న్యూ ఇయర్ ఎఫెక్ట్..  డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే పదివేలు ఫైన్, వాహనం సీజ్!!

డిసెంబర్ 31 రాత్రి వచ్చిందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరైతే పీకల దాకా తాగి రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. అరుపులు కేకలతో హోరెత్తించి పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తుంటారు. మరికొందరైతే రోడ్ల మీద రైడింగ్ పోటీలు పెట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చిల్లర మల్లర వేషాలను కట్టడి చేసేందుకు పోలీసులు కూడా ఈ సారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తాగే తందానా బ్యాచ్ కు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే 10,000 ల జరిమానాతో పాటు వాహనం సీజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇందు కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా, న్యూయిర్ వేడుకల్లో ప్రమాదాలతో పాటు న్యూసెన్స్ చోటు చేసుకోకుండా హోటళ్లు, పబ్బులకు గైడ్ లైన్స్ జారీ చేశారు పోలీసులు. రాత్రి ఎనిమిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. 45 డెసిబుల్స్ మ్యూజిక్ సిస్టం కంటే పెద్దవి వాడొద్దని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో మందు బాబుల భరతం పట్టనున్నారు పోలీసు అధికారులు. మొత్తం మీద మందు బాబులకు గట్టి మోత పడునుంది.

దిశ నిందితుల మృతిదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి...

దిశ నిందితుల మృతిదేహాల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈరోజు దిశ అత్యాచార నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం ముగిసింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా నేతృత్వంలోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. మృతదేహాలను కుటుంబ సభ్యుల గుర్తించిన తరువాత రీపోస్టుమార్టం మొదలు పెట్టారు. ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉండగా, శివ శరీరంలో మూడు బులెట్ గాయాలు, నవీన్ శరీరంలో రెండు బుల్లెట్ గాయాలు,చెన్నకేశవులు శరీరంలో ఒక బులెట్ గాయాన్ని గుర్తించారు. నాలుగు మృతదేహాలకు రీ పోస్టు మార్టం పూర్తి చేసేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టింది. రిపోస్టుమార్టం అనంతరం నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ,జొల్లు నవీన్ ,చెన్నకేశవుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీ భద్రత మధ్య స్వస్థలాలకు మృతదేహాలను తరలించారు. ఎట్టి పరిస్థితిలో ఇవాళ అంత్యక్రియల పూర్తయ్యేలా ఏర్పాట్లు  చేస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఐదు లోపు నివేదిక సమర్పించాల్సిందిగా ఇప్పటికే హై కోర్టు ఆదేశించింది. ఈనేపధ్యంలో రీపోస్టుమార్టం వీడియో ప్రక్రియ సీడీ, పెన్ డ్రైవ్ను కోర్టుకు సమర్పించనున్నారు అధికారులు. పోస్టుమార్టం మొత్తం వీడియో రికార్డింగ్ జరిగిందనీ మృతదేహాలు 50% కుల్లిపోయాయని అయ్యాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ తెలిపారు.

మోడీకి పోటీగా చాపకింద నీరులా ఎదుగుతున్న యువ నాయకుడు!!

రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, ఎన్టీఆర్, కరుణానిధి వంటివారు ఆ కోవలోకే వస్తారు. వారి ప్రసంగం ప్రజల్ని ఉత్తేజ పరిచేది. వారి ప్రసంగం వినడం కోసం అప్పట్లో ప్రజలు కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లేవారు. అయితే ఈ తరంలో ఆ స్థాయిలో ప్రసంగించే నేతలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న అతి తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అసలు విపక్ష పార్టీల నేతల్లో ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకునే నేతలు లేకపోవడమే మోడీకి కసిసొచ్చిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇప్పుడొక యువ నాయకుడు మోడీకి పోటీగా చాపకింద నీరులా బలమైన శక్తిగా ఎదుగుతున్నాడని అంటున్నారు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు కన్నయ్య కుమార్. గతంలో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన కన్నయ్య కుమార్... ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతగా, సిపిఐ శక్తివంతమైన నేతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడటంలో కన్నయ్య ముందుంటాడు. ఎందర్నో ఆ పోరాటంలో నడిచేలా చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు ఇలా ఎన్నో అంశాలపై కన్నయ్య పోరాటం చేసాడు, చేస్తున్నాడు. కన్నయ్య ప్రభావం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తోంది. ఆయన ప్రసంగం వినడానికి యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన మాటలతో యువతలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగుతున్నాయి. ఇక ఇటీవల ఆయన ఆజాదీ నినాదం యువతలోకి బలంగా వెళ్లింది. ఆయన గొంతు వినిపిస్తే చాలు వేల గొంతులు జత కలుస్తున్నాయి. మొత్తానికి ఈ 32 ఏళ్ళ దళిత యువ నాయకుడు.. తన ప్రసంగాలతో యువతని కదిలిస్తూ బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని ప్రస్థానం ఇలాగే కొనసాగితే.. కాన్షీరాం, మాయావతి వంటి శక్తివంతమైన దళిత నాయకుల సరసన చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పల్లె ప్రగతి పై సీఎం సంచలన నిర్ణయం...

పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పని తీరును పరిశీలించేందుకు జనవరి ఒకటి నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని రంగంలోకి దించుతున్నట్లు సీఎం తెలిపారు. కార్యక్రమాల పురోగతి నాణ్యతను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమం గతంలో 30 రోజుల పాటు జరిగింది. ప్రతీ పల్లెలో అక్కడున్న లోకల్ సమస్యల పరిష్కారం కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని దీంతో పాటు మరోక పది రోజుల పాటు పల్లెప్రగతి నిర్వహించాలని, ఇప్పటి వరకు ఏదైతే 30 రోజులలో నిర్వహించిన కోణంలో పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మరొక 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించినట్లు సమాచారం. దాంతోపాటు అధికారులపై గతంలో జరిగినటువంటి సమస్యల పై చాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్లె ప్రగతిలో ప్రజలు చాలా చురుగ్గా పాల్గొనడమే కాక ప్రజా ప్రతినిధులు కూడా చాలా ఆశక్తి చూపించారు. కానీ అధికారులు మాత్రం సమస్యలను నమోదు చేసుకుని, అక్కడ పరీష్కారం కాని సమస్యలను  ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విషయంలో విఫలమయ్యారంటూ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ సారి జరిగేటువంటి పల్లె ప్రగతి పని తీరుని జనవరి ఒకటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ లను ఏర్పాటు చేశారు. ప్రతి పల్లెలో వాళ్ళు పర్యటిస్తారు. ఈ సారి ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకునెలా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.  

రాజధానిలో స్పీకర్ తమ్మినేనికి ఘోర అవమానం!!

దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఘోర అవమానం జరిగింది. ఏపీ భవన్‌ సిబ్బంది వల్ల ఎదురైన అవమానంతో తమ్మినేని మనస్తాపం చెందారని తెలుస్తోంది. ఓ పర్యటన నిమిత్తం సతీసమేతంగా డెహ్రాడూన్ వెళ్లిన తమ్మినేని.. తిరిగి ఢిల్లీ చేరుకొని ఏపీ భవన్‌లో బస చేశారు. అయితే అక్కడి నుంచి తిరిగి ఏపీకి బయల్దేరే సమయంలో.. ఏపీ భవన్ ఉద్యోగి ఒకరు భోజనం, వసతికి సంబంధించి బిల్లు కట్టాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో తమ్మినేని షాక్ అయ్యారట. గెస్ట్ హోదాలో వచ్చిన తనను బిల్లు కట్టమని అడగటంతో తమ్మినేని అసంతృప్తి వ్యక్తం చేశారట. అసలు విషయం ఏంటని అక్కడి సిబ్బందిని ఆరా తీస్తే.. అమరావతిలో ఉండే జీఏడీ నుంచి స్టేట్‌ గెస్ట్‌గా కాకుండా కేటగిరీ-1లో వసతి కల్పించాలని ఆదేశాలిచ్చారని చెప్పుకొచ్చారట. దీంతో తమ్మినేని.. ముందు బిల్లు కట్టేయండని తన సిబ్బందిని ఆదేశించారట. ఈ వ్యవహారంపై ఆయన సతీమణి కూడా కాస్త అసహనానికి గురయ్యారట. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారట. ఇంత జరిగిన తర్వాత అధికారులు ఎప్పటికో తప్పును గ్రహించారట. స్టేట్ గెస్ట్‌గా వచ్చినవారి నుంచి బిల్లలు వసూలు చేయడం తప్పేనని క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వానికి మరో షాకిచ్చిన కేంద్రం..!

జగన్ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో షాకులిచ్చిన కేంద్రం... తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఏపీకి కొత్తగా మెడికల్ కాలేజీలు కేటాయించబోమని... అవసరమనుకుంటే మీరే కట్టుకోవాలంటూ తేల్చిచెప్పింది. అయితే, కేంద్రమే ముందుగా ప్రతిపాదనలు కోరి, ఇఫ్పుడు మీరే కట్టుకోమంటూ కేంద్రం చేతులెత్తేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, అలాగే వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కంగుతిన్నారు. కేంద్రంపై ఆశలు పెట్టుకునే తాము మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముందడుగు చేస్తే, ఇప్పుడు నిధులు ఇవ్వమంటే ఎలా అంటున్నారు. ప్రతి జిల్లాలో కచ్చితంగా ఒక మెడికల్ కాలేజీ ఉండేలా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరింది. దాంతో, ఆయా రాష్ట్రాలు తమ అవసరాలను తెలుపుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే, వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం... కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కొత్త మెడికల్ కాలేజీలను కేటాయించింది. అయితే, ఏపీ... మూడింటికి ప్రతిపాదనలు పంపగా... ఒక్కటి కూడా ఇవ్వలేదు. అందుకు కేంద్రం అనేక కారణాలను చూపినప్పటికీ, ముఖ్యంగా ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్నాయని... పశ్చిమగోదావరి, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని... ఈ రెండు జిల్లాల్లో కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నందున... ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించలేమని స్పష్టంచేసింది. అయితే, ఏపీ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని... ఒక్కో కాలేజీకి 340కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని మళ్లీ కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఏలూరు మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, అలాగే... మిగతా రెండు కాలేజీలకూ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు రెడీ అవుతున్నందున నిధులు ఇవ్వాలని కేంద్ర పెద్దలను కోరనున్నారు. అంతేకాదు, సరికొత్త లెక్కలతో కేంద్రం ముందు మళ్లీ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. తమిళనాడులో 25 జిల్లాలు ఉన్నప్పటికీ... ప్రతి జిల్లాలో 20లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నారని... అయితే, ఏపీలోని 13 జిల్లాల్లో ప్రతి చోటా 40లక్షల మంది జనాభా ఉన్నారని... అందువల్ల జనాభా ప్రాతిపదికన ఏపీకి కొత్త మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరనున్నారు. అయితే, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏలూరు, పాడేరు, విజయనగరంతోపాటు పులివెందుల, మచిలీపట్నం, గురజాల, మార్కాపురంలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేంద్రం షాక్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఒకవేళ రెండోసారి కూడా రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరిస్తే మాత్రం... ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి దాదాపు 2500కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడనుంది. ఇప్పటికే, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఏపీ... అంత పెద్ద మొత్తాన్ని భరించగలిగే పరిస్థితిలో లేదంటున్నారు అధికారులు.

151 సీట్ల అఖండ మెజారిటీ ఇచ్చి... మళ్ళీ ఈ రచ్చేంటి?

ఏపీలో రాజధాని మార్పు పై రచ్చ మాములుగా లేదు. సీఎం జగన్ అసెంబ్లీ లో మూడు చోట్ల రాజధాని పెట్టవచ్చు అన్నప్పటి నుండి మొదలై ప్రభుత్వం నియమించిన జి ఎస్ రావు కమిటీ రిపోర్ట్ బయటకు రావడంతో నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. ఐతే గత ప్రభుత్వాధినేత మాజీ సీఎం చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాలలో ఒకటి అమరావతి రాజధాని. ఐతే మొన్న ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో బాబు నాయకత్వం లోని టీడీపీ ని దారుణంగా ఓడించి వైస్సార్సీపీ కి 151 సీట్ల అఖండ మెజారిటీ కట్టబెట్టిన విషయం తెలిసిందే. కారణాలేమైనప్పటికీ రాజధాని పరిసర జిల్లాలైన గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీన్ని బట్టి బహుశా ఆ జిల్లాల ప్రజలకు కూడా అమరావతి రాజధాని వద్దనుకున్నారో లేక ఆల్రెడీ రాజధాని వచ్చేసింది కదా ఇక బాబు గారితో పనేముందనుకున్నారో కానీ పాపం టీడీపీకి కృష్ణా జిల్లా నుండి రెండు, గుంటూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. సాక్షాత్తు రాజధాని ప్రాంత నియోజక వర్గాలైన తాడికొండ, మంగళగిరి నియోజకవరాగాల్లో కూడా టీడీపీ ని కాదని వైస్సార్సీపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. బాబుగారేమో ఇదిగో నేను అభివృద్ధి వికేంద్రీకరిస్తున్నాను అంటూ ఒక కియా మోటార్స్ ను వెనుక పడిన జిల్లా అనంతపూర్ లో, సోలార్ పవర్ ప్లాంట్ ను కర్నూల్ లో, హీరో మోటార్స్ ను చిత్తూర్ జిల్లాలో, సిమన్స్ గమేశా వంటి పరిశ్రమలను నెల్లూరు, శ్రీసిటీలలో నెలకొల్పినా కూడా టీడీపీకి కేవలం 23 సీట్లిచ్చి ఇక చాలు పొమ్మన్నారు ఎపి ప్రజలు.  తాజాగా అమరావతిలో గవర్నర్ నివాసం, అసెంబ్లీ (కేవలం శీతాకాల సమావేశాల కోసం) మాత్రమే అని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి భూములిచ్చిన రైతులు ఇపుడు మా పరిస్థితేంటని రోడ్డెక్కారు. ఐతే ఇపుడు కూడా అటు గుంటూరు జిల్లానుండి కానీ ఇటు కృష్ణా జిల్లా నుండి ఆ రైతులకు మద్దతు గా బయటకు వచ్చేవాళ్లే కరువైన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికి రాజధాని లేని రాష్ట్రానికి తమ జీవనాధారమైన ౩౩౦౦౦ ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు, నాయకులూ వస్తుంటారు కనుమరుగవుతుంటారు. కానీ రాజధాని ప్రాంత ప్రజలకు అన్యాయం  జరగకుండా ఉంటె అదే పదివేలు అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అంతే కాకుండా ఒకసారి సెక్రటేరియట్, సీఎం నివాసం విశాఖపట్నానికి మార్చిన తరువాత మెల్లగా మూడు చోట్ల రాజధాని ఆర్ధిక భారం అవుతోందని చెప్పి ప్రస్తుతం అమరావతి లో ఉండే కొద్ది ప్రభుత్వ కార్యకలాపాలను కూడా నిలిపివేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ పదేపదే చెప్పింది. అయినా ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చి అధికారం కట్టబెట్టారు. మరి అప్పుడు గెలిపించి ఇప్పుడు రాజధాని మార్పు అంటే రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పొతే రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుందని.. రాజధానిపై స్పష్టమైన, శాశ్వతమైన నిర్ణయం తీసుకొని ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళన దూరం చేయాలని విశ్లేషకులు కోరుతున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ప్రభుత్వానికి ఢోకా లేదు.. అయినా ఇంకా దేనికి భయపడుతూ ఇలా రాజధాని పేరుతో రాజకీయాలు చేసి రచ్చ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మంగళగిరి ఎమ్మెల్యే మిస్సింగ్..! కనిపించడం లేదంటూ ఫిర్యాదు

ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే... మంగళగిరి ఎమ్మెల్యే... వైసీపీ నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే... అంతేకాదు, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఓడించిన సాధారణ నాయకుడు... ఇక, ఆర్కే వ్యవహారశైలి కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటుంది.... తాను చాలా సాదాసీదా మనిషినని... రైతు బిడ్డనని... పేద మధ్యతరగతి ప్రజల్లో ఒకడినని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. కూలీలతో కలిసి పనిచేయడం... వాళ్లతో కలిసి భోజనం చేయడం... ఓ సాధారణ రైతులా అన్నీ పనులూ చేస్తూ మీడియా దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటారు. అది నిజమో లేక బిల్డప్పో తెలియదు గానీ. ఈ వ్యవహార శైలే నారా లోకేష్ పై గెలవడానికి ఉపయోగపడింది. తానొక సామాన్యుడునని... అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకునే మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.  అయితే, వారం రోజులుగా తన నియోజకవర్గ రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ వారం రోజులుగా రైతులు, కూలీలు, ప్రజలు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతుంటే ఎమ్మెల్యే  ఆర్కే మాత్రం ఒక్కసారి కూడా మీడిమా ముందుకి రాలేదు. దాంతో, తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. తామంతా అమరావతి కోసం ఆందోళనలు చేస్తుంటే... తమ ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వారం పది రోజులుగా తమ ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని... అతడిని వెదికి పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు, కూలీలు.   అమరావతిపై తమలో ఆందోళన నెలకొందని, తమ గోడును చెప్పుకుందామంటే తమ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియడం లేదని రాజధాని రైతులు, ప్రజలు, కూలీలు అంటున్నారు. తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నామని, మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి తమకు అప్పగించాలంటూ పోలీసులను కోరారు. వారం రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోనూ గానీ... ఆయన కార్యాలయంలో గానీ... ఇంట్లో గానీ ఎక్కడా కనిపించ లేదని నిడమర్రు రైతులు అంటున్నారు. తమ ఎమ్మెల్యే కనిపించకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియకే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. దయచేసి తమ ఎమ్మెల్యే ఆర్కేని వెదికి తమకు అప్పగించాలంటూ కంప్లైంట్ లో రాశారు రైతులు.

ప్రత్యేక జిల్లాల పేరుతో ఆందోళనలు చేపడుతున్న ఏపీ ప్రజలు!!

ఏపీకి 3 రాజధానులు అని జగన్ చేసిన ప్రకటన మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఎవరికి వారు తమ ప్రాంతంమే రాజధాని అవ్వాలని ఆందోళనలుచేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రత్యేక జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానుల పై రచ్చ జరుగుతోంది. ఓ వైపు సంబరాలు, మరోవైపు ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా 12 జిల్లాల వస్తాయంటూ చేసిన ప్రకటన మరో చర్చకు దారితీసింది. విషయం పాతదే అయినా ఆశలు ఆకాంక్షలు పెరిగిపోయాయి. మాకు జిల్లా కావాలంటూ క్రమంగా స్వరం పెరుగుతోంది. పాత డిమాండ్లే కాదు కొత్త గళాలు వినిపిస్తున్నాయి. చారిత్రిక నేపథ్యాలు, జనాభా ఇలా తమకుండే ప్రాధాన్యతల ముందుంచి తమకు జిల్లా కావాలి అంటున్నారు. ఎన్నికలకు ముందు పాద యాత్రలో జగన్ కొత్త జిల్లాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు, ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా మారుస్తామన్నారు. ఆచరణలోకి వస్తే 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా అవతరించనుంది. నిన్న మొన్నటి వరకు 25 జిల్లాలకే జనాలు దాదాపుగా సిద్ధపడ్డారు. కానీ రాజధానుల అంశం తెరమీదకు వచ్చిన తరువాత ప్రజల్లో ఆశలు రేగాయి. రాజధాని రావడం లేదు, పోరాడితే జిల్లా అయిన వస్తుందన్న భావన పెరిగింది. అందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెరమీదకొస్తున్నాయి. అనంతపురం జిల్లాలో హిందూపురం ప్రత్యేక జిల్లా చెయ్యాలన్నది దశాబ్దాల కాలాల డిమాండ్, దేశ విదేశాల్లో పుట్టపర్తికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యం లోనే దీనినే జిల్లా కేంద్రంగా చెయ్యాలన్నది స్థానికులు అభిమతం, పేరు మాత్రమే కాదు జిల్లా కేంద్రం కూడా ఇదే కావాలి అంటూ కొందరి వాదన. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతి నిధులపై ఒత్తిడి పెరిగిపోతోంది. కర్నూలు జిల్లాలో నంద్యాల ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. కడప జిల్లా రాజంపేట విషయం లోనూ ఎలాంటి అనుమానాలు లేవు కాగా చిత్తూరు జిల్లాలో తిరుపతి కొత్తగా జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అయితే దీనికి బాలాజీ పేరుపెట్టాలన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కొత్తగా మదనపల్లి వంటి ప్రాంతాల్లో కూడా జిల్లా డిమాండ్ వినిపిస్తోంది. మొత్తానికి రాయలసీమలో అదనంగా మరో నాలుగు జిల్లాలు వచ్చి చేరే అవకాశముంది. చివరికి ఈ సంఖ్య 8 కి చేరుతుంది. సీఎం రాయలసీమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. 

చిక్కుల్లో జనసేనాని... వైరల్ అవుతోన్న వీడియో...

జనసేన అధినేత పవన్ కల్యాణ్, కర్నూలు పర్యటనలో మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు రాజధానుల రగడ, తాజాగా పవన్ చేస్తున్న ట్వీట్లను కూడా జత చేస్తూ, షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమరావతే మనకు రాజధాని కావొచ్చు. నా మనసుకి మాత్రం కర్నూలే రాజధాని. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజు అమరావతి ఏ స్థాయి నగరం అవుతుందో అంతకుమించిన నగరంగా కర్నూలుని తీర్చిదిద్దుతా. కర్నూలుకి, రాయలసీమకి పూర్వవైభవం తీసుకొస్తానంటూ పవన్ అన్న మాటలు ఇప్పటికీ జనసేన పార్టీ ఫేస్‌బుక్ అధికారిక అకౌంట్‌లో ఉండటంతో... నాడు కర్నూల్‌పై ప్రేమ కురిపించిన పవన్ కల్యాణ్, నేడు హైకోర్టు ప్రతిపాదనపై ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, రాయలసీమ వాసులు విమర్శిస్తున్నారు. తన మనసులో ఇప్పటికీ కర్నూలే రాజధాని అన్న పవన్... నేడు మరో రాజధాని అవుతున్నందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేనాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖ వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అంటూ పవన్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, అసలు అమరావతికే దిక్కు లేదు, ఇకమ మూడు రాజధానులా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, రాయలసీమ వాసులు మాత్రం... గతంలో మాట్లాడిన మాటలను... ఇప్పటి ట్వీట్లను జతచేసి జనసేనానికి చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడేమో కర్నూలు గురించి అలా మాట్లాడి, ఇప్పుడేమో మరోలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. మొత్తానికి నాటి ప్రసంగం వీడియో, నేటి ట్విట్టర్‌ కామెంట్లు, జనసేన అధినేతను ఇరుకునపెడుతున్నాయి. ఇక, మూడు రాజధానులను వ్యతిరేకిస్తే, మిగతా రెండు ప్రాంతాల్లో పార్టీకే నష్టమని అంటున్నారు. విపక్షాలకు ఈ పరిణామం విపత్కరంగా మారిందని, ఏం మాట్లాడినా మరో ప్రాంతంలో వ్యతిరేకత రావడం ఖాయమని చెబుతున్నారు. టీడీపీ, జనసేనలు ఈ సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాయో, మూడు ప్రాంతాల ప్రజలను ఎలా ఒప్పిస్తాయో, కాలమే తేల్చాలి.  

పాలమూరు టీఆర్ఎస్ లో ప్రచ్ఛన్న యుద్ధం... రెండు గ్రూపులుగా  మంత్రులు, ఎమ్మెల్యేలు...!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య లేదని ప్రచారం సాగుతుండగా... ఇక, ఇప్పడు ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత లేదన్న మాటలు వినపడుతున్నాయి. గ్రూప్ రాజకీయాలతో దూషణలకు, భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అల్లంపూర్, గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరడంతో, పార్టీ అధినేత వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై అధినాయకత్వం అసహనం కూడా వ్యక్తంచేసింది. ఇక, జోగుళాంబ జిల్లాలోనూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య అగ్గి రాజేస్తోంది ఇసుక పంచాయితీ. ఇసుక రవాణాపై ఆధిపత్యం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు నువ్వానేనా అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కోసం టీఆర్‌ఎస్ నేతలు పోటీపడుతున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకరిపై మరొకరు కేసీఆర్ కు ఫిర్యాదులు చేసుకున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ భర్త తిరుపతయ్య... కేసీఆర్‌ను కలిసి గద్వాల ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తన నియోజవకర్గంలో గద్వాల ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని అలంపూర్ ఎమ్మెల్యే ...ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, అలాగే జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతోపాటు మరో ఇద్దరు ముఖ్య నేతలందరూ ఒక జట్టుగా ఏర్పడి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా కేసీఆర్‌కు, కేటీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అలాగే, అధిష్టాన పెద్దలకు అత్యంత సన్నిహిత నాయకుల ద్వారా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాంపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్‌ నేతల మధ్య కోల్డ్‌వార్‌ పీక్స్‌కు చేరిందని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. ఈ ఎఫెక్ట్‌ మున్సిపల్ ఎన్నికలపై పడుతుందేమోనని, అధిష్టాన పెద్దలు టెన్షన్‌ పడుతున్నారు. అందుకే, వీలైనంత త్వరగా టీఆర్‌ఎస్ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే, అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలితో టీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న రగడను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ జెండా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి.

100 కి కాల్ చేసి సాయమడిగితే.. నిద్ర చెడగొడతావా అంటూ కొట్టిన పోలీస్ 

సాయం కోసం 100 కి కాల్ చేయండి.. నిమిషాల్లో మీ ముందుంటాం మీకు సాయం చేస్తామని పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రచారానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సాయం కోసం కాల్ చేసినవారినే.. కొడుతున్నారు చివాట్లు పెడుతున్నారు. అల్లరి మూకల నుంచి రక్షించమని ఓ యువకుడు ‘100’కు కాల్ చేస్తే... తిరిగి అతనికే క్లాస్ పీకిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జీడిమెట్ల‌లో జరిగింది.  అల్ల‌రిమూక‌ గొడ‌వ చేస్తుండటంతో ‘100’కి ఫోన్ చేశాడు ఓ యువకుడు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు.. అక్కడికి చేరుకుని అల్ల‌రిమూక‌ను చెద‌ర‌గొట్టారు. అయితే అక్కడున్న కానిస్టేబుల్ కోటేశ్వ‌ర‌రావు మాత్రం.. ‘100’కి ఫోన్ చేసిన‌ యువ‌కుడిపై తిట్ల దండకం అందుకున్నాడు. అర్ధ‌రాత్రిపూట నిద్ర ఎందుకు చెడ‌గొట్టావురా? ఎవ‌రు కొట్టుకుని చ‌స్తే నీకెందుకురా? అంటూ బూతులతో రెచ్చిపోయాడు. అక్కడితో ఆగక.. రెండు దెబ్బలు కొట్టి, తిడుతూ జీపులో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. చివరకు ఆ యువకుడు తాను మీడియాలో పని చేస్తున్నానని చెప్పడంతో.. కంగారుపడిపోయిన కానిస్టేబుల్.. సారీ అంటూ అతన్ని ఇంటి వ‌ద్ద దింపి వెళ్లాడు. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ స‌జ్జ‌నార్.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అయితే పోలీసులపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు.

హోరాహోరీగా నడుస్తున్న జార్ఖండ్ ఎన్నికల ఫలితాల లెక్కింపు....

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షించిన సమయం నేడు రానే వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్, జేఎంఎం కూటమి బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. 81 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి బిజెపి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటిపడుతున్నట్లు సమాచారం. మొదట బిజెపి కాస్త వెనుకబడ్డట్టు కనిపించిన రెండో దశ రౌండ్ల నుంచి పుంజుకుంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా ఆర్జేడీ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.జెఎంఎం నలభై మూడు, కాంగ్రెస్ ,31 ఆర్జెడీ ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ ఒంటరిగా 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52 స్థానాల్లో పోటీ చేయగా, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 స్థానాల్లో పోటీ చేశాయి.కానీ ఈ పార్టీల అంత ప్రభావం చూపలేకపోయాయి. గత ఎన్నికల్లో బీజేపీ 39 సీట్లు గెలుచుకోగా, బిజెపి నేత రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా కూడా పగ్గాలు చేపట్టారు. ఈ సారి ఎన్నికల్లో జంషెడ్ పూర్ నుంచి పోటీ చేసిన రఘువర్ దాస్ ముందంజలోనే ఉన్నారు.జేఎంఎం నేత హేమంత్ సొరేన్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.రెండు జాతీయ పార్టీలతో పాటు నాలుగు ప్రాంతీయ పార్టీ లు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారాన్ని నిలబెట్టు కునేందుకు బిజెపి సాయశక్తులా ప్రయత్నా లు చేసింది. పార్టీ తరుపున మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు జార్ఖండ్ లో ప్రచారం చేశారు. నిరంతరం అనిశ్చిత  రాజకీయాలు రాజ్యమేలే జార్ఖండ్ లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐదేళ్ల ముఖ్య మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా రఘువర్ దాస్ రికార్డు సృష్టించారు.ఈ హోరా హోరీ రేసులో కాంగ్రస్ పై కూడా చాలా వరకు ఊహాగానాలు ఉన్నాయి. మరి జార్ఖండ్ లో కమలదళం ఎగరనుందో లేదో అన్న ఉత్కంఠత నేటితో తేలనుంది.

తెలంగాణ ప్రజలపై బాదుడే బాదుడు... పైసలు కోసం పన్నులు పెంపు...

ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణ ఖజానాపై తీవ్రంగా పడింది. ఆర్ధిక మాంద్యం కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నందున దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఇక, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా సక్రమంగా అందడం లేదు. మరోవైపు కేంద్రం నుంచి అందాల్సిన గ్రాంట్లు, నిధులు, బకాయిలూ విడుదల కావడం లేదు. దాంతో, మరో రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. అయితే, ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడానికి ఛార్జీలను పెంచిన కేసీఆర్ సర్కారు.... ఆ తర్వాత లిక్కర్ పై బాదుడు బాదింది. అలాగే ప్రభుత్వరంగ సంస్థ పాల ధరలనూ పెంచింది. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏటా 800కోట్ల భారం వేయగా, ఇక మద్యం ధరల పెంపుతో ఏకంగా 4వేల కోట్లకు పైగా వడ్డించి మందుబాబులకు చుక్కలు చూపించింది. అయితే, ఇదే దారిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర పరిధిలో ఉండే వివిధ పన్నులను కూడా పెంచాలని చూస్తోంది.  ఇక, అన్నింటికంటే ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. విద్యుత్ సంస్థలు ఇప్పటికే భారీ అప్పుల్లో ఉండటంతో వాటిని భర్తీ చేయాలంటే ఛార్జీల పెంపు తప్పదని అంటున్నారు. దాంతో, సామాన్యులపై మరింత భారం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే, విద్యుత్ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో వ్యతిరేకత రాకుండా పారిశ్రామిక, కమర్షియల్ కనెక్షన్స్ పైనే ఎక్కువ బాదుడు ఉంటుందని అంటున్నారు. ఇక, పన్నుల పెంపు ద్వారా దాదాపు పది వేల కోట్ల రూపాయలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

మూడు రాజధానుల నిర్ణయంపై రెండు లక్షల మంది ఇచ్చిన తీర్పు

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. మూడు రాజధానుల అంశమనే చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని వ్యాఖ్యలు చేయడం. ఆ వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉండటంతో.. ఏపీకి మూడు రాజధానులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ మూడు రాజధానుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. కొందరు మాత్రం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు పార్టీలకతీతంగా జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు సైతం.. పార్టీ కార్యాలయానికి నల్లరంగు వేసి నిరసన వ్యక్తం చేసారు. మేము ముందు ఈ ప్రాంత రైతులం, ఆ తర్వాతే మాకు పార్టీ అని స్పష్టం చేసారు. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మొత్తానికి జగన్ నిర్ణయం కొందరికి ఇష్టం, కొందరికి కష్టం అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని... 'తెలుగువన్' యూట్యూబ్ ఛానెల్ లో ఓ పోల్ పెట్టింది. రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని భావిస్తున్నారా? అని క్వశ్చన్ అడిగింది. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు రెండు లక్షల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. 43 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. 57 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోంది. ఈ పోల్ కి వెయ్యికి పైగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ కామెంట్స్ లో కూడా మెజారిటీ శాతం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్స్ రావడం గమనార్హం. ఇది పనికిమాలిన చర్య అని కొందరు అంటే.. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పొతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని కొందరు కామెంట్స్ చేశారు. ముందు.. ఉన్న రాజధాని నగరం అమరావతిని డెవలప్ చేయండి చాలు.. మీరిలా మూడు రాజధానులు అంటే ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా పోయే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రెండు లక్షల మంది పాల్గొన్న ఈ పోల్ ని గమనిస్తే మాత్రం.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అర్థమవుతోంది.

 ప్రముఖ సినీ నటి,యాంకర్ల ఇళ్ళల్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించిన జీఎస్టీ అధికారులు.....

  ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్ళల్లో శుక్రవారం జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టిన కేసులకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి తనిఖీలు జరిగాయి. విరిగి ఇళ్లతో పాటు నగరంలోని మొత్తం 23 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. కోట్లలో సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్ ను రద్దు చేసుకొని ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో మణికొండలోని యాంకర్ సుమ కనకాల, బంజారాహిల్స్ లోని అనసూయ భరద్వాజ్ ఇళ్లల్లో తనిఖీ చేశారు. సినీ నటి యాంకర్ల ఇళ్లతో పాటు నగరం లోని చిట్ ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, భవన నిర్మాణ సంస్థలు, సాఫ్ట్ వేర్ సంస్థలు, ఓవర్సిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఫిట్ నెస్ సెంటర్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్ టైన్ మెంట్ తదితర ఇరవై మూడు సంస్థలలో ఏక కాలంలో ఈ సోదాలు జరిగాయి. కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ పెట్టుబడులు పెట్టారని ఆ సంస్థల పై సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఎగ్గొట్టిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఆ సంస్థల్లో సోదాలలో భాగంగానే లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ ఇళ్లల్లో సోదాలు జరిగినట్టు తెలిసింది. సాధారణంగా సినీ నటులు వ్యక్తిగతంగా సర్వీస్ టాక్స్ జిఎస్టి చెల్లించే నిబంధనలు ఉండవు. వీరి భాగస్వామ్యం ఉన్న సంస్థలు గతంలో సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఆయా పెట్టుబడుల్లో భాగస్వామ్యం ఉన్న కారణంగా వీరి ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.  

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం చేయనున్న ఢిల్లీ ఫోరెన్ సీక్ అధికారులు .....

దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఎప్పుడూ అప్పగిస్తారనే ఉత్కంఠరేపుతోంది. సామాజిక కార్యకర్త పిటిషన్ తో నిన్న హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను ఎప్పుడూ అప్పగిస్తారని ప్రభుత్వం తమ అభిప్రాయం తెలపాలని హై కోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహానికి రీపోస్ట్ మార్టం చెయ్యటానికి ఆదేశాలిచ్చేందుకు హైకోర్ట్ సిద్ధమైనట్టుగా తెలిపింది. ఇందు కోసం ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి రీపోస్టుమార్టం చేస్తారని సమాచారం. ఎన్ కౌంటర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల17న మహిళా సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అయితే దీని పై హై కోర్టులో తేల్చుకోవాలని మృతదేహాలను భద్రంగా వుంచాలని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే మృతదేహాలకూ రీపోస్టుమార్టం నిర్వహించాలని హై కోర్టు భావిస్తుంటే అవసరం లేదని ఏజీ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 లోపు ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు మృతదేహాల పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను హై కోర్టు ఆదేశించింది.దిశ అత్యాచారం నిందితుల్లో ఒకరి భార్య మైనర్ అని సమాచారం. నిందితుడు చెన్న కేశవులు భార్య వయస్సు 13 ఏళ్లని అధికారుల విచారణలో తేలింది. నారాయణ పేట జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. అయితే ఆమె వయస్సు 13 సంవత్సరాల 6 నెలలుగా గుర్తించారు. రిజిస్టర్ లో 2006 జూన్ 15 న పుట్టినట్లుంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా, దీంతో చెన్నకేశవులు తల్లితండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలిక 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, అందుకు వారు నిరాకరించారు.చెన్న కేశవులు భార్య మైనర్ కావడం చేత వారి చేసింది తప్పు అని పోలీసులు హెచ్చరించారు.వాళ్ళ కోడలికి గట్టి భద్రత కూడా కలిపిస్తామన్నారు.వారి మృత దేహాల పై ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనిహైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

జేసీ అనుచిత వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయా?

అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకించుకుంటానంటూ మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యల పై మండిపడిన పోలీసు అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జేసీ వెనక్కు తగ్గక పోవడంతో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీ వ్యాఖ్యల పై ఫిర్యాదు చేశారు. జేసీ పై ఐపీసీ సెక్షన్ 153ఎ, 506 కింద కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు దీని పై వివరణ ఇచ్చిన చేసి తాను పోలీస్ వ్యవస్థనంతటిని అనలేదని, కొందరు అధికారులను ఉద్దేశించి విమర్శించినట్లు తెలిపారు. మరో వైపు జేసీ వ్యాఖ్యల పై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసు బూట్ల వంటి యుద్ధంలో ఆయుధాలని వాటిని మేము ముద్దు పెట్టుకుంటామన్నారు. పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి మాదవ్ వాటిని ముద్దాడారు. పోలీసులంటే హీరోలని వారిలో ఒకరైన నేను ఒక ట్రైల్ వేస్తే ఎంపీని అయ్యానన్నారు. పోలీసుల పై మీసం తిప్పితే మీరు పతనావస్థకు చేరుకుంటారని అన్నారు. గతంలో ఏం జరిగిందో దృషి పెట్టుకోవాలని  అప్పడే మరచిపోయావా అంటూ సెటైర్లు కూడా వేశారు. జేసీ వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ సైతం ఇరకాటంలోకి నెట్టాయి. చంద్రబాబు ముందే జేసీ పోలీసుల పై అభ్యంతరకరమైన భాషను వాడుతూ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశమయ్యాయి.జేసీ వాడిన పాదజాలాన్ని తప్పుపడుతూ పలువురు నేతలసైతం మండి పడ్డారు. చంద్రబాబు ముందే వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పించాలంటూ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఏ బాబుకు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది.దీని పై బాబు ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి.

 అమరావతి రాజధాని నుంచి ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని భవితవ్యాన్ని నిర్దేశించే జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికతో అమరావతికి కోత పడట్టుగానే కన్పిస్తోంది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించింది. ఇందులో కమిటీ సభ్యులు చెప్పిన అంశాలు అనేక ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ అమరావతిలోనే ఉండాలని కమిటీ, శీతాకాల సమావేశాలు, వేసవి సమావేశాలంటూ వేర్వేరు ప్రతిపాదనలు చేసింది. శీతాకాలం సమావేశాలు అమరావతిలో, వేసవి కాల సమవేశాలు విశాఖలో నిర్వహించాలని సూచించింది. దీంతో అమరావతిలో ఉండే అసెంబ్లీ కూడా టెంపరరీనే అన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు కర్నూలుకు తరలిపోనున్న నేపథ్యంలో అమరావతిలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజ్ భవన్, మంత్రుల నివాసాలు, అధికారుల క్వార్టర్స్ కూడా మంగళగిరిలోనే నిర్మించాలని నివేదికలో పేర్కొంది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని కమిటీ సూచించిందన్నారు. కమిటీ నివేదిక పై ఈ నెల 27 న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని ఖాళీ అవడం ఖాయం అన్న విషయాన్ని మంత్రి బొత్స పరోక్షంగా హింట్ ఇచ్చారని 29 గ్రామాల ప్రజలు అంటుంటారు. అందుకే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ప్రకటించినట్టు సమాచారం. త్వరలో అమరావతి ప్రాంతం ఖాళీ చేయటం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి క్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కథ ముగిసినట్టేనన్న వాదన ఆ ప్రాంత వాసుల నుంచి బలంగా వినిపిస్తుంది.అక్కడి రైతులు మాత్రం తమకు అన్యాయం చేయవద్దని, మరియు ఉద్యోగులు కూడా తము రాజధాని పరిసర ప్రాంతాలల్లో పిల్లల చదువులు, సొంత నివాసాలను ఏర్పటు చేసుకున్నామని,ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారుసీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.