వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు..! టీఆర్ఎస్ లో కొనసాగుతోన్న సస్పెన్స్...

వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్... అలాగే, రాంకీ సంస్థల ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నాలుగో సీటును పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానికి కేటాయించనున్నారు. శాసనమండలి రద్దు కానున్న నేపథ్యంలో... మంత్రి పదవులు కోల్పోనున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను రాజ్యసభకు పంపుతున్నారు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీలో రాజ్యసభ అభ్యర్ధులను ఖరారైనా, తెలంగాణలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ స్థానాల్లో ఎవరిని పంపుతారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా కేకే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే, కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు, హెటెరో అధినేత పార్ధసారధి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురిలోనే ఇద్దరి ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో ఈనెల 13న నామినేషన్ వేయాల్సి ఉండటంతో మరో మూడ్రోజుల్లోపే అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంటుంది. దాంతో, రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈనెల 12న పెద్దల సభకు వెళ్లే అభ్యర్ధులను ప్రకటించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అయోమయం, గందరగోళం అమరావతిలోని ఉద్యోగుల పరిస్థితి..

మనకి కోపం వచ్చినా, వారికి కోపం వచ్చినా మనకే నష్టం అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ (రాజధాని) అమరావతిలోని కిందస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఒక్క శాఖ కాదు అన్ని శాఖల ఉద్యోగులకూ ఇదే స్థితి. వచ్చే ఫస్టుకు ఇల్లు ఖాళీ చేయాలి అని అద్దె ఇంటి ఓనరు మౌఖికంగా చెప్పినట్లుగా శాఖాధిపతులు ఉద్యోగులకు చెబుతున్నారు. ఏమని? వచ్చే నెలా 5 కల్లా విశాఖపట్నం వెళ్లిపోవాలి. లేకపోతే ఇదే మీకు ఆఖరి జీతం. ఈ మాటలు విన్న ఉద్యోగులకు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయి ముచ్చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. కార్యాలయాల మార్పు గురించి లిఖిత పూర్వక ఆజ్ఞలు ఏమైనా జారీ చేస్తున్నారా అంటే అదీ లేదు. అమరావతి నుంచి వెళ్లి పోవాలి, విశాఖ తరలి పోవాలి. అంతే.. అక్కడ ఆఫీసు ఎక్కడ? ఎక్కడ కూర్చోవాలి? తమకు వసతి సదుపాయాల మాట ఏంటి? ఎవరు చూస్తారు? ఇవన్నీ ఎన్నటికి సమాధానం దొరుకుతాయో తెలియని ప్రశ్నలే. వీటికి సమాధానం ఉండదు. పై అధికారులు మాత్రం సిబ్బంది కనిపించినప్పుడల్లా వచ్చే నెల 5 వరకే నీకు ఉద్యోగం. 6వ తేదీ నుంచి విశాఖ పట్నం రాకపోతే నీకు ఇదే ఆఖరు జీతం అని చెబుతున్నారు. కొంతమందైతే ఉద్యోగం మానేస్తే మానెయ్యి అని కూడా అంటున్నారు. మా వాళ్లు చాలా మంది ఉన్నారు అని కూడా కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ మాటలు సరదాకి అంటున్నారో, నిజంగానే అంటున్నారో తెలియక తలలు బాదుకుంటున్నారు. ఈ మాటలతో అమరావతి ప్రాంతంలో ఉద్యోగాలు చేసేవారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. విశాఖపట్నం ఎలా వెళ్లాలి? వెళ్లి అక్కడ ఎలా ఉండాలి? కొందరు ఉద్యోగులు ఈ తికమకతో  కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలోలా అనునయించి చెప్పే పరిస్థితి లేకపోవడం  ఉద్యోగులకు మరింత కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులం, అదీనూ సచివాలయ ఉద్యోగులం అనే తేడా లేకుండా అడ్డా మీద రోజు వారీ కూలీలను చూసినట్లు తమను చూడటం వారిని మరింత బాధేస్తున్నది. తమను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్ ఇస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. కానీ వారి మొర ఆలకించే దిక్కే లేకుండా పోయింది. వెళ్లి పోవాల్సిందే.. అంతే అంటున్నారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులైనా తమ భవిష్యత్తు ఏమిటో చెప్పగలరో, లేదో అనుకుంటున్నారు.

జగన్ ప్రభుత్వానికి అమరావతి భయం... అందుకే అక్కడ ఎన్నికలు వాయిదా?

గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలతోపాటు, రాజధాని గ్రామాల్లో ఎన్నికలను నిలిపివేయడంపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజధాని గ్రామాల ప్రజలు... అమరావతిని తరలించొద్దంటూ దాదాపు మూడు నెలలుగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, రైతు కూలీలు... ఇలా ప్రజలందరూ ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. దాంతో, రాజధాని గ్రామాలతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ భయంతోనే నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీని... రాజధాని తరలింపు భయం వెంటాడుతోందని టీడీపీ విమర్శిస్తోంది. అందుకే, అమరావతి రైతుల ఉద్యమ ప్రభావమున్న గుంటూరు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు. ఇక, అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లోనూ ఎన్నికలను నిలిపివేశారని, దీనంతటికి ఓటమి భయమే కారణమని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. వాయిదా వేసిన మున్సిపాలిటీల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, వైసీపీ ఘోర పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు.   మూడు రాజధానుల నిర్ణయంతో గుంటూరు జిల్లాలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందంటున్నారు. ముఖ్యంగా తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన వాళ్లు కూడా ఇఫ్పుడు పూర్తిగా రివర్స్ అయ్యారని అంటున్నారు. వైసీపీకి మంచి పట్టున్న తాడేపల్లి మున్సిపాలిటీలో సైతం ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావిస్తున్నారు. ఇవన్నీ గమనించే, వ్యూహాత్మకంగా నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే, కోర్టు కేసులు, పంచాయతీల విలీనాల కారణంగానే ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయని వైసీపీ చెబుతోంది.

ద‌ళితుల ఆత్మాభిమానాన్ని ఎందుకు ప‌ణంగా పెడుతున్నారు?

దొరగారిచేత శభాష్ అనిపించుకోవాలనే తాప‌త్ర‌యం. క‌మీష‌న్ల మీద వున్న దృష్టి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై వుండ‌టం లేదు. చెన్నూరు నియోజకవర్గ సమస్యలు ప‌ట్టించుకోకుండా ఎమ్మెల్యే బాల్క సుమన్ బానిస సుమ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారని స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఎం.పి .రేవంత్ రెడ్డి చిన్న దొర కేటీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడికి వెళ్తే ఆగమేఘాల మీద, హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి దొర గారి చేత శభాష్ అనిపించుకున్నార‌ట ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌. ఉస్మానియా యూనివర్సిటీ భూములను టీఆరెస్ పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నాఎమ్మెల్యే గారికి క‌నిపించ‌లేద‌ట‌. సేవ్ ఉస్మానియా పేరుతో ఉద్యమం జరుగుతుంది, తక్షణం యూనివర్సిటీకి రూ.700 కోట్లు అవసరం ఉంది అయినా బాల్క సుమన్ త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు అస‌లు స్పందించ‌డం లేద‌ని యూనివ‌ర్శిటీ విద్యార్థులు సైతం మండిప‌డుతున్నారు. యూనివర్సిటీ విద్యార్థి కార్డు మీద ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి, ఏనాడు యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడ లేదు. కొఠారి కమీషన్ చెప్పినట్టు బడ్జెట్ లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించేలా చూడాలని తెలియకపోవడం సిగ్గుచేటని ఉస్మానియా విద్యార్థులంటున్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలే ప్రధానంగా ఉద్యమించిన తెలంగాణలో నియామకాలు లేక, బ్రతుకుదెరువు లేక తెలంగాణ కోసం ఉద్యమించిన డాక్టరేట్ పొందిన నిరుద్యోగులు గత్యంతరం లేక యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకుంటే, ప్రభుత్వ నియామక పరీక్ష రాసి మెరిట్ వచ్చినా సెలెక్టెడ్ లిస్ట్ మీరు పెట్టకపోవడంతో చూసి చూసి మహిళ ఆత్మహత్య చేసుకున్నా విద్యార్థి నేత నుంచి ప్ర‌స్తుతం అసెంబ్లీకి వెళ్ఙ‌న సుమ‌న్‌గారికి కనిపించదు. దళిత కార్డు మీద సీటు పొందిన మీరు దళిత ముఖ్యమంత్రి హామీ, దళితులకు మూడెకరాల భూమి కోసం మాట్లాడరు. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకర్తలే పి.యె కి ఫోన్ చేసి చేసి అలసిపోతుంటే ఇక ప్రజల సమస్యల గురించి, ద‌ళిత ఉద్య‌మాల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడుకోవడం వ్యర్థమే. గెల‌వ‌డానికే ద‌ళిత కార్డు కావాలి. ఆ త‌రువాత‌ దొర‌గారి ఆశీస్సులుంటే చాలు. ఆంధ్ర‌లోనైనా, తెలంగాణాలోనైనా కొంత మంది ద‌ళిత నేత‌ల వ్య‌వ‌హార‌శైలి.

ఏప్రిల్ నుంచే H1B వీసా కొత్త నిబంధనలు

అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఏటా 85వేల హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తోంది. వీటిల్లో అత్యధికంగా భారతీయులు పొందుతుండగా.. వారిలో కూడా 70శాతం ఐటీ ఉద్యోగులకే లభిస్తున్నాయి. ప్రస్తుతం 65,000 హెచ్‌-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు. దీనికి అదనంగా అమెరికాలో ఉన్నత విద్య(మాస్టర్స్‌ డిగ్రీ, అంతకంటే ఎక్కువ స్థాయి విద్య) పూర్తి చేసిన మరో 20,000 మంది విదేశీ వృత్తినిపుణలకు వీటిని ఇస్తున్నారు. ప్ర‌స్తుతం అమెరికా ప్రభుత్వం H1B వీసాల్లో చేసిన మార్పులు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. అప్లికేషన్లను కూడా వచ్చే నెల నుంచి స్వీకరించనున్నారు. తొలుత కంపెనీలు ఎలక్ట్రానిక్‌(ఆన్‌లైన్‌) విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వీసా ఫీజు కింద ప్రతి అప్లికేషన్‌కు 10 డాలర్లను చెల్లించాలి. కొత్త విధానం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో చాలా మార్పులు తీసుకురానుంది. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌లో ఉద్యోగి, యజమానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు. లబ్ధిదారు పూర్తిపేరు, పుట్టిన తేదీ వివరాలు, దేశం, పౌరసత్వం, లింగ సమాచారం, పాస్‌పోర్టు నంబర్‌ వంటి వాటితోపాటు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ను కూడా వారికి సమర్పించాల్సి ఉంటుంది. హెచ్‌-1బీ వీసాలు రిజిస్ట్రేషన్‌ సమయంలో యాదృచ్చికంగా స్క్రీనింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఎంపికైన వారికి యూఎస్‌సీఐఎస్‌ విషయం వెల్లడించి 90 రోజుల్లోపు హెచ్‌-1బీ వీసాకు పిటిషన్‌ పెట్టుకోవాలని సూచిస్తారు. ఈ పిటిషన్లను ఏప్రిల్‌ 1 నుంచి దాఖలు చేయవచ్చు. దీంతో ఎంపిక అయిన వారు మాత్రమే పిటిషన్‌ దాఖలు చేస్తుండటంతో చాలా ఖర్చు, శ్రమ మిగులుతున్నాయని యూఎస్‌సీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మార్క్‌ కౌమన్స్‌ పేర్కన్నారు. హెచ్‌-1బీ వీసాలు అత్యధికంగా పొందే తొలి 30 కంపెనీల్లో అత్యధికంగా ఐటీ రంగానికి చెందినవే ఉన్నాయి. 2018లో 66శాతం ఈ వీసాలు కంప్యూటర్‌కు సంబధించిన ఉద్యోగాలు చేసేవారికే లభించాయి.

జగన్ వైపు రామసుబ్బారెడ్డి చూపు..! జమ్మలమడుగులో హీటెక్కిన రాజకీయం

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో టీడీపీకి ముఖ్యనేతగా ఉంటూ, చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా కొనసాగుతోన్న సీనియర్ లీడర్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి... త్వరలో తెలుగుదేశానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామసుబ్బారెడ్డి త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నట్లు జమ్మలమడుగులో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. సీఎం జగన్ తో మాట్లాడిన కడప జిల్లా వైసీపీ ముఖ్యనేతలు... రామసుబ్బారెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రప్పించడానికి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నుంచి క్లియరెన్స్ రావడంతో, అనుచరులు, కార్యకర్తలతో రామసుబ్బారెడ్డి మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. రామసుబ్బారెడ్డి రాకను మొదట జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించినా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కావడంతో కాదనలేక సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. అయితే, రామసుబ్బారెడ్డి... వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారన్న సమాచారంతో... కడప జిల్లా టీడీపీ సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డిని కలిసిన తెలుగుదేశం నేతలు... పార్టీ మారకుండా బుజ్జగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, 2019 ఎన్నికలకు ముందే, రామసుబ్బారెడ్డి... వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా, ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన రామసుబ్బారెడ్డి... అప్పుడే పార్టీ మారతారని అనుకున్నారు. అయితే, రామసుబ్బారెడ్డిని బుజ్జగించిన చంద్రబాబు... ఆదినారాయణరెడ్డితో సయోధ్య కూడా కుదిర్చారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి.... ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. అయితే, ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆదినారాయణరెడ్డి తెలుగుదేశాన్ని వీడి... బీజేపీ గూటికి చేరారు. అయితే, ఇప్పుడు, రామసుబ్బారెడ్డి... వైసీపీ వైపు చూస్తున్నార్న ప్రచారంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

మ‌తం మారినా ఎస్సీ హోదా అనుభ‌విస్తారా?

వైఎస్ఆర్సీపీ తరఫున బాపట్ల ఎంపీగా గెలుపొందిన నందిగాం సురేశ్ పై హిందూ ధార్మిక సంస్థ‌లు, ద‌ళిత వాద సంఘాలు మండిప‌డుతున్నాయి. ఎ.సి. రిజ‌ర్వేష‌న్ కోటాలో గెలిచి క్రిస్టియానిటీని స్వీక‌రించ‌డం ఎస్సీ స్టేట‌స్‌ను దుర్వినియోగం చేయ‌డ‌మేన‌ని వారు రాష్ట్ర‌ప‌తికి, లోక్ స‌భ స్వీక‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం ఎం.పి. నందిగాం సురేష్‌యే కాదు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కోటా కింద ఆయా ప్ర‌త్యేక నియోజ‌క వ‌ర్గాల నుంచి గెలిచిన చాలా మంది నేత‌లు క్రిస్టియానిటీ తీసుకున్నార‌ట‌. అంతే కాదు బైబిల్ చేతిలో ప‌ట్టుకొని ద‌ర్జాగా చ‌ర్చికి వెళ్ళి ప్రార్థ‌న‌లు చేస్తూ ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డ‌డానికి ఫోటో ఫోజులు కూడా ఇస్తున్నార‌ట‌. ఏపీలో జరుగుతున్న ఈ రాజ‌కీయ పరిణామాలు, హిందూ దేవాలయాలపై, సంస్కృతిపై జరుగుతున్న దాడిగానే అర్థం చేసుకోవాల‌ని హిందూ మ‌త పెద్ద‌ల‌తో పాటు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తితో పాటు లోక్‌స‌భ స్వీక‌ర్ దృష్టికి ఈ వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్ళారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే ప్రభుత్వ అండదండలతో ఇదంతా జ‌రుగుతోందంటున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాల్ని అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు. వాస్త‌వానికి త‌మ మ‌న‌సాక్షిగా త‌మ‌కు న‌చ్చిన మ‌తాన్ని పాటిస్తున్నారా అంటే ఆ దేవుడికే తెలియాలి. త‌మ నేత‌ల‌ను సంతోష‌పెట్ట‌డానికే ఇక్క‌డ కూడా రాజ‌కీయాలు చేయ‌డం మ‌న నేత‌ల‌కు అల‌వాటైపోయింది. రిజ‌ర్వేష‌న్ క్యాటిరిగిలో వున్న ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గెలిచి మ‌న‌సాక్షిగా రాజ్యంగ‌బ‌ధంగా ప్ర‌మాణం చేసి మ‌ళ్ళీ అదే మ‌న‌సాక్షిగా వేరే మ‌తం అవ‌లంభించ‌డం ఏమిట‌ని హిందూ ధార్మిక సంస్థ‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి. మాత‌మార్పిడిల‌పై ఇక ఊపేక్షించేది లేద‌ని, క‌ఠినంగా కొర‌ఢా ఝ‌ళిపించ‌డానికే మోదీ ప్ర‌భుత్వం యాక్ష‌న్‌లోకి దిగింది. అందులో భాగంగా ప్ర‌జాప్ర‌తినిధుల్ని ల‌క్ష్యంగా చేసుకొంది. ఇప్ప‌ట్టికే ఆర్ఎ.స్ఎ.స్‌. దేశ‌వ్యాప్తంగా మ‌తం మార్చుకున్న వారి జాబితా త‌యారుచేసి ప్ర‌భుత్వానికి ఇచ్చింది. అయితే మ‌త‌మార్పిడిల‌కు పాల్ప‌డుతున్న వారి ఆట‌లు క‌ట్టించ‌డానికి మోదీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాప‌ట్ల ఎంపి వ్య‌వ‌హారంలో ద‌ళిత సంఘాల్నే రంగంలోకి దింపింది. ప్ర‌జాప్ర‌తినిధుల్ని ల‌క్ష్యంగా చేసుకుంటే దీనిపై చ‌ర్చ ఎక్కువ‌గా జ‌రిగి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌తార‌ని ఆర్ ఎస్ ఎస్ భావిస్తోంది. ఆర్ ఎస్ ఎస్ డైరెక్ష‌న్‌లో బిజెపి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. హిందు మ‌తం నుంచి వేరే మ‌తంలోకి మారిన వారు  మ‌ళ్ళీ హిందూమ‌తాన్ని అడ్డంగా పెట్టుకొని లాభ‌ప‌డాల‌ని చూస్తే  చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌నే సందేశం పంపేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. 

మనసంతా వైసీపీలోనే.. అందుకే రాజీనామా చేశా...

కొద్దిరోజులుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్... పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లును జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన డొక్కా... అప్పట్నుంచి తెలుగుదేశంతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. దాంతో, డొక్కా వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా ఎందుకు చేశారో మాత్రం చెప్పలేదు. పైగా అప్పట్నుంచీ టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో? తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో? వివరిస్తూ డొక్కా బహిరంగ లేఖ రాశారు.    తెలుగుదేశం అధిష్టానం తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు డొక్కా చెప్పుకొచ్చారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయించారని, అది తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అలాగే, టీడీపీ నేతల చౌకబారు విమర్శలు కూడా తనను బాధించాయన్నారు. మొన్నటి ఎన్నికల్లో తాను తాడికొండ సీటు కోరానని, కానీ ఓడిపోతానని తెలిసినా, తనకు ప్రత్తిపాడు సీటు ఇచ్చారని డొక్కా ఆరోపించారు. ఇక, ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తనతో వ్యవహరించి తీరు... తనను మానసికంగా కలిచివేసిందన్నారు.  అయితే, ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను మానసికంగా వైసీపీ వైపు మొగ్గుచూపానని డొక్కా తన లేఖలో తెలియజేశారు. కానీ, వైసీపీ అధిష్టానంతో తాను ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. అయితే, ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్న డొక్కా... పార్టీ అనేదిక ఒక వేదిక... ఆ వేదిక ద్వారా నాదైన పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా, తన ప్రవర్తనా తీరు తెన్నులు ప్రజలకు తెలుసంటూ చెప్పుకొచ్చారు.

రమేష్ గాంధీనా..భరత్ రెడ్డా!.. సజ్జల రామకృష్ణా రెడ్డే డిసైడింగ్ ఫ్యాక్టర్

రమేష్ గాంధీనా..భరత్ రెడ్డా ! గుంటూరు వై ఎస్ ఆర్ సి పి లో మేయర్ పదవికి పోటీ పడుతున్న ఆశావహులు ... సజ్జల రామకృష్ణా రెడ్డే డిసైడింగ్ ఫ్యాక్టర్ గుంటూరు నగర పాలక సంస్థ రాజకీయం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. అధికార వై ఎస్ ఆర్ సి పీ, విపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ కన్నా,  అధికార పార్టీ లోనే అంతర్గత పోరు చాలా బలంగా కనిస్పిస్తోంది. గుంటూరు నగర వై ఎస్ ఆర్ సి పీ అధ్యక్షునిగా ఉన్న పాదర్తి రమేష్  గాంధీ, నిజానికి మేయర్ పదవి ఆశావాహునిగా ఎప్పటి నుంచో తన ప్రయత్నాలు తానూ చేసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు జనరల్ కేటగిరీ లో ఉండటం వల్ల , వైశ్య సామజిక వర్గానికి చెందిన పాదర్తి  రమేష్ గాంధీ, తన ప్రత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకట రమణ తో పాటు, గుంటూరు వన్ ఎం ఎల్ ఏ ముస్తఫా, ఇంకా గుంటూరు-పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యేసు రత్నం ల మద్దతు ఉన్న రమేష్ గాంధీ అభ్యర్థిత్వంపై , జిల్లా ఇంచార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు కూడాపాజిటివ్ గా ఉండటం గాంధీ కి ప్లస్ పాయింట్ అయితే, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ని ఆశ్రయించిన స్విమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు తానూ చేస్తున్నారు. తనకు గానీ, వీలు కాని పక్షం లో తన భార్య శిరీష కు గానీ మేయర్ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని భరత్ రెడ్డి కోరుతున్నారు. నిజానికి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న పాదర్తి రమేష్ గాంధీ  తో పోలిస్తే, భరత్ రెడ్డి కి ఉన్న రాజకీయ నేపధ్యం అసలు ఏ మాత్రం పరిగణన లోకి రాదనేది గుంటూరు వై ఎస్ ఆర్ సి పీ వర్గాల వాదన. అయితే, సజ్జల తో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా , భరత్ రెడ్డి మాత్రం చాలా ధీమా గా ఉన్నారు. ఇక, బొత్స సత్యనారాయణ అనుయాయునిగా ముద్ర పడిన కావేటి  మనోహర్ నాయుడు కూడా మేయర్ పదవి ఆశావహుల్లో ఉన్నారు. ఇలా, ప్రస్తుతానికి మూడు గ్రూపులు, ఆరు అభిప్రాయాలు గా నడుస్తున్న వై ఎస్ ఆర్ సి పీ రాజకీయం ఇలాఉంటే, విపక్ష తెలుగు దేశం మాత్రం  కార్పొరేటర్ అభ్యర్థులను వెతుక్కునే పని లో పడింది. నిజానికి, 2005 ఎన్నికల తర్వాత 15 ఏళ్ల పాటు గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. 2012లో గుంటూరు నగర పాలకసంస్థలో చుట్టూ పదిగ్రామాలను విలీనం చేశారు. 2014లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నిక లు జరగలేదు. అప్పట్లో వార్డుల పునర్‌ విభజన సక్రమంగా జరగలేదని పలువురు వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి గుంటూరు నగరపాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2020లో ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ కావడం, రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఎన్నికలకు కార్పొరేషన్‌ సన్నద్ధం అయింది.1994 నుంచి ఇప్పటి వరకు మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోవరుసగా రెండుపర్యాయాలు తెలు గుదేశం పార్టీ మేయర్‌ సీటును గెలుచుకుంది. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి జరిగే నగరపాలకసంస్థ ఎన్నిక ల్లో మేయర్‌ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. 2005లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 31కార్పొరేటర్‌ స్థానాలను గెలుపొంది మేయర్‌ పదవినికైవసం చేసుకుంది. అయితే అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ మంత్రి గా తన కుమారుడు కన్నా నాగరాజును మేయ ర్‌గా చేయాలని, అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తన సోదరుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ కుమారుడు మోహన్‌ సాయికృష్ణను మేయర్‌గా చేయాలని పట్టుపట్టారు. దీం తో ఈ వ్యవహారం కాస్తా హైదరాబాద్‌కు మార డం,అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకొని చేరో రెండున్నర సంవత్సరాలు మేయ ర్‌ స్థానాన్ని అధిష్టించాలని ఆదేశించారు. తొలు త 2005 అక్టోబర్‌ 5న నగర మేయర్‌గా కన్నా నాగరాజు, డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీమోహన్‌లు బాధ్యతలు చేపట్టారు. అప్పటి ఒప్పందం ప్రకారం 2008లో మేయర్‌, డిప్యూలీ మేయర్‌ పదవులకు వారు రాజీనామా చేశారు. దీంతో 2008 మే 3న నగర మేయర్‌గా రాయపాటి మోహన్‌సాయికృష్ణ, డిప్యూటీ మేయర్‌గా షేక్‌ గౌస్‌లు బాధ్యతలు చేపట్టారు. అయితే రెం డున్నర సంవత్సరాల పాటు వీరిద్దరు మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా కొనసాగి 2010 సెప్టెంబర్‌ 29న పదవీ కాలం ముగిసింది.

హ్యాట్సాఫ్ సునయన పటేల్.. ఏ కె 47 చేత పట్టిన ఆరు నెలల గర్భిణి

హ్యాట్సాఫ్ సునయన పటేల్..  ఏ కె 47 చేత పట్టిన ఆరు నెలల గర్భిణి..  ఛత్తీస్ గఢ్ అడవుల్లో మహిళా కమాండో.. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా ..అంటూ  మన తెలుగు ఆడియెన్స్ ఒక ఉత్తేజపూరిత, భావోద్వేగ మిళితమైన పాట వినేవారు కదా ! సరిగ్గా ఆ పాట కు సరిపడా భావోద్వేగాలను షేర్ చేసుకోవాలంటే,  ఛత్తీస్ గఢ్ లో ఈ మహిళా పోలీసు కమాండో స్టోరీ ఏంటో మనం చదవాల్సిందే. ఆమె ఆరు నెలల గర్భిణీ. పేరు సునయన పటేల్.  నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్ లో దిట్ట గా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం దట్టమైన అడవుల్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తోంది. ఒక పది కేజీ ల బరువుండే ఏ కె 47 తో పాటు, బ్యాక్ ప్యాక్ తో ఆమె ఆ అడవుల్లో శత్రువులను వేటాడుతున్న దృశ్యాలు చూస్తుంటే, ఒక మహిళ తలచుకుంటే, ఎంత కష్ట తరమైన పనినైనా దీక్షతో , నిబద్ధత తో పూర్తి చేయగలదు అనే దానికి నిదర్శనం గా చెప్పవచ్చు.  ఛత్తీస్ గఢ్ లోని తీవ్ర నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహించే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ -దంతేశ్వరి ఫైటర్స్ వింగ్ లో ఈ ఆరు నెలల గర్భిణీ సునయన పటేల్ ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె రెండు నెలల గర్భిణి గాఉన్న సమయం లో ఈ దంతేశ్వరి యూనిట్ లో చేరింది. అయితే , ప్రస్తుతం ఆరు నెలలు గర్భవతి కావడం వాళ్ళ ఆమెను సీనియర్ ఆఫీసర్స్ విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. కానీ, ఆమె విధి నిర్వహణ వైపే మొగ్గు చూపింది. పోలీసు శాఖ నిర్మించిన 'నాయి సుబహ్ క సూరజ్ ' అనే లఘు చిత్రం లో ఆమె కీలక పాత్ర పోషించింది కూడా. అయితే ఆమె ఆరోగ్యం పట్ల పోలీసు శాఖా ఉన్నతాధికారులు కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. లోగడ ఒక సారి మిస్ క్యారేజ్ అయినా కారణంగా , ఆమెను ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరినట్టు, దంతెవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ్ చెప్పారు.

కంట్రోల్ బాబూ.. కంట్రోల్.. కంట్రోల్ రూంలను మర్చిపోలేకపోతున్న చంద్రన్న...

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా ఒక కమాండ్ కంట్రో రూం, ఒక టోల్ ఫ్రీ నంబర్ తప్పనిసరి. అవి పుష్కరాలైనా, తుఫాన్లైనా, కరువైనా వీటికి మాత్రం కరువు లేకుండా చూసుకునే వారు. ఆఖరికి పాలన మొత్తం కమాండ్ కంట్రోల్ రూంలోనే చేసిన ఘనత ఆయనది. ఆ అలవాటు ప్రకారమే చంద్రబాబు అధికారం కోల్పోయినా కంట్రోల్ రూంలు ఏర్పాటు మాత్రం మానలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై టిడిపి నాయకులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఆ పార్టీ అధినేత పిలుపునిచ్చారు.  రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ శ్రేణులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, వస్తువులు పంపిణీ చేస్తుంటే వీడియోలు తీసి షేర్‌ చేయాలన్నారు. వాటిని ఎన్నికల సంఘానికి పంపుతామని అంటున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ భవన్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 7995014525 ఏర్పాటు చేశారు. ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్ ముఖ్యమంత్రి హోదాలో డబ్బు పంపిణీ చేసినట్టు తేలితే అనర్హత వేటు తప్పదని ప్రకటన చేశారు. దానికి రివర్స్ గా చంద్రబాబు అధికార పార్టీ వాళ్ళు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే సమాచారం ఇవ్వాలని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడే వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు అయన అధికారంలో ఉండగానే ఈ కంట్రోల్ రూంలు, టోల్ ఫ్రీ నంబర్లు వల్ల ఒరిగేదేమీ ఉండదన్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా వినలేదనీ, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటని అంటున్నారు. కొందరు చంద్రబాబు స్వపక్షం వాళ్ళు కూడా ‘బాబ్బాబు తగ్గవయ్యా అన్నా..వినలేదు ఇప్పుడు నువ్వేడా’ అని కోట శ్రీనివాసరావు శతృవు సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుంటున్నారు.  ఇకపోతే తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో ఓడి పోవడం ఖాయమని..తర్వాత చంద్రబాబుకు ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం అనే సాంప్రదాయ వనరు ఎలాగూ ఉంటుంది. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే మాట వినని ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలా వింటుంది అని ఎలాగూ చెప్తారని, ఇలాంటి నంబర్లు ఎన్ని పెట్టుకున్నా చివరికి నంబర్ గేమ్ లో గెలిచేది మేమే అని అధికార వైసీపీ అంటోంది.

వైసిపిని చిత్తు చేయ‌డానికి ఆ మూడు పార్టీలు మ‌ళ్ళీ క‌లుస్తాయా?

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజు రోజుకీ ఉత్కంఠ‌త‌ను రేపుతూ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాది కూడా కాకముందే అప్పుడే పరిస్థితులు అన్ని తారుమారు అయితున్నాయా? ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఓ ప‌రీక్ష‌గా మారాయా? అయితే ఎన్నికల ముందు చెప్పిన పథకాలు, హామీలు పక్కాగా అమలవుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు తీవ్ర వివాదస్పదంగా మారిన విషయం మాత్రం రాజధాని అంశం ఒక్కటే అని చెప్పాలి. వికేంద్రీకరణ పేరుతో ఇప్పుడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే జగన్ ఈ నిర్ణయం ప్రకటించడంతో ఆనాడు రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు రాజధానిని మార్చవద్దంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సీఎం జగన్ ప్రజల నుంచి మంచి పేరు కంటే కూడా వ్యతిరేకతనే ఎక్కువగా మూటగట్టుకున్నారు. ఓ పక్క పోలవరం పనులు పూర్తిగా మూలనపడ్డాయి, పెట్టుబడులు రావడం ఏమో కానీ ఉన్న పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే వీటన్నిటిని జగన్ అర్ధం చేసుకునేలోపే ప్రత్యర్ధులు తమ బలం పెంచుకుంటూ ప్రభుత్వంపై వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సమర్ధంగా ఎదురుకుంటున్నారు. జగన్‌పై వస్తున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మొన్న ఇసుక సమస్యపై కార్మికులకు మద్ధతుగా నిలిచారు, నేడు రాజధాని రైతులకు మద్ధతుగా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ సారి చంద్రబాబు అధికారం కోల్పోవడం తిరిగి కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రావడంతో బాబు సైలెంట్ అయిపోయారు. అయితే ఎన్నికలలో ఓడిపోయాక చంద్రబాబు బాగా నమ్మిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి వారు బీజేపీలో చేరిపోయారు. అయితే వారిని చంద్రబాబు కావాలనే బీజేపీలోకి పంపారని, త్వరలో టీడీపీనీ కూడా బీజేపీలో కలిపేస్తారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీతో జగన్ సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు ఓటమికి పరోక్షంగా బీజేపీ కూడా జగన్‌కి కాస్త సహాయం చేసిందని టాక్. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది కట్ చేస్తే తాజాగా జనసేన వెళ్ళి బీజేపీతో చేతులు కలిపింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేన కలిసిందని 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఆ రెండు పార్టీలు ప‌నిప్రారంభించాయి. 2014 ఎన్నికలలో బీజేపీ, జనసేన సహాయంతో చంద్రబాబు ఎన్నిక‌ల్లో గెలిచారు. జగన్‌ని దెబ్బ కొట్టాలని అనుకుంటే ఈ మూడు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేయాలట‌. వైసీపీ ని ఎదుర్కోవాలంటే టీడీపీ ఒక్కదానితో అయ్యే పని కాదు, అలా అని బీజేపీ-జనసేనతో అయ్యే పని కూడా కాదని భావిస్తున్న ఈ మూడు పార్టీలు స్థానిక ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా వైసిపిని దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్నార‌ట‌.

అదేదో తోక పట్టుకుని స్థానిక ఎన్నికల సమరానికి సిద్దమైన కమలం...

పాతికేళ్ళు రాజకీయం చెయ్యడానికి వచ్చాను, నన్ను తక్కువ అంచనా వెయ్యకండి..ప్రశ్నించడానికి అధికారం అవసరం లేదు..నేను ఓడినంత మాత్రాన ప్రశ్నించడం మానను..సమస్య ఎక్కడున్నా అక్కడికొచ్చి నిలదీస్తా.. ఇలాంటి డైలాగులు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..ఇంకెక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ నోటినుంచే..రాజకీయాలు, అధికారం మీద పిచ్చ క్లారిటీ ఉన్న జనసేన నాయకుడు..ఏపీలో మేము సొంతంగానే ఎదుగుతున్నాం..రాబోయే కాలానికి కాబోయే పాలకులం అని చెప్పే కమలం పార్టీ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమరావతిలో ఆదివారం జనసేన, బీజేపీ పార్టీల మధ్య స్థానిక ఎన్నికల పొత్తుపై చర్చించారు. కూటమి గెలిచేందుకు గాను జనసేన జిల్లాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. తిరుపతికి చెందిన డాక్టర్‌ పి.హరిప్రసాద్‌ను కడప జిల్లా సమన్వయకర్తగా నియమించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియమించారు. నామినేషన్‌ దశ నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 13 జిల్లాల సమన్వయకర్తల వివరాలు.. శ్రీకాకుళం జిల్లా : డాక్టర్‌ బి.రఘు విజయనగరం జిల్లా : గడసాల అప్పారావు విశాఖపట్నం (రూరల్‌) : సుందరపు విజయ్‌ కుమార్‌ తూర్పుగోదావరి జిల్లా : బొమ్మదేవర శ్రీధర్‌ (బన్ను) పశ్చిమ గోదావరి జిల్లా : ముత్తా శశిధర్‌ కృష్ణా జిల్లా : పోతిన మహేశ్‌ గుంటూరు : వత్త కళ్యాణం శివ శ్రీనివాస్‌ (కె.కె.) ప్రకాశం : షేక్‌ రియాజ్‌ నెల్లూరు : సి.మనుక్రాంత్‌ రెడ్డి చిత్తూరు : బొలిశెట్టి సత్య కడప : డా.పి.హరిప్రసాద్‌ కర్నూలు : టి.సి.వరుణ్‌ అనంతపురం : చిలకం మధుసూదన్‌ రెడ్డి ఇందులో వార్తేమి ఉంది అంటారా అక్కడికే వస్తున్నాం.. మరి కమల దళాధిపతులు కూడా సమన్వయ కర్తలను నియమిస్తారా లేక..తమ్ముడు నియామకాల మీదే అధారపడటారా చూడాలి.  2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 136 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట విజయాన్ని సాధించింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఫలితంగా ఆ పార్టీ ఏకంగా 120 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది.    రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.13 కోట్ల ఓట్లు పోలయ్యాయి. వీటిలో జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. నోటా గుర్తుకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. గత 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు దక్కించుకోగా, ఎమ్మెల్యేగా చిరంజీవి సైతం గెలుపొందారు. ఆ పార్టీకి ఏకంగా 18 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కానీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం కేవలం ఏడు శాతం ఓటు బ్యాంకును మాత్రమే సొంతం చేసుకుంది. ఇక్కడే ఉంది అసలు కిటుకు 18 శాతం ఓట్లు సాధించిన అన్నయ్య చిరు పరోక్షంగా వైసీపీ మద్దతుగా ఉంటె ఏడు శాతం ఓట్లు సాధించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని బీజీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈదుతోంది అని పరిశీలకులు గుసగుసలాడుకుంటున్నారు.

సింహాచల ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ నియామకం.. మిక్సహ..మిక్సస్య..మిక్సో భ్యహ

హిరణ్య కశపుడి మరణం కోసం ప్రహ్లాదుడు.. నరకాసుర సంహారానికి సత్యభామ..రావణాసురి అంతం కోసం శ్రీరాముడు..ఉద్భవించినట్టు.. చరిత్ర చెపుతోంది. వీళ్ళందరూ శక్తి వంచన లేకుండా తప్పులు చేసి దైవాగ్రహానికి గురైన వారే. అలాగే కలియుగంలో కూడా ఎవరికి వారే తప్పులు చేసి పతనం కొని తెచ్చుకోవడం మనం ఇదివరకే చూసాం. మళ్ళీ మరోసారి అదే జరుగుతోందని హిందువులు అంటున్నారు. అత్యంత పవిత్రమైన సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా అర్ధరాత్రి జీవోతో ప్రమాణ స్వీకారం చేసిన సంచయిత క్రిష్టియన్ మత ఆచారాలను అమితంగా ఇష్టపడేవారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆమె తల్లి ఉమా గజపతి రాజు, పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం పునర్వివాహం చేసుకున్నారు. ఆమె పునర్వివాహం చేసుకున్న రమేష్ శర్మ కూడా బ్రదర్ అనిల్ శాస్త్రి లానే క్రైస్తవుడు అనే విషయం శర్మ గారి సోషల్ మీడియా అకౌంట్ చూసిన..కాస్త మెదడులో గుజ్జు ఉన్నోడు ఎవడికైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఆయన క్రమం తప్పకుండా క్రిస్టమస్ జరుపుకునేవారు..వాటికన్ సిటీకి వెళ్లేవారు.. ఆయనతో బాటు ఉమా గజపతి రాజు కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేవారు..ఆ విషయాలు కూడా వారే సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మారుతండ్రి, తల్లితో బాటు సంచయిత కూడా క్రిష్టమస్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారన్న సంగతి కూడా స్పష్టంగా తెలుస్తోంది. క్రైస్తవ మత ఆచారాలు అనుసరించే కుటుంబంలో పెరిగిన హిందువు సంచయిత రాజు గారిని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన  శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డుతో పాటు, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్సాస్) చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తనను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని సంచయిత చెబుతున్నారు. తాను 'సేవ' చేయడానికి మాత్రమే ఈ పదవిని స్వీకరించారని కూడా అంటున్నారు. ఈ వ్యాఖ్యల్లో మర్మమేమిటో మన్సాస్ చైర్ పర్సన్ గారే మరింత వివరణ ఇస్తే ఆంద్రప్రదేశ్ ప్రజలు తరిస్తారు.  

స్వామి స్వరూపానంద ను టార్గెట్ చేసిన గరికపాటి 

వేదాంత జ్ఞానం రవ్వంతైనా లేని పీఠాధిపతులు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారే తప్ప.. అద్వైత స్వాములుగా కనబడటం లేదని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్ర పురాణకర్త, మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంత్యుత్సవ సభ లో గరికపాటి చేసిన వ్యాఖ్యలు సూటిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతి ని ఉద్దేశించి చేసినట్టు గా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.  నవరసాలు పండించిన మహాకవి మధునాపంతుల  సభలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు స్వరూపానంద ని మరో సారి వివాదాల్లోకి లాగినట్టు గానే కనిపిస్తోంది, మధునాపంతుల  కావ్యాలు ఆంధ్ర సాహిత్యంలో ప్రకంపనలు సృష్టించాయని శ్లాఘించిన గరికపాటి, హఠాత్తుగా ఆ వేదిక మీద పీఠాధిపతుల ప్రస్తావన తేవటం వెనుక జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు, అలాగే వాటిని సమర్థిస్తున్న స్వామి స్వరూపానంద వైఖరే ప్రధాన కారణం గా కనిపిస్తోంది.  అంతే  కాకుండా, విపక్ష తెలుగు దేశం తోనూ, మీడియా అధిపతి వేమూరు రాధ కృష్ణ తోనూ గరికపాటి కి ఉన్న సాన్నిహిత్యం కూడా ఆయన చేత ఆ రకంగా మాట్లాడించి ఉండవచ్చునని కూడా విశ్లేషకులు   అభిప్రాయపడుతున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం విశాఖ లో శారదాపీఠం ఏర్పాటు చేసుకున్న స్వామి స్వరూపానంద కు అద్వైత సంబంధ విషయాల్లో ఉన్న జ్ఞానం పరిమితమని గరికపాటి పరోక్షం గా చేసిన వ్యాఖ్యలు ఆధ్యాత్మిక రంగం తో అనుబంధం ఉన్న వారిలో ఆలోచన రేకెత్తించాయి. నిజానికి స్వామి స్వరూపానంద ఎన్నడూ ప్రవచనాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన సన్యాసాశ్రమం అంతా కూడా రాజకీయాలతో మమేకమైపోవటం ఒక ప్రధాన మైన అంశం గా ఆయన్ను దగ్గరి నుంచి చూసిన వారికి అనుభవైకేద్యమే. అయితే, స్వామి స్వరూపానంద దగ్గర ఉన్న గొప్ప లక్షణమేమిటంటే ..తన దగ్గరకు ఒక సారి వచ్చిన వారిని కుల, మతాలకు అతీతంగా అక్కున చేర్చుకోవటం. జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని కూడా అక్కున చేర్చుకుని , ఆయన చేత తన పీఠం లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కుంభాభిషేకం చేయించటం ద్వారా ఒక్క సారిగా హిందూ ధార్మిక వ్యవస్థల దృష్టిని ఆకర్షించిన స్వామి స్వరూపానంద, ఆ క్రమం లో విపరీతమైన విమర్శలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.  అయితే, దివంగత కాంగ్రెస్ మంత్రి, పూర్వ రాజ్య సభ్యుడు అయిన ద్రోణం రాజు సత్యనారాయణ ఒంట  పట్టించిన రాజకీయ ఎత్తుగడలు , స్వామి స్వరూపానంద ను రాటుతేలేలా చేశాయి. ఆ  తర్వాత,విశాఖ కె చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు, కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి సాహచర్యం  కూడా  స్వామి స్వరూపానంద కు బాగా కలిసి వచ్చింది. శ్రీ  శారదాపీఠాన్ని ఒక స్వతంత్ర పీఠంగా రాష్ట్రం లో విస్తరించడానికి ఒక వైపు అవిశ్రావంతంగా కృషి చేస్తూనే, మరో వైపు తిరుమల లోనూ, ఇతర రాష్ట్రాలు, ప్రత్యేకించి... మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో తమ పీఠం వ్యవస్థలను పరిపుష్టం చేసుకున్న స్వామి స్వరూపానంద , తన తర్వాతి పీఠాధిపతి గా స్వామి స్వాత్మానందేంద్ర ను ప్రకటించిన విధానం కూడా ఆధ్యాత్మిక వాసులను విస్తుపోయేలా చేసింది. చంద్రబాబు నివాసానికి అతిదగ్గరలో, కృష్ణా నది   కరకట్ట మీద అంగ రంగ వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు -కె చంద్ర శేఖర్ రావు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవటమే కాకుండా, ఆ వేదిక మీదనే స్వామి స్వరూపానంద జగన్ మోహన్ రెడ్డి ని తన ఆత్మ గా అభివర్ణించటం, జగన్ నుదిటిని ముద్దాడటం కూడా రాజకీయ రంగ ప్రముఖులను విస్మయ పరిచింది.  ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు  గరికపాటి చేసిన వ్యాఖ్యలతో స్వామి స్వరూపానంద శీల పరీక్ష కు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ అధినేతనో, లేక ఆయన కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడో స్వామి ని  విమర్శించటమో,లేక ఆయనపై ఆరోపణలు చేయటమే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక రంగంలో లబ్ధ ప్రతిష్టులైన గరికపాటి లాంటి వారిని నేరుగా రంగం లోకి దింపటం ద్వారా -ఏ బీ ఎన్ మీడియా అధిపతి రాధాకృష్ణ చేసిన దాడిని స్వామి స్వరూపానంద ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.  ఎందుకంటే,స్వామి పీఠం లో ఆద్యాత్మికత ను ప్రశ్నించటం ద్వారా , పీఠ వ్యవస్థను నడి  రోడ్డు మీద నుంచో  పెట్టి అవమానించటానికే తెలుగుదేశం అనుకూల శక్తులు, ఈ రకమైన ఎత్తుగడలకు దిగుతున్నాయని స్వామి స్వరూపానంద అనుయాయుల వాదన. నిజానికి, కాస్త అటూ ఇటూగా ..స్వామి స్వరూపానంద తో సమానంగా పీఠం నెలకొల్పిన స్వామి పరిపూర్ణానంద కు ఎదురుకానంత వ్యతిరేకతను స్వరూపానంద మూట కట్టుకుంటున్నారు. ఇది తిరుగులేని వాస్తవం.  

స్థానిక ఎన్నిక‌ల్లోనైనా పవర్ స్టార్ ప‌రువు ద‌క్కుతుందా?

స్థానిక ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాట‌డానికి ప‌వ‌ర్ స్టార్ సిద్ద‌మైయ్యారు. సినిమా స్టైల్‌లో డైలాగులు, స్రిప్ట్ ఆధారంగానే రాజ‌కీయ చ‌ర్చ‌లు, స‌మావేశాల్లో బిజీ అయిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రువు ఎక్క‌డ పోగొట్టుకున్నారో అక్క‌డే వెతుక్కుంటున్నార‌ట జ‌న‌నేత‌. క‌నీసం గాజువాక ప‌రిధిలోనైనా ఓటింగ్ శాతం పెంచుకొని ప‌రువు కాపాడుకోవ‌ల‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నార‌ట‌. స్థానిక ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు సినిమా షూటింగ్‌ను సైతం ప‌క్క‌న పెట్టి రాజ‌కీయ స‌మావేశాల నిర్వ‌హించ‌డంపై దృష్టి పెట్టారు. ఇప్పటికిపుడు అన్నీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రక్రియలో తలమునకలౌతున్నారు. ముందుగా వ‌ల‌స‌ల‌పై దృష్టి పెట్టారు. విశాఖ‌ప‌ట్ట‌ణం కు చెందిన ప‌లువురు స్థానిక వైసీపీ నాయకులు, యువకులు దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని జనసేనలో చేర్చుకున్నారు. కండువాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన సమయమని, ఈ తరుణంలో ఇంత మంది యువకులు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తునంటు త‌న‌దైన శైలిలో ఉప‌న్యాసాలు దంచుతున్నారు జ‌న‌నేత‌. ఆంధ్ర‌ప్ర‌జ‌ల్ని ఉద్ద‌రిస్తానంటూ మ‌రో సారి ఎన్నిక‌ల స‌మ‌రంలో దిగిన ప‌వ‌ర్‌స్టార్‌కు జ‌నం ఎలా స్పందిస్తారో అన్న అంశంపై రాష్ట్రంలో మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కాపు క‌మ్యూనిటీలో ప‌ట్టు వుంద‌ని చెప్పుకుంటున్న జ‌న‌సేన‌, ప్ర‌జారాజ్యం పార్టీల ప‌ట్ల గ‌తంలో ప్ర‌జ‌ల స్పంద‌న చూస్తే వాస్త‌వం ఏమిటో అర్థం అవుతుంది. 2008లో ప్ర‌జారాజ్యం పార్టీ 294 సీట్లు పోటీచేసి 17 శాతం ఓట్లు పొంది ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 6.7 శాతం ఓట్లు పొందింది. 136 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలుచుకుంది. ఎ.పి.లో 17 స్థానాల‌కు పోటీ చేసి లోక్‌స‌భ‌కు 6.1 శాతం ఓట్లు మాత్ర‌మే పొందింది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో 5 శాతం కంటే త‌క్కువ ఓట్లు పొందింది. నోటా కంటే త‌క్కువ ఓట్లు జ‌న‌సేన‌కు ప‌డ్డాయి. నిజానికి రాష్ట్రానికి సంబంధించినంత వరకు మొన్నటి ఎన్నికల్లో బిజెపికన్నా జనసేనకు వచ్చిన ఓట్లు ఎక్కువే. బిజెపికి కేవ‌లం 0.84 శాతం ఓట్లు వ‌చ్చాయి. అయితే జనసేనకు కొంతమంది కాపు సామాజికవర్గం ఓట్లు, మిగిలినవి అభిమానుల ఓట్లు వచ్చాయి. అంతే కానీ మామూలుగా జనాల వేసిన ఓట్లు తక్కువనే ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. ఇప్ప‌ట్టికీ జనసేనకు ఉన్న సమస్యేమిటంటే ఏ స్ధాయిలోనూ అసలు పార్టీ నిర్మాణమే జరగలేదు. ఏదో గాలివాటంగా నెట్టుకొచ్చేస్తున్నాడు జ‌న‌నేత‌. అందుకే బీజేపీతో క‌లిసి జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో త‌ల‌ప‌డాల‌నుకుంటోంది. రెండు పార్టీలు కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయాలనే డిసైడ్ అయ్యాయి. అయితే వ‌చ్చిన చిక్కు ఏందంటే, బిజేపీ రాజకీయాలు ప‌వ‌ర్‌స్టార్‌కు అర్థం కావ‌డం లేద‌ట‌. బిజెపిని న‌మ్ముకొని రాజ‌కీయం చేస్తున్న జ‌న‌నేత‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కేంద్రంతో స‌ఖ్య‌త‌గా వుండ‌టం, బీజేపీ అధినాయకత్వం జగన్‌పై సాఫ్ట్‌గా ఉండటంతో ప‌వ‌ర్ స్టార్‌కు మింగుడుప‌డ‌టం లేదట‌. జగన్ బీజేపీతో స్నేహం చేస్తుంటే, స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి పొరాటం చేస్తే జ‌నం ఎలా అర్థం చేసుకుంటారంటూ జనసేనాని గుర్రుగా ఉన్నారట. బిజెపి త‌న‌ను వెర్రి వెంక‌ళ‌ప్ప చేస్తున్న విష‌యం ఇంకా ప‌వ‌ర్ స్టార్‌కు అర్థం కావ‌డం లేదని జ‌నం అనుకుంటున్నారు. వైసిపికి గట్టి పోటి ఇస్తామని బిజెపి, జ‌న‌సేన‌ పార్టీల నేతలు ప్రకటించాయి. అసలు ఇంతకీ పవన్ ప్రచారానికి టైం కేటాయిస్తారా? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా తయారైంది.

NPR రద్దు చేయ‌క‌పోతే స్థానిక ఎన్నిక‌ల్లో పోటీచేస్తాం!

24 గంటల్లో NPR రద్దు చేస్తూ ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుతామంటూ C.M. జగన్ కి NPR,CAA వ్యతిరేక అలయన్స్ అల్టిమేటం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న NPR,CAA,MRC వ్యతిరేక‌ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ‌ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో NPR ను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు ప్రకటించడాన్ని స్వాగతించే లోపులోనే జిల్లా కలెక్టర్ ల ద్వారా ఏప్రిల్ ఒకటి నుండి NPR వివరాల సేకరణకు సంబంధించిన‌ ట్రైనింగ్ ఇవ్వడం తమకు ఓట్లేసిన ప్రజలను మోసగించడమేనని. ముస్లిం సంఘలు మండి పడుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి కేరళ వలె NPR ను శాశ్వత ప్రాతిపదికపై నిలుపుదల చేయాలని విజ‌య‌వాడ‌లో జ‌రిగిన Alliance Against NRC NPR CAA సంఘాల సమావేశం డిమాండ్ చేసింది. అలయన్స్ రాష్ట్ర కన్వీనర్ షబ్బీర్ అహ్మద్ ఆధ్వ‌ర్యంలో ఈ స‌మావేశంలో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ లకు అతీతంగా అభ్యర్థులను నిలబెట్టి వారు గెలుపు కు ప్రజాసంఘాలు కృషి చేయాల‌ని నిర్ణ‌యించారు. NPR ను 2010 ప్రశ్నలతో చేసినా ప్రమాదమేనని అది NRC కి తొలిమెట్టు అని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపధ్యంలో NRC కి వ్యతిరేకమని ప్రకటించిన ప్రభుత్వం NPR ను పూర్తిగా నిలుపుదలచేసి తమ విశ్వసనీయతను చాటుకోవాలన్నారు. తక్షణమే రాష్ట్రంలో NPR ,CAA,NRC లను అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాల‌ని, తీర్మానం చేసేంతవరకు‌ఈ పోరాటం ఆగదని ప్రకటించారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన వారిగా ‌ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మిగిలిపోతారని ఈ స‌మావేశం అభిప్రాయ‌ప‌డింది. ముఖ్య‌మంత్రి స్థానిక‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేశార‌ని, ఎన్నికలే లేకపోతే ఈ ప్రకటన‌కూడా వచ్చేది కాదని ఈ స‌మావేశంలో ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ‌ప్రభుత్వం అసెంబ్లీ లో NPR,NRC,CAA లను పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాల‌ని, సెప్టెంబరు లోపు ఎప్పుడు‌NPR నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజలు బహిష్కరించాలని స‌మావేశం పిలుపు నిచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి గ్రామాలకు మినహాయింపు!

ప్రత్యేక కార్పొరేషన్ గా రాజధాని గ్రామాలు మరికొన్ని గ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు ఆయా గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయిస్తూ ఆదేశాలు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదలైంది. అయితే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోవని తెలుస్తోంది. రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తుండడం ఓ కారణమైతే, కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండడం మరో కారణం. తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయా గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాజ‌కీయ కంపులో రాజ‌కుటుంబం

మాన్సాస్‌ ట్రస్ట్ వివాదంపై అమీతుమీకి సిద్ద‌మంటున్న రాజ‌కుటుంబం వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమిస్తారా? ప్రభుత్వ జోక్యం సరికాదంటున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? కుటుంబ‌స‌భ్యులే వేధిస్తున్నారంటున్నసంచైత. మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం ముదురుతోంది. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నియామకంలో ప్రభుత్వ తీరుపై అశోక్‌ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం వైఖరి వింతగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు, దేవాలయం భూములపై ప్రభుత్వం కన్నేసిందని.. అందుకే దొడ్డి దారిన అర్థరాత్రి నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. వేరే మతం వారిని చైర్మన్‌లుగా నియమించడం మంచిది కాదని.. దాతల భూములు ఆలయానికే చెందాలని అభిప్రాయపడ్డారు. ట్రస్టు నిబంధనల ప్రకారం ఆడవాళ్లు పదవి చేపట్టకూడదన్నారు. అసలు జీవోలో ఏముందో బయట పెట్టకపోతే న్యాయపోరాటం చేస్తాను అన్నారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే ఎందుకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?... ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలపై ఆ ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌ సంచైత గజపతిరాజు ఘాటుగా స్పందించారు. చర్చి, మసీదులకు వెళ్తే మతం మారుతుందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కుటుంబ సభ్యులే తనపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని సంచైత ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ట్ర‌స్టు బాధ్య‌లు త‌నకు అప్ప‌గించ‌డాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఇలా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయ‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన నియామకంపై ఎవరైనా న్యాయస్థానానికి వెళ్లినా పోరాటం చేస్తానని తెలిపారు. ట్రస్ట్‌ భూములు, దేవదాయ భూములు ఎవరికీ చెందనివ్వమని ఆమె స్పష్టంచేశారు. తన తాతగారు స్థాపించిన ట్రస్ట్‌ ద్వారా పేదలకు సేవలందిస్తానని చెప్పారు.