రాజధాని అంశం బెడిసికొట్టేలానే ఉంది.. వైసీపీ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుంది!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తుండడంపై అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన ఉద్యమం రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు కూడా పాకింది. రైతుల ఆందోళనను తొలుత లైట్ గా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత సెగ తగులుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగం గానే పరిపాలన ఒకే చోట ఉండాలని శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ ఒక చోట ఉంటేనే నిర్ణయాలు వెంటనే తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అలా చేసిన మరుసటి రోజే అగ్రనేతలు ఒత్తిడితో ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల్లో అంతర్లీనంగా ఉన్న భావన ఏమిటో తెలిసిపోయింది.  అమరావతి ప్రాంత గ్రామాల్లో విస్తరించిన నియోజక వర్గాల ఎమ్మెల్యేలు తమకు భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందేనని భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రాజకీయ సెగ ఎక్కువైంది. తమ నియోజక వర్గాల ఎమ్మెల్యేల వద్దకు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే వెళ్లి ప్రభుత్వ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సదరు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి వర్గ సమావేశానికి ముందు రోజు సీఎం జగన్ నివాసంలో ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో నిరసనలూ ఆందోళనలూ పెరిగాయని తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తేల్చి చెప్పేశారు. రాజధాని రైతుల ఆందోళనలు.. అక్కడి మహిళల కన్నీరు.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజక వర్గాల్లో సామాన్య ప్రజానీకం కూడా రాజధాని అమరావతిని తరలించడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారని వివరించారు. శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది కదా అని వ్యాఖ్యానించగా అసెంబ్లీ సమావేశాలు కూడా కేవలం శీతాకాలానికే పరిమితం చేయడం గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్టు తెలిసింది. దీనివల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టమేనని రాజధానిని తరలించుకుపోతున్నారనే ఆవేదన ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. కోస్తాంధ్ర ప్రజలు రోడ్డు మీదకు రారని.. సమయం చూసి వాతపెడతారని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఓ ప్రముఖుడు మాత్రం చంద్రబాబు రాజధానిని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తే ఆ రాజధాని ఏర్పాటైన తాడికొండ, మంగళగిరి నియోజక వర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ ప్రముఖుడు ఎమ్మెల్యేలకు హితవు చెప్పారు. అయితే రాజధానిపై ఈ వాదన తెస్తున్న ఆ ప్రముఖుడి అభిప్రాయాలు బయటకొచ్చాక ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేస్తే, విశాఖలో పాలన రాజధానిని ఏర్పాటు చేస్తే రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయనే నమ్మకం ఉందా అని నిలదీశారు.  మొత్తం మీద ఇలాంటి వాద ప్రతివాదనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలను లోలోపల కలవర పరుస్తున్నాయని తెలుస్తోంది. రాజధాని రైతులకు న్యాయం చేయాలని.. వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతనే రాజధాని తరలింపు పై ఓ నిర్ణయానికి వస్తే బావుంటుందని కూడా వారు సూచించినట్టు సమాచారం. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళుతానని సదరు ప్రముఖుడు కూడా హామీ ఇచ్చారు. కాని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేల ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం అంత సంతృప్తికరంగా ఉన్నట్టు కనిపించలేదు. బయటకేమో తామంతా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. కానీ లోపల జరిగిన తంతు నిదానంగా బయటకు పొక్కడంతో తమ నియోజక వర్గాల ప్రజలకు సదరు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.

మనీ పవర్ ఇన్ పాలిటిక్స్.. పొలిటీషియన్స్ మాటల్లోనే

ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు లేకుండా రాజకీయం చేయలేమనే స్థాయికి దిగజారిపోయింది నేటి రాజకీయం. ఒకప్పుడు నాయకులు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చేవారు. ప్రజలు కూడా తమకి మంచి చేసేవారికి, తమ బ్రతుకులు మార్చేవారికి ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాసేవ చేయాలని ఉన్నా డబ్బుల్లేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కొందరు నాయకులు. ఇక కొందరు పరిస్థితుల్ని బట్టి మనం కూడా మారిపోవాలని చెప్పి.. చుట్టూ మందిని తిప్పుకోవడానికి, ఓట్లు కొనడానికి.. కోట్ల డబ్బులు వెనకేసుకుంటున్నారు. అంతోఇంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఉన్న వ్యాపారాలు, ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజాసేవని గాలికి వదిలేస్తున్నారు. మొత్తానికి డబ్బు అనేది నేటి రాజకీయాలను శాసిస్తోంది. డబ్బు చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో డబ్బు పాత్ర గురించి మనకంటే.. రాజకీయ ప్రముఖులకు, మేధావులకు బాగా తెలుస్తుంది. త్వరలో వారి మాటల్లోనే దీని గురించి తెలుసుకోవచ్చు. జనవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని 'ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌' వేదికగా ‘ఇండియన్‌ డెమోక్రసీ ఎట్‌ వర్క్‌’ సదస్సు జరగనుంది. ఇందులో ‘మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావస, జస్టిస్‌ చలమేశ్వర్‌, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ, బీజేపీ నేత రాంమాధవ్‌, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నిజామాబాద్ మాజీ ఎంపీ‌ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొననున్నారు.

తెలంగాణ సీఎస్ పదవి ఆ ఇద్దరిలో ఎవరిని వరించనుంది?

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే విషయం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్ పదవి కోసం సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉనప్పటికీ సోమేష్ కి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పరిణామాలు మారితే అజయ్ మిశ్రా ఆ పోస్టులోకి వస్తారని సమాచారం. 1984 బ్యాచ్ అధికారిగా చేసిన ఈయనకు కీలక అధికారుల మద్దతు ఉంది. అయితే 1989 బ్యాచ్ కు చెందిన సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరి సర్వీసు కూడా పరిగణలోకి రానున్నట్టు తెలుస్తోంది. అజయ్ 2020 జులైలో రిటైరవనున్నారు, సోమేష్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ వరకు ఉంది. వివాదరహితుడిగా పేరుతో పాటు సీనియార్టీ పరంగానూ ప్రస్తుత సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి తరవాతి స్థానంలోఅజయ్ ఉన్నారు. ఇక సోమేశ్ ను రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో కేడర్ వేరైనా సీఎం తన విచక్షణాధికారంతో సోమేశ్ ను తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అజయ్ కి 7 నెలల సర్వీసే ఉన్నందున ఇప్పుడు ఆయనకు అవకాశమిచ్చి తరవాత సోమేష్ ను సీఎస్ చేయాలనే ప్రతిపాదన కూడా వస్తుంది.  ఈరోజు ( డిసెంబర్ 31న ) సాయంత్రం 5 గంటలకు జోషి పదవీ విరమణ చేయనున్నారు, ఈలోగా ఉత్తర్వులు వెలువడాల్సి వుంది. జోష్ కి మరో 3 నెలలు అవకాశమిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలింది. మరోవైపు సోమేష్ కుమార్ బిఆర్కె భవన్ లో జోష్ పదవీ విరమణ కార్యక్రమ ఏర్పాట్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గంటన్నర పాటు సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హాతో భేటీ అయ్యారు. జోషితో పాటు విపత్తుల నివారణ యాజమాన్యం కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, శాట్స్ డైరెక్టర్ దినకర్ బాబు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒకే రోజు ముగ్గురు ఐఏఎస్ లు రిటైర్ కానుండటం ఇదే ప్రథమం. మరో 6 నెలల్లో ఐదుగురు కీలక ఐఏఎస్ లు విరమణ పొందనున్నారు.

2019 పొలిటికల్ రిపోర్ట్.. లీడర్ ఆఫ్ ది ఇయర్ ఏపీ సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 151 సీట్లలో గెలిచి రికార్డు సృష్టించింది. పోలైన మొత్తం ఓట్లలో 49.9 శాతం సాధించింది. ఇక అధికారం కోల్పోయిన తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 30.96 శాతం ఓట్లతో ప్రతిపక్షస్థానంలో కూర్చవలసి వచ్చింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి, మొత్తం 25 స్థానాలకు గాను, 22 చోట్ల వైసిపి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.  ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న జగన్ కల 2019 లో నెరవేరింది. ఇందు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో గెలవాలన్న తపనతో అంతకు రెండేళ్ల ముందే 2017 నవంబర్ 6 న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. సుమారు 3648 కిలోమీటర్ల పాద యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది జనవరి 9 వ తేదీ న ప్రజా సంకల్ప యాత్రను ముగించారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. చివరకు ఘన విజయాన్ని అందుకో గలిగారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహనరెడ్డి మే 30 వ తేదీ న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణం చేయించారు, ప్రమాణ స్వీకారం రోజు ఆయన వృద్ధాప్య పెన్షన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేశారు. జూన్ 8 వ తేదీ న సీఎం జగన్మోహనరెడ్డి సెక్రటేరియట్ లో తొలిసారి అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంతపురం, అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండవ సంతకం చేశారు. జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తూ మూడవ సంతకం చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాటు పాలించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం ఈ సారి ఒంటరిగా బరిలోకి దిగింది. కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చంద్రబాబు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలేవి ఆయన్ను గట్టెక్కించలేక పోయాయి. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి కమ్యునిస్టు పార్టీలతో కలిసి బరిలోకి దిగారు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ తరపున రాపాక వర ప్రసాద్ మాత్రమే గెలిచారు. జనసేన పార్టీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలు ఈ సారి ఖాతా కూడా తెరవలేకపోయాయి. 2014 లో టిడిపితో కలిసి నాలుగు సీట్లు గెలిచిన బీజేపీకి ఈ సారి ఒక్కటి కూడా దక్కలేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచేందుకు ఎంతో ప్రయత్నించింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీల పరిస్థితి కూడా అంతే. ఇక అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత  టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యలు పార్టీ ఫిరాయించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పోయారు. మెజారిటీ సభ్యులు అటు వెళ్లడంతో రాజ్యసభలో టిడిపికి ఒక సభ్యుడు మాత్రమే మిగిలారు. ఓవరాల్ గా ఈ ఏడాది ఎన్నికలు వైసీపీకి తప్ప మిగిలిన పార్టీలన్నింటికీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

విశాఖ రాజధానిపై సీమ ప్రజలు ఫైర్.. పక్క రాష్ట్రాల రాజధానులే దగ్గరగా ఉన్నాయి

రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు, ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికు వచ్చిపోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెడుతున్నారు. బాబోయ్ రాజధానిగా ఆ నగరం మాకు వద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీనికంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైన విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమ లోని నాలుగు జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి విశాఖకు చేరుకోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.. 890 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కిలో మీటర్లు అంటే మరో రెండు గంటలు అదనపు ప్రయాణం అవుతుంది. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరి నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కిలో మీటర్లు, 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కిలో మీటర్ల దూరం, కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కిలో మీటర్ల దూరం వుంది. ఇలా ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికి సుమారు రెండు రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లిరావచ్చు. కడప నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే 415 కిలో మీటర్లు, చెన్నైకి 260 కిలో మీటర్లు, బెంగళూర్ కు 289 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్ కు 570 కిలో మీటర్లు, చెన్నైకి 158 కిలో మీటర్లు, బెంగళూరుకు 181 కిలో మీటర్లు ప్రయాణించిసి కేవలం గంటల వ్యవధి లోనే చేరుకునే అవకాశముంది. ఇక అనంతపురం నుంచి బెంగళూరుకు 215 కిలో మీటర్లు, హైదరాబాద్ కు 360 కిలో మీటర్లు, చెన్నైకి 464 కిలో మీటర్లు ప్రయాణిస్తే  విశాఖ కంటే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. కర్నూలు పరిధిలో విశాఖ కంటే ఈ మూడు రాష్ట్రాల రాజధానులకు తక్కువ సమయంలో వెళ్లిరావొచ్చు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు 218 కిలోమీటర్లు, బెంగుళూరుకు 360 కిలో మీటర్లు, చెన్నైకి 503 కిలో మీటర్లు ప్రయాణించి సులువుగా ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ విశాఖ కు వెళ్లిరావాలంటే రాయలసీమ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతి మేలని భావిస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల ప్రజలు కేవలం 7 గంటల్లో అమరావతికి రావచ్చు, అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ నాలుగు జిల్లాలకు అమరావతి 450 కిలోమీటర్ల లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కిలోమీటర్ల దూరం కేవలం 9 గంటలలో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశముంది.

విశాఖలో పులివెందుల పంచాయతీలు... జగన్, విజయసాయిపై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డా? లేఖ విజయసాయిరెడ్డా? అంటూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే.... విజయసాయిరెడ్డి.... వైజాగే రాజధాని అంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. భీమిలి ప్రాంతంలో రాజధాని రాబోతుందని విజయసాయి ఏవిధంగా ప్రకటించారని నిలదీశారు. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకాలంటూ విజయసాయి ఎలా పిలుపునిస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు. అయినా, దొంగ లెక్కలు రాసి జైలుపాలైన విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటన చేయడమేంటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారన్న దేవినేని ఉమా... విశాఖలో పులివెందుల పంచాయతీలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో విజయసాయి ఆగడాలపై సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ ‌రెడ్డి తీసుకునే తప్పుడు నిర్ణయాల్లో అధికారులు భాగస్వాములు కావొద్దని సూచించిన దేవినేని ఉమ... టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. దేవినేని ఉమా తరహాలోనే సీపీఐ రామకృష్ణ కూడా సీఎం జగన్‌‌ను నిలదీశారు. కేబినెట్ భేటీకి ముందే... విశాఖే రాజధాని అంటూ విజయసాయిరెడ్డి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. విజయసాయి ప్రకటనపై జగన్మోహన్‌రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో ప్రాంతాల మధ్య జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టారని విమర్శించారు. అయినా, ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని రామకృష్ణ ప్రశ్నించారు. మళ్లీ ఎవరిని మభ్యపెట్టడానకి హైపవర్ కమిటీ వేశారని ప్రశ్నించిన సీపీఐ రామకృష్ణ.... జగన్, విజయసాయిరెడ్డి కలిసి నిర్ణయాలు తీసుకుంటే... ఇంకా కమిటీలు ఎందుకన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిజంగానే జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.... అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. 

బకాయిల దెబ్బ.. సచివాలయాల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

గ్రామ సచివాలయం భవనాల నిర్మాణాల పై పీటముడి పడింది. గ్రామాల్లో నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నా ఇప్పటికే బిల్లుల బకాయిలు రూ.2000 కోట్లకు చేరడంతో కాంట్రాక్టర్లలో ఆసక్తి కొరవడింది. రాష్ట్రంలో మొత్తం 1365 గ్రామ పంచాయతీల్లో 11,158 గ్రామ సచివాలయాలుగా మార్చి ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు ప్రభుత్వం సిబ్బందిని నియమించింది. 7,785 సచివాలయాలకు సొంత భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 5,248 భవనాలు విస్తరించాల్సి ఉంది.1771 యొక్క సచివాలయలు ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తూ ఉండగా మరో ఒక 1,602 అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. సచివాలయాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు గ్రామాల్లో లేకపోవటంతో ఉపాధి పథకం నిధుల ద్వారా నూతన భవన నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో వివిధ పనులు చేపట్టిన మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఉపాధి బిల్లుల బకాయిలు చెల్లించకపోవటంతో ప్రస్తుతం పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే గ్రామాల్లో 2 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నుంచి మెటీరియల్ నిధులు విడుదల కాకపోతే పరిస్థితి ఏంటని పలువురు ఈ పనులకు వెనుకాడుతున్నారు. ఉపాధి పథకం నిబంధనల ప్రకారం గ్రామాల్లో టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ విధానం లోనే ఈ పనులు అప్పగించాలి. ప్రస్తుతం సర్పంచులు లేనందున గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి ద్వారా వీటిని అప్పగిస్తారు. భవన నిర్మాణాల్లో పెద్దగా ఆదాయం ఉండదని కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని అంచనా. టెండర్ల పనుల్లో కాంట్రాక్టర్ బెనిఫిట్ కింద 14% శాతం కేటాయిస్తారు. ఉపాధి పనులు నామినేషన్ విధానంలో చేస్తున్నందున అవి వచ్చే అవకాశం లేదు. పైగా నిధుల కొరత ఉండటంతో ఈ పనులు చేయటానికి ఎవరూ మొగ్గు చూపటం లేదని సమాచారం.ఎవరైనా తమంత తాముగా ఆసక్తి తో ముందుకొస్తే తప్ప నిర్మాణా లు చేపట్టడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. సచివాలయ పాలన పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే కొత్తగా 4181 భవనాలు నిర్మించాల్సిన అవసరముందని గుర్తించారు. 3189 భవనాల నిర్మాణానికి గ్రామాల్లో స్థలం అందుబాటులో ఉందని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. మరో 992 గ్రామ సచివాలయాలకు వేరే స్థలం లేదు. ఒకేసారి ఇన్నిటిని నిర్మించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ప్రభుత్వం విడతల వారీగా నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఉపాధి పథకంలో 3494 భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేశారు.973 కోట్లతో 2781 భవనాల్లో కలెక్టర్లు మంజూరు చేశారు.ముందుగా అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని నిర్మించాలని నిర్ణయించారు అధికారులు.20 ఏళ్లకు ముందు నిర్మించి కూలిపోయే స్థితిలో ఉన్నవి ప్రస్తుత అవసరాలకు సరిపోయినంత స్థలం లేని వాటి విస్తరణను రెండో ప్రాధాన్యంగా తీసుకొని పనులను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది .గత ఐదేళ్లలో ఉపాధి పథకం ద్వారా భారీ సంఖ్యలో పంచాయతీ భవనాలు నిర్మించారు. వాటిని 860 చదరపు అడుగుల నుంచి 1360 చదరపు అడుగులకు విస్తరించేందుకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు భావిస్తున్నారు.

పొత్తులపై కసరత్తులు.. మునిసిపల్ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు కరువైన అభ్యర్థులు!

తెలంగాణలో కామ్రేడ్లు డీలా పడ్డారు. లెఫ్ట్ పార్టీలకు అభ్యర్థుల కొరత ఏర్పడింది. పొత్తుల కోసం వామపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు ముఖ్య పార్టీలన్ని తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అధికార పార్టీతో సహా కాంగ్రెస్, బిజెపి ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా లిస్ట్ రెడీ చేసుకుంటున్నాయి.  సిపిఐ, సిపిఎం పార్టీలకు మాత్రం అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారాయి. అందుకోసమే వేరే పార్టీలతో జట్టు కట్టాలని భావిస్తున్నాయి. తమకు పట్టు ఉన్న వార్డుల్లో పోటీ చేస్తూ మిగతా చోట్ల తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మద్దతు ఇస్తామంటున్నాయి. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి తప్ప తమతో కలిసి వచ్చే మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని మునిసిపల్ ఎన్నికలకు వెళతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమకు అభ్యర్థులు లేని చోట స్వతంత్రులకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. అయితే సుత్తి, కొడవలి పార్టీ కన్నా కంకి, కొడవలి పార్టీ మునిసిపల్ ఎన్నికల విషయంలో ఆసక్తి చూపుతోంది. తెలంగాణలో తమకు బలం ఉందని చెబుతోంది. పోరులో బీజేపీతో తప్ప ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా మున్సిపోల్స్ షెడ్యూల్ విడుదల చేశారని ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం అంటకాగడం మంచిది కాదని సూచించారు చాడ. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలంటే పండగ చేసుకునే లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు పోటీపై అనాసక్తి ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడం, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా డీ కొట్టలేకపోవటం, టిడిపి బలహీన పడటంతో కామ్రెడ్ లు కూడా చతికిలబడిపోయారనే చెప్పాలి.

ఇదెక్కడి చోద్యం.. ముగ్గులు వేసిన మహిళలు అరెస్ట్!!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో వినూత్నమైన నిరసన తెలిపారు. కొందరు మహిళలు బీసెంట్ నగర్ లోని 17వ క్రాస్ స్ట్రీట్ లో ఇళ్ల ముందు ముగ్గురు ముగ్గులు వేసి నో సీఏఏ నో ఎన్ఆర్సీ అంటూ రాశారు. చాలా ఇళ్ల ముందు ఇలా కనిపించడంతో విషయం తెలుసుకొని ఆ ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఈ నిరసనకు కారణమైన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుకు కొందరు ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలియజేస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చివరకు నిరసనకారులను బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు అధికారులు.ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును డిఎంకె చీఫ్ స్టాలిన్ తప్పుబట్టారు. సీఏఏను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేస్తే కేసులు పెడతారా అని ఫేస్ బుక్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఈ ముగ్గుల నిరసన డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆ పార్టీ నేత కనిమొళి ఇళ్లకు కూడా పాకింది. నిరసనకారులు వారి వారి ఇళ్ల ముందు కూడా సీఐఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేశారు. మాజీ సీఎం కరుణా నిధి ఇంటి ముందు సైతం ఇదే తరహాలో నిరసనలకు కూడా దిగారు.

టీఆర్ఎస్ మంత్రులకు సవాల్ గా మారిన మునిసిపల్ ఎన్నికలు!!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంగా తన సత్తా చాటుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో మంత్రులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోసారి మేయర్ పీఠం దక్కించుకునే బాధ్యత జిల్లా మంత్రులైన ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ పై పడింది. కరీంనగర్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో అభ్యర్తులను గెలిపించుకునే బాధ్యతను మంత్రి ఈటెల రాజేందర్ భుజానికెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నందున క్లీన్ స్వీపే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. జమ్మికుంటలో 30, హుజూరాబాద్ లోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప్రజాదరణ ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో అన్ని స్థానాలూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకునే విధంగా మంత్రి కేటీఆర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. గత 2 నెలల నుంచే ఇందు కోసం కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరి గానే ఈ సారి కూడా సిరిసిల్ల చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. 33 కు 33 వార్డుల్లో జయకేతనం ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.  అటు కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి మునిసిపాలిటీల్లో 15 కు 15 వార్డుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో కొప్పుల పని చేస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కత్తిమీద సవాలనే చెప్పుకోవాలి. ధర్మపురి, జగిత్యాల, రాయికల్, పెద్దపల్లి, కోరుట్ల, మెట్ పల్లి, సుల్తానాబాద్ మునిసిపాలిటీలతో పాటు రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పైనే ఉంది. రామగుండంలో ఈ సారి బీజేపీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ బిజెపి అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టడంతో కొప్పుల ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పోటీని తట్టుకుని టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రులకు పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు.  

టీడీపీకి షాకిచ్చిన మరో ఎమ్మెల్యే!!

టీడీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి.. ఆయన సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతుండటం గమనార్హం. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వంశీ కొద్దిరోజులు క్రితం సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరనప్పటికీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోనూ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. ఇప్పుడు అదే బాటలో మద్దాలి గిరి పయనించనున్నారు. ముందు ముందు టీడీపీకి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు షాకిస్తారో చూడాలి.

ఆనందమానందమాయే.. మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్

కేసిఆర్ కి దైవ భక్తి చాలా ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అధికారంలోకి రాగానే యాదగిరి గుట్టను గొప్ప పుణ్యక్షేత్రంగా రూపొందించేందుకు చర్యలు కూడా చేపట్టారు. ఇటీవలే ఆయన దానిని ప్రత్యేకంగా కూడా సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సిరిసిల్ల పర్యటనకు బయలుదేరారు. శామీర్ పేట దగ్గర ఆగిన కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ ను కాన్వాయ్ లో ఎక్కించుకొని అక్కడ నుంచి పయనమయ్యారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకుంటారు. అక్కడ కేసీఆర్, కేటీఆర్ దంపతులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్, కేటీఆర్లు వేములవాడ నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టు బయలుదేరుతారు. ప్రాజెక్టు దగ్గర జలహారతి చేపట్టనున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు తొలి ఏడాదే నిండి పరవళ్లు తొక్కడం పై సీఎం ఆనందంగా ఉందన్నారు. అయితే దాదాపు గంట సేపు ఇవాళ మిడ్ మానేరు ప్రాజెక్టు వద్ద గడపనున్నారు కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ కు చేరుకుంటారు. అక్కడ తీగలగుట్టపల్లి లోని తెలంగాణ భవన్ లో భోజనం చేస్తారు. భోజన విరామం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు పయనమవుతారు.

జగన్ జోరు.. మూడు వారాల్లో మూడు రాజధానుల ప్రకటన

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధి పై నిపుణుల కమిటీ నివేదికలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని నియమించింది వైసిపి సర్కార్. 10 మంది మంత్రులతో సహా 16 మంది కమిటీలో సభ్యులుగా ఉంటారు. మంత్రుల బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్సా సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ఏపి డిజిపి గౌతం సవాంగ్, సిసిఎల్ఎ, మునిసిపల్ సెక్రటరీ, లా సెక్రెటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మెంబర్ కన్వీనర్ గా కమిటీలో ఉంటారు. ఈ కమిటీ 3 వారాల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని జీవోలో ప్రస్తావించారు. అవసరం మేరకు అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అన్ని అంశాల పై అధ్యయనం చేసి సమగ్ర రిపోర్టు ఇస్తామన్నారు మంత్రి కొడాలి నాని. అభివృద్ధి వికేంద్రీకరణ జిల్లాల సమగ్ర ప్రణాళికలపైన హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని దృఢ సంకల్పంతో సీఎం ఉన్నట్టు మంత్రి మోపిదేవి తెలిపారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ విధానంగా చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందు కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకెళతామన్నారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే 3 క్యాపిటల్స్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వీలుంది. దీనిపై జనవరి చివరి నాటికి క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు.

కనిపించని కళ్యాణ్.. కార్యాచరణలో రాజధాని రైతులకు జనసేనాని అండగా ఉంటాడా ?

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది . మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం నోట వెలువడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మార్చొద్దనే డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. రైతులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో జనసేనాని పాల్గొనలేదు. అసలు రైతుల నిరసనలపై కానీ ఆ తర్వాత గానీ మళ్లీ మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు జనసేన కార్యచరణ ప్రకటించటానికి సిద్ధమవుతున్నారు పవన్ . నేడు మంగళగిరిలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు జనసేనాని. ఈ సమావేశానికి పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ , నాగేంద్రబాబులతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం లో ప్రధానంగా ఏపీ రాజధానుల పై చర్చించనున్నారు. రాజధాని తరలింపును జనసేనాని గతంలో వ్యతిరేకించారు. అయితే క్యాబినెట్ భేటీ తర్వాత పవన్ రాజు దానిపై స్పందించలేదు. దీంతో రాజధాని పై జనసేన పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాయలసీమ నేతలు, పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మరోవైపు ఇప్పటికే అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రత్యేకంగా లేఖని విడుదల చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజధాని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.

సూపర్ పోలీస్.. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్పీ

  ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట అక్షరాల వరకే పరిమితం అవ్వకుండా చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ కౌషల్. క్రైమ్ రేట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు అధికారిగా.. సంచలన కేసుల్లో మిస్టరీని చేధించి నేరస్తుల్ని కటకటాల బాటపట్టించారు. ఆదేశాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్లో దర్యాప్తు కొనసాగించగల గట్స్ ఉన్న ఎస్పీగా కూడా పేరొందారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయటమే కాకుండా అర్ధరాత్రి కూడా వెంటనే స్పందిస్తారు.ఇటీవల సంచలనం రేపిన తల్లీ కూతురు హత్య కేసులో గంటల వ్యవధి లోనే మిస్టరీ ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే.. భార్యాబిడ్డల్ని చంపిన కేసులో నిందితుడ్ని కటకటాల బాటపట్టించారు.ఇలా ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీస్ గా పేరొందారు కౌషల్. స్పందన కార్యక్రమంలో వెల్లువెత్తే ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు ఎప్పటికప్పుడు దర్యాప్తును ట్రాక్ చేయటమే కాక డిపార్ట్ మెంట్ లో తనదైన మార్కును చాటుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్. క్రైమ్ రేట్ కు కళ్లెం వేయడంతో పాటు పోలీసుల పని తీరు పై కూడా నిఘా పెంచారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్ లలో సరైన స్పందన ఉండడం లేదన్న ఆరోపణల క్రమంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఎస్పీ. ఒంగోలు ఠాణాలో ఫిర్యాదు దారులతో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ను రంగంలోకి దింపారు. ఆయన మఫ్టీలో సామాన్య పౌరుడిలా ఒంగోలు తాలూకా పీఎస్ కు వెళ్లి తన మొబైల్ లో గుర్తు తెలియని వ్యక్తి లాక్కేల్లాడని కంప్లైంట్ తీసుకోవాలని కోరారు.కానీ సిబ్బంది స్పందించలేదు సిఐ లేరు ఆయన సాయంత్రం వస్తారు అప్పుడు దాని తిప్పి పంపారు. సాయంత్రం మళ్లీ స్టేషన్ కు వెళ్లారు జగదీష్. రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వ మని అడిగితే మళ్లీ వెళ్ళవయ్యా వెళ్లు అని కాసురుకున్నారు. ఎందుకివ్వరు అని గట్టిగా అడిగితే అసలు ఫోన్ నీదే అని గ్యారెంటీ ఏంటి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అని అవాక్కైన ట్రైనీ ఎస్పీ ఒంగోలు తాలూకా పీఎస్ లో తనకు ఎదురైన అనుభవాన్ని.. ప్రతి అంశాన్ని సిద్దార్థ్ కౌశల్ కు రిపోర్టు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి వేధించడమే కాకుండా అవమానపరచడం దురుసుగా మాట్లాడటం వంటి చర్యల్ని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ట్రైనీ ఐపీఎస్ జగదీష్ రిపోర్ట్ పై వెంటనే స్పందించారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు దారుని అవమానపరచిన స్టేషన్ రైటర్ సుధాకర్ ను వెంటనే సస్పెండ్ చేశారు.సీఐ లక్ష్మణ్, ఎస్ ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ రాజేష్, మహిళా కానిస్టేబుల్ రమ్య కిరణ్ లకు శిక్షగా చార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ. పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించటమే కాక ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కట్టుబడి ఉండాలని పదేపదే సూచిస్తున్నారు.ప్రజల్లో పోలీసులంటే భరోసా.. గౌరవం ఉండాలన్నారు. ఆ దిశగా ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నిజమయ్యేలా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ చేపడుతున్న చర్యలకు జే జే లు కొడుతున్నారు ప్రజలు.

రాజధాని మారడం బాబుకి ఇష్టం లేదు.. ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేస్తున్న చంద్రబాబు

మూడు రాజధానుల విషయంలో టిడిపి చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బాబు లక్ష్యంగా పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. చంద్రబాబును నమ్మలేమని.. ఆయన పైకి ఒకటి చెబుతారు తెరవెనుక మరొకటి చేస్తారంటూ వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమన్యాయం పేరుతో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన కొందరి సాయంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విశాఖ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని.. ఢిల్లీ స్థాయిలో టిడిపి నేతలు ఎవరితో మాట్లాడారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు బాబు ఎలాంటి కుట్రలకు తెర తీశారనే ప్రశ్నలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ వేడి కొనసాగుతుండగానే ఇదే స్థాయిలో ఆరోపణలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు కూడా చెప్పాల్సిన వారికే చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో విజయసాయి , అవంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసు.. ఎస్సై వీడియో లీక్!!

మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యలు. పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి చెప్పిన మాటలను, వీడియోను మీడీయాకు అందజేశారు హర్ష కుమార్ కుటుంబ సభ్యులు. తన పై ఒత్తడి తెచ్చి హర్ష కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని వీడియోలో పోలీస్ ఆఫీసర్ వివరిస్తున్నట్లుగా ఉంది. వైద్యులు వద్దంటున్న హర్ష కుమార్ ను బలవంతంగా జైలుకు తరలిస్తున్నారని ఆయన కుమారులు శ్రీరాజ్ సుందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కనీసం లేవలేని స్థితిలో ఉన్న హర్ష కుమార్ ను జైలుకి ఎలా తీసుకువెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నా కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అంటున్నారు. సమాజం  సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  దీని పై స్పందించిన హర్ష కుమార్ కుమారుడు.. " మా నాన్నగారి పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన  ఎస్సై ఆయన దగ్గరకు వచ్చి..రెండు చేతులు పట్టుకుని చాలా తప్పు జరిగిపోయిందని చెప్పారన్నారు. ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి, ఒక పేద బడుగు బలహీన చిన్నస్థాయి మనుషుల గురించి పోరాడుతుంటే మీ పై కక్షసాధింపు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. మిమ్మల్ని ఇబ్బంది గురిచేయడానికి ఇలా అక్రమ కేసులు పెట్టడం తప్పని  ఎస్సై చెప్పారు" అని వెల్లడించారు.  

జగన్‌పై సుబ్రమణ్యస్వామికి అంత ప్రేమెందుకు?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ తీరు సరిగానే ఉందన్నారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలను సుబ్రమణ్యస్వామి తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. అలాగే, టీటీడీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం చేశారని, అది కూడా తప్పేనన్నారు. తమ దృష్టికి వచ్చిన అన్ని ఆరోపణలపైనా నిజనిర్ధారణ జరిపామని, అయితే అవన్నీ అవాస్తవాలుగా తేలాయన్నారు. ఒకవేళ నిజంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట రియాక్ట్ అయ్యేది తానేనన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మతపరమైన ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి సుబ్రమణ్యస్వామి సూచించారు. అయితే, దేవాలయాలను వచ్చిన డబ్బును హజ్ యాత్రలకు, జెరూషలేము టూర్స్‌కి ఎలా ఇస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వందేళ్లుగా వచ్చిన కానుకలపై కాగ్‌‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఆడిట్ బాధ్యతలను పూర్తిగా కాగ్ కి అప్పగించాలన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండొద్దని... స్వర్ణ దేవాలయం మాదిరిగా స్వతంత్రంగా ఉండాలన్నారు సుబ్రమణ్యస్వామి. అయితే, జగన్ పై సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలనపై విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తుంటే.... సుబ్రమణ్యస్వామి మాత్రం ప్రతిపక్షాలనే తప్పుబట్టడం.... అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ పై అంత ప్రేమెందుకో అంటూ మాట్లాడుకుంటున్నారు.

 జనవరి 3న రాజధానుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసిన బిసిజి కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు మరియు ఇతర అంశాల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నానితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం డీజీపీ గౌతం సభ సీసీఎల్ పురపాలక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అవసరమైతే ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవచ్చని సూచించారు. కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా విశ్లేషిస్తుంది. మూడు వారాల లోపు సిఫారసులతో కూడిన నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలనీ జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దీంతో అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అనంతరం క్యాబినెట్ సమావేశంలో అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక రావాలని.. ఆ తరువాత రెండు నివేదికలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. జనవరి 3వ తేదీన బిసిజి నివేదిక అందించనుంది. హైపవర్ కమిటీ దీనిని జీఎన్ రావు కమిటీ నివేదికను పరిశీలించి సిఫార్సు చేస్తోంది. వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి చట్టబద్ధంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.