సూపర్ పోలీస్.. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్పీ
posted on Dec 30, 2019 @ 1:19PM
ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట అక్షరాల వరకే పరిమితం అవ్వకుండా చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ కౌషల్. క్రైమ్ రేట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు అధికారిగా.. సంచలన కేసుల్లో మిస్టరీని చేధించి నేరస్తుల్ని కటకటాల బాటపట్టించారు. ఆదేశాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్లో దర్యాప్తు కొనసాగించగల గట్స్ ఉన్న ఎస్పీగా కూడా పేరొందారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయటమే కాకుండా అర్ధరాత్రి కూడా వెంటనే స్పందిస్తారు.ఇటీవల సంచలనం రేపిన తల్లీ కూతురు హత్య కేసులో గంటల వ్యవధి లోనే మిస్టరీ ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే.. భార్యాబిడ్డల్ని చంపిన కేసులో నిందితుడ్ని కటకటాల బాటపట్టించారు.ఇలా ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీస్ గా పేరొందారు కౌషల్.
స్పందన కార్యక్రమంలో వెల్లువెత్తే ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు ఎప్పటికప్పుడు దర్యాప్తును ట్రాక్ చేయటమే కాక డిపార్ట్ మెంట్ లో తనదైన మార్కును చాటుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్. క్రైమ్ రేట్ కు కళ్లెం వేయడంతో పాటు పోలీసుల పని తీరు పై కూడా నిఘా పెంచారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్ లలో సరైన స్పందన ఉండడం లేదన్న ఆరోపణల క్రమంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఎస్పీ. ఒంగోలు ఠాణాలో ఫిర్యాదు దారులతో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ను రంగంలోకి దింపారు. ఆయన మఫ్టీలో సామాన్య పౌరుడిలా ఒంగోలు తాలూకా పీఎస్ కు వెళ్లి తన మొబైల్ లో గుర్తు తెలియని వ్యక్తి లాక్కేల్లాడని కంప్లైంట్ తీసుకోవాలని కోరారు.కానీ సిబ్బంది స్పందించలేదు సిఐ లేరు ఆయన సాయంత్రం వస్తారు అప్పుడు దాని తిప్పి పంపారు. సాయంత్రం మళ్లీ స్టేషన్ కు వెళ్లారు జగదీష్. రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వ మని అడిగితే మళ్లీ వెళ్ళవయ్యా వెళ్లు అని కాసురుకున్నారు.
ఎందుకివ్వరు అని గట్టిగా అడిగితే అసలు ఫోన్ నీదే అని గ్యారెంటీ ఏంటి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అని అవాక్కైన ట్రైనీ ఎస్పీ ఒంగోలు తాలూకా పీఎస్ లో తనకు ఎదురైన అనుభవాన్ని.. ప్రతి అంశాన్ని సిద్దార్థ్ కౌశల్ కు రిపోర్టు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి వేధించడమే కాకుండా అవమానపరచడం దురుసుగా మాట్లాడటం వంటి చర్యల్ని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ట్రైనీ ఐపీఎస్ జగదీష్ రిపోర్ట్ పై వెంటనే స్పందించారు.
ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు దారుని అవమానపరచిన స్టేషన్ రైటర్ సుధాకర్ ను వెంటనే సస్పెండ్ చేశారు.సీఐ లక్ష్మణ్, ఎస్ ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ రాజేష్, మహిళా కానిస్టేబుల్ రమ్య కిరణ్ లకు శిక్షగా చార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ. పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించటమే కాక ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కట్టుబడి ఉండాలని పదేపదే సూచిస్తున్నారు.ప్రజల్లో పోలీసులంటే భరోసా.. గౌరవం ఉండాలన్నారు. ఆ దిశగా ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నిజమయ్యేలా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ చేపడుతున్న చర్యలకు జే జే లు కొడుతున్నారు ప్రజలు.