రెక్కలు రానున్న తెలంగాణ భూముల మర్కెట్ విలువ...

  తెలంగాణలో భూముల మార్కెట్ విలువకు త్వరలో భారీగా పెరగనున్నాయి.భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయంగా అంచనా వెయ్యాలి అంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రాంతాల వారీగా ఉన్న బహిరంగ మార్కెట్ విలువలను ఆధారంగా చేసుకొని రేట్లను నిర్ణయించాలని సూచించింది. ఇప్పటికే కొత్త మార్కెట్ విలువలతో ప్రతిపాదనలనూ స్టాంపులు రిజిస్ట్రేషన్ ల ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయం తయారు చేసింది. ఆయా ప్రాంతాలకు  అనుగుణంగా 35 నుంచి 150% వరకు మార్కెట్ విలువలను పెంచుతూ వీటిని రూపొందించింది.పెంపు ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి సోమేష్ కుమార్ కు అందచేసింది. ఈ ప్రతిపాదనలను పునః పరిశీలించాలి అంటూ తిరిగి రిజిస్ర్టేషన్ల శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ ను ఆదేశించారు. కొత్తగా రాబోతున్న పారిశ్రామిక కారిడార్ లు క్లస్టర్ లు ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాలను ఆధారంగా చేసుకొని రేట్లను అంచనా వేయాలని ఆదేశించారు. మార్కెట్ రేట్లతో పోల్చి చూస్తే ప్రభుత్వ మార్కెట్ విలువలు శాస్త్రీయంగా నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. దీంతో రిజిస్టేషన్ల అధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. ఏ ప్రాంతంలో బహిరంగ మార్కెట్ విలువ ఎంతుంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందన్న వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలలు వెలుస్తున్నాయి. ములుగు ప్రాంతంలో ఉద్యానవన యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చింది. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వంటివి ఏర్పాటు కావాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. కొన్ని జాతీయ రహదారుల విస్తరణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ లను తయారు చేసి కేంద్రానికి అందజేసింది.ఇలాంటి ప్రాజెక్టులు, కారిడార్లు, హైవేలు, విద్యా సంస్థలు ఏర్పడే ప్రాంతాల చుట్టుప్రక్కల భూములు స్థలాల విలువలు అనూహ్యంగా పెరగనున్నాయి. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువలను రూపొందించనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి అర్బన్ ప్రాంతాల్లో లెక్కలోకి రానున్నాయి.  జూబ్లీహిల్స్ లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో గజం ధర లక్షకు పైగానే పలుకుతోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధర మాత్రం ఇప్పటికీ నలభై వేల రూపాయలే ఉంది. ఇలా పెరిగిన రేట్లను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయంగా మార్కెట్ విలువలను అంచనా వేయనున్నారు. చాలా చోట్ల వంద శాతానికి పైగా రేట్లు పెరిగాయి.కొన్ని చోట్ల 150 నుంచి 250 శాతం వరకు రేట్లను పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గా లు చెప్తున్నాయి. త్వరలో ప్రభుత్వ మార్కెట్ విలువల పెంపు పై అధికారికంగా ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు.తెలంగాణలో సామాన్య ప్రజలు ముందుముందు భూములు కొనాలంటే నిజంగానే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి.   

జగన్ సర్కార్ కి షాక్... ఫలించిన బాబు వ్యూహం.. మూడు రాజధానుల బిల్లుకి బ్రేక్!

జగన్ ప్రభుత్వానికి మండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లును ఎలాగైనాసరే ఆమోదించుకోవాలనుకున్న వైసీపీ సర్కారుకు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి, బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీ వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. మంగళవారం రూల్ 71తో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేసుకున్న ప్రతిపక్ష టీడీపీ తాను అనుకున్నట్లుగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో సక్సెసైంది. దాంతో, మూడు రాజధానుల ప్రక్రియ మూడు నెలలపాటు ఆగిపోనుంది.  ఎందుకంటే, ఏ బిల్లు అయినాసరే సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తే ఆ ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లు సెలెక్ట్ కమిటీ వెళ్లకుండా చేయాలని జగన్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా వీగిపోయినా ఫర్వాలేదని ప్రభుత్వం భావించింది. కానీ వైసీపీ సర్కారు వ్యూహాన్ని టీడీపీ తెలివిగా దెబ్బకొట్టింది. దాంతో, ఆగమేఘాల మీద రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ముగించాలనుకున్న జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. అనేక పరిణామాలు, అత్యంత ఉత్కంఠ మధ్య మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసనమండలి నిర్ణయం తీసుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాదాపు 20మంది మంత్రులు మండలికి రావడమే కాకుండా, బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష టీడీపీ పైచేయి సాధించింది. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంతో వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు కౌన్సిల్ గ్యాలరీలోనే కూర్చున్న చంద్రబాబు.... టీడీపీ ఎమ్మెల్సీలను గైడ్ చేస్తూ... రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చక్రం తిప్పారు. అయితే, ఓటింగ్ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు లాగేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఏకంగా 20మందికి పైగా మంత్రులు కౌన్సిల్ కు రావడమే కాకుండా అత్యధిక సమయం మండలిలోనే గడిపారు. పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన సైతం చేయడంతో కొద్దిసేపు మండలిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించడంతో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.  

అమరావతి పై దాఖలైన 5 పిటీషన్ ల పై విచారణలు చేపడుతున్న హైకోర్ట్...

ఏపీ హైకోర్టులో అమరావతి పై దాఖలైన పిటిషన్ లపై విచారణ మొదలైంది. కర్నూలుకు హై కోర్టు తరలింపు సవాల్ చేస్తూ మొదటి పిటిషన్, మూడు రాజధానుల నిర్ణయం పై 37 మంది రైతుల పిటిషన్ వేశారు. సీఆర్డీఏకు రైతులు ఇచ్చే వినతి గడువు పెంచాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు పై ఇంకో పిటిషన్, సీఆర్డీయే రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై నాలుగో పిటిషన్ ఇలా దాఖలైన  పిటిషన్ల పై ఏపీ హై కోర్టు విచారణ చేపట్టింది.ఏపీ హై కోర్టులో అమరావతికి సంబంధించి ఐదు కీలకమైన 5 పిటిషన్ ల మీద  హై కోర్టు విచారణను చేపట్టింది. ప్రధానంగా  కర్నూల్ కి హై కోర్టు తరలింపు విషయంలో న్యాయవాదులు స్థానికంగా ఉన్న  రైతులందరూ  హైకోర్టును తరలించటానికి వీల్లేదంటూ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు.రెండువ పిటీషన్ రాజధాని నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 37 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ లను దాఖలు చేశారు. సీఆర్డీయేకి రైతులిచ్చే వినతి గడువు పెంచాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పోలీసుల మీద కావచ్చు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ పోలీసు యాక్టు 30 అమలును కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. మరో పిటిషన్ ను నిన్న అర్థరాత్రి సమయంలో సీఆర్డీయేను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ మరో పిటిషన్ ఇంకో ఇద్దరు రైతులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు కీలకమైనటువంటి పిటిషన్ ల మీద హై కోర్టు న్యాయ స్థానంలో విచారణ చేపడుతున్నారు. ఈ కేసుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేదాని  పై సర్వత్ర ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నదని సమాచారం.

కొనసాగుతోన్న మండలి ఉత్కంఠ... టీడీపీ నెక్ట్స్ స్టెప్ అదేనా?

మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మండలిలో మూడు రాజధానుల బిల్లును టీడీపీ వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో తర్వాత జరుగుతోందన్న టెన్షన్ అధికార పార్టీని వెంటాడుతోంది. మండలిలో ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంలో విజయవంతమైన తెలుగుదేశం... మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే... వాటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆ మేరకు ఇఫ్పటికే నోటీసులు కూడా ఇఛ్చారు.  అయితే, తాము మంగళవారం సాయంత్రమే మండలిలో బిల్లులను ప్రవేశపెట్టామని మంత్రి బొత్స చెబుతున్నారు. మంగళవారమే మండలిలిలో బిల్లులను ప్రవేశపెట్టేశామని ప్రభుత్వం చెబుతుండటంతో... టీడీపీ కూడా తెలివిగా కౌంటరిస్తోంది. తాము కూడా మంగళవారం ఉదయమే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఏదిఏమైనాసరే, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం మినహా మరో గత్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. మొత్తానికి, మూడు రాజధానుల బల్లుపై మండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి, రూల్ 71ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చి మండలిలో ప్రభుత్వానికి షాకిచ్చిన టీడీపీ... నెక్ట్స్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఇక బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కాంగ్రెస్ అభ్యర్థి కొరకడం కలకలం రేపింది. 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కొరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇమ్రాన్ ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో జగన్ కు 32వేల ఎకరాలు..? త్వరలో ఆధారాలు...!

ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో 32వేల ఎకరాల భూమి ఉందంటూ ఆరోపణలు చేశారు. బినామీల పేరుతో జగన్మోహన్ రెడ్డి... ఈ భూములు కొనుగోలు చేశారని అన్నారు. ఆ భూముల విలువ పెంచుకోవడానికే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చారని తులసిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బినామీ పేర్లతో ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసిన భూముల వివరాలను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే జగన్ ఈ భూములను కొనుగోలు చేశారని తులసిరెడ్డి అన్నారు. విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఆస్తులను జగన్ కూడబెట్టుకున్నారని, ఆ భూములపై ప్రేమతోనే రాజధానిని మార్చుతున్నారే తప్ప... ఉత్తరాంధ్రపై ప్రేమతో కాదని అన్నారు. అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పుంటే... వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఇప్పుడైనాసరే, జగన్మోహన్ రెడ్డి నిజంగా మొనగాడయితే... అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. లేకపోతే మోసగాడిగానే మిగిలిపోతారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.  

మూడు రాజధానులపై... వైసీపీ నేతల్లోనూ వ్యతిరేకత..!

కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం... అన్నట్లుగా వైసీపీ, టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల పరిస్థితి. ఎందుకంటే, మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపమన్నట్లుగా ఉందని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటును వైసీపీ, టీడీపీల్లో కొందరు స్వాగతిస్తుంటే... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ఒకటున్నా... మూడున్నా... ముప్పై ఉన్నా... తమకు ఒరిగేదేమీ ఉండదని సామాన్య ప్రజలు భావిస్తున్నారని కిందిస్థాయి వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం తమకేమిచ్చిందని మాత్రమే ప్రజలు చూస్తున్నారే తప్ప.... ఈ రాజధానుల గొడవను వాళ్లు పట్టించుకోవడం లేదని విశాఖ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తాను తీసుకోబోయే నిర్ణయాలపై కిందిస్థాయి నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అధికార పార్టీయైనా, ప్రతిపక్ష టీడీపీయైనా... అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం తప్ప... కిందిస్థాయి లీడర్లు ఇంకేం చేయగలరని వాపోతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీలోనూ చాలామందికి ఇష్టంలేదని, కానీ అధిష్టానం ఆదేశాల మేరకు ర్యాలీలు చేయడం, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నామని వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు.  ఇక, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రతిపక్ష టీడీపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతి మాత్రమే ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు అంటుంటే, విశాఖ ద్వితీయశ్రేణి తెలుగుదేశం నేతలు మాత్రం... వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా బలంగా సమర్ధిస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనలపై చర్చించుకుంటున్నారే తప్ప, ఎవరూ సమర్ధించడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ రాజధాని రైతుల ఆందోళనల్ని సమర్ధిస్తే... ఉత్తరాంధ్ర ద్రోహులుగా వైసీపీ నేతలు విమర్శిస్తారనే భయం కూడా విశాఖ టీడీపీ నేతలను వెంటాడుతోంది. అదే సమయంలో మూడు రాజధానులను సమర్ధిస్తే... పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లు అవుతుందని భయపడుతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర ఎంతోకొంత అభివృద్ధి చెందుతుందని టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. విశాఖతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అంటున్నారు.  అయితే, మూడు రాజధానుల నిర్ణయం కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా... మరికొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉన్నా... తమతమ పార్టీల నిర్ణయాలపై అభ్యంతరం చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. మొత్తంమీద మూడు రాజధానులపై అటు అధికార వైసీపీ... ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.

పరిపాలనా రాజధానిపై విశాఖ వాసుల భిన్నాభిప్రాయాలు

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ప్రకటించడంపై విశాఖ వాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేయడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అదే సమయంలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ లో అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదని మరికొందరు అంటున్నారు. అసలు పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యంకాదని కొందరు అంటుండగా... రాజధాని అనే పేరే విశాఖ నగరం మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.   ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ నగరానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని... దాంతో, ఇప్పుడు కొత్తగా జరిగే అభివృద్ధి ఏముంటుందని అంటున్నారు. పరిపాలనా వికేంద్రీకరణతో పాలనా సౌలభ్యమే తప్ప... అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటేనే తప్ప... ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా ఉండవని అంటున్నారు. కేవలం పాలనకే విశాఖను పరిమితం చేయకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ నగరానికీ లేనన్ని ప్రత్యేకతలు విశాఖకు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. ముఖ్యంగా పర్యాటకరంగంపై దృష్టిపెడితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. టూరిజం, ఫుడ్, కన్-స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా రంగాలపై మరింత ఫోకస్ పెడితే ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయని... ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు. విశాఖ బ్రాండ్ ను సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు. అలాగే, ఒక్క విశాఖకే అభివృద్ధిని పరిమితం చేయకుండా... అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు. అయితే, అభివృద్ధి అంటే కేవలం భవనాలు, కార్యాలయాలే కాదని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు.

బీజేపీ నేతలతో మరోసారి భేటీ కానున్న జనసేనాని.. ఏం జరగబోతోంది?

పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన ఏపీలో  హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల వ్యవధి లోనే మరోసారి బీజేపీ పెద్దలతో భేటీ చర్చనీయాంశమైంది. జనసేన అధినేత హస్తినకు వెళ్ళడంలో ఆంతర్యమేంటని, రాజధాని మార్పు ఉండదన్న పవన్ ధీమా వెనక కారణమేంటన్న చర్చ అందరిలో మొదలైయ్యింది.బిజెపి నేతలు పవన్ తో ఏ అంశాల పై చర్చించనున్నారు, అమరావతి పై ఇరు పార్టీల కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజధాని వాసులు.రాజధానిగా అమరావతికి  జై కొట్టాయి బిజెపి జనసేన. ఈ నేపధ్యంలో మిత్రపక్షాలైన ఇరు పార్టీలూ క్యాపిటల్ ఇష్యూపై ఎలా ఉద్యమించాలి, చేపట్టాల్సిన ఆందోళనలపై చర్చించ నున్నట్లు సమాచారం. ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఢిల్లీ లోనే ఉండడంతో అక్కడి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం.రాజధాని మార్పు భవిష్యత్ కార్యాచరణతో పాటు పొత్తుకు సంబంధించిన పలు కీలక అంశాల పై కమలం పార్టీ అగ్రనేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. రాజధాని మార్పు అంశం ఏపీని కుదిపేస్తోంది. వైసీపీ సర్కారు ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని పై రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో అట్టుడికిపోతున్నాయి. 36 రోజులుగా భూములిచ్చిన రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు.రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని ఎక్కడికి వెళ్ళదని అమరావతి లోనే ఉంటుందని, జగన్ సర్కారును కూల్చడమే తన లక్ష్యమని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఎలా ముందుకెళ్తారోనని వారి సమస్యకి కనీసం ఏదైనా ఉపశమనం దొరుకుతుందేమో అని రాజధాని రైతులు ఎదురు చూస్తున్నారు. 

మరో షాకిచ్చిన వైసీపీ.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు తీర్మానం

రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కి పాల్పడ్డారని ప్రతిపక్ష టీడీపీపై.. అధికార పార్టీ వైసీపీ పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాటలు చెప్పడం కాదు.. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగితే రుజువు చేయాలనీ టీడీపీ నేతలు సవాలు సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలకపరిణామం చోటు చేసుకుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు అసెంబ్లీ తీర్మానం చేసింది. సభలో ఈ తీర్మానాన్ని హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపిన ఆమె... దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇక, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 4070 ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపి, దీనికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. 

టీడీపీ దూకుడు... ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు!!

రూల్ 71 నోటీసు పై జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన టిడిపి ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాద్ రెడ్డిలపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకూ టిడిఎల్పీ సిద్ధమైంది. విప్ దిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని టీడీఎల్పీ కోరనున్నట్లు సమాచారం. నిన్న రూల్ 71 చర్చలో భాగంగా చేపట్టన డివిజన్ తరువాత జరిగినటువంటి ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ఆ ఇద్దరు సభ్యుల పై కూడా చర్యలు తీసుకోవాలని నిన్ననే తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వాళ్ళ పై చర్యలు తీసుకుకోవాలని ఒక లేఖను కూడా మండలి ఛైర్మన్ కి అపీల్ చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ వెంటనే చర్యలకు దిగింది. ఇద్దరి ఎమ్మెల్సీల పై వేటు వేయాలని వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని మండలి ఛైర్మన్ కి ఇప్పటికే అపీల్ చేశారు. తద్వారా ఈ రోజు బిల్స్ పై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఓటింగ్ ప్రక్రియలో ఇతర ఎమ్మెల్సీలు ఎవరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ విధానానికి విప్ కి భిన్నంగా వ్యవహరించకూడదన్న ఆలోచనలో భాగంగానే వెంటనే చర్యలకు దిగినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించకూడదన్న ఆలోచనలో భాగంగానే విస్తృతంగా చర్యలకు దిగినట్లుగా సమాచారం.

జగన్ కి షాక్.. సీఆర్డీయే రద్దు అంశంపై హైకోర్టులో పిటిషన్లు

సీఆర్డీయే రద్దు బిల్లు పై మండలిలో ఓ వైపు రగడ నడుస్తోంటే మరోవైపు దానిపై హై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ బిల్లు ఆపేయాలంటూ రెండు పిటిషన్ దాఖలు చేశారు. దీని పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజధానికి సంబంధించిన 37 మంది రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ కూడా పిటిషనర్ లు దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఈ రోజు కానీ రేపు కాని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని తాము హైకోర్ట్ ని ఆశ్రయించామని రైతులుతెలియజేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న దాని పట్ల హై కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతిలోనే నిర్మిస్తారన్న మేరకు తాము భూములన్నీ ఇచ్చామని వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మరో రెండు రాజధానుల ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సవాల్ చేస్తూ హైకోర్టులో  మొత్తం 37 మంది రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు. నిన్న సీఆర్డీఏను కూడా రద్దు చేసినట్లు బిల్లుని పాస్ చేయటంతో సీఆర్డీఏ రద్దు చట్ట విరుద్ధమంటూ కూడా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం మీద ఈ పిటిషన్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ హై కోర్టులో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైకోర్ట్ లో సీఆర్డీఏ బిల్లు పై ఏ విచారణ జరగనుందో వేచి చూడాలి.

సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్... వీళ్ల కంటే వీధి రౌడీలు బెటర్‌ 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు సభలో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఓవైపు రైతు భరోసా కేంద్రాలపై సభలో చర్చ కొనసాగుతుండగా.. మరోవైపు టీడీపీ సభ్యులు అమరావతి కోసం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ సభ్యులు జై అమరావతి, జైజై అమరావతి నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. దీంతో మరోసారి టీడీపీ సభ్యులపై  స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే సలహాలు ఇవ్వాలి... చేతకాకపోతే సభ బయట ఉండాలని సూచించారు. స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కావడంలేదని అన్నారు. సభ్యులు స్పీకర్‌ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌ను పెట్టి సభ్యులను బయటకు పంపాలని స్పీకర్ కి సూచించారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాలా బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో జోరుగా సాగుతున్న మున్సిపల్ పోలింగ్...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్  కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మన్సిపాల్టీలు 9 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,961 పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 11,179 మంది కౌన్సిలర్ అభ్యర్ధులు 1747 మంది కార్పొరేటర్ అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1240  మంది ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.120 మున్సిపాలిటీలో 25,14600 పురుష ఓటర్లు, ఇరవై లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది మహిళ ఓటర్లు ఉన్నారు.ఇక 9 కార్పొరేషన్ లలో 6,66,900 మంది పురుష ఓటర్లు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు మంది మహిళ ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ సమీపం లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ స్టేషన్ వద్ద ఇరు పార్టీ లకు చెందిన కార్యకర్తలు తన్నుకొన్నారు. డబ్బులు పంచుతున్న వారిని మరో పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలకు నోట్లు పంచుతుండగా పట్టుకొని చితకబాదారు.పోలీసులు కూడా భారీ బందోబస్తులను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్స్ ఉంటే లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు. ఒకరు ఓటేసిన తర్వాత ఒకరు ఓటేసేలా అవకాశమిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ ఉన్న వారికి పూర్తిగా ఆధార్ కార్డు అదే విధంగా ఓటరు కార్డు ఎందుకంటే ఇక్కడ మీర్పేట్ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం కొంత మేర గొడవలయ్యాయి. దొంగ ఓట్లు నమోదు చేసినట్లు సమాచారం.పోలీసులు తక్షణమే అనుమానితుల్ని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆధార్ కార్డు ద్వారా  స్పష్టతవచ్చాకే అందరిని పోలింగ్ కేంద్రాలకు పోలీసులు అనుమతిస్తున్నారు.మొత్తం మీద పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి తప్పుడు చర్యలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు చేపట్టారు అధికారులు. 

సభలో స్పీకర్ హోదాను మరచిన తమ్మినేని...

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఆయన ప్రవర్తించిన తీరు పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వ, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాల నడుమ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వరుసగా రెండు రోజులు ఆయన విపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు. స్పీకర్ స్థాయిని సైతం మరిచిపోయి ప్రతిపక్షాల పై ఆగ్రహంతో అరుస్తూ ఊగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఐదు సార్లు టిడిపి తరఫున ఎన్నికై మూడు పర్యాయాలు మంత్రిగా పని చేసిన సుదీర్ఘ అనుభవం కూడా ఆయనకుంది. 2013 లో వైసీపీలో చేరి, 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, 2019 లో ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయ్యారు. అయితే స్పీకర్ గా ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలో తెలుగుదేశం సభ్యులకు మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదన్న ఆరోపణలను ఆయన తరచూ ఎదుర్కొంటున్నారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భం గానూ మరుసటి రోజున ఎస్సీ కమిషన్ బిల్లు సందర్భం గానూ ఆయన తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఏపీ శాసన సభ సమావేశాలు రెండోవ రోజున ప్రారంభమైనపుడు ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు అడ్డు తగిలినా టిడిపి ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకు వెళ్లి జై అమరావతి అంటూ నినాదాలిచ్చారు. టిడిపి సభ్యులు స్పీకర్ చైర్ ను అవమానిస్తున్నారని ఈ పరిస్థితుల్లో తాను సభ నడిపించలేనని ఆయన ఆగ్రహం చెందారు. విపక్షాలకు ఉన్న సంఖ్యాబలంతో పోలిస్తే తాను అధిక ప్రాధాన్యమిస్తున్నామని అయినా చైర్ ను అవహేళన చేస్తున్నారని అంటూ సభ నుంచి విసురుగా వెళ్లి పోయారు. వాస్తవానికి తమకు సరైన అవకాశం రాని సందర్భాల్లో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తారు. ఏపీ అసెంబ్లీలో మాత్రం విచిత్రంగా స్పీకర్ బయటకు వెళ్లిపోయారు.  సోమవారం కూడా సభలో స్పీకర్ తీరు విపక్షాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన తరువాత ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం గుట్టు తేల్చాలని భూ కొనుగోళ్ల పై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ముఖ్యమంత్రి జగన్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. దీనిపై టిడిపి సభ్యులు అభ్యంతరం తెలిపుతూ అలా ఆదేశాలు జారీ చేసే ముందు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు వైజాగ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ వాదన వినకుండా ఏక పక్షంగా ఆదేశాలు జారీ చేయటానికి మీకు ఏమి అధికారముందని స్పీకర్ ను విపక్షాలు ప్రశ్నించగా దీంతో తమ్మినేని మండిపడ్డారు. గట్టిగా ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడుని ఉద్దేశించి సెన్సాఫ్ హ్యూమర్ ఉందా, ప్రతిపక్ష సభ్యులు హద్దులు దాటుతున్నారు అని అన్నారు. ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు నాకు లేదంటారా, డోంటాక్ రబీష్ అని విరుచుకుపడ్డారు. బొత్సకు మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసే అధికారం తనకు ఉందో లేదో చెప్పాలని అడిగారు. పైగా త్వరలో మంత్రిగా వచ్చి చూపిస్తానంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు. పైగా ఏయ్ ఆగవయ్య,సమయం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తా అంటూ  అంటూ విపక్ష సభ్యుల పట్ల ఏకవచన సంబోధన అందరినీ ఆశ్చర్యపరిచింది. సభ ప్రారంభం నుంచే స్పీకర్ తమ్మినేని తమ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద స్పీకర్ స్థాయిలో ఉండి సమస్యలను సామరస్యంగా తేల్చాల్సిన తమ్మినేని ఇలాంటి సమస్యలకు తావునివ్వడం సమంజసం కాదని కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన.

జనసేనానికి చుక్కలు చూపిస్తోన్న ఫేక్ లేఖలు...

ఫేక్ న్యూసులు రావడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఇవి రాజకీయాలల్లో వస్తుంటే నేతల సైతం ఏది నిజమే ఏది అబద్ధంమో తెలియక తలలు పట్టుకుంటూన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న లేఖలు జనసేన నేతల్ని హడలెత్తిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ విషయంలోనూ తాజాగా ఇదే జరిగింది. మూడు రాజధానుల విషయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించి అసెంబ్లీలో ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడినందున రాపాకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ సంతకంతో ఉన్న పార్టీ లేఖ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.  వాస్తవానికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడాలని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కానీ అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు రాపాక. ఇది జనసేన వర్గాలకు నచ్చలేదు. రాపాక తీరు పై పార్టీ కూడా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంతలోనే రాపాకను సస్పెండ్ చేస్తూ లేఖ రావడంతో కలకలం రేగింది. అధ్యక్షుడు వద్దన్నా సర్కారుకు అనుకూలంగా మాట్లాడినందున రాపాక మీద వేటు పడుతోందని అంతా ఊహించారు. అదే సమయంలో జనసేన పార్టీ లెటర్ హెడ్ పై పవన్ సంతకంతో ఉన్న లేక కావడంతో అంతా నిజమే అని భావించారు.ఈ లేఖ నెట్ లో విస్తృతంగా ప్రచారమవుతొంది. దీంతో పార్టీ మీడియా సెల్ ఆ లేఖను ఫేక్ గా తేల్చుతూ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. గతంలోనూ పలుమార్లు జనసేన పేరుతో ఫేక్ లెటర్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి.ఇలా లెటర్లు వచ్చి రాగానే వాటిపై అనుకూల ప్రతికూల పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. వీటి వల్ల నష్టం కూడా ఉండటంతో నష్ట నివారణ చర్యలు తీసుకుని పార్టీ మీడియా సెల్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. జనసేన కు, పవన్ కల్యాణ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేసే బృందాలు బలంగానే ఉన్నాయి. కొందరు పవన్ అభిమానుల అత్యుత్సాహంతో ఇలాంటి ఫేక్ లెటర్స్ విడుదల చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఫేక్ దాడి తట్టుకోలేకపోతున్న జనసేన హైదరాబాద్ లో పోలీసులను కూడా ఆశ్రయించింది. అయినా లాభం కనిపించడం లేదు. ఈ ఫేక్ పోస్టులన్నీ పార్టీ రాజకీయ విధానాన్ని నిర్దేశించేవి నిర్ణయించేవి కావడంతో జనసేన తల పట్టుకొంటోంది. వాటి మీద వ్యక్తమయ్యే అభిప్రాయాలు నష్టం కలిగిస్తాయనే ఆందోళన కూడా ఉంది. ఇలాంటి లేఖలు ఎక్కడ నుంచి వచ్చాయో ఐపీ అడ్రస్ ద్వారా తెలుసుకోవచ్చు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవచ్చు, అయితే ఫేక్ లేఖలు రిలీజ్ చేస్తుంది ఎవరో అందరికీ తెలుసుననే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అంశాల పై పవన్ ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.

అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీడీపీ...

ఏపీ శాసన మండలిలో టీడీపీ సభ్యుల వాదనే నెగ్గింది. రూల్ 71 పై చర్చకు చైర్మన్ షరీఫ్ అనుమతించారు.అంతకుముందు గందరగోళ పరిస్థితుల నడుమ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే ఉపసంహరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీయే ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రులు ప్రవేశ పెట్టిన బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చైర్మన్ ప్రకటించారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. రూల్ 71 పై చర్చకు నోటీసిచ్చిన బిల్లులను పరిగణలోకి తీసుకోవడం పై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ రూల్ 71 పై చర్చ ప్రారంభించాలని సూచించారు. టిడిపి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ చర్చను ప్రారంభించారు. ఏపీ శాసన మండలిలో రూల్ 71 కింద వైసిపి ప్రభుత్వాని టిడిపి ఇరుకున పెట్టింది. వికేంద్రీకరణ బిల్లునూ మండలిలో ఆమోదించాలని భావించిన వైసిపికి షాకిచ్చింది. రూల్ 71 ను తెరపైకి తీసుకు రావడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. రూల్ 71 అంటే ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓ ప్రభుత్వ పాలసీని రూల్ 71 కింద వ్యతిరేకించే హక్కు విపక్షానికి వుంది. రూల్ 71 కింద మంత్రిత్వ శాఖ పాలసీని వ్యతిరేకిస్తూ విపక్షం తీర్మానమివ్వవచ్చు, ఈ తీర్మానానికి 20 మంది సభ్యుల మద్దతు ఉంటే శాసన మండలి చైర్మన్ అనుమతితో సభలో దాని పై చర్చ జరగాల్సి ఉంటుంది. సెక్రటరీ ద్వారా రూల్ 71 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానం ఆర్డర్ లో ఉంటే దానిని చైర్మన్ చదివి వినిపిస్తారు. దీనికి 20 మంది సభ్యుల మద్దతు ఉంటే దానిని అదే రోజు లేదా సభ నిరవధిక వాయిదా పడేలోపు దానిపై చర్చించాల్సి ఉంటుంది. కానీ 20 మంది సభ్యుల కంటే తక్కువ మంది మద్దతు పలికితే దానిని తోసిపుచ్చి అధికారం చైర్మన్ కుంటుంది.  ప్రస్తుతం టిడిపి కూడా ఇదే రూల్ 71 కింద తీర్మానమిచ్చింది, ప్రభుత్వ పాలసీ అయినా వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ తీర్మానం ఇచ్చింది. దీంతో రూల్ 71 పై చర్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు శాసన మండలి ప్రసారాలను నిలిపి వేయడం పై టిడిపి అభ్యంతరం తెలిపింది. మండలి చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు యనమల రామకృష్ణుడు. తన ఆదేశాలు లేకుండా ప్రసారాలు నిలిపివేయడం పై చైర్మన్ షరీఫ్ విస్తుపోయినట్లు తెలుస్తుంది. తక్షణమే ప్రసారాలు పునరుద్ధరించాలని చైర్మన్ రూలింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, బిల్లులు పాస్ అవుతాయా లేదా అనే అంశం పై ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే ఆలోచనలో టిడిపి ఉంది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపితే జాప్యం జరిగే అవకాశముంది.సెలెక్ట్ కమిటీలో నిర్ణయానికి గరిష్ఠంగా మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద టీడీపీ చర్యలతో అధికార పక్షానికి గట్టి దెబ్బ ఎదురైయ్యింది.

శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసిన అధికార పక్షం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు తలుపులు మూసేసి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి విభజన చట్టాన్ని ఆమోదించామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి అక్కడ ఏం జరిగిందో రికార్డులు కూడా లేవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు విభజన రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టులో పిటిషన్ లు వేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి శాసన మండలిలో ఆమోదించుకోవటానికి ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసింది. లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియనివ్వకుండా అధికార పక్షం వ్యవహరిస్తోంది. రూల్ నెంబరు 71 ప్రకారం అసలు వికేంద్రీకరణ చట్టాన్ని చర్చ చేపట్టకుండానే తిరస్కరించటానికి టిడిపి ప్లాన్ సిద్ధం చేసింది. ఈ కారణంగానే లోపల గందరగోళం ఏర్పడింది.  రూల్ నెంబరు 71 గురించి ఏమాత్రం ఊహించని వైసిపి మండలి ప్రసారాలను వెంటనే నిలిపివేయించింది. మండలి సభ్యులు కాని 14 మంది మంత్రులు శాసన మండలికి వచ్చారు. వారందరూ మండలి చైర్మన్ పై వత్తిడి తెచ్చారు. మండలిని రద్దు చేస్తామని అలాగే ఎమ్మెల్సీలకూ ప్రలోభాలు కూడా చూపిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించారు. ఎలాగైనా బిల్లును ఆమోదించకున్నా అనిపించుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఎప్పుడూలేని విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మండలి గ్యాలరీలో ఉదయం నుంచి ఉన్నారు. వివిధ సందర్భాల్లో వారు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.మండలి ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసిన ప్రభుత్వం లోపల జరుగుతున్న వాటి పై గందరగోళ సమాచారాన్ని బయటకు పంపుతుంది. బిల్లులూ మండలిలో ప్రవేశపెట్టారని రూల్ 71 పై చర్చ తర్వాత వికేంద్రీకరణ బిల్లుపై దృష్టి సారిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిడిపి మాత్రం అలాంటిదేం జరగలేదని , మండలి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం లేకపోవటంతో ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేయడం పై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు ఏం చూడకూడదని ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారని టిడిపి ప్రశ్నిస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంలో అధికార పక్షం ఏదైనా వ్యూహం వహిస్తొందా లేక ఎందుకు నిలిపివేశారు అన్న అంశం పై తీవ్ర చర్చ నడుస్తొంది.

గోళ్లతో గిచ్చి...చొక్కా చింపారు... పోలీసుల దాష్టీకంపై గల్లా ఆవేదన...

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అరెస్టై జైలుకెళ్లిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ లభించింది. 10వేల రూపాయల పూచీకత్తుపై మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో, గుంటూరు సబ్ జైలు నుంచి జయదేవ్ విడుదల అయ్యారు. జైలు నుంచి రిలీజైన గల్లా జయదేవ్... పోలీసులు తన యెడల ప్రవర్తించిన తీరును మీడియాకి వివరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులే తమతో దురుసుగా ప్రవర్తించారని గల్లా జయదేవ్ అన్నారు. మహిళలు, వృద్ధులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంతో తాను అక్కడ బైఠాయించానని, దాంతో పోలీసులు తనపైకి దూకుడుగా వచ్చారని అన్నారు. అయితే, పోలీసుల లాఠీఛార్జ్ నుంచి మహిళలు, రైతులే తనను కాపాడారని గల్లా జయదేవ్ తెలిపారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో ప్రణాళిక ప్రకారమే దాడి చేయిస్తున్నారని గల్లా జయదేవ్ ఆరోపించారు. పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, తన చేతులు వెనక్కిలాగిపట్టి గోళ్లతో గిచ్చి... చొక్కా చింపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తర్వాత తనను అదుపులోకి తీసుకుని దాదాపు 15 గంటలపాటు పోలీస్ వాహనంలో తిప్పి ఇబ్బంది పెట్టారని అన్నారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలాగుంటే... ఇక సామాన్యులతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుందన్నారు. తనకు 149 సెక్షన్ కింద నోటీసు ఇవ్వలేదని, తన ఇంటికి కూడా నోటీసులు అంటించలేదని, అందుకే తాను శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ముందుకొచ్చానని, కానీ పోలీసులు మాత్రం వైలెంట్‌గా ప్రవర్తించారన్నారు. ఒకానొక దశలో ఎస్పీ తనను కొడతారని భయపడ్డానని, ఎస్పీ చేతిలో లాఠీ ఉందని జయదేవ్ అన్నారు. వైద్య సదుపాయం కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు జీపులోనే వైద్య పరీక్షలు చేసి...జైలుకి పంపారని మండిపడ్డారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే...సామాన్యుల పరిస్థితి ఏంటని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. పోలీసులు గిచ్చుతున్నారంటే ఏంటో అనుకున్న....ఇప్పుడు తనకు బాగా తెలిసిందని జయదేవ్ అన్నారు. పోలీసులపై ఎవరూ రాళ్లు వేయలేదని, పోలీసులే వాళ్లపై మట్టిపెళ్లలు వేసుకుని కావాలని లాఠీఛార్జ్‌ చేశారని గల్లా జయదేవ్ తెలిపారు.