జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రికి సీబీఐ కోర్టు షాక్‌... 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు స్వీకరించింది. రెండేళ్ల క్రితమే అడిషనల్‌ ఛార్జి షీటును దాఖలు చేసినప్పటికీ హైకోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది. అయితే, తాజాగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును స్వీకరించిన సీబీఐ కోర్టు... సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్‌కు సమన్లు జారీ చేసింది. వాస్తవానికి, పెన్నా వ్యవహారంలో రెండేళ్ల క్రితమే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా నిందితులంతా అనుబంధ ఛార్జిషీటును స్వీకరించవద్దంటూ వాదించారు. అయితే, తమకున్న సమాచారంలో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశామని, ఆ తర్వాత మరిన్ని వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జిషీట్ చేశామని సీబీఐ వివరించింది. చట్ట ప్రకారం ఎప్పుడు కీలకాంశాలు వెలుగులోకి వచ్చినా ఛార్జిషీటు దాఖలుచేసే వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉందని తెలిపింది. అయితే, ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని తెలిపిన సీబీఐ.... పాత ఛార్జిషీటులో ఉన్న విషయాలనే మళ్లీ ప్రస్తావిస్తూ మరికొందరిని నిందితులుగా చేర్చడం సమంజసం కాదంటూ జగన్ సహా నిందితుల తరపు లాయర్లు వాదించారు. అయితే, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.... అనుబంధ ఛార్జిషీటును విచారణకు స్వీకరించి సమన్లు ఇష్యూ చేసింది. అనంతపురం, తాండూరు, ఇతర ప్రాంతాల్లో పెన్నా సిమెంట్స్‌కు జరిగిన గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అప్పటి గనులశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఆనాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీళ్లంతా నేరానికి పాల్పడ్డారని అనుబంధ ఛార్జిషీటులో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాంతో, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్ తదితర నిందితులందరూ జనవరి 17న తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది.

రాజధాని వివాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు... కేంద్రం కల్పించుకోవాలని డిమాండ్‌....

అమరావతి రైతులు, మహిళల ఆందోళనలకు జనసేనాని పవన్ కల్యాణ్‌ సంఘీభావం తెలిపారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన నేతలతో సమావేశమైన పవన్‌ను అమరావతి రైతులు కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రాజధాని రైతులతో సమావేశమైన జనసేనాని.... రాజధాని తరలింపపై కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఏపీ రాజధాని వివాదంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని జనసేనాని గుర్తుచేశారు. అలాగే, ఏపీ రాజధాని వివాదంపై బీజేపీ, కాంగ్రెస్‌ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు... తమకు అన్యాయం జరుగుతుందని పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారని.... వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

నొప్పి ఉన్నచోటే మందు రాయాలి... తలనొప్పి వచ్చిందని తలే తీసేస్తారా?

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి... కోర్టు బోనులో నిలబడి ఆంధ్రాకు తలవంపులు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. జయలలిత తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బోనులో నిలబడింది ఒక్క జగనే అన్నారు. ఇది, ఆంధ్రప్రదేశ్‌‌కు ఎంతో సిగ్గుచేటంటూ అశోక్ నిప్పులు చెరిగారు. ఏపీలో శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉందన్న అశోక్ గజపతిరాజు... సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిల్చుంటే.... ఆంధ్రుల పరువు పెరుగుతుందా? పోతుందా? అంటూ ప్రశ్నించారు. ఇక, మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ విజయనగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీతోపాటు లోక్‌సత్తా, ప్రజాసంఘాలు హాజరయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని స్వాగతించిన జగన్... ఇప్పుడు మూడు రాజధానులు అనడం సరికాదని అశోక్ గజపతిరాజు అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందన్నారు. జగన్ పరిపాలన చూస్తుంటే... మొఘలుల పాలన గుర్తొస్తుందని అన్నారు. రాజధానులను మార్చడం మంచి సంస్కృతి కాదన్న అశోక్ గజపతిరాజు.... అమరావతి నుంచి కేపిటల్‌ను తరలించే శక్తి ఎవరికీ లేదన్నారు.  అయినా, తలనొప్పి వస్తే మాత్ర వేసుకోవాలని, కానీ తలే తీసేస్తానంటే కుదురుతుందా? అంటూ అశోక్ ప్రశ్నించారు. నొప్పి ఉన్నచోటే మందు రాయాలే కానీ... మొత్తం ఆ భాగాన్నే తీసేస్తాననడం సరికాదని సీఎం జగన్ కు అశోక్ గజపతిరాజు సూచించారు.

అమరావతి మహిళలపై పోలీసుల దౌర్జన్యం... లాఠీఛార్జ్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్‌...

రాజధానిపై ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు అంటూ రాజధాని రైతులు, మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. దాంతో, అమరావతి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, అమరావతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రాజధాని మహిళలు తలపెట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ తుళ్లూరులో మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో, పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే, తాము... ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి వెళ్లడం లేదని... కేవలం దుర్గమ్మను దర్శించుకోవడానికే వెళ్తున్నామంటూ మహిళలు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో, కొందరు మహిళలు... పోలీసులను, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.  అయితే, అమరావతి మహిళలపై లాఠీఛార్జ్‌ను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. లాఠీఛార్జ్‌ను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్... పోలీసులకు నోటీసులు పంపింది. అలాగే, తుళ్లూరులో మహిళలపై పోలీస్ చర్యపై నిజనిర్ధారణ కోసం రేపు అమరావతికి కమిటీని పంపుతున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ ఛైర్ పర్సన్ రేఖాశర్మ తెలిపారు.

మునిసిపల్ ఎన్నికల పోరు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ జోరు!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో.. కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ స్థానిక ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ విజయ డంఖా మోగించింది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన గులాబీ పార్టీలో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే వచ్చినప్పటికీ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ బలాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల భారమంతా మంత్రి అజయ్ కుమార్ మీదనే ఉంది. జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉండటం టిఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా మారింది.  గత మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 97 వార్డులు ఉంటే వాటిలో కేవలం ఐదు వార్డుల్లోనే టీఆర్ఎస్ గెలుపొందింది. ఇల్లెందులో మూడు, మధిరలో ఒకటి, కొత్తగూడెంలో మరొకటి కలిపి ఐదింటిని దక్కించుకుంది. సత్తుపల్లిలో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. అయితే నాలుగు మున్సిపాలిటీలను ఫిరాయింపుదారుల సహకారంతో టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మధిరలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే ఆ తరువాత ఆమె కూడా టిఆర్ఎస్ కండువా కప్పేసుకుంది. మధిర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోట, ఇక్కడ భట్టిని ఓడించేందుకు జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు టిడిపితో కలసి పోటీ చేయడానికి టిఆర్ఎస్ ప్రయత్నించి విఫలమైందని సమాచారం. దీంతో టిడిపి, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.  సత్తుపల్లిలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవలేకపోయింది. టిడిపి నుంచి చైర్ పర్సన్ గా దొడ్డాకుల స్వాతి ఎన్నికయ్యింది. ఆ తరువాత ఈమె కూడా టిఆర్ఎస్ లో చేరిపోయింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ వైపే ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ గుబాళించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెంలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఛైర్మన్ సీట్ దక్కింది. ఆ తరవాత వారు కూడా టిఆర్ఎస్ లో చేరి పోయారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది. ఇక్కడ గెలుపు బాధ్యతను వనమా వెంకటేశ్వరరావుకు అప్పగించారు. జలగం వర్గీయుల సపోర్ట్ ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇక్కడ నాలుగు వార్డుల్లో గెలిచింది. ఆ తరువాత చైర్ పర్సన్ మడత రమాతో పాటు పలువురు టీఆర్ఎస్ లో చేరి పోయారు. ఇక్కడ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మడత రమా వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే.  ఇక వైరా మున్సిపాలిటీకీ మోదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్ కు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇరువర్గాలూ ఎన్నికల్లో బాహాబాహీకి సిద్ధమవుతున్న పరిస్థితి. ఇల్లెందు వైరాలలో ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు మంత్రి పువ్వాడ ప్రయత్నిస్తున్నారు. ఐదు మున్సిపాల్టీల్లో గెలుపు బాధ్యత ఇప్పుడు మంత్రి పువ్వాడ పైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యర్థులను సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపించడానికి మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇంటికి ఒక్కరు చాలు.. అమరావతిని రాజధానిగా నిలుపుకునేందుకు బాబు పిలుపు

రాజధాని అమరావతి కోసం ప్రతి ఇల్లు ఉద్యమించాలని.. ప్రతి ఇంటి నుంచి ఒకరు ముందుకు రావాలని.. అందరూ సంఘటిత శక్తిగా మారాలని.. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతి లోనే ఉంచాలి అంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  తొలిసారిగా మచిలీపట్నం, విజయవాడలో జరిగిన జేఏసీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా రాజధానిని రక్షించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చామని చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి అంటే సీఎం జగన్ భయపడుతున్నారని..అందుకే బస్సు యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చి చివర్లో రూట్ పర్మిషన్ లేదంటూ పోలీసులను ఉసిగొలిపి అడ్డుకున్నారని దుయ్యబట్టారు.  ముందుగా ప్రజావేదికను కూల్చేశారన్నారు. అమరావతికి ముంపు భయం లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెప్పినా కూడా మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తాను అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నానని ప్రచారం చేశారన్నారు. హై కోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలంటే వెనుకడుగువేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో చదరపు గజం రూ 30,000 పలికింది. తాను మళ్లీ వచ్చి ఉంటే లక్ష పలికేదని.. ఆ డబ్బుతోనే అమరావతిని బ్రహ్మాండంగా నిర్మించవచ్చని ఎద్దేవా చేశారు. ఇది ప్రజా రాజధాని దేవుళ్ల మొదలు ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి. దానిని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. ప్రజా రాజధానిని రక్షించుకునేందుకు ఇంటికో వ్యక్తి బయటికి వస్తే.. మనమందరం కలిసి కట్టుగా ఉద్యమిస్తే జగన్ తోక ముడుస్తారని అన్నారు. ఆయన తీరుతో బయటి రాష్ట్రాల్లో మన పరువు పోతుందన్నారు. ఆంధ్ర ప్రజల బతుకు మూడుముక్కలాటయిందని ఇతర రాష్ర్టాల ప్రజలు నవ్వుతున్నారు. అమరావతి కోసం ఉద్యమించే వారిపై తన పత్రిక ద్వారా బురద చల్లుతున్నారని తెలియజేశారు. రాజధానిపై రెఫరెండం పెట్టి.. దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. అప్పుడు మీ ఇష్టం వచ్చిన చోట రాజధానులు పెట్టుకోవాలి అన్నారు.  మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తున్నారు. మరీ ఆయనేమన్నా నాని రెడ్డా పవన్ స్వశక్తితో ఎదిగిన వాడు. ఆయన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారు. ఉన్న ఊరి నుంచి రాజధాని తరలిపోతుంటే ఎవరైనా పోరాడతారని అన్నారు. కానీ మంత్రి పేర్ని నానికి ఇక్కడ రాజధాని ఉండటం ఇష్టం లేనట్లే ఉంది.. అందుకే సిగ్గులేకుండా హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తాను ఒక పిలుపు ఇస్తే అమరావతి రైతులు 33,000 ల ఎకరాలను రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు.  విశాఖ నీతి నిజాయితీ ఉండేవాళ్ల నగరం.. అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు బయలుదేరారు అని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ ముందు హుద్ హుద్ తర్వాత విశాఖ ఎలా ఉందో అక్కడ ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. దానిని టెక్నాలజీ హబ్ గా, ఫార్మా హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభకు అధికారులు అవంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. సభకు వచ్చిన వారందరు తమ సెల్ ఫోన్లలో ఉన్న లైట్ ను వెలిగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం వద్ద సెల్ ఫోన్ లైట్ల వెలుగుతో నిండిపోయింది.

దేశంలో ఇప్పటివరకు ఎంతమందిని ఉరితీశారు? నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేదా?

నిర్భయ దోషులను ఉరి తీయనున్న నేపధ్యంలో మరణశిక్షల అమలు మరోసారి తెరపైకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఒక వెయ్యి పద్నాలుగు  మందిని ఉరి తీశారు. అయితే, నేషనల్‌ క్రైం రికార్డులను పరిశీలిస్తే గత 15ఏళ్లలో నాలుగు ఉరి శిక్షలు మాత్రమే అమలు అయ్యాయి. 2003-18 డిసెంబర్‌  మధ్య కాలంలో కోర్టులు ఏకంగా 400 మందికి ఉరి శిక్షలు విధించాయి. వీరిలో  నలుగురు మాత్రమే ఉరికంభం ఎక్కారు. గత 15ఏళ్లలో  మరణ దండన విధించిన కేసుల్లో కేవలం ఒక్క శాతం మందినే ఉరితీసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది ఒక టీనేజ్‌ అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన 44ఏళ్ల వాచ్‌మెన్‌ ధనుంజయ్‌ ఛటర్జీని 2004 ఆగస్టు 14న బెంగాల్‌లోని ఆలీపూర్‌ జైల్లో ఉరి తీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుపడ్డ కసబ్‌ను 2012 నవంబర్‌లో పూణె ఎర్రవాడ జైల్లో ఉరి తీశారు. పార్లమెంట్‌పై దాడి కేసులో 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్‌ గురును తీహార్‌ జైల్లో ఉరి తీశారు. గత 15 ఏళ్లలో ఉరి కంభం ఎక్కిన నాలుగో వ్యక్తి యాకూబ్‌ మెమెన్‌. అయితే, కోర్టులు విధించిన 1200 మరణ శిక్షలను ఉన్నత న్యాయస్థానాలు యావజ్జీవ ఖారాగార శిక్షలుగా మార్చాయి. ఘోరమైన నేరాలకు పాల్పడిన ఈ దోషులకు శిక్ష తగ్గిస్తే ప్రజలు క్షమించరనే భయంతో నలుగురిని మాత్రమే ఉరితీశారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ దోషులందర్నీ ఒకేసారి ఉరి తీయనున్నారు. ఢిల్లీలో నిర్భయపై దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, పాశవికంగా వ్యవహరించి ఆమె హత్యకు కారణమైన ఘటనలో వారిని ఉరికంభం ఎక్కించనున్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో నాలుగు ఉరికంభాలను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఉరికంభాలతో పాటు నాలుగు సొరంగాలను కూడా నిర్మించారు. నిర్భయ దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌కి ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు చాలా మంది రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తుండటం వల్ల మరణదండన అమలులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో మరణశిక్ష ఖరారైన  దోషులు రాష్టప్రతి క్షమాభిక్ష పెడితే జీవితాంతం జైలులో గడిపేయవచ్చునని ఎదురు చూస్తున్నారు.  కొన్ని దేశాల్లో అమలవుతున్న మరణశిక్షలను  పరిశీలిస్తే విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో  వెయ్యిమందికి మరణశిక్షను విధిస్తే అంతమందినీ ఉరితీశారు.  ఇరాన్‌లో 507 మందిని, సౌదీ అరేబియాలో 146 మందిని, ఇరాక్‌లో 125 మందిని, పాకిస్తాన్‌లో 60 మందిని, ఈజిప్టులో 35 మందిని, అమెరికాలో 23 మందిని, అఫ్ఘానిస్తాన్‌లో ఐదుగురిని, మలేషియాలో నలుగురిని, జపాన్‌లో నలుగురిని ఉరితీశారు. భారత్‌లో 2017లో ఒక్కరికి కూడా ఉరిశిక్షను విధించలేదు. ఇదిలా ఉంటే, ప్రపంచంలో 142 దేశాలు ఉరిశిక్షను రద్దు చేశాయి. 56 దేశాలు మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తున్నాయి. మన దేశంలో మరణశిక్ష విధించే చట్టాలు ఉన్నా, ఆ శిక్షలు అంతగా అమలు కావడం లేదు. గతంలో ప్రతిఏటా పదుల సంఖ్యలో ఉరి అమలు కాగా, ఇప్పుడు మాత్రం జాప్యం జరుగుతోంది.

కరీంనగర్ లో మంత్రుల ప్రతీకార ఆట... బెంబేలెత్తుతోన్న ప్రత్యర్ధులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో కొందరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోలా స్పందించినా.....ముగ్గురి మాటల వెనకా...అర్ధం ఒకటే అనే చర్చ సాగుతోంది. ఏడాది కిందట జరిగిన ఘటనపై ఈ ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారు. కొంతమంది చేసిన గాయానికి, వారు ఇప్పటికీ లోలోపల పగతో రగిలిపోతున్నారు. ఇంకా వేచి చూస్తే, మంచిది కాదనుకున్నారో  ఏమో గాని, ఇక అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్. ఈ ముగ్గురు మంత్రులే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారంటూ జిల్లాలో చర్చ స్టార్ట్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికల సమావేశాల్లో మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయంటూ సొంత పార్టీలో కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. తమకు ద్రోహం చేసిన శత్రువు ఎవరో తెలిసినా, ఏడాది కాలంగా మౌనంగా ఉన్న మంత్రులు... ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా తమ ఆపరేషన్ మొదలు పెట్టారు. దాంతో, కొంతమంది తెలిసి....మరికొంత మంది తెలియక నూతిలో పడ్డ ఎలుక మాదిరిగా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న మంత్రులకు, గెలుపు కంటే గుణపాఠాన్నే నేర్పించాయి గత అసెంబ్లీ ఎన్నికలు. తమకు అనుచరులుగా ఉన్న వారంతా, తీరా సమయానికి వ్యతిరేకులుగా మారి, తమ నాయకలనే ఓడించే ప్లాన్ చేశారు. ఎన్నికల సమయంలో ఎవరినీ దూరం పెట్టలేని, అలాగే నిందించలేని పరిస్థితి. ఎలాగోలా ప్రజల మద్దతుతో విజయం సాధించి, సీనియారిటి, పార్టీ విధేయత కోటలో మంత్రి పదవులు సంపాదించుకున్నారు ఈటెల, కొప్పుల, గంగుల. వెన్నుపోటుదారుల సంగతి తేల్చేందుకు సిద్ధమయ్యారు మినిస్టర్లు.  గత ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. మంత్రి పదవి ఎలాగైనా వస్తుందన్న జోష్‌లో ముమ్మర ప్రచారం చేశారు. తీరా సమయానికి ఈశ్వర్‌కి అనుకూలంగా ఉన్నవారంతా ఓ మాజీ ఎంపీకి సపోర్ట్ చేయడంతో, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు విజయం సాధించారు. అప్పటి వరకు అందరినీ గుడ్డిగా నమ్మిన ఈశ్వర్, ఇప్పుడు తన మార్క్ రాజకీయాలు చేస్తూ...ద్రోహులను హడలెత్తిస్తున్నారు. ఇక ఈటెల రాజేందర్. తనను ఓడించడానికి సొంతపార్టీలో వున్న చాలామంది ట్రై చేశారని, ఇప్పటికీ రగిలిపోతున్నారాయన. పదవుల కోసం ఈటెల చుట్టూ తిరగడం... పదవులు రాగానే ఈటెలకు తలనొప్పిగా మారడం హుజూరాబాద్ రాజకీయాల్లో సాధారణమైంది. నమ్మక ద్రోహం చేసిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరదంటూ బహిరంగంగానే చెప్పేశారు ఈటెల. ఇక, నమ్మిన వారే వెన్ను పోటు పొడిచారని ఆగ్రహంతో వున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలు, టీఆర్ఎస్‌ మీద ఉన్న విశ్వాసంతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నానని అంటున్నారు గంగుల. నాడు తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి ఆటకట్టించే పని మొదలుపెట్టారట. ముగ్గురు మంత్రులకీ మున్సిపల్ ఎన్నికల రూపంలో, ఒక మంచి ఆయుధం దొరికినట్టయ్యింది. నమ్మకద్రోహం చేసినవారిని పక్కకు పెట్టే అవకాశాన్ని కల్పించాయి పోల్స్. వ్యతిరేకులు, నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారుల కోటాలో లిస్ట్ తయారు చేసుకున్న మంత్రులు, వారికి టికెట్ ఇవ్వకుండా పొలిటికల్ దెబ్బ తీయడానికి ప్లాన్ చేశారట. మంత్రుల లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారో తెలీదు గాని...పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే వారిపై రాజకీయ వేటు పడే అవకాశం ఉంది. 

దీపికాపై ట్రోలింగ్... బాలీవుడ్ లోనూ విమర్శలు... 

దీపికా పదుకొనె. టైమ్ పత్రిక ఆమెను ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 మంది లో ఒకరిగా గుర్తించింది. కాకపోతే ఇప్పుడు ఆమె టైమ్ బాలేనట్లుగా ఉంది. ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుపోయింది. వివాదాలకూ ఆమె కొత్త కాదు. కాకపోతే తాజా వివాదం మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దీపికా పదుకొనె ఢిల్లీ JNUకి వెళ్ళి అక్కడ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషె ఘోష్ ను కలుసుకోవడం పెను వివాదంగా మారింది. అయితే, ఇన్నేళ్ళుగా వచ్చిన వివాదాలు ఒక ఎత్తయితే....తాజా వివాదం మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినిమా భవిష్యత్ పై ప్రభావం చూపే అంశం. వివాదాలను ఆధారం చేసుకొని సినిమాను ప్రమోట్ చేసుకోవడం పాత పద్ధతే. దీపికా పదుకొనె కూడా అదే బాట పట్టారన్న విమర్శలూ వచ్చాయి. సినిమా ప్రచారం సంగతి ఎలా ఉన్నా ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో అధికమైపోయింది. ఓ పదేళ్ళ క్రితం దాకా వివిధ అంశాలపై సినిమా తారల స్పందన పెద్దగా బయటకు తెలిసేది కాదు. సోషల్ మీడియా రావడంతో ప్రతీ అంశంపై సినీ తారల స్పందన ఏంటో ప్రజలకు తెలుస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి వాటిని సినిమా తారలు బాగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా దీపికా పదుకొనె విషయానికి వస్తే....ఆమె కొత్త సినిమాను బాయ్ కాట్ చేయాలన్న ప్రచారం ఇప్పడు సోషల్ మీడియాలో ఉధృతమైంది. మరోవైపున దీపికా పై ప్రశంసలు, విమర్శలు అధికమైపోతున్నాయి. దేశంలో ఎవరికైనా భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అందులో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని పరిమితులూ ఉంటాయి. మరో వైపున సమాజం నిట్టనిలువునా చీలిపోతున్న సందర్భంలో ప్రముఖుల అభిప్రాయాలకు, చేసే పనులకూ బాగా ప్రాచుర్యం వస్తుంటుంది. దాన్ని తమ స్వలాభం కోసం ఉపయోగించుకునే వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. నిజమైన అభిమానం వేరు....సినిమా హిట్ కోసం చేసే జిమ్మిక్కులు వేరు. దీపికా ఏ ఉద్దేశంతో చేసినా....అందులో పెద్దగా తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. భిన్న భావజాలాలు సంఘర్షించి అసలైన సత్యం బయటకు రావడాన్నే అంతా కోరుకుంటారు. మొత్తానికి, దీపికా పరిస్థితి కూడా ఇప్పుడు సినిమాలో యాసిడ్ బాధితురాలి పరిస్థితిగా మారిపోయింది. పౌర చట్టంపై అట్టుడుకుతున్న ఢిల్లీ జేఎన్ యూని సందర్శించి, గూండాల దాడికి గురైన యువతిని పరామర్శించడం ఓ పెద్ద వివాదంగా మారిపోయింది. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.  

అమరావతి రైతుల గోడు జనసేనానికి పట్టదా? ఎందుకు పట్టించుకోవడం లేదు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఏం చేసినా, ఏం చెయ్యకున్నా చర్చనీయాంశమే. అయితే, రాజధానిపై రైతులు రగిలిపోతుంటే, పవన్‌ కల్యాణ్‌ మాత్రం మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో ఒక్కరోజు వచ్చి సంఘీభావం ప్రకటించి వెళ్లిపోయారు. అయితే, పవన్ పర్యటన రోజు, రణరంగాన్ని తలపించాయి రాజధాని వీధులు. ఇప్పుడు కూడా, రాజధాని హోరెత్తుతోంది. కానీ డిసెంబర్ 31 తర్వాత, అసలు పవన్ కల్యాణ్‌ ఊసేలేదు. అదే ఇప్పడు మరోసారి చర్చనీయాంశమైంది. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌‌లు రాజధానిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. అయితే, పవన్ కల్యాణ్‌ మాత్రం, ఆందోళనలకు విరామం ఇచ్చి, మళ్లీ ఇంటికెళ్లిపోయారని, రైతులు లోలోపల రగిలిపోతున్నారు. నిరసనల్లో ఆ‍యన కూడా పాల్గొంటే, ఉద్యమానికి మరింత ఊపొచ్చేదని అన్నదాతలు మాట్లాడుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం, ఒకే ఒక్క నిరసనతో బ్యాక్‌ టు హోం అంటూ వెళ్లిపోయారని మండిపడుతున్నారు రైతులు. ఫుల్‌ టైమ్‌ పొలిటీషియన్‌గా పవన్‌ మారలేదని, 2014 నుంచి కూడా విమర్శలున్నాయి. అప్పుడప్పుడు హడావుడి చేసి వెళ్లిపోవడం, నెలల తరబడి గ్యాపివ్వడం, అప్పుడప్పడు ట్వీట్లు చేయడం, మినహా పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదని ప్రత్యర్థి పార్టీలు సైతం విమర్శించాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి కామెంట్లే వినపడుతున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాలు రణక్షేత్రాన్ని తలపిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.  అయితే, పవన్ కల్యాణ్‌ ఎందుకు గ్యాపిచ్చారన్నదానిపై ఎవరి మాటలు వారివే. హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోందని, దాని తర్వాత రాజధానిపై క్లారిటీ వచ్చి, కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత, గట్టిగా పోరాడాలని పవన్ నిర్ణయించుకున్నారని, ఆ పార్టీవర్గాలంటున్నాయి. అందుకే ఉద్యమంలో పవన్‌ పెద్దగా పాల్గొనడంలేదని, అధికారిక నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అదేవిధంగా కవాతు కూడా నిర్వహించబోతున్నారని చెబుతున్నారు. అయితే, ఒకవైపు రైతులు, మరోవైపు టీడీపీ శ్రేణుల ఆందోళనలతో రాజధాని యుద్ధరంగాన్ని తలపిస్తున్నవేళ, పవన్ కల్యాణ్‌ క్రియాశీలకంగా లేకపోవడాన్ని సహించలేకపోతున్నారు నిరసనకారులు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోపే ప్రతిరోజూ నిరసనల్లో పాల్గొనాలని, సర్కారు తీర్మానాన్ని  సైతం ప్రభావితం చేసేలా, ఉద్యమం హోరెత్తించాలని కోరుకుంటున్నారు.

మహేష్‌కి తాకిన రాజధాని ఉద్యమ సెగ.. నెక్స్ట్ బన్నీ, తారక్!!

ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలలు, యువత చేస్తోన్న ఉద్యమం హైదరాబాద్ కి పాకింది. ఈ ఉద్యమ సెగ టాలీవుడ్ స్టార్ హీరోల ఇంటి గడపలకు తాకుతోంది. హైదరాబాద్ లోని ఫిలింనగర్‌లో ఉన్న మహేష్ బాబు ఇంటి ముందు.. ఏపీ రాజధాని కోసం 'జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి' నాయకులు శుక్రవారం నాడు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. మరి ఈ వ్యవహారంపై మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు..19 వరకు హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ & అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల ఇళ్ల ముందు వీరు ఆందోళన వ్యక్తం చేసే అవకాశముంది.

అమరావతి ఉద్యమంలో మరో విషాదం... రైతు కూలీ ఆత్మహత్య

రాజధాని అమరావతి కోసం రైతుల చేస్తోన్న ఉద్యమం రోజురోజుకి మరింత ఉదృతమవుతోంది. రైతులు, మహిళలలు, యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గొంతెత్తి నినదిస్తున్నారు. అయితే ఈ రాజధాని ఉద్యమం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. రాజధాని కోసం ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు వేదనతో గుండె ఆగి మరణిస్తుంటే.. కొందరు రాజధాని తరలిపోతోందన్న మనస్తాపంతో ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. తాజాగా వేమూరి గోపి(20) అనే ఓ రైతుకూలీ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధానిలో ప్రాంతంలో గోపి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా గోపి అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నాడని సమాచారం. ఒకవైపు ఉపాధి లేక మరోవైపు రాజధాని తరలింపుతో తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంసభ్యులు చెబుతున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, పోరాడి సాధించుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకొని కుటుంబాల్లో విషాదం నింపొద్దని పెద్దలు కోరుతున్నారు.

నామినేషన్లను నేడే లాస్ట్.. ఒకే పార్టీ నుండి పోటీ పడుతున్న పది మంది అభ్యర్థులు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ( జనవరి 10వ తేదీన ) ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మునిసిపాలిటీలు , 9 కార్పొరేషన్లలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటివరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో చాలావరకు నామినేషన్లు దాఖలు కాలేదు. గత రెండు రోజుల్లో మొత్తం 5689 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 967 నామినేషన్లు దాఖలు అవ్వగా..  రెండవ రోజు ఏకంగా 4772 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన చివరి రోజు గనుక నేడు మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ  వారి అభ్యర్థులకు బీ ఫామ్స్‌ ఇవ్వడంతో.. ఆ పార్టీ అభ్యర్థులందరూ నేడు నామినేషన్లు వేయనున్నారు. అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తి చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళ వారిని ఖరారు చేయడంతోపాటు నామినేషన్లు వేయించనున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా చివరి రోజే ఎక్కువగా నామినేషన్లు వేయనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు దక్కని వారు సైతం స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశం ఉండడంతో.. ఇవాళ వేలాది నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.పార్టీ నుండి రెబల్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే ధోరణిలో ఖరారైన అభ్యర్థులను కూడా ఇంకా ప్రకటించటం లేదు ప్రధాన పార్టీలు. ఆశవాహులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నుండి బీ-ఫామ్స్‌ అందని వారు సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. కానీ ఒకేపార్టీ నుండి ఐదారుగురు నామినేషన్లు వేస్తుండటంతో చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందన్న విషయం ప్రశ్నగా మారింది. మరోవైపు ఒక పార్టీ నుంచి టికెట్ రాని పక్షాణ వెంటనే ప్రత్యర్థి పార్టీల తరపున బీ-ఫామ్స్‌ పొందేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

సీఎం హోదాలో మొదటిసారి కోర్టు మెట్లెక్కిన వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏ1 జగన్‌తో పాటు ఏ2 ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి 3వ తేదీన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఏ1, ఏ2 లు జగన్, విజయ సాయి తప్పనిసరిగా హాజరుకావాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

మినహాయింపులు చెల్లవు... సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్

  అక్రమాస్తుల కేసు విచారణలో ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు ఏపీ సీఎం జగన్. సీబీఐ కోర్టు వద్ద బందోబస్తుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ సీఎం హోదాలో తొలి సారిగా సీబీఐ కోర్టుకు ఈరోజు హాజరుకాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ పోలీసులకు ఒక లేఖ అందింది. ఏపీ ముఖ్యమంత్రి రేపు సీబీఐ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రిక్వస్ట్ లెటర్ అందటం జరిగింది. ముఖ్యంగా గత వారం సీబీఐ కోర్టులో ఇన్ కెమేరా ప్రొసీడింగ్స్ జరిగాయి. ఇన్ కెమేరా ప్రొసీడింగ్స్ జరిగిన నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా కోర్టు విచారణకు హాజరు కాకుండా ప్రతిసారి ప్రతి మినహాయింపు పొందుతున్నారు. ఇలాంటి మినహాయింపులు చెల్లవని.. నెక్స్ట్ వీక్ తప్పని సరిగా వీరిద్దరూ కోర్టుకు హాజరు కావాలని చెప్పి సీబిఐ కోర్టు ఆదేశించింది. అయితే గత రెండు నెలల క్రితం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ మోహన్ రెడ్డి తరపున దాఖలైన పిటిషన్ ను సీబిఐ కోర్టు తోసి పుచ్చటం జరిగింది. అప్పటి నుంచి కూడా హైకోర్టుకు వెళ్లకుండా ప్రతి శుక్రవారం నాడు ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పెట్టుకుని ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో తాను హాజరు కాబోతున్నాడు కాబట్టి ఈ సీబిఐ విచారణకు హాజరుకావట్లేదన్న వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు కేసు విచారణకు జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. విజయ సాయిరెడ్డి మాత్రమే రెండు మూడు సార్లు రావడం జరిగింది. వీటన్నింటిని సీబిఐ కోర్టు పరిశీలించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని తప్పని సరిగా కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది.

భారీగా పట్టుబడ్డ గంజాయి... పిల్లల ఆట వస్తువుల్లో 180 కేజీల గంజాయి సరఫరా

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది.పిల్లల బొమ్మల మాటున గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు స్మగ్లర్లు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు చేపట్టారు. 16 గంపల్లో పిల్లల బొమ్మల కింద గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. బూర్గంపాడు నుంచి కరీంనగర్ కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు నిర్ధారించారు.ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనాలు, కార్లు ఇతర వాహన టాటా సుమోల ద్వారా సరఫరా చేస్తే చెక్ పోస్ట్ ల ద్వారా పోలీసులకి పట్టుబడుతున్నామని భావించిన అక్రమార్కులు గంజాయి సరఫరా రవాణా చేసే పద్దతిని దారి మళ్ళించారు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటవస్తువుల బుట్టలలో బొమ్మలు పెట్టి ఆ బొమ్మల కింద గంజాయిని పెట్టి ప్యాకింగ్ చేసి సరఫారా చేస్తున్నారు. భద్రాచలం నుంచి కరీంనగర్ కు వెళ్తున్న బస్సులలో 8 బుట్టలలో 180 కేజీలకు పైగా గంజాయిని సరఫరా చేస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు బుట్టలను తనిఖీ చేసి ఆట వస్తువుల బొమ్మలలో పెట్టి గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అధుపులోకి తీసుకున్నారు.

వివాదాల మనిషి.. గురువుకే పంగనామాలు పెడుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి!!

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడిగా చిత్తూరు జిల్లాలో అరంగేట్రం చేసారు చెవిరెడ్డి భాస్కర రెడ్డి. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. జిల్లాలో సీనియర్లను తన గురువు భుమానను పక్కన పెట్టి వారిపై పెత్తనం చేలాయించేలా పావులు కదుపుతున్నారు. పార్టీలో వచ్చిన అవకాశాలను అందిపుచుకుంటూ గురువు కరుణాకరరెడ్డికే పంగనామాలు పెడుతూ పక్కలో బలెంలా తయారయ్యారు.భూమన కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ టీటీడీ పాలకమండలి లో ఈ ఎక్స్ అఫీషియో సభ్యుడి పదవులు కొట్టేసారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుకు కూడా నెమ్మదిగా ఎసరు పెడుతునట్లు సమాచారం. అన్నీ కలిసొస్తే చంద్రగిరిలో తన కుమారుడిని రంగంలో దింపి తిరుపతిలో తాను కాళ్లు మోపాలనే ఆలోచనలో ఉన్నారట చెవి రెడ్డి. ఇప్పటి వరకు అన్ని అనుకున్నట్లు జరుగుతుండటంతో ఇదే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది.  జిల్లా పై పట్టు సాధించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మంత్రి పెద్దిరెడ్డి సీనియర్ కావడంతో అక్కడ ఆయన మాటే ప్రస్తుతం వేదంలా నడుస్తోంది. పెద్ది రెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి ఎంపీగా సీఎం జగన్ కు ఆత్మీయుడు కావడం మంత్రికి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పటి వరకు జిల్లాలో పని కావాలంటే పెద్దాయన ఆశీస్సులుంటే చాలు అనే భావన ఉండేది. కానీ చెవిరెడ్డి మాత్రం నాకేమిటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన పరిధిలో ఉన్న పనులకు కూడా పెద్దాయన రికమండేషన్ ఉన్నా.. నేను చెప్పాలని అడ్డుపడుతున్నారు. ఇదే కాదు టీటీడీ పాలక మండలి సమావేశంలో కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారు చెవి రెడ్డి. తనకు సంబంధంలేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పాలనలో వేలు పెట్టడం.. వారి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన పదవులను అడ్డం పెట్టుకుని తిరుమల దర్శనాలలో పెత్తనం చేస్తున్నారు చెవి రెడ్డి. ఎమ్మెల్యే విప్, తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ వంటి నాలుగు పదవులు ఉండడంతో ఆ నాలుగు పదవుల కోటా కింద ప్రతి రోజూ 40 కి తగ్గకుండా బ్రేక్ దర్శనాలు ఇప్పించుకుంటున్నారు. ఒక్కోసారి చెవి రెడ్డి తీసుకునే బ్రేక్ దర్శనం టికెట్ల సంఖ్య 60 నుంచి 70 కూడా దాటుతుందని అధికారులు అంటున్నారు.  సహజంగా ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు ఆరు టికెట్లు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆ కోటాకి మించి నాలుగు ఐదు టికెట్లు అదనంగా ఇస్తారు. కానీ చెవి రెడ్డి తానకు ఉన్న ప్రతి పదవికి ఆ కోటా కింద వచ్చే అన్ని టికెట్లతో పాటు అధనంగా కూడా లాగిస్తున్నారు. తన ప్రాపకం కోసం తనకు ముఖ్యమని అనుకున్న వాళ్ల కోసం టీటీడీ నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారే గుసుగుసలు వినిపిస్తున్నాయి. పేరుకి పరమ భక్తుడిలా కనిపించే చెవి రెడ్డి తాను అనుకున్న బ్రేక్ టికెట్లు ఇవ్వకపోతే టీటీడీ అధికారులను వేధిస్తున్నారు. చెవి రెడ్డి నోటికి జడుస్తున్న ఆధికారులు ఆయనతో గొడవెందుకని అనుకున్న అధికారులు ఎన్ని టికెట్లు అడిగితే అన్ని ఇస్తున్నారు. చెవి రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ వివాధాలు ఉంటాయి. అటు పెద్దాయన అనుచరులను ఇటు గురువు కరుణాకర రెడ్డికీ చెక్ చెబుతూ జిల్లాలో పెత్తనం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు చెవి రెడ్డి. మరి గురువుకు పంగనామాలు పెట్టి పెద్దాయన శిబిరానికి పావులు కదిలిస్తున్న చెవి రెడ్డి అనుకున్నది సాధిస్తారో లేక వివాదాల సుడిగుండంలోనే గుండ్రంగా తిరుగుతారో వేచి చూడాలి.

మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న టీడీపి

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయిపోయింది. నాయకత్వ లేమితో మిగిలిన కాస్త కేడర్ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. చాలా రోజుల తరువాత తెలంగాణ లోని టీడీపీ కేడర్ ఊపిరి పీల్చుకోబోతోంది. ఏ ఎన్నికలొచ్చినా పోటీచేసే అవకాశం లేకపోవటంతో చాలామంది ఇతర పార్టీలలోకి వెళ్ళిపోయారు. కానీ మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ కలిసి పోటీ చేశాయి. ప్రజాకూటమి పేరుతో సిపిఐ, తెలంగాణ జనసమితిలను కూడా కలుపుకున్నాయి. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురవ్వడంతో తరవాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి అసలు పోటీయే చెయ్యలేదు. ఓ రకంగా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈవీఎంలలో అసలు సైకిల్ గుర్తే కనిపించకుండా పోయింది. అయితే ప్రస్తుతం జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. మునిసిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయటం కంటే ప్రభావం చూపగలిగే స్థానాల్లోనే బరిలో నిలబడాలనుకుంటోంది టిడిపి. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టిడిపి మునిసిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కమిటీ క్యాంపెయినింగ్ కమిటీలను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ ను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ యాక్టివ్ చెయ్యాలనుకుంటుంది. మునిసిపల్ ఎన్నికల్లో ఎంత వరకు సత్తాచాటుతుందో వేచి చూడాలి.

చిన్నమ్మకు జగన్ పై నమ్మకం లేదా... వివేకా హత్య వెనక మిస్టరీ అదేనా? 

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ, వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. వివేకా హత్య వెనుక టీడీపీ ఉందని.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు వివేకా హత్య ఇంటిదొంగల పనేనని, సొంత బాబాయ్ మరణాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ వారు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అలా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగానే ఎన్నికలు ముగిశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది.  ఇంకేముంది జగన్ సీఎం అయ్యాడు.. తన బాబాయ్ హత్యకు కారణమైన వాళ్లెవరో తేల్చేసి, కటకటాల పలు చేస్తాడు అనుకున్నారంతా. కానీ నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి లేదు. సిట్ పేరుతో పుణ్య కలం గడిచిపోతోంది. మరోవైపు ఎన్నికలకు ముందు ఇది రాజకీయ హత్య, సీబీఐతో దర్యాప్తు చేయాలి అన్న గొంతులు కూడా మూగబోయాయి. అయితే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బలంగా కోరుతున్నారు. తన భర్త హత్య కేసులో అసలు దోషుల్ని వదిలేసి, అమాయకుల్ని ఇరికించే ప్రమాదముందని సౌభాగ్యమ్మ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకూ హంతకులను గుర్తించలేదంటే సిట్‌ దర్యాప్తు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు.  వివేకా హత్య కేసుని సీబీఐకి అప్పగించాలని సౌభాగ్యమ్మ కోరడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు కుమారుడు వరసైన జగన్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. గతంలో అంటే ప్రత్యర్థి పార్టీ నేత చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేయించే దర్యాప్తు మీద నమ్మకంలేక కేసుని సీబీఐకి అప్పగించాలని కోరారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్నారు. అయినా ఆమె సీబీఐ విచారణకు పట్టుబట్టడం అంతుచిక్కని ప్రశ్న. ఆమెకు జగన్ ప్రభుత్వం చేయించే దర్యాప్తుపై నమ్మకం లేదా? ఇంకా దీని వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ హత్య వెనుక అయినవాళ్ల హస్తం ఉందని, వారిని కాపాడటానికే జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గ్రహించే సౌభాగ్యమ్మ.. సీబీఐ విచారణ కోరుతున్నారని అంటున్నారు. మరి వివేకా హత్య వెనకున్న మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.