అమరావతిలో దేవినేని ఉమ అరెస్ట్.. రైతుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
posted on Dec 27, 2019 @ 4:22PM
అమరావతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలతో రాజధాని గ్రామాలు అట్టుడుకుతున్నాయి. పలుచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా టీడీపీ నేత దేవినేని ఉమా రోడ్డు పై బైఠాయించడంతో గొల్లపూడిలో ఉద్రిక్తత తలెత్తింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గ గుడి వరకు ఆయన భారీ ర్యాలీకి ప్రయత్నించారు. భారీగా తరలి వచ్చిన రైతులు, మహిళలతో కలిసి రోడ్డు పై ఆయన బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.ఇరవై తొమ్మిది గ్రామాల రైతాంగ త్యాగ ఫలంతో అమరావతి ప్రజా రాజధాని ఏర్పడిందన్నారు. ఇవ్వళ ముఖ్యమంత్రిగారు దుర్మార్గంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఓ రాజకీయ దళారి ఓ ముద్దాయి విజయసాయిరెడ్డి భీమిలిలో రాజధాని ఉంటుందని, విశాఖపట్నంలో రాజధాని ఉంటుందని కమిటీ పూర్తి అవ్వక ముందే ప్రకటన చేశాడని మండిపడ్డారు. తమ వ్యాపారాలకు.. జగన్ మోహన్ రెడ్డికి భయపడి ప్రాంతీయ నేతలు కూడా రాజధాని మార్పుకు మద్దతు తెలుపుతున్నారని ఉమా ఆవేదను వ్యక్తం చేశారు.ఈ చర్యలకు పాల్పడిన ఉమాను తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.