సింథియాకు రాజ్యసభ సీటు, మంత్రి పదవి... మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కారు..! 

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సర్కారులో తలెత్తిన సంక్షోభం పతాకస్థాయికి చేరింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి యువ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన సుమారు 20మంది ఎమ్మెల్యేలు... బెంగళూరుకు తరలిపోవడంతో కమల్ నాథ్ సర్కారు కష్టాల్లో పడింది.   అయితే, జ్యోతిరాదిత్య సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సోనియా ఆదేశాలతో రంగంలోకి దిగిన అహ్మద్ పటేల్... జ్యోతిరాదిత్యను రాజ్యసభకు పంపుతామంటూ హామీ ఇచ్చారు. అయితే, సింధియా వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ కు సింధియా తలుపు మూసేశారని చెబుతున్నారు. సింథియా స్నేహితుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను రంగంలోకి దించినా జ్యోతిరాదిత్య స్పందించలేదని అంటున్నారు. జ్యోతిరాదిత్యను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో కాంగ్రెస్ ఆశలు వదులుకుంది. దాంతో, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుల్లోకి చేరింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతిరాదిత్య సింధియా... బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా.... ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం సంచలనం రేపుతోంది. అంతేకాదు, సింధియా.... మోడీ, అమిత్ షాను కలవడంతో బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు. అలాగే, సింథియాకు రాజ్యసభ సీటుతోపాటు, మోడీ కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. పది రోజుల్లో వైసీపీ రంగులు తొలగించాలని ఆదేశం...

ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఎప్పట్నుంచో వివాదం కొనసాగుతోంది. చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పెద్దఎత్తున విమర్శలు చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ భవనాలు, పంచాయతీ కార్యాలయాలపై రాజకీయ పార్టీల రంగులు తొలగించాల్సిందేనని ఆదేశించింది. ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ కార్యాలయాలకు పది రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ప్రభుత్వ భవనాలపై రాజకీయ పార్టీల రంగులను తొలగించినట్లు ఆధారాలతో సహా తమకు నివేదిక సమర్పించాలని సీఎస్ ను ఆదేశించింది. ఇదిలా ఉంటే, పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు ఉండటంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కూడా సరైన సమాధానం చెప్పకుండా మాట దాట వేశారు. అయితే, మార్చి 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే.... కొత్త రంగులు వేయడానికి హైకోర్టు పది రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఈ పది రోజుల సమయంలో... ప్రభుత్వం కొత్త రంగులు వేయగలుగుతుందో లేదో? ఒకవేళ హైకోర్టు ఆదేశాలు అమలుకాకపోతే... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరికొన్ని కొత్త రూట్లలో దూసుకుపోనున్న మెట్రోరైలు

ప్రస్తుతం 55 రైళ్ల ద్వారా రోజు వెయ్యి ట్రిప్పులు నడిపిస్తున్నారు. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్స్‌ వల్ల ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వ‌స్తుంది. అందులో రూ.30 కోట్లు ప్యాసింజర్‌ టికెట్ల నుంచి సమకూరుతోంది. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో మరో రెండు అదనపు రైళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో దాదాపు 74 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మొత్తం 69 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 5 కిలోమీటర్లు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే, మార్కింగ్‌ పను లు ప్రారంభం కాగా త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. తెలంగాణా ప్రభుత్వం రెండో దశలో 62 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసి, దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రెండోదశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతీబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాక్‌, లక్డీకాపూల్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో ఒవైసీ దవాఖాన, సైదాబాద్‌, ఫలక్‌నుమా మార్గం మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదేవిధంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు గల 5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా కలుపుతారు. ఎలివేటెడ్‌ మెట్రోరైలు నిర్మించాంటే ఒక కిలోమీటర్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు అవుతుంది. ప్రస్తుత బడ్జెట్‌లో నగరానికి కేటాయించిన రూ.10 వేల కోట్లలో మెట్రోరైలు కేటాయింపులుండటంతో ఈ పనులు వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు. రెండోదశ విస్తరణ జ‌రిగితే నగరంలోని ఏ మూల నుంచైనా మరోమూలకు మెట్రోద్వారా ప్రయాణించడం మరింత సౌలభ్యం అవుతుంది.

మంత్రి వెలంపల్లిపై సి.ఎం. సీరియ‌స్‌

జ్యోతిషాలయం అడ్డాగా లైంగిక వేధింపులు వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి వంశీకృష్ణ రెడ్డి, అచ్చిరెడ్డి లీల‌ల‌పై సి.ఎం. ఆరా కేవ‌లం రూపాయి తీసుకుని జోస్యం చెప్పడం మొదలెట్టి...'తాంత్రిక మంత్రాలు' అంటూ అల్లిబిల్లి సోది కబుర్లన్నీ చెప్పీ.. చెప్పి ఏకంగా ఓ డెబ్బై కోట్లు వెనుకేశాడట‌. ఆ మ‌హానుభావుడు ఎవ‌ర‌నుకుంటున్నారా? అదేనండి. కోనాల అచ్చిరెడ్డి. విజయవాడలోనే నివాసం. 'ఆంధ్రా, తెలంగాణ' అనే బేధం లేకుండా ఎంచక్కా మోసాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు కోనాల అచ్చిరెడ్డి భవానీపురంలో జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. కోనాల అచ్చిరెడ్డి, అత‌ని కొడుకు వంశీకృష్ణ రెడ్డికి మంత్రి ఆశీస్సులున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు, వంశీకృష్ణ రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడే కాదు. రైట్ హ్యాండ్ కూడా. వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శిగా మంత్రి ఆయ‌న‌కు ప‌ద‌వి కూడా ఇచ్చారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి మహిళలను లైంగికంగా వేధించ‌డం వారికి అల‌వాటుగా మారింది. జాతకాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకోవ‌డానికే దుకాణం పెట్టుకున్నారు. ప్రజల బలహీనతలే పునాదులుగా చేసుకొని కోట్ల రూపాయ‌లు సంపాదించారు. నమ్మి వచ్చే భక్తుల్ని దోచుకున్నారు. సాప్ట్ వేర్ కంపెనీలలో 'షేర్ ల‌లో పెట్టుబ‌డులు పెడ్తామంటూ లక్షల రూపాయ‌లు అమాయ‌కుల నుంచి కాజేశార‌ని స్థానిక పోలీసులకు ఫిర్యాదులూ అందాయి. తెలంగాణ ఖమ్మంకు చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానంటూ రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో వైసీపీ విజయవాడ సిటీ కార్యదర్శి కోనాల వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అధికార పార్టీ నాయకుడిగా ఉండటం, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఆంధ్ర పోలీసులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడంతో పలువురు బాధితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనా ఒత్తిడి తెస్తున్నారు. అస‌లు వివ‌రాల్లోకి వెళ్లితే, గ‌త ఏడాది తెలంగాణకు చెందిన ఓ మహిళ జ్యోతిషం చెప్పించుకునేందుకు భవానీపురంలోని జ్యోతిషాలయంకు వ‌చ్చి అచ్చిరెడ్డిని క‌లిసింది. ఆ సమయంలో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు తనతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టిస్తానని రూ.50 లక్షలు తీసుకున్నార‌ట‌. అంతే కాదు అబ్బా కొడుకులిద్ద‌రూ క‌లిసి ఆమెను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించింది. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీసులను ఆశ్రయిస్తే వారు రాజకీయ ఒత్తిళ్లతో ఎలాంటి కేసులు నమోదు చేయలేదట‌. మంత్రి అండ చూసుకొని వంశీ కృష్ణారెడ్డి ఆ మహిళను బెదిరించడం ప్రారంభించాడు. త‌న‌ వద్ద ఆమె నగ్న చిత్రాలు ఉన్నాయని బెదిరించడంతో బాధిత మహిళ ఏం చేయాలో పాలుపోక కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అచ్చిరెడ్డి, ఆయన కుమారుడు వంశీ కృష్ణారెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, న‌గ్న ఫోటోలున్నాయ‌ని బెదిరించ‌డం, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకోవ‌డంతో పాటు ఆమె కారును కూడా లాక్కున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు. భవానీపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలోని పాత ఎంఐజీ 123 బ్లాకులో జ్యోతిషాలయం నిర్వహించే అచ్చిరెడ్డి అదే బ్లాకులో ఉన్న ఆనం మోహన్‌ రెడ్డి, చెంచులక్ష్మి దంపతుల ఫ్లాటును కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఫ్లాటును మోహన్‌రెడ్డి రిటైర్డ్‌ వీఆర్వో ప్రకాశరావు నుంచి కొన్నారు. అచ్చిరెడ్డి బెదిరింపులకు భయపడే ప్రకాశరావు తన ఫ్లాటును మోహన్‌ రెడ్డికి అమ్ముకుని వెళ్లిపోయారు. మోహన్‌ రెడ్డి కొన్నాక ఆయనకూ అచ్చిరెడ్డి నుంచి వేధింపులు తప్పలేదు. రూ.30 లక్షల విలువ చేసే ఫ్లాటును రూ.10 లక్షలకు తనకు విక్రయించాలని అచ్చిరెడ్డి వేధించ‌డం మొద‌లు పెట్టాడు. 'మంత్రి అనుచరులు' అంటూ కొందరు ఫోన్లు చేసి మోహన్‌ రెడ్డి దంపతులను బెదిరించారు. దీనిపై ఈ దంపతులు గత ఏడాది ఆగస్టు 19న స్పందనలో పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫ‌లితం లేద‌ట‌. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుపేరు చెప్పి అచ్చిరెడ్డి, ఆయన కొడుకు వంశీ కృష్ణారెడ్డి విజ‌య‌వాడ వ‌న్‌టౌన్‌లో అరాచకాలకు పాల్పడుతున్నా మంత్రి చూసీ చూడ‌న‌ట్లు ఎందుకు వుంటున్నార‌ని స్థానిక ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఖ‌మ్మం పోలీసుల జోక్యంతో జాతకాలోడి బండారం బట్టబయలైంది. అందరి జాతకాలు చెపుతాననే ఇతగాడు తెలంగాణ పోలీసుల దెబ్బకు కుటుంబంతో సహా పరార్.

నారాయణా..హరి..జగన్.. నారాయణా..గోవిందా..ఇదీ ప్రస్తుత ఏపీ పరిస్థితి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చిరంజీవిలానే ఉన్నారు. ఏంటి..ఇదేంటి ఈ వెబ్ సైట్ ఇలా రాసింది..అనుకుంటున్నారా.. ఈ వార్త చూసాక కొంతమందికి అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన ముఠామేస్త్రి సినిమా గుర్తొచ్చినా తప్పులేదు... ఎందుకంటే ఈ వార్త చూస్తే గుర్తు రాక తప్పదు కూడా. ఇంతకీ వార్త ఏంటి అని బుర్ర బద్దలు కొట్టుకోకండి.. ఇదుగో.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్చ్..ఇందులో కొత్త వార్త ఏముంది? అనుకుంటున్నారా.. కాస్త ఆలోచించండి..అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖామాత్యులు. ఆయన ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం సరఫరా నిలిపి వేస్తున్నామని ప్రకటించారు..అదన్న మాట..వార్త. ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఏక్సైజ్ శాఖ, దానికి మంత్రి లేరా..ఉన్నారు కదా..ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నారాయణ స్వామి కాదా..అని ఎవరికైనా డౌటానుమానాలు వస్తే.. నారాయణ..నారాయణ.. మాది బాధ్యత కాదు సుమా.. జస్ట్ అనిల్ గారికి ముఠామేస్త్రీలా మారాలనిపించిందేమో..నారాయణా.. ఈ వార్త చదివాక ఏపీ ప్రజలు తమని తాము.. మొన్నామధ్య గ్రామీణ ఎన్నికల నేపథ్యంలో చిరు తనయుడు రాంచరణ్ రంగస్థలం సినిమాలో  గొంతు కొస్తే మాట రాక పెదాలు కదల్చిన చిట్టిబాబు అన్నయ్య క్యారెక్టర్ లో చూసుకుంటే అసలేం చేయలేము..సారీ..

ఎపి శాసన మండలి ర‌ద్దుకు కేంద్రం ముహూర్తం పెట్టింద‌ట‌!

మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు వ‌చ్చేశాయి. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావులకు రాజ్యసభకు అందుకే ఎంపిక చేసి పంపార‌ట‌. శాసన మండలి రద్దు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదిస్తే వారిద్దరూ మాజీలు అవుతారు. మాజీలు కాక‌ముందే రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేశారంటే త్వ‌ర‌లోనే శాస‌న‌మండ‌లి ర‌ద్ద‌యిపోతోంద‌ని అర్థం చేసుకోవ‌లంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా వున్న‌ సీనియర్‌ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావులకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాజ్య‌స‌భ‌కు పంప‌డం మండ‌లి ర‌ద్దుతో లింక్ అయి వుంది. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి మంత్రిపదవులు కేటాయించారు. ఆ తర్వాత. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఇపుడు వైకాపా ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. అందుకే రాజ్య‌స‌భ‌కు పంపారు. ర‌ద్దు విషయం ఇంకా కొలిక్కి రాకమునుపే ఇద్దరు నేతలను రాజ్య‌స‌భ‌కు పంప‌డం అంటే మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్‌ నత్వానీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే, ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయ‌డానికి ముహూర్తం కూడా ఖ‌రారుచేశార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఆర్టీసీ కొంప ముంచిన యస్‌ బ్యాంక్

క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తిప‌డిన అధికారులు, రాజ‌కీయ‌పార్టీల నేత‌లు జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను య‌స్‌కు మ‌ళ్ళించారు. అందాల్సిన వారికైతే క‌మీష‌న్లు ముట్టాయి కానీ ప్రజారవాణా శాఖకు చెందిన 240 కోట్ల రూపాయ‌లు బ్యాంక్‌లో ఇరుక్కుపోయాయి. ఏ నెలకు ఆ నెల అప్పులు తెచ్చుకుని బ‌స్సుల‌ను న‌డిపే పీటీడీకి 240 కోట్ల రూపాయలు బ్యాంక్‌లో వున్నా కేవ‌లం ఖాతాలో నుంచి 50 వేలు మాత్ర‌మే డ్రా చేసే దుస్థితి. బ‌స్సుల‌కు అవ‌స‌ర‌మైన డీజిల్‌ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి అధికారులు హైరానా ప‌డుతున్నారు. యస్‌ బ్యాంక్‌ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ ప్రజా రవాణా వ్యవస్థపై పిడుగులా ప‌డింది. ఒప్ప‌ట్టి ఆర్‌టిసి, అదే ఇప్ప‌ట్టి పీ టీ డి ప్రజారవాణా శాఖ య‌స్ బ్యాంక్‌లో ఇరుక్కుని గిల‌గిల కొట్టుకుంటోంది. పీటీడీ విజయవాడలోని యస్‌ బ్యాంకు హెడ్‌ ఆఫీసులో అకౌంట్‌ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోం ది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది. జనవరి నెలకు సంబంధించిన జీతం ప్ర భుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్‌ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతా లో జమ అయింది. దీంతోపాటు రోజువారీ కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు డిపాజిట్‌ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్‌ బ్యాంకులో నిల్వఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంక్‌కు వెళ్లి న అధికారులకు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాధానం తో దిమ్మతిరిగింది. ‘మీ అకౌంట్‌ నుంచి 50వేల రూపాయలకు మించి తీసుకోవడం సాధ్యం కాదు’ అని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను ఇలాంటి బ్యాంకుల వైపు ఎందుకు మార్చారని తెలుగువ‌న్ అధికారుల‌తో ప్రస్తావించగా ‘వడ్డీకి ఆశపడి’ అంటూ ఆయన సమాధానం దాట‌వేశారు. ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్‌ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్‌ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్‌ అకౌంట్‌ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో దిక్కుతోచని స్థితి.

బాబాయితో మా అమ్మకూ ప్రాణ హాని వుంది!

ఆస్థి గొడ‌వ‌లే మా నాన చావుకు కార‌ణం కావ‌చ్చు. ''మా నాన్నకు బినామీ పేర్లతో చాలా ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల విషయంలో బాబాయ్‌ శ్రవణ్‌కు ఆయనకు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లు నాకు తెలిసింది. మా నాన్న ఆస్తులపై నాకు ఆసక్తి లేదు. మా అమ్మకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించారు'' అని అమృత సంచలన ఆరోపణలు చేసింది. మారుతీరావును కనీసం నా తండ్రి అని కూడా సంబోధించకుండా ''మారుతీరావు''అంటూ ఆమె మాట్లాడింది. ఈ క్రమంలో మారుతీరావుకు..ఆయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయనీ..ఆ తగాదాలతోనే మారుతీరావును శ్రవణ్ చాలాసార్లు కొట్టాడని..దాంతో భయపడిన మారుతీరావు ఎక్కుడో దాక్కున్నాడనీ అమృత ఆరోప‌ణ‌లు చేసింది. అమృత ప్రణయ్ చేసిన ఆరోపణలపై మారుతీరావు తమ్ముడు శ్రవణ్ స్పందించారు. మా అన్న మారుతీరావుకు నాకు ఎటువంటి విభేదాలు లేవనీ..ఆస్తుల విషయంలో అస్సలు తగాలు లేనే లేవని స్పష్టంచేశారు. మా అన్న మారుతీరావుపై కేసులు ఉన్నాయి. దీంతో నేను కాస్త దూరంగా ఉన్నమాట నిజమే. కానీ విభేదాలు మాత్రం లేవని స్పష్టంచేశారు శ్రవణ్. అమృత నాపై చేసిన ఆరోపణలు వాస్తవం కాదనీ..ఆస్తుల కోసమే అమృత ఇటువంటి ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రవణ్.

ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణ

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం లో గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పూర్తిగా ఇరుక్కున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు గుంటూరుఅర్బన్‌ ఎస్పీపై సీబీఐ విచారణ షురూ అయింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని అక్రమంగా నిర్బంధించారనే కేసులో గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణ చేస్తోంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సోమ‌వారం నాడు విచారణ ప్రారంభించారు. గుంటూరు జిల్లా నారా కోడూరుకు చెందిన ముగ్గురిని క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో నిర్భందించారు. ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులను 24గంటల లోపు కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా.. అలా జరగకపోవడంతో నిందితులు హైకోర్టుని ఆశ్రయించారు. నిబంధనలు పక్కన పెట్టి విచారణ పేరుతో తమని రోజుల తరబడి వేధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డబ్బు కోసమే ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించగా నిర్బంధం నిజమేనని తేలింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో నిందితులను నిర్బందించింది సీసీఎస్‌ పోలీసులే అయినా దీని వెనుక మొత్తం క‌థ న‌డిపింది ఎస్పీనే అట‌. ఎస్పీ ఆదేశాల మేరకే ఇలా చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఐపీఎస్ అధికారి కావటంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారించాలంటూ రెండు వారాల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలతో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు సోమవారం గుంటూరుకు వచ్చారు. అక్రమ నిర్బంధం వ్యవహారంపై ఆరా తీశారు. చేబ్రోలు పోలీసులతో పాటు సీసీఎస్‌ పోలీసుల నుంచి వివరాలు సేకరించి రహస్యంగా విచారిస్తున్నారు.

రిలయన్స్ లక్షల కోట్ల సంపద ఆవిరి

క్రూడాయిల్ దెబ్బకు ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. భారీగా షేర్ల విలువ ప‌డిపోయింది. కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో మార్చి 9వ తేదీన మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) పరంగా దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్‌లో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రెండో స్థానంలోకి నెట్టి వేసింది. ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను క్రాస్ చేసిన ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. అయితే చమురు మార్కెట్ దెబ్బతో రిలయన్స్ M-Cap డిసెంబర్ 2019 రికార్డ్ హైతో పోల్చుకుంటే రూ.2.7 లక్షల కోట్లు ఆవిరైంది. 2008 తర్వాత తొలిసారి రిలయన్స్ షేర్ ఇంత దారుణంగా పడిపోయింది. ఇందుకు అంతర్జాతీయ చమురు మార్కెట్ ప్రభావమే. రిలయన్స్ కంపెనీ షేర్ హోల్డర్స్ సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.1 లక్ష కోట్లు ఆవిరైంది. క్రూడాయిల్ ధరలు 31 శాతం వరకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 11.31 డాలర్లు లేదా 25 శాతం తగ్గి 33.96 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 12, 2016 (31.02 డాలర్లు) తర్వాత ఇది కనిష్టం. జనవరి 17, 1991 గల్ఫ్ వార్ తర్వాత క్రూడాయిల్ ధరలు అత్యంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇంతలా పడిపోయాయి.

స్టాక్ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్లు హాంఫ‌ట్‌!

మార్కెట్ చ‌రిత్ర‌లో బ్లాక్‌ మండే. ఈ ఒక్కరోజే దాదాపు రూ.6.8 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరైపోయింది. చమురు ఉత్పత్తి దేశాల మధ్య నెలకొన్న తీవ్ర పోటీలో భారత్‌ సహా పలు దేశాల స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే పతనం దిశగా కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం స్టాక్‌ మార్కెట్ల పతనంతో ఆరున్నర లక్షల కోట్ల సంపద హరించుకపోయింది. స్టాక్ మార్కెట్‌ చరిత్రలో ఇదొక బ్లాక్‌ మండేగా మిగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, ఒపెక్‌ మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చాయి. దీంతో చమురు ఆధారిత సంస్థల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. అలాగే యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో సీబీఐ సోదాలు చేపట్టడం.. రూ.600 కోట్లు ముడుపులు అందాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం వంటి పరిణామాలు దేశీయ మదుపర్లను నిరాశకు గురిచేశాయి. దీంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఓ దశలో ఓఎన్‌జీసీ 15శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 13శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.5శాతం, టాటా స్టీల్‌ 7శాతం నష్టపోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 4శాతం నష్టాలతో లోహరంగం అత్యధిక నష్టాల్ని మూటగట్టుకుంది. భారత స్టాక్ మార్కెట్లలో ఇదివరకూ ఎప్పుడూలేని భారీ పతనాన్ని ఇన్వెస్టర్లు ఇప్పుడు చూచిచూశారు. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా పతనమైంది.

గాంధీభవన్లో రేవంత్ వివాదం.. రెండ్రోజులుగా అనుచరుల నిరసన...

తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యనేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పైకి కనిపించకపోయినా, ఎవరికివారు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఒకరినొకరు కార్నర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ ను పలువురు సీనియర్లు టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ తో అది మరోసారి రుజువైంది. నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించుకున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రేవంత్ చేసిన హల్ చల్ కు టీకాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించలేదు. దాంతో, రేవంత్ వర్గీయులు గాంధీభవన్లో ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి వర్గీయులు రెండ్రోజులుగా గాంధీభవన్లో నిరసన తెలియజేస్తున్నారు. రేవంత్ ను అరెస్ట్ చేస్తే... పీసీసీ చీఫ్ ఉత్తమ్ గానీ, ఇతర ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ పై పోరాడుతుంటే, కనీసం మద్దతు ఇవ్వడం లేదని, అన్యాయంగా అరెస్ట్ చేసినా, నేతలెవరూ స్పందించకపోవడం అన్యాయమని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేటీఆర్ ఫాంహౌస్ ను వెలుగులోకి తెచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని అభినందించాల్సిన నేతలు... కనీసం నోరు విప్పకపోవడంపై మండిపడుతున్నారు. అయితే, పీసీసీ చీఫ్ ను గానీ, పార్టీని కానీ సంప్రదించకుండా వ్యక్తిగతంగా రేవంత్ చేస్తున్న ఆందోళనలను టీకాంగ్ ముఖ్యనేతలు తప్పుబడుతున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై అధిష్టానం కూడా గుర్రుగా ఉందని అంటున్నారు. రేవంత్ తాజా వివాదం పంచాయతీ కూడా హైకమాండ్ దగ్గర ఉందంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని, రేవంత్ వ్యవహారాన్ని అధిష్టానంతో చర్చించే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి రేవంత్ వ్యవహరశైలి... టీకాంగ్రెస్ లో మరోసారి వివాదాస్పదమైంది.

దారుణంగా ప‌డిపోయిన క్రూడ్ అయిల్ ధర‌!

సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతానికి పైగా చమురు ధరలు పడిపోయాయి. 1991లో గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఒకరోజులో ఆయిల్‌ ధరలు భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. తమ దేశంలో చమురు ఉత్పత్తి పెంచి.. తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించాలని రియాద్‌ తీవ్ర ధరల పోరుకు సిద్ధమవడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ ముడి చమురు అత్యల్పంగా 31.02డాలర్ల స్థాయికి పడిపోయింది. ఎక్కువ మార్కెట్‌ను హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో సౌధీ క్రూడ్‌ ఆయిల్‌ ధరలను భారీగా తగ్గిస్తోంది. దీంతో దేశీయంగా పెట్రోల్‌, డీజీల్‌ రేట్లు భారీగా పడిపోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు ఒక్క రోజులోనే 25శాతం పడిపోవటంతో. ఆ ప్రభావం రిటైల్‌ మార్కెట్‌పై పడనుంది. అయితే, ఈ ప్రభావం భారత్‌పై భారీగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్‌ కూడా క్రూడ్ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఇరాన్‌ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉందని. అయితే, సౌధీ అరెబియా రేట్ల తగ్గింపు ఇతర దేశాలపై ఉంటుంది కాబట్టి. భారత్‌లో ప్రభావం కాస్త తక్కువైనా ఖచ్చితంగా ఉంటుందని విశ్లేష‌కులు అభ‌ప్రాయ‌ప‌డుతున్నారు. చమురు ధర బ్యారల్‌కు 43 డాలర్ల కన్నా తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగ దేశాలైన భారత్‌, చైనాలకు ఇది ఆయిల్‌ బొనాంజా అని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే నెల నుంచి 10 మిలియన్‌ బ్యారల్‌కు పైగా ముడిచమురును ఉత్పత్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది ఈ రెండు దేశాలకు ఉపయోగకరమని భావిస్తున్నారు. ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి రష్యా-సౌధీ అరెబియా కారణమం. ఇంధన ఉత్పత్తి విషయంలో ఈ రెండు దేశాల మధ్య వివాదం తలెత్తటంతో. సౌధీ క్రూడ్‌ ఆయిల్‌ ధరలను భారీగా తగ్గించింది. అంతేకాదు రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్‌ ఉత్పత్తిని కూడా మరింత పెంచనుందని. ఇవన్నీ కలిపి అంతర్జాతీయంగా రేట్లు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్ కు కేవీపీ ఘాటు లేఖ... పోలవరంపై ప్రధానికి సంచలన నివేదిక...

కాంగ్రెస్ ఎంపీ కేవీపీ... ఫస్ట్ టైమ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాజ్యాంగపరంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు అందాల్సిన నిధులు రావడం లేదన్న కేవీపీ... ఏపీ పునర్విభజన చట్టం అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన కేవీపీ... నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే తిరిగి అప్పగించాలని కోరారు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను తీసుకున్నారని ఆరోపించిన కేవీపీ... మీరు ఆ తప్పు చేయవద్దంటూ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం... వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 27వేల 571కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, వాటిని సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు కేవీపీ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తిరిగి కేంద్రానికే అప్పగించాలంటూ సీఎం జగన్ కు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ లేఖ రాస్తే, మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ.... ప్రధాని మోడీకి సంచలన నివేదిక సమర్పించింది. 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు కేంద్రంగా బీజేపీ, వైసీపీ రాజకీయాలు చేశాయి. ప్రాజెక్టు అంచనాలు పెంచేసి చంద్రబాబు దోచుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే.... టీడీపీ నేతలకు పోలవరం ఏటీఎంలా మారిందంటూ ప్రధాని మోడీ విమర్శలు చేశారు. చంద్రబాబు టార్గెట్ గా ఆనాడు మోడీ అండ్ జగన్మోహన్ రెడ్డిలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయమంటూ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. తీరా చూస్తే ఆ ఆరోపణల్లో నిజం లేదని ఏకంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చింది. పోలవరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాంట్రాక్టరును మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందంటూ కంప్లైంట్స్  రావడంతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖను ప్రధాని కార్యాలయం ఆదేశించింది. దాంతో, పోలవరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... కాంట్రాక్టు నిబంధనల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని పీఎంవోకి నివేదిక ఇచ్చింది. కాంట్రాక్టు కేటాయింపులు నిబంధనల మేరకే జరిగాయని, ముందున్న కాంట్రాక్టర్ సరిగా పనులు చేయకపోవడంతో, 60C రూల్ ప్రకారమే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు తన నివేదికలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక, ప్రాజెక్టు అంచనాలు పెరగడానికి 2013 భూసేకరణ చట్టమేనని తేల్చింది. అంతేకాదు, కొత్త ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పినట్లు కేంద్ర జలశక్తిశాఖ తెలియజేసింది. దాంతో, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని, మిగతా ఆరోపణల్లో కూడా చివరికి తేలేది ఇదేనని తెలుగుదేశం నేతలు అంటున్నారు.

దేశంలో 'కరోనా' కేసులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన

ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42 కరోనా పాజిటివ్‌ కేసులు  ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి  కేరళలోని పథనంతిట్టాలో విద్యా సంస్థలకు మూడు రోజుల సెలవులు   దేశంలో 'కరోనా' కేసులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్‌ తెలిపారు. కాగా, ఇటీవల విదేశాల నుంచి కేరళలోని పథనంతిట్టాకు వచ్చిన ఓ కుటుంబంలోని ఐదుగురికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో పథనంతిట్టాలో విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. అయితే, పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలిపారు. కాగా, కరోనా సోకిన ఆ ఐదుగురికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులో  వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు మేరకు బెంగళూరు నార్త్‌, సౌత్‌, గ్రామీణ జిల్లాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ పాండే ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో.. బాబుకి విజయసాయి సూచన

వై ఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిఘా యాప్ ఆవిష్కరణ తర్వాత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన శైలిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. "రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించారు. ఇదీ చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు పంపిణీ లేకపోతే పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు. .'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సోషల్ మీడియా విమర్శలు బాధించాయి: డొక్కా

ఎమ్మెల్సీ పదవికి రాజీనామాపై మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలు బాధించాయన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని... కానీ వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. ఆయన లేఖ ఈ దిగువున ఇస్తున్నాం...  " నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ...'!   'మిత్రులు, శ్రేయోభిలాషులకు... నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ రాస్తున్న బహిరంగ లేఖ...' అంటూ ప్రారంభించిన ఆయన, సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన విమర్శలు బాధించాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపానని, అయితే, ఆ పార్టీ నేతలతో మాత్రం చర్చించలేదని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని డొక్కా వ్యాఖ్యానించారు. తనపై నీతి బాహ్యమైన, చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తన ప్రవర్తన ప్రజలకు సుస్పష్టమని అన్నారు. రాజకీయ పార్టీ అన్నది ప్రజా సేవకు ఓ వేదిక మాత్రమేనని, ఆ వేదిక ద్వారా తనదైన శైలిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాసిన లేఖను మీరూ చూడవచ్చు. తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ కోసమే పని చేస్తానని మాణిక్యవరప్రసాద్‌ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. అయితే రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎందుకు పార్టీకి దూరమవుతున్నారు..? వైసీపీలో చేరుతున్నారా..? 2019 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది..? ఇలా పలు విషయాలపై బహిరంగ లేఖ రూపంలో డొక్కా నిశితంగా వివరించారు. మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల కీలక సమయం లో డొక్కా తన అభిప్రాయాన్ని నేరుగా పంచుకోవటం, ప్రస్తుతం చర్చనీయాంశం గ మారింది. డొక్కా సామాజిక వర్గ ఓట్ల కోసమే, వై ఎస్ ఆర్ సి పీ ఈ డ్రామా కి తెర  తీసిందని తెలుగు దేశం ఆరోపిస్తోంది.

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు!

విషం కలిపిన గారెలు తిన్నందుకే మారుతీరావు మరణించారు. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పని చేయకుండా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ అయి ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్టు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగుచూశాయి. ఆయన ఆత్మహత్య పోస్టుమార్టం నివేదిక తాజాగా బహిర్గతమైంది. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని డాక్ట‌ర్లు రిపోర్ట్‌లో రాశారు. హైదరాబాద్ లోని ఓ వైశ్యభవన్ లో ఆత్మహత్య చేసుకున్న అమృతరావు డెడ్ బాడీకి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు. మారుతీరావు మృతిపై కూతురు అమృత తొలిసారి స్పందించింది. తన తండ్రి సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదంటూ పేర్కొంది. తన విషయంలో పశ్చాత్తాపంతో కాకుండా. ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చని తెలిపింది. కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని పేర్కొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తిరునగరు మారుతీరావు మృతి చెందారు. తన కుమార్తె అమృతను షెడ్యూల్డ్‌ కులానికి చెందినప్రణయ్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన మారుతీరావు హత్య చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి, ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు. అయితే, అనుమానాస్పద మృతి కింద కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది.

మేడ్చెల్ లో డాక్టర్ అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ మిథులలో దారుణం చోటుచేసుకుంది. ప్లాట్ నంబర్57 లో దమ్మాయి గూడ శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎం డి డాక్టర్ రవీంద్ర కుమార్.. తన లైసెన్సు రివాల్వర్తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి తన భార్య తో రవీంద ఘర్షణ పడినట్లు సమాచారం. బంధువుల గృహ ప్రవేశానికి భార్య రాకపోవడంతో మనస్తాపం కు గురైనట్లు తెలుస్తోంది. అ ర్ధరాత్రి తర్వాత రవీందర్ భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్లగా.. రాత్రి 2 గంటల ప్రాంతంలో భార్య కు ఫోన్ చేసి తన కుమారుడి తో రవీందర్ మాట్లాడారు. కుమారుని క్షమించమని ఫోన్ లో చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసారు. ఆయన ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. ఆయన బంధువులు వెళ్లి చూడగా.. ఇంట్లో తన బెడ్ పై గన్ తో రక్తం మడుగులో రవీందర్ పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ ఆధారాలు సేకరించాయి.