మునిసిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. మురికి కాలువలు శుభ్రపరిచే పనిలో పడ్డ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
posted on Jan 4, 2020 @ 2:51PM
మున్సిపాలిటీల ఎన్నికల సందడి మొదలయింది. పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో మంచి జోష్ మీదున్న టీఆర్ఎస్ పార్టీ అదే సీన్ రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. చేర్యాల మునిసిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాలని 12 వార్డులను తమ ఖాతాలో వేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. చేర్యాలలో ఉన్న 12 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా చేపట్టాలని మురికి కాలువలను శుభ్రం చేసి చెట్లను పెంచాలని కౌన్సిలర్ టిక్కెట్ ఆశిస్తున్న నేతలకు , కార్యకర్తలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదేశించారు. అంతేకాదు ఆయా వార్డులలో ఆశావాహులు ప్రజల మన్నలను పొందుతున్నారా.. లేదా అని స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. పనిలో పనిగా కాలనీ ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆశవహులు కార్యకర్తల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తానే పారిశుద్ధ్య కార్మికులు అవతారమెత్తి మురికి కాలువలను శుభ్రం చేస్తున్న దృశ్యాలు కూడా స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
చేర్యాల మున్సిపల్ అధికారులు ఇప్పటికే వార్డుల విభజన పూర్తి చేశారు. 12 వార్డుల్లో మొత్తం 12,127 ఓటర్లున్నారు. కౌన్సిలర్ టికెట్ ఆశించే అభ్యర్థులు తమ తమ వార్డుల్లో పట్టు పెంచుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు మధ్య అంతర్గత విభేదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచిస్తున్నారు. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వారు ఆ అభ్యర్థికి సహకరించేలా కేడర్ ను ఒప్పిస్తున్నారు. ఈ మేరకు ఆశావహులతో డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేసే వారికి బహిష్కరణ వేటు తప్పదని ముందే హెచ్చరిస్తున్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని పనులు చేసే వారికి మాత్రమే అధిష్టానం అనుగ్రహం ఉంటుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పష్టం చేయడంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారు అప్రమత్తమయ్యారు. తమ వార్డుల్లో సొంత డబ్బులతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పైరవీల ద్వారా టికెట్లు సాధించుకోవాలని తలపోసిన వారు కూడా ఇప్పుడు దారిలోకి వస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చేర్యాల మున్సిపాలిటీలో ఎస్సీ సామాజిక వర్గం తర్వాత బీసీ ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందని ఆశావహులు ఉత్కంఠతో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా పూర్తిగా గులాబీ జెండాలే ఎగురవేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో నూతనంగా ఏర్పడిన చేర్యాల పురపాలక సంఘాల రాజకీయం ఆసక్తికలుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లా డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డితో ఇటీవల భేటీ కావడం స్థానికంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో మున్సిపల్ పరిధి లోని హస్తం పార్టీ నాయకులను పిలిపించుకుని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని వ్యూహ రచన చేస్తున్నారు. బిజెపి కూడా బలమైన అభ్యర్థులను పోటీకి నిలపాలని ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి రెండు స్థానాల్లో అయిన గెలవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పట్నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి తమదైన శైలిలో కదులుతున్నారు.