జగన్‌పై సుబ్రమణ్యస్వామికి అంత ప్రేమెందుకు?
posted on Dec 30, 2019 @ 11:05AM
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ తీరు సరిగానే ఉందన్నారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలను సుబ్రమణ్యస్వామి తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. అలాగే, టీటీడీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం చేశారని, అది కూడా తప్పేనన్నారు. తమ దృష్టికి వచ్చిన అన్ని ఆరోపణలపైనా నిజనిర్ధారణ జరిపామని, అయితే అవన్నీ అవాస్తవాలుగా తేలాయన్నారు. ఒకవేళ నిజంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట రియాక్ట్ అయ్యేది తానేనన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మతపరమైన ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి సుబ్రమణ్యస్వామి సూచించారు.
అయితే, దేవాలయాలను వచ్చిన డబ్బును హజ్ యాత్రలకు, జెరూషలేము టూర్స్‌కి ఎలా ఇస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వందేళ్లుగా వచ్చిన కానుకలపై కాగ్‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఆడిట్ బాధ్యతలను పూర్తిగా కాగ్ కి అప్పగించాలన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండొద్దని... స్వర్ణ దేవాలయం మాదిరిగా స్వతంత్రంగా ఉండాలన్నారు సుబ్రమణ్యస్వామి.
అయితే, జగన్ పై సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలనపై విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తుంటే.... సుబ్రమణ్యస్వామి మాత్రం ప్రతిపక్షాలనే తప్పుబట్టడం.... అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ పై అంత ప్రేమెందుకో అంటూ మాట్లాడుకుంటున్నారు.