తెలంగాణలోనూ మండలిని రద్దు చేస్తారా? కేసీఆర్‌కు... జగన్‌కు తేడా ఏమిటి?

ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంతో... తెలంగాణలో కూడా కౌన్సిల్ రద్దు జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే, తెలంగాణ సీఎం కేసీఆర్.... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య సత్సంబంధాలు నెలకొనడం... సఖ్యతతో కలిసి ముందుకు సాగడం... పదేపదే సమావేశమవుతుండటంతో... జగన్ తరహాలోనే కేసీఆర్ కూడా మండలిని రద్దు చేస్తారేమోనన్న చర్చను కొందరు లేవనెత్తుతున్నారు. దీనికి కారణంగా మండలి నిర్వహణకు అవుతున్న కోట్లాది రూపాయల ఖర్చును చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మండలి నిర్వహణకు అవుతున్న ఖర్చును ఒక కారణంగా చూపడమే కాకుండా... ఈ ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికే కౌన్సిల్ ను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో... ఇదే కోణంలో కేసీఆర్ కూడా ఆలోచించ వచ్చేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ పరిస్థితులు ఒకేలాగా లేవు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే, తెలంగాణ శాసనసభలోనూ.... అలాగే శాసనమండలిలోనూ టీఆర్ఎస్ దే ఆధిపత్యం. తెలంగాణ కౌన్సిల్లో మొత్తం 40మంది సభ్యులు ఉంటే.... అందులో 26మంది టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. దాంతో, కేసీఆర్ ప్రభుత్వానికి మండలిలో వచ్చే ఇబ్బందులే లేవు. అయితే, ఏపీలో పరిస్థితి అలా లేదు. శాసనసభలో వైసీపీకి తిరుగులేని బలముంటే.... మండలిలో మాత్రం ప్రతిపక్ష టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దాంతో, జగన్ ప్రభుత్వం చేస్తున్న బిల్లులకు ఆటంకం ఏర్పడుతోంది. అలా, రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అడ్డంకులు రావడంతోనే సీఎం జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. కానీ, అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేనే లేవు, ఎందుకంటే... ఉభయ సభల్లోనూ అధికార టీఆర్ఎస్ బలమే ఉంది. మరి అలాంటప్పుడు మండలిని రద్దు చేయాల్సిన అవసరం కేసీఆర్ కి ఎందుకొస్తుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.... జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యొక్క ప్రభావం మాత్రం పలు రాష్ట్రాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఏపీతో కలిపి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉండటంతో..... ఆయా రాష్ట్రాలు కూడా కౌన్సిల్ రద్దు దిశగా ఆలోచన చేస్తాయేమోనంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి..! మండలి రద్దు ఓటింగ్ కి 18మంది డుమ్మా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యేలు ఊహించని షాకిచ్చారు. ఏకంగా శాసనసభలోనే జగన్ మాటను ధిక్కరించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు టీడీపీ అడ్డంకులు సృష్టించిందనే కోపంతో మండలి రద్దుకు నిర్ణయం తీసుకుని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఝలక్ ఇఛ్చారు. మరి, మండలిని రద్దు చేయడం వాళ్లకు ఇష్టంలేదో ఏమో తెలియదు గానీ, కౌన్సిల్ రద్దుపై శాసనసభలో ఓటింగ్ జరిగినప్పుడు 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు డమ్మాకొట్టారు. మండలి రద్దు తీర్మానంపై సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఈ ఓటింగ్ నుంచి 18మంది ఎమ్మెల్యేలు తప్పుకున్నారు. అంతేకాదు ఓటింగ్ సందర్భంగా సభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పైనా గందరగోళం కనిపించింది. మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 121మంది ఎమ్మెల్యేలు ఓటేశారని తెలిపిన అసెంబ్లీ సిబ్బంది... ఆ తర్వాత సంఖ్యను 133 అంటూ ప్రకటించారు. ఇక, మండలి రద్దు తీర్మానానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ అనుకూలంగా ఓటేయగా... వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ... అలాగే మద్దాల గిరిలు ... ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అయితే, 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉండటమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు వీళ్లెందుకు మండలి రద్దు తీర్మానం ఓటింగ్ కు దూరంగా ఉన్నారనేది రాజకీయ వర్గాల్లోనే కాదు.... వైసీపీలోనూ కలకలం రేపుతోంది. అయితే, వీళ్లంతా పొరపాటున ఓటింగ్ కి గైర్హాజరయ్యారా? లేక కావాలనే దూరంగా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. ఇక, ఓటింగ్ కు కొద్ది సమయం ముందు విప్ చెవిరెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. చెవిరెడ్డితోపాటు విప్ గా ఉన్న దాడిశెట్టి రాజా కూడా ఓటింగ్ సమయంలో లేకపోవడంపై వైసీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వైసీపీ ఫ్లోర్ మేనేజ్ మెంట్ పై సీఎం జగన్ ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సమయంలో ఏకంగా 18మంది ఎమ్మెల్యేలు లేకపోవడంపై మండిపడ్డారు. అయితే, ఓటింగ్ కి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలపై జగన్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 18మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్న తర్వాత నెక్ట్స్ స్టెప్ ఉంటుందని అంటున్నారు. మరి, వీళ్లంతా మండలి రద్దు ఇష్టంలేక ఓటింగ్ కి దూరంగా ఉన్నారా? లేక ఓటింగ్ పై సమాచారం లేక సభ నుంచి బయటికి వెళ్లారా? అనేది తేలాల్సి ఉంది. అయితే, వైఎస్ తీసుకొచ్చిన మండలిని రద్దు చేయడం ఇష్టంలేకే ఓటింగ్ కి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరి, ఏది నిజమో వాళ్లే చెప్పాల్సి ఉంటుంది.

నేను రాను.... కోర్టుకు రావడం కుదరదని హై కోర్టులో పిటిషన్ వేసిన జగన్

  అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు వెల్లడించింది. అయితే పలు మార్లు జగన్ తనకు రావడం వీలుపడదని తన బదులు తన సంబంధిత లాయర్లు హజరవుతారని పిటిషన్ పెట్టగా ప్రతిసారి కోర్టులో జగన్ కు చుక్కెదురైంది.  అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు పై మినహాయింపు దక్కకపోవడంతో ఏపీ సీఎం జగన్ హైకోర్టు ను ఆశ్రయించారు. సిబిఐ కోర్టు తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించడం పై సవాల్ చేశారు. ఏపీ సీఎంగా పరిపాలనా పరమైన విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత తమపై ఉందని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు జగన హైకోర్టులో ఇదే పిటిషన్ వేయగా సీబీఐ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ అప్పట్లో హై కోర్టు ఆదేశించింది. మరి ఏపీ సీఎం జగన్ కు ఈ పిటిషన్ అయినా ఊరటనిస్తుందో లేదో వేచి చూడాలి.

మండలి రద్దుతో వైసీపీకే నష్టం... అయినా జగన్ డేరింగ్ స్టెప్...

శాసనమండలి రద్దుతో వైసీపీకే ఎక్కువ నష్టమని... అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్సీల వ్యవహార శైలి కారణంగానే మండలి రద్దుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం బిల్లులు చేస్తుంటే... వాటిని టీడీపీ అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తోందన్నారు. అయితే, మండలి రద్దుపై... అలాగే, తమ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు సరైనవో కాదో... త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెబుతారని సజ్జల అన్నారు.

మండలి రద్దుపై ...టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏమన్నాయంటే...

మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంతోపాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జగన్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమంటున్నారు. మండలి రద్దు నిర్ణయంపై ఎవరేమన్నారో చూద్దాం... (నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి) మండలి రద్దు నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళ్తే జగన్ ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కలేదని ఏకంగా కోర్టులనే రద్దు చేస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు. (దేవినేని ఉమామహేశ్వర్రావు, టీడీపీ సీనియర్ నేత) శాసనమండలిని రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన అవివేకానికి నిదర్శనమని దేవినేని ఉమామహేశ్వర్రావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు పట్టిన పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా... నియంతలా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. (యనమల రామకృష్ణుడు, టీడీపీ సీనియర్ నేత) రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చినంత తేలికగా శాసనమండలిని రద్దు చేయడం సాధ్యంకాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా మండలిలో వైసీపీకి మెజారిటీ వస్తుందని, మరి అలాంటప్పుడు కౌన్సిల్ ను రద్దు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. రద్దుకు తీర్మానం చేసినా... అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని... అప్పటివరకు మండలి కొనసాగుతుందని అన్నారు. (అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే) ఏడు నెలల్లో 32 బిల్లులు పంపితే మండలిలో తెలుగుదేశం వ్యతిరేకించలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, ప్రజాభీష్టానికి ప్రజావ్యతిరేకంగా ఉన్నందునే మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామన్నారు. (మాధవ్‌, బీజేపీ ఎమ్మెల్సీ) దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన శాసనమండలిని ఆయన తనయుడు జగన్‌ రద్దు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. శాసనమండలి రద్దులో వైసీపీ, టీడీపీ... రెండు పక్షాలూ దోషులేనన్న మాధవ్‌... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు.    (శైలజానాథ్‌, ఏపీపీసీ అధ్యక్షుడు) శాసనమండలి రద్దు సీఎం జగన్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఏపీపీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. మండలిని రద్దు చేయాలనుకోవడం ద్వారా జగన్‌ తన ఓటమిని తానే ఒప్పుకున్నట్లన్నారు. సంఖ్యాబలం ఉందని ఏదిపడితే అది చేస్తానంటే కుదరదన్నారు.

రాజ్యసభకు పిల్లి, మోపిదేవి.! మరో ఏడుగురికి నామినేటెడ్ పదవులు.! మిగతా వాళ్ల పరిస్థితేంటి?

  శాసనమండలి రద్దు తర్వాత పదవులు కోల్పోనున్న తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్సీలకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి అధికారికంగా రద్దయిన తర్వాత ఏదో ఒక పదవి కట్టబెడతానని భరోసా కల్పించారు. ముఖ్యంగా శాసనమండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు కీలక పదవులను ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తులుగా, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కొనసాగుతోన్న పిల్లి, మోపిదేవికి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే, మండలి రద్దు తర్వాత పదవులు కోల్పోనున్న మరో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీలకు కూడా అండగా ఉంటానంటూ జగన్ హామీ ఇచ్చారు. వీళ్లందరికీ నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, మండలి రద్దుతో పదవులు కోల్పోయేవారికి రాజ్యసభ సభ్యత్వం, నామినేటెడ్ పోస్టులు ఆఫర్ చేసిన జగన్మోహన్ రెడ్డి... ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ హామీలు ఇచ్చినవారికి ఏవిధంగా న్యాయం చేస్తారని చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ కారణాలతో పలువురికి టికెట్లు నిరాకరించిన జగన్.... అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే, ఇఫ్పుడు ఏకంగా మండలినే రద్దు చేయడంతో... ఇఫ్పుడు వాళ్లందరికీ ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక, ఎమ్మెల్సీ హామీలు పొందిన నేతలైతే మండలి రద్దుపై సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది.

ముందు కేటీఆర్... తర్వాత కేసీఆర్... గల్ఫ్ వెళ్లనున్న తండ్రీకొడుకులు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఫిబ్రవరి 26నుంచి గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. సౌదీ, కతార్, దుబాయ్‌, కువైట్ తదితర దేశాల్లో పర్యటించనున్న కేసీఆర్.... వివిధ కారణాలతో గల్ఫ్ లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించనున్నారు. పర్యటనకు ముందే గల్ఫ్ పాలసీ ప్రకటించనున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.... ఆయా దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణవాసులను తిరిగి వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టనుంది. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులను విడిపించడానికి ఆయా దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటే ముందుగా మంత్రి కేటీఆర్ గల్ఫ్ వెళ్లనున్నారు. తెలంగాణవాసులను వెనక్కి తీసుకురావడానికి ఆయా దేశాల ఉన్నతాధికారులతో మాట్లాడి... గ్రౌండ్ వర్క్ పూర్తి చేయనున్నారు. అనంతరం గల్ఫ్ కంట్రీస్ లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయా ప్రభుత్వాధినేతలతో... అలాగే, భారత రాయబారులతో సమావేశమై... ప్రక్రియ ముగించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వీళ్లందరినీ స్వరాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా.... వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక్ చర్యలు చేపట్టనున్నారు.

ప్రజావేదికను కూల్చినంత ఈజీ కాదు... తీర్మానం చేసినా రాత్రికి రాత్రే రద్దు కాదు..

  మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా, ఇప్పటికిప్పుడు జరిగిపోదు. తీర్మానం చేసిన దగ్గర్నుంచి రద్దు ప్రక్రియ పూర్తవడానికి కనీసంలో కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుంది. ఎందుకంటే, తీర్మానం వరకే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ, మండలిని రద్దు చేయాల్సిన ప్రక్రియ మొత్తం కేంద్రం చేతిలోనే ఉంది. మండలిని రద్దుచేస్తూ జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానం మొదట కేంద్ర హోంశాఖకు వెళ్తుంది. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది. చివరిగా రాష్ట్రపతి సంతకం చేశాకే ఏపీలో శాసనమండలి రద్దు అవుతుంది. అయితే, ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కనీసం ఆర్నెళ్లు లేదా ఏడాది పడుతుందని అంటున్నారు. ఇదే, టీడీపీ ధీమాకి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాదిలోపు టీడీపీ ఎమ్మెల్సీ మెజారిటీ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఆ ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికార వైసీపీకే దక్కుతాయి. దాంతో, మండలి రద్దుతో టీడీపీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదని అంటున్నారు. అందుకే, రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చినంత సులువుగా మండలి రద్దు కాదని తెలుగుదేశం నేతలు జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా, మండలి రద్దు ప్రక్రియ మొత్తం కేంద్రం చేతిలోనే ఉన్నందున... మోడీ ప్రభుత్వానికి ఇష్టంలేకపోతే ఆగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పనిచేస్తున్న మండలి రద్దు ఆగిపోయినా ఆగిపోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తుండటం... అదే సమయంలో ఏపీ బీజేపీ కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని తీర్మానం చేసింది. దాంతో, జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా,  మండలి రద్దు అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది.  అయితే, శాసన మండలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదని, దీనిపై కేంద్రానికి ఎలాంటి హక్కూ ఉండదని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దుకు శాసనసభ తీర్మానంచేసి పంపితే, దాన్ని కచ్చితంగా పార్లమెంట్ ఆమోదించి తీరుతుందని అంటున్నారు. అందుకు, ఎన్టీఆర్ హయాం నాటి ఘటనను గుర్తుచేస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారని, అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే... కేంద్రం చేయక తప్పదని అంటున్నారు. మరోవైపు, మండలి రద్దు తీర్మానంపై ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశముందంటున్నారు. మండలిలో బిల్లులను అడ్డుకున్నారన్న కారణంతోనే కౌన్సిల్ రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.... చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంటున్నారు.

పంతం నెగ్గించుకున్న జగన్... సభలో మండలి రద్దు తీర్మానం....

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్ ప్రభుత్వం.... మండలి రద్దుకే నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా... మండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా శాసనసభలో ప్రవేశపెట్టారు. దాంతో, మండలి రద్దు తీర్మానంపై సభలో చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దు నిర్ణయంపై తెలుగుదేశం మండిపడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏడు నెలల్లో 32 బిల్లులు పంపితే మండలిలో తెలుగుదేశం వ్యతిరేకించలేదన్న టీడీపీ లీడర్లు... ప్రజాభీష్టానికి ప్రజావ్యతిరేకంగా ఉన్నందునే మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామన్నారు. అయితే, మండలి రద్దు అంటే ప్రజావేదికను కూల్చినంత తేలిక కాదని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు. మరోవైపు, మండలి రద్దు నిర్ణయంతో ఇద్దరు మంత్రులు త్వరలో మాజీలుగా మారనున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు.... కౌన్సిల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ జగన్ కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే, శాసనమండలి రద్దు జరిగిన ఆర్నెళ్ల తర్వాత వీళ్లిద్దరూ మాజీలుగా మారిపోతారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది.

చైర్మన్ చైర్... నేరేడుచర్లలో వివాదాల కారణంగా వాయిదా పడ్డ చైర్మన్ ఎన్నిక

నేరెడుచర్లలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. నేరేడుచర్లలో కేవీపీ ఓటు వేయనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపికి అనుమతులిచ్చింది.  మొదట కెవిపిని అనుమతించనందుకు మైకును విరగొట్టి.. పేపర్లు చింపి.. ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఈ దృశ్యాలన్ని వెబ్ కాస్టింగ్ లో రికార్డయ్యాయి. మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 7, సీపీఎం 1 స్థానాల్లో గెలిచాయి. దీంతో సిపిఎం సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులను రంగంలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవీపీ ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో మొదటి నుంచి చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపికి ఈసీ అనుమతినిచ్చింది. ఈ  వివాదం కారణంగా  చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎంతో ఉత్కంఠ రేపిన  నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మొత్తానికి రేపటికి వాయిదా పడింది.రేపు అయినా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతాయా లేదా అనేది వేచి చూడాలి.

వెలుగులోకి వచ్చిన మరో దిశ... శ్రీకాకుళంలో మైనర్ బాలికపై కామాంధుల కాటు

దిశా ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవలేదు. ఆ దారుణమైన ఘటన మరువక ముందే ఏదో ఒక ప్రాంతంలో రోజుకొక ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా , వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒక మైనర్ ఇంటర్ విద్యార్థిని పై అత్యాచారం చేసి బాధితురాలిని హత్య చేశారు. అలా హత్య చేసిన తరువాత పలాస రైల్వే స్టేషన్ పరిధిలో ధర్మపురం సమీపంలోని రైలు పట్టాల పై విద్యార్థిని మృతదేహాన్ని పడేశారు. పట్టాల పై మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ స్థలానికి వచ్చి పరిక్షించారు. బాధితురాలి గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుడు కూడా పలాస మండలం సున్నాడకు చెందిన వ్యక్తిగా అనుమానస్తూ కాశీబుగ్గ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన పై పూర్తి వివరాల కొరకు దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

ఆగని సెగ... రాజధాని కోసం భూములు ఇస్తే బూటు కాలుతో తన్నిన వైసీపీ ప్రభుత్వం

  పరిపాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో నిరసనల హోరు కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయం పై రాష్ట్ర వ్యాప్త వ్యతిరేకతను ముఖ్యమంత్రి కనీసం గమనించట్లేదు అంటూ మందడం రైతులు మండిపడుతున్నారు. పాలనకు అవసరమైన అన్ని భవనాలు ఉన్న అమరావతి నుంచి రాజధాని తరలింపు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టెనని మండిపడుతున్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా మహిళలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నుంచి వందలాది మంది మహిళలు ట్రాక్టర్లపై తుళ్లూరు చేరుకుని అక్కడి నుంచి వెలగపూడి, మందడం వరకు ర్యాలీగా తరలి వచ్చారు. మూడు రాజధానులు వద్దు ఓకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఉద్దండరాయునిపాలెంలో కాలభైరవ యాగం చేసిన శివస్వామికి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. నెలకు పైగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపి రైతుల ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. రాజధాని రైతుల పోరులో వారు ఒంటరి కాదని ఉద్యమంలో పాల్గొనేందుకు పొరుగు ప్రాంతాల నుంచి వచ్చినట్లు విద్యార్థులు, మహిళలు చెప్పారు. రాజధానికి భూములిచ్చిన ప్రజలతో బిల్లుల పై చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై లేదా అని నిలదీశారు. విజయవాడ పరిధిలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో గన్నవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాజధాని అభివృద్ధి సహా విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చామని రైతులు వాపోయారు. రాజధాని తరలిపోతే తమ త్యాగాలు వృధా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించే వరకు వెనుకడుగేసే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు.

జిహెచ్ఎంసీ ఎన్నికలు... కారు జోరుతో గెలుపు తథ్యం అంటున్నగులాబీ తమ్ముళ్లు

మునిసిపల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది  టీఆర్ఎస్ పార్టీ. ఇక జీహెచ్ఎంసీ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ల పై కూడా దృష్టి పెట్టనుంది. ఈ మూడు కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కావటానికి కొంచెం అటు ఇటుగా మరో ఏడాది సమయమే ఉండటంతో ప్రభుత్వ పరంగా రంగంలోకి దిగనుంది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయా కార్పొరేషన్ ల పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యమివ్వనుంది. పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగలేదు. అదే కారణంతో అచ్చంపేట, బాదేపల్లి, నకిరేకల్, సిద్దిపేట మునిసిపాలిటీలు కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో జహీరాబాద్, సారపాక, మందమర్రి, మణుగూరు, ఆసిఫాబాద్, పాల్వంచ మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు.  జీహెచ్ఎంసి , ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2016 జనవరిలో జరిగాయి. అదే ఏడాది మార్చిలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగాయి. వీటి పాలకవర్గాల పదవీ కాలం 2021 జనవరి మార్చిలో ముగియనుంది. వీటితో పాటు ఎన్నికల జరగకుండా మిగిలిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.  అయితే నిర్ణీత గడువు కంటే ముందే జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే రానున్న మూడున్నర నాలుగేళ్లలో సహకార ఎన్నికలు మినహా మరేమీ ఉండబోవని.. అభివృద్ధి పై పూర్తిస్థాయిలో దృష్టి సారించవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్త జనాభాలో మూడింట ఒక వంతు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంది. గ్రేటర్ వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను కలుపుకుంటే ఓటర్ల సంఖ్య దాదాపు కోటి ఉంటుంది. ఈ ఎన్నికలను అధికార పార్టీ అత్యంత కీలకంగా భావిస్తూ ఉండటానికి ఇది కూడా ఒక కారణం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై పడే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీ పై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు చెబుతున్నాయి. అటు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. మంచిరోజులు లేవనే ఉద్దేశంతో ఆయన ఇన్ని రోజులు నామినేటెడ్ పదవుల భర్తీ జోలికి వెళ్లలేదని చర్చ ఉంది. మునిసిపల్ చైర్ పర్సన్, కార్పొరేషన్ ల మేయర్ ఎన్నికలు నేటితో పూర్తి కానుండటంతో నామినేటెడ్ పదవుల భర్తీనే తదుపరి అని ఆశావహులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లు ప్రస్తుతం టిఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. 2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచి ఎవరి ప్రమేయం లేకుండా మేయర్ పదవి తొలిసారి దక్కించుకున్న చరిత్రను టీఆర్ఎస్ నిలబెట్టుకోవాల్సి ఉండటంతో  ముందే అప్రమత్తమైంది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్వయంగా రంగం లోకి దిగారు కేసీఆర్. హైదరాబాద్ పరిధిలో బస్తీ దవాఖానాలను 118 నుంచి 350 కి పెంచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన నగరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అడవుల అభివృద్ధి చేపట్టాలని నిర్దేశించారు.

మండలి రద్దు... వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్

మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకుగానూ ఒక తీర్మానం కూడా ఆమోదించిందని సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ  జరగనుంది. 2007, ఏప్రిల్ 22న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలిని పునరుద్ధరించారు. 2007 నుంచి మళ్లీ దాదాపు 12 ఏళ్ల పాటు సజావుగా సాగుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న మండలికి నేడు ప్రభుత్వం అధికారికంగా రద్దు ముద్ర వేయనుంది. ఈ తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందితే చివరిగా దానిని కేంద్రానికి పంపుతారు. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేస్తే మొత్తానికి ఏపీలో శాసనమండలి పూర్తిగా రద్దవుతుంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో శాసన సభ మండలి ఏర్పాటైన తర్వాత రద్దు కావడం.. మళ్లీ పునఃరుద్ధించటం అనేది కేవలం ఏపీలో మాత్రమే జరిగినట్లు సమాచారం. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ అధికారంలో ఉండగా ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే కరుణానిధి హయాంలో శాసన మండలి సభ్యత్వానికి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆమోద పొందలేదు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది. ఏపీకి కూడా శాసన మండలి వద్దని జగన్ తీర్మాణాలు చేయించి రాష్ట్రపతి అనుమతితో మండలి గనుక రద్దు అయితే దేశంలో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉనికిలో ఉంటుంది. అయితే శాసనమండలి రద్దు అవ్వడంతో రాజకీయంగా వైసీపీ లాభనష్టాలను చూస్తే.. కొద్ది రోజుల్లో రిటైర్ అయ్యే వాళ్ళ కారణంగా 17 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఇక తన ఎమ్మెల్యేల బలంతో 17 ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకొని తన పార్టీ బలాన్ని పెంచుకునే అవకాశం ఉన్నా కూడా జగన్ ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తమ సొంత పార్టీ సభ్యులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకొవద్దని సూచిస్తున్నా జగన్ మండలి రద్దు పైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీలో దీని పై ఏ నిర్ణయం తీసుకోనున్నారనే అంశం ఉత్కంఠత రేపుతుంది.

అందరూ కారులోకే... టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న 90 శాతం మంది ఇండిపెండెంట్లు

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. 100 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మెజారిటీ రాని చోట్ల ఎలా పాగా వేయాలన్న దానిపై పావులు కదుపుతోంది. స్వతంత్రులుగా గెలిచిన అభ్యర్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే స్థానిక నాయకత్వం వీరితో మాట్లాడుతూ పార్టీకి మద్దతు కోరుతోంది. రాబోయే నాలుగేళ్ళ పాటు టిఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. గెలిపించిన వార్డు ప్రజలకు అభివృద్ధి చేసే అవకాశం టీఆర్ఎస్ ద్వారానే లభిస్తుందని.. స్వతంత్రులకు వివరిస్తున్నారు. 90 శాతం మంది ఇండిపెండెంట్లు టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చారని స్థానిక ఎమ్మెల్యేలు పార్టీకి తెలియజేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు టిఆర్ఎస్ భావిస్తుంది. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇన్ చార్జిలు.. జిల్లా మంత్రులతో కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్లు , కౌన్సిలర్ల సంఖ్యతో పాటు మునిసిపల్ చైర్మన్ , మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావల్సిన బలం అవసరమైన ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య పై కేటీఆర్ చర్చిస్తున్నారు.   ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యులను స్థానికంగా ఏ  మునిసిపాలిటీలకు ఎంచుకోవాలో పార్టీ సూచిస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్న చోట్ల ఒకటి రెండు ఓట్లు అవసరమైన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక మేయర్లు, చైర్మన్ లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ ల ఎంపిక కోసం కేటీఆర్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్లు , ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే సామాజిక సమీకరణాలు స్థానికంగా పార్టీకి అవసరమైన ఇతర అంశాల ప్రాతిపదికగా వారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ దిశగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి పురపాలిక పరిధి నుంచి రెండు పేర్లు చొప్పున ఓ ప్రాథమిక జాబితాను ఎమ్మెల్యేలు , పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిలు ఇప్పటికే ఆయనకు పంపారు. దాన్ని పరిశీలించి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఎంపిక చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఇవాళ పార్టీ స్థానిక నాయకత్వానికి అందజేయనున్నారు. సీఎం ఎంపిక చేసిన వారికే బీఫారాలను ఇవ్వనున్నారు. ఈ పరిణామం ఇండిపెండెంట్లకు వరం అనే చెప్పుకోవాలి.

సంచలన తీర్పులు... ఒకటే రోజు నాలుగు అత్యాచార కేసులకు తుది తీర్పు

తెలంగాణలో సంచలనం సృష్టించిన నాలుగు అత్యాచార ఘటనల పై నేడు ( జనవరి 27వ తేదీన )  తీర్పులు వెలువడనున్నాయి. అటు హాజీపూర్ ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగు చూసిన దారుణాలకు  న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది. ఏ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో తీర్పు ఇవ్వనుంది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎలా పట్టారు గ్రామ అటవీ ప్రాంతంలో గత నవంబరు 24 న సమత పై అదే గ్రామానికి చెందిన షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ లు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు డిసెంబరు 11 న ఆదిలాబాద్ లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. పోలీసులు ముగ్గురు నిందితుల పై డిసెంబరు 14 న 144 పేజీల చార్జి షీటును దాఖలు చేశారు. నిందితుల తరపున కేసును వాదించేందుకు న్యాయవాదులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో కోర్టు నిందితులకు న్యాయవాదిని కేటాయించింది. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, పోలీసు రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు.. మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించగా డిసెంబరు 31వ తేదీతో విచారణ పూర్తయింది. ఈ నెల ( జనవరి ) 20 తో ప్రాసిక్యూషన్.. డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగియగా నేడు తీర్పు రానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ కు చెందిన ముగ్గురు అమ్మాయిల పై వేర్వేరు ఘటనల్లో శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి పాల్పడి హతమార్చాడని పోలీసులు నల్గొండ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు. హాజీపూర్ కేసులో గత ఏడాది అక్టోబర్ 20 న విచారణ ప్రారంభం కాగా 44 మంది సాక్షులను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆయా కేసులో గత డిసెంబర్ 26వ తేదీన వాదనలు ముగిశాయి. 

శాసన సభలో మండలి కొనసాగుతుందా లేదా... ఉత్కంఠతను రేపుతున్న నేడు తుది నిర్ణయం....

మండలి రద్దు జరగాలని సీఎం జగన్ నేడు అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు.ఏపీ శాసన సభలో మండలి అంశం పై ప్రత్యేక చర్చ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముందు సచివాలయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమవుతుంది. శాసన మండలి భవితవ్యం ఇక్కడే తేలిపోతుంది. అధికార పక్షం అనుకున్నట్టుగా బలం వస్తే ప్రతి పక్షం నుంచి పాలకపక్షానికి ఎమ్మెల్సీల వలసవస్తే శాసన మండలి సురక్షితంగా ఉంటుందని లేదంటే కౌన్సిల్ రద్దవుతుందని రాజకీయ వర్గాల సమాచారం.మంత్రి వర్గ సమావేశంలోనే ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది తేలిపోతుందని అంటున్నారు. కౌన్సిల్ రద్దు చేయాలనుకుంటే మంత్రి వర్గ సమావేశంలోనే దాని పై తీర్మానం చేస్తారు. 99% శాతం మేర మండలిని రద్దు చేసే దిశలోనే జగన్ ఉన్నారని ఒక మంత్రి వ్యాఖ్యా నించారు.ఆశించిన స్థాయిలో చేరిక లుంటే మాత్రం ఆయన పునః ఆలోచించాల్సి ఉంటుంది.  సీఆర్ సీఆర్డీఏ రద్దు రాష్ట్రంలో అధికార పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసన మండలి లో చోటు చేసుకున్న పరిణామాలతో అధికార పక్షం విస్తుపోయింది.  శాసనసభలో 175 స్థానాల్లో 151 స్థానాలతో 80% శాతం పైగా సభ్యులను కలిగి బిల్లులనూ ఆమోదిస్తే శాసన మండలిలో తిరస్కరణకు గురి కావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. ఈ నేపధ్యంలోనే శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారని అధికార పక్షం చెబుతోంది.దీని పై మంత్రి వర్గంలో తీసుకునే వైఖరికి అనుగుణంగా అసెంబ్లీలో సీఎం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు.ఒకవేళ శాసనమండలి రద్దుకే మొగ్గు చూపితే అది వైసీపీకే ఎక్కువ నష్టమని విపక్షాలు వాదిస్తునలు వినిపిస్తున్నాయి.ఏడాది తర్వాత శాసన మండలిలో ప్రస్తుతం ఉన్న సభ్యులలో అధికులు రిటైర్ అవుతున్నారు. 2021,2023 లో జరిగే ద్వై వార్షిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా రిటైరవుతుంటే ఆ స్థానాల్లో వైసీపీ సభ్యులు భర్తీ అవుతారు. వైసీపీ శాసన సభ్యు లకు దీటైన స్థాయిలో ఉన్న నేతలకు శాసన మండలిలో స్థానం కల్పించడం ద్వారా నేతలందరికీ పదవులు ఇచ్చి సంతృప్తిపరిచేందుకు వీలు కలుగుతుంది.ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి పార్టీ ముఖ్య నేతలు వివరిస్తున్నారు.శాసనమండలి రద్దయితే పార్టీకి అత్యంత విశ్వసనీయంగా ఉండే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ లాంటి పటుత్వం ఉన్న వారు తమ ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోతారు. వారి కోసం ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఇద్దరు తమ స్థానా లు ఖాళీ చేసి 6 నెలల్లో వాటికి ఎన్నికల జరిగితేనే వారు మంత్రి వర్గంలో కొనసాగే వీలు ఉంటుంది.టిడిపి ఎమ్మెల్సీలు ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని కొందరు టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గ కార్యకర్తలకు ఫోన్లు చేశారని వెల్లడించారు.మొత్తం మీద మరికాద్ది గంటల్లో వెలువడనున్న సమావేశంతో మండలి రద్దు అంశంకు తెర పడనుంది.

సాక్షిపై రూ. 75 కోట్లకు లోకేష్ పరువునష్టం దావా!!

సాక్షి దినపత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. 'చినబాబు చిరుతిండి 25 లక్షలండి' అంటూ గత ఏడాది సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు. తప్పుడు కథనంతో తన పరువు ప్రతిష్టలకు ఉద్దేశపూర్వకంగా మంటగలిపేందుకు ప్రయత్నించారని.. సాక్షిపై లోకేష్ పరువునష్టం దావా వేశారు.  విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేష్ పేర్కొన్నారు. 2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లలో.. లోకేష్ రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని, అదంతా ప్రజాధనమని సాక్షి రాసింది. అయితే.. సాక్షి పత్రిక ప్రచురించిన తేదీల్లో లోకేష్ విశాఖలో లేరు. అదే సమయంలో.. ఆ ఖర్చంతా ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చుగా తేలింది. ఈ విషయాలను బయట పెట్టిన లోకేష్.. క్షమాపణ చెప్పాలని కోరుతూ.. సాక్షి యాజమాన్యానికి లేఖ రాశారు. అయితే సాక్షి పత్రిక.. తమ కథనానికి వివరణ ప్రచురించడానికి నిరాకరించడంతో.. లోకేష్ న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో తప్పుడు కథనం ప్రచురించారంటూ.. సాక్షిపై రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు.

భైంసాలో ఎంఐఎం భారీ విజయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో రసవత్తర రాజకీయానికి తెర పడింది.భైంసాలో ఉత్కంఠ వాతావరణం మధ్య ఎన్నిక ఫలితాలు వెలువడ్దాయి.భైంసా మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తాచాటింది. మొత్తం 26 స్థానాల్లో 15 ఎంఐఎం కైవసం చేసుకోగా.. బిజెపి 9 స్థానాల్లో.. స్వతంత్రులు 2 స్థానాలను గెలుపొందారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా మొదటి నుండి బిజెపి , ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఒకానొక దశలో బీజేపీ ముందంజలో కొనసాగగా అనూహ్యంగా ఎంఐఎం చివరి రౌండ్ లో దూసుకెళ్లింది. ఏకంగా 15 స్థానాలను కైవసం చేసుకుని భైంసాను తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 8 గంటల నుంచి ఫలితాలు విడుదలవుతున్న నేపధ్యంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా గట్టి పోటీ కొనసాగింది. మొదటి రౌండ్ లో ఇద్దరు 9 స్థానాలతో సమాంతరంగా ఉండి కౌంటింగ్ రసవత్తరంగా సాగింది.చివరకు 15 స్థానాలతో ఎంఐఎం భైంసా విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ కానీ ఎవరూ గెలవలేదు. మొత్తం మీద చైర్మన్ పీఠంతో పాటు వైస్ చైర్మన్ పీఠాన్ని కూదా ఎంఐఎం తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.