మధుర జ్ఞాపకంగా మిగిలిన మెస్సీ టూర్ : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 13) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఫుట్ బాల్ అభిమానులకు మధురానుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి , అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో  ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.  మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటామన్నారు. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం (14న) ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో సీఎం  రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు .

మెస్సీ టూర్ ఖ‌ర్చు ఎవ‌రిది?

ఈ కార్ రేస్ ద్వారా 55 కోట్ల  రూపాయ‌ల మేర స్కామ్ జ‌రిగింది. హైద‌రాబాద్ లో ఉన్న రోడ్ల‌కూ, డ్రైనేజీల‌కూ ఇత‌ర‌త్రా వ‌స‌తులు లేవు. వాటిని ప‌ట్టించుకోకుండా ఈ హంగామా అవ‌స‌ర‌మా?   హెచ్ఎండీఏ డ‌బ్బు ఇలా ఎవ‌రైనా దుబారా చేస్తారా?  అంటూ ఇదే రేవంత్ స‌ర్కార్ ధూమ్ ధామ్ చేయ‌డంతో పాటు.. కేసులు కూడా  నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ అరెస్టుకు  గ‌వ‌ర్న‌ర్ ని అనుమ‌తి  కూడా కోరింది. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి  రాలేద‌ని కూడా  రేవంత్  పెద్ద ఎత్తున దుమ్మెత్తి  పోశారు గత జూబ్హీహిల్స్ ఉప  ఎన్నిక‌ల ప్ర‌చారంలో. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజనం మెస్సీ హైద‌రాబాద్ రాక‌.. అనే ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున  ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అనే  ప్ర‌శ్న త‌లెత్తింది.. అయితే ఇందుకు ప్ర‌భుత్వం కూడా రియాక్ట‌య్యింది. ఇద‌స‌లు ప్ర‌భుత్వ  కార్య‌క్ర‌మం కానే కాదు.  ఇది ఒక  ప్రైవేటు కార్య‌క్ర‌మం. అయితే మెస్సీ ఎలాగూ ప‌ద‌నాలుగు ఏళ్ల త‌ర్వాత ఇండియా వ‌స్తున్నారు కాబ‌ట్టి.. ఇటీవ‌లే అంటే డిసెంబ‌ర్ 8, 9 తేదీల్లో ఇక్క‌డ తెలంగాణ రైజింగ్ ఈవెంట్ జ‌రిగింది కనుక ఇంట‌ర్నేష‌న‌ల్ గా తెలంగాణ రైజింగ్ స్లోగ‌న్ వినిపించాలంటే ఇదే అవ‌కాశ‌మ‌ని.. ఈ టూర్ ని పార్వ‌తీ  రెడ్డి అనే ఒక టూర్ ప్యాట్ర‌న్, స‌ల‌హాదారు సాయంతో మెస్సీని హైద‌రాబాద్ ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి  చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా  ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల  నిర్వ‌హ‌ణ  చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని. గ‌తంలోనూ పీలే, రొనాల్డినో, మార‌డోనా వంటి ప్ర‌ముఖ ఆట‌గాళ్ల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్లు నిర్వ‌హించారు శ‌త‌ద్రు ద‌త్తా. అందులో భాగంగానే 2022 లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ ప్లే చేసిన మెస్సీ  గోట్ ఇండియా టూర్- 2025 నిర్వ‌హించారు.  అయితే  ఈ విష‌యంలోనూ రాజ‌కీయ వివాదం రాజుకుంది. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ని అతి పెద్ద డివిజ‌న్ల మ‌యంగా తీర్చిదిద్ద‌డంలో స‌ర్కార్ ని ఏకి  ప‌డేస్తున్న బీజేపీ.. ఈ విష‌యంలోనూ పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం చెల‌రేగేలా చేసింది. మెస్సీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఖ‌ర్చు ఎంత‌? ఈ  నిధులు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో చెప్పాలంటూ బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్సీతో క‌ల‌సి సీఎం రేవంత్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆడ్డానికి అయ్యే ఖ‌ర్చు ఏయే శాఖ‌లు నిర్వ‌హిస్తున్నాయో ఆ ఫుల్ డీటైల్స్ కావాలంటూ..డిమాండ్ చేస్తున్నారు బీజేపీ  నాయ‌కులు. అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ ప‌ర్య‌ట‌న కోప‌రేట్ చేస్తుందంటారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. మెస్సీ రావ‌డంతో ప్ర‌పంచ వేదిక‌పై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వినిపిస్తుంది. కనిపిస్తుంది.  తెలంగాణ‌కు మరింత మంచి పేరు వ‌స్తుంది. కనుక ఈ కార్య‌క్ర‌మం స‌రైన‌దే అంటున్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. అందులో భాగంగానే చివ‌ర్లో రేవంత్ రెడ్డి.. మెస్సీని ప్ర‌పంచ‌మంతా చూస్తుండ‌గా... తెలంగాణ  రైజింగ్ క‌మ్ జాయిన్ ద రైస్.. అంటూ నిన‌దించారు.  కాబ‌ట్టి ఇదంతా ప్ర‌భుత్వమే  అంతా ఖ‌ర్చు చేసి నిర్వ‌హించిన  కార్య‌క్ర‌మం కాదు వంద‌ల వేల కోట్ల ఖ‌ర్చు అస‌లే చేయ‌లేదు. ఇండియా టూర్ వ‌చ్చిన మెస్సీని హైద‌రాబాద్ కూడా వ‌చ్చి పొమ్మ‌ని ఒక చిన్న అడ్జ‌స్ట్ మెంట్ చేశామంతే.. ఆయ‌న్ను తెలంగాణ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తామ‌ని చెప్పామంటున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. ఇది తెలంగాణ‌లో యువ‌జ‌న  క్రీడాభివృద్ధికి తోడ్ప‌డుతుంది కాబ‌ట్టి ఇందులో దురుద్దేశాల‌ను ఆపాదించ‌వ‌ద్ద‌ని కోరుతోంది తెలంగాణ ప్ర‌భుత్వం.

పాక్‌కి భారత్ అండర్ -19 టీమ్ నో షేక్‌హ్యాండ్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్‌లో కొనసాగించింది. అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచులోనూ ‘నో హ్యాండ్ షేక్’ ఘటన పునరావృతం అయింది. పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది. అయితే భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేసేలా చూడాలని బీసీసీఐను ఐసీసీ అభ్యర్థించినట్లు సమాచారం. కానీ నిర్ణయాన్ని బీసీసీఐకే వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే, పాక్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

బ్రౌన్ వర్సిటీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్.. ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి బ్రౌన్ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది.   ఘటన జరిగిన వెంటనే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఇంకా పట్టుకోలేదని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు కూడా బ్రౌన్ వర్సిటీలో కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కాల్పుల ఘటనను ఖండించారు.  దర్యాప్తులో ఎఫ్‌బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

రెండో విడత పంచాయతీ పోలింగ్ షురూ

తెలంగాణలో  రెండో విడత పంచాయతీలకు పోలింగ్‌  ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది ఆ తరువాత  ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఇక పోతే 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను  108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.   31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు,   153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు.   

సీఐసీ ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయెల్

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్ సహా ఖాళీగా ఉన్న ఎనిమిది పోస్టులనూ భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 9 సంవత్సరాల తరువాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయికి చేరుకుంది. కేంద్ర సమాచార కమిషనర్ గా రిటైర్డ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు.  ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.  రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి   వంటి ప్రముఖులు ఉన్నారు.  గత ఏడాది సెప్టెంబర్ నుంచీ సీఐసీ ప్రధాన కమిషనర్ పోస్టు, అలాగే 2023 నుంచి ఎనిమిది మంది డైరెక్టర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.   ఇక సీఐసీ కమిషనర్ గా నియమితులైన ఏపీకి చెందిన సుధారాణి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, లా గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా చేశారు. ప్రస్తుతం పీఎన్జీఆర్బీ సభ్యురాలిగా ఉన్నారు.  

అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు.. తెలంగాణ పోలీసులకు మెస్సీ బృందం అభినందనలు

హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పోలీసులు కల్పించిన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లపై ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్‌ మెస్సీ మేనేజర్‌,  ఆయన భద్రతా బృందం కూడా  ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భం గా రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)  బి. శివధర్‌రెడ్డి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌   సుధీర్‌బాబులను వారు ప్రత్యేకంగా అభినందించారు. మ్యాచ్ అనంతరం, మెస్సీ బృందం సంతృప్తి  వ్యక్తం చేసింది. అంతర్జా తీయ స్థాయిలో జరిగిన ఈ హైప్రొఫైల్‌ క్రీడా కార్యక్రమానికి పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయని పేర్కొంది. స్టేడియం లోపలా బయటా కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వేలాది మంది ప్రేక్షకుల రాకపోకలను సజావుగా నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపింది. ముఖ్య అతిథులు, మెస్సీ బృందం రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా పోలీసులు తీసుకున్న జాగ్రత్తలు తమను ఎంతగానో ఆకట్టుకున్నా యని మెస్సీ మేనేజర్‌ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చినా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకో కుండా, ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌ ముగియడం పోలీసుల ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీకి నిదర్శనమని పొగడ్తల వర్షం కురిపించారు. మెస్సీ, ఆయన బృందానికి కల్పించిన ఎస్కార్ట్‌ సేవలు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం  ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, పోలీసు అధికారులు, సిబ్బందిని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్    బి. శివధర్ రెడ్డి అభినందించారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సందర్భంగా  చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా విజయవంతంగా ముగిసేలా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారని డీజీపీ ప్రశంసించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ  బి. శివధర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్‌కతా లో జరిగిన ఘటనను దృష్టి లో పెట్టుకుని అప్రమత్తమై, అక్కడ చోటుచేసుకున్న లోపాలను విశ్లేషించి, ఉప్పల్ స్టేడియంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. అభిమానులు ఎవరూ గ్రౌండ్‌లోకి ప్రవేశించ కుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు.మ్యాచ్ ప్రశాంతం గా, విజయవంతంగా ముగియడంలో సహ కరించిన ఫుట్‌బాల్ క్రీడాభిమానులు, మెస్సీ అభిమానులకు డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

ఈటల రాజేందర్ మళ్లీ హర్టయ్యారు!.. ఈ సారి బీజేపీతో తాడో పేడో?

ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా... ఆ పార్టీలో ఆయన ఒంటరే అని చెప్పాలి. అసలు ఈటల బీజేపీలో చేరడమే ఆశ్చర్యమంటారు ఆయన గురించి తెలిసిన వారు. సరే రాజకీయ అనివార్యతతో ఆయన బీజేపీ పంచన చేరినా పదే పదే అవమానాలకు గురైతున్నారు. ఉక్కపోతను తట్టుకుంటూ నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ సాధన ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం వరకూ, ఆ తరువాత ఐదేళ్ల పాటు మంత్రిగా ఈటల తెలంగాణ ప్రగతిలో కేసీఆర్ తో సమానమైన స్థాయిలో పని చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఈ విషయం వాస్తవం.  2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత   తెలంగాణ ప్రగతిలో, సంక్షేమంలో ఈటల ముద్ర చెరిపివేయడం సాధ్యం కాదనీ బీఆర్ఎస్ వర్గాలే చెబుతాయి.  రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటల బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవని బీఆర్ఎస్ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా అప్పట్లో ప్రశంసలు కురిపించారు. వామపక్ష భావజాలంతో ఉ:డే ఈటల.. తన శాఖకు సంబంధించినంత వరకూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారనీ, అదే కేసీఆర్ కు నచ్చలేదనీ అనే వారు బీఆర్ఎస్ లో ఇప్పటికీ ఉన్నారు.  సరే 2014 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడినా.. తెలంగాణ ప్రగతిలో కొంత క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడింది. అదే ఆయనకు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కారణమైందని అంటారు.  2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజ యం సాధించి కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఈటలను ఆయన దూరం పెట్టారు.   కేబినెట్ లో ఇవ్వలేదు. అయితే . ఆ తరువాత విస్తరణ సమయంలో అనివార్యంలో ఈటలను కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ,  భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు .దీంతో పొమ్మన లేక పొగబెడుతున్నారని గ్రహించిన ఈటల ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు.  వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీ గూటికి చేరడమేమిటన్న విస్మయం అప్పట్లో సర్వత్రా వ్యక్తమైంది.  ఇది జరిగిన కొన్నాళ్లకే ఈటల తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.  అధికార బీఆర్ఎస్ ఎన్ని విధాలుగా ఈటల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం సాధించలేకపోయి చతికిల పడింది. నియోజకవర్గంలో  బీసీలలో తనకున్న పట్టును ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో  23, 855 ఓట్ల మెజారిటీతో  గెలవడం ద్వారా నిరూపించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆ ఉప ఎన్నికలో విజయం సాధించినా.. ఈ గెలుపు మాత్రం పూర్తిగా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. అయితే తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.   పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో   బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబడ్డారు.  సరే ఈటల రాజేందర్ వర్గీయులు కూడా   బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. అయితే  సర్పంచులుగా గెలిచిన వారు బండి సంజయ్ మద్దతుదారులే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా  ఈటల వర్గీయుల ఓటమిని ప్రస్తావిస్తూ, వారెవరికీ బీజేపీ మద్దతు ఇవ్వలేదు, ఈటల స్వయంగా వారిని నిలబెట్టారన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 12) మీడియాతో మాట్లాడిన ఆయన   ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో, ఉండాలో ప్రజలే తేల్చుకుంటారనీ, కాలమే అన్నీ నిర్ణయిస్తుందని అన్నారు.  పంచాయతీ ఎన్నికలలో మిగిలిన రెండు విడతలూ పూర్తయిన తరువాత అన్ని విషయాలూ వివరంగా చెబుతానన్న ఈటల ఈ సారి పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు.  

జగన్, షర్మిల ఎడతెగని ఆస్తుల పంచాయతీ..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన సొంత చెల్లి షర్మిలతో ఆస్తుల పంచాయతీ ఎడతెగకుండా సాగుతోంది.  ఈ ఆస్తుల పంచాయతీలో జగన్, ఆయన భార్య భారతీ రెడ్డీ ఒక వైపు ఉంటే.. షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ నిలిచారు.  ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి.    తాజాగా జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి షర్మిల దెబ్బతీయాలని ప్రయత్నించిందంటూ  ఎన్సీఎల్టీకి నివేదిక అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో చెల్లితో చేసుకున్న ఆస్తుల   ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన కౌంటర్‌లో పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ఆస్తులన్నీ తన స్వార్జితమని పేర్కొంటూ జగన్  ఎన్సీఎల్టీలో సమగ్ర కౌంటర్‌ దాఖలు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో వాటాల బదిలీ అంశంపై గతంలో వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమకు చెందిన షేర్లను అక్రమంగా తల్లి వైఎస్‌ విజయమ్మ   బదిలీ చేశారని ఆరోపిస్తూ, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై వైఎస్‌ షర్మిల అప్పీల్‌ చేయడంతో, ఆమెకు ఈ వ్యవహారంలో ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవనీ, . అప్పీల్‌ చేసే అర్హత కూడా షర్మిలకు లేదని జగన్‌ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. చెల్లిపై ఉన్న ప్రేమాభిమానాలతో గతంలో భవిష్యత్తులో ఆస్తులు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదిరిందని పిటిషన్ లో పేర్కొన్న జగన్.. అయితే ఆ మేరకు జరిగిన వాటాల బదిలీకి మూడేళ్లు పూర్తైనప్పటికీ, ఇంతకాలం మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు అప్పీల్‌ చేయడం వెనుక ఉద్దేశాలపై  సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, తన వాదనలను ట్రిబ్యునల్‌ ముందు జగన్‌ ఉంచారు.

ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు వెడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడినవిషాద ఘటన ఇది. మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది   బైక్ పై వెడుతున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో  ఎనిమిదేళ్ల చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు.సమాచారం అందుకున్న   పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆదివారం (డిసెంబర్ 14) పోలింగ్ ఉండటంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం (డిసెంబర్ 14)  బయలుదేరిన ఈ కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంమాగీ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  ప్రాణం తీసిన ఓటు  అంటూ   గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. మరి కొద్ది సేపటిలో పోలింగ్

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. . ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలౌతుంది. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఏకగ్రీవాలు కాకుండా.. మిగిలిన 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే..  రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  కాగా తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల హవా సాగింది. మొత్తం 3834 సంర్పంచ్ స్థానాలకు, 27 వేల 628 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక 398 పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ జరిగిన పంచాయతీల్లో 37 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 3451 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేశారు. మొత్తం 52, 57 277 మంది ఓటర్లకుగాను 45, 15, 141 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 84.28శాతం ఓటింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 92. 88 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థలు ఉండగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా విజయం సాధించిన వారిలో ఉన్నారు. 

సీఎం రేవంత్ గోల్...మెస్సీ చప్పట్లు

  గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ముఖ్యమంత్రి ఆర్ ఆర్9 టీమ్‌తో బరిలో దిగారు. అపర్ణ టీమ్ తరుపున మెస్సీ ఆడారు. ఈ మ్యాచ్‌లో రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ కొట్టగా.. మెస్సి రెండు గోల్స్‌ రాబట్టాడు. మరోవైపు మోస్సీని దగ్గర నుంచి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలి రావడంతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్, మంగ్లీ పాటలతో స్టేడియం హోరెత్తింది. లేజర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.  కోల్‌కతాలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం లో మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరిన ఘటనలు జరగడంతో, ఇలాంటి పరిస్థి తులు హైదరాబాద్‌లో పునరావృతం కాకూడదని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.  వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 34 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. స్టేడియం చుట్టూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మొత్తం మీద మెస్సీ హైదరాబాద్ పర్యటనను సురక్షితంగా, ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాది  

ఉప్పల్ స్టేడియానికి లియోనెల్ మెస్సీ

  గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనన్నున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మోస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు.  అనంతరం  మెస్సీ బృందం ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత  ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఉప్పల్ స్టేడియం వద్ద  బందోబస్తు పెంచారు.  

అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక వినతి... వెంటనే స్పందించిన పవన్

  ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇమిడియట్‌ యాక్షన్ తీసుకున్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును డిసెంబర్ 12వ తేదీ ఉదయం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అభినందించిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని మారుమూల గ్రామం తంబాళహట్టికి చెందిన జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామం రోడ్ల పరిస్థితి వివరించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కు తెలిపారు.  గ్రామానికి రోడ్డు వేయాలని వినతి చేశారు. అయితే, తాను వెంటనే చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీపిక విజ్ఞప్తిని స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. గ్రామానికి నాణ్యమైన రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు. ఉదయం విజ్ఞప్తి చేయగా.. ఆ సాయంత్రానికే రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడంతో దీపికతో పాటు ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా, మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిసెంబర్ 12వ తేదిన క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు. ఒక్కో క్రికెటర్‌కు రూ. 5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. అంతేకాకుండా, ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను కూడా అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు.  

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ విందు

  హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.  సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.   వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.   రామేశ్వరం కేఫ్‌లో లంచ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, అఖిలేష్ యాదవ్ మరియు కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.  

హాస్టల్లో కోతుల బెడద…రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల నిరసన

  అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మెరుగైన విద్య కోసం రావికమతం, మాడుగుల మండలాల పరిధిలోని ఆవురువాడ, చీమలపాడు పంచాయతీ పరిధిలో రాయపాడు, పెదగరువు, జోగంపేట, అజయ్పురం, కళ్యాణ్ లావా, చీమలపాడు, తోపాటు గొరిగడ్డ గ్రామాలకు చెందిన మొత్తం 96 మంది ఆదివాసి గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. గత నెల రోజులుగా హాస్టల్ ప్రాంగణంలో కోతులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులపై కోతులు దాడి చేయడంతో, వారిని  హాస్టల్ సంక్షేమ అధికారి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై పత్రికల్లో వార్తలు రావడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. తమ పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, జిల్లా ఉన్నతాధికారులు ఒక రాత్రైనా హాస్టల్లో బస చేసి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కోరారు. అదే విధంగా హాస్టల్‌లో కిటికీలు సక్రమంగా లేకపోవడం, చుట్టూ భారీ చెట్లు ఉండటం వల్ల కోతుల బెడద పెరిగిందని వారు తెలిపారు. వెంటనే చెట్ల తొలగింపు, కిటికీల మరమ్మతులు చేపట్టి, గిరిజన విద్యార్థులకు భద్రత కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ నెల్లూరు నేత కరిముల్లా

  నెల్లూరు జిల్లాలో వైసీపీకి  బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నట్లైంది. కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్‌ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. శనివారం (ఈ నెల 13)ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  

హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  స్వాగతం పలికారు. రాహుల్ నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌‌లో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్ పాల్గొంటారు. మెస్సీ రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి డొమెస్టిక్ అరైవల్స్ వద్దకు ప్రయాణికులను ఒక్కొక్కరిని అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి విజిటర్స్ అవర్స్‌ను కూడా డిస్మిస్ చేశారు.  మొదటగా లియోనెల్ మెస్సి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి ప్రైవేట్ మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపధ్యంలో  ఉప్పల్ స్టేడియం వద్ద 3 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం టికెట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో సీసీటీవీ కెమోరాలు డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు.  

ధాన్యం కొనుగోలుపై మంత్రి పార్థసారథి తక్షణ స్పందన

  కృష్ణా జిల్లాలో కారకంపాడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ రైతులు మాట్లాడుతూ… ధాన్యం పై పొర రంగు మారిందనే కారణంతో రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యాపారస్తుల లారీలను ఆపించి విచారణ చేపట్టారు. వ్యాపారస్తులు ధాన్యం రూ.1500కి కొనుగోలు చేస్తున్నామని చెప్పినా, వాస్తవంగా రైతులకు కేవలం రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నట్టు మంత్రి పరిశీలనలో తేలింది. దీంతో రైతు సేవా కేంద్ర అధికారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నట్లు స్పష్టమైంది. మంత్రి ఆదేశాల మేరకు మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించగా, పై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత పూర్తిగా బాగానే ఉందని నిర్ధారణ అయింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, డీఎం సహా సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు రూ.1250కి కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు తప్పనిసరిగా రూ.1550 చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఇకపై రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి తక్షణ స్పందన, దృఢమైన నిర్ణయాలతో న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.