కొంప ముంచిన వైసీపీ లేఖలు? పోలవరానికి రూ. 15.6 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని అత్యంత భారీగా తగ్గించేసింది. పోలవరానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. ఇందులోనూ  రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.7,053.74 కోట్లే. 2013, 2014 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.15,667.90 కోట్లకు కేంద్రం కుదించింది. కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లే అని అంగీకరిస్తేనే.. ప్రసుత్తం రూ.2,234.28 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం షరతు పెట్టిందని తెలుస్తోంది.    పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించిన సమాచారం తెలియడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజులుగా హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. అందు కోసమే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇవాళ కూడా నిర్మలతో సమావేశమయ్యారు బుగ్గన. అయితే పోలవరం నిధులు, సవరించిన బడ్జెట్ అంచనాల ఆమోదంపై కేంద్రం నుంచి బుగ్గనకు ఎలాంటి ఊరట లభించలేదని చెబుతున్నారు.    నెల రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన బడ్జెట్ కు పోలవరం అథారిటీ ఆమోదం తెలిపిందని వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునరావాస ప్యాకేజీ, ముంపు బాధితులకు పరిహారం కోసం అవసరమైన 56 వేల కోట్ల రూపాయలు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైసీపీ నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. జగన్ వల్లే ఇది సాధ్యమైందని, కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారని మంత్రులు కూడా చెప్పారు. ఇప్పడు సీన్ మారిపోవడంతో వైసీపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు నెల రోజుల క్రితం కేంద్రం ఓకె చెబితే.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎందుకు ఈ ప్రకటన చేస్తారనే చర్చ వస్తోంది.ఢిల్లీ నుంచి సరైన సమాచారం లేకుండానే వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.    పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.56 వేల కోట్లకుపైగా అంచనాలను గతంలో టీడీపీ కేంద్రానికి పంపింది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పోలవరంపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి వైసీపీ లేఖలు రాసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని, అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయమని. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని పెంచారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ రాసిన లేఖలు, ప్రతిపక్ష నేతగా గతంలో జగన్ చేసిన ఆరోపణలే పోలవరానికి ఇప్పుడు శాపంగా మారాయని అధికారులు అంటున్నారు.    వైసీపీ అధికారంలోకి వచ్చాకా పోలవరం పనుల్లో వేగానికి బ్రేక్ పడింది ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేసింది జగన్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో  పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఆందోళన నెలకొంది. కేంద్రం 15.6 వేల కోట్లే ఇస్తే.. ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వానికి భారం కానుంది. అసలే అంతమాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్న ఏపీకి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.   అంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై తాజాగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. రాజకీయాల  కోసం జగన్ గతంలో చేసిన ఆరోపణలు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.

కమలానికి కాదేదీ అనర్హం.. కరోనా వ్యాక్సిన్ సైతం!

ఇంతకూ వ్యాక్సిన్ ఉచితమా? కాదా?   బీహార్ మేనిఫెస్టోతో కొత్త సందేహాలు   భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరార్ధ రాజకీయాలు చేయదు. వాజపాయ్ మాదిరిగా, అవసరమైతే అధికారమయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అది.. అవసరార్ధ రాజకీయాలు, పూటకో మాట, రాష్ర్టానికో హామీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీలా కాదు. కాంగ్రెస్ అనే రాజకీయభూతం, దేశంలో సృష్టించిన పుండాకోరు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి, దాని భ్రష్ఠాచార-అవకాశ వాద రాజకీయాలకు.. చరమగీతం పలికేందుకు పుట్టిన పార్టీ బీజేపీ!   అంత పవిత్రమైన, అంత మంది పులుకడిగిన ముత్యాలున్న పార్టీ.. ఒక ఓటుతో అధికారాన్నే కాదనుకున్న పార్టీ... కేవలం ఒక్క రాష్ట్రంలో ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందా? అసాధ్యం.. నెవ్వర్.. అసంభవ్.. కండిత ముడియాదు.. ఆగోదిల్ల.. హైలీ ఇంపాజిబిల్!!! అవును కదా?.. నిన్నటి వరకూ అంతా అలాగే ఫీలయ్యారు. కానీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ప్రకటించిన, బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత.. అవకాశవాద రాజకీయాలు, అనుచిత హామీల తీరు చదివిన తర్వాత.. రాజకీయ జేజెమ్మ కాంగ్రెస్‌కే, కమలం పువ్వు పార్టీ దగ్గులు నేర్పుతుందనిపించక మానదు. ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో గజగజలాడుతోంది. శ్వేత సౌదాధిపతి, ప్రపంచపెద్దన్న ట్రంపు నుంచి.. భారత రెండవ పౌరుడయిన మన నెల్లూరు నాయుడు గారి వరకూ, కరోనా ఎవరినీ విడిచిపెట్టలేదు. పాపం దానికి కులాలు-మతాలు-హోదాలు-పదవులతో పనిలేదు.  ప్రపంచం మీదకు చైనా వదిలిన ఆ మహమ్మారికి,  ఇప్పటికీ కోట్ల మంది బలవుతూనే ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పెద్ద దేశాలు బిజీగా ఉన్నాయి. మనదేశంలో కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వస్తే తొలి విడత 25 కోట్ల మందికి ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామని, అందులో ముందుగా కరోనా వారియర్స్, వృద్ధులు, పిల్లలకు ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది.   కానీ, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించిన, వ్యాక్సిన్ తాయిలమే దేశ ప్రజలలో కొత్త సందేహాలు రేపింది. తమ పార్టీకి ఓటు వేసి, ఆ పీఠమేదో తమకు అప్పగిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది, నిర్మలమ్మ హామీల వరదలో వినిపించిన ఓ మహాప్రసాదం. అంటే ఆ ప్రకారంగా.. కేవలం బీహార్ ప్రజలకే, అది కూడా తన్మయత్వంతో కమలం పువ్వును వికసింపచేస్తేనే, ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రసాద భాగ్యం దక్కుతుందన్నమాట! లేకపోతే లేనట్లే లెక్క. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లేదా?.. అన్న ప్రశ్నకు,  బీజేపీ మోతుబరి భూపీందర్ యాదవ్ చేసిన మరికొన్ని అమృతవాక్కులు, దేశ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశాయి.   వ్యాక్సిన్ అనేది ఉచితం కాదని, నామమాత్రపు ధరకు లభిస్తుందని, రాష్ర్టాలే ఈ ఖర్చును భరించాలని సదరు బీజేపీ మహా మంత్రి సెలవిచ్చారు. ఆ ప్రకారంగా బీహార్‌లో తాము అధికారంలోకి వస్తేనే, వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది కమలదళాల కవిహృదయమన్న మాట. అంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారేమోనని,  భ్రమిస్తూ వచ్చిన వెర్రి వెంగళప్పల కళ్లను, కమలనేత్రాలు ఆ విధంగా తెరిపించాయన్నమాట. మరి ఇన్నాళ్లూ టీవీలో నరేంద్రుల వారిచ్చిన గంభీర ఉపన్యాసాలు. కొట్టిన చప్పట్లు.. వెలిగించిన కొవ్వొత్తుల మాటేమిటి? అంతా తూచ్చేనా?   కేంద్రం తీరు చూస్తే అదే డౌటనుమానం వస్తోంది మరి! రాదా మరి..? ఎందుకంటే.. కరోనా సీజన్‌లో మోదీ భయ్యా చప్పట్లు కొట్టమంటే, జనం గంటలు మోగించారు. కొవ్వుత్తులు వెలిగించమంటే, ఏకంగా దివిటీలే వెలిగించారు. మరి నరేంద్ర భయ్యా చెబితే ఇంత చేసిన జనాలకు, కమలం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కమలం పార్టీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా  కావాలంటే, మళ్లీ ఎన్నికలు రావలసిందేనా? అప్పటివరకూ వ్యాక్సినుకు తెరవు లేదా? ఎన్నికలొచ్చే వరకూ కళ్లలో వత్తులేసుకుని, దేభ్యమొహాలతో ఎదురుచూడాల్సిందేనా?   ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు, మరి ఎవరి ఖర్మకు వారిని విడిచిపెట్టడం భావ్యమా? మరోపక్క.. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని, కేంద్ర ఆరోగ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? పార్టీ నేతదా? కేంద్రమంత్రిదా? హేమిటో.. ఈ కమలం కంగాళీయం! అయినా అవకాశవాద రాజకీయాలకు ఆమడదూరం.. ఇంకా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరం ఉంటుందనుకునే,  భారతీయ జనతా భిన్నమైన పార్టీ అనే కడిగిన ముత్యానికి.. ఈ రాజకీయ పైత్యమేమిటన్నది దేశప్రజల ప్రశ్న. -మార్తి సుబ్రహ్మణ్యం

మొన్న సబ్బం హరి.. ఈరోజు గీతం యూనివర్సిటీ.. అక్రమ నిర్మాణాలంటూ అర్ధరాత్రి కూల్చివేత 

విశాఖలోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వవిద్యాలయం గీతం యూనివ‌ర్శిటీకి చెందిన ప‌లు క‌ట్ట‌డాల‌ను విశాఖ మున్సిప‌ల్ అధికారులు గత అర్ధరాత్రి నుండి మొదలుపెట్టి కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో.. గీతం వర్సిటీ ప్రధాన ద్వారంతో పాటు, ప్రహరీ గోడలో కొంతభాగం, అలాగే సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సమయంలో యూనివర్సటీకి దారి తీసే రోడ్లను మూసివేసి మరీ కూల్చివేత కొనసాగయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.    అయితే తమకు ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చివేత‌లు చేప‌ట్టార‌ని గీతం వ‌ర్శిటీ ఆరోపిస్తుండ‌గా… గ‌తంలోనే నోటీసులిచ్చిన‌ట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు. దాదాపు 40ఎక‌రాల ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.    అయితే కొద్దీ రోజుల క్రితం విశాఖలోని టీడీపీ నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను, టాయిలెట్ ను కూడా ఇలాగె శనివారం రోజు ఎంచుకుని మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ ఏపీలో వరుసగా టీడీపీ నాయకులను టార్గెట్‌గా చేసుకుని వారికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలా ఇచ్చారు.. ఇలా తీసుకున్నారు! టీఎస్ ఉద్యోగుల నిరాశ

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏను విడుదల చేసింది. జూలై 2019 నుంచి అమలు కావాల్సిన DAను 5.24 % పెంచుతూ జీవో జారి చేసింది. 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డిఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ డీఏ కోసమే చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఉద్యోగులు కోరిక మేరకు దసరా పండుగ మరుసటి రోజున  సెలవు దినంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.   దసరా ముందు డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు ఊరట చెందారు. దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించడాన్ని స్వాగతించారు. అయితే తెలంగాణ ఉద్యోగుల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేతనం కట్ చేస్తూ మరో నిర్ణయం వెలువడింది. సర్కార్ నిర్ణయంతో తమ  సంతోషం కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయిందని ఉద్యోగులు ఢీలా పడ్డారు. ప్రభుత్వం ఇలా ప్రకటించి.. అలా తీసుకున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు.       ప్రభుత్వానికి ఒక రోజు వేతనం ఇవ్వాలన్న జేఏసీ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ ఒక రోజు వేతనాన్ని ఎలా పణంగా పెట్టారంటూ కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఓపెన్ లెటర్ కూడా విడుదల చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా ఉన్నా.. జేఏసీ ఎందుకు ప్రశ్నించడం లేదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడిన.. ఎందుకు స్పందించలేదని నిలదీశారు.  గ్రామ రెవిన్యూ సంఘాల బాటలోనే మరికొన్ని సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి.

అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టుల గోల... రఘురామరాజు సంచలన కామెంట్స్ 

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులు, ప్రజలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఐతే ఈ ఉద్యమాన్ని ఎలాగైనా భగ్నం చేసి తాము కోరుకున్న విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనీ వైసిపి సర్కార్ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఉద్యమం చేపట్టి.. 300 రోజులు పూర్తీ కావడంతో పాటు ప్రధాని మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్దండరాయనిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ సర్కార్ కు మళ్ళీ టెన్షన్ మొదలైంది.   ఇప్పటిదాకా తమపార్టీ నేతలతో విశాఖ కర్నూల్ ప్రాంతాల్లో మూడు రాజధానుల అనుకూల ప్రదర్శనలు చేయించిన సర్కార్ ఇపుడు ఏకంగా అమరావతి ప్రాంతంలోనే బలప్రదర్శన చేయాలనే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేసింది. గతంలో కూడా దళిత రైతుల పేరుతో వైసీపీ అనుకూల క్యాంపులు నిర్వహించి... చంద్రబాబునాయుడి పర్యటనలో.. చెప్పులు కూడా వేయించినా అవన్నీ బయటపడిపోయాయి. తాజాగా నిన్న తాము కూడా ప్రదర్శన నిర్వహిస్తామని.. మూడు రాజధానులకు అనుకూలమంటూ కొందరు పోలీసులను పర్మిషన్ అడిగినట్లు.. దానికి వారు ఒక టైమ్ ఫిక్స్ చేసినట్లు హైడ్రామా నడిచింది. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడి రైతులు భగ్గుమన్నారు. దీంతో ఏదేమైనా సరే అని.. మళ్లీ కొందరిని చివరి నిమిషంలో ఆటోల్లో తరలించి.. ఆ ప్రాంతంలో గొడవలు రేపటానికి కూడా ప్రయత్నించారు.   ఐతే ఈ మొత్తం ఉదంతం పై వైసిపి రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. కర్నూల్‌లో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని అసలు బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా? అమరావతి వాడు కర్నూల్‌లో ఒకటి.. వైజాగ్‌లో ఒకటి కావాలని అడుగుతాడా? అన్నం తింటున్నారా.. గడ్డితింటున్నారా... ఇది కేవలం పెయిడ్ ఆర్టిస్టుల పని అని అర్థమువుతోంది. వైసిపి వాళ్ళు చిన్నపిల్లల్లా, తెలివితక్కువతనంతో ప్రవర్తిస్తున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతోంది. నాలుగు గంటలకల్లా ... ఆటోలో కొంతమంది అక్కడికి చేరుకున్నారంటూ అయన తన దగ్గరున్న మొబైల్‌లోని ఓ ఫొటో చూపించారు. వైసీపీ లోకల్ ఎమ్మెల్యేనే పెయిడ్ ఆర్టిస్టుల సప్లయిర్ అని అయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు ప్రజాప్రతినిధే ఒక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తీసుకున్నారన్నారు. వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారట. ఐతే ఆటోలో వచ్చిన వారికి... ఎందుకు వెళుతున్నారో కూడ తెలియదని అయన అన్నారు.

రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్‌ రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్స్ లిమిటెడ్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పర్యవేక్షణలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపింది.    గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ కు మధుసూదన్‌ను తాత్కాలిక సీఎండీగా నియమించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, గత కొన్ని రోజులుగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు.

కపిల్ దేవ్‌ కు గుండెపోటు

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల కపిల్‌ దేవ్‌ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కపిల్‌ దేవ్‌ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కపిల్ దేవ్‌ కు గుండెపోటు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్ ఆరోగ్యంపై పలువురు క్రికెటర్లు, ప్రముఖులు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.   కాగా, భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన కపిల్‌దేవ్‌ 1983లో వరల్డ్ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 225 వన్డేలు, 131 టెస్టులు ఆడిన కపిల్‌ దేవ్‌.. 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌ గా రికార్డు సాధించారు. 

స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పై మరో సారి ఉత్కంఠ నెలకొంది. కరోనా కారణంగా మొన్న మార్చిలో నిలిచిపోయిన ఎన్నికలను మళ్ళీ ఎపుడు నిర్బహించాలనే విషయంపై ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో పక్క స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.   తాజాగా రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి ఈ అంశం పై  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన అన్నారు. డిసెంబర్‌లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారని.. అలాగే ఏ వైరస్ అయినా రెండు, మూడు సార్లు వస్తుందని అయన తెలిపారు. నవంబర్, డిసెంబర్ పరిస్థితిని చూసి అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని అయన తెలిపారు. అప్పటి వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఆయన వెల్లడించారు. బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని, అందువల్ల వాటి నిర్వహణ తప్పనిసరి అని.. ఐతే రాష్ట్రంలో జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో వీటికి కొంత వెసులుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. అసలు రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని కూడా అయన అన్నారు.   ఇది ఇలా ఉండగా గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించుకుందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్‌ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరో పక్క రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటైర్ మెంట్ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగం తరపున ఉద్యమిస్తాం

జగిత్యాల, కామారెడ్డిలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని, సన్నరకం ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ తెలుగు దేశం తీవ్రంగా ఖండించింది.    అరెస్టు చేసిన రైతులను బేషరతుగా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ప్రభుత్వమే రైతుల చేత సన్నరకాలు సాగు చేయాలని ప్రోత్సహించి ఇప్పుడు కనీస మద్దతు ధర కల్పించకపోవడం హేయమైన చర్య అని రాష్ట్ర తెలుగు దేశం అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ప్రభుత్వం వెంటనే సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు  రూ. 2,500 మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతాంగం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భర్తకు భార్యనుంచి భరణం! యూపీ ఫ్యామిలీ కోర్టు సంచలనం 

చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాలు సమయానుసారం మారుతుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కోర్టు అలానే ఓ డిఫరెంట్ తీర్పు ఇచ్చింది. సాధారణంగా విడాకుల కేసుల్లో భర్త విడిపోయే భార్యకు భరణంగా నెలనెలా ఇవ్వాలని కోర్టులు సూచిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టు మాత్రం భార్య షాక్ ఇచ్చింది. భ‌ర్త‌కు భ‌ర‌ణం చెల్లించాల‌ని ఆదేశాలు ఇచ్చింది.    ముజఫరాబాద్ ఫ్యామిలీ కోర్టుకు ఓ జంట వెళ్లింది. చాలా ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్న ఆ భార్యాభ‌ర్త‌లు త‌మ‌కు విడాకులు ఇవ్వాల‌ని కోరారు. హిందూ వివాహ చ‌ట్టం-1955  కింద ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్ అయిన భార్య నుంచి త‌న‌కు భ‌ర‌ణం ఇప్పించాల‌ని.. ఆమె భ‌ర్త 2013లో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. దీనిపై ఏడేళ్ల పాటు విచార‌ణ చేసిన ఫ్యామిలీ కోర్టు తాజాగా ఓ వినూత్న తీర్పు వెలువ‌రించింది.  భార్య తన భర్తకు నిర్వహణ ఖర్చుల కింద ప్రతినెలా వెయ్యి రూపాయలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఆమెకు ప్రతినెలా రూ.12 వేలు పెన్షన్ వస్తుండ‌డం, మ‌రోవైపు భ‌ర్త‌కు ఎలాంటి ఆదాయం లేక‌పోవ‌డాన్ని కోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తుది తీర్పునిచ్చింది.     ఈ కాలంలో విడాకులు సర్వసాధారణం. విడిపోతే భర్త సంపాదన నుంచి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ తన భార్యకు దాదాపు 50శాతం వరకు వాటా ఇచ్చాడు. దీంతో ఆమె కూడా ఒక అతిపెద్ద ధనవంతురాలిగా మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ కు విడాకులిస్తూ భారీగా భరణం ఇచ్చారని చెబుతారు. ఇక మన దేశంలోనూ భారీ విడాకుల కేసులు చాలా ఉన్నాయి. వ్యాపార వేత్తలు, సినీ సెలబ్రెటీలు , రాజకీయ నేతలు చాలా మంది భారీగా భరణం ఇచ్చి తమ భార్యకు విడాకులు ఇచ్చారు.    అయితే గత  విడాకుల కేసులకు విరుద్ధంగా యూపీలోని ముజఫరాబాద్ ప్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది  వింత విడాకుల కేసుగా మారిపోయింది. సోషల్ మీడియాలో దీనిపై సెటైర్లు పేలుతున్నాయి. భార్య సంపాద‌న‌ప‌రురాలై, ఎలాంటి ఆదాయం లేని భ‌ర్త‌లు వేరుగా ఉంటే ...హిందూ వివాహ చ‌ట్టం-1955 కింద భార్య నుంచి భ‌ర‌ణం పొంద‌వ‌చ్చ‌నే స‌ర‌దా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తాము ఖాళీగా ఉంటూ భార్యల సంపాదనపై ఆధారపడి జీవించేవారికి మంచి రోజులు వచ్చినట్టేనని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

వరద విరాళాల కోసం ఒత్తిళ్లు? పవన్ పంచ్ తో పరేషాన్

వరద విపత్తు విరాళాల కోసం వేధిస్తున్నారా? కచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందేనని కండీషన్లు పెడుతున్నారా? టాలీవుడ్ తీవ్ర ఒత్తిడిలో ఉందా? అంటే తెలుగు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు అందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ ఎత్తున విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ ఘాటు స్పందనతో సంచలనంగా కూడా మారింది       ప్రభుత్వంలోని ఓ మంత్రి నేరుగా విరాళాల కోసం ఫోన్లు చేస్తున్నారనే వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయం ప్రకటిస్తే తీసుకోవాలి కానీ.. ఇలా ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో చాలా విపత్తులు వచ్చాయని, కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని కొందరు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. సాయం అన్నది ఎవరికి తోచినట్లు వారు చేస్తారు...  సాయం ఎంత చేయాలో 'ఫిక్స్' చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.    హైదరాబాద్ వరద బాధితుల కోసం ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ స్టార్లు ముందుకు వచ్చారు. విరాళాలు కూడా ప్రకటించారు. హీరో ప్రభాస్ కోటిన్నర రూపాయలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోటి రూపాయల లెక్కన సీఎంఆర్ఎఫ్ కు సాయం ప్రకటించారు. నాగార్జున, ఎన్టీఆర్ లు ఏభై లక్షలు ప్రకటిస్తే..విజయదేవరకొండ పది లక్షలకు ఏకంగా సీఎంఆర్ఎఫ్ కు బదిలీ చేశారు. మరికొంత మంది దర్శకులు, నటులు కూడా తమకు తోచిన వరద సాయం ప్రకటించారు. అయినా ఇంకా విరాళాల కోసం ఒత్తిడి చేయడంపై విమర్శలు వస్తున్నాయియ    ఫోన్లు, ఒత్తిళ్ల  విషయం తెలియడం వల్లే పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. సినిమా వాళ్ళ కంటే రాజకీయ నేతలు, మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. అంతే కాదు..ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే నేతలు ఇప్పుడు రాజకీయానికి పెట్టుబడి అనుకుని డబ్బు బయటకు తీయాలని అన్నారు. ఇండస్ట్రీలో పేరు ఉన్నంతగా డబ్బు ఉండదని క్లారిటీ ఇచ్చారు జనసేనాని. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందే ఆన్ లైన్ లో పైరసీకి గురైతే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గ్యారంటీ పత్రాలపై సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో రూ.1 కోటి సంపాదిస్తే కొంత జీఎస్టీ ద్వారా పోతుంది. అన్ని పన్నులు పోయి చేతిలో మిగిలేది రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలేనని చెప్పారు. నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదని.. జీవితాలు కోల్పోయిన వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పారు పవన్.    పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సినీ ప్రముఖులంతా  స్వాగతిస్తున్నారు. సాయం అనేది స్వచ్చందంగా ఉండాలి కానీ.. ఫోన్లు చేసి సాయం ప్రకటించాలని ఒత్తిడి చేయటం సరికాదనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వస్తున్నాయి. కరోనా కారణంగా సిని పరిశ్రమ కుదేలైంది. కొన్ని నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఈ సమయంలో విరాళాల కోసం ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు సినీ ప్రముఖులు.

ఓట్ల కోసం వ్యాక్సిన్ వాయిస్! జోరుగా కరోనా పాలిటిక్స్  

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఖతం చేసే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఇంకా తుది దశకు రాకముందే.. వ్యాక్సిన్ వార్ కూడా మొదలైంది. తామే ముందు కరోనా టీకా తీసుకురావాలని కొన్ని దేశాల మధ్య పోటీ జరుగుతుండగా.. రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల వేటలో వ్యాక్సిన్ వార్ కు దిగాయి. ఓట్ల కోసం కరోనా వ్యాక్సిన్ ను ఉపయోగించుకుంటున్నారు నేతలు. నవంబర్ లో ఎన్నికలు జరగనున్న అమెరికాలో ప్రచారమంతా కరోనా వ్యాక్సిన్  చుట్టే తిరుగుతోంది. తాను మళ్ళీ గెలిస్తేనే వ్యాక్సిన్ త్వరగా వస్తుందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. లేకపోతే అది మరింత ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అంతే కాదు ఎన్నికల ముందే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెబుతున్నారు ట్రంప్. అయితే  ట్రంప్ ప్రత్యర్ధి , డెమెక్రాట్ అభ్యర్థి జొ బైడెన్ మాత్రం మార్కెట్లోకే రాని వ్యాక్సిన్ ఎక్కడ నుంచి తెస్తారంటూ ట్రంప్ ను ప్రశ్నిస్తున్నారు.    మన దేశంలోనూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుండగా రాజకీయ వేడి మాత్రం రాజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  బీహార్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ ఇవ్వడం దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. బీహార్‌లో ప్ర‌తి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది  తమ తొలి హామీ అని ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బీజేపీ కరోనా  హామీపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకమని విమర్శించారు రాహుల్ గాంధీ. ఎన్నికలు జరగనున్నది ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు? వీళ్లు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నించారు. ఇంకా రాని వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రజలకు ఎలా చెబుతారు? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.    బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఇతర పార్టీలు కూడా మండిపడుతున్నాయి. బీహార్ లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరు ఇస్తారు అంటూ  కొన్ని పార్టీలు నిలదీస్తున్నాయి. వ్యాక్సిన్ దేశానికి సంబంధించింది అని...బిజెపికి సంబంధించింది కాదని పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. కరోనా వ్యాక్సిన్‌ను బీహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీహారీలకు ఫ్రీ టీకా ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీపై ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేశారు. జనాల్లో తిరుగుతున్నా మీకు వైరస్‌ సోకలేదు.. టీకా వేసుకున్నారా?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. లేదని చెబుతూ కేటీఆర్‌ ఈ సమాధానం చెప్పారు. రాజకీయాలకు వ్యాక్సిన్ అంశాన్ని వాడుకోవటంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.    బీహార్ లో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా ముందుగానే ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే తమిళనాడు ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తామని ఆయన వెల్లడించారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో కరోనా కీలక అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అమెరికా సహా అన్ని దేశాల్లోనూ రాజకీయ పార్టీలు కరోనా వ్యాక్సిన్ ను ఓట్ల రాబట్టుకోవడం కోసం ఉపయోగించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో పరిశోధన సంస్థలు స్పష్టంగా చెప్పడం లేదు. అలాంటి సమయంలో ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడమంటే ప్రజలను మోసం చేయడమేనన్న అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది.

పోలీసు నియామకాలపైనే ఫోకస్! కేసీఆర్ వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి మందికి పైగా సబ్ ఇన్స్ పెక్టర్లు విధుల్లో చేరబోతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్ఐల పరేడ్ కూడా పూర్తైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎక్కువగా పోలీస్ శాఖలోనే నియమకాలు జరిగాయి. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణ ఇచ్చినట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీనే తెలిపారు. ఇందులో 18 వేల 428 మంది ఎస్.ఐ, కానిస్టేబుళ్లే. తెలంగాణ లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పోలీస్ శాఖకు అధిక బడ్జెట్, ఆధునిక పరికరాల కొనుగోలు, సాంకేతికతను సమకూర్చామని చెప్పారు హోంశాఖ మంత్రి.  తెలంగాణ  పోలీస్ శాఖలో పెద్దఎత్తున నియామకాలు జరిగాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.   తెలంగాణ వచ్చాక పోలీసు శాఖలోనే ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నారు. గత ఆరేండ్లలో కేసీఆర్ సర్కార్ భర్తీ చేసిన ఉద్యోగాల్లో సగానికి పైగా ఒక్క పోలీస్ శాఖలోనే ఉన్నాయి. పోలీస్ శాఖలో ఖాళీలు లేకున్నా కొత్త పోస్టులు స్పష్టించి మరీ నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలంగాణ జనాభా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉండాల్సిన వారి కంటే ఎక్కువే ఎస్ఐలు ఉన్నారని తెలుస్తోంది. పోలీస్ శాఖకు గతంలో కంటే బడ్టెట్ కూడా భారీగా పెంచారు. వాహనాలను భారీగా సమకూర్చారు. హైటెక్ టెక్నాలజీని కూడా పోలీసులకు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. విదేశాల నుంచి కూడా అత్యాధునిక పరికరాలను తెప్పించింది. ఇక హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మిస్తోంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ శాఖపైనే ఎందుకు ఫోకస్ చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.    పోలీస్ శాఖ ద్వారా తమకు కావాల్సింది చేసుకోవాలనే లక్ష్యంతోనే కేసీఆర్ సర్కార్ ముందుకు వెళుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘా పెట్టడం, వారి కదలికలను గమనించడం వంటి పనుల కోసమే పోలీసు శాఖను బలోపేతం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోలీసులను ఉపయోగించి గట్టెక్కవచ్చన్నది కేసీఆర్ భావనగా  చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి పేవర్ గా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలు టీఆర్ఎస్ లో చేరేలా పోలీసులతో బెదిరించారనే ఫిర్యాదులు కూడా గతంలో వచ్చాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. విపక్షాలు ఎలాంటి నిరసనకు పిలుపిచ్చినా.. రాత్రికి రాత్రే వారిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. విపక్ష నేతలను రోడ్డుమీదకు రావడానికే అనుమతించడం లేదు.    గతంలో జరిగిన ఆర్టీసీ సమ్మెతో పాటు పలు ఉద్యమాల సమయంలో... పోలీసులనే ప్రధానంగా వాడుకుంది ప్రభుత్వం. పోలీసులతో బస్సులు నడిపించే ప్రయత్నం కూడా చేసింది. ఇటీవల శ్రీశైలం పవర్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగినా.. అక్కడికి విపక్ష నేతలెవరు వెళ్లకుండా పోలీసులతో కట్టడి చేసింది కేసీఆర్ సర్కార్. కల్వకుర్తి పంపులు మునిగినా.. కాళేశ్వరం కాలువలు తెగినా పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతలకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని విపక్ష నేతల కదలికలను గమనించేందుకు విదేశాల నుంచి తెప్పించిన పరికరాలను పోలీసులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రఘునందన్ రావు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారు.    తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షన్నరకు పైగా ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. సరిపడా ఉద్యోగులు లేక పాలనలో ఇబ్బంది అవుతుందని ఉద్యోగ సంఘాలు కూడా చాలా సార్లు ప్రకటించాయి.ఖాళీలను భర్తీ చేయాలని సీఎస్ కు వినతి పత్రాలు కూడా ఇచ్చాయి. కాని కేసీఆర్ సర్కార్ మాత్రం ఉద్యోగ నియామకాలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల ఊసే ఎత్తడం లేదు. టీఎస్పీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్లు రాకా చాలా కాలమైంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలనే ఇంకా భర్తీ చేయలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2017లో రాతపరీక్ష జరిగిన గ్రూప్ 2 ఫలితాలను గత నెలలో విడదుల చేసింది. అది కూడా పట్టభద్రుల మండలి ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే చేసిందని చెబుతున్నారు.       టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక టీచర పోస్టుల భర్తీ ఎండమావిగానే మారింది. మూడేండ్లు డీఎస్సీ వేయకపోవడంతో నిరుద్యోగుల్లో ఉద్యమాలు చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికలకు వాడుకుంది. కాని ఇప్పటికి అవి ఇంకా పూర్తి కాలేదు. ట్రైనడ్ గ్రాడ్యువేట్ టీచర్ పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టిజిటి మెరిట్ అభ్యర్థులు కొన్ని రోజులుగా  ధర్నాలు చేస్తున్నారు. అయినా టీఎస్పీఎస్సీలో చలనం లేదు. కాని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మాత్రం వరుసగా నియమకాలు చేపడుతూనే ఉంది. కరోనా సమయంలోనూ ఎస్ఐలు, కానిస్టేబుళ్ల శిక్షణను కొనసాగించింది. దీన్ని బట్టే పోలీసు శాఖకు కేసీఆర్ సర్కార్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోంది. అయితే పోలీసులను ప్రజల కోసం ఉపయోగిస్తే మంచిదే కాని... ఇలా విపక్ష నేతలను అడ్డుకోవడానికి, సొంత అజెండా అమలు చేయడానికి వాడుకుంటే మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పై ఐటీ దాడులు.. బీజేపీకి ఓటమి భయం అంటున్న ఆర్జేడీ..

బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పాట్నాలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసారు. ఈ దాడిలో పార్టీ ఆఫీసు బయట పార్క్ చేసిన వాహనంలో రూ. 8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఐతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పై ఐటీ దాడులకు సంబంధించి బీహార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శక్తిసింగ్ గోహిల్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ సోదాలలో ఎటువంటి డబ్బును అధికారులు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు.   ఈ సోదాలలో "పార్టీ ఆఫీసు కాంపౌండ్‌కు బయట పార్క్ చేసిన ఓ వాహనంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నందుకు ఐటీ అధికారులు పార్టీకి నోటీసులు జారీచేశారు. ఐతే పార్టీ కార్యాలయం కాంపౌండ్‌లో ఎలాంటి డబ్బులు లభించలేదు. ఐటీ అధికారులకు మేము పూర్తిగా సహకరిస్తాం" అని శక్తిసింగ్ అన్నారు. మరో పక్క రాక్సేల్ ‌ బీజేపీ అభ్యర్థి నుంచి 22 కిలోల బంగారం, 2.5 కిలో వెండి స్వాధీనం చేసుకున్నా కూడా ఐటీ అధికారులు అక్కడికి ఎందుకు వెళ్లరు?" అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తాజా ఐటీ దాడులను కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ, జేడీయూ కూటమి ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయిస్తోందంటే.. దాని అర్థం.. వాళ్లు ఓటమిని అంగీకరించినట్టేనని తీవ్ర వ్యాఖలు చేసింది.   ఇది ఇలా ఉండగా మొదటి దశ పోలింగ్‌కు కొద్ది రోజుల గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రతిపక్ష ఆర్జేడీ.. తాము అధికారంలో వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా.. ఆ హామీని తలదన్నెలా బీజేపీ ఏకంగా 19 లక్షలు ఉద్యోగాలతో పాటు బిహార్ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని వారి మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే అసెంబ్లీ  ఎన్నికలకు కరోనా వ్యాక్సిన్ తో ముడి పెట్టడం పై బిహార్‌లోని ప్రతిపక్షాలే కాకుండా, దేశంలోని పలు రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాణాలను కాపాడే కరోనా వ్యాక్సిన్‌ను ఎన్నికల్లో ఓట్లకు ముడిపెడతారా అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

గుడ్ న్యూస్.. 'కోవ్యాక్సిన్' మూడో దశ ట్రయల్స్ కు డీసీజీఐ లైన్ క్లియర్..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ "కోవాక్సిన్" ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. వ్యాక్సిన్ పరీక్షలలో అత్యంత కీలకమైన మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ కు అనుమతులు లభించాయి. ఇప్పటికే పూర్తైన తొలి రెండు దశల ట్రయల్స్ కు సంబంధించిన నివేదికను డీజీసీఐకి భారత్ బయోటెక్ పంపగా.. మూడో దశ ట్రయల్స్ కు అనుమతి లభించింది.   త్వరలో మొదలయ్యే మూడవ దశ ట్రయల్స్ మొత్తం 28,500 మందిపై జరుగుతుందని, దీని కోసం 18 ఏళ్లు దాటిన వాలంటీర్లను ఎంచుకుని, దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పట్నా, లక్నో తదితర నగరాలతో పాటు మరో 10 రాష్ట్రాలలో ఈ ట్రయల్స్ జరుగుతాయని సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ పై రిపోర్ట్ ను విడుదల చేసిన భారత్ బయోటెక్, జంతువులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, వాటిల్లో కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదిరించగల యాంటీ బాడీలు వృద్ధి చెందాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. త్వరలో చేపట్టబోయే మూడవ దశ ట్రయల్స్ విజయవంతమైతే ఏ క్షణమైనా వ్యాక్సిన్ ను ప్రపంచంలోకి విడుదల చేస్తామని భారత్ బయోటెక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మరో భారత సంస్థ జైడస్ కాడిలా రూపొందించిన వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించింది. ఇక ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెక రూపొందించిన వ్యాక్సిన్ రెండు, మూడవ దశ ట్రయల్స్ ను అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఇప్పటికే భారత్ లో చేపట్టింది.

వ్యాపారులు, నేతలు డబ్బులు బయటికి తీయాలి! వరద బాధితులకు పంచాలన్న పవన్ 

విపత్తు విరాళాలపై తీవ్రస్థాయిలో స్పందించారు పవన్ కళ్యాణ్. విరాళాలు ఎవరికి వారు స్పందించి ఇవ్వాలన్న పవన్.. ఎందుకు ఇవ్వలేదని అడగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ సున్నితమైనది కాబట్టే సులువుగా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. నేతలు, వ్యాపారులతో పోల్చితే సినిమా వాళ్ల వద్ద ఉన్న సంపద ఎంతని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఎన్నికల వేళ వందల కోట్ల రూపాయలు భారీగా ఖర్చు పెట్టే వాళ్లంతా ఇప్పుడా డబ్బులను బయటికి తీయాలన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నాం అనుకుని.. వరద బాధితుల కోసం ఖర్చు చేయాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.    విపత్తులు సంభవించిన ప్రతిసారి సినీ పరిశ్రమ స్పందిస్తూనే ఉందని పవన్ స్పష్టం చేశారు. అయినా సినిమా పరిశ్రమ సరిపోయినంత ఇవ్వడంలేదని అంటున్నారని, ఎంత ఇవ్వాలో నిర్ధారించేది ఎవరు? ఆలా నిర్ధారించేవాళ్లు తమ జేబుల్లోంచి పది రూపాయలైనా తీసి ఇచ్చారా? కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు నుంచి కోటి రూపాయలు, రూ.10 లక్షలు ఇవ్వాలంటే వారికి మనసొప్పుతుందా? అని పవన్ ప్రశ్నించారు. నా వరకు నేను కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాను. అలా ఇవ్వాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. ఇండస్ట్రీలో పేరు ఉన్నంతగా డబ్బు ఉండదు. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందే ఆన్ లైన్ లో పైరసీకి గురైతే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు, గ్యారంటీ పత్రాలపై సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది అని పవన్ చెప్పారు.    సినీ రంగంలోని వారికి పేరేమో ఆకాశమంత ఉంటుంది, కానీ డబ్బు ఆ స్థాయిలో ఉండదన్నారు పవన్. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ఇక్కడ వేల కోట్ల టర్నోవర్ రాదన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వందల కోట్లలో ఖర్చు చేస్తారని... ఆ స్థాయిలో డబ్బులు చిత్ర పరిశ్రమలో ఉండవన్నారు జనసేనాని. వాస్తవానికి డబ్బంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద, రాజకీయ నేతలు, రాజకీయ వ్యవస్థలు, ఎగుమతి వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తల వద్ద, ఇన్ ఫ్రా రంగంలో ఉండే సంస్థలు, కాంట్రాక్టర్ల వద్ద ఉందని... వాళ్లతో పోల్చితే సినీ రంగం ఏపాటిదని తేల్చిచెప్పారు పవన్ కల్యాణ్.    ఒక్కో సీజన్ లో అన్ని సినిమాలు కలిపినా వెయ్యి కోట్లు కూడా ఉండదు. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో రూ.1 కోటి సంపాదిస్తే కొంత జీఎస్టీ ద్వారా పోతుంది. అన్ని పన్నులు పోయి చేతిలో మిగిలేది రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలే. నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదు. జీవితాలు కోల్పోయిన వాళ్లు ఉన్నారు ఇక్కడ. కరోనా వేళ నేను కోటి రూపాయలు ఇస్తే, అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ఇచ్చారు. అది ఆయన స్థాయి. అందులో ఎలాంటి మెహర్బానీ లేదని చెప్పారు పవన్ కల్యాణ్.

కరోనా వ్యాక్సిన్ రెండేళ్లవరకు రాకపోవచ్చు.. సీసీఎంబీ డైరెక్టర్ 

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా షాకింగ్ న్యూస్ చెప్పారు. రెండేళ్ల వరకు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అయన బాంబు పేల్చారు. అంతేకాకుండా భారతదేశంలో కరోనా వైరస్ తగ్గిపోయిందని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అయన అన్నారు. కొంతమంది కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారని.. ప్రజలు అపోహలు వదిలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన సూచించారు. మరో పక్క భారత్ బయోటెక్, అరబిందో ఫార్మాతో సహా వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్ కోసం తాము పరిశోధనలు జరుపుతున్నామని అయన తెలిపారు. అయితే వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై ఒక స్పష్టత రావొచ్చన్నారు. అంతేకాకుండా కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం అనేది చాలా కష్టమైన వ్యవహరమని అయన చెప్పారు.   తాము జరిపే పరిశోధనలకు తోడు అదృష్టం కూడా కలసిరావాలని అయన చెప్పారు. తాజాగా హైదరాబాద్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు తగ్గటం సంతోషకరమన్నారు. అయితే ఆసుపత్రులను పరిశీలించి కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని అంచనాకు రాకూడదని ఆయన స్పష్టం చేసారు. పుట్టగొడుగుల్లో ఉండే ఒక పదార్ధాన్ని సేకరించి AICతో కలసి తాము ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి కమ్యూనిటీ బూస్టర్ రోగనిరోధక శక్తి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు తమ ఆహారంతో కలపి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ను తీసుకోవాలని రాకేష్ మిశ్రా సూచించారు. చాలా కాలంగా భారతీయులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశం లేదని అయన తెలిపారు.

ఆవు మాంసం తింటే.. ఇక ప్రాణాలు గాలిలోనే!

కొత్తగా మార్కెట్‌లోకి రానున్న ఇంజక్షన్   గోవులు మాత్రం భద్రమేనట   ఆవు మాంసం అంటే చెవి కోసుకునే వారికి ఇది ప్రాణంతకమయిన వార్త. అలాగే గో సంరక్షుకులకు మాత్రం ఇది శుభవార్త. ఇకపై ఆవు మాంసం తిన్న వారెవరయినా, దివంగతులవాల్సిందే. వారి జీవితాలకు ఇక అదే ఆఖరి భోజనం. అది తిన్న నాలుగు గంటల్లోనే వారి చీటీ చినిగిపోతుందంతే! ఎందుకంటే.. ఆవు శరీరంలో ఉన్న ఇంజక్షన్ ప్రభావం అది!   దేశంలో గోవుల సంఖ్య తగ్గుతుండటం, ఉన్న ఆవుల ఆరోగ్యం వివిధ కారణాల వల్ల క్షీణిస్తుండటం, కొన్ని మత వర్గాలకు చెందిన వారు.. ఉన్న ఆవులను చంపి తినడం అహ్మదాబాద్ ఎల్.డి.యూనివర్శిటీకి చెందిన, ధృవపటేల్‌ను ఆందోళనకు గురిచేసింది. ఫలితంగా ఆయన మేధస్సు నుంచి ఓ రసాయనం ఆవిష్కృతమయింది. అయితే ఆ ఇంజక్షన్‌కు ఇంకా పేరు పెట్టలేదట. ఆ ఇంజక్షన్ పశువులకు యాంటీ వైరస్‌లా పనిచేస్తుందట. ఈ రసాయనం తయారుచేసేందుకు పటేల్ కు రెండేళ్లు పట్టిందట. దీనిని ఇంజక్షన్ రూపంలో పశువులకు ఇస్తారు. దీనివల్ల వాటికి ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలూ రావు. పైగా ఆయుర్దాయం లోనూ ఎలాంటి తేడా ఉండదు. దీని ఖరీదు కేవలం 150 వరకూ ఉండవచ్చట.   అయితే... ఒకవేళ పశువులు ఏ పరిస్థితిలో మృతి చెందినా, లేక వాటిని చంపి ఆ మాంసాన్ని భుజించినా.. అది తిన్న వారు నాలుగు గంటల్లో చనిపోవడం ఖాయం. ఎందుకంటే ఆ పశువుల శరీరంలో ఉన్న ప్రత్యేక రసాయన మహత్యమది. అంటే ఆ రసాయనం.. పశువు చనిపోయిన తర్వాత ప్రభావం చూపించేలా పటేల్ దానిని తయారుచేశారన్నమాట. ఈ ఇంజక్షన్‌ను గోశాలలకు ఉచితంగానే ఇస్తారని సైంటిస్ట్ తేజ్‌సింగ్ వెల్లడించారు.   ఈ ఇంజక్షన్ మార్కెట్‌లోకి వస్తే.. ఇక ఆవులు, గేదెలు, ఎద్దులు రోడ్లపై స్వేచ్ఛగా తిరగవచ్చు. ఇప్పటికే గోవధపై దేశంలో ఆందోళన జరుగుతోంది. విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు, గోవధ అడ్డుకునేందుకు నిరంతరం సైనికుల మాదిరిగా పనిచేస్తూనే ఉన్నారు. ఒక మతానికి చెందిన వారు పశువులను ఎక్కువగా సంహరించి, వాటి మాంసం తింటున్నారు. ముఖ్యంగా పండుగల సందర్భంలో ఆవు, ఒంటె మాంసం అమ్మకాలు విపరీతంగా ఉంటాయన్నది తెలిసిందే.   ముఖ్యంగా..  హైదరాబాద్ పాతబస్తీ వంటి ప్రాంతాల్లో అయితే... ఆవులను చంపి, వాటి మాంసాన్ని అమ్మడం చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఇంజక్షన్ మార్కెట్‌లోకి వస్తే, ప్రాణభయంతో ఎవరూ ఆవుల జోలికి రారు. ఉభయ తారకంగా ఉండేందుకే పటేల్ సాబ్ ఈ ఇంజక్షన్ కనిపెట్టినట్లున్నారు. ఈ లెక్క ప్రకారం.. ఇక దేశంలో ఉన్న కబేళాలు కూడా మూతపడటం, మాంసాన్ని విదేశాలకు ఎగుమతి కావడం కూడా బందవడం ఖాయం! -మార్తి సుబ్రహ్మణ్యం

ఏపీ బీజీపీలో.. వేటు పడ్డ యువనేతదే హవా!

ఆ ‘అగ్ర నేత’దగ్గర ఆయనదే పలుకుబడి   ఏపీ బీజేపీలో.. వాయువేగంతో కొనసాగుతున్న సస్పెండ్ల పర్వంలో, ఇదో హాశ్చర్యమైన కుదుపు. కన్నా లక్ష్మీనారాయణ హయాంలో, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఓ నాయకుడిని సస్పెండ్ చేశారు. అయితే, ఆయన ఇప్పుడు బీజేపీ రాష్ట్రశాఖ ‘పెద్దతలకాయ’ వద్ద హవా సాగిస్తున్న తీరు కమలదళాలను విస్మయానికి గురి చేస్తోంది. ఆ అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడాలంటే ముందు ఈ సస్పెండయిన నాయకుడికే ఫోన్ చేయాలట. కన్నా హయాంలో పార్టీలో చేరిన వారిని, సస్పెండ్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రస్తుత నాయకత్వం.. అదే కన్నా హయాంలో సస్పెండయిన నేతను మాత్రం, తమ కొలువులో చేరదీయడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.   గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ బీజేపీ యువనేత, అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ అనుబంధసంస్థలో పనిచేసే సదరు యువ నేత తీరుపై ఆగ్రహించిన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ, ఆయనపై వేటు వేసింది. తర్వాత గత ఎన్నికల్లో ఆయన పాలకొల్లు వైసీపీ అభ్యర్ధి డాక్టర్ బాబ్జీ వద్ద చేరి, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించారు.   సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ తెనాలి నాయకుడు, ప్రస్తుత బీజేపీ ‘రాష్ట్ర ప్రముఖ నేత’ వద్ద చేరటం, పార్టీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి సస్పెండయిన నేతను తన పక్కనే పెట్టుకోవడం ద్వారా, సదరు అగ్ర నేత ఇచ్చే సంకేతాలు ఏమటన్న చర్చ, బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. సదరు తెనాలి నేత, గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించడంతోపాటు, మెయిల్స్ రూపంలో అసభ్యపదజాలంతో సందేశాలు పంపుతున్నారన్న ఫిర్యాదుపై.. 2014 అక్టోబర్ 27లో, సైబరాబాద్ పోలీసులు అరెస్టు అవడం, అప్పట్లో సంచలనం సృష్టించింది.   బీజేపీ అనుబంధ విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావడంతో, పార్టీ కూడా అప్పట్లో ఇబ్బంది పడింది. ఇదే కేసులో సదరు నేత అంతకుముందు ఏడాది కూడా అరెస్టయి, జైలుకు వెళ్లారట. అయితే, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద కబుర్లు- ఉపాన్యాసాలు ఇచ్చే బీజేపీ నాయకులు... మహిళలను వేధించే వారికి, పార్టీలో పెద్ద వేయడాన్ని భరించలేని ఆ మహిళా బాధితురాలు ఆత్మహత్యా ప్రయత్నం చేయడం విషాదం.   ఇలాంటి ఘనత వహించిన నేతపై ఒక నాయకత్వం వేటు వేస్తే.. అదే పార్టీకి చెందిన మరొక నాయకత్వంలోని ప్రముఖ నేత, తమ పక్కనే పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీకి చెందిన ఓ సీనియర్ కార్యకర్త.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాతోపాటు, జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని, రాష్ట్ర సంఘటనా కార్యదర్శికి మాత్రం ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆయన క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని, ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉన్నందుకే, బహుశా ఆయనకు ఫిర్యాదు చేయనట్లు కనిపిస్తోంది.   గతంలో కూడా బీజేపీకి చెందిన ఓ కీలక నేతపై ఇదేవిధంగా, మహిళలకు సంబంధించిన వ్యవహారశైలిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫిర్యాదులూ వెళ్లాయి. ఆయనను ‘మహిళా నాయకుడిగా’ పార్టీ వర్గాలు అభివర్ణించేవి. ఆ తర్వాత ఆయనను తొలగించారు. అది వేరే విషయం. సదరు నాయకుడి ఆశీస్సులతోనే,  కొత్త నాయకత్వం తెరపైకి వచ్చిందన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో వినిపించింది. ఏదేమైనా.. మహిళలను గౌరవించే పార్టీలో అదే మహిళలను వేధించిన వారిని పక్కన ఉంచుకుంటున్న వైనమే విస్మయపరుస్తోంది. మరి బీజేపీ అంటే భిన్నమైన పార్టీ కదా? అందుకు! -మార్తి సుబ్రహ్మణ్యం