'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలయ్య సాయం.. నెటిజన్ల ప్రశంసల వర్షం!!

నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనస్సుని చాటుకున్నాడు అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టీడీపీ అధినేత చంద్రబాబుని, నందమూరి కుటుంబాన్ని కించపరిచేలా చూపించారంటూ.. అప్పట్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది కావాలని వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వర్మ చేసిన సినిమా అని ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా ఎన్నికలకు ముందు ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. కాగా ఎన్నికలు ముగిసిన ఏడు నెలలు తరువాత.. ఈ సినిమా చర్చనీయాంశమైంది.  లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ పాత్రధారి విజయ కుమార్ భార్యకు క్యాన్సర్ సోకింది. ఆమెకు ఇప్పుడు.. బాలయ్య నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా పేరుతో తమ కుటుంబం, పార్టీ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూసిన వారికి కూడా బాలయ్య సాయం చేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసిస్తున్నారు.

పాక్ సైన్యం నుండి ఏపీ మత్స్యకారులను విడిపించిన నేతలు!

భారత దౌత్యాధికారులు పాకిస్థాన్ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. గత 13 నెలలుగా పాకిస్థాన్ చెరలో బందీలుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు విడుదల చేశారు. మొత్తం 20 మందిని రేపు ( జనవరి 7వ తేదీన ) వాఘా సరిహద్దుల్లో శ్రీకాకుళం మత్స్యకారులను విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించనుంది.  పాకిస్థాన్ చెరలో మగ్గిన ఏపీ మత్స్యకారులను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతం వాఘా వెళ్లారు మంత్రి మోపిదేవి వెంకట రమణ. తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ విడిచిపెట్టడంతో వారిని తీసుకురావాలని మోపిదేవిని సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వాఘా బోర్డర్ పయనమైన మోపిదేవి అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలు పూర్తయ్యాక పాక్ అధికారులు ఏపీ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగించనున్నారు. కొంతకాలంగా వైసీపీ ఎంపీలు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేయడంతో పాక్ చెర నుంచి మత్స్యకారుల విడుదలకు మార్గం సుగమం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి విజయసాయిరెడ్డి తోడ్పడ్డారని ఆయన అన్నారు.  గుజరాత్ లో చేపల వేటకు వెళ్లిన వీళ్ళు పొగ మంచు కారణంగా పాక్ జలాశయాలలోకి ప్రవేశించారు. దీంతో పాక్ కోస్ట్ గాడ్స్ వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైసీపీ విజయసాయి రెడ్డి వంటి నేతలు.. మత్స్యకారులను విడిపించాలని కేంద్రాన్ని కోరారు. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించి మత్స్యకారులు పాక్ చెర నుండి విడుదల అయ్యారు. మొత్తానికి మత్స్యకారుల కుటుంబాలల్లో ఆనందాన్ని తీసుకువచ్చేందుకు నేతలు తీవ్రంగా కష్టపడ్డారనే చెప్పుకోవాలి.

తెలంగాణ సీఎంగా కేటీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్!!

తెలంగాణ రాష్ర్టానికి యువనేత కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రివర్గంలోని సభ్యులతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికలు పూర్తయితే రాష్ట్రంలో నాలుగేళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు ఉండే అవకాశం లేదు. దీంతో మునిసిపల్ ఎన్నికల అనంతరమే సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టాలనే కార్యకర్తల ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు సీనియర్ నేత మంత్రి కొప్పుల ఈశ్వర్. గతంలో ఇలానే ఇద్దరు ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంత్రివర్గంలోని మిగతా సభ్యులు కూడా చేస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి సంకేతాలు రాని పక్షంలో మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చొబెడితే.. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే అంశంపై పలు ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలను నడిపించాలనుకుంటే ప్రభుత్వ పరంగా అడ్వైజరీ కమిటీ నియమించి దానికి చైర్మన్ గా కేసీఆర్ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే రాజ్య సభ స్థానం నుంచి పార్లమెంటు వైపు అడుగులు వెయ్యొచ్చు. అదే జరిగితే గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఆయన కుమార్తె కవితను ఎమ్మెల్యేగా బరిలో దించేందుకు కూడా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అది కూడా జరగని పక్షంలో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని మరోసారి అందుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై ఆరేళ్లుగా తాను చేసిన పనుల పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.  

30 మందికి పైగా గాయాలు.. ఢిల్లీ 'జేఎన్ యూ'లో అల్లరి మూకల దాడులు!!

ఢిల్లీలోని జేఎన్ యూలో మళ్లీ హింస చెలరేగింది. యూనివర్సిటీ క్యాంపస్ లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి చొరబడ్డారు. అలా చొరబడిన వ్యక్తులు విద్యార్థుల పై, ప్రొఫెసర్ల పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జేఎన్ యూ ప్రెసిడెంట్ అయిషేయ్ ఘోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  తమపై దాడికి పాల్పడింది ఏబీవీపీ కార్యకర్తలే అని ఆరోపించారు అయిషేయ్ ఘోష్. ఆ అనుమానాస్పద వ్యక్తులు రాడ్లు, కర్రలతో దాడి చేయడంతో దాదాపు 30 మందికి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుగా వచ్చిన ప్రొఫెసర్లపై కూడా దాడి చేశారు. ఈ ఘటన తర్వాత యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ దాడి జరిగిన దృశ్యాలు కేమరాలకు చిక్కడంతో వాటిపై దృష్టి పెట్టారు పోలీసులు.  జేఎన్ యూలో గత కొద్దిరోజులుగా విద్యార్ధి సంఘాలు పోటా పోటీగా నిరసనలు చేస్తున్నాయి. హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు చాలా రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన హింసలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టల్లో ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. క్యాంపస్ లో హింసకు ఏఐఎస్ఐ విద్యార్థులే కారణమని ఏబీవీపీ ఆరోపించింది. కాంగ్రెస్ లెఫ్ట్ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని లెఫ్ట్ నేతలు ప్రశ్నించారు

సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టించిన రోజా!!

సొంత పార్టీ కార్యకర్తలపైనే వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కేసు పెట్టించారనే విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్‌పురంలో.. గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజకోసం వెళ్తున్న రోజా కారును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో కష్టపడిన తమను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారి చెప్పిన స్ధానంలోనే  గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను దూరం పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రోజా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. చాలాసేపు రోజా కారుని అలాగే నిలిపివేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి వారితో మాట్లాడి రోజాని అక్కడి నుండి తీసుకెళ్లాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనతో రోజా తీవ్ర అసహనానికి లోనయ్యారని తెలుస్తోంది. అందుకే పుత్తూరులోని పోలీస్ స్టేషన్‌లో తన అనుచరులతో రోజా కేసు నమోదు చేయించారని సమాచారం. 30 మంది కేబీఆర్‌పురం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏకాదశి శోభ... తిరుమలకు క్యూకట్టిన వీఐపీలు...

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. ప్రముఖ ఆలయాలన్నీ వైకుంఠ ఏకాదశి వైభవంతో కళకళలాడుతున్నాయి. స్వామివార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కొన్ని ఆలయాల్లో అర్ధరాత్రి నుంచి... మరికొన్ని ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు క్యూకట్టారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇక, అర్ధరాత్రి నుంచే తిరుమల శ్రీవారికి కైంకర్యాలు మొదలయ్యాయి. తిరుప్పావై పఠనంతో శ్రీవారిని మేల్కొలిపి... శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు ప్రముఖులు తిరుమలకు క్యూకట్టారు. ఉభయ రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు... ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అండ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కేటీఆర్‌కు ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ముక్తి, మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే, తిరుమల శ్రీవారి పర్వదినాలు అన్నింటిలో వైకుంఠ ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా చెబుతారు పండితులు. ఎందుకంటే, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ తర్వాత తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఆలయంలో వైకుంఠా ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఇక, ఏకాదశి రోజున స్వామివారిని క్షణకాలం చూసినా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.  తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత వైకుంఠ ద్వారాల నుంచి వెళ్తే ముక్తి కలుగుతుందని భక్తులు భావిస్తారు. పైగా లక్షీదేవి విగ్రహం దగ్గర్నుంచి వైకుంఠ ద్వారం ఉండటంతో లక్షీ కటాక్షం కూడా సిద్దిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే, గంటల తరబడి వేచి ఉండైనా వెంకన్నను దర్శించుకుంటున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోనూ క్యూలైన్లు నిండిపోయాయి. లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో తరలివస్తోన్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం నుంచి పల్లకి సేవపై వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.  అలాగే, భద్రాచలంలో రాములోరు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం వైభవంగా జరిగింది. హంస వాహనంపై గోదావరిలో రామచంద్రుడు విహరించారు.

మొన్నటివరకు ఉల్లి... ఇప్పుడు ఎండు మిర్చి...

మొన్నటివరకు ఉల్లి... ఇప్పుడు ఎండు మిర్చి... సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండు మిర్చిని తింటేనే కాదు... ధర వింటేనే చాలు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకటికి మూడు రెట్లు పెరిగిన ఎండు మిర్చి ధరలు మంట పుట్టిస్తున్నాయి. అసలు తినకుండానే మిర్చి ఘాటు నషాళానికి ఎక్కుతోంది. కొద్దిరోజులుగా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తోన్న ఎండుమిర్చి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటివరకు కిలో 90 రూపాయలున్న ఎండుమిర్చి... ఇప్పుడు ఏకంగా 240 రూపాయలు పలుకుతోంది. దాంతో, మిర్చిని తింటేనే కాదు... దాని రేటు వింటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.  కూరల్లోనూ, తాళింపుల్లోనూ కచ్చితంగా వాడే ఎండుమిర్చి ధరలు ఇలా, ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు హడలిపోతున్నారు. ఇప్పటికే ఉల్లిని కొనలేని పరిస్థితి ఉంటే, ఇఫ్పుడు దాని జతకు ఎండుమిర్చి కూడా చేరిందని వాపోతున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా పెరిగిపోతుంటే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు పంట దిగుబడి పడిపోవడంతోనే ఎండుమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండుమిర్చి ధర ఇంకా పెరిగే అవకాశమే ఉందంటున్నారు. మొత్తానికి, మొన్నటివరకు ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తే, ఇప్పుడు ఒకటికి మూడు రెట్లు పెరిగిన ఎండుమిర్చి... తినకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది.  

గర్భిణీలపై కేసీఆర్ కిట్ ఎఫెక్ట్... తెలంగాణలో కొత్త రికార్డులు

తెలంగాణ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగాయి. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. కేసీఆర్ కిట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో 30శాతం కూడా ప్రసవాలు జరగని సర్కారు దవాఖానాల్లో ఇప్పుడు 50శాతానికి పైగా డెలివరీలు నమోదు అవుతున్నాయి. గతేడాది సర్కారు దవాఖానాల్లో 50శాతానికి పైగా ప్రసవాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతోన్న ప్రసవాల్లో ఎక్కువగా నార్మల్ డెలివరీలే జరుగుతుండటం మరో విశేషం. కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కిట్ కింద... రెండు చీరలు, బేబీ సోప్, బేబీ ఆయిల్‌తోపాటు దోమ తెర అందిస్తారు. అలాగే, ఆడబిడ్డ పుడితే 15వేలు... మగబిడ్డ పుడితే 14వేలు నగదు అందజేస్తున్నామని, అలాగే నార్మల్ డెలివరీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దాంతో గర్భిణీలు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలకు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.  2016లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి, 2019 జూన్ వరకు 4లక్షల 46వేల 400మంది... ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒక్క హైదరాబాద్‌లోనే లక్షా 2వేల మంది... ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీలు జరిగినట్లు అధికారులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కిట్ బాగానే పనిచేస్తుందని... ఆ పథకం ద్వారా అందుతోన్న నగదు, వస్తువులను అందుకోవడానికైనా... ప్రసవాల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో చేరుతున్నారని అంటున్నారు.

నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి.. వైసీపీ నేతల్లో మొదలైన అలజడి!

నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం పోరు కొనసాగుతోంది. నాలుగు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి అధికార వైసీపీలో సెగలు రాజేస్తోంది. 1975 లో మార్కెట్ యార్డు ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ సారి టఫ్ ఫైట్ కొనసాగుతోంది. మార్కెట్ యార్డ్ ఆరంభం నుంచి నేటి వరకు ఈ కుర్చీలో మిడుతూరు మండలానికి చెందిన నేతలే కూర్చుంటూ వచ్చారు.  అయితే మార్కెట్ కమిటీ రిజర్వేషన్ల ప్రకారం నందికొట్కూరు మార్కెట్ యార్డును ఓసీ జనరల్ కు కేటాయించింది కొత్త ప్రభుత్వం. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.నందికొట్కూరు శాసన సభ్యుడు ఆర్ధర్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు ప్రధానంగా బరిలో నిలిచారు. నామినేటెడ్ పోస్టు కావడం దీనికి తోడు సొంత నియోజకవర్గం కనుక తమకే ఈ పీఠం దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు శ్రీశైలం నియోజక వర్గ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి బంధువర్గం జూపాడు బంగ్లా మండలంలో ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా ఈ పదవిపై కన్నేశారు. ఇదే సమయంలో నందికొట్కూరు నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం సైతం బరిలోకి దిగింది. ఈ ముగ్గురు నేతల అనుచరులు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం హోరాహోరీకి దిగడంతో స్థానిక రాజకీయం రక్తికడుతోంది. 40 దశాబ్దాల తరువాత రిజర్వేషన్ మారడంతో నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. ఇప్పటికే కొంత మంది గ్రామ మండల స్థాయి నాయకులు రేస్ లోకి దిగి ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు మంత్రుల స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సత్తా చాటుకోగల నాయకుడికే మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కట్టబెట్టాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. జూపాడు బంగ్లా , మిడ్తూరు నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలో ముఖ్యనేతలకు సైతం తెలియడం లేదు. మార్కెట్ యార్డు చైర్మన్ అభ్యర్థిని స్థానిక ఎన్నికలకు ముందే డిక్లేర్ చేయండి లేదా మీ మండలానికే ఇస్తామని గట్టి హామీ ఇవ్వమని జూపాడుబంగ్లా ప్రజలు అంటున్నారు. దీంతో ఆ ముగ్గురు నేతలు ఈ విషయం పై జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగ రాజేస్తున్న మాట వాస్తవం.  

పోటీ అదరనుంది.. మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న జగ్గారెడ్డి భార్య

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) రాజకీయ జీవితం మునిసిపల్ చైర్మన్ గా మొదలైంది. ఆ తర్వాత 2004, 2009, 2018 లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తన రాజకీయ జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమైందో అక్కడ నుండి తన భార్య రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిచాలని చూస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. తూర్పు నిర్మల ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డి రాజకీయ కార్యకలాపాలపై సహకారమందిస్తూ ఆయన లేని టైంలో నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆమెను బరిలోకి దించి చైర్మన్ చేస్తే బాగుటుందని ఆయన భావిస్తున్నారు. అయితే బిజెపి నుండి అప్పట్లో చైర్మన్ చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు భార్యను చైర్మన్ చేసుకుంటారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఏదేమైనా సంగారెడ్డి లో జగ్గారెడ్డి భార్య బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఈ సీటు హాట్ ఫేవరెట్ గా మారింది.

నిజామాబాద్ లో నయా రూల్.. వ్యతిరేకత ఉన్న అభ్యర్థులకు నో టిక్కెట్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ తో పాటు 6 మున్సిపాల్టీ లను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపుగుర్రాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినట్లే మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్ భీమ్ గల్ మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ కు బిజెపి గట్టి పోటి ఇస్తుండగా.. కామారెడ్డి ,బోధన్, ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముందంజలో పోటీ ఉంది. బాన్సువాడలో ప్రతిపక్షాల ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండటంతో గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు ఎమ్మెల్యేలు. డివిజన్ల వారీగా అభ్యర్థుల సర్వే జరిగినట్లు తెలుస్తోంది.  నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలో సగానికిపైగా సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ సర్వేలో తేలింది. తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు సమాచారం. సిట్టింగులకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వారికి టికెట్ రాకుండా చెక్ పెట్టడమే కాకుండా వారు వేరే పార్టీ తరపున పోటీ చేయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా నిజామాబాద్ కార్పొరేషన్లో మెజార్టీ సిట్టింగ్ లకు టికెట్ దక్కడం లేదని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ల టెన్షన్ సిట్టింగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో డివిజన్లు 60 కి పెరిగాయి. సమీప 9 గ్రామాల విలీనంతో చాలా డివిజన్ల సరిహద్దులు మారాయి. దీంతో రిజర్వేషన్లు సైతం పూర్తిగా మారే అవకాశముంది. ఇటు రిజర్వేషన్లు అనుకూలించగా అటు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో సగం మంది సిట్టింగులు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. అవసరమైతే పక్కపార్టీ లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు.  

రాజంపేటలో రాజుకుంటున్న చిచ్చు.. ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న వైసీపీ కార్యకర్తలు

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ టిక్కెట్ కూడా సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. పార్టీలో.. ప్రభుత్వంలో.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా ఉన్నారు. ఎప్పటిలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. సాధ్యమైనంత వరకు మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డితో సమన్వయంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పార్టీ విషయంలో కొంత అసంతృప్తిగానే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్ తో కలిసి సాగిన ఆయన మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదనే భాధలో ఉన్నారు. గత ఎన్నికల్లో వివిధ సమీకరణాల దృష్ట్యా జగన్ ఆకేపాటిని కాదని టిడిపి నుంచి వచ్చిన మేడాకు టికెట్ ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన జగన్ కు తన విధేయత ప్రదర్శిస్తూ మేడ గెలుపునకు కృషి చేశారంటున్నారు. కానీ లోలోపల అసంతృప్తి మాత్రం అలానే ఉంది. అసలు సమస్య అక్కడే మొదలయిందని అంటున్నారు.  ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆకేపాటి మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి నియోజకవర్గంలో తన పెత్తనాన్ని కొనసాగించేందుకు ఆరాటపడుతున్నారు. వైసిపిలో పాత పరిచయాలను ఉపయోగించుకుంటూ జిల్లా మంత్రులను ఇన్ చార్జిలను తన ఇంటికి పిలిపించుకుంటూ పరపతిని చూపించుకుంటున్నారు. అధికార కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే మేడా లేకుండానే పూర్తి చేస్తున్నారు. ఆకేపాటి వ్యవహారం పై ఎమ్మెల్యే మేడా వర్గీయులు కాస్త గుర్రుగా ఉన్నారు. ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఇసుక రీచ్ ల ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే మేడా లేకుండానే ఆకేపాటి సమక్షంలో మంత్రులు ప్రారంభించేశారు. జనవరి 24 నుంచి రాజంపేటలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వేరువేరుగా పర్యవేక్షిస్తుండటం కార్యకర్తల్లో అయోమయం మొదలైంది. కార్యకర్తలకు సమస్య వచ్చి పోలీస్ స్టేషన్ కు వెళితే ఆకేపాటి చేయమంటే ఎమ్మెల్యే మేడా వద్దంటున్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కూడా ఇదే పరిస్థితి, వీరి మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారం ముదరకముందే జగన్ నచ్చజెప్పితే మంచిదని కార్యకర్తలు అంటున్నారు.

మునిసిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. మురికి కాలువలు శుభ్రపరిచే పనిలో పడ్డ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

మున్సిపాలిటీల ఎన్నికల సందడి మొదలయింది. పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో మంచి జోష్ మీదున్న టీఆర్ఎస్ పార్టీ అదే సీన్ రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. చేర్యాల మునిసిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని 12 వార్డులను తమ ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. చేర్యాలలో ఉన్న 12 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా చేపట్టాలని మురికి కాలువలను శుభ్రం చేసి చెట్లను పెంచాలని కౌన్సిలర్ టిక్కెట్ ఆశిస్తున్న నేతలకు , కార్యకర్తలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదేశించారు. అంతేకాదు ఆయా వార్డులలో ఆశావాహులు ప్రజల మన్నలను పొందుతున్నారా.. లేదా అని స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. పనిలో పనిగా కాలనీ ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆశవహులు కార్యకర్తల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తానే పారిశుద్ధ్య కార్మికులు అవతారమెత్తి మురికి కాలువలను శుభ్రం చేస్తున్న దృశ్యాలు కూడా స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి.  చేర్యాల మున్సిపల్ అధికారులు ఇప్పటికే వార్డుల విభజన పూర్తి చేశారు. 12 వార్డుల్లో మొత్తం 12,127 ఓటర్లున్నారు. కౌన్సిలర్ టికెట్ ఆశించే అభ్యర్థులు తమ తమ వార్డుల్లో పట్టు పెంచుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు మధ్య అంతర్గత విభేదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచిస్తున్నారు. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వారు ఆ అభ్యర్థికి సహకరించేలా కేడర్ ను ఒప్పిస్తున్నారు. ఈ మేరకు ఆశావహులతో డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేసే వారికి బహిష్కరణ వేటు తప్పదని ముందే హెచ్చరిస్తున్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని పనులు చేసే వారికి మాత్రమే అధిష్టానం అనుగ్రహం ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పష్టం చేయడంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారు అప్రమత్తమయ్యారు. తమ వార్డుల్లో సొంత డబ్బులతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పైరవీల ద్వారా టికెట్లు సాధించుకోవాలని తలపోసిన వారు కూడా ఇప్పుడు దారిలోకి వస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.  చేర్యాల మున్సిపాలిటీలో ఎస్సీ సామాజిక వర్గం తర్వాత బీసీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా పూర్తిగా గులాబీ జెండాలే ఎగురవేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో నూతనంగా ఏర్పడిన చేర్యాల పురపాలక సంఘాల రాజకీయం ఆసక్తికలుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లా డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డితో ఇటీవల భేటీ కావడం స్థానికంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మున్సిపల్ పరిధి లోని హస్తం పార్టీ నాయకులను పిలిపించుకుని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని వ్యూహ రచన చేస్తున్నారు. బిజెపి కూడా బలమైన అభ్యర్థులను పోటీకి నిలపాలని ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి రెండు స్థానాల్లో అయిన గెలవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పట్నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి తమదైన శైలిలో కదులుతున్నారు.

బీసీజీ రిపోర్ట్ కి తల తోక ఉందా?.. అన్నీ అబద్ధాలు!!

బోస్టన్ కమిటీ నివేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బీసీజీ ఎప్పుడు వేశారు..తల తోక ఉందా?. క్లయింట్‌కు ఏది కావాలంటే అది రాసి ఇచ్చింది అని విమర్శించారు. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చిందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు. రాజధానికి లక్షా 10 వేల కోట్లు అవసరమని ఎవరు చెప్పారు?.. అమరావతిని చంపేసి పేద అరుపులు అరుస్తారా? అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త నగరాలు సైబరాబాద్‌, నవీముంబై, డెహ్రాడూన్‌ అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. అమరావతిని తీసుకెళ్లి ఫెయిల్యూర్‌ సిటీలతో పోలుస్తారా? అని మండిపడ్డారు. 2009 వరదల్లో అమరావతి మునిగిపోయిందని అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెప్పడానికి సిగ్గుండాలి. విశాఖలో హుద్‌హుద్ వస్తే 9 రోజులు అక్కడే ఉన్నాను. 2009లో వరదలు వస్తే కర్నూలు మునిగిపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు. రాజధానికి మిమ్మల్ని ఎవరు అప్పులు తెమ్మన్నారు?.. అమరావతిలో ఇప్పుడున్న వసతులతో పాలించలేరా?. అమరావతిలో హైకోర్టు, పరిపాలన భవనాలు లేవా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర రాజధానిలోనైనా ఎగ్జిక్యూటివ్‌, లెజిస్లేచర్‌ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయా? అని నిలదీశారు. అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్దాలు చెబుతున్నారు. హైదరాబాద్‌, చెన్నై కంటే అమరావతిలోనే తక్కువ ఖర్చవుతుందని తెలిపారు. అమరావతిలో కట్టిన బిల్డింగ్‌లు, రోడ్లు మీకు కనిపించలేదా?. రైతులతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్‌ను గౌరవించరా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

మునిసిపల్ ఎన్నికలు అవ్వగానే ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం!!

వారుసుడి పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గం సుగమం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టటానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత లేదా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ముహూర్తం నిర్ణయించాలనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. రాహుల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన పొరపాటును తాను చెయ్యరాదని కేసీఆర్ భావిస్తున్నారని అందుకే వారసుడి పట్టాభిషేకం దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. తానే సీఎంగా కొనసాగుతానని సాక్షాత్తూ అసెంబ్లీ లోనే కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇటు కేసీఆర్ కు సన్నిహితులైన మంత్రులు, అటు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన మంత్రులు మాత్రం కాబోయే సీఎం కేటీఆర్ అంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఇతర నేతల బహిరంగ ప్రకటనలకు.. పార్టీలో , ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో కేటీఆర్ కు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే తెలుస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా వెలువడుతున్న సంకేతాలు కూడా అందుకు కారణమని పలువురు టీఆర్ఎస్ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.  గత ఏడాది డిసెంబర్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక పార్టీ వ్యవహారాలన్ని ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పీపీ సమావేశం కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అధికార అనధికార ప్రముఖులను కలవటం కేసీఆర్ బాగా తగ్గించారు. కేవలం కీలక సందర్భాల్లో మాత్రమే నేరుగా మార్గ నిర్దేశం చేస్తున్నారు. అధికార అనధికారిక ప్రముఖులంతా కేటీఆర్ ను కలవటం తమ సమస్యలను విన్నవించుకోవడం రివాజుగా మారింది. కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో అప్పటి వరకు ఆయన అధికారిక సమీక్షలు నిర్వహించలేక పోతున్నారనే ముచ్చట తగ్గింది. సీఎం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ యే అయినా ఆయన తరపున అటు ప్రభుత్వం ఇటు పార్టీలో కేటీఆర్ అన్నీ తానే అయి నిర్వహించటాన్ని ప్రభుత్వ పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నాయి. ఈ వాతావరణం తొందర్లోనే కేటిఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారానికి ఊతమిస్తోందని అంటున్నారు. అధికారం ఇంకా నాలుగేళ్లు మిగిలివున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం లాంఛనమేనని ఆ తరువాత కేటీఆర్ పట్టాభిషేకం ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆర్టీసీలో మళ్ళీ మొదలైన లొల్లి... పదవి విరమణ వయస్సును పెంచితే సమ్మె!!

తెలంగాణ ఆర్టీసిలో మరో లొల్లి మొదలైంది. సమస్యల పరిష్కారం దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమ్మె తరువాత సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు కేసీఆర్. అందులో భాగంగానే రిటైర్ మెంట్ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ వయస్సు పెంచితే ఏ ఉద్యోగులైనా ఎగిరి గంతేస్తారు కానీ అందుకు భిన్నంగా ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. వెంటనే పెంచిన వయసును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు గ్యారేజీ సిబ్బందితో ఎక్కువ శాతం పదవి వయస్సు 60 ఏళ్లకు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మాత్రం ముఖ్యమంత్రి ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  మొత్తం ఆర్టీసీలో 48,000 మందికి పైగా ఉద్యోగులుంటే 30 వేలకు పైగా ఉన్న క్లాస్ మూడు నాలుగు ఉద్యోగుల విరమణ వయస్సు పెంచకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ తో పాటు ఇతర కార్మిక సంఘాల నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులంతా జాబ్ చేసినంత కాలం శారీరికంగా కష్టపడాల్సిందే.. కాలం తీరిన స్క్రాప్ కు పంపించాల్సిన బస్సులను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇంకా నడుపుతుండటంతో క్లాస్ మూడు నాలుగు ఉద్యోగులు విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్నారు. డబుల్ డ్యూటీలు , ఓవర్ టైం డ్యూటీలు.. టార్గెట్ ఫిక్సేషన్, ఈపిబి వంటివి మోపడంతో వీరిలో చాలామంది నలభై యాభై ఏళ్లకే ఉద్యోగం చేయలేకపోతున్నాననే భావనలో ఉన్నారు. అయితే విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తూ క్లాస్ టూ ఉద్యోగులు కిందిస్థాయి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముంది. దీంతో రిటైర్ మెంట్ వయసు పెంపుపై బయటకు మాట్లాడేందకు జంకుతున్నారు ఉద్యోగులు.  

కొల్లాపూర్ లో మొదలైన మునిసిపల్ వేడి.. టీఆర్ఎస్ లో వర్గపోరు

అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరులో టిఆర్ఎస్ హవా నడిచింది. 14 సీట్లలో 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఒకే ఒక సీటు కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కొల్లాపూర్ లో ఓటమి పాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కోల్డ్ వార్ మొదలైంది. నియోజకవర్గంపై పట్టు కొనసాగించేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీలోని కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోను హర్షవర్ధన్ రెడ్డి.. జూపల్లి కృష్ణా రావు వర్గాలు విడివిడిగా పోటీ చేశాయి. ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.  మొదటి సారి కొల్లాపూర్ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికలు కావడంతో అధికార పార్టీకి చెందిన ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. కౌన్సిలర్ అభ్యర్ధులతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్ధులను కూడా ఇరువర్గాల వారు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య మునిసిపల్ ఎన్నికల్లో కూడా సయోద్య కుదిరే పరిస్థితి కనిపించటం లేదు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో 60-40 ఫార్ములా ప్రకారం తమ తమ వర్గీయులకు సీట్లు కేటాయించాలని ఒప్పందం జరిగినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. దీని పర్యవసానంగా టిఆర్ఎస్ జారీ చేసిన విప్ ను ధిక్కరించి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది. ఆ తరువాత వ్యవహారం కోర్టు కేసు దాకా వెళ్లడంతో బీరం , జూపల్లి మధ్య వ్యవహారం మరింత బెడిసికొట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీరం , జూపల్లి వర్గీయులు వేరు వేరుగా పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో గ్రూపు రాజకీయాలు ఎటు వైపు టర్న్ తీసుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న వైరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్.. బిజెపిలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడిన తరువాత రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిగా మారతాయని చర్చ జరుగుతుంది.

గ్రేడ్-1 ర్యాంక్‌... కానీ అక్కడన్నీ ...లో-క్లాసే

సంగారెడ్డి... గ్రేడ్-1 ర్యాంక్‌ మున్సిపాలిటీ... అంతేకాదు, ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంగా కొనసాగుతోంది... 1954లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన సంగారెడ్డిలో ప్రస్తుతం లక్ష పైచిలుకు జనాభా, 70వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డిలో 38 వార్డులుండగా... ఇంటి-ఆస్తి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. అయితే, సంగారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడి 60ఏళ్లు దాటుతున్నా... జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నా... అభివృద్ధి మాత్రం ఆశించినస్థాయిలో జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సంగారెడ్డి తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికీ సరైన రోడ్లు లేవు... పారిశుద్ధ్య నిర్వహణా లేదు. ఇక, డ్రైనేజీ వ్యవస్థ అయితే అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మరోవైపు, తాగునీటికి కూడా జనం కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, పేరుకు గ్రేడ్-1 మున్సిపాలిటీ అయినా సంగారెడ్డిలో కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయి. అయితే, సంగారెడ్డిని తాము అభివృద్ధి చేశామంటే... తాము డెవలప్ చేశామని... టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు వాదులాడుకుంటున్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. రోడ్ల విస్తరణతోపాటు ఫ్లైడ్ లైట్స్ ఏర్పాటు చేశామని, అలాగే... రాజీవ్ పార్క్‌ను సుందరీకరించామని చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే తప్పా.... సంగారెడ్డిలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని హస్తం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నా సంగారెడ్డి తలరాత మాత్రం మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లా యంత్రాంగమంతా సంగారెడ్డిలోనే కొలువుదీరినా అభివృద్ధికి నోచుకోవడం లేదని మండిపడుతున్నారు. పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైందని అంటున్నారు. మరి, త్వరలో జరగనున్న ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో ఉత్కంఠ రేపుతోంది.

ఖమ్మంలో కారు స్పీడెంత? ఇల్లందులో జెండా ఎగురుతుందా?

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్... ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సెగ్మెంట్లో గులాబీ జెండా ఎగురవేసింది. ఇక, ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా సింగరేణికి స్వస్థలమైన ఇల్లందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్‌ ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయతీగా ప్రస్థానం ప్రారంభించిన ఇల్లందు... 1954లో నగర పంచాయతీగా అవతరించింది. పదుల సంఖ్యలో బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతం కార్మికుల నివాస కేంద్రంగా మారింది. జనాభా, ఆదాయాల ప్రాతిపదికన అప్పటి ప్రభుత్వం... 24 వార్డులతో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 1987లో మొదటిసారి జరిగిన ప్రత్యక్ష పురుపోరులో సీపీఎం-టీడీపీ కూటమి విజయం సాధించింది. అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచినా... ఛైర్మన్ ఎన్నికల్లో మాత్రం సీపీఎం-టీడీపీ కూటమికే ఓటర్లు పట్టంకట్టారు. అయితే, 1995లో ఛైర్మన్ ఎన్నికను పరోక్షం చేయడంతో... అప్పట్నుంచి  2014వరకు జరిగిన ఎన్నికల్లో.... వివిధ పార్టీలు ఇల్లందును ఏలాయి. అయితే, అత్యధికంగా కాంగ్రెస్‌ ఐదుసార్లు ఇల్లందు పీఠాన్ని దక్కించుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి రాకముందు... 2014 ప్రారంభంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇల్లందును కాంగ్రెస్‌-సీపీఐ కూటమి కైవసం చేసుకుంది. టీఆర్ఎస్‌ కేవలం మూడు వార్డులకే పరిమితమైంది. అయితే, స్వరాష్ట్రం ఏర్పడ్డాక, తొలిసారి జరుగుతోన్న పురపోరులో.... ఇల్లందుపై గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్‌ నేతలు తహతహలాడుతున్నారు. అయితే, ఇల్లందు టీఆర్ఎస్ నేతలంతా ఏకతాటి పైకి వస్తే.... గులాబీ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనన్న మాట వినిపిస్తోంది. దాంతో, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తోన్న ఇల్లందు టీఆర్ఎస్ నేతలు.... ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.