ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్న అభ్య‌ర్థులు!

స్థానిక‌ సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన‌ట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ప్ర‌తిప‌క్షాలు హ‌డ‌లిపోతున్నాయి. ప్ర‌భుత్వం అనుకుంటే ఎలాగైనా ఇరికించి జైలుకు పంపిస్తుంద‌నే భ‌యం పోటీ చేయాల‌నుకునే అభ్య‌ర్థుల‌ను వెంటాడుతుంద‌ట‌. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మద్యం పంచ‌వ‌ద్దు. పంచిన‌ట్లు రుజువు అయితే ఆ అభ్య‌ర్థి గెలిచినా జైలుకు వెళ్ళ‌డం త‌ప్ప‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థులు మద్యం ఎలా పంచుతారు. మందుషాపుల‌న్నీ ప్ర‌భుత్వ అజ‌మాయిషీలోనే న‌డుస్తున్నాయి. జ‌నం లైన్‌లో నిల‌బ‌డి మందు కొంటున్నారు. కాబ‌ట్టి ప్ర‌త్య‌ప‌క్షాల‌కు మందు పంచే అవ‌కాశం ఈ ఎన్నిక‌ల్లో వుండ‌క‌పోవ‌చ్చు. ఇటీవ‌ల ఎపి ప్ర‌భుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేసి, ఆర్డినెన్స్‌ జారీ చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తూ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వేసిన‌ సెటైర్లపై జ‌నం ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. అమ్మో స్థానిక ఎన్నిక‌ల్లో పోటీ చేయం. గెలిచినా చ‌ట్టాన్ని ఉప‌యోగించుకొని జైలుకు పంపిస్తారు. ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత కూడా ఎవ‌రైనా తాను ఫ‌లానా అభ్య‌ర్థి వ‌ద్ద‌ డ‌బ్బు తీసుకొని ఓటు వేసిన‌ట్లు ఫిర్యాదు చేస్తే, గెలిచిన అభ్య‌ర్థి ఓడిపోయిన‌ట్టే. అంత‌టితో ఆగ‌కుండా ఈ చ‌ట్టం ద్వారా జైలుకు వెళ్ళ‌డం త‌ప్ప‌దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని ఆర్డినెన్స్‌లో వుంది. గరిష్టంగా మూడేళ్లు జైలు, రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. గ్రామంలో ఉండేవాళ్లే సర్పంచ్‌లుగా పోటీ చేయాలని ఆర్డినెన్స్‌ సూచించింది. వందశాతం గిరిజనులున్నచోట గిరిజనులకే పోటీ చేసే అవకాశాన్ని ఆర్డినెన్స్ ద్వారా కల్పించారు. సి.ఎం. జ‌గ‌న్ తీసుకు వ‌చ్చిన ఈ ఆర్డినెన్స్‌తో స్థానిక ఎన్నిక‌ల్లో నిల‌బ‌డే ద‌మ్ము ఎవ‌రికి ఉంటుంది? అన్నీ ఏక‌గ్రీవంగానే అధికార పార్టీ గెల్చుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజూ పాల్గొనాలని ఆర్డినెన్స్‌లో పేర్కొన‌డం వెనుక ప‌క్కా ప్లానే వుందంటారు జేసి. జేసీ లాంటి వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేమ‌ని చేతులెత్తేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ఎన్నిక‌లు ఎలా జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల‌కు ముందు వైరాగ్యం పెంచుకుంటున్నార‌టంటే సిఎం జ‌గ‌న్ స‌త్తా ఏమిటో ప్ర‌తిప‌క్షాల‌కే కాదు ప్ర‌జ‌ల‌కూ ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.

కృష్ణాజిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. కృష్ణాజిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. ***జెడ్పీటీసీ రిజర్వేషన్లు ( కృష్ణాజిల్లా )*** # జగ్గయ్యపేట - ఎస్టీ ( మహిళ ) # ఏ.కొండూరు - ఎస్టీ # గన్నవరం - ఎస్సీ ( మహిళ ) # పెనమలూరు - ఎస్సీ ( మహిళ ) # బాపులపాడు - ఎస్సీ ( మహిళ ) # వత్సవాయి - ఎస్సీ ( మహిళ ) # వీరుళ్లుపాడు - ఎస్సీ ( మహిళ ) # కంచికచర్ల - ఎస్సీ ( మహిళ ) # విజయవాడ - ఎస్సీ  # గంపలగూడెం - ఎస్సీ  # నూజివీడు - ఎస్సీ # కంకిపాడు - ఎస్సీ # ముసునూరు - ఎస్సీ # జి.కొండూరు - ఎస్సీ # కైకలూరు - బీసీ ( మహిళ ) # కలిదిండి - బీసీ ( మహిళ ) # మండవల్లి - బీసీ ( మహిళ ) # మండవల్లి - బీసీ ( మహిళ ) # ముదినేపల్లి - బీసీ ( మహిళ ) # కృత్తివెన్ను -  బీసీ ( మహిళ ) # మచిలీపట్నం - బీసీ # అగిరిపల్లి - బీసీ  # మైలవరం - బీసీ # గూడూరు - బీసీ # నాగాయలంక - బీసీ # బంటుమిల్లి - జనరల్ ( మహిళ ) # ఉయ్యూరు - జనరల్ ( మహిళ ) # ఉంగుటూరు - జనరల్ ( మహిళ ) # చాట్రాయి - జనరల్ ( మహిళ ) # పమిడిముక్కల - జనరల్ ( మహిళ ) # చల్లపల్లి - జనరల్ ( మహిళ ) # గుడ్లవల్లేరు - జనరల్ ( మహిళ ) # పామర్రు - జనరల్ ( మహిళ ) # పెనుగంచిప్రోలు - జనరల్ ( మహిళ ) # నందివాడ - జనరల్ ( మహిళ ) # మొవ్వ - జనరల్ ( మహిళ ) # ఇబ్రహీంపట్నం - జనరల్ ( మహిళ ) # పెదపారుపూడి - జనరల్ ( మహిళ ) # తోట్లవల్లూరు - జనరల్ # చందర్లపాడు - జనరల్ # రెడ్డిగూడెం - జనరల్ # కోడూరు - జనరల్ # పెడన - జనరల్ # తిరువూరు - జనరల్ # ఘంటసాల - జనరల్ # విస్సన్నపేట - జనరల్ # మోపిదేవి - జనరల్ # నందిగామ - జనరల్ # అవనిగడ్డ - జనరల్ # గుడివాడ - జనరల్

స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో భారీగా ఐపిఎస్ బదిలీలు పదోన్నతులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి. పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా హరీశ్‌ కుమార్‌ గుప్తా, విశాఖపట్నం అదనపు డీజీగా ఆర్‌కే మీనాకు పదోన్నతి లభించింది. ఎస్‌ఐబీ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌, మైరెన్‌ విభాగం ఐజీగా ఏఎస్‌ఖాన్‌ నియమితులయ్యారు. గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు బదిలీ అయ్యారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌ ఐజీతో పాటు ఎక్సైజ్‌. ప్రొహెబిషన్‌ డైరెక్టర్‌గా వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు దక్కాయి. డిజీపీ కార్యాలయంలో లీగల్ ఐజీగా నాగేంద్ర కుమార్ నియ‌మితుల‌య్యారు. వీరే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్ కుమార్, ఏసీబీ ఐజీగా అశోక్ కుమార్, ఏలూరు రేంజ్ డీఐజీగా కేవి మోహన్ రావు, నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్ , ఏపీఎస్సీ కాకినాడ కమాండెంట్ గా అమిత్ బర్దార్, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎస్ఐబీ చీఫ్ గా శ్రీకాంత్, ఐజీ లీగల్ గా పి.హరికుమార్, సీఐడీ డీఐజీగా హరికృష్ణ, ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా ఎస్వీ రాజశేఖర్ బాబులను ప్రభుత్వం నియమించింది.

కడప జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. కడప జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. ***జెడ్పీటీసీ రిజర్వేషన్లు ( కడప జిల్లా )*** # కొండూరు - ఎస్టీ # పుల్లంపేట - ఎస్టీ # పెనగలూరు - ఎస్సీ (జనరల్) # పోరుమామిళ్ల - ఎస్సీ (జనరల్) # ఓబులవారిపల్లి - ఎస్సీ (జనరల్) # బి.కోడూరు - ఎస్సీ (జనరల్) # పుల్లంపేట - ఎస్సీ (మహిళ) # ప్రొద్దుటూరు - ఎస్సీ (మహిళ) # ఖాజీపేట - ఎస్సీ (మహిళ) # రాజంపేట - ఎస్సీ (మహిళ) # చాపాడు - ఎస్సీ (మహిళ) # మైలవరం - బీసీ (మహిళ) # జమ్మలమడుగు - బీసీ (మహిళ) # కొండాపురం - బీసీ (మహిళ)  # ముద్దనూరు - బీసీ (మహిళ) # చిన్నమండ్యం - బీసీ (మహిళ)  # గాలివీడు - బీసీ (మహిళ) # ఎల్‌ఆర్ పల్లి - బీసీ (మహిళ)  # దువ్వూరు - బీసీ (జనరల్) # ఎర్రగుంట్ల - బీసీ (జనరల్) # టి.సుండుపల్లి - బీసీ (జనరల్) # వీరబల్లి - బీసీ (జనరల్) # పెండ్లిమర్రి - బీసీ (జనరల్) # లింగాల - బీసీ (జనరల్) # రామాపురం - బీసీ (జనరల్) # వల్లూరు - బీసీ (జనరల్) # నందలూరు - జనరల్ (మహిళ) # రాజుపాలెం  - జనరల్ (మహిళ) # తుండూరు - జనరల్ (మహిళ) # సాంబేపల్లి  - జనరల్ (మహిళ) # సింహాద్రిపురం  - జనరల్ (మహిళ) # పెద్దముడియం  - జనరల్ (మహిళ) # చెన్నూరు  - జనరల్ (మహిళ) # చిట్టివేల్  - జనరల్ (మహిళ) # వీఎన్ పల్లి  - జనరల్ (మహిళ) # మైదుకూరు  - జనరల్ (మహిళ) # అట్లూరు  - జనరల్ (మహిళ) # కమలాపురం - జనరల్ (మహిళ) # రాయచోటి - జనరల్ # సిద్ధవటం  - జనరల్ # సీకే దిన్నె - జనరల్ # ఒంటిమిట్ట - జనరల్ # కలసపాడు  - జనరల్ # బద్వేల్ - జనరల్ # వేముల  - జనరల్ # వేంపల్లి  - జనరల్ # కాశినాయిని- జనరల్ # పులివెందుల  - జనరల్ # చక్రాయపేట  - జనరల్ # గోపవరం - జనరల్ # బి.మఠం - జనరల్

అంతా తూచ్ అన్న ఆర్ధర్... జగన్ అక్షింతలతో మారిన మాట...

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాల కారణంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన ప్రచారానికి బ్రేక్ పడింది. నందికొట్కూరులో వైసీపీ శ్రేణులు బైరెడ్డి అండ్ ఆర్ధర్ వర్గాలుగా విడిపోవడం... ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో... ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్నే నియమించడంతో ఎమ్మెల్యే ఆర్ధర్ తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. అంతేకాదు, తాను ప్రతిపాదించిన గండ్రెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. దాంతో, ఒకవైపు బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలు... మరోవైపు తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ ఆయన అనుచరులు ప్రచారం చేశారు. దాంతో, ఆర్ధర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నవేళ ఆర్ధర్ అసంతృప్తి వెళ్లగగ్గడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, మీడియా ముందుకొచ్చిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్... తన నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవులు తాను ప్రతిపాదించిన వాళ్లకు రానందుకు బాధ లేదని అన్నారు. అలాగే, పదవులు వచ్చినవారికి కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యమన్న ఎమ్మెల్యే ఆర్ధర్... నందికొట్కూరు నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. తన అనుచరులకు మార్కెట్ కమిటీలో చోటు దక్కనందుకు మనస్తాపానికి గురైన మాట నిజమేనన్న ఎమ్మెల్యే ఆర్ధర్... పదవులు అందరికీ రావంటూ కార్యకర్తలకు నచ్చజెప్పానన్నారు. అయితే, నందికొట్కూరు మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తనకు ...పాలకవర్గం ప్రమాణస్వీకారానికి ఆహ్వానం అందలేదని, దీనిపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలపైనా ఎమ్మెల్యే ఆర్ధర్ స్పందించారు. బైరెడ్డితో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిని తాను ఎప్పుడూ విమర్శించలేదని ఆర్ధర్ తెలిపారు. ఇక, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను జిల్లాలో అడుగుపెట్టనీయమని తన అనుచరులు అనలేదని ఆర్ధర్ క్లారిటీ ఇఛ్చారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలుచుకుని, సీఎం జగన్ కు కానుకగా ఇస్తానన్నారు. అయితే, విభేదాలను పక్కనబెట్టి, కలిసి పనిచేయాలంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్షింతలు వేయడంతోనే, బైరెడ్డితో విభేదాలకు ఆర్ధర్ పాజిటివ్ ఎండింగ్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.

చిత్తూరు జిల్లా జెడ్పీటీసీ రిజర్వేషన్ల వివరాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. హైకోర్టు దిశానిర్దేశం మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. చిత్తూరు జిల్లాజెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. ***జెడ్పీటీసీ రిజర్వేషన్లు ( చిత్తూరు జిల్లా )*** # బి.కొత్తకోట - బీసీ # బైరెడ్డిపాలెం - ఎస్సీ # బంగారుపాలెం - ఎస్సీ # బుచ్చినాయుడు కండ్రిగ - జనరల్‌ (మహిళ) # చంద్రగిరి - జనరల్‌ # చిన్నగొట్టిగల్లు - జనరల్‌ (మహిళ) # చిత్తూరు - జనరల్ # చౌడేపల్లి - జనరల్‌ # జీడీ నెల్లూరు - బీసీ # గంగవరం - బీసీ (మహిళ) # గుడిపాల - ఎస్సీ (మహిళ) # గుడుపల్లె - బీసీ # ఐరాల - జనరల్‌ (మహిళ) # గుర్రంకొండ - జనరల్‌ (మహిళ) # కేవీబీపురం - ఎస్సీ (మహిళ) # కంభంవారిపల్లె - జనరల్‌ (మహిళ) # కలకాడ - ఎస్సీ (మహిళ) # కలికిరి - బీసీ (మహిళ) # కార్వేటినగరం - ఎస్సీ (మహిళ) # కుప్పం - బీసీ # కురబలకోట - జనరల్‌ (మహిళ) # మదనపల్లె - బీసీ # ములకలచెరువు - జనరల్‌ # నాగాలపురం - జనరల్‌ (మహిళ) # నగరి - ఎస్సీ # నారాయణవనం - ఎస్సీ # నిమ్మనపల్లి - జనరల్‌ (మహిళ) # నింద్ర - జనరల్ (మహిళ) # పెద్దతిప్పసముద్రం - జనరల్  # పాకాల -  బీసీ (మహిళ) # పలమనేరు - జనరల్ # పాలసముద్రం - ఎస్సీ # పెద్దమాండ్యం - జనరల్ (మహిళ) # పెదపంజని - బీసీ (మహిళ) # పెనుమూరు - బీసీ  # పీలేరు - జనరల్ # పిచ్చాటూరు - జనరల్ (మహిళ) # పులిచర్ల-జనరల్ # పుంగనూరు - బీసీ (మహిళ) # పూతలపట్టు - ఎస్సీ (మహిళ) # పుత్తూరు -  జనరల్ (మహిళ) # రామచంద్రపురం - జనరల్ (మహిళ) # రామకుప్పం - ఎస్టీ # రామసముద్రం - జనరల్ # రేణిగుంట - జనరల్ (మహిళ) # రొంపిచర్ల -  జనరల్ # శాంతిపురం- బీసీ # సత్యవేడు -  జనరల్ # సోదం -  జనరల్ # సోమల - బీసీ (మహిళ) # శ్రీకాళహస్తి - జనరల్ # శ్రీరంగరాజపురం - జనరల్ # తంబళ్లపల్లి - జనరల్ (మహిళ) # తవనంపల్లి - ఎస్సీ (మహిళ) # తొట్టంబేడు - ఎస్సీ (మహిళ) # తిరుపతి రూరల్ - ఎస్టీ (మహిళ) # వాదమలపేట - జనరల్ # వాల్మీకిపురం - బీసీ (మహిళ) # వరదాయపాలెం - ఎస్టీ (మహిళ) # వెదురుకుప్పం - ఎస్సీ # వెంకటగికోట - బీసీ (మహిళ) # విజయపురం - జనరల్ (మహిళ) # యాదమర్రి - జనరల్ # ఏర్పేడు - ఎస్సీ # యర్రావారిపాలెం - జనరల్‌  

ప్ర‌గ‌తిప‌థంలో తెలంగాణ.. సంక్షేమ‌రంగానికే ప్రాధాన్య‌త‌!

గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగం తెలంగాణా శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్‌ తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని,  సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదలకు భద్రత కల్పించాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60 వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు. పట్టణాల్లో రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచింది. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో తక్కువ వేతనంతో పని చేస్తున్న ఉద్యోగులు కూడా సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులయ్యారని తమిళిసై తెలిపారు. గతంలో రేషన్‌షాపు ద్వారా ఒక్కొక్కరికీ 4 కిలోల బియ్యం ఇస్తే, ఇప్పుడేమో  6 కిలోలకు పెంచామ‌ని ఆమె   చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేపపిల్లలను ప్రభుత్వం వదిలిందని గవర్నర్‌ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నడుపుతున్నామ‌న్నారు.  విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని అందిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేసిందన్నారు. వివిధ వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఖర్చు చేస్తుందన్నారు. డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాదబీమాను ప్రభుత్వం కల్పించిందని గవర్నర్‌ తెలిపారు. పూజారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తోందని గవర్నర్‌ స్పష్టం చేశారు. మసీదుల్లో ఉండే ఇమామ్‌, మౌజమ్‌లకు నెలకు రూ. 5 వేల చొప్పున భృతి అందిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లకు ఉపయోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తోందని తమిళిసై తెలిపారు. పోలీసు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. హోంగార్డులకు దేశంలో ఎక్కడా లేనంత వేతనం తెలంగాణలోనే అందుతుందన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30 శాతం అదనపు రిస్క్‌ అలవెన్స్‌ అందిస్తోందన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 28 శాతాన్ని ప్రభుత్వం బోనస్‌గా అందిస్తోందని గవర్నర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద రూ. 1,00,016 ఇస్తున్నాం. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్‌ తెలిపారు. గ‌వ‌ర్న‌ర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం సభ శ‌నివారానికి వాయిదా పడింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శ‌నివారంనాడు సభలో చర్చ జరగనుంది. 

కామ‌పిశాచి టీచ‌ర్ అరాచ‌కాలు!

పాఠాలంటూ పిలిచి పైశాచికం సందేహాలడిగితే ఇంటికి రమ్మంటాడు అమ్మాయిల‌ పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన సామ శరత్‌కుమార్ మూడేళ్లుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలికలు సందేహాలడిగితే ఇంటికి రమ్మనేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టేవాడు. ఒక బాలిక స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడం చూసి తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు చెప్పడంతో హతాశురాలైన తల్లి ఏం జరిగిందని పాపను అడిగితే విషయం చెప్పింది. వెంటనే పాఠశాలకు వెళ్లి యజమాన్యాన్ని నిలదీసి ఉపాధ్యాయుడి కోసం గాలింపు చేపట్టారు. కొల్లాపూర్‌ వెళ్లాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లి పట్టుకుని తీసుకువచ్చారు. గ్రామస్థులతా కలిసి ప్రశ్నించగా మద్యం మత్తులో తప్పుచేశానని అంగీకరించాడు. దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు. సీఐ సూర్యానాయక్‌ గోపాల్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో అతణ్ని విచారించారు. మరి కొందరు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించానని అతడు అంగీకరించాడు.

ఆ కొండపైనే ఏపీ సచివాలయం!

రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేసే విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా అడుగులు వేస్తున్నారు. సి.ఎం. ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే  విశాఖ‌ప‌ట్నం మధురవాడలోని మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం చేయ‌డానికి  స‌ర్కార్ స‌న్న‌ద్ధ‌మైంది.  కాపులుప్పాడ కొండ వున్న మొత్తం ప్రాంతాన్ని సచివాలయం తో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు.   కాపులుప్పాడలో విశాలమైన కొండలు ఉన్నాయి. గతంలోనే రెవెన్యూ యంత్రాంగం 1300 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించింది. తాజాగా 250 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసేందుకు, ముఖ్యంగా సెక్రటేరియట్‌ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లును అధికారులు ఇక్కడి నుంచే చేస్తున్నారు.  సహజసిద్ధమైన ప్రకృతి సంపదకు కేంద్ర బిందువైన కాపులుప్పాడ ప్రాంతం భీమిలి ఏరియాలోనే ఉంది. ప్రస్తుతం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. 250 ఎకరాల విస్తీర్ణ స్థలంలో లేవుట్ వేయగా..175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇతర కొండలను చదును చేసి మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకరావాలని అధికారులు భావిస్తున్నారు. అదానీ డేటా సెంటర్‌ కోసం కొండ దిగువ ప్రాంతంలో 175 ఎకరాలను ఎంపిక చేసి ఇక్కడ 'క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా సెంటర్‌'ను పెట్టాలని గ‌తంలో నిర్ణ‌యించారు. అయితే రూ.70 వేల కోట్ల పెట్టుబడితో అదానీ వస్తాడని ప్రణాళికలు వేయడం అత్యాశే అవుతుందని భావించి వైసిపి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొట్టిపడేసింది.  ఎపిఐఐసి ఇదివరకే అదానీ గ్రూప్‌ సంస్థకు ఇచ్చేందుకుగానూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 175 ఎకరాలను ఆమోదించగా, వైసిపి ప్రభుత్వం అధికారానికి వచ్చాక రద్దు చేసింది.   ఇప్పటికే కొండలపై నీటి ట్యాంకులను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎపిఐఐసి ఇక్కడ రూ.100 కోట్లు ఖర్చు చేసి కొండలను చదును చేసింది. 

అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ కి కొత్త కష్టం

హెచ్ 1 బి వీసా కోసం ఎదురుచూస్తున్న 24 వేల మంది తెలుగు విద్యార్థులు ఏప్రిల్ తో ముగియనున్న నివాస గ‌డువు వీసా రాక‌పోతే తిరుగుపయనం తప్పదు. అమెరికాలో భారతీయులకు కష్టమొచ్చింది. వచ్చే ఏప్రిల్ తో 68 వేల మంది ఎన్నారై స్టూడెంట్ల భ‌విష్య‌త్ రోడ్డున ప‌డ‌నుంది. ఓపీటి ముగియ‌నుండ‌టంతో  భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉన్నత విద్యకోసం ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడ హెచ్ 1 బి వీసా కోసం ఎదురుచూస్తున్న వారు 68 వేల మంది ఉన్నారు. వీరిలో తెలుగు వారు అత్యధికంగా 24 వేల మంది ఉన్నారు.   వీరి అమెరికా నివాస గడువు ఈ ఏప్రిల్ తో ముగియనుంది. వీరిలో ఎవరికైతే హెచ్ 1 బి వీసా దొరుకుతుందో వారు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. మిగతా వారు అక్కడి నుంచి ఉద్యోగాలు వదిలి అర్ధంతరంగా తిరుగుపయనం కాక తప్పదు. వీరంతా ప్రస్తుతం ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం) కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. హెచ్ 1బి వీసా రానివారికి తిరుగుపయనం తప్పదు. ఒకవేళ అక్కడే ఉండాలి అనుకుంటే... వారికు మరో అవకాశం ఉంది. అక్కడ ఏదైనా మరోకోర్సులో జాయిన్ అయితే... మరో మూడేళ్లు నివాసం ఉండొచ్చు. కోర్సులో చేరాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నవారికి అది సాధ్యమవుతుంది. కానీ ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే... హెచ్ 1 బి వీసా ఉండాలి.  ఇది విదేశీయులకు అమెరికాలో ఉండటానికి జారీ చేసే అనుమతి పత్రం వంటిది. ఇది మొదటి సారి మూడేళ్లకు ఇస్తారు. తర్వాత దానిని మరోసారి పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా ఆరేళ్లు మాత్రమే ఈ వీసా మీద అమెరికాలో ఉండగలరు. ఏదైనా స్కిల్ ఆధారంగా మాత్రమే దీనిని మంజూరు చేస్తారు. ఈ హెచ్-1బీ వీసా మూడు రకాలుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం నిర్దేశించిన సంఖ్యలో మాత్రమే వీసాలను జారీ చేస్తారు. హెచ్ 1 బి వీసా పొందిన వారి రక్తసంబంధీకులు డిపెండెంట్ వీసా ( హెచ్ 4) తీసుకుని వారితో కలిసి ఉండొచ్చు.

ఆరోగ్యకర అలవాట్లతో కొరోనాను నిరోధించవ‌చ్చు

ఆందోళన వద్దు. భయభ్రాంతులకు గురికావద్దు. మన రోగనిరోధకశక్తే మనకు రక్ష అంటోంది జ‌న విజ్ఞాన వేదిక‌. చైనాలో 80వేల మందికి కొరోనా వైరస్ సోకగా 50వేల మందికి ఇప్పటికే నయమైంది. కేవలం 3వేల మంది మాత్రమే చనిపోయారు. 4% మంది కూడా చనిపోలేదు. సాధారణ ఫ్లూ వైరస్ తో కూడా ఇంతకంటే ఎక్కువ మంది చనిపోతారు. కావున ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదు. వృద్దులు, గర్భిణి స్త్రీలు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ వంటి, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు హై రిస్క్ గ్రూపు. కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 100 - 250nm సైజులో ఉంటాయి. అందరూ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. కరోనా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు N95 మాస్కులు ఖచ్చితంగా వాడాలి. దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు సాధారణ మాస్కులు వాడాలి. ఆవీ లేకపోతే జేబురుమాళ్ళు వాడాలి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా జేబురుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. జేబురుమాలు లేకపోతే మోచేతిని బెండ్ చేసి నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన నోటి తుంపర్లు ఇతరుల మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు. మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా నోరు, ముక్కు, కండ్ల ద్వారా మనకు చేరుతుంది. కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలు ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే, సరిపోతుంది. కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.   ఈ వైరస్ గనుక, 26-27 ° C ఉష్ణోగ్రత ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి. ఇప్పటి మన ఎండలకు రూమ్ టెంపరేచర్ లో కూడా ఈ వైరస్ బ్రతకలేదు. AC గదుల్లో, వాహనాళ్లో ఉండేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాంటి చల్లని పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.

ఢిల్లీ హింసపై నోరు మెదపరేం?

బిజెపి మిత్ర‌పక్షాలపై ఎంపీ అసదుద్దీన్‌ విమర్శలు తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లో  సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్‌పీఆర్‌పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్‌పీఆర్‌పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్‌లో దాని ప్రక్రియ ఆగుతుందని తేల్చిచెప్పారు. ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా భారతీయులేనని, ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు.  ఢిల్లీ హింసాకాండపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌనం వహిస్తున్నాయని.. నితీశ్‌కుమార్, రామ్‌విలాస్‌ పాశ్వాన్, అకాలీదళ్‌ హింసపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు.  ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

ర‌సం కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుందా?

మిరియాల చారు తాగండి. కరోనాను తరిమికొట్టండి. అవును. కరోనా కు విరుగుడు మన కరేపాకు వేసిన మిరియాల చారేన‌ట‌. ఇది ఇప్పుడు చైనాలో ప్ర‌చారంలో వుంది.  ఇది ఇప్పుడు కరోనా వైరస్ కి విరుగుడుగా ప‌నిచేస్తుంద‌ట‌. అద్భుత వనమూలికలూ, మషాలా దినుసులు, అల్లం, మిరియాల తో తయారు చేసిన భారతీయ వంటకం ర‌సం. దీనితో కరోనా వైరస్ ను రాకుండా చేసుకోవచ్చని ఇప్పుడు చైనా లో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. హోటళ్లలో కూడా ప్రత్యేకంగా ఫ్లెక్సీ స్టాండులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారట‌. ' రసం పవర్ ' అని దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు చైనా వాళ్ళు. 5 వేల ఏళ్ల నాటి భారతీయ వంటకం ర‌సం. దీనిపై పేటెంట్ ఎలా తీసుకుందామ‌ని ఆలోచించ‌కుండా ముందు ర‌సం సేవించండి.   మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఆచారాలు, జీవన విధానాల వెనుక ఏదొక విజ్ఞానం(సైన్స్) ఇమిడి ఉంటుంది. కాబ‌ట్టి మిరియాల చారు తాగుదాం కరోనాను తరిమికొడదాం.

రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలా? వ‌ద్దా అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవ‌ద‌ని మ‌రోసారి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వివ‌ర‌ణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి సైతం వేసవి రాజధానిని ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు. రాజధాని ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం పార్లమెంటులో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ శాఖ కోరిన అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయ‌ద‌ని ఆయ‌న చెప్పారు. రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందని  పేర్కొందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చి కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకోదన్నారు. ఎవరైనా  అమరావతి విషయంలో తప్పుడు హామీలు ఇచ్చినా, వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే పరిగణించాలని జీవీఎల్ స్పష్టంచేశారు.

ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజు ఫిక్స్‌!

కనిష్ఠం రూ.35 వేలు 288లో 150 కాలేజీలకు ఖరారు మిగతావాటిపైనా నేడు నిర్ణయం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజ్‌ల ట్యూషన్‌ ఫీజు ఖరారు చేశారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల బ్లాక్‌ పీరియడ్‌కు మొత్తం 288 ఇంజనీరింగ్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు ఖరారు కావాల్సి ఉంది. గురువారం ప్రత్యేకంగా సమావేశమైన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌... ఇందులో దాదాపు 150 కాలేజీల ఫీజులను తేల్చింది. కనీస ఫీజు రూ.35 వేలుగా నిర్ణయించారు. అయితే కొన్ని కాలేజీల విషయంలో పున:సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కమిషన్‌ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆడిటర్‌ రిపోర్టును బట్టి చూస్తే పలు కాలేజీలకు ఫీజును గతంలో కంటే తగ్గించాల్సి ఉందన్న భావన ఈ సమావేశంలో వ్యక్తమయినట్టు చెబుతున్నారు. ఉన్నత విద్య నియంతణ్ర, పర్యవేక్షణ కమిషన్‌ బృందాలు గత నవంబర్‌ 27 నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. జనవరి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియను పూర్తిచేశాయి. ఫిబ్రవరి 4 నుంచి కాలేజీలతో వ్యక్తిగత విచారణ మొదలుపెట్టి మార్చి 3తో ముగించాయి. కాలేజీలు సమర్పించిన ఫీజుల ప్రతిపాదనలు, తనిఖీల నివేదికలు, వ్యక్తిగత విచారణ అనంతరం..గురువారం కమి షన్‌ సమావేశమైంది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కాలేజీల పనితీరును బట్టి వాస్తవంగా ఎంతవస్తే అంతే సిఫారసు చేద్దామని పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో  మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజుల ఖరారులో విద్యాబోధన , సదుపాయాలు, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు, ఆదాయ, వ్యయాలు, ఏఐసీటీఈ నిబంధనల అమలు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. కన్వీనర్‌ కోటా ఫీజుకు దాదాపు డబుల్‌ ఫీజును కేటగిరీ-బి అడ్మిషన్లలో వసూలు చేసుకునేలా సిఫారసు చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికభారం తగ్గించుకునే ఆలోచనతోనే ఫీజులు తగ్గిస్తున్నారని కాలేజీల మేనేజ్‌మెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

కడప లో మ‌రో స్టీల్ ప్లాంట్!

కడప జిల్లాలో 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.   ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో రవాణా సదుపాయం ఉందని వారికి వివరించారు. రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌ సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలు న్నాయని కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ నీలం సహానీ, ఇండిస్టీస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్‌, ఐఎంఆర్‌ ఎజి చైైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్‌, కంపెనీ డైరెక్టర్‌ అని ర్యుధ్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఒర్‌ కంపెనీ సిఇఒ అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సిఎఫ్‌ఒ కార్ల్‌డిల్నెర్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రా జెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజరు సిన్హా, ఎపి ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎమ్‌డి పి.మధుసూదన్‌ పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తి

ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం దిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 69.54 శాతం పూర్తయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు వెల్లడించింది. తెదేపా ఎంపీ కేశినేని నాని లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2016 సెప్టెంబర్‌ 30 నాటి కేంద్ర ఆర్థికశాఖ లేఖ ప్రకారం 100 శాతం పోలవరం ప్రాజెక్టు ఖర్చును కేంద్రమే భరిస్తుందని అందులో స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాను కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని సమాధానంలో పేర్కొన్నారు. కేంద్రం ప్రకటన చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం ఆమోదం ప్రకారం ఏపీ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.8,614.16కోట్లు చెల్లించామని.. గతనెలలో విడుదల చేసిన రూ.1,850 కోట్లు కూడా దీనిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ఏపీ ఇచ్చే వివరాలపైనే మిగిలిన నిధులు... పోలవరంపై 2014 మార్చి 31 వరకు చేసిన ఖర్చు ఆడిట్‌ నివేదికలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే రెండు లేఖలు రాశామని.. 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు కూడా సమర్పించాలని ఆయా లేఖల్లో ప్రస్తావించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2018 జులై 26న, 2019 మే 6న రాసిన రెండు లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఆడిట్‌కు సంబంధించిన అన్ని వివరాలు అందించే వరకు తదుపరి నిధులు విడుదల చేయడం కుదరదంటూ గతేడాది నవంబర్‌ 26న కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రానికి మరో లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం తాత్కాలికంగా రూ.5,175.25 కోట్లకు గాను.. రూ.3,777.44 కోట్లకు ఆడిట్‌ పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాలపైనే మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడం ఆధారపడి ఉంటుందన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గజేంద్రసింగ్‌ షెకావత్‌ వివరించారు.

ఏపీలో ఓవైసీ ప‌ప్పులుడ‌క‌వు! ఆంధ్ర‌లోనూ అదే ఎత్తుగ‌డ‌నా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిజంగానే ముస్లింలు వైసిపికి దూరం అవుతున్నారా?  విజ‌య‌వాడ‌, గుంటూరు బ‌హిరంగ‌స‌భ‌ల్లో ఎంపి అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌సంగాల ఉద్దేశం ఏమిటి?  ముస్లిం ఓటు  బ్యాంక్ జ‌గ‌న్ నుంచి దూర‌మైతే బిజెపి లాభ‌ప‌డుతుందా? అందుకేనా ఓవైసీ ఏపి ముస్లింల ప‌ట్ల స‌వ‌తిత‌ల్లి ప్రేమ ఒల‌క బోస్తున్నారా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చి ఓవైసీ చేసిన ప్ర‌సంగాల వెనుక బిజెపి వ్యూహం వుందా?  లేక స్వంతంగా ఎపిలో ఎద‌గాల‌ని ఎంఐఎం తాప‌త్ర‌య ప‌డుతుందా? దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయిన ముస్లింల‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసిన ఘ‌న‌త ఓవైసీ ఖాతాకే వెళుతుంది. ఎంఐఎం ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చోట్ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బాగా లాభ‌ప‌డిన విష‌యం అయా నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే స్ప‌ష్టం గా అర్థం అవుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఓవైసీ బ్రదర్స్ ఎనలేని అభిమానం చూపించేవారు. ముస్లింల కోసం ఆనాడు వైఎస్ తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్లో లేక ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలో... లేక మరేదైనా కారణముందో తెలియదు గానీ వైఎస్ అన్నా, ఆయన కుటుంబమన్నా ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడూ పాజిటివ్ కామెంట్సే చేసేవారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వైఎస్ ను ఎన్నోసార్లు పొగిడారు. ముస్లింల కోసం వైఎస్ ఎంతో చేశారంటూ అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక, వైఎస్ రాజకీయ వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డిపైనా ఓవైసీ బ్రదర్స్ ప్రేమానురాగాలు, అభిమానం చూపించేవారు. ఎప్పుడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా గతంలో పొగడ్తల వర్షం కూడా కురిపించారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకు? ప్రధాని మోడీ అంటే, జగన్మోహన్ రెడ్డికి భయమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మోడీ అండ్ అమిత్ షా అంటే భయం కనుకే, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. అదే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే, సీఏఏ, ఎన్పీఆర్ వంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేవారంటూ గుంటూరు సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య‌వాడ‌,  గుంటూరు సభల వెనుక అసదుద్దీన్ కు రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణతోపాటు దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీచేస్తూ ఎంఐఎంను విస్తరిస్తున్న అసదుద్దీన్.  ఏపీలో కూడా సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగానే ముస్లింలు అధికంగా ఉండే గుంటూరు, కర్నూలు, కడపపై దృష్టిపెట్టారని చెబుతున్నారు. గుంటూరు, కర్నూలు, కడపలో ఇప్పటికే ఎంఐఎం కార్యాలయాలు ప్రారంభించడంతో, జెండాలు, కార్యకర్తల హడావుడి సైతం కనిపిస్తోంది. అయితే, ఏపీలో ముస్లింలంతా వైసీపీకి ఓటు బ్యాంకుగా మారారని గుర్తించిన ఓవైసీ, ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలంటే, వైసీపీ నుంచి ముస్లింలను వేరు చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను ఆయుధంగా ప్రయోగిస్తున్నారని చెబుతున్నారు. అందుకే, జగన్‌ పట్ల ముస్లింలలో వ్యతిరేక ముద్ర వేసి, ఏపీలో ఎంఐఎం బలోపేతానికి బాటలేసుకోవాలన్నది ఓవైసీ వ్యూహంగా తెలుస్తోంది.  అందుకే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే, ముస్లింలంతా జగన్‌కు వ్యతిరేకం కావాలని పిలుపునిచ్చారు అసద్. స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేస్తే గుంటూరు, కర్నూలు, కడపలో ఫలితాలు తారుమారౌతాయి. ఎంఐఎం గెల‌వ‌క‌పోయినా ప్ర‌త్య‌ర్థి పార్టీల గెలుపుకు అవ‌కాశం వుంటుంది. అయితే టిడిపి లాభ‌ప‌డుతుందా?  లేక బిజెపి లాభ‌ప‌డుతుందా అనేది ఓవైసీ కే తెలుసు. రాజ‌కీయాల్లో  మిత్రులు, శ‌త్రువులంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లింలు వాటిని వ్యతిరేకించని పార్టీలపై కూడా అంతే ఆగ్రహంతో ఉన్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని అర్థం చేసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యంతీసుకున్నారు. 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ముస్లింల మ‌న‌స్సుల్ని గెల్చుకోవ‌డ‌మే కాదు ఓవైసీ వ్యూహాన్నిచెక్‌పెట్ట‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు.