భారత్ లో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 19,148 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 434 మంది మరణించారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరగా, మృతుల సంఖ్య 17,834కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకోగా, ప్రస్తుతం  2,26,947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,80,298 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8,053 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇక, ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,08,03,599 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,18,968కి చేరుకుంది. ఇప్పటివరకు  64,57,985 మంది కరోనా నుంచి కోలుకోగా,, ప్రస్తుతం 43,45,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సచివాలయం కూల్చేస్తే.. మరి ప్యాలెస్ సంగతేంటీ?

ఆరో నిజాం నుంచి ఎన్టీఆర్ వరకు పరిపాలన సాగించిన భవనం.. బకింగ్ హామ్ ప్యాలెస్ నమూనాలోని అరుదైన నిర్మాణం.. సంప్రాదాయ యూరోపియన్ శైలీలో ఆకట్టుకునే రాజసం.. నాడు ఆరో నిజాం, నేడు కేసీఆర్ వాస్తు బాగలేదన్నారు.. 132ఏండ్ల చారిత్రక భవనం మ్యూజియంగా మారనుందా?.. తెలంగాణ ప్రభుత్వం సచివాలయ భవన సముదాయాన్ని కూల్చివేయాలన్న నిర్ణయానికి ఎట్టకేలకు న్యాయవ్యవస్థ నుంచి ఆమోదం లభించింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయవద్దంటూ ప్రతిపక్షాలతో పాటు చారిత్రక పరిశోధకలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనా కేంద్రం లేదన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు తన తుదితీర్పు వెల్లడించింది. దాంతో కొన్ని నెలలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. అయితే సచివాలయం మధ్యలో ఉన్న జీ బ్లాక్ గా మార్చబడిన సైఫాబాద్ ప్యాలెస్ సంగతేటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందరో ముఖ్యమంత్రుల కార్యాలయంగా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి నందమూరి తారక రామారావు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రుల పరిపాలన కేంద్రంగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ నేడు శిథిలావస్థలోకి చేరుకుంది. నిజాం ఆరో నవాబు మహబూబ్ అలీ ఖాన్ 1887లో ఈ ప్యాలెస్ ను నిర్మణం ప్రారంభించారు. లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ ను పోలిన విధంగా సంప్రదాయ యూరోపియన్ నిర్మాణశైలీలో ఈ భవనాన్ని నిర్మించారు. డంగ్ సున్నం, వివిధ ప్రాంతాలతో తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లతో కట్టిన ఈ భనవం రెండస్తుల్లో ఉంటుంది. మధ్యలో విశాలమైన మెట్లు రాజసం ఉట్టి పడేలా ఉంటాయి. అర్థచంద్రాకార గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంజనీర్ల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ భవనంతో ఎండాకాలంలోనూ చల్లగా ఉండేదట. బర్మా టేకుతో చేసిన గుమ్మాలు, కిటికీలు నేడు లక్షల ఖరీదు పలుకుతాయి. నివాసయోగ్యం కాదని... పురానీ హవేలీలో నివాసం ఉండే మహబూబ్ అలీ ఖాన్ అనారోగ్యం కారణంగా తమ మకాం హూసేస్ సాగర తీరంలో ఆహ్లాదవోకరమైన వాతావరణంలో నిర్మించిన సైఫాబాద్ ప్యాలెస్ కు మార్చాలని అనుకుంటాడు. తమ ప్రధాన మంత్రి కిషన్ ప్రసాద్తో కలసి ఏనుగు అంబారీపై ప్యాలెస్ కు వస్తుండగా అపశకునం ఎదురైందని, ఈ ప్యాలెస్ నివాస యోగ్యం కాదని జోతిష్యులు చెబుతారు. దాంతో నిజాం ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ భవనాన్ని తన ఆర్థిక మంత్రి సర్ అక్బర్ హైద్రీ కోసం కేటాయిస్తారు. ఆ రోజు నుంచి పైఫాబాద్ ప్యాలెస్ పరిపాలన భవనంగా మారిపోయింది. 1888 నుంచి ఈ భవనంలో అనేక శాఖల కార్యకలాపాలు జరిగాయి. జీ బ్లాక్ నుంచి సర్వహితగా.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి నందమూరి తారక రామారావు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రుల కార్యాలయంగా సైఫాబాద్ ప్యాలెస్ మారింది. ఎన్టీఆర్ ఈ ప్యాలెస్ లో మార్పులు చేయాలని భావిస్తే అప్పటి సిఎస్ నరేంద్ర లూథర్ ఆయన ప్రతిపాదను వ్యతిరేకింటారు. చారిత్రకాత్మకమైన కట్టడం రూపురేఖలు మారిస్తే వారసత్వ సంపదను కోల్పోతామని ఆయన చెప్పిన మాటలకు ఫిదా అయిన ఎన్టీఆర్ ఈ ప్యాలెస్ ను యథాతథంగా కొనసాగించారు. సర్వహితగా పేరు మాత్రం మార్చగలిగారు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు జీ బ్లాక్ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగా ప్రజాసంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయన తన కార్యకలాపాలను సీ బ్లాక్(సమత బ్లాక్) నుంచి నిర్వహించారు. 1994 నుంచి 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాడే వరకు సీ బ్లాక్ ముఖ్యమంత్రి కార్యాలయంగా, జీ బ్లాక్ లో మంత్రుల కార్యాలయాలతో పాటు మీడియా సెల్ కూడా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఎ,బి,సి,డి బ్లాక్ల లు తెలంగాణకు కేటాయించగా జె, ఎల్, కె,జీ, హెచ్ బ్లాక్ లను ఆంధ్రకు కేటాయించారు. జీ బ్లాక్ లో కార్యకలాపాలు తగ్గిపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరింది. వారసత్వ వారధి.. తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోని అన్నీ బ్లాక్ లను కూలగొట్టి ఆధునాతనంగా నిర్మించాలన్న యోచనలో ఉంది. అయితే అన్ని బ్లాక్ ల మధ్యలో, 132ఏండ్ల వయసుతో నాటి నిజాంల పాలనకు.. నేటి తెలంగాణ అస్తిత్వానికి, వారసత్వానికి వారధిగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ ను ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.. వారసత్వ సంపదను కాపాడాలి... హైదరాబాద్ నగరంలో ఎన్నో విభిన్న శైలీ నిర్మాణాలు ఉన్నాయి. యూరోపియన్, పర్షన్ సంప్రదాయతీరులో కట్టిన కట్టడాలు ఒకే పట్టణంలో ఉండటం చాలా అరుదు. అలాంటి భిన్నశైలీ నిర్మాణాలను వారసత్వ సంపదగా మనం కాపాడుకోవాలి. -అనురాధ, ఇంటెక్

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల పై ఎన్జీటీ కమిటీ 

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, అంతర్వేది ప్రాంతాలలో సముద్ర ఇసుక అక్రమ తవ్వకాల పై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో ఈ రోజు విచారణ జరిగింది. ఈ వ్యవహారం పై అదే జిల్లాకు చెందిన వెంకటపతిరాజు ఎన్జీటీ లో పిటిషన్ వేస్తూ ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు రొయ్యల చెరువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. దీని పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ అక్రమాల పై విచారణ జరపడానికి ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయం పై కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. ఈ కమిటీ మూడు నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ .. జైలుకు తరలింపు

మాజీ మంత్రి అచ్చెన్నాయడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందనందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ కావడంతో పోలీసులు ఆయనను విజయవాడ జైలుకి తరలించారు.  ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలను ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును.. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అచ్చెన్నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు పొడిగించింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే,  ఇప్పుడు ఆసుపత్రి అధికారులు సడెన్‌గా డిశ్చార్జి చేశారు. కరోనా టెస్ట్ చేసి, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు కోరినా.. పట్టించుకోకుండా డిశ్చార్జ్ చేసారని తెలుస్తోంది. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేస్తున్నారన్న విషయం తెలిసి.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు.   అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నాను అన్నారు. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. మరోవైపు, అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. శుక్రవారం ఆయనకు ఎక్కడ బెయిల్ వస్తుందోనన్న ఆలోచనతోనే.. ఇప్పుడు ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించారని టీడీపీ ఆరోపిస్తోంది. అచ్చెన్నాయుడును ఒకటి,రెండు రోజులయినా జైల్లో ఉంచాలన్నది జగన్ లక్ష్యమని.. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.

వైసీపీలో వర్గ విభేదాలు.. ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం

గుంటూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొంతకాలంగా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ ఎమ్మెల్యే రజినీ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ పర్యటనను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో వీరి మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.  నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త గంటా హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. అయితే, ఎంపీ కారును స్థానికంగా ఉన్న రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలును వైసీపీ నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. పరామర్శ కోసం మాత్రమే వచ్చానని ఎంపీ చెప్పినా వినిపించుకోకుండా.. కారుకి అడ్డుపడి వాగ్వాదానికి దిగారు. అనధికార కార్యక్రమాలకు కూడా ఇబ్బంది కలిగించటం సరికాదని ఎంపీ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. ఇరు వర్గాల వాదనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసుల రాకతో అక్కడి వాతావరణం సద్దుమణిగింది. పోలీసులు సాయంతో అక్కడి నుంచి ఎంపీ బయటపడ్డారు. గతంలో పురుషోత్తంపట్నంలోనూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం అప్పట్లో సంచలనమైంది.

తమిళనాడులో పేలిన బాయిలర్.. ఆరుగురి మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ థర్మల్ ప్లాంట్‌లో బుధవారం బాయిలర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. అందుతున్న సమాచార ప్రకారం థర్మల్ పవర్ స్టేషన్-2 లోని ఐదవ యూనిట్‌లో పేలుడు చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం షిఫ్ట్ లో కార్మికులు పని ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 17 మంది గాయపడినట్టు కడలూరు ఎస్పీ అభినవ్ తెలిపారు. మరి కొంత మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్టుగా చెబుతున్నారు. గాయపడినవారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ క్లాసుల పై ప్రభుత్వానికి ఒక పాలసీ ఉందా.. తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న 

కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. గత మార్చ్ లో లాక్ డౌన్ తో మూసి వేసిన స్కూళ్లు, కాలేజీలు ఇప్పటికీ తెరుచుకోలేదు. అసలు ఎప్పటికి తెరుచుకుంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతా సవ్యంగా ఉంటే ఇప్పటికే స్కూళ్లు తెరిచేవారు. ఐతే ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా చిన్న చిన్న పిల్లలకు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లలో పాఠాలు చెబుతున్నారు. ఇపుడు దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులను నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. అంతే కాకుండా ఆన్ లైన్ త‌ర‌గ‌తుల వ‌ల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని పిటిష‌న‌ర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయ‌స్థానం ల్యాప్ టాప్స్, ఫోన్స్ కొనే ఆర్థిక స్థోమ‌త అంద‌రికీ ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించింది. విచారణకు హాజరైన ప్ర‌భుత్వ న్యాయ‌వాది ఆన్ లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న పాఠ‌శాల‌ల‌పై డీఈవోలు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని కోర్టుకు తెలిపారు. ఐతే దీని తో సంతృప్తి చెందని కోర్టు అసలు ఆన్‌లైన్ క్లాసుల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన పాలిసీని రూపొందించలేదని, ఎల్లుండి లోగా దీని పై పూర్తి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసేవిధంగా రాష్ట్ర‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు..10 నిమిషాల్లో రిపోర్టులు వచ్చే పరీక్షలు చేయాలని ఆదేశించింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్నిపరీక్షలు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారు? జూన్ 26న హైదరాబాద్‌లో పరీక్షలు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సెంట్రల్  టీం ఎక్కడెక్కడ పర్యటించిందన్న అంశాలను ఈ నెల 17న తెలపాలని హైకోర్టు పేర్కొంది. జులై 17న పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని, దానిపై సంతృప్తి చెందకపోతే… జూన్ 26న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్త్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, హెల్త్ కమిషనర్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే.. కోర్టు ధిక్కరణగా భావిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

అసలు వైఎస్సార్ పార్టీ మాది

ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి షోకాజ్ నోటిస్ ఇచ్చి వైసీపీనే ఇరుకున పడినట్టు అనిపిస్తోంది. అసలు మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ పేరు వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.  తాజాగా అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా.. ఢిల్లీలో చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరారు. వైఎస్సార్ అని రాయకుండా, పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  అసలు వైఎస్సార్ పార్టీ తమదేనని మహబూబ్ బాషా అన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీ పేరుతో వాళ్ల ఎంపీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని మహబూబ్ బాషా తెలిపారు.

మంత్రి పదవులకు మోపిదేవి, సుభాష్ చంద్రబోస్ రాజీనామా

ఇటీవల ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాలుగూ గెలుచుకున్న సంగతి తెలిసిందే. వారిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ ఇద్దరు నేతలు తమ ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.  రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లోగా వారి పదవులకు రాజీనామా చేయాల్సి ఉండడంతో.. ఎమ్మెల్సీ పదవుల రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి అందజేశారు. వీరి రాజీనామాకు మండలి చైర్మన్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, మంత్రి పదవుల రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్‌కు పంపారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో వారి స్థానంలో సీఎం జగన్ ఎవరిని తన కేబినెట్ లోకి తీసుకుంటారోనన్న ఆసక్తి అధికారపార్టీ వర్గాల్లో నెలకొంది.

ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, ఏపీలో వైద్యుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. "వైద్యో నారాయణో హరిః అన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలందిస్తోన్న దేవుళ్ళకి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చేతులెత్తి మొక్కుతూ... హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు. "ప్రాణదాతలైన వైద్యుల పట్ల ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తోంది. డాక్టర్లకు ఇప్పటికీ పిపిఈ కిట్లు అందించక పోవడం వైసీపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం. పిపిఈల కోసం విశాఖ ఇఎన్ టి ఆసుపత్రిలో డాక్టర్లు ధర్నా చేసారంటే ఎంత సిగ్గుచేటు!" అంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. "మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, నడిరోడ్డుపై అర్థనగ్నంగా, లాఠీలతో కొట్టించి, పిచ్చివాడని ముద్రవేసింది ప్రభుత్వం. ప్రపంచమంతటా డాక్టర్లపై పూలు చల్లి ప్రశంసిస్తోంటే ఏపీలో డాక్టర్ల పరిస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల సేవను గుర్తించి గౌరవించాలి." అని చంద్రబాబు పేర్కొన్నారు.

1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్

108, 104 వాహనాలను సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను అందించేందుకు 1,088 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొత్త అంబులెన్స్‌ల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మండల కేంద్రానికి ఒక వాహనం ఏర్పాటు చేయనున్నారు.  108, 104 వాహనాలను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండగా, ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 412 అంబులెన్స్ లు 108 సేవల్లో భాగంగా అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరుస్తాయని చెప్పారు. మరో 282 అంబులెన్స్ లు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను కలిగివుంటాయని, మిగతావి అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్టుతో ఉంటాయని తెలిపారు. 26 అంబులెన్స్ లు చిన్నారుల కోసం కేటాయించామని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.  వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి మాత్రమే కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అత్యవసరాల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గోతిలో విసిరేసి పూడ్చి పెట్టారు

దేశ వ్యాప్తంగా కరోనా తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. కొన్ని నగరాల్లో కొత్తగా పాజిటివ్ గా తేలిన వారిని చేర్చుకునేందుకు హాస్పిటల్స్ లో బెడ్ లు ఖాళీ లేక పోవడం తో ఇంటి వద్దే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కరోనా తో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్య క్రియల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక లోని బళ్లారికి సంబంధించిన వీడియోలు రెండు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో కొంత మంది పిపియి కిట్లు ధరించిన వ్యక్తులు కరోనా తో మరణించిన వారి మృతదేహాలను ప్లాస్టిక్ బ్యాగులలో చుట్టి రెండు పెద్ద గోతులలో విసిరేసి కప్పి పెట్టినట్లుగా కనిపిస్తోంది. బళ్లారి లోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ గత రెండు రోజులలో 18 మంది మరణించారు. ఐతే ఆ మృత దేహాలకు అంత్యక్రియల పై స్థానికులు అభ్యతరం చెప్పడంతో అధికారులే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికోసం గుగ్గరహట్టి లోని తుంగభద్ర ఎగువ కాల్వ కు కొద్దీ దూరంలో ప్రొక్లైన్ తో రెండు పెద్ద గోతులు తీసి ఉంచగా పిపియి కిట్లు ధరించిన ప్రభుత్వ సిబ్బంది నల్లటి ప్లాస్టిక్ బ్యాగులలోచుట్టిన మృతదేహాలను తీసుకు వచ్చి ఒక గోతిలో 8 మరో గోతిలో 10 మృతదేహాలను విసిరేసి పూడ్చి పెట్టారు. ఈ వీడియోలో ఉన్న వారి సంభాషణలు కూడా దారుణంగా ఉండడంతో ఈ వ్యవహారం పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఐతే వైరల్ అవుతున్న ఈ వీడియోల పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో బళ్లారి జిల్లా కలెక్టర్ స్పందించారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారికి జరిగిన అంత్యక్రియల తీరు పై మృతుల బంధువులకు అయన బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని పై విచారణకు ఆదేశించామని తప్పు చేసినట్లుగా తేలిన వారి పై చర్యలు తీసుకుంటామని అయన చెప్పారు. ఐతే ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితి కేవలం విదేశాలలోనే చూశాం. ఐతే ఇపుడు వచ్చిన ఈ వీడియోతో మన దేశం లోని పరిస్థితుల పై ప్రజలలో ఆందోళన నెలకొంది.

ఏపీకి రావాలంటే పర్మిషన్ కావాల్సిందే.. డీజీపీ

కేంద్రం అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఆ రాష్ట్రాల నుండి ఎంటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ లో కొన్ని రోజులలో నిర్వహించవలసిన ప్రవేశ పర్రేక్షలను వాయిదా వేయడం తో పాటు, ఇటు హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్ననేపథ్యంలో నగర వాసులు ఏపీలోని తమ స్వంత ఊళ్లకు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాలతో పాటు ఏపీ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఈ సందర్బంగా అయన తెలిపారు. దీని కోసం స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని అన్నారు. అలా అనుమతి తీసుకున్న వారిని ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి ప్రజలను అనుమతిస్తామని అన్నారు. ఐతే అనుమతి తీసుకున్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదని వివరించారు. రాత్రి సమయం లో కేవలం అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రం అనుమతి కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.

విదేశాల్లో గృహహింస కేసులకు తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా పరిష్కారాలు

ఎన్ఆర్ఐ గృహహింస కేసుల వివాదాలకు చెక్.. 360కోణాల్లో కేసులను పరిశీలిస్తున్న ఉమెన్ సేఫ్టీ వింగ్.. విదేశాల్లో గృహహింస కేసులకు తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా పరిష్కారాలు.. యువతులను రక్షించడమే లక్ష్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక శ్రద్ద.. నిందితులు ఎక్కడ ఉన్నా వివరాలు తెలుసుకునే ప్రయత్నం.. వెబినార్ ద్వారా విచారణ.. ఐదెంకల జీతం,  విదేశాల్లో విలాసవంతమైన జీవనంపై ఆసక్తిలో కొందరు, అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడిన మరికొందరు ఎన్ఆర్ఐల సంబంధాలపై మక్కువ చూపిస్తారు. తీరా భారీ కట్నకానుకలతో పెండ్లి అయిన తర్వాత భార్యకు వీసా పంపిస్తామని ఉడాయించే వారు కొందరైతే దేశం కాని దేశం తీసుకువెళ్లి చిత్రహింసల పాలు చేసేవారు మరికొందరు ఉంటారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ఎన్ఆర్ఐ పెండ్లికొడుకులను ఏమీ చేయలేక కుమిలిపోయే తల్లిదండ్రులకు ఊరట కలిగిస్తోంది తెలంగాణ ఉమెన్ సేప్టీ వింగ్. ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ విభాగాన్ని... ఉమెన్ సేఫ్టీ వింగ్ లో ఎన్నారై ల గృహహింస కేసుల నమోదు, పరిష్కారం కోసం  గత ఏడాది జూలై 17న ప్రత్యేకంగా ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేశారు. ఎన్ఆర్ఐ జీవిత భాగస్వాములు, బంధువులను నిందితులుగా పేర్కొన్న ఎన్ఆర్ఐ కేసులను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు.  గత నాలుగైదు ఏండ్ల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నమోదు అయినా ఇప్పటికీ పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల నుండి ఎన్ఆర్ఐ సెల్ పిటిషన్లను స్వీకరించి, కేసుకు సంబంధించిన  పూర్తి సమాచారాన్ని నిర్ణీత ఫార్మెట్ లో భద్రపరుస్తారు. సంబంధిత దర్యాప్తు అధికారులు, నిపుణుల బృందం  నిందితుల వివరాలన్ని సేకరిస్తారు. అయితే గతంలో ఎన్ఆర్ఐ జీవితభాగస్వామిపై ఫిర్యాదు చేస్తే పరిష్కారం లభించేది కాదు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి, ఐపిఎస్ అధికారి స్వాతిలక్రా ఈ కేసులు పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్ఆర్ఐ ఫిర్యాదులపై న్యాయసూచనలు తీసుకుంటూ విదేశీ వ్యవహారాల శాఖ, రాయబారి కాార్యాలయాల అధికారులతో, జాతీయ మహిళా కమిషన్, కేంద్ర, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ, ఎన్జీవోలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎల్ఓసి(లుక్ అవుట్ సర్క్యులర్) జారీ చేసి మరీ నిందితులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వెబినార్ ద్వారా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అనేక కేసుల విచారణ వాయిదా పడింది. అయితే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబినార్ ద్వారా ఎన్ఆర్ఐ కేసులను విచారిస్తున్నారు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు. విదేశాల్లోనూ ఈ కేసుల పరిష్కారం కోసం పనిచేసే వివిధ సంస్థల సహాయంతో త్వరితగతిన కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వెబినార్ ద్వారా ఎన్నారై కేసుల్లో బాధితుల హక్కులను వివరిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న నిందితులపై చట్టపరంగా తీసుకోవల్సిన చర్యలపై దృష్టి సారిస్తున్నారు. మంగళవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డిజిపి స్వాతి లక్రా, డిఐజి సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు ఆన్ లైన్ వర్కషాప్ లోయునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ నెట్‌వర్క్ (WEN)  ఎన్జీఓ కౌన్సిలర్ గీతా మోర్లా, చికాగోలోని కమ్యూనిటీ లీడర్ చాందిని ఎన్నారై బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.  "మాడాడ్" పోర్టల్ ను ఉపయోగించుకోవడంలో అనుసరించాల్సిన విధానాల గురించి తెలియజేశారు. 80 కేసుల్లో బాధితులు.. ఉమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహించిన వెబినార్ లో ఎన్‌ఆర్‌ఐ సెల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ వద్ద నమోదు అయిన 101  పిటిషన్ దారుల్లో 80మంది బాధితులు పాల్గొన్నారు. వారి కేసులు సత్వరంగా పరిష్కారం కావడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు.  ఎన్ఆర్ఐ విభాగం జిఏడి చిట్టిబాబు, ఎసిపిలు అపర్ణ, డానియల్, లీగల్ అడ్వరైజర్లు పార్వతి, నంద, తారాశర్మ,  తరుణి ఎన్జీవో మమతారఘువీర్, దాదాపు 45మంది ఎస్ఐ, సిఐలు, 80మందికి పైగా బాధితులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు. ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు.. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎన్ఆర్ఐ గృహహింస కేసుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందని డిఐజి సుమతి చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గృహహింస చట్టం 498ఏ కింద ఎన్ఆర్ఐపై 574 కేసులు నమోదు కాగా ఇందులో 417 కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యాయి. ఇప్పటివరకు ఎన్ఆర్ఐ సెల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ లో101 పిటిషన్లు వచ్చాయి. ఇందులో 6 కేసుల్లో ఎన్నారై జీవిత భాగస్వాముల పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకున్నాం.  మరో8 కేసులలో ఎన్నారై జీవిత భాగస్వాములపై ఎల్‌ఓసిలు జారీ చేశాం. 7 కేసులలో ఎన్‌ఆర్‌ఐ జీవిత భాగస్వాముల పాస్‌పోర్ట్‌లు కోర్టులో జమ చేశారు. 44 కేసులలో యజమాని వివరాలు సేకరించాం. ఎన్‌ఆర్‌ఐ నిందితుల విచారణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిని విచారణకు హాజరుకావాలని లేఖలు పంపామని చెప్పారు. ధైర్యంగా ముందుకు రావాలి.. విదేశాల్లో చిక్కుబడి పోయిన, ఎన్నారైల చేత మోసపోయిన తమ పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడవద్దని, గృహహింస ఎదుర్కోంటున్న వారెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్న ధైర్యాన్ని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ కల్పిస్తోంది.

ఎవరీ బీసీ రాయ్.. డాక్టర్స్ డే ఎలా వచ్చింది?

ముందు వరుసలో నిలబడి వైద్యసేవలందిస్తూ.. మన దేశంలో 1622 మందికి ఒక డాక్టర్.. ప్రజలు- డాక్టర్ల నిష్పత్తిలో పాకిస్తాన్ కన్న వెనుకబడి.. మందులు వ్యాధులను నయం చేస్తాయి. కానీ, డాక్టర్లు మాత్రమే రోగులను నయం చేయగలుగుతారు. - కార్ల్ జంగ్ మతాలు వేరైనా.. కులాలు వేరైనా అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్ కే. కనిపించని దేవుడు ప్రాణం పోస్తే కనిపించే వైద్యుడు ఆ ప్రాణాలను కాపాడుతాడు. అందుకే  వైద్యో నారాయణో హరి అన్న నానుడి వచ్చింది. అన్ని వృత్తుల్లోకి డాక్టర్ వృత్తి అంటే ఎనలేని గౌరవం ప్రజల్లో ఈ నాటికీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధికశాతం ప్రజలు కోవిడ్ 19 కారణంగా మృత్యువు అంచులదాక వెళ్లుతుంటే వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నది డాక్టర్లే. ఈ విప‌త్క‌ర సమ‌యంలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వైద్యసిబ్బంది సంఖ్య తక్కువేమీ కాదు. త‌మ కుటుంబాల‌కు దూరంగా ఉంటూ, కరోనా బాధితుల‌కు 24/7 సేవ‌లందిస్తున్నారు.  కేవలం ఆరోగ్యాన్నే కాదు రోగుల్లో మానసిక స్థైర్యాల్ని అందిస్తున్న ఈ వైద్య నారాయణులకు  డాక్టర్స్ డే సందర్భంగా అక్షరాభిషేకం. అంతకన్న వారి రుణం మనం ఎలా తీర్చుకోగలం... ఇలామొదలైంది.. ప్రతి ఏడాది జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినత్సవంగా నిర్వహిస్తాం. ఇందుకు కారణం వైద్యసేవకే వన్నెతెచ్చిన బీసీరాయ్. ఆయన జన్మదినం, మరణించిన రోజూ రెండూ జూలై1. అందుకే ఆయన స్మారకార్థం ప్రతీ ఏడాది జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఆయన పేరు మీద వివిధ రంగా ల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి అవార్డులు అందిస్తున్నారు.  ఎవరీ బీసీ రాయ్.. వైద్యరంగంలో ఉన్నవారందరికీ, వృత్తిని దైవంగా భావించే వారందరికీ మార్గదర్శి డాక్టర్‌ బీసీ రాయ్‌. ఆయన పూర్తి పేరు బిధాన్‌ చంద్రరాయ్‌. 1882 జులై 1న బీహార్‌ రాష్ట్రంలోని బంకింపూర్‌లో ఆయన జన్మించారు. కలకత్తా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌, 1909లో ఇంగ్లాండ్‌ లోని బర్త్‌ హోమ్‌ హాస్పిటల్‌లో ఎం.ఆర్‌.సి.పి, ఎఫ్‌.ఆర్‌. సీ.ఎస్‌ డిగ్రీలు పూర్తిచేశారు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఆశయంతో ఆయన జాదవ్‌ పూర్‌ టీ.బీ హాస్పిటల్, ఆర్‌.జి.ఖార్‌ మెడికల్‌ కాలేజ్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ తదితర వైద్య సంస్థల్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు వైద్యరంగంలో వస్తున్న పోకడలకు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా ఎన్నో వ్యాసాలు రచించారు. 1922 - 1928 మధ్య కాలంలో కలకత్తా మెడికల్‌ జర్నల్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. కలరా విజృంభించిన సమయంలో వేలాదిమంది ప్రాణాల్ని ఆయన కాపాడారు. జాతిపిత మహాత్మా గాంధీకి వైద్యుడిగా, స్నేహితుడిగా ఉంటూ ఆయన ఆశయాలకు వెన్నంటి నడిచారు. ఆ తర్వాత 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా చేరి ఆ తర్వాత అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి 1948 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రోజూ సాయంత్రం కొంత సమయాన్ని వైద్య సేవలకు కేటాయించారు. 1961లో ఫిబ్రవరి 4న ఈయన భారత రత్న అందుకున్నారు. వైద్యుడిగా సేవలందిస్తూ సిఎంగా ప్రజల మధ్యనే ఉన్న ఆయన  1962 జూలై 1న మరణించారు. ఆయన గౌరవార్థమే  1991 నుంచి జూలై 1న డాక్టర్స్ డేను భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా కొత్త నినాదంతో డాక్టర్ డేను నిర్వహిస్తున్నారు. ప్రజలు - డాక్టర్ నిష్పత్తి మనదేశంలో వైద్యుల కొర‌త ఎక్కువగా ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ప్రతి 1622 మంది ప్రజలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారస్స్ ల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. ప్రజలు డాక్టర్ నిష్పత్తి లో మన దేశం 57వ స్థానంలో ఉంది. తమ పొరుగుదేశం పాకిస్తాన్ కన్నా మనం వెనుకబడే ఉన్నాం. భారత్ లో 1000 : 0.62 పాకిస్తాన్ లో 1000 : 0.89 బంగ్లాదేశ్ లో 1000 : 0.91 అత్యధికంగా ఆస్ట్రేలియాలో 1000 : 3.37 ఉన్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడే వాడే నిజమైన వైద్యుడు. కానీ, వైద్యం వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో డాక్టర్లు కూడా తయారు చేయబడుతున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ధనాపేక్ష లేకుండా సేవాభావంతో పనిచేస్తున్నవారి సంఖ్యే ఎక్కువ. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ముందువరుసలో నిలబడి ఈ మహమ్మారిని ఎదుర్కోంటూ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లకు మరోసారి పాదాభివందనం.

ట్రంప్ కు మండింది.. చైనాకు మూడింది

కరోనా వైరస్ విలయతాండవం తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ చైనా లో మొదలైనా కూడా ప్రస్తుతం చైనాలో పెద్దగా దీని ప్రభావం లేదు కానీ ప్రపంచ దేశాలు మాత్రం అల్లకల్లోలం అవుతున్నాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఐతే గత ఐదు నెలలు గా పరిస్థితి దారుణంగా ఉంది. నిన్న ఒక్క రోజే అక్కడ 46,639 పాజిటివ్ కేసులు రాగా 764 మంది చనిపోయారు. అంతే కాకుండా అమెరికాలో ముందు ముందు రోజుకు లక్ష వరకు కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనల కు గురి అవుతున్నారు. తాజాగా కరోనా ను కంట్రోల్ చేసే అంశంపై తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ట్రంప్ ఇంకో సారి చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దారుణంగా వ్యాపించింది. అది అమెరికాకు చాల తీవ్ర నష్టం కలిగించింది. నాకు చైనా పై చాల తీవ్రమైన కోపం ఉంది. ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు. దీన్ని కూడా నేను ఫీల్ అవుతున్నాను" అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా ట్వీట్ చేశారు. ఐతే ట్రంప్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం లో కొంత న్యాయం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో నే కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా ఒకటి. అక్కడ దాదాపు 27 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ బారిన పడిన వారందరికీ ట్రీట్‌మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడిందే కాకుండా అటు హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ పిపియి కిట్లు, మందులు ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి. అంతే కాకుండా సాధారణ పరిస్థితులు లేక పోవడం తో ఆర్థికంగా కూడా ఎక్కడ లేని నష్టం జరుగుతోంది. దీనికంతటికి చైనాయే కారణం అని ట్రంప్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు తాజాగా చైనాలో మరో భయంకరమైన G4 EA H1N1 అనే వైరస్ వెలుగులోకి రావడంతో... ప్రపంచ దేశాలన్నీ ఇపుడు "చైనా వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచానికి చావొచ్చింది" అని ఫైర్ అవుతున్నారు. ఈ కొత్త వైరస్ పందుల నుంచే మనుషులకు సోకుతోందాని తెలుస్తోంది. మరో పక్క పొరుగు దేశం ఐన భారత్ తో సరిహద్దులో కుట్రలు పన్నుతున్న చైనాపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే కాకుండా ఒక్క పాకిస్తాన్ తప్పించి తన చుట్టూ ఉన్న దేశాలతో చైనా ఏదో ఒక కారణం తో శత్రుత్వాన్ని పెంచుకుంటోంది. తాజాగా అసలు చైనాలో కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతినిధులు చైనాకు వెళ్లి పరిశోధించ బోతున్నారు. ఒక వేళ ఆ పరిశోధనలో కరోనా వైరస్‌ని చైనా స్వయంగా ల్యాబ్‌లో తయారుచేసిందని తేలితే మాత్రం ప్రపంచ దేశాలు చైనాపై చాలా పెద్ద ఎత్తున పరిహారం కోరుతూ కేసులు వేసే అవకాశం ఉంది. ఇక అమెరికా ఐతే యుద్ధం వంటి తీవ్ర నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్య పోనవసరం లేదు. మరో పక్క చైనా మాత్రం ఈ వైరస్‌ని అమెరికాయే సృష్టించిందని ఆరోపిస్తోంది. ఏది ఏమైనా చైనా కు ఒక వైరస్‌ల దేశంగా మాత్రం కొత్తగా గుర్తింపు వచ్చింది.