మెస్సీ టూర్ ఖ‌ర్చు ఎవ‌రిది?

ఈ కార్ రేస్ ద్వారా 55 కోట్ల  రూపాయ‌ల మేర స్కామ్ జ‌రిగింది. హైద‌రాబాద్ లో ఉన్న రోడ్ల‌కూ, డ్రైనేజీల‌కూ ఇత‌ర‌త్రా వ‌స‌తులు లేవు. వాటిని ప‌ట్టించుకోకుండా ఈ హంగామా అవ‌స‌ర‌మా?   హెచ్ఎండీఏ డ‌బ్బు ఇలా ఎవ‌రైనా దుబారా చేస్తారా?  అంటూ ఇదే రేవంత్ స‌ర్కార్ ధూమ్ ధామ్ చేయ‌డంతో పాటు.. కేసులు కూడా  నమోదు చేసింది. అంతే కాదు కేటీఆర్ అరెస్టుకు  గ‌వ‌ర్న‌ర్ ని అనుమ‌తి  కూడా కోరింది. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి  రాలేద‌ని కూడా  రేవంత్  పెద్ద ఎత్తున దుమ్మెత్తి  పోశారు గత జూబ్హీహిల్స్ ఉప  ఎన్నిక‌ల ప్ర‌చారంలో.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజనం మెస్సీ హైద‌రాబాద్ రాక‌.. అనే ఈవెంట్ కి ఇంత భారీ ఎత్తున  ఖ‌ర్చు చేయ‌డం అవ‌స‌ర‌మా? అనే  ప్ర‌శ్న త‌లెత్తింది.. అయితే ఇందుకు ప్ర‌భుత్వం కూడా రియాక్ట‌య్యింది. ఇద‌స‌లు ప్ర‌భుత్వ  కార్య‌క్ర‌మం కానే కాదు.  ఇది ఒక  ప్రైవేటు కార్య‌క్ర‌మం. అయితే మెస్సీ ఎలాగూ ప‌ద‌నాలుగు ఏళ్ల త‌ర్వాత ఇండియా వ‌స్తున్నారు కాబ‌ట్టి.. ఇటీవ‌లే అంటే డిసెంబ‌ర్ 8, 9 తేదీల్లో ఇక్క‌డ తెలంగాణ రైజింగ్ ఈవెంట్ జ‌రిగింది కనుక ఇంట‌ర్నేష‌న‌ల్ గా తెలంగాణ రైజింగ్ స్లోగ‌న్ వినిపించాలంటే ఇదే అవ‌కాశ‌మ‌ని.. ఈ టూర్ ని పార్వ‌తీ  రెడ్డి అనే ఒక టూర్ ప్యాట్ర‌న్, స‌ల‌హాదారు సాయంతో మెస్సీని హైద‌రాబాద్ ర‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది.

అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి  చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా  ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల  నిర్వ‌హ‌ణ  చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని. గ‌తంలోనూ పీలే, రొనాల్డినో, మార‌డోనా వంటి ప్ర‌ముఖ ఆట‌గాళ్ల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్లు నిర్వ‌హించారు శ‌త‌ద్రు ద‌త్తా. అందులో భాగంగానే 2022 లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ ప్లే చేసిన మెస్సీ  గోట్ ఇండియా టూర్- 2025 నిర్వ‌హించారు. 

అయితే  ఈ విష‌యంలోనూ రాజ‌కీయ వివాదం రాజుకుంది. ఇప్ప‌టికే గ్రేట‌ర్ ని అతి పెద్ద డివిజ‌న్ల మ‌యంగా తీర్చిదిద్ద‌డంలో స‌ర్కార్ ని ఏకి  ప‌డేస్తున్న బీజేపీ.. ఈ విష‌యంలోనూ పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారం చెల‌రేగేలా చేసింది. మెస్సీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఖ‌ర్చు ఎంత‌? ఈ  నిధులు ఎక్క‌డి నుంచి తీసుకొచ్చారో చెప్పాలంటూ బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెస్సీతో క‌ల‌సి సీఎం రేవంత్ ఉప్ప‌ల్ స్టేడియంలో ఫుట్ బాల్ ఆడ్డానికి అయ్యే ఖ‌ర్చు ఏయే శాఖ‌లు నిర్వ‌హిస్తున్నాయో ఆ ఫుల్ డీటైల్స్ కావాలంటూ..డిమాండ్ చేస్తున్నారు బీజేపీ  నాయ‌కులు. అయితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ ప‌ర్య‌ట‌న కోప‌రేట్ చేస్తుందంటారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు.

మెస్సీ రావ‌డంతో ప్ర‌పంచ వేదిక‌పై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ వినిపిస్తుంది. కనిపిస్తుంది.  తెలంగాణ‌కు మరింత మంచి పేరు వ‌స్తుంది. కనుక ఈ కార్య‌క్ర‌మం స‌రైన‌దే అంటున్నారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌. అందులో భాగంగానే చివ‌ర్లో రేవంత్ రెడ్డి.. మెస్సీని ప్ర‌పంచ‌మంతా చూస్తుండ‌గా... తెలంగాణ  రైజింగ్ క‌మ్ జాయిన్ ద రైస్.. అంటూ నిన‌దించారు.  కాబ‌ట్టి ఇదంతా ప్ర‌భుత్వమే  అంతా ఖ‌ర్చు చేసి నిర్వ‌హించిన  కార్య‌క్ర‌మం కాదు వంద‌ల వేల కోట్ల ఖ‌ర్చు అస‌లే చేయ‌లేదు. ఇండియా టూర్ వ‌చ్చిన మెస్సీని హైద‌రాబాద్ కూడా వ‌చ్చి పొమ్మ‌ని ఒక చిన్న అడ్జ‌స్ట్ మెంట్ చేశామంతే.. ఆయ‌న్ను తెలంగాణ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తామ‌ని చెప్పామంటున్నారు ప్ర‌భుత్వ ప్ర‌తినిథులు. ఇది తెలంగాణ‌లో యువ‌జ‌న  క్రీడాభివృద్ధికి తోడ్ప‌డుతుంది కాబ‌ట్టి ఇందులో దురుద్దేశాల‌ను ఆపాదించ‌వ‌ద్ద‌ని కోరుతోంది తెలంగాణ ప్ర‌భుత్వం.

భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్

   ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.  భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్ర‌భుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ‌తులూ లేకుండా శంకుస్థాప‌న చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమతులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారని వాదిస్తోంది.  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది.  మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వదిస్తోంది.పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.  భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతికించరని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది. మరోవైపు  భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై  మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.   

2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్దం : ప్రధాని మోదీ

  2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. 72వ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. గత పదేళ్లలో ఫీపా అండర్-17, హాకీ వరల్డ్ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెండ్లను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ప్రధాని గుర్తుచేశారు.  భారత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని వాలీబాల్‌ ఆటతో ప్రధాని మోదీ పోల్చారు. ఏ విజయం అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, సమన్వయం, పరస్పర విశ్వాసం, జట్టు సంసిద్ధత ఉంటేనే విజయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ క్రీడలో ప్రతి ఒక్కరికి బాధ్యత, పాత్ర ఉంటుందని, అవన్నీ సమర్థంగా నిర్వర్తించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు. జనవరి 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా 58 జట్లకు చెందిన వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలతో వారణాసి నగరం జాతీయ స్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రబిందువుగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.  

స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

  హైదరాబాద్ నగరంలోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పలువురి కంటతడి పట్టించింది. హైదర్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అర్జున్ కుమార్ అనే బాలుడు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన తల్లిదండ్రుల సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఈత కొలను వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.  ఆ సమయం లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరు లేరు..కొంతసేపటి తర్వాత బాలుడు కనిపిం చకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అర్జున్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపో యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈత కొలను ప్రాంతంలో తగిన పర్యవేక్షణ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని గ్రేటర్ కమ్యూనిటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈత కొలను వద్ద భద్రతా నిబంధనలు పాటించారా? పర్యవేక్షణ లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన గేటెడ్ కమ్యూనిటీల్లో చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి అన్న విషయం ఈ ఘటనతో స్పష్టమవుతోంది.

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

  చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 03 ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నాట్లు తెలిపింది. గ్రహణమాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం.   మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి మరియు ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా, ఆ భక్తులపై అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలకర సేవను టిటిడి రద్దు చేసింది. భక్తులు గమనించాలని టీటీడీ కోరింది  

చట్ట విరుద్దమైన పోస్టులపై ‘ఎక్స్’ కీలక నిర్ణయం

   ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. 'ఎక్స్‌'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది.  తమ ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్‌'ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్‌లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' కూడా అదే తరహా ప్రకటన చేసింది. 'ఎక్స్' నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది.  స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి 'ఎక్స్‌'కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది. 'గ్రోక్' ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి 'ఎక్స్‌'లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'గ్రోక్' ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 'ఎక్స్' తగిన చర్యలు చేపట్టింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన కోకైన్ సీజ్

  మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపేందుకు అన్ని శాఖల అధికారులు ఉక్కు పాదం మోపుతున్న కూడా కొందరు స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కు తున్నారు...ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి ముగ్గురు కేటుగాళ్లు దొరికారు. వారి వద్ద నుండి సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లు కోకైన్‌ను అత్యంత పకడ్బందీగా సిలర్ కవర్‌లో చుట్టి, దానిపై మరలా పాలితిన్ కవర్లతో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్‌లో దాచారు. స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు గ్రీన్ చానల్ దాటే క్రమంలో అనుమా నాస్పదంగా ప్రవర్తించడంతో కస్టమ్స్ అధికారులు వారిని ఆపి తనిఖీ చేపట్టారు. ట్రాలీ బ్యాగ్‌లను స్కానింగ్ మిషన్‌లో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లుగా స్పష్టమైంది. వెంటనే బ్యాగ్‌లను తెరిచి పరిశీలించగా భారీ మొత్తం లో కోకైన్ బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు, వారి నుంచి మొత్తం 2.1 కిలోల కోకైన్‌ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, దేశంలో సరఫరా చేయాల్సిన నెట్‌వర్క్‌పై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతుండటంపై కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి, నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాముతో హల్‌చల్

  హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడి చర్యలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే చంద్రాయణ గుట్ట చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానా స్పదంగా ఆటో నడుపు తున్న డ్రైవర్‌ను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షించగా, అతడికి డ్రంకన్ డ్రైవ్‌లో 150 వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదు అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్, అకస్మాత్తుగా తన ఆటోలో నుంచి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. అంతేకాకుండా పామును పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ నానా హల్చల్ సృష్టించాడు. ఈ అనూహ్య ఘటనతో చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాము కనిపిం చడంతో  వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆలోపే అతడు పాముతో పాటు ఆటోను తీసుకుని సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు చెక్‌పోస్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ... డ్రంక్ డ్రైవింగ్‌కు తోడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  పరారైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రమాదాలకు దారి తీసే డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.  

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో... సిట్ విచారణకు ఎమ్మెల్సీ నవీన్‌ రావు

  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్‌ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న నవీన్‌ రావుకు 2019లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్

    భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు. ఈ ఏడాది జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి.  దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్  సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.