దేశం ఉలిక్కిపడి ఏడేళ్లు దాటింది... నిర్భయ దోషులకు మిగిలింది కొన్ని గంటలే...

2012 డిసెంబర్ 16న భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున వైద్య విద్యార్ధిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. అంతేకాదు, నిర్భయ ప్రైవేట్ పార్ట్స్ లో తుప్పుపట్టిన ఇనుప రాడ్డును పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఢిల్లీ నడిబొడ్డున ప్రధాన రహదారిపై నడుస్తున్న బస్సులో నిర్భయపై ఇష్టానుసారంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి జీవచ్ఛవంగా మారిన వైద్య విద్యార్ధినిని రోడ్డుపక్కన విసిరేశారు. అలా, మృగాళ్ల చేతిలో దేహమంతా ఛిద్రమై నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన నిర్భయ ఉదంతంపై దేశమంతా భగ్గుమంది. అయితే, ఈ దారుణ సంఘటన జరిగి ఏడేళ్లు దాటిపోయింది. కానీ, దోషులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అయితే, ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దోషులకు మరణశిక్ష విధించినా... రకరకాల కారణాలతో ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ, ఇక టైమ్ దగ్గరకొచ్చింది. నిర్భయ దోషులకు... ఇంకా, కొన్ని గంటలే మిగిలాయ్. ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకపోతే ...ఫిబ్రవరి ఒకటిన నలుగురు దోషులను... ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... ఉరితీయనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తిచేసిన తీహార్ జైలు అధికారులు.... నిర్భయ దోషుల కోసం ప్రత్యేక ఉరికంబాన్ని సిద్ధం చేయించారు.  నిజానికి, జనవరి 22నే నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా... దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీంను ఆశ్రయించడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఇప్పుడు, మరోసారి ముఖేష్... సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడంతో ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. అయితే, ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోతే... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయనున్నారు.

మండలి రద్దు అయితే తాము దురదృష్టవంతులమే అని భావిస్తున్న మండలి సభ్యులు...

మండలి రద్దు ప్రక్రియ ఇంకా పూర్తి కాకున్నా, పరిణామాలు ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పకున్నా ప్రస్తుతం సభ్యులుగా ఉన్న 55 మంది మాత్రం తమ పదవులు కోల్పోతారనే భావనతో ఉన్నారు. తమను తాము దురదృష్టవంతులుగా భావించుకుంటున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58. అయితే మూడు ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం 55 మంది సభ్యులున్నారు. వచ్చే నెల రెండవ తేదీ (ఫిబ్రవరి 2) నుంచి మొదలుకొని 2025 సంవత్సరం మార్చి వరకు విడతల వారీగా ఈ సభ్యులు రిటైర్ కావాల్సి ఉంది. అతి తక్కువ కాలంలో రిటైరయ్యే సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే 2025వ సంవత్సరం వరకూ గడువు ఉన్న సభ్యులు మాత్రం ఇదెక్కడి గొడవరా అంటూ నిట్టూరుస్తున్నారు. వీరిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కాబోతున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వచ్చే నెల రెండవ (ఫిబ్రవరి 2) తేదీన ఇద్దరు సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఈ రెండు స్థానాలూ గవర్నర్ కోటాలోనే ఉన్నాయి. వీరిలో ఒకరు కంతేటి సత్యనారాయణ రాజు అయితే మరొకరు టి రత్నాభాయి. వీరిలో కంతేటి సత్యనారాయణ రాజు మండలి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. అటువంటి కంతేటి రాజు మండలి రద్దు ప్రతిపాదన సమయంలోనూ ఉండటాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.  ఇక 2021 ఏడాదికి రిటైరయ్యే సభ్యుల జాబితా పెద్దదిగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎనిమిది మంది ఉన్నారు, వీరిలో టిడిపి నుంచి ప్రస్తుత మండలి ఛైర్మన్ షరీఫ్ మొదలుకొని తిప్పేస్వామి, సంధ్యారాణి, వీవీవీ చౌదరి వంటి నలుగురు సభ్యులు ఉంటే వైసీపీ నుంచి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటీవలె మండలి లోకొచ్చిన ఇక్బాల్ దేవసాని చిన్న గోవిందరెడ్డి ఉన్నారు అలాగే బిజెపి నుంచి సోము వీర్రాజు ఉన్నారు. హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఇక్బాల్ కు మండలిలో స్థానం కల్పించి చట్ట సభల్లోకి ప్రవేశం కల్పించింది వైసీపీ. ఇప్పుడాయన చట్టసభల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం కానుంది. ఇక స్థానిక సంస్ధల కోటా నుంచి 2021 ఏడాదిలో రిటైరయ్యే సభ్యుల సంఖ్య పదకొండు మంది అయితే వీటిల్లో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే తొమ్మిది మంది సభ్యులు రిటైర్ కానున్నారు, వీరిలో టిడిపి నుంచి డిప్యూటీ చైర్మన్, రెడ్డి సుబ్రహ్మణ్యం సహా వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, ద్వారంపూడి జగదీష్, బుద్ద నాగదీశ్వరరావులు ఉన్నారు. ఇక వైసీపీ నుంచి మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు. వీరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఆయన సతీమణి గాలి సరస్వతీకి కట్టబెట్టింది టిడిపి. ఇక టీచర్ ల కోటా నుంచి ఇద్దరు, గవర్నర్ కోటా నుంచి నలుగురు రిటైర్ కాబోతున్నారు. 2021 తరువాత తిరిగి 2023 ఏడాది లో ఇంకొందరు రిటైర్ కానున్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఏడుగురు ఉంటే వారిలో టిడిపి నుంచి నలుగురు వైసీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. టిడిపి నుంచి రిటైరయ్యే వారిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ 2023 లో రిటైర్ కావాల్సి ఉంది.  లోకేష్ తో పాటు బచ్చుల అర్జునుడు, మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత ఉన్నారు. వీరిలో మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, పోతుల సునీత పార్టీ మారారు. ఇక వైసీపీ నుంచి రిటైరయ్యే వారిలో మంత్రి మోపిదేవి, ఇటీవల పార్టీలో చేరి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న చల్లా రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఉన్నారు. స్థానిక సంస్ధల కోటా నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు. వీరంతా టిడిపికి సంబంధించిన వారే, దీపక్ రెడ్డి, బీటెక్ రవి, కేఈ ప్రభాకర్, బిఎన్ రాజసింహులు, చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, శత్రుచర్ల, వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరిలో వాకాటి ప్రస్తుతం బిజెపికి జంప్ అయ్యారు. అలాగే గ్రాడ్యుయేట్స్ కోటాలోని ముగ్గురు రిటైర్ కావలసి ఉంది. అలాగే గవర్నర్ కోటా నుంచి ఇద్దరు రిటైర్ కానున్నారు. ఇక 2025 ఏడాది లో రిటైరయ్యే ఎమ్మెల్సీలనూ అత్యంత దురదృష్టవంతులుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన ఏడాది తరవాత కూడా మండలిలో సభ్యులుగా కొనసాగే అవకాశం వీరికుంది. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి రిటైరయ్యే సభ్యుల సంఖ్య ఐదుగురు కాగా వీరిలో టిడిపి నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఒకరు రిటైర్ కాబోతున్నారు. టిడిపి నుంచి యనమల, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారాపు రామారావు ఉంటే వైసీపీ నుంచి జంగా కృష్ణ మూర్తి ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారు 2025 లో రిటైర్ కావలసి ఉంటుంది. టీచర్ ల కోటా నుంచి పాకాలపాటి రఘువర్మ కూడా పీడీఎఫ్ నుంచి ఉన్నారు. వీరిని అత్యంత దురదృష్టవంతులుగా రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

2020 బడ్జెట్ కేటాయింపులకు సర్వం సిధ్ధం...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. గత ఏడాది తొలి సారిగా ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండో సారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల మెప్పు పొందేలా బడ్జెట్ ను రూపొందించడం కత్తిమీద సామే. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు ఈ బడ్జెట్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. శనివారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఏయే రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు, ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. మౌలిక వసతుల రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పారిశ్రామిక వర్గాల వ్యక్తిగత పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ప్రారంభం కాబోయే క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏవైనా అమెండ్ మెంట్ బిల్లులు ఉన్నా వాటికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడానికి వీలుగా వాటిని సిద్ధం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సారి బడ్జెట్ కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. ఆ మేరకు ఇప్పటికే బడ్జెట్ ఒక ముసాయిదా సిద్ధమైంది దానిని ఎల్లుండి  ప్రారంభమయ్యే పార్లమెంటు ఉభయ సభలలో (ఫిబ్రవరి 1) ఒకటో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టే ముందు మరొకసారి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా దాన్ని ఆమోదించి పార్లమెంట్ లో దానిని ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సారి బడ్జెట్ లో ఎటువంటి అంశాలుండాలి, ఎటువంటి వడ్డింపులు ఉండాలి అనేది సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ఈ సారి తమకేమైనా వెసులుబాటు లభిస్తుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పన్ను వడ్డింపులు పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒకే ఉరికంబంపై... ఒకేసారి... నలుగురు ఉరితీత... తీహార్ జైలు సరికొత్త రికార్డు

ఏడేళ్లుగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిర్భయ దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉదయం ‎ఆరు గంటలకు ఉరితీయనున్నారు. ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... నలుగురినీ ఉరి తీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. నిర్భయ దోషుల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఉరికంబంపై తలారులతో డమ్మీ ఉరితీత ప్రక్రియ నిర్వహించారు. దోషుల ఎత్తు, బరువునకు సమానమైన ఇసుక సంచులను ఉరికొయ్యపై వేలాడదీశారు. అలాగే, ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి తెప్పించిన ఉరితాళ్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ పరిశీలించారు. ఇదిలా ఉంటే, ఒకేసారి నలుగురిని ఉరి తీయబోతున్న కారాగారంగా తీహార్ జైలు సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసిన సందర్భాలుండగా... మొదటిసారి నలుగురినీ ఒకే ఉరికంబంపై ...ఒకే సమయంలో ఉరి తీయబోతున్న జైలుగా రికార్డులకెక్కబోతోంది. అయితే, తీహార్ జైల్లో కూడా ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరి తీసేందుకు వీలుండగా... ఇప్పుడు, నలుగురు నిర్భయ దోషులను ఒకేసారి తీయాల్సి ఉండటంతో... ప్రత్యేకంగా ఉరికంబాన్ని సిద్ధంచేశారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా జేసీబీతో పెద్ద గుంతను తవ్వించారు. అలాగే, ఉరి తీసిన తర్వాత అక్నడ్నుంచి మృతదేహాలను తరలించేందుకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడమే కాకుండా... దారులన్నీ మూసుకుపోవడంతో ఫిబ్రవరి ఒకటిన ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసేశారు. అయితే, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించాడు. సహా దోషి అక్షయ్ సింగ్ తనపై అనేకసార్లు జైల్లో లైంగిక దాడి చేశాడని, ఇదంతా జైలు అధికారుల ప్రోద్బలంతోనే జరిగిందంటూ రిట్ పిటిషన్ వేశాడు. దాంతో, ముఖేష్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. దాంతో, నిర్భయ దోషుల ఉరితీతపై మరోసారి సందిగ్ధత నెలకొంది.

దిశ కేసులో కీలకంగా సీసీటీవీ విజువల్స్... ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన నిజాలు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోలీసులు అందజేసిన సాక్ష్యాధారాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు మరో రెండ్రోజుల్లో నివేదికను అందజేయనున్నారు. దిశ రేప్ అండ్ మర్డర్ ఘటనలో మొత్తం 40 సాక్ష్యాధారాలను పోలీసులు పరీక్షలకు పంపగా... ఫోరెన్సిక్ నిపుణులు సునిశిత సూక్ష్మ విశ్లేషణ చేశారు. ముఖ్యంగా తొండుపల్లి టోల్‌ప్లాజా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన నిందితుల దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. నిందితులు దిశలో మాట్లాడటం... దిశను లారీ దగ్గరకు లాక్కెళ్లడంలాంటి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే, సీసీటీవీ విజువల్స్ అస్పష్టంగా ఉండటంతో... అవి స్పష్టంగా కనిపించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కృషిచేశారు. ముఖ్యంగా మహ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్‌లు.... దిశను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలను... అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి మరింత సృష్టంగా కనిపించేలా డెవలప్ చేశారు.  అలాగే, తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర్నుంచి దిశ... ఆమె సోదరితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను విశ్లేషించారు. దిశ తన సోదరితో మాట్లాడుతుండగా నిందితుల వాయిస్ కూడా రికార్డయినట్లు తెలుస్తోంది. అలాగే, సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల వాయిస్‌లను పరీక్షించి... ఆ స్వరాలు వాళ్లవేనని తేల్చారు. అదేవిధంగా, దిశ 15రోజుల కాల్ డేటాను, మొబైల్లో ఉన్న ఫోన్‌ నెంబర్లు, ఎస్‌ఎంఎస్‌లను కూడా విశ్లేషించారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు నుంచి అంతకుముందు 15రోజుల వరకు దిశ ఎవరెవరితో మాట్లాడిందో వివరాలు సేకరించి నివేదికలో పొందుపర్చారు. ఇక, దిశ ఘటన జరిగిన రోజు... రాత్రి 9గంటల నుంచి 9-40 వరకు నిందితుల ఫోన్ సిగ్నల్స్ తొండుపల్లి ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించారు.  అయితే, దిశ హత్యాచార ఘటనలో అత్యంత కీలకమైన దృశ్యాలు తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ కెమెరాల్లోనే నిక్షిప్తమయ్యాయి. ఇప్పుడా దృశ్యాలే దిశ కేసులో అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన రివాల్వర్లను, తూటాలను బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు దాదాపు తుది దశకు చేరుకోవడం... మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా సిద్ధమవడంతో... త్వరలోనే ఢిల్లీ బృందం హైదరాబాద్ కి రానుంది. దిశ ఘటన జరిగిన నాటి నుంచి నిందితుల ఎన్ కౌంటర్ వరకు నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.

అన్యాయం జరిగితే సహించను... అధికారులకు జగన్ హెచ్చరిక...

ఫిబ్రవరి ఒకటి నుంచి 21లోపు కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులను డోర్ డెలివరీ చేయాలంటూ అధికారులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి 15కల్లా ఇళ్ల పట్టాల లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పది రూపాయల స్టాంపు పేపర్ల మీద మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు  ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏదో మొక్కుబడిగా ఇవ్వకుండా, నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలను కేటాయించి... ఉగాదినాడు లబ్దిదారుల్లో సంతోషం నింపాలని జగన్మోహన్‌రెడ్డి సూచించారు. అలాగే, ఫిబ్రవరి 15నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో విడత చేపడతామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇకపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించనున్నట్లు జగన్ తెలిపారు.  అదేవిధంగా ఫిబ్రవరి 28న 3వేల 300 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ-వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నామని, అయితే 336 సర్వీసులు 72గంటల్లోనే పూర్తిచేసి తీరాలని సూచించారు. ఇక, ఫిబ్రవరి 28నుంచి దాదాపు 11లక్షల మందికి విద్యావసతి దీవెన అమలు చేయబోతున్నట్లు తెలిపిన జగన్... మధ్యాహ్నం భోజనం నాణ‌్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్లకు ఆజ్ఞాపించారు. ఆర్డీవోలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. ఇక, ఫిబ్రవరి చివరి నాటికి దాదాపు అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ విధానం అమలు కావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... అన్ని చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలందరి ముఖాల్లో సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హులైనవారందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు అర్హుల జాబితాను కచ్చితంగా తనిఖీ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించబోనని హెచ్చరించారు.

అభివృద్ధికి అడ్డుకట్ట.... శాసనమండలి ఉండటం దండగ అంటున్న జగన్

  ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని సీఎం జగన్ ఆ తరవాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభకు హాజరు కాకూడదని టిడిపి సభ్యులు నిర్ణయించుకోవడంతో సీఎంతో సహా అందరు అధికార పక్ష సభ్యులే దీనిపై మాట్లాడారు. సభ్యులందరూ మండలి రద్దుకు సానుకూలంగా మాట్లాడారు. అభివృద్దిని ఆ సభ అడ్డుకుంటోందని ఖర్చు దండక తప్పా ప్రజా ప్రయోజనాలు లేవని ఆక్షేపించారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండల ఉందని మిగతా రాష్ట్రాలు వద్దనుకున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసమే శాసన మండలి రద్దుకు తీర్మానం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చెప్పారు. మండలికి ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగని తేల్చి చెప్పారు. క్యాబినెట్ అనేది కేవలం శాసన సభకే జవాబుదారీగా ఉంటుంది కానీ శాసన మండలికి కాదని స్పష్టం చేశారు. బిల్లులకు అడ్డు తగులుతూ దిక్కుమాలిన ఆలోచనలు చేసే మండలి అవసరం లేదని దానిని రద్దు చేస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం చెప్పారు. శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన సీఎం జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజల ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజధాని బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ అహం దెబ్బతిందని ఆరోపించారు. గతంలో మండలి పునరుద్ధరణ సమయంలో దానిని తమ పార్టీ వ్యతిరేకించిన మాట వాస్తవమని అపుడు అది తమ పార్టీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. చర్చ ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. రద్దు తీర్మానానికి అనుకూలంగా సభలో ఉన్నవారంతా లేచి నిలబడ్డారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ 132 మంది వైసీపీ సభ్యులు నిల్చున్నారు. దీంతో తీర్మానాన్ని ఆమోదించిన వారి సంఖ్య 133 గా స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ సమయంలో కొంత గందరగోళం నెలకొంది. మండలి సభ్యులైన మంత్రి మోపిదేవి వెంకట రమణరావు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బయటకు వెళ్లాలని తలుపులు మూసేయాలని స్పీకర్ ఆదేశించారు. తర్వాత అసెంబ్లీ సిబ్బంది సభ్యుల సంఖ్యను లెక్కించారు. దాని ప్రకారం అనుకూలంగా 121 మంది ఉన్నారని స్పీకర్ తొలుత ప్రకటించారు. ఈ లేక్క పై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారని మరోసారి లెక్కించాలని కోరారు. దీంతో అసెంబ్లీ సిబ్బంది మళ్లీ లెక్కించారు, ఈలోగా బయటి నుంచి ఎమ్మెల్యేలు సంతకాలు చేసే హాజరు పట్టికను తీసుకు రావాలని స్పీకర్ పురమాయించారు. రెండోవ సారి లెక్కింపు పూర్తయ్యాక సభలో 133 మంది మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. తీర్మానాన్ని సభ ఆమోదించిందని తెలిపారు. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

శ్రీవారికి చిల్లర కష్టాలు.. టన్నుకు 30 వేలు చెల్లిస్తున్న టీటీడీ

తిరుమల శ్రీవారిని చిల్లర కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు చలామణిలో ఉన్న నాణాలను తొలగించుకునే ప్రయత్నం చేసిన టీటీడీ ఇప్పుడు చలామణిలో లేని నాణాల పై దృష్టి పెట్టింది. 80 టన్నుల నాణాలను ఆర్బీఏ సహాయంతో కరిగించేందుకు సిద్ధమవుతోంది. టీటీడీ వద్ద ఒకటోవ శతాబ్ధం నుంచి నేటి వరకు ఉన్న నాణాలు ఉన్నాయి. ప్రస్తుతం చెల్లు బాటులో లేని వాటిని కరిగించేందుకు ప్రయత్నిస్తోంది టీటీడీ. అణా నుంచి 25 పైసల వరకు ఉన్న నాణాలను కరిగించాలని అనుకుంటోంది. అయితే అల్యూమీనియం, నికెల్, స్టీల్, రాగి, ఇత్తడి నాణాలని కరిగించేందుకు సెయిల్ కంపెనీ ముందుకొచ్చింది. దీనికోసం టన్నుకు రూ.30,000 రూపాయలను ఇచ్చేందుకు అంగీకరించింది టీటీడీ. స్వామి వారికి ప్రతినిత్యం వచ్చే హుండీ ద్వారా అటు నగదు , నాణాలకు సంబంధించి 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కానుకలను భక్తులు సమర్పిస్తుంటారు. వీటిలో నాణాలు దాదాపు 20 లక్షల రూపాయల వరకు భక్తులు సమర్పిస్తుంటారు.

క్యాష్ బ్యాక్.. అమ్మఒడి పేరుతో ఇచ్చిన డబ్బు నుండి రూ.1000 తిరిగి ఇవ్వాల్సిందే!

ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమ్మ ఒడి పథకం రివర్స్ సీన్ మొదలైంది. పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లో రూ.15,000 రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విరాళం సాకుతో అందులో రూ.1000 రూపాయలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. దీన్ని ఆప్షన్ గా కాకుండా తప్పని సరి చేస్తూ తాజాగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  జనవరి 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లుల నుంచి వెనక్కి తీసుకునే వెయ్యి రూపాయలతో రాష్ట్రం లోని 44,570 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరచాలని ఆ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. స్కూళ్ల లోని బాత్రూమ్ లు శుభ్రం చేసే ఆయాలకు నెలకు రూ.4000 వేతనంగా ఇవ్వాలని అలాగే బ్రష్ లు, చీపుర్లు , ఫినాయిల్ కు నెలకు అయ్యే రూ.2000 రూపాయలను కాంపోజిట్ గ్రాంట్ కింద ఖర్చు పెట్టుకునేలా ఈ సర్క్యులర్ జారీ చేశారు.  తల్లులందరి నుంచి జమ చేసిన సొమ్ముతో పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు పారిశుధ్య నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రధానోపాధ్యాయులు ఈ నెల 30 న తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించి.. వారిని చైతన్యపరచాలి. సమావేశానికి హాజరైన వారు తమ వంతు విరాళంగా రూ.1000 రూపాయలను తల్లిదండ్రుల కమిటీకివ్వాలని అభ్యర్థించాలి. తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చేసిన సొమ్ముని జిల్లా స్థాయిలో డీఈవో ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు జమ చేయాలి.  పాఠశాల కమిషనర్ ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. చాలా చోట్ల ఇప్పటి వరకు ఎంతమందికి అమ్మఒడి నగదు పడిందో స్పష్టత లేదు. ఇప్పటికే నగదు జమ కాలేదని చాలా మంది తల్లితండ్రులు ప్రధానోపాధ్యాయులను నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలో అమ్మఒడి లబ్దిదారుల నుంచి వెయ్యి రూపాయల వసూలు చేయాలని చెప్పడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఒకసారి డబ్బు చెల్లించాక మళ్లీ కొంత ఇచ్చేయాలని అడిగితే ఎవరూ ముందుకు రారని, ఇది సాధ్యమయ్యే పని కాదని మండిపడుతున్నారు. పైగా ఫిబ్రవరి ఒకటి నుంచి బాత్రూంల నిర్వహణ అమలు చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ ఒడి లబ్దిదారులు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల లో కూడా ఉన్నారు. ఆ పాఠశాలల్లో పిల్లల ఫీజులలోనే అన్ని రకాల నిర్వహణ ఖర్చులు కలిపి వసూలు చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో లబ్ధిదారుల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేసి జేబులు నింపుకోవడం మినహా ఎలాంటి నిర్వహణ ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

జగన్ రూటు సపరేటు.. దేశంలో శానసమండలి కావాలని కోరిన పది రాష్ట్రాలు!

దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉందని.. మన రాష్ర్టానికి శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టిగా చెబుతుంటే, మరోవైపు ధర్మాన ప్రపంచంలో ఎగువ సభలు ఎన్నెన్ని దేశాల్లో ఉన్నాయో లెక్కలు వివరిస్తున్నారు. వాటిలో ఎంత నిజముందో వారికే తెలియాలి కానీ ప్రస్తుతం దేశంలో తమ రాష్ర్టానికి శాసనమండలి పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ 10 రాష్ట్రాలు కేంద్రానికి తీర్మానాలు పెట్టకున్నాయి. వాటి పై కేంద్రం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు శాసన మండలి ఏర్పాటు చేసుకుందామని ఎదురుచూస్తున్నాయి.  గతంలో శాసనమండలిని రద్దు చేసుకుని మళ్లీ కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని మరో ఐదు రాష్ట్రాలు కోరుతున్నాయి. శాసన మండలిని ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రాల ఇష్టం, ఆ ప్రకారం మొదట్లో కొన్ని రాష్ట్రాలు శాసన మండలి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్ అవసరం లేదని రద్దు చేసుకున్నాయి. మళ్లీ కొన్నేళ్లుగా తమకు మండలి అవసరముందని ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. గతేడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018 లో మండలిని పునరుద్దరించాలని మోదీ సర్కార్ కు తీర్మానం పంపారు. పంజాబ్ ఇప్పటికీ మూడు సార్లు తీర్మానాలు చేసి పంపింది. బెంగాల్ 2017 లో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు.  ఇప్పటి వరకు శాసన మండలి ఏర్పాటు చేసుకోని ఐదు రాష్ట్రాలు తమ రాష్ర్టానికి అవకాశమివ్వాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాలు పంపాయి. ఒడిష, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కౌన్సిల్ లేదు. గత రెండు మూడేళ్లుగా ఈ రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినా ఇంత వరకు కేంద్రం స్పందించలేదు. శాసన మండలికి సంబంధించి రాష్ట్రాలు పంపే తీర్మానాలను కేంద్రం వరుసగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏపీ సర్కారు చేసే తీర్మానాన్ని ఈ పది తీర్మానాల తర్వాతే కేంద్రం పరిగణిస్తుంది. వాటినే ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టిన కేంద్రం జగన్మోహనరెడ్డి సర్కారు చేసిన తీర్మానాన్ని ఆఘమేఘాల మీద పరిష్కరిస్తుందా అన్నది చర్చ నీయాంశంగా మారింది.  

కమలం వికశించలేదు.. కార్పొరేషన్ లో కొంత ఊరట తప్ప ఒరిగింది ఏమి లేదు!

పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో జోరు పెంచిన బిజెపి మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి రాష్ట్రంలో పాగా వేయాలనుకుంది. అయితే మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. అధికార పక్షం వేసిన ఎత్తులతో బీజేపీకి నిరాశ తప్పలేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలే ఇప్పుడు వస్తాయని బిజెపి భావించింది. అదే జోష్ లో చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరారు, అయినా ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ లకు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు మునిసిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధి లోని మక్తల్, ఆమన్ గల్ మునిసిపాలిటీలను గెలుచుకుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కూడా తమదే అనుకున్న బిజేపి ఆశల మీద అధికార టీఆర్ఎస్ పార్టీ నీళ్లు చల్లింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అండతో బీజేపీకి షాక్ ఇచ్చింది. మణికొండలో కాంగ్రెస్ కి ఛైర్ పర్సన్ స్థానాన్ని కట్టబెట్టి వైస్ చైర్మన్ చైర్ ని తీసుకుంది.  రాష్ట్రవ్యాప్తంగా 2,727 వార్డులు ఉంటే 2026 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 237 వార్డుల్లో మాత్రమే గెలిచింది. 10 కార్పొరేషన్లలో 385 డివిజన్ లు ఉంటే 344 చోట్ల పోటీ చేసి 78 డివిజన్లలో గెలిచింది. 48 మునిసిపాలిటీలు, రెండు మునిసిపల్ కార్పొరేషన్ లో ఖాతా తెరవలేదు. పార్టీకీ ఎంపీలు ఉన్న చోట కూడా ఫలితాలు అనుకూలంగా రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ ఇచ్చిన పట్టణాల్లో సైతం పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వార్డులు గెల్చుకుంటామని బీజేపీ నేతలు భావించినా ఫలితం తారుమారైంది.  అయితే ఒక్క నిజామాబాద్ కార్పొరేషన్ లో మాత్రం బిజెపి 60 డివిజన్లలో 28 డివిజన్లు దక్కించుకుంది. జిల్లాలో మిగతా చోట్ల మాత్రం నిరాశే ఎదురయ్యింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో బీజేపీకి పరాజయం తప్పలేదు. కొత్త నేతల చేరిక ఆ పార్టీకి కలిసిరాలేదు. వివేక్ ప్రభావం ఉంటుందని అనుకున్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీజేపీకి నిరాశే ఎదురైంది. డీకే అరుణ గద్వాలకే పరిమితం కాగా మిగతా నేతలు తమ ఇలాకాలో ఒకటి రెండు వార్డులకు పరిమితమయ్యారు. అయితే కొత్త వారి చేరిక వల్ల బీజేపీ గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది. 22 మునిసిపాలిటీల్లో 100 శాతం అభ్యర్థులను నిలపగలిగింది.  అయితే బీజేపీ నేతలు మాత్రం కమల వికాసం జరగకపోయినా పార్టీ విస్తరణ జరిగిందని సంబరపడుతున్నారు. అధికార పార్టీని తట్టుకుని నిలబడ్డామని ఈ ఫలితాలను తక్కువ చేసి చూడొద్దని అభిప్రాయపడుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ లలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. నిజామాబాద్ లో అత్యధిక డివిజన్లు గెలిచిన పార్టీగా నిలిచింది. మీర్ పేట్, బడంగ్ పేటలో చెప్పుకోదగ్గ డివిజన్ లను గెలిచి టీఆర్ఎస్ కు మెజారిటీ రాకుండా అడ్డుకోగలిగింది. కరీంనగర్ లో గతం కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది. కార్పొరేషన్ లలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లడం బిజెపికే ఊరటనిచ్చే విషయం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చిన కాంగ్రెస్ ఘోరంగా విఫలమవ్వటం కమలదళానికి కలిసొచ్చే అంశంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ట్విస్ట్ అదిరింది.. కారు ఖాతాలోకి వెళ్లిన నెరేడుచర్ల మునిసిపాలిటీ 

సినిమా తరహా ట్విస్ట్ ల మధ్య నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. చివరి నిమిషంలో శేరి సుభాష్ రెడ్డిని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ రంగంలోకి దించడంతో బలాబలాలు తారుమారైపోయాయి. నిన్నటి దాకా కాంగ్రెస్, టిఆర్ఎస్ బలం సమంగా ఉండింది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శైలి సుభాష్ రెడ్డి పేరుని  అదనంగా కలపడంతో టిఆర్ఎస్ బలం 11 కు చేరింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం టిఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లింది. ఈ రోజు ఉదయం నుండి నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కొంత ఉత్కంఠ నెలకొంది. సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఉన్న ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నిక జరగాలని డిమాండ్ చేశారు. కొత్తగా సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ పేరును చేర్చడం సరైంది కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే సుభాష్ రెడ్డి ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో తాము ఆత్మహత్య చేసుకుంటామని కూడా కాంగ్రెస్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు.    

వరుస మీటింగ్ లతో బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితలు విడుదలైన దెగ్గర నుంచి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వరుస ప్రెస్ మీట్ లు, మీటింగ్ లతో హడావిడిగా ఉన్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇవాళ వరుస మీటింగులతో బిజీ బిజీగా గడపనున్నారు. ఈ సాయంత్రం ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలను ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం.విభజన అంశాలను పార్లమెంట్ లో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్రానికి ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేటీఆర్.  కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్లతో సమావేశం కూడా నిర్వహించనున్నారు. రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున భేటీ అయ్యి నగరాభివృద్ధికి సంబంధించి చర్చించనున్నారు కెటిఆర్. కొద్ది సేపట్లోనే ఈ సమావేశలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున మేయర్ ల తో,చైర్ పర్సన్ ల తో కేటీఆర్ సమావేశంలో పాల్గొనటమేకాక, వాళ్ళకు గ్రామ అభివృద్ధికి తగిన సూచనలు,వారి స్థానాలల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తీసుకోవలసిన జాగ్రత్తలు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కొంత మేరా సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. మేజర్ గా నియమితులైయ్యే వారికి వాటికి సంబంధించి గైడెన్స్ ఇస్తూ గ్రామ అభివృద్ధిని పై దృష్టి సారించనున్నారు కేటీఆర్. .

జగన్ సర్కార్ కి హైకోర్టు షాక్... తొలగించాల్సిందే!!

వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై ఉండకూడదని, వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ భవనాలకు వారి పార్టీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే.. మరోవైపు పార్టీ రంగుల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. జగన్ సర్కార్ పై విపక్షాలు మండిపడ్డాయి. అయితే పంచాయతీ కార్యాలయాలకు రంగులేయడం మానలేదు. దాదాపు అన్ని పంచాయతీ కార్యాలయాలు వైసీపీ రంగులతో నిండిపోయాయి. అయితే ఇప్పుడు ఈ రంగుల వ్యవహారంలో హైకోర్టు షాక్ ఇవ్వడంతో.. వేసిన రంగులని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హడావుడిగా రంగులు వేసి వృధా ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ రంగులు తొలగించడానికి మళ్లీ అదనపు ఖర్చు. ఇలా వందల కోట్లు రంగుల పేరుతో వృధా చేసేబదులు.. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయొచ్చు కదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆ ఖర్చుతో చిన్న ప్రాజెక్ట్ లు పూర్తీ అయ్యేవని లేదా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగుపడేవని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రాజధాని మార్పు, మండలి రద్దు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళనున్న టిడిపి!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ ఎంపీలతో సమావేశమవుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అమరావతి రాజధాని, మండలి రద్దు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో టీడీపీ ఉన్నట్టు సమాచారం. కాసేపట్లో టిడిపి కార్యాలయంలో పార్టీ ఎంపీలతో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మండలి రద్దు, అమరావతి రాజధాని అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే త్వరలో జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహం మీద ఎంపీలతో చర్చించనున్నారు. మధ్యాహ్నం అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు, ఎందుకంటే నిన్న మండలి రద్దు జరిగిన తరువాత అనంతరం జరుగుతున్న పరిణామాల మీద ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, ప్రధాని మరియు కేంద్ర మంత్రులను కలవాలని, అమరావతి జె ఎ సి ని కలుపుకొని ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని తెలుగు దేశం పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీలకు టిడిపి పిలుపునిచ్చింది. అలాగే రేపు తెనాలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మండలిలో ఎలాంటి ప్రలోభాలకూ ఒత్తిళ్లకు లొంగకుండా నీతిగా, నిజాయితీగా నిలబడినటువంటి ఎమ్మెల్సీలను రేపు తెనాలి బహిరంగ సభకు ఆహ్వానించి సన్మానం చేయాలని టిడిపి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలూ, బహిరంగ సభలు నిర్వహించాలని టిడిపి, అమరావతి జేఏసీ నిర్ణయించింది. అయితే అన్ని పార్టీలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలనేది టిడిపి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. ఈరోజు తేలనుంది!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ మరియు ఏపీ హోం శాఖను చేర్చారు.  ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇటీవల వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు వేశారు. ఇప్పుడు వివేకా కూతురు సునీత కూడా.. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేయడంతో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న పిటిషన్లతోపాటూ... తాజా పిటిషన్‌పైనా ఈరోజు హైకోర్టు విచారించనుంది. కాగా, హైకోర్టు వివేకా హత్య కేసుని  సీబీఐకి అప్పగిస్తుందా లేదా అన్నది ఈరోజు తేలే అవకాశముంది.

హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న కరోనా వైరస్.... నేడు రానున్న అనుమానితుల ఫలితాలు

రోజుకొక కొత్త భయంకర రోగాలతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. మందులు లేని రోగాలతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి సైతం తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. మొన్నటి దాకా హడలెత్తించిన 'స్వైన్ ఫ్లూ' కే బయపడుతున్న ప్రజలకు 'కరోనా వైరస్' అనే కొత్త జబ్బు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతొంది.హైదరాబాద్ లోనూ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. చైనా నుండి వచ్చిన నలుగురు అనుమానితులు ఫీవర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో ముగ్గురు చైనా, హాంకాంగ్ నుండి వచ్చిన వ్యక్తులు కాగా వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ నలుగురినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించటంతో అతడి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు.ఈ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మిగిలిన ముగ్గురిలో ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలూ లేవు. కానీ ముందొస్తు చర్యలుగా వారిని కూడా ప్రత్యేక వార్డులో అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్య బృందం. చైనా నుండి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్దారించేంత వరకూ కుటుంబ సభ్యుడు సన్నిహితంగా ఉండేవారని ఇళ్లకే పరిమితం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ లక్షణాల కల్పించటానికి సుమారు రెండు వారాలు పట్టే అవకాశముందని ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా వైరస్ కు మందు లేదని లక్షణాలను బట్టి వైద్యం అందించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. తెలంగాణ మెడికల్ డిపార్ట్ మెంట్ ఫీవర్ ఆస్పత్రిలో 10, గాంధీలో 40, చెస్ట్ ఆస్పత్రిలో 50 పడకలతో ఇన్సులేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు.

జగన్‌కి చెక్ పెట్టేందుకు పవన్ స్కెచ్..! ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో?

ఊహించినట్లే శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. శాసనసభ ఆమోదించిన తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనుంది. దాంతో, మండలి రద్దు కథ... కేంద్రం కోర్టులో చేరుతుంది. అయితే, మండలి రద్దును తీవ్రంగా ఖండిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ... కేంద్రంలో చక్రం తిప్పగలరా అనే చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి పనిచేస్తున్న పవన్ కల్యాణ్... మండలి రద్దును అడ్డుకోగలుగుతారా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసినా.... కౌన్సిల్ రద్దు కావాలంటే మాత్రం అది కేంద్రం చేతిలో ఉంది. ఏపీ తీర్మానాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తేనే మండలి రద్దు జరుగుతుంది. దాంతో, ఏపీ విపక్షాల చూపు ఇప్పుడు మోడీ సర్కారుపై పడింది. అయితే, పవన్ కల్యాణ్ తన పలుకుబడిని ఉపయోగించి మండలి రద్దును అడ్డుకుంటారని జనసైనికులు అంటున్నారు. జగన్ దూకుడుకు చెక్ పెట్టేవిధంగా జనసేనాని పావులు కదుపుతున్నారని, కచ్చితంగా మండలి రద్దును అడ్డుకుంటారని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో కలిసి ఏపీలో ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుడుతోన్న పవన్... మండలి రద్దు అంశంపైనా దృష్టిపెడతారని చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని... బీజేపీతో కలిసి పోరాడుతున్నారు. అయితే, మండలి ఇష్యూ కూడా కలిసిరావడంతో... కేంద్రంలో చక్రం తిప్పి జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పవన్ ఆలోచిస్తున్నారట. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతోందంటూ ప్రధాని మోడీకి కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనాసరే మోడీ ద్వారా జగన్ కు చెక్ పెడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. అయితే, బీజేపీ అగ్రనాయకులతో పవన్ కు సత్సంబంధాలుంటే.... మోడీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి సఖ్యత కొనసాగిస్తున్నారు. అలాగే, కీలక బిల్లుల విషయంలో మోడీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతుగా నిలిచింది. మోడీ కూడా జగన్ విషయంలో సానుకూలంగానే ఉన్నారని అంటారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ద్వారా జగన్ కు చెక్ పెట్టడం అంత సులభం కాదని అంటున్నారు.

తీర్మానం చేసినా మండలి రద్దు కాదు..! న్యాయ నిపుణుల సంచలన వ్యాఖ్యలు

ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం... శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం త్వరలోనే కేంద్రానికి చేరనుంది. అయితే, మండలి తీర్మానాన్ని కేంద్రం... పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాక... రాష్ట్రపతి గెజిట్ విడుదల తర్వాతే... కౌన్సిల్ రద్దు జరుగుతుంది. అందుకే, మండలి రద్దు ఒక్క రోజులో తేలిపోయే వ్యవహారం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంపై అసెంబ్లీ మాజీ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండళ్లపై కేంద్రం దగ్గర ఇప్పటికే అనేక తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయని, దాంతో ఏపీ తీర్మానం ఇప్పటికిప్పుడు ఆమోదం పొందే అవకాశం లేదన్నారు. మండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్నారు  జంధ్యాల రవిశంకర్. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు మండలి కొనసాగుతుందని తెలిపారు. 2013 నుంచి 2019వరకు ఇలాంటివి ఐదు బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని జంధ్యాల అన్నారు. 1970లో యూపీ చేసిన మండలి రద్దుకు తీర్మానం చేసినా ...1980 వరకు కూడా కేంద్రం ఆమోదం పొందలేదని... అప్పటివరకు మండలి కొనసాగిందని గుర్తుచేశారు. ఇక, ఇఫ్పుడు ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై కూడా ఏడాదిలోపు అయితే పార్లమెంట్ లో చర్చ కూడా జరిగే అవకాశం లేదన్నారు.  మరోవైపు, బిల్లులు సెలెక్ట్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నాయంటూ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు మండలి రద్దు తీర్మానంపై న్యాయస్థానంలో ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనూ శాసనసభలాగే మండలి కూడా యథావిధిగా సమావేశం కావాల్సి ఉంటుందన్నారు. అలాగే,  సెలెక్ట్ కమిటీకి అధికార పార్టీ పేర్లు ఇవ్వకపోతే ఛైర్మనే స్వయంగా కొందరిని నియమించుకునే అధికారం ఉందన్నారు.