సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత వార్నింగ్ తో కూడిన విన్నపం

కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌ధాని మోడీతో వెంట‌నే మాట్లాడి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలంటూ కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశారు. కాపుల స‌మ‌స్య‌లు వెంట‌నే తీర్చాల‌ని తన లేఖ‌లో ఆయన డిమాండ్ చేశారు. అడిగిన వారికి, అడ‌గ‌ని వారికి అన్నీ ఇస్తూ ధాన‌క‌ర్ణుడులా పేరు తెచ్చుకుంటున్న మీరు, మా స‌మ‌స్య ను కూడా పరిష్కరించాలని అయన కోరారు. మీ పార్టీ విజ‌యంలో కాపు జాతి కూడా ఉంద‌ని అంటూ.. ప్రజల యొక్క స‌మ‌స్యలను తీర్చి న‌వీన్ ప‌ట్నాయ‌క్, జ్యోతిబ‌సు, వైఎస్ లాగా మీరు కూడా పేరు తెచ్చుకోవాల‌ని, అల్లా కాకపోతే అది ముణ్ణాళ్ల ముచ్చ‌టే అవుతుంద‌ని ముద్రగడ సున్నితంగా హెచ్చ‌రించారు. కాపులకు బీసీ రిజ‌ర్వేష‌న్లు అనేది త‌మ అంతిమ కోరిక అని, త‌మ‌ను బీసీలో క‌ల‌పాల‌న్న డిమాండ్ కు మీరు కూడా గ‌తంలో మ‌ద్ధ‌తిచ్చారంటూ ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్ కు గుర్తు చేశారు. ఐతే కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్నిమొదటి సారిగా కాస్త గట్టిగానే డిమాండ్ చేయడం ఎపి రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సడెన్ గా భారత్-చైనా సరిహద్దులో ప్రత్యక్షమైన ప్రధాని మోదీ

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. లేహ్, లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం లడఖ్ కు ప్రధాని వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తొలుత ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. సైనికులతో సమావేశమయ్యారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయ ఘటన సహా సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన జవాన్లును కూడా ప్రధాని పరామర్శించనున్నారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హఠాత్తుగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏక్ దో తీన్ డాన్స్ కంపోజర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నోహిట్ సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్ ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ లో ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. జూన్ నెల 20 న శ్వాసకోశ సమస్యతో ఆమె బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. ఐతే ఆమెకు డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని తేలింది. అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మృతి చెందారు. సరోజ్ ఖాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ‘తేజాబ్’ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్’ పాట ఆమె కు సూపర్ హిట్ ను ఇచ్చింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాలో ‘డోలా రే డోలారే ’ పాట, తమిళ సినిమా శృంగారం చిత్రం లోని, "జబ్ వి మెట్" లోని ‘యే ఇష్క్ హై’ పాటలు ఆమెకు మంచి పేరు తీసుకు రావడమే కాక జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన "కళంక్" సినిమాలో మాధురీ దీక్షిత్ నటించిన "తబా హోగయీ" పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియచేస్తున్నారు.

హైకోర్ట్ లో పిటిషన్ వేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ లో కోరారు. తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు.. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని, తాను ఎన్నికైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ పిటిషన్ సోమవారం పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.

వైసీపీ నేత హత్య కేసులో కొల్లు రవీంద్రపై కేసు నమోదు 

కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోకాను హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటా అని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీస్ విచారణ వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హత్యలో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు తేలితే ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.  కాగా, 2013 లో మోకా భాస్కర రావు చేసిన హత్యలో తమ తండ్రిని కోల్పోవడంతో కక్ష పెంచుకున్న కొడుకులు ఇద్దరు మోకా భాస్కర రావును హత్య చేశారని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరి వయసు 19 సంవత్సరాలు కాగా, మరకొరి వయసు 17 సంవత్సరాలు. మరోవైపు, హత్య కేసులో కావాలని మాజీ మంత్రి పేరు ఇరికంచారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. తెలంగాణాలో కరోనా విలయం 

తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకు తీవ్రమవుతోంది. గురువారం కూడా భారీగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,213 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఎక్కువ భాగం 998 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలో నే నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌లో 54, రంగారెడ్డిలో 48, ఖమ్మంలో 18, వరంగల్ రూరల్‌లో 10, వరంగల్ అర్బన్‌లో 9, నల్గొండలో 8, భద్రాద్రిలో 7, సిరిసిల్లలో 6, కరీంనగర్‌లో 5, నిజామాబాద్‌లో 5, ములుగు, నిర్మల్‌ ల లో 4 చొప్పున, నారాయణపేట, కామారెడ్డిలో 2 చొప్పున, గద్వాల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల ‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇది ఇలా ఉండగా నిన్న సీఎం కార్యకలాపాలు సాగించే సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్ లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడి గెలిచిన 9,069 మంది డిశ్చార్జి అయ్యారు. 275 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,143 మందికి నెగెటివ్ రాగా 1,213 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

అచ్చెన్నాయుడు వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ను నిన్న హడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీని పై ఒక పక్క రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఐతే తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేవలం రాజ‌కీయ కార‌ణాల‌తోనే అచ్చెన్నాయుడును హాడావిడిగా గుంటూరు జీజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసి త‌ర‌లించార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైద్యుల‌పై ఒత్తిడి తెచ్చి ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేశార‌ని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా దీని పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వెంక‌టేష్ అనే వ్య‌క్తి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుపై విచార‌ణ శుక్ర‌వారం జ‌రిగే అవ‌కాశం ఉంది.

రూ.705 కోట్ల కుంభకోణం.. జీవీకే రెడ్డి, ఆయన కుమారుడిపై సీబీఐ ఎఫ్ఐఆర్

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపైన సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ సీబీఐ ఆరోపించింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలపైనా కేసు నమోదైంది. ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సీబీఐ బుధవారం ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కార్యాలయాలు సహా మొత్తం 6 ప్రదేశాలలో సోదాలు చేసింది.  ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఈఎఎల్) అనేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్. ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోసం దీన్ని ఏర్పాటుచేశారు. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం. ఈ వెంచర్ సంస్థ‌పై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ ఆరోపణల ప్రకారం ప్రధానంగా అవినీతి ఇక్కడే జరిగింది. బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇందుకోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు జీవీకే వినియోగించుకుందని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ కంపెనీ ప్రతినిధుల నేరపూరిత చర్యల వల్ల ఏఏఐ తీవ్రంగా నష్టపోయిందని, ఎంఐఏఎల్ వద్ద ఉన్న రూ. 395 మిగులు నిధులను జీవీకే అనుబంధ కంపెనీల్లోకి తరలించారని పేర్కొంది. జీవీకే కారణంగా రూ. 705 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అధికార వర్గాలు వెల్లడించాయి.

అబ్బే ఆ ఎంపీల టూర్ తో ఒరిగేదేమి లేదు.. రఘురామ రాజు  

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరేందుకు కొంతమంది ఎంపీలు న్యాయ సలహాదారులతో సహా ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా రేపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘు రామ రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీల ఈ పర్యటన పై రఘురామరాజు స్పందించారు. ఆ ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎటువంటి ప్రయోజనం ఉండదని అయన తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు తన పై జరుగుతున్న వ్యవహారమంతా జగన్ కు తెలియకుండా జరుగుతోందని భావించానని ఐతే ప్రత్యేక విమానం లో ఎంపీలను ఢిల్లీకి పంపిస్తున్నారంటే ఇదంతా జగన్ కనుసన్నలలోనే జరుగుతోందని స్పష్టమౌతోందని అయన అన్నారు. అయినా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిని సస్పెండ్ చేస్తే ఇక పార్లమెంట్‌లో ఎవరు మిగులుతారన్నారు. అంతే కాకుండా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మరోసారి అయన స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి భూములు అమ్మొద్దని చెప్పానని, తర్వాత సీఎం జగన్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇసుక, పేదలందరికీ ఇల్లు పథకంలో ఉన్న తప్పులను మాత్రమే తాను ఎత్తి చూపానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నరసాపురం ఎంపీ ఒక లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం పై ఆ లేఖలో కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో దూరదృష్టితో తీసుకున్న ఈ పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని అలాగే ప్రధాని మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందంటూ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రశంసించారు.

రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్.. కలలో కూడా ఊహించం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత కొన్ని రోజులు కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచాయి. తరువాత వలస కార్మికుల కోసం శ్రామిక రైళ్లను ప్రభుత్వం నడుపుతోంది. మొన్న జూన్ నెల నుండి సాధారణ ప్రయాణీకుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా స్టార్ట్ చేసింది రైల్వే డిపార్ట్ మెంట్. మొత్తం గా 230 రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఐతే రైలు ప్రయాణం అంటే మనకు సినీ కవి ఆరుద్ర గారి ఒక మాట తప్పకుండా గుర్తుకొస్తుంది. అది "నేను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు" అని. వీటి దుంప తెగ మనం ముందుగానే రైల్వే స్టేషన్ కు చేరుకుంటే మన్మ ఎక్కవలసిన రైళ్లు మాత్రం తాపీగా గంటల కొద్దీ ఆలస్యంగా వస్తుంటాయి. ఐతే తాజాగా భారతీయ రైల్వే ఈ రోజు ఒక అద్భుతమైన రికార్డ్ నెలకొల్పింది. అదేంటంటే భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి గమ్యాన్ని చేరుకున్నాయి. రైల్వే బోర్డు చైర్మన్ వైకే యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం 30 రాజధాని రైళ్లు, 200 ప్రయాణికుల రైళ్లు ఏ మాత్రం ఆలస్యంగా నడవకూడదని, నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య తక్కువే అయినా ఆలస్యం కావొద్దని అయన స్పష్టం చేశారు. దీంతో రైల్వే చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్ ఈ రోజు నమోదైంది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం.. వాస్తవం ఏంటంటే?

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ముంబయి తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారని వస్తున్న వార్తలపై.. వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు. తమకు జైలు అధికారులు సమాచారం అందించారనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జైల్లో ములాఖాత్ లు లేనందున వారానికోసారి ఫోన్ చేసే వీలు కల్పించారని, దాంతో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులకు వరవరరావు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు. వారం కింద ఉన్న ఆరోగ్య స్థితిలోనే, బలహీనంగానే ఉన్నారని తెలిపారు. అంతేతప్ప 'వరవరరావు ఆరోగ్యం విషమం'.. 'జైలు అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం'.. 'హుటాహుటిన ముంబాయి ప్రయాణమవుతున్న కుటుంబం' అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, దానిపై రేపు విచారణ జరుగుతుందని వేణుగోపాల్ తెలిపారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైసీపీ ఎంపీలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్‌కు లేఖ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎంపీలు స్పీకర్ ‌ను కలిసినట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పీకర్‌తో వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం. కాగా, కొద్దిరోజులుగా రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ అధినాయకత్వం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. అయితే దానికి సమాధానం ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసునే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణంరాజు మరింత ఆజ్యం పోశారు. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణంరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రఘురామకృష్ణంరాజు.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు. ఇప్పుడు, వైసీపీ ఎంపీలు స్పీకర్ ను కలవనుండడంతో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడింది.

ఏబీ కేసులో ట్విస్ట్.. సుప్రీంకు ఏపీ స‌ర్కార్

ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ‌పై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల‌పై స్టే ఇవ్వాలని కోరింది. ఇది జులై 6వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది. ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం నిఘా పరికరాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అయితే క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే విధంగా తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయి తలోజా జైలు సిబ్బంది వరవరరావు భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయనకు తలోజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఆరోగ్యం బాగా లేదంటూ బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవరరావు అరెస్ట్ అయ్యారు. కుట్రలో వరవరరావు పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లోయర్ కోర్ట్ కొట్టేయడంతో..మహారాష్ట్ర హైకోర్టులో వరవరరావు బెయిల్ పిటీషన్‌‌ను వేశారు. తాజాగా, వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్న సమాచారంతో ఆయన కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకలు.. పైశాచిక ఆనందాలు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. 108, 104 వాహనాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జూలై 1 విజయసాయిరెడ్డి పుట్టినరోజు అని, ఆయనకు పుట్టినరోజు నాడు ఇన్ని అంబులెన్స్ లతో కానుక ఇచ్చారని, అంబులెన్స్ ల వ్యవహారంలో 307 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థకు అంబులెన్స్ ల నిర్వహణ అప్పగించారని మండిపడ్డారు. మీకు కావాల్సిన వాళ్లకు వాహనాలు ఇచ్చేందుకు ఇంత షో చేస్తారా? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడతారా? అంటూ విరుచుకుపడ్డారు. తాము గతంలోనే 1500 అంబులెన్స్ లు ఇచ్చామని, వాటిలోనూ అత్యాధునిక సౌకర్యాలున్నాయని తెలిపారు. కరోనాను కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ తీరు చాలా దారుణమని, ఒక టెర్రరిస్టును అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మీవి పద్ధతిలేని రాజకీయాలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి విషయంలో వైసీపీ ప్రభుత్వం మానవ హక్కులు ఉల్లంఘించడంతో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఒక వ్యక్తి శస్త్రచికిత్స చేయించుకుంటే అతడిని ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నా, ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడి విషయంలో భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. తనకు అనారోగ్యంగా ఉందన్నా గానీ, కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచినా గానీ అచ్చెన్నాయుడిని కావాలనే డిశ్చార్జి చేశారు. వీల్ చెయిర్ లో బయటికి తీసుకొచ్చి, అంబులెన్స్ లో ఎక్కించుకుని జైలుకి తీసుకెళ్లారు. ఇది పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

కేసీఆర్ ఖేల్ ఖతం అంటున్న బీజేపీ.. ఇది సీరియస్ గానేనా..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. తనకు పోటీ వస్తుందనుకున్న టీడీపీ ని నామ రూపాలు లేకుండా చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీ అగ్రనాయకులు మధ్య సయోధ్య తక్కువే. దీంతో తెలంగాణాలో కేసీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. ఐతే తాజాగా బీజేపీ ముఖ్య నేత జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన సంచలన కామెంట్స్ తో రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపుతున్నాయి. ఈ కామెంట్స్ వెనుక బీజేపీ హై కమాండ్ ఉందా అని కూడా చర్చ జరుగుతోంది. నిన్న బీజేపీ నిర్వహించిన జనసంవాద్ వర్చ్యువల్ ర్యాలీలో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా రాం మాధ‌వ్ చేసిన ఒకే ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ అయన ఏదో ఫ్లోలో ఆలా అన్నారా లేక ముందస్తుగా ఏమైనా హింట్ ఇస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే కరోనా తో సహా వివిధ అంశాల పైన టిఆర్ఎస్ బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకూ రామ్ మాధవ్ ఏమన్నారంటే "ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి ఫ్రంటు లేదు టెంటు లేదు చివరికి హైదరాబాద్ లో ఒంటరిగా ఏకాకిగా కూర్చున్నారు. అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని" తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంటే కాకుండా "సగం సగం పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప ఏడాది కాలంలో మీరు సాధించిన ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉందా.. అసలు మీ ఏడాది పాలనా పై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే ధైర్యముందా " అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. "అవినీతి, అసమర్ధతకు మారుపేరుగా తెలంగాణ ప్రభుత్వం తయారైందని, చివరికి కరోనా పై పోరాటంలో కూడా ఫెయిల్ అయిందని అన్నారు. కరోనా కేసులపై మసిపూసి మారేడు కాయ చేసి కేంద్ర బృందాలను మోసం చేయగలరేమోగాని కరోనా బారిన పడ్డ రాష్ట్ర ప్రజలను ఎంత కాలం మోసం చేయగలరు" అని అయన కేసీఆర్ పై మండి పడ్డారు. కేంద్రం కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోకపోవడంతో కేసులు పెరిగాయన్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న తెలంగాణాలో రోజుకు కేవలం రెండు వేల పరీక్షలు చేస్తున్నా 15 వేలు పాజిటివ్ కేసులు తెలియని అన్నారు.

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో క‌రోనా పరీక్షల‌కు బ్రేక్

తెలంగాణ‌లోని ప్రైవేట్ ల్యాబ్‌ల్లో క‌రోనా పరీక్షల‌కు బ్రేక్ ప‌డింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిలిచిపోనున్నాయి. వారం రోజుల క్రితం క‌రోనా పరీక్షలు నిర్వహించేందుకు 16 ప్రైవేటు ల్యాబులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రైవేట్ ల్యాబుల్లో పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ల్యాబులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఆందోళనకలిగించే విషయాలు వెలుగుచూశాయని సమాచారం. దీంతో, పరీక్షలకు సంబంధించి తప్పుడు రిపోర్టులు ఇస్తున్న ల్యాబ్‌లకు అనుమతులు రద్దు చేసింది. కరోనా పరీక్షల్లో ప్రైవేట్‌ ల్యాబుల నిర్లక్ష్యం నిజమేనని తేల్చిన ప్రభుత్వం.. తీరు మార్చుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. మ‌రోవైపు, ప్రైవేట్ ల్యాబుల్లో నాలుగు రోజుల పాటు టెస్ట్‌లు నిలిపివేసింది. ఐసీఎమ్మార్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలను నిలిపివేశారు. ల్యాబ్‌ల శానిటైజేషన్‌తో పాటూ, ల్యాబ్ సిబ్బందికి సేకరణ, టెస్టింగ్‌లపై ట్రైనింగ్ అప్డేట్ చేయనున్నారు. మ‌రోవైపు.. ప్రభుత్వ ల్యాబ్‌లు, శ్యాంపిల్స్ సేకరణ కేంద్రాలు యధావిధిగా కొనసాగనున్నాయి.

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఎమ్మెల్యే కు కరోనా సోకడంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న 16మందికి టెస్టులు చేశారు. వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. మరోవైపు ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్.. ఎన్ హెచార్సీ సీరియస్

తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫెనిక్స్ అంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసు ఎన్ హెచ్ ఆర్ సి కి చేరింది. దీని పై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు డీజీపీ, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ, ట్యూటికోరిన్ ఎస్పీలకు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. జయరాజ్, ఫెనిక్స్ లాకప్ మరణాలకు సంబంధించి ఆరువారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలనిఅలాగే దీనికి సంబంధిత అధికారులు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ సి స్పష్టంచేసింది. ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో తండ్రి కుమారులైన జయరాజ్, ఫెనిక్స్ మొబైల్ ఫోన్ షాప్ నడుపుతున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంతో స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తరువాత వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ లో ఉంచి తీవ్రంగా హింసించి తరువాత రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ఫెనిక్స్ 21న మరణించగా ఆ మరుసటి రోజు ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు మలద్వారం లో లాఠీలతో అమానుషంగా కొట్టడం వల్ల తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికీ బాధ్యులైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనకు బలపర్చేలా ఆ రోజు రాత్రంతా పోలీసులు తండ్రి, కొడుకులను కొట్టినట్లు అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నఒక మహిళా కానిస్టేబుల్ మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా నిన్న ఈ ఘటన జరిగిన పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పని చేస్తున్న రఘు గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. నిన్న రాత్రి మరో ఇద్దరు పొలిసు అధికారులను అరెస్ట్ చేసారు. ఈ పోలీసు స్టేషన్ లో ని ఎస్సైలు రఘు గణేష్, బాలకృష్ణన్ ల పై మర్డర్ కేసు వంటి తీవ్రమైన కేసులు పెట్టారు. ఈ కేసును సిఐడి ఐజి నేతృత్వం లోని 12 టీమ్ లు దర్యాప్తు చేస్తున్నాయి.