కాంగ్రెస్ కొత్త తరహా ఆలోచన : ప్రామిసరీ నోటుపై సంతకం పెడితేనే సీటు
posted on Dec 28, 2019 @ 11:23AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అధికార పార్టీ లోకి జంప్ కావడం ఫ్యాషన్ గా మారింది. ఒకానొక సమయంలో ఈ జంపింగ్ జపాంగ్ ల ఎఫెక్ట్ తో మున్సిపల్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కోల్పోయింది. దీంతో ఇప్పుడు గోడ దూకే నేతలకు చెక్ పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కొత్త ఫార్ములాను వర్కౌట్ చేయాలని చూస్తుంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ జారిపోకుండా కాంగ్రెస్ ఇప్పుడు జాగ్రత్తపడుతోంది. ఇందులో భాగంగా పార్టీ టికెట్ ఇచ్చే ముందే అభ్యర్థుల దగ్గర నుంచి ఓ హామీ తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. గెలిచిన అభ్యర్థులు పార్టీ మారబోమని ప్రామిసరీ నోట్ , బ్లాంక్ చెక్కులు అనుమతి పత్రాలపై సంతకం చేశాకనే టికెట్ అంటూ కొత్త రూల్ పాస్ చేసింది. కనీసం ఇలానైనా గెలిచిన నేతలను కాపాడుకోవాలని కాంగ్రెస్ తిప్పలు పడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించేవారు అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
కాంగ్రెస్ బలంగా ఉన్న నిర్మల్ , మంచిర్యాల జిల్లాలో కొత్త మున్సిపాల్టీల్లో ఈ ఫిట్టింగ్ ను అమలు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం వెయ్యి మందికి పైగా నేతలు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో సగం మందికి పైగా నేతలు అఫిడవిట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం అఫిడవిట్ లో బాండ్ పేపర్లు నింపి పార్టీ మారబోమని సంతకాలు చేసి టికెట్ తీసుకునేందుకు నేతలు రెడీ అవుతున్నారు. మొత్తానికి జంపింగ్ అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలంటే ఈ ప్రక్రియ అవసరమనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ బాండ్ల గోల ఏ మేరకు కాంగ్రెస్ కు కలిసొస్తుందో ప్రామిసరీ నోట్లు గెలిచాక జంపింగ్ లను ఎంత మేర పార్టీ మారకుండా ఆపగలుగుతుందో వేచి చూడాలి.