సమాధానం చెప్పండి. అప్పుడు మతాన్ని అంటగట్టం!
posted on Mar 3, 2020 @ 2:02PM
ట్విట్టర్ లో నిలదీసిన మాజీ ఐఎఎస్ అధికారి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు మతాన్ని అంటగడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా స్పందించారు. జగన్‌కు మత పిచ్చి లేకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా ఐవైఆర్ సంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి.
1. హిందూ మత సంస్థల నుంచి హిందూయేతరలను తొలగిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణాలేమిటో?
2. చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దాని క్రిందికి ధార్మిక సిబ్బందిని నియమించక పోవడం ఏమిటి?
3. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి, దానిని సమరసత వేదికతో అనుసంధానం చేయకపోవడం.
4. రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఇమామ్‌లకు, పాస్టర్లకు వేతనాలు చెల్లించడంలో మతలబు ఏమిటి?
5. ప్రభుత్వ ధనం నుంచి జెరూసలేం, హజ్ యాత్రకు సహాయం, చర్చిలు కట్టడానికి సహాయం ఎందుకు చేస్తున్నారు?
6. దేవతా విగ్రహాలపై దుండగులు దాడి చేస్తే తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దేవాదాయ శాఖ మాత్యులుగా ఆ ప్రదేశాలను కూడా సందర్శించకుండా ఉండటం.
సరైన సమాధానం చెప్పగలిగితే ముఖ్యమంత్రి గారికి మతాన్ని అంట కట్టాల్సిన అవసరం ఉండదని ఐవైఆర్ పేర్కొన్నారు.