చంద్రబాబుకి ఊహించని షాక్... ఏడుగురు ఎమ్మెల్యేలు, 12మంది ఎమ్మెల్సీలు డుమ్మా..!

రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను ఆమోదించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీఎల్పీ విస్తృతంగా చర్చించింది. టీడీఎల్పీ నేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. మొత్తం 23మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు డుమ్మాకొట్టారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే చంద్రబాబుపై తిరుగుబాటు ఎగురవేయగా, మరో ఐదుగురు మాత్రం వ్యక్తిగత కారణాల పేరుతో గైర్హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరిలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వల్లభనేని వంశీ అయితే, శాసనసభలో ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక, మద్దాల గిరి అయితే, ఇటీవలే జగన్ ను కలిసి బాబు నాయకత్వంపై విమర్శలు చేశారు. దాంతో వీళ్లిద్దరూ రాకపోవడంపై పెద్దగా అనుమానాల్లేకపోయినా, మిగతా ఐదుగురు డుమ్మా కొట్టడంపైనే చర్చ జరుగుతోంది.  ఈ ఐదుగురిలో గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, బి.అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని ఉన్నారు. అయితే వీళ్లంతా ముందుగానే చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే టీడీఎల్పీ మీటింగ్ కి హాజరుకాలేకపోతున్నామని, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతామని తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా స్వాగతిస్తూ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేయడమే కాకుండా, టీడీపీ అధిష్టానానికి తీర్మానాన్ని కూడా పంపారు. దాంతో ఈ ముగ్గురి వైఖరి అసెంబ్లీలో ఎలాగుంటుందోనన్న ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది. ఇక, ఎమ్మెల్సీల్లోనూ 12మంది ఈ సమావేశానికి డుమ్మాకొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీళ్లేమైనా మండలిలో టీడీపీకి షాకిచ్చి అధికార పార్టీకి కొమ్ముకాస్తారేమోనన్న ప్రచారం జరుగుతోంది.  

ఎన్టీఆర్ పై కేసీఆర్ అభిమానం మాటల వరకే? ఘాట్ పరిస్థితి అద్వానం

తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ విలువని మరిచిపోయిందా? అందుకే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణను గాలికొదిలేసిందా? అంటూ సగటు ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎన్టీఆర్ జయంతి,వర్థంతి సమయాల్లో.. ప్రభుత్వ తరఫున ఎన్టీఆర్ ఘాట్ లో కనీస ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ ఆనవాయితీని పక్కన పెడుతూ వస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అనేక విగ్రహాలు, ఘాట్ లు.. పూల అలంకరణ, మరమ్మత్తులకు నోచుకుంటున్నాయి.. కానీ ఎన్టీఆర్ ఘాట్ మాత్రం కొంతకాలంగా అనాథలా మిగిలిపోయింది. గత ఏడాది కూడా ఎన్టీఆర్ వర్థంతికి.. ఘాట్‌లో కనీస ఏర్పాట్లు చేయకపోవటంతో నందమూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు అప్పటికప్పుడు పూలు తెప్పించి, ఘాట్ ని అలంకరించి నివాళులర్పించారు.  ఈ సంవత్సరం కూడా అధికారులు ఎన్టీఆర్ ఘాట్ ని పట్టించుకోలేదు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎన్టీఆర్ ఘాట్ శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోయి కళా విహీనంగా మారింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ట్రస్ట్ సొంత ఖర్చులతో ఎన్టీఆర్‌ ఘాట్‌కు మరమ్మతులు చేసి వర్థంతి వేడుకలకు ముస్తాబు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యపు వైఖరిని ఎన్టీఆర్ అభిమానులు తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ సహా ఎందరికో రాజకీయంగా అండగా నిలబడ్డ నేత వర్ధంతికి కనీసం ఏర్పాట్లు కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ సహా ఎందరో నేతలు.. తమకి ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయనను మేం అభిమానిస్తామని చెప్తుంటారు. అయితే ఆ అభిమానమంతా కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఆ అభిమానాన్ని చేతల్లో ఏ మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహం వ్యక్తం చేస్తున్నారు.

సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు... అమరావతిలో ఉద్రిక్తత!!

ఏపీలో రాజధాని పోరాటం మరింత ఉధృతమవుతోంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలు.. రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. వైసీపీ సర్కార్ రాజధాని మార్పు విషయంలో వేగంగా అడుగులు వేస్తుండటంతో.. ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దీక్షలు, ధర్నాలు, హోమాలు, గవర్నర్ కి ఫిర్యాదులు, ప్రధానికి లేఖలు ఇలా అన్ని రకాల శాయశక్తులా పోరాడుతున్నారు. అయితే తాజాగా నలుగురు యువకులు రాజధాని కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సెల్ టవర్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మోడీ భారతీయుడేనా? ఆధారాలేమైనా ఉన్నాయా?

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ... ఇప్పుడు దేశమంతా వీటి గురించే చర్చ... మొత్తంగా మూడింటి సారాంశం ఒక్కటే... భారతీయ పౌరసత్వం... లేదా మీరు భారతీయులేనా?... జాతీయ జనాభా నమోదు... ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి... మొత్తంగా చూస్తే మీరు భారతీయులేనా? అనే ప్రశ్న కొన్ని వర్గాలను భయపెడుతోంది... అంతేకాదు, మత ప్రాతిపదికన మోడీ ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చిందని విపక్షాలు, కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ బీజేపీపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు, బిల్లులతో దేశంలో పలు వర్గాలు భయపడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు... లేదంటే అమెరికా పోవచ్చన్న కామెంట్స్ ఆయా వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయి. మీ భారతీయతను నిరూపించుకోవాలన్న కొందరి వ్యాఖ్యలతో కొన్ని వర్గాలు తీవ్రంగా భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ వాసి ఒకరు.... ప్రధాని మోడీ భారతీయతనే ప్రశ్నించారు. నరేంద్రమోడీ అసలు భారత పౌరుడేనా? మోడీ భారతయుడేనని నిరూపించుకునేందుకు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఆర్టీఐ కార్యకర్త జోషి దరఖాస్తు చేశారు. దాంతో, జోషి దరఖాస్తును.... కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపించారు. అయితే, సీఏఏ గురించి కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నందుకే, ప్రజాప్రయోజనార్ధం ఈ దరఖాస్తు చేశానని ఆర్టీఐ కార్యకర్త జోషి తెలిపాడు.

సన్నాసుల్లారా...! మంత్రులపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

ఇష్యూ ఏదైనా తనదైన శైలిలో స్పందించే మెగా బ్రదర్ నాగబాబు...  వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేయడంతో... నాగబాబు కూడా అంతే ఘాటుగా రియాక్టయ్యారు. గుండుసున్నా దేనితో కలిసినా... ఫలితం జీరోనే అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్ ఇంత డెవలప్ అయ్యాయంటే... సున్నా మహత్యమేరా... చదువుకున్న సన్నాసుల్లారా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. విజయసాయిపైనే కాదు అంబటి, అవంతి, పేర్ని నానిపైనా నాగబాబు విరుచుకుపడ్డారు. ఇలాంటి వైసీపీ లీడర్ల వల్లే ఎక్స్ ట్రా జబర్దస్త్ లేని లోటు తీరిందంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే, వెధవలు... ఏరా... సన్నాసుల్లారా... లాంటి తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ నాగబాబు ట్వీట్స్ చేయడంతో.... వైసీపీ నుంచి కూడా మళ్లీ స్ట్రాంగ్ రియాక్షన్ కచ్చితంగా వస్తుంది. ఈ లెక్కన జనసేన-వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధం... ఏపీ రాజకీయాల్లో సరికొత్త హీట్ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ముగ్గురు ఎంపీలు వర్సెస్ కేసీఆర్... అందరి దృష్టీ ఆ మూడు సెగ్మెంట్లపైనే...

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి చావు దెబ్బ తిన్న బీజేపీ... ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఊహించనిస్థాయిలో ఉపశమనం పొందింది. ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందటమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితతోపాటు ...టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత వినోద్ కుమార్ ను ఓడించటంతో కమలానికి మైలేజీ పెంచింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ కనీస ప్రభావం చూపలేకపోయింది. కానీ, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్యాయమని, 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీయేనని కమలనాథులు బల్లగుద్దిమరీ చెబుతూ వస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు, కమలం సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అత్యంత కీలకంగా మారాయి. దాంతో, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుకు మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి. కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్​సభ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలో గెలుపు బాధ్యత సంజయ్, అర్వింద్‌పై పడింది. ఇక సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపుపైనా పార్టీలో ఆశలు ఉన్నాయి. దాంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదుల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జీహెచ్ఎంసీకి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా... హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజ్​గిరి, చేవెళ్ల లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని ఏడు కార్పొరేషన్ సీట్లు, అలాగే, 20వరకు మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉంది. బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ కార్పొరేషన్ స్థానాలు... అలాగే, శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్ వంటి కీలక మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ కు ఆనుకుని ఉండడంతో వీటిల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని భావిస్తోంది బీజేపీ. అయితే, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ప్రాతినిథ్యం వహిస్తోన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై అధికార టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్... తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ జెండా ఎగురవేయడమే కాకుండా బీజేపీని మానసికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. దాంతో, ఈ ముగ్గురు ఎంపీల పరిధిలో జరిగే ఎన్నికలు హోరాహోరీగా మారాయి. అయితే, అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు కూడా ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు. అభివృద్ధి, హిందుత్వవాదంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. తమతమ పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని బీజేపీ అధిష్టానం దగ్గర తమ పలుకుబడిని మరింత పెంచుకునేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారు. మరి, మున్సిపోల్స్ లో ఈ ముగ్గురు ఎంపీల స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందో... లేక... ఎంపీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ బదులు తీర్చుకుంటారో చూడాలి. మొత్తానికి తెలంగాణ మున్సిపోల్స్ లో అందరి దృష్టీ ఇఫ్పుడు ముగ్గురు బీజేపీ ఎంపీలపైనే ఉంది. ఎందుకంటే, ఆ ముగ్గురి వల్లే తెలంగాణలో బీజేపీకి మళ్లీ ఊపొచ్చింది. ఏమీ లేదనుకున్న పార్టీని ఔరా ఇంతుందా అనిపించేలా చేశారు ఈ ముగ్గురూ. పార్టీ లేదనుకున్న చోట... దిగ్గజాలను ఓడించారు. అంచనాలను మించిన ఆ విజయమే... ఇప్పుడు మున్సిపోల్స్‌ రూపంలో వారిపై ఒత్తిడి పెంచింది. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలో మునుపటి జోష్ లేదన్న ప్రచారం ఓ వైపు, వాపును చూసి కమలం పార్టీ నాయకులు బలుపు అనుకుంటున్నారన్న టీఆర్‌ఎస్ నేతల కౌంటర్ల నేపథ్యంలో, ఆ ముగ్గురు ఎంపీలకు మున్సిపల్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా ఈ ముగ్గురు ఎంపీలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి, ఎంపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించినట్లే.... మున్సిపోల్స్ లోనూ సత్తా చాటి తమకు తిరుగులేదని నిరూపించుకుంటారో లేక ...చతికిలపడతారో కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

అధికారులను అయోమయంలో పడేసిన క్యాబినెట్ భేటీ... మళ్లీ మారిన తేదీ!!

మూడు రాజధానుల నిర్ణయం అమలులో అతి కీలకమైన క్యాబినెట్ భేటీ పై ఉత్కంఠత మొదలైంది.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్, మంత్రులు అధికారులతో కూడిన హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశాన్ని జరుపుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.18 వ తేదీ కేబినెట్ భేటీ 20 వ తేదీ అసెంబ్లీ నిర్వహిస్తామని గత నెలలోనే షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత క్యాబినెట్ అసెంబ్లీ రెండు సోమవారమే ఉంటాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఈ నిర్ణయం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ భేటీ జరుగుతుందంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.రాజధాని పై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రి మండలి ఆమోదించగా అసెంబ్లీలో చర్చించేలోగా న్యాయపరమైన ప్రతిబంధకాల పై అధ్యయనం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.కేబినెట్ వాయిదా పడినట్టు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సమాచారమిచ్చింది.  తాజా సమాచారం ప్రకారం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. క్యాబినెట్ సమావేశాన్ని సోమవారానికి మార్చడానికి పలు కారణాలున్నట్టు సమాచారం.రాజధాని మార్పుల్లో భాగంగా సీఆర్డీయేను రద్దు చేస్తూ బిల్లును ఆమోదించలని భావించారు. ఇది ద్రవ్య బిల్లు కాబట్టి అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికంటే ముందే గవర్నర్ ఆమోదం తీసుకోవాలని అందుకు అనుగుణంగా శనివారమే క్యాబినెట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.తర్వాత అది ద్రవ్య బిల్లు కాదని నేరుగా సోమవారం క్యాబినెట్ లో ఆమోదించిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్ట వచ్చుననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమరావతి మార్పుపై ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు, అందువల్ల కోర్టులు కూడా ఈ జోక్యం అంశం గురించి ప్రస్తావించట్లేదు.ఒకవేళ శనివారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న పక్షంలో వెంటనే దీని పై ఎవరైనా హైకోర్టును ఆశ్రయించవచ్చు. బిల్లు అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు,దీని కారణంగా కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశం వెంట వెంటనే ఉండేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం. 

ఇంతకీ లక్ష్మీనారాయణ ఉన్నట్లా? లేనట్లా? పవనే దూరం పెడుతున్నారా?

లక్ష్మీనారాయణ... సీబీఐలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీనారాయణ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని వెంట నడిచారు. వైజాగ్‌ ఎంపీ పోరులోనూ గౌరవమైన ఓట్లు కూడా తెచ్చుకున్నారు. అయితే, ఎన్నికల తర్వాత ఒకట్రెండు సమావేశాలు మినహా జనసేన కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఆమధ్య జరిగిన విశాఖ లాంగ్ మార్చ్ లో గానీ, ఇప్పుడు బీజేపీతో జనసేన కలిసి నడుస్తున్నవేళ గానీ, ఏ మీటింగ్ లోనూ లక్ష్మీనారాయణ కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మీనారాయణే పార్టీకి దూరంగా ఉంటున్నారా? లేక జనసేనే లక్ష్మీనారాయణను దూరం పెడుతోందో తెలియక జనసైనికులు, లక్ష్మీనారాయణ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు అమరావతిలో రాజధాని ఉద్యమం పెద్దఎత్తున ఎగిసిపడుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రాజధాని ప్రజలకు మద్దతుగా ఒకరోజు ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. కానీ, లక్ష్మీనారాయణ ఎక్కడా కనబడలేదు. ఇటు రాజధాని ఆందోళనల్లోనూ... అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో... లక్ష్మీనారాయణ అసలు జనసేనలోనే ఉన్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కారణాలేమైనప్పటికీ జనసేనతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే టాక్ కూడా వినిబడుతోంది. అందుకే, పార్టీ సమావేశాలకు హాజరవడం లేదని అంటున్నారు.  అయితే, తాను జనసేనకు దూరంగా ఉంటున్నానని, పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను లక్ష్మీనారాయణ కొట్టిపారేశారు. పార్టీ నిర్ణయాల ప్రకారమే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే 2020లో తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నానని, వాటి కోసం అధిక సమయం వెచ్చిస్తానని చెప్పారు. అదే సమయంలో పార్టీ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తానని అన్నారు. ఒక వేళ పార్టీ మారే పరిస్థితి ఏర్పడితే అందరికీ చెప్పే చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి అయితే తాను పార్టీ మారబోనని, అలాంటి ఆలోచనే లేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, ప్రజా చైతన్య కార్యక్రమాలకు హాజరవుతూ ఫుల్ బిజీగా ఉన్నట్లుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. పార్టీ మారే ఉద్దేశం లేదని లక్ష్మీనారాయణ చెబుతున్నా... జనసేన విధానాలు, నిర్ణయాల్లోనూ తనకు పాత్రలేకుండా చేస్తున్నారని లోలోపల రగిలిపోతున్నారట. రాజకీయాల్లో సీనియర్‌ కాకపోయినా, తనకంటూ సమాజంలో ఒక ఇమేజ్‌ ఉందని, కానీ తనకు ఆ మేరకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జనసేనకు సంబంధించి ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కల్యాణ్‌ తర్వాత నాదెండ్ల మనోహర్ మాత్రమే కనపడ్తున్నారని, ఇది సరికాదని అంటున్నారట. మొత్తానికి పార్టీ నిర్ణయాల్లో తనకేమాత్రం భాగస్వామ్యం కల్పించడం లేదని లక్ష్మీనారాయణ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, ఇటీవల నియోజకవర్గ ఇన్ ఛార్జులను ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్.... విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ బాధ్యతలను లక్ష్మీనారాయణకే అప్పగించారు. దాంతో, లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉన్నారని, ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పినట్లయ్యింది. అయితే, పార్టీ విధాన నిర్ణయాల్లో... పార్టీ కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదో ప్రశ్నార్ధకమవుతోంది. మొత్తానికి లక్ష్మీనారాయణ జనసేనలో ఉన్నారంటే ఉన్నారు... లేరంటే లేరన్నట్లుగా పార్టీ వ్యవహరిస్తోందని అంటున్నారు.

తగ్గిన ప్రజల మూలధన వ్యయం..  ఏపీకి తీవ్ర నష్టం!!

ఈ ఏడాది పన్ను విషయంలో ఏపీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందనిసమాచారం. ఏపీలో ప్రజల మూలధన వ్యయం తగ్గింది. గత ఏడాదితో పోల్చితే 69% శాతం పతనమైనట్టు ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోళ్లలో 31% తిరోగమనం ఉంటుంది. పీక్ టైమ్ లో విద్యుత డిమాండ్ తగ్గిపోయింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే తీవ్రంగా తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేందుకు పరిగణలోకి తీసుకునే పలు అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన నివేదిక ఈ విషయం వెల్లడించింది. పలు అంశాల్లో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితి ఎలా ఉందో లెక్కలు తీసి అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రతి రాష్టానికి  ఆయా సూచికల్లో వచ్చిన మార్పులను కలిపి మొత్తం స్కోరును ఇచ్చింది.  ఆర్ధిక అభివృద్ధి ఎలా ఉందో చెప్పడంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అదే సమయంలో ప్రజలు చేసే మూలధన వ్యయం అనేవి కీలక అంశాలు. ప్రభుత్వానికి పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఫీజులు, జీఎస్టీ, యాక్సిస్ తదితర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 7% శాతం తగ్గిందని పేర్కొంది. ఈ ధోరణి నెలకొన్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొంది. ఈ సమయంలోనే ప్రజల మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. మూలధన వేయమంటే భూములు, స్థలాలు, ఇళ్లు ఇతర స్థిరాస్తుల పై వెచ్చించే మొత్తం. ఈ వ్యయం ఎంత ఎక్కువుంటే అంతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. ఈ వ్యయం పైనే ఆర్థిక చక్రం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ప్లాటు కొనుగోలు చేశాడని అనుకుంటే అంత మేరకు సిమెంట్ ఇనుము ఇసుక కంకర అన్ని వ్యాపారాలు చేసే వారికి బాసటగా నిలిచినట్లే.

జనసైనికుడు అరెస్ట్.. తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత!!

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నాయకుడు మారిశెట్టి పవన్ బాలాజీని పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ వద్ద గొడవ మొదలైంది. బీజేపీ జనసేన పొత్తును విమర్శిస్తూ పవన్ పై గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శలు చేశారు. ఆ విమర్శలను తిప్పికొడుతూ బాలాజీ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.వాటిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేయడం అక్రమం అని నినదిస్తూ జనసేన కార్యకర్తలు పీఎస్ కు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నియోజకవర్గ జనసేన ఇనఛార్జ్ అయిన బొలిశెట్టి శ్రీనివాసరావు కార్యకర్తలకు మద్దతు తెలిపారు.

కనిపించని కడియం శ్రీహరి.. ఓరుగల్లు మునిసిపల్ ఎన్నికల సందడిలో ఆయన మిస్!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభ వెలిగి పోవటంతో అన్ని పార్టీల నుంచి గులాబిదళంలో భారీగా వలసలు కొనసాగాయి. దీంతో కారు పార్టీ కిక్కిరిసిపోతోంది. ఈ పరిణామమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టిఆర్ఎస్ సీనియర్ నేతలను టెన్షన్ పెడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు అంతర్గతంగా ఎలాంటి రాజకీయాలు చేస్తారనే వారి ఆందోళనకి ప్రధాన కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగబోతున్న మున్సిపోల్స్ అన్ని పార్టీల సీనియర్ లకి అగ్ని పరీక్షగా మారాయి. ఆయా పార్టీల అధిష్ఠానలేమో గెలుపు బాధ్యతలను ముఖ్య నేతల భుజస్కంధాలపై మోపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని చోట్ల గెలవాల్సిందేనని ముఖ్య మంత్రి కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గానికి ఇన్ చార్జిలను నియమిస్తూనే ఇతర సీనియర్ నేతలకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.  ఈ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ,సత్యవతి రాథోడ్ ల పై కూడా కీలక భారం మోపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ ,డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలున్నాయి .తొర్రూరు మునిసిపాలిటీ మంత్రి దయాకర్ రావు పరిధిలోకి వస్తుంది కాబట్టి అయనకి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఇక మహబుబాబాద్ డోర్నకల్ మరిపెడ బాధ్యతులు మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ మంత్రి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, ఎంపీ కవిత ఎన్నికల ఇంచార్జ్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లకు అప్పగించారు. వీరిలో అందరి కంటే ఎక్కువ బాధ్యత వహించాల్సింది మాత్రం సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్ లే ఎందుకంటే వీరిద్దరూ జిల్లాలో సీనియర్ నేతలు మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాల్టీలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోగుట్టు వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సీనియర్ నేతలను ఈ పరిణామాలు బీపీ పెంచుతున్నాయి. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు మూడు ముక్కలుగా విడిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా గెలుపు బాధ్యతలు అప్పగించారు. దీంతో అక్కడ ఎవరి విజయాలు వారివే అన్నట్టు పరిస్థితి తయారైంది. దీనికి తోడు ఈ మున్సిపాలిటీలో ప్రత్యర్థులు కూడా బలంగానే ఉండడం గమనార్హం. ఇక ములుగులో జడ్పీ చైర్మన్ జగదీష్ , భూపాలపల్లి లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు మున్సిపోల్స్ లో గెలుపు బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ నేతలు అందరి కంటే ప్రచారంలో ముందున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండగా పొరపాటున ఏదైనా జరిగితే పరువు పోతుందన్న టెన్షన్ ఆ నేతల్లో కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ పార్టీ సీనియర్ లకు మున్సిపల్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానంగా కొండా మురళి, సురేఖ దంపతులకు పరకాల భూపాలపల్లి మునిసిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారు తమ పార్టీని గెలిపించుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.జనగామ బాధ్యతల్లో పొన్నా లక్ష్మయ్య కు, నర్సంపేట బాధ్యతలను దొంతి మాధవరెడ్డికి అప్పగించారు. ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాగైనా మున్సిపల్ బార్ లో పై చేయి సాధించాలని ఇందు కోసం అవసరమైతే సామదానభేద దండోపాయాలను ప్రయోగించాలని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ కౌన్సిలర్ స్థానాలు తమకు తగ్గితే ఇతరులను నయానో భయానో తమ వైపు తిప్పుకోవాలని కూడా స్కెచ్ వేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపేమిటంటే టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఎక్కడా కనిపించకపోవడం ప్రస్తుతం ఉమ్మడి ఓరుగల్లు టీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.

రాజధానిలో మొదటి వేడుకలు.. విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగర తీరంలో నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ రోడ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ ని నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజు పరేడ్ లో పాల్గొనే కంటెంజెన్సీ బీచ్ రోడ్ లో సన్నధ కవాతు నిర్వహించారు. ఎనిమిది కంటింజెన్సీ ఇప్పటికే విశాఖకు చేరుకుని రిహార్సల్స్ ప్రారంభించాయి.  రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా విశాఖలోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత తొలి రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలో నిర్వహిస్తుండటం విశేషం. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 25 వరకు బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్ లో ఉదయం 5:30 నుంచి 11:30 వరకు..అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5:30 నిమిషాల వరకు రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆయా సమయాల్లో బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నరు. ఆర్కే బీచ్ ఏరియాలో నివాసముండే వాళ్లకు రాకపోకల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

రేవంత్ రెడ్డికి మొండి హస్తం.. చిన్నారెడ్డికే టీపీసీసీ పగ్గాలు!!

కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పీసీసీకి నూతన సారథిని నియమించింది. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ అంశం మళ్లీ తెరపై కి వచ్చింది. తెలంగాణలోని పలు సమీకరణాల నేపథ్యంలో పార్టీ విధేయతకు ప్రాధాన్యమివ్వాలా లేక ప్రజాకర్షణకు పెద్ద పీట వేయాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్య దర్శి సంపత్ కుమార్, తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఏపిసిసి అధ్యక్ష పదవి కోసం గిడుగు రుద్రరాజు ,పల్లం రాజు తోపాటు పలువురి పేర్లు చర్చకు వచ్చినా అధిష్ఠానవర్గం తమ సొంత నిర్ణయం మేరకు శైలజానాథ్ ను నియమించిందని.. అదే దృక్పథంలో టిపిసిసి అధ్యక్షుడు కూడా నియమిస్తారని.. రాజకీయ వర్గాలు అంటున్నాయి.  కాగా వరుస ఎన్నికల్లో డీలా పడిన పార్టీకీ నూతన నాయకత్వం ఉత్తేజాన్నిచ్చేదిగా ఉండాలన్న అంశంపైన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన నేపథ్యంలో పార్టీ పట్ల విశ్వాసం పై అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి నూతన సారథిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తే రేవంత్ రెడ్డి , చిన్నారెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. విశ్వాసానికి ఓటు వేస్తే చిన్నారెడ్డికి అవకాశం దక్కవచ్చని పార్టీకి నూతనోత్తేజం అందించాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డికే పట్టం కట్టవచ్చని అంటున్నారు. రెడ్డి ఇతర వ్యక్తికి ఇవ్వాలని భావిస్తే శ్రీధర్ బాబు పేరే ఖరారవుతుందని అనుకుంటున్నారు. ఇటు పార్టీ పట్ల విశ్వాసం వివాదరహితుడు కావడం ఆయనకు కలిసి వస్తుందంటున్నారు మునిసిపల్ ఎన్నికలు పూర్తి కాగానే నూతన సారథిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు.

జనసేన-బీజేపీ మైత్రితో జగన్ కి తిప్పలు తప్పేలా లేవు!!

జనసేన-బీజేపీ కలయికపై మౌనం వహించాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ పరిణామం పై స్పందించరాదని నిర్ణయించింది. అయితే వాటి చెలిమి సీఎం జగన్ మోహన్ రెడ్డికే తలనొప్పులు తెచ్చిపెడతుందని అంచనా వేస్తోంది. రాజధాని తరలింపు.. అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయనకు ఇబ్బందులు ఎదురుకావచ్చు అని భావిస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో జనసేన బిజెపి పొత్తు ప్రస్తావనకు వచ్చింది. అయితే జరగబోయేది కొంత కాలం వేచి చూద్దామని అప్పటి వరకు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించాలని సమావేశంలో అభిప్రాయపడింది. రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పడుతుందని భావించి.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్టు టిడిపి నేతలు చెబుతున్నారు.  అమరావతి విషయంలో జనసేన, బిజెపి కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బిజెపి సొంతంగా ఉద్యమం చేపట్టటమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లేనని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని మార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదని చాలా అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతుందని టిడిపి సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. జగన్ కేసుల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని మరో టీడీపీ నేత అన్నారు. తన కేసులో విచారణ జాప్యం కావడానికి జగన్ ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం పొందారని.. ఆ సహకారం ఆగిపోతే కేసుల విచారణలో వేగం పెరిగే అవకాశముందన్నారు. విచారణ త్వరగా ముగిస్తే శిక్షలు కూడా ఖాయం. జనసేనతో కలిసి బలపడాలనుకునే రాజకీయ పార్టీగా బిజెపి ఈ దిశగా పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతుంది.

మూడు రాజధానులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు... జగన్ వైఫల్యం కావొచ్చేమోనంటూ..! 

ఆమధ్య ట్విట్టర్ చిట్ చాట్ లో ఏపీ రాజధాని వివాదంపై సమాధానం దాటవేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.... ఇఫ్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడేమో ఏపీ రాజధాని వివాదం ఆంధ్రులకు సంబంధించిన విషయమంటూ తప్పించుకున్న కేటీఆర్... ఇప్పుడు మూడు రాజధానుల రగడపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదన్నారు. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించామని గుర్తుచేశారు.  అయితే, ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎందుకు వ్యతిరేకత వస్తోందో ఆలోచించుకోవాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమరావతి రైతులు, ప్రజలు, ఆయా పార్టీలు పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, విమర్శలు ఎందుకు చేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.  అయితే, తెలంగాణలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకెళ్లారని కేటీఆర్ అన్నారు. అందుకే, తెలంగాణలో 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైనా ఎక్కడా చిన్న ఆందోళన జరగకుండా విజయవంతంగా పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే కేటీఆర్ వ్యాఖ్యలు... జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపాయని అంటున్నారు. అమరావతి గ్రామాల్లో ఇంత పెద్దఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తడమంటే అది జగన్ ప్రభుత్వ వైఫల్యమేనన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.

పాలమూరు మంత్రుల్లో గుబులు... ఒక్కటి చేజారినా పదవి పోయినట్లే..!

మున్సిపాలిటీల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడుతాయంటూ గులాబీ బాస్ చేసిన హెచ్చరిక మంత్రులకు దడ పుట్టిస్తోంది. దాంతో, కేసీఆర్ వార్నింగ్ ను సవాల్ గా తీసుకుంటున్న మంత్రులు... పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు. తలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని... పంచుకుని అభ్యర్థుల గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍ హెచ్చరిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు సవాల్ మారింది. ఉమ్మడి జిల్లాలోని 17 పురపాలికల గెలుపు బాధ్యతంతా వీరిద్దరిపైనే పడింది. ఏ ఒక్క పురపీఠం చేజారినా వేటు తప్పదన్న భావనతో ఇద్దరు మంత్రులు తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అయితే, టికెట్లు దక్కనివారిని బుజ్జగించడం, వర్గ విభేదాలను క్లియర్ చేయడం పెద్దతలనొప్పిగా మారింది. ఇక, పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ లో పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ టీఆర్‍ఎస్‍ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి మంచి ఓట్లు రావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుండెల్లో గుబులు నెలకొంది. ఇక, మంత్రి నిరంజన్‍ రెడ్డి నాగర్‍కర్నూల్‍ పార్లమెంటు సెగ్మెంట్ కే పరిమితమయ్యారు. వనపర్తి, కొల్లాపూర్‍, అలంపూర్‍ మున్సిపాలిటీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‍రెడ్డిపై వదిలిపెట్టారు. గద్వాల్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‍రెడ్డితో ఉన్న విబేధాల కారణంగా అటువైపు మంత్రి నిరంజన్ రెడ్డి చూడడంలేదని తెలుస్తోంది. నాగర్ కర్నూల్, గద్వాల మున్సిపాలిటీలు వదిలేసి వనపర్తి, అలంపూర్, ఐజ, కొల్లాపూర్‍ లో టీఆర్ ఎస్ గెలుపు కోసం నిరంజన్ రెడ్డి శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు మంత్రులు ఎన్ని మున్సిపాల్టీల్లో గులాబీ జెండా ఎగరవేసి అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తారోనన్న చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్త్రతంగా చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ కు పట్టిన గతే వైసీపీకీ పడుతుంది... జగన్ కు రాజకీయ సన్యాసమే...

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు పట్టిన గతే.... మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీకి పడుతుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చితే వైసీపీ మునిగిపోవడం ఖాయమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీ పతనం ప్రారంభమవడం ఖాయమన్నారు. అలాగే, దుర్మార్గపు ఆలోచనలు, నియంతృత్వ పోకడలతో జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతారని నిమ్మల కిష్టప్ప జోస్యం చెప్పారు. ఏవిధంగా చూసినా అన్ని ప్రాంతాలకు విశాఖ అనువైనది కాదని అన్నారు. అందుకే, అమరావతిని మార్చొద్దంటూ మంత్రులైనా జగన్ కు నచ్చజెప్పాలని సూచించారు. విశాఖపట్నం రాజధానిగా అనువైనది కాదని మంత్రివర్గ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి మంత్రులంతా చెప్పాలన్నారు. లేదంటే, మూడు రాజధానుల రగడ వైసీపీని కచ్చితంగా ముంచేస్తుందని నిమ్మల కిష్టప్ప హెచ్చరించారు.