జగన్ జోరు.. మూడు వారాల్లో మూడు రాజధానుల ప్రకటన
posted on Dec 30, 2019 @ 2:02PM
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధి పై నిపుణుల కమిటీ నివేదికలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని నియమించింది వైసిపి సర్కార్. 10 మంది మంత్రులతో సహా 16 మంది కమిటీలో సభ్యులుగా ఉంటారు. మంత్రుల బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్సా సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ఏపి డిజిపి గౌతం సవాంగ్, సిసిఎల్ఎ, మునిసిపల్ సెక్రటరీ, లా సెక్రెటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మెంబర్ కన్వీనర్ గా కమిటీలో ఉంటారు.
ఈ కమిటీ 3 వారాల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని జీవోలో ప్రస్తావించారు. అవసరం మేరకు అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అన్ని అంశాల పై అధ్యయనం చేసి సమగ్ర రిపోర్టు ఇస్తామన్నారు మంత్రి కొడాలి నాని. అభివృద్ధి వికేంద్రీకరణ జిల్లాల సమగ్ర ప్రణాళికలపైన హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని దృఢ సంకల్పంతో సీఎం ఉన్నట్టు మంత్రి మోపిదేవి తెలిపారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ విధానంగా చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందు కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకెళతామన్నారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే 3 క్యాపిటల్స్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వీలుంది. దీనిపై జనవరి చివరి నాటికి క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు.