వచ్చే ఏడాది ఆర్ధిక బడ్జెట్ అయినా తెలంగాణ ప్రభుత్వం చేరుకోగలదా...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడాది కూడా సవరించిన అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కారణంగా మొదట ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం కారణంగా 1,46,000 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రకటించారు. ఇది అంతకుముందు ఏడాది అంచనాల కంటే 35000 కోట్లు తక్కువే. అయితే, సవరించిన అంచనాలను కూడా ఇప్పుడు చేరుకోలేని పరిస్థితి ఉన్నట్లు సమాచారం.సవరించిన అంచనాలలో 10,000 కోట్లను భూముల అమ్మకం సమకూర్చుకుంటామని తెలిపారు. కానీ సాంకేతిక కారణాలతో ఒక్క ఎకరం భూమి కూడా అమ్మలేకపోయారు. దీంతో అంచనాలు చేరుకోవడం కష్టమేనని అంటున్నారు.భూముల అమ్మకం కాకుండా ఇతర ఆదాయ మార్గాల లోనూ కోత పెడుతోంది. జీఎస్టీ తో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది మద్యం షాపుల దరఖాస్తుల వేలం ద్వారా సుమారు 10,000 కోట్ల సమకూరాయి.  మద్యం ధరల పెంపకం మద్యం షాపుల టెండర్ల వల్ల కూడా ఆదాయం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. రవాణా రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయం కూడా లాభసాటి గానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయన జీఎస్టీ భారీగా పడిపోవటం వల్ల అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు.ఫిబ్రవరి 3డవ వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సారైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ అంచనాల్లో రూపొందించాలని భావిస్తున్నారు. అన్ని శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ చేరాయి. దీని పై మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ బడ్జెట్ రూపకల్పనపై సమీక్ష చేసే అవకాశముంది.ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో గత ఏడాది అంచనాలూ చేరుకోలేకపోయారు దీంతో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు పంపాల ని సూచించినట్టు తెలిసింది ఆర్థిక మాంద్యం ప్రభావం కొత్త ఆర్థిక సంవత్సరం లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గత ఏడాది కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.2020-2021 బడ్జెట్ లో పన్నుల మోత పడే అవకాశముంది. పన్నులు పెంచి ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడ్డ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచారు. అన్ని రకాల ఎన్నికలు ముగిసినందున అవకాశం ఉన్న చోట అల్లా పన్నుల బాదే అవకాశముంది. భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ర్టేషన్ల ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. విద్యుత్ చార్జీలు కూడా పెంచి ఆ శాఖకు అందించే సహాయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఎంత మేరా తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక బడ్జట్ ను చేరుకోగలుగుతుందో వేచి చూడాలి.

మండలి రద్దు ఆలోచనపై మేధావులు ఏమంటున్నారు?

శాసనసభలో జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, మేధావులు మాత్రం మండలి రద్దు దిశగా ఆలోచన చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమల్ని తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, కానీ, పూర్తిగా అడ్డుకోలేరని గుర్తుచేస్తున్నారు. మరి, ఇంత చిన్నదానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మండలి ఉండాలా? వద్దా? అవసరమా? కాదో? చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ అంటున్నారని, అయితే... ప్రభుత్వాధినేతగా కౌన్సిల్ ను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే... వైసీపీలో అడ్డుచెప్పగలవారు ఎవరున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కేవలం, మూడు నాలుగు నెలలు ఆగితే సమస్య పరిష్కారమవుతుందని... మండలిలో విపక్షానికున్న బలంతో బిల్లులు ఆలస్యమవుతాయో గానీ ఆపలేరని గుర్తుచేస్తున్నారు. అయినా, ఓ మూడు నెలలు ఆలస్యమైతే ఏమవుతుందని అంటున్నారు. ఒకవేళ మండలి రద్దుకు నిర్ణయం తీసుకుంటే... ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర పట్టొచ్చని.... ఒక్కోసారి పార్లమెంట్లో ఆమోదం పొందకపోవచ్చని గుర్తుచేస్తున్నారు. అయినా, ఒక్క ఏడాది లేదా ఏడాదిన్నర ఓపిక పడితే... మండలిలో కూడా వైసీపీకి మెజారిటీ వస్తుందని, అలాంటప్పుడు రద్దు దిశగా అడుగులు వేయడం ఎందుకంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలకు పోతే మాత్రం మండలి రద్దు జరగడం ఖాయమంటున్నారు మేధావులు. మండలిలో పరిణామాలను తనను తీవ్రంగా బాధించాయని జగన్ వ్యాఖ్యానించడంతో రద్దు దిశగా వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.... తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో ఉంటే మాత్రం మండలి రద్దు తప్పదు. అయితే, సోమవారానికి ఇంకా మూడు రోజులు సమయం ఉండటంతో ఈలోపు టీడీపీ ఎమ్మెల్సీలతో ఏమైనా లాబీయింగ్ జరుగుతుందేమోనన్న మాట కూడా వినిపిస్తోంది.

మండలిని రద్దుచేస్తే తొందరపాటు చర్యే... చీమలు పట్టాయని మొత్తం బెల్లాన్నే పడేస్తారా? 

మూడు రాజధానుల బిల్లు, అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ కౌన్సిల్ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా మండలి రద్దు దిశగా జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ సీఎం జగన్ ప్రకటించారు. మండలిలో పరిణామాలు తన మనసును తీవ్రంగా గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారని, కానీ డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు శాసనసభలో ఉండగా, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంతమంది విజ్ఞులు శాసనసభలోనే ఉండగా, ఇక మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నామని.... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో కౌన్సిల్ అవసరమా? అనేది సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. హత్య చేయడం తప్పు... అయినా చేస్తామన్నట్టుగా మండలి తీరు ఉందన్న జగన్... అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగుల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటన తర్వాత నిజంగానే మండలిని రద్దు చేస్తారా? ఒకవేళ రద్దు చేస్తే లాభనష్టాలేంటి? ఎవరికి ఎక్కువ నష్టం? రద్దుకు ఎంత టైమ్ పడుతుంది? ప్రక్రియ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఇంట్లో ఏదైనా పాడైతే... బాగు చేసుకోవాలే తప్ప... మొత్తం ఇల్లే తగలబెట్టుకుంటారా? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. చీమలు పడితే... చీమలను తీసేయాలి కానీ... మొత్తం బెల్లాన్నే పడేస్తామంటే ఎలా అంటున్నారు. మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ముగిసేపోయే సమస్యకు అంత పెద్ద నిర్ణయం ఎందుకంటున్నారు. మండలిలో విపక్షానికి బలముంటే... కేవలం మూడు నెలలు మాత్రమే ఆపగలరని, దాంతో కొంచెం ఆలస్యం అవుతుందే కానీ, పూర్తి ఆపలేరని, ఇంత దానికి, మండలిని రద్దు చేయాలన్న ఆలోచన చేయడం సరికాదని చెబుతున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం కచ్చితంగా తొందరపాటు చర్యే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

నా మనసు గాయపడింది... మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన...

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై జగన్ ప్రభుత్వం రగిలిపోతోంది. కౌన్సిల్ ఛైర్మన్ నిర్ణయంపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం... అసలు మండలిని కొనసాగిచాలో వద్దో సోమవారం నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మండలిలో జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్న ముఖ్యమంత్రి జగన్... రాజకీయ అజెండాతో నడుస్తూ... ప్రజలకు మేలుచేసే విధంగాలేని కౌన్సిల్ ను కొనసాగించాలా లేదా అన్న దానిపై సీరియస్ గా ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే... మండలిలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ అజెండాతో అడ్డుకుంటోందని మండిపడ్డారు. శాసనమండలి కేవలం సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఏర్పడిందన్న జగన్మోహన్ రెడ్డి... చట్టాలు చేయడానికే శాసనసభ ఉందని గుర్తుచేశారు. ప్రజల చేత, ప్రజల వల్లే తమ ప్రభుత్వం ఏర్పడిందని... మొత్తం 175 స్థానాలకు గాను 86శాతం మెజారిటీతో 151 సీట్లను తమకు కట్టబెట్టి శాసనసభకు పంపారని, తాము కూడా ఏడున్నర నెలలుగా ప్రజాసంక్షేమం కోసం సేవ చేస్తూ వస్తున్నామని, అయితే... తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు మండలిని రాజకీయంగా టీడీపీ వాడుకుంటోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. చట్ట సభల్లో భాగమైన మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని, కానీ కౌన్సిల్ ఛైర్మన్ దానిని వమ్ము చేశారని అన్నారు. నిష్పాక్షికంగా మండలిని నిర్వహించి పరిస్థితి కనిపించలేదన్నారు. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు... అదీకాకపోతే సవరణలు కోరుతూ తిప్పిపంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది... కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారమంటూ కౌన్సిల్‌ చైర్మన్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మండలిలో ఛైర్మన్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించిన సీఎం జగన్... నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చెప్పారని... అలాగే, బిల్లు పెట్టిన 12గంటల్లోపే సవరణలు ఇవ్వాలని, అదేవిధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే... బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా ఛైర్మన్‌ చెప్పారని, కానీ... మళ్లీ ఆయనే రూల్స్‌ను అతిక్రమించి బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించారని జగన్ మండిపడ్డారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్‌, వామపక్ష సభ్యులు ఏకీభవించినా.... సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం ఛైర్మన్ కు లేకున్నా... తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నానంటూ ఛైర్మన్‌ చెప్పడం దారుణమన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు. హత్య చేయడం తప్పు... అయినా నేను చేస్తా అన్నట్టుగా మండలి తీరు ఉందని జగన్ అన్నారు. అయితే, ఆ తప్పు చేయకుండా ఆపాలా? వద్దా? అని నేను అడుగుతున్నాంటూ జగన్ ప్రశ్నించారు. దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందన్న జగన్మోహన్ రెడ్డి.... మండలి ప్రజల కోసం నడుస్తోందా... రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్నది ఆలోచన చేయాలన్నారు. మండలి కోసం ఏటా 60కోట్లు ఖర్చు పెడుతున్నాము... అయితే, ఆర్ధిక లోటుతో నడుస్తున్న రాష్ట్రంలో శాసనమండలి అవసరమా? అనేది కూడా ఆలోచన చేయాలన్నారు.  మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని అనుకున్నానని... కానీ, తన నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వ్యాఖ్యానించారు. మరి, ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్‌గా చర్చ జరగాలన్నారు జగన్.  మేధావుల కోసం అప్పట్లో పెద్దల సభ ఏర్పాటు చేశారన్న జగన్మోహన్ రెడ్డి... డాక్టర్లు, పీహెచ్‌డీలు చేసినవాళ్లు, సివిల్‌ సర్వెంట్లు అసెంబ్లీలో ఉన్నారని, ఇంతకు మించిన మేధావులు ఇంకెక్కడ దొరుకుతారన్నారని అన్నారు. ఇంత మంది విజ్ఞులు అసెంబ్లీలోనే ఉంటే, మండలి అవసరమేముందని జగన్ ప్రశ్నించారు. మండలిలో పరిణామాలు తన మనసును గాయపరిచాయన్న జగన్మోహన్ రెడ్డి... బిల్లులు చట్టం కాకుండా అడ్డుకుంటున్న కౌన్సిల్ ను కొనసాగించాలో వద్దో సోమవారం శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదని... రాష్ట్రంలో ఎక్కడ్నుంచైనా పాలన సాగించవచ్చన్నారు జగన్. అలాగే, ఆర్టికల్‌ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ్నుంచే ప్రభుత్వం నడుస్తుందన్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని పెట్టొచ్చని, ఆ అధికారాన్ని ప్రజలే ప్రభుత్వానికి ఇచ్చారని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ మంత్రుల ఫోటోల లీక్.. ఇలా దౌర్జన్యం చేయడం కోసమే లైవ్ ఆపేశారా?

శాసన మండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలి చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేస్తున్న మంత్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మంత్రుల తీరుపై నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఫోటోలలో మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ తదితరులు.. చైర్మన్ పోడియం ముందు కుర్చీలు, బల్లలపై నిల్చొని.. వేళ్లు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయి. దీంతో ఇలా మండలి చైర్మన్ ని బెదిరించి దౌర్జన్యం చేయడం కోసమే.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారా? అంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు అయ్యుండి ఇలా కుర్చీలు, బల్లలు ఎక్కి బెదిరింపులకు పాల్పడటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

25 న ఫలితాలు... 27న మేయర్లు, చైర్మన్ల ఎంపిక!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది నగరపాలికలు, 120 పురపాలికలకు పోలింగ్ జరిగింది. 120 పురపాలక సంఘాల్లో 74.73 శాతం పోలింగ్ జరగగా.. 9 నగర పాలక సంస్థలో 58.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 7,613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు నెలకొన్నాయి. 120 మున్సిపాలిటీలలో 2,727 వార్డులకు ఇప్పటికే 80 ఏకగ్రీవం అయ్యాయి. 2,647 వార్డులకు పోలింగ్ జరిగింది. తొమ్మిది కార్పొరేషన్లలో 325 డివిజన్లకు గాను ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. 324 డివిజన్లకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రెటర్ హైదరాబాద్ శివార్లలో కార్పొరేషన్లు , మునిసిపాల్టీల్లో ఓటింగ్ శాతం తగ్గింది. దొంగ ఓట్లు పడకుండా కొంపల్లిలో తొలిసారిగా ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా వినియోగించారు ఎన్నికల అధికారులు. బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు శనివారం కౌంటింగ్ జరగబోతుబడటంతో..అభ్యర్ధుల భవితవ్యం తేలుతుంది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల అధికార పార్టీ విపక్షాలకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. నిజామాబాద్ లో 41 వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో టిఆర్ఎస్, బిజెపి నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఇరు పార్టీ నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 8 వ వార్డులో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరిని కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అక్కడ 60 కార్పొరేటర్ స్థానాలకు రెండు ఏకగ్రీవమయ్యాయి. 58 డివిజన్లకు ఈ నెల 24 న పోలింగ్ జరగబోతోంది. కరీంనగర్ లో ఈ నెల 27 న ఓట్ల లెక్కింపును చేపట్టబోతున్నారు. కాగా.. మేయర్లు, చైర్ పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం, కొత్త పాలక మండలి తొలి సమావేశం తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.

చంద్రబాబు ఫోన్ లాక్కున్న మార్షల్స్... బాలయ్యతో సెల్ఫీలకు వైసీపీ ఎమ్మెల్యేల పోటీ... 

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా సాగుతున్న సమయంలో చంద్రబాబుతోపాటు గ్యాలరీకి వచ్చిన బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు సరదాగా ముచ్చటించారు. అనంతరం, వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కాసు మహేష్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్, శ్రీనివాసులు తదితరులు బాలయ్యతో సెల్ఫీ దిగారు. దాదాపు పది పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేశారు. అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. మండలి సమావేశాలు అత్యంత ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో చంద్రబాబు కౌన్సిల్ కి వచ్చారు. అయితే, చంద్రబాబు గ్యాలరీలో కూర్చునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... సెల్ ఫోన్ ఇచ్చేయాలని మార్షల్ కోరారు. దాంతో, రూల్స్ అలాగే ఉంటే ఫోన్ తీసుకోండంటూ మార్షల్స్ ను ఇచ్చేసి గ్యాలరీలో కూర్చున్నారు చంద్రబాబు. అయితే, ఇక్కడే వివక్ష బయటపడింది. అదే మండలి గ్యాలరీలోకి పదుల సంఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వచ్చారు. అయితే, వాళ్లంతా సెల్ ఫోన్లు వినియోగించారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.   అయితే, చంద్రబాబు దగ్గర సెల్ ఫోన్ తీసుకున్న మార్షల్స్... మరి, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల దగ్గర ఎందుకు తీసుకోలేదని టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. తమకో రూల్... అధికార పార్టీకో రూలా? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై మార్షల్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పిచ్చి వేషాలు వేసినందుకే ఒకసారి దాడి జరిగింది.. మర్చిపోవద్దు ఓవైసీ!!

ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ,  టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి మద్య మాటల యుద్దం కాకరేపుతోంది. టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరోక్షంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన కొడుకు సాయిను ఉద్దేశించి అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ నుండి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఒకసారి గెలిస్తే రెండు సార్లు ఓడతారంటూ ఎద్దేవా చేశారు అక్బరుద్దీన్. ఆయన కొడుకును కూడా గెలిపించలేకపోయారన్నారు. తాను ఐదు సార్లు చాంద్రాయణగుట్ట నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నానని అన్నారు. వారికి దమ్ముంటే చాంద్రాయణగుట్ట నుండి పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు అక్బరుద్దీన్ ఓవైసీ. తాను దేశంలో ఎక్కడ నుండైనా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు అక్బరుద్దీన్. దీని పై అంతే ఘాటుగా స్పందించారు తలసాని సాయికుమార్ యాదవ్. గతంలో బుల్లెట్ దెబ్బలు తిని కత్తిపోట్లకు గురైన ఒవైసీ దేశం కోసం త్యాగం చేయలేదన్నారు సాయి. పిచ్చి వేషాలు వేయటం వల్లే నీపై దాడి జరిగిందని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మిత్రపక్షం మీద అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు సాయి యాదవ్.

ఆర్డినెన్స్ కూడా ఇవ్వలేరా? యనమల కీలక కామెంట్స్

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో ఏం చేయాలనే దానిపై జగన్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని పట్టుదలగా ముందుకెళ్లిన వైసీపీ ప్రభుత్వానికి కౌన్సిల్ లో చుక్కెదురు కావడంతో నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మూడు రాజధానుల బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై మంతనాలు జరిపారు. పార్టీ ముఖ్యనేతలతోపాటు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. అలాగే, హైకోర్టులో పెద్దఎత్తున దాఖలైన పిటిషన్లపైనా ప్రభుత్వ వాదనలు ఎలా ఉండాలన్నదానిపై ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీతో చర్చించారు. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలే కాదు... కొన్నేళ్లు కూడా పట్టొచ్చని కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలే అయినా... అవసరమైతే పొడిగించవచ్చని అన్నారు. సెలెక్ట్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందని యనమల గుర్తుచేశారు. ఈ ప్రక్రియకు ఒక్కోసారి ఏళ్లు కూడా పడతాయన్నారు. అంతేకాదు, బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి కూడా వీలు ఉండదని యనమల అన్నారు. అసలు మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదన్నారు. మరోవైపు ఆర్డినెన్సులను గతంలో రాష్ట్రపతి తిరస్కరించారని, అలాగే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా కోర్టులో నిలబడదని యనమల అభిప్రాయపడ్డారు. అలాగే, రూల్ 154 కింద మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు కూడా ప్రశ్నించలేవని యనమల అన్నారు.  

మండలిలో అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదు: సీఎం జగన్

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లుకు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. గవర్నమెంటు ప్రైమరీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం పర్సెంటేజ్ కేవలం 23.67% శాతం మాత్రమే ఉందని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. మొత్తం మీద 35% కూడా దాటని పరిస్థితి ఉందని అదే ప్రైవేట్ స్కూల్స్ లో 98.5% శాతం పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మరెన్ని సంవత్సరాలు పేదవాళ్ల చదువు అలాగే ఉండాలని..  కేవలం పేదలకు ఇంగ్లీష్ చదువులు రాకూడదన్న కుట్రపూరితమైన పరిస్థితులను మార్చాలని.. మన వ్యవస్థను మార్చాలని.. పేదవాడికి భావి ప్రపంచంలో కూడా పోటీ పడే పరిస్థితి తీసుకొని రావాలనే తాను ఎంతగానో కృషి చేయనున్నట్లు జగన్ తెలియజేశారు. నేటి తరంలో కంప్యూటర్స్ లో కానీ ఎక్కడ చూసినా ఇంగ్లీష్ భాషనే ఎక్కుగా ఉంటుందని.. మంచి జీతాలతో మంచి జీవితాన్ని గడపాలంటే ఇంగ్లీషు భాష మాట్లాడగలిగితేనే సాధ్యపడుతుందని ఆయన అన్నారు. ప్రపంచంతో తాము ముందుకు నడవాలని.. పేదరికంలో ఉన్న వాళ్ళ బ్రతుకులు బాగుపడాలని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. ఇదే బిల్లును కొద్ది నెలల కిందట తీసుకొస్తే.. రైట్ టు ఎడ్యూకేషన్ కాదు రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్న ధృడ సంకల్పంతో ఈ బిల్లును ప్రతిపాదించినట్లు జగన్ పేర్కొన్నారు. పేదవాడికి మంచి జరిగే ఈ బిల్లును ప్రతిపాదిస్తే దానిని కూడా కౌన్సిల్ లో అడ్డుకున్నారని కానీ ఈ బిల్లును ఎవరు ఆపినా ఆగేది లేదని, మధ్యాహ్న భోజన పథకం కింద మంచి మెనూను సిద్ధం చేసి దానికి గోరుముద్దా అని పేరు పెట్టి పేద పిల్లలకు అందించినట్లు స్పష్టం చేశారు.  జూన్ 1వ తేదీనే పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు, నోట్ బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, మూడు జతల యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టులు.. పెట్టి ఒక కిట్టు ఇస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా ఒక పిల్లాడి పై రూ.1355 రూపాయల కేటాయింపు చేస్తూ దాదాపుగా 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుక కింద జూన్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జగన్ తెలియజేశారు. తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకూడదని పిల్లలందరికి మామగా తాను ఈ కానుకను ఇవ్వనున్నట్లు జగన్ వెల్లడించారు. ఈ బిల్లు ఇక్కడ ఆమోదం తెలిపితే ఆపడానికి ఇంకేమి ఉండదని జగన్ తెలిపారు.

అమరావతిలో దళితుల భూములు స్వాహా.. చిక్కుల్లో టీడీపీ మాజీ మంత్రులు!!

ఓ వైపు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా తెల్లరేషన్ కార్డుదారుల భూములు కొన్న వ్యవహారం సంచలనం రేకెత్తిస్తుంటే మరో వైపు మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు నారాయణ పై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తమను బెదిరించి భూములు లాక్కున్నారంటూ బుజ్జమ్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది సీఐడీ. గుంటూరు జిల్లా , వెంకటపాలానికి చెందిన బుజ్జమ్మకు 90 సెంట్ల అసైన్డ్ భూమి ఉంది. ఆ భూమిని మాజీ మంత్రులు లాక్కున్నారని ఆరోపించింది బుజ్జమ్మ. ఆ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రులపై సక్షన్ 420,506,120/B కింద కేసు పెట్టింది సీఐడీ. మరోవైపు తన పై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ప్రత్తిపాటి పుల్లారావు. బెల్లంకొండ నరసింహారావు అనే వ్యక్తి ద్వారా బెదిరింపులకు పాల్పడి తమ వద్ద ఈ భూములను కొనుగోలు చేశారంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి కొన్ని కీలకమైన విషయాలు కూడా సేకరించినట్లు సమాచారం. అమరావతి పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి.. మొత్తం ఆరు మండలంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దళితులకు అండగా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన భూములను బలవంతంగా బెదిరించి తీసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పై సీఐడీ కేసు పెట్టడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు... బాబుతో టచ్ లో ఉన్నారు

సాధారణంగా విపక్ష ఎమ్మెల్యేలు... అధికార పార్టీతో టచ్ లో ఉండటం సహజం. వీలు కుదిరితే, అధికార పార్టీలోకి జంప్ చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీయే... రివర్స్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ గంభీరం ప్రదర్శిస్తూ ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనే చేసి ఇరకాటంలో పడ్డారు. జగన్ చేసిన ఆ ప్రకటన తర్వాతే... ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు... 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని షాకిచ్చారు. అయితే, ఇలాంటి ప్రకటనలు... మెజారిటీ ఫిగర్ కు కొంచెం అటూఇటుగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య బలాబలాలు ఉన్నప్పుడు చేస్తేనే కొంతలో కొంత నమ్మశక్యంగా ఉంటాయి. కానీ, అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ ఉన్నపుడు అలాంటి ప్రకటనలు బెడిసికొడుతుంటాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జరిగింది. అయితే, టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య ఇప్పుడు అలాంటి ప్రకటనే చేశారు. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తీరుతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని... వాళ్లంతా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని... త్వరలోనే వాళ్లు టీడీపీలో చేరతారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాబోయే కాలమంతా జగన్ కు అగ్నిపరీక్షే అన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకెళ్తోన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు తప్పవన్నారు. అయితే, వేమూరి ఆనంద సూర్య వ్యాఖ్యలు  అంత నమ్మశక్యంగా లేకపోయినా... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటనలాగే పరిగణించాల్సి ఉంటుంది.

మండలిలో విజయం గుండె ధైర్యాన్ని ఇచ్చిందంటున్న రైతులు

షరీఫ్ నినాదాలతో తుళ్లూరు మహా ధర్నా శిబిరం మారుమోగిపోతోంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు సెలెక్టు కమిటీ పంపాలన్న ఆయన నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిందంటూ రాజధాని రైతులు, మహిళలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహాధర్నా 36 రోజులను పూర్తి చేసుకుంది. నేడు 37 వ రోజు  మహాధర్నా శిబిరంలో పాల్గొన్నారు. ఇన్ని రోజులు పడిన శ్రమకు కాస్త ఉపశమనం లభించిందని అంటున్నారు రైతు జేఏసీ. తమ గోడును శాసన మండలి కనీసం ఆలకించిందని.. ఈ ఉపశమనం మాత్రం తమకు గొప్ప మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందంటున్నారు. నిన్న ( జనవరి 22వ తేదీన ) జరిగిన శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుకు తాత్కాలిక బ్రేక్ పడింది . న్యాయ పోరాటం చేయటం వల్ల న్యాయం గెలిచిందని.. ఈ ఉద్యమానికి ఇదే మొదటి విజయం అని రైతులు అంటున్నారు. ఇక్కడితో ఇది ఆగదని అమరావతి ప్రజలు వెల్లడించారు. శాసన మండలి తీర్పుతో ఉద్యమాలు చేసేవాళ్ళకి మరింత బలం చేకూరుతుందని అమరావతి ప్రజలు తెలియజేస్తున్నారు. అమరావతిని అక్కడ నుంచి కదిలివ్వమని చెప్పేవరకు న్యాయ పోరాటం సాగుతూనే ఉంటదని అన్నారు. నిన్నటి తీర్పు అందరికి గుండె నిబ్బరం, స్ఫూర్తిని నింపిందని అక్కడి ప్రజలు తెలిపారు.  

దౌర్జన్య రాజ్యం.. మండలి చైర్మన్ ను బెదిరించిన వైసీపీ నేతలు!!

తెలుగుదేశం ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ధ్వజస్థంభాల్లా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని.. వారి స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అయితే మండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. లోకేష్ పై ముగ్గురు మంత్రులు దౌర్జన్యం చేశారన్నారు. ఉన్మాదం పై పోరాడటానికి సర్వశక్తులు పెట్టాలని ధైర్యం నూరి పోశారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల రామకృష్ణుడు నిరూపించారన్నారు చంద్రబాబు. అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు రింగు దాటితే బయటపడేయాలంటూ మార్షల్స్ ను ఆదేశించిన సీఎం జగన్ మండలి లో చైర్మన్ పోడియం ఎక్కి పేపర్లు చించేసిన వైకాపా ఎమ్మెల్సీలను ఏం చేయాలో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 25 మంది మంత్రుల మండలిలో తిష్ఠవేసి వీరంగం సృష్టించారని చైర్మన్ షరీఫ్ పై దాడి చేసినంత పని చేశారని మండిపడ్డారు. చైర్మెన్ కు పిల్లలూ.. మనువళ్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఆరోపించారు.

శాసనమండలిలో ఎదురుదెబ్బ ఎఫెక్ట్... సతమతమవుతున్న వైసీపీ!!

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసన మండలి నిర్ణయంపై న్యాయ నిపుణులు, వైకాపా ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గంట పాటు సాగిన సమావేశంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి , అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం, వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందకపోవటం పై ప్రధానంగా చర్చించారు. సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం పై ప్రభుత్వ పరంగా తదుపరి వ్యూహం ఎలా ఉండాలనే అంశంపైన మంతనాలు జరిపారు. ఈ విషయంలో సీఎం జగన్ న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజధాని రైతుల పిటిషన్ పై హై కోర్టులో విచారణకు సంబంధించిన అంశం పై కూడా చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణ పై ముఖ్యనేతలతో సమాలోచనలు చేశారు. ఈసారి రాబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. ఎదురుదెబ్బలు తగలకుండా ముందుకు సాగేలా నిర్ణయాలను తీసుకోవాలని నేతలకు దిశా నిర్ధేశం చేశారు జగన్.

కొత్త చిక్కుల్లో కాంగ్రెస్... వరంగల్ జిల్లా సహకార బ్యాంకు రుణాల్లో అవినీతిపై విచారణ!!

ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పంట రుణాలు లీజుల పేరుతో 7 కోట్ల 90 లక్షల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు రెండేళ్ల క్రితం కలకలం రేపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి బ్యాంకు చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలకు గేట్లు ఎత్తారని విమర్శలు ఆనాడు చుట్టుముట్టాయి. ఆయన 2013 నుంచి 2017 వరకు బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. ఆనాటి అక్రమాల అంతు తేల్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. విచారణను సీఐడీకి అప్పగించింది. దీంతో జిల్లాలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది.  రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న కేసు ఒక్కసారిగా దుమ్ముదులపడం ఏమిటనేది మొదటి ప్రశ్న.. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది రెండో అంశంగా మారింది. సీఐడీ నెట్ పరిధిలోకి ఎవరెవరు వస్తారో అనేది మూడో ప్రశ్నగా జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు మునిసిపల్ ఎన్నికల హడావుడి నుండి ఇంకా బయటకు రాని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆదేశాల గురించి తెలుసుకొని ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఈ విచారణ ద్వారా జంగా రాఘవరెడ్డినే లక్ష్యంగా చేసుకున్నారా లేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా టార్గెట్ పెట్టారా అనేది ఉత్కంఠ రేపుతోంది.  జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవ రెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో అన్నీ తానై కాంగ్రెస్ కు వ్యవహరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు సన్నిహితుడిగా ఆయన అండదండలతో పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవరెడ్డి. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కొండామురళి, సురేఖ పేర్లు వినిపించాయి. కొండా మురళీ అనుచరుడిగానే కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారు జంగా రాఘవ రెడ్డి. కొండా దంపతులు అనేక పార్టీలు తిరిగి తిరిగి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ కాగా రాఘవ రెడ్డి మాత్రం వారితో సమానంగా రాజకీయం చేసే ఎత్తుకు ఎదిగారని పార్టీలో టాక్. ముఖ్యంగా జనగామ జిల్లాలో జంగాకు చెక్ చెప్పాలని భావిస్తున్న మంత్రి దయాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఒత్తడి తెచ్చి రాజకీయంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. జంగాకు ధీటుగా ఎర్రబెల్లి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనాలను కలుస్తున్నారు. దీంతో జంగాతో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మంత్రి ముందు గానే బ్రేకులు వేసేందుకు సిద్ధపడ్డారని జనాల టాక్. ఒక్క జంగానే కాదు సీఐడీ విచారణ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ టీఆర్ఎస్ ఝలక్ ఇవ్వబోతున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆది లోనే వారి దూకుడుకు బ్రేక్ వేయాలన్న చూస్తోంది అధికార పార్టీ. అయితే డీసీసీబీ రూపంలో వారికి అవకాశం చిక్కడంతో దానిని వినియోగించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

రాజధానిపై బీజేపీ డబుల్ గేమ్.. పవన్ పరిస్థితి ఏంటి?

మూడు రాజధానుల అంశంపై బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓ వైపు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు మండలిలో జగన్ సర్కార్ కి అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలతో అసలు బీజేపీ స్టాండ్ ఏంటో అర్థంగాక... సామాన్యుల నుండి రాజకీయ విశ్లేషకులు వరకు తలలు పట్టుకుంటున్నారు. రాజధాని విషయంలో మొదటి నుండి బీజేపీ నేతలు రోజుకో ప్రకటన చేస్తూ అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఒక నేత ఏమో రాజధానికి మేము వ్యతిరేకం అడ్డుకుంటాం అంటారు, ఒకరేమో మంచి నిర్ణయమే అంటారు.. ఇంకో నేతేమో రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. ఇలా ఒక్కో నేత ఒక్కో ప్రకటన చేస్తూ.. రాజధాని మార్పుకు బీజేపీ అనుకూలమో వ్యతిరేకమో అర్థంకాకుండా చేస్తున్నారు. మరోవైపేమో, కేంద్రం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ దోస్త్ జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు ఖండిస్తున్నారు. వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని, మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్రం సమ్మతి లేదని అంటున్నారు. అయితే వీరి మాటలకు, బీజేపీ చేతలకు అసలు పొంతన కుదరడం లేదు. మండలిలో బీజేపీ సభ్యుల తీరే దానికి నిదర్శనం.   మండలి లో బీజేపీకి సంబందించిన 3 సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి సహకరించారు. వికేంద్రీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి వైసీపీతో కలిసి ఛైర్మెన్ పై ఒత్తిడి తెచ్చారు. రూల్ 71 పై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి, ప్రభుత్వ నిర్ణయానికి మేము వ్యతిరేకం అని చెప్పే అవకాశం ఉన్నా అది ఉపయోగించుకోలేదు. దీనిబట్టి చూస్తుంటే బీజేపీ మాటలకు, చేతలకు పొంతన లేదని అనిపిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకమైతే.. మరి మండలిలో ఆ పార్టీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశమున్నా ఎందుకు ఉపయోగించుకోలేదు?. ఇదంతా చూస్తుంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గేమ్ లో పవన్ బలి అవుతున్నారా?.. అది ఆయనే ఆలోచించుకోవాలి.

పార్టీ కీలక నేతలతో జగన్ వరుస భేటీలు.. ఊహించని స్టెప్ పడనుందా?

మూడు రాజధానుల బిల్లుకు మండలిలో అడ్డుపుల్ల పడడంతో తర్వాత అడుగులు ఎలావేయాలన్న దానిపై వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరుస భేటీలతో దీని గురించి చర్చిస్తున్నారు. ఈ రోజు ఉదయం వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశం వికేంద్రీకరణ బిల్లేనని తెలుస్తోంది. రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ మంత్రులు, తమ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు. తమ తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జగన్ చర్చించి.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ చీఫ్ తో పవన్ భేటీ... కేంద్రం మనసులో మాట తెలిసిపోయింది!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, బీజేపీ ఎంపీ జీవీఎల్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. రాజధాని అమరావతి తరలింపుతో పాటు అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలను పవన్, నడ్డా దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం అనుమతితోనే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చామన్న వైసీపీ వాదనలో నిజం లేదని.. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు తనకు స్పష్టం చేశారని పవన్ చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. కేంద్రం అనుమతితోనే వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చామన్న వైసీపీ అసత్య ప్రచారాన్ని.. జనసేన, బీజేపీ ప్రతినిధులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భూదందాల కోసమే వైసీపీ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని పవన్ ఆరోపించారు.