లాంగ్ లీవ్ పై ఐఏఎస్ స్మితా సబర్వాల్

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు అమె సెలవు పెట్టారు. సెలవుకు ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ.. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆమె తన సెలవుకు కారణం గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆమె సెలవును ప్రభుత్వం మంజూరు చేసింది.  

కేసిరెడ్డి పీఏకి బెయిలొచ్చింది కానీ.. పాపం!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) కొట్టివేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1 అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోసం రాజ్ కాసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ విజయవాడ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్ల పై ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) తీర్పు వెలువరించింది. రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లకు బెయిలు నిరాకరించిన కోర్టు, ఇదే కేసులో ఏ30 అయిన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ రెడ్డికి మాత్రం బెయిలు మంజూరు చేసింది.  ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న నిందితులలో దిలీప్ ఒకరు. అతడికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే రాజ్ కరేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు మాత్రం కోర్టు బెయిలు నిరాకరించి, వారి పిటిషన్లను డిస్మిస్ చేసింది.  రాజ్ కేసిరెడ్డి గతంలో బెయిలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని  సూచిస్తూ ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.   

ఆధార్ తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్ లో  కుటుంబాలన్నిటికీ ఫ్యమిలీ బెనిఫిట్ కార్డు అందించే కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డ్ తరహాలో ఈ కార్డు రాష్ట్ర పథకాల ప్రయోజనాలన్నిటికీ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇడింటిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా  సమస్త వివరాలూ ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందనీ, అందులో భాగంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును తీసుకురానున్నట్లు చంద్రబాబు చెప్పారు.  ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్థపై గురువారం (ఆగస్టు 28) సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ సందర్భంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు  నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ తరహాలోనే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందు బాటులో ఉంటుందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను  ఫ్యామిలీ కార్డులో పొందుపరిచి, వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుం బాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు, అందుకు అనుగుణంగా అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్‌ చేసే విషయాన్ని పరిశీలించలని చంద్ర బాబు పేర్కొన్నారు.   

విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఆరిఫ్ హుస్సేన్ అరెస్టు

బీహార్ కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక నిందితుడైన ఆరిఫ్ హుస్సేన్  దేశం విడిచి పారిపోయేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎన్ఐఏ అడ్డుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూరుస్తాడనీ, దేశంలో  జిహాదీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ అభియోగాలు ఉన్నాయి.  సిరాజ్ ,సమీర్ ల అరెస్టుల తర్వాత   అప్రమత్తమైన ఆరిఫ్ హుస్సేన్ విదేశాలకు పరారయ్యేందకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఎన్ఐఏ ఆయనను ఢిల్లీ ఎయిర్ పోర్టులో గురువారం (ఆగస్టు 28) అదుపులోనికి తీసుకుంది. ఆరిఫ్ ను శుక్రవారం (ఆగస్టు 29) విశాఖ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 29) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాల్సి ఉంటుంది. భక్తులు మాత్రమే కాకుండా ఆలయ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలయ ఉద్యోగులు కొలువులకు సంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ ల వినియోగంపై నిషేధం అమలులోనికి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వినియోగించకూడదు. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి ఈవో తెలిపారు.   

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఆగస్టు 29) ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 15 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలిగేందుకు 3 గంటలకు పైగా సమయం పడుతోందిఇక గురువారం (ఆగస్టు 28) శ్రీవారిని మొత్తం 63 వేల 843 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.

విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్

  ఏపీకి మరో భారీ పెట్టుబడికి సిద్దమైంది. విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఈ సెంటర్‌ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది. మూడు సముద్రపు కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ల ద్వారా వైజాగ్‌‌లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ముంబయికి రెండు రెట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది. విశాఖలో 6 బిలియన్‌ డాలర్లతో డేటా సెంటర్‌ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్‌ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఇది గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలవనుంది. హౌసింగ్‌ డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (AI) హబ్‌ల ఏర్పాటుకు అందులో చోటు కల్పించనుంది.హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖపట్నం మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో ఈ డేటా సిటీని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.   

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చింది భూమనే : ఓ.వి.రమణ

  భూమన హైందవ ధర్మ పరిరక్షకుడు కాదు..టీటీడీని దోచేసిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు ఓ.వి.రమణ విమర్శించారు. కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అని ఆరోపించారు.బిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయించారని పేర్కొన్నారు. కలెక్టర్లకు టార్గెట్ లు ఇచ్చి ఎవరిని పడితే వారిని పట్టుకొచ్చి వివాహాలు చేయించారని ఆయన తెలిపారు. వైజాగ్ లో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు 12వేలు ఖర్చు చేశారు. ఆడిట్ రిపోర్టులో బయటపడిందని రమణ పేర్కొన్నారు.సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క కాటేజీ అయినా కట్టించావా భూమన అని ఆయన ప్రశ్నించారు. తిరుమల టీటీడీ ఛైర్మన్ గా రెండు సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా..? ఆయన ప్రశ్నించారు. బుషికేష్ లో 20ఎకరాల స్థలాన్ని నొక్కేయాలని చూస్తే దాత ఆ స్థలాన్ని విరాళంగా ఇవ్వకుండా వెళ్లిపోయారని అన్నారు. వైసీపీ హయాంలో కొండపైన వ్యభిచారం జరిగిందని సాక్షాత్తు చిన్నజియ్యర్ స్వామే చెప్పారని ఆరోపించారు . దేవుడి సొమ్ములో కమిషన్ కు కక్కుర్తి పడిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని తెలిపారు.శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవం కాదని భూమన చెప్పగలడా..? అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికే క్రైస్తవుడే తెలిపారు.తాడేపల్లి, లోటస్ పాండేలలోని గోడలపై బైబిల్ సూక్తులే కనిపిస్తాయిని వెల్లడించారు. తిరుమల టీటీడీని రోడ్డుపై లాగొద్దు భూమనకు రమణ సూచించారు.  

వార్డెన్ చొరవ..హాస్టల్ విద్యార్థుల సంరక్షణకు భరోసా

  హాస్టల్ కు వచ్చామా..  అటెండెన్స్ వేసామా మెనూ ఇచ్చామా ఇందులో ఏమైనా మిగులుతాయా ..ఇంటికి వెళ్ళామా అనే ధోరణితో పని చేసే వార్డెన్లు చాలా చోట్ల కనపడుతుంటారు. అయితే ఈ  వార్డెన్ అందుకు భిన్నమైన ధోరణితో విద్యార్థుల పట్ల, విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ విద్యార్థుల పరిశుభ్రతకు ,ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ సొంత బిడ్డలకు ఎలా కేర్ తీసుకుంటారో అలా హాస్టల్ లో కూడా కేర్ తీసుకుంటూ సంరక్షణ చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో  సాంఘిక సంక్షేమ  హాస్టల్ లో ఈ వార్డెన్ (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) పనిచేస్తూ విద్యార్థుల సంరక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు హాస్టల్ భవనం 45 సంవత్సరాల క్రితం నిర్మించినది అయినా కూడా అందులో వార్డెన్ గుప్తా విద్యార్థులకు చేసిన ఏర్పాట్లు శభాష్  అనేలా ఉన్నాయి.ఆ హాస్టల్లో బెడ్ సీట్లు పెట్టుకోవడానికి దాత ద్వారా చెక్కతోచేసిన బీరువా ఏర్పాటు చేయించారు.పిల్లలు తేమతో కూడిన ప్లేటు పెట్టేలో పెట్టుకుంటే క్రిములుచేరడం, దుర్వాసన రావడం జరుగుతుందని ప్లేట్లు బయటే పెట్టుకునేందుకు ఒక స్టాండ్ ను ఏర్పాటు చేశారు. పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు తగిన మందులను సూచిస్తూ మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ టాబ్లెట్ అందుబాటులో ఉంచారు.అవసరమైనప్పుడు వారికి అందజేస్తారు. ఇంగ్లీష్ మందులే కాకుండా దగ్గుకు కరక్కాయ లాంటి ఆయుర్వేద గుణం కలిగిన వాటిని కూడా అందుబాటులో ఉంచారు. పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీ కూడా అందులో ఉంచి పుస్తకాలు సమకూర్చి పెట్టారు. గ్లాసులు, కప్పులు విద్యార్థి ఎవరిది వారు పెట్టుకునేలా స్టాండ్లు ఏర్పాటు చేశారు. స్టోర్ రూమ్ లో వస్తువులు పురుగులు ,చీమలు చేరకుండా బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విద్యార్థులను తన చేతనైనంత వరకు సొంత బిడ్డల్లా ఆలోచించి, వసతులు ఏర్పాటు చేసిన వార్డెన్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు. అయితే అన్నీ ఆయన బాగా చేస్తున్నా పిల్లలు తాగేందుకు సురక్షిత మంచినీరు ఆర్ఓ ప్లాంట్ లేకపోవడం దురదృష్టకరంగా చెప్పవచ్చు. సురక్షిత మంచి నీటి ప్లాంట్ అనేక సంవత్సరాలనుండి పని చేయక పోయినా  అధికారులు మారమ్మత్తు చేయకకపోవడం హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది.

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బెయిల్

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో జగన్ మోహన్‌ను రావును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష, రెండు షూరిటీ సంతకాలతో సమర్పించాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలతో పాటు హెచ్ సీఏ ఎన్నికల్లో 2016లో జరిగిన శ్రీచక్రా క్లబ్ ఫోర్జరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందని తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది.  గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.ఇటీవలే జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.   

ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు

  ఏపీలో ప్రతీ కుటుంబ సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు  అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఫ్యామ్లీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి.  ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. దీని కోసం ఫ్యామిలీ కార్డును తీసుకురండి. ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలి. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపర్చడంతో పాటు... పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  అంతే కాకుండా... కుటుంబంలో ఎంత మంది ఉంటే.. వారందరికీ ఆ కార్డును ఇస్తే.. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి.” అని సీఎం సూచించారు.ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉల్లి రైతులకు చంద్రబాబు తీపి కబురు

  ఘాటైన ఉల్లిపాయలు పండించే కర్షకులకు ఏపీ  సీఎం చంద్రబాబు చల్లని వార్త చెప్పారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో  ముఖ్యమంత్రి  తాజాగా  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. వెంటనే రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున .. అంటే కేజీ రూ.12కు ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు.  కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఉల్లికి రేటు వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతో పాటు ఆధునీకికరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని  సీఎం దిశానిర్దేశం చేశారు.

మత్తు కలిగించే దగ్గు మందు బాటిళ్లు పట్టివేత

    గంజాయి, డ్రగ్స్‌ లభించక పోవడంతో డ్రగ్స్‌ మత్తుకు అలవాటు పడిన  వ్యక్తులు నిషేధిత దగ్గు మందు టానిక్‌లను తాగి మత్తులో మునిగిపోతున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు, ఎస్సై రవి, సిబ్బంది కలిసి పక్కా సమాచారంతో సరూర్‌నగర్‌ కొత్తపేట ప్రాంతానికి చెందిన మూసం లక్ష్మణ్‌ అనే వ్యక్తిని రోడ్‌ నెంబరు 6 అష్టలక్ష్మీ టెంపుల్‌ మందమల్లమ్మ చౌరస్తా నుంచి 102 కోడిన్‌ పాస్పెట్‌ దగ్గుమందు బాటిళ్లను కొనుగోలు తీసుకొని బైక్‌పై వెళ్తుండగా  పట్టుకున్నారు. రూ.190 ఎంఆర్‌పీ ధర కలిగిన ఈ దగ్గు మందు బాటిల్స్‌ను లక్ష్మాణ్‌ తన  ఇంట్లో పెట్టుకొని రూ. 350 ఒక బాటిల్‌ను అమ్మకాలు చేపడుతున్నట్లు  విచారణలో వెల్లడయ్యింది. కోడిన్‌ పాస్పెట్‌ బాటిళ్లను డ్రగ్స్‌ ఆధారిటీ గతంలో నిషేధించారు. దగ్గు మందును డాక్టర్‌ చీటితో మాత్రమే అమ్మకాలు జరపాలి. కాని కొందరు అక్రమంగా దగ్గు మందును తయారు చేస్తూ ఎవ్వరికి అనుమానం  రాకుండా అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో మత్తు కలిగించే గంజాయి ప్యాకెట్‌ ధర రూ. 500 ఉంది. ఒక గ్రాము ఎండిఎంఎ డ్రగ్‌ విలువ రూ. 5000 వేలు ఉంది.  అంత డబ్బుతో  కొనుగోలు చేయలేని వారు, మత్తుకు బానిసగా మారిన వారు ఇలా  మార్కెట్‌ అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న దగ్గు మందును  వాడి మత్తులో మునిగి పోతున్నారు.ఇలాంటి నిషేధిత మత్తు మందులను అమ్మకాలు జరుపుతున్న మెడికల్‌  హల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌ సీఐ బాలరాజు డ్రగ్స్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు.ఇలాంటి నిషేదిత కోడిన్‌ పాస్పెట్‌ మందును పట్టుకున్న సిఐ, సిబ్బందిని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌. కిషన్‌, ఏఈఎస్‌ జీవన్ కిరణ్  అభినందించారు.

హైదరాబాద్‌కి బీచ్ రాబోతోంది

  హైదరాబాద్‌లో తొలి ఆర్టిఫీషియల్ బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్ గూడ సమీపంలో నిర్మించనున్నారు. బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో 225 కోట్ల ప్రాజెక్టులో వ్యయంతో దీని నిర్మాణం డిసెంబర్ 2025లో ప్రారంభమవుతుంది. బీచ్‌సైడ్ ఫీల్ రావడానికి..సహజ సిద్ధమైన సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది.  ప్రాజెక్టులో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్ళు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు & ఫుడ్ కోర్టులు ఉంటాయి. తేలియాడే విల్లాలు మరియు స్టార్-కేటగిరీ హోటళ్ళు.. బంగీతో సహా సాహస క్రీడలు ఉంటాయి. జంపింగ్, సెయిలింగ్, స్కేటింగ్ మరియు శీతాకాలపు ఆటలు.. పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆట స్థలాలు వినోదం మరియు విశ్రాంతి సౌకర్యాలు కల్పించనున్నారు. థియేటర్లు, ఫుడ్ కోర్టులు, అలంకార ఫౌంటెన్లు మరియు ఆధునిక వేవ్ పూల్ ఉన్నాయి.  

ఫేక్ వీడియోతో అమరావతిపై మరోసారి విషం కక్కిన వైసీపీ

వైసీపీ ఫేక్ ప్రచారం విషయంలో డాక్టరేట్ సాధించిందా అనిపించక మానదు. పదే పదే ఫేక్ ప్రాపగాండాతో ప్రజలను తప్పుదోవపట్టించాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమౌతూ వస్తున్నాయి. అయినా వైసీపీ తీరు మారడం లేదు. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పలు సార్లు ఇలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేసి విఫలమైన వైసీపీ తాజాగా మరో సారి అదే విషప్రచారానికి తెగబడింది. ఇప్పటికే అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ నకిలీ వీడియోలను విడుదల చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఇప్పుడు తాజాగా మరో ఫేక్ వీడియోతో అమరావతిలో దళితులకు అవమానం జరుగుతోంది. వారిపై దాడులు జరుగుతున్నాయంటూ జనాలను నమ్మించడానికి ప్రయత్నించింది. వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ నకిలీ వీడియోలో ఒక దళిత మహిళను అవమానానికి గురి చేస్తున్నట్లుగా ఉంది. ఒకింత నిశితంగా పరిశీలిస్తే అది ఫేక్ వీడియో అని ఇట్టే తేలిపోతుంది. ఎందుకంటే ఆ వీడియో తమిళ టెక్స్ట్ స్పష్టంగా కనిపి స్తున్నది. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆ వీడియో అమరావతికి సంబంధించినదని చెప్పుకుంటోంది. అలా చెప్పడం ద్వారా అమరావతిలో దళితులకు అన్యాయం జరుగుతోందని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయనీ చాటడం ద్వారా కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే.. అమరావతికి, దళితులకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారానికి అంతం అన్నదే ఉండదా అనిపించక మానదు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం కూటమి వర్గాలు.. ఈ ఫేక్ వీడియో పోస్టు చేసిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాయి.   

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే

  వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి  హెలికాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియాల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం అని చెప్పారు.  ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.  మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావులను ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామ, అల్లుడు అతి తెలివితేటలతో ఒకరు ఆణిముత్యాం మరొకరు స్వాతిముత్యం అని అన్నారు. కాళేశ్వరం ఘోష్ నివేదికపై శాసన సభల్లో చర్చకు పెడుతామని, మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు.  మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.

హమ్ తుమ్ ఏక్.. క‌మ‌లంమే.. బంధ్ హే!

  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతలను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. దీంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా వీరిద్దరు తెలంగాణ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా ఉన్నా విషయం తెలిసిందే.  ఈ లెక్క‌న బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య బంధం ఎట్ట‌కేల‌కు ఉన్న‌ట్టే ఎస్టాబ్లిష్ అయ్యిందా!? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక‌టేన‌నే  బీజేపీ నేత బండి సంజ‌య్, బీజేపీ కాంగ్రెస్ ఒక‌టేన‌నే కేటీఆర్.. కామెంట్ల వ‌ర్షం అంతా తుస్సేనా? ఈ ఇద్ద‌రు ఎదురు ప‌డ్డ‌ప్పుడు ఇలాంటి సన్నివేశం క‌నీసం ఊహించ‌లేక పోయారు చాలా మంది. ఇంత  స‌ర‌దాగా ఒక‌రికొక‌రు ప‌ల‌క‌రించుకుని న‌వ్వుకోవ‌డం ఏంటి? దీన్నెలా అర్ధం చేసుకోవాలి? చాలా మందికి అంతు చిక్క‌ని ఫ‌జిల్లా మారింది. గ‌తంలో ఇదే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే అంశం మీద సీఎం రమేష్ అన్న మాట‌ల‌కు ఇది తార్కాణ‌మా? బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెడుతున్న కేసుల నుంచి త‌ప్పించుకోడానికి బీఆర్ఎస్ ని బీజేపీలో క‌లిపేస్తార‌న్న మాట నిజ‌మ‌వుతుంద‌నుకోవాలా? అని చూస్తే.. అంత వ‌ర‌కూ వ‌స్తుందో రాదో తెలీదు కానీ కొంత వ‌ర‌కూ అయితే... ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయ‌గ‌లిగారు కేటీఆర్. అదెలాంటిదంటే, త‌మ‌కు కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం అండ పుష్క‌లంగా ఉంది. మీ కేసులు, క‌మిష‌న్ల బెదిరింపుల‌కు భ‌య‌ప‌డం అన్న కోణంలో కొంత కేటీఆర్ ఈ దృశ్యం ద్వారా చెప్పాల‌ని చూసిన‌ట్టుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇలాంటి ఘ‌ట‌న‌లు స‌ర్వ‌సాధార‌ణంగా  జ‌రుగుతూనే ఉంటాయి. మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ ఎదురు ప‌డ్డ‌ప్పుడు ఉండి ఎమ్మెల్యే, ఏపీ  డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌రాజు ఎంతో స‌ర‌దాగా ప‌ల‌క‌రించారు. జ‌గ‌న్ పై తాను చాకిరేవు పెట్టి ఉతికి ఆరేసిన‌దేదీ ఆయ‌న పెద్ద‌గా తీస్కోలేదు. ఇద్ద‌రు కూడా  రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌ర్వ సాధార‌ణం అన్న కోణంలో చేతులు క‌లుపుకుని వెళ్లిపోయారు. ఆ మాట‌కొస్తే అసెంబ్లీ లోప‌ల గ‌ల్లా ప‌ట్టుకుని కొట్టుకుంటారేమో అన్న కోణంలో క‌నిపించే-  అధికార ప్ర‌తిప‌క్ష  పార్టీల నాయ‌కులు బ‌య‌ట‌ క‌ల‌సి జోకులేసుకుని హ్యాపీగా మాట్లాడుకుని వెళ్లిపోతుంటారు. అచ్చం సినిమా  హీరోల్లా.. ఇక్క‌డ జ‌న‌మే వారి పేరు చేప్పుకుని వీరు- వీరి  పేరు చెప్పుకుని వారు త‌న్నుకులాడుకుంటారు. కానీ వాళ్లు వాళ్లు లోప‌ల అలాయ్ బ‌లాయే.  రాజాసింగ్ కిష‌న్ రెడ్డి మీద చేసిన మెయిన్ కామెంట్ ఇదేగా? ఎవ‌రు ప‌వ‌ర్ లో ఉంటే కిష‌న్ వారితో కుమ్మ‌క్క‌య్యి కావ‌ల్సిన ప‌నులు చేసుకుంటాడ‌ని. అలాంటి కామెంట్ చేసిన రాజాసింగ్ ప్రెజంట్ బ‌య‌ట ఉన్నారు. అదే కిష‌న్ తాను పార్టీలో చ‌క్రం తిప్పుతూనే ఉన్నారు. అదే ఏదైనా ఆల్ పార్టీ మీటింగుల్లాంటివి పెట్టిన‌పుడు మాత్రం.. త‌న‌కు టైమే లేద‌న్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి ఆపై బ‌య‌ట జ‌నానికి తానొక నిఖార్జైన క‌మ‌లం పార్టీ  నాయ‌కుడ‌న్న క‌ల‌రింగ్ ఇస్తుంటార‌ని అంటారు రాజాసింగ్.  ప్ర‌స్తుతం బండి- కేటీఆర్ క‌ల‌యిక అనే ఈ దృశ్యంలో స్ప‌ష్టంగా ఆ ఫేసుల్లో తొణికిస‌లాడిన ప్రేమాభిమానాల‌ను బేరీజు వేస్తే.. ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రికి ఉండాల్సిన దానిక‌న్నా మించి ఏదో ఉంది అన్న ఇంటిమ‌సీ అయితే బాగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. మ‌రి చూడాలి దీనిపై కాంగ్రెస్ లీడ‌ర్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

పెద్దిరెడ్డి కుటుంబాన్ని వైసీపీ వదిలేసిందా?

వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ జగన్ సర్కార్ లో అప్రకటిత నంబర్ 2 పొజిషన్ ను ఎంజాయ్ చేసిన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పార్టీలో ఏకాకి అయిపోయారా అంటే పరిస్థితులను బట్టి చూస్తే ఔననే అనిపించక మానదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీలోనూ, జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డిది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి  సొంత జిల్లా  చిత్తూరు కావడంతో చిత్తూరు జిల్లాపై వైసీపీ ఆధిపత్యం కోసం జగన్ కూడా పెద్దిరెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.  చిత్తూరు ఎంత చంద్రబాబు సొంత జిల్లా అయినా.. తెలుగుదేశం పార్టీకి ఆ జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం గతంలో ఎన్నడూ లేదు. 2014 ఎన్నికలను తీసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా చిత్తూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ 14 అసెంబ్లీ  స్థానాలకు  గాను కేవలం ఆరింటిలోనే విజయం సాధించగలిగింది. అదే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పం వినా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పరాజయం పాలైంది. అలాగే జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలలోనూ ఓడిపోయింది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితిపూర్తిగా తిరగబడింది. ఆ ఎన్నికలలో  వైసీపీ కేవలం  రెండంటే రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.  వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకుల బలం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి వంటి బలమైన నాయకులు ఉన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో 2019, 2024  మధ్యా కాలంలో  జిల్లాలో పార్టీ బలహీనపడటానికి వీరే కారకులయ్యారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణి కారణంగా పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. ఇక 2024లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసి.. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థతికి పతనమయ్యాకా.. చిత్తూరులో వైసీపీ ఉనికి మాత్రంగా మిగిలిపోయిందని చెపవచ్చు. సరే ఇదంతా పక్కన పెట్టి విషయానికి వస్తే.. మద్యం కుంభకోణంలో ఇరుక్కుని మిథున్ రెడ్డి జైలు పాలైన తరువాత జిల్లాకు చెందిన నాయకులెవరూ ఇంత వరకూ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా  ఉన్న ఆయన కోసం తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నినా ఎవరూ వెళ్లి పరామర్శించి పలకరించిన పాపాన పోలేదు. ఒకప్పుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టిన రోజా కూడా ఆ తరువాత కాలంలో పెద్దిరెడ్డితో విభేదాల కారణంగా మిథున్ రెడ్డిని పరామర్శించే ఆలోచన కూడా చేయడం లేదంటారు. ఇక జిల్లాలో మరో బలమైన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా మద్యం కుంభకోణంలో జైలు పాలైన సంగతి తెలిసిందే.  ఇక జిల్లాలోని ఇతర నాయకుల పరిస్థితి చూస్తుంటే.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి లోలోన ఆనందిస్తున్నారా అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టునకు వ్యతిరేకంగా తొలి రోజులలో జరిగిన నామమాత్రపు నిరసనలు వినా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు అసలాయనను పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు.  ఇక మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయానికి వస్తే ఆయన తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో తనకు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదన్న ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిట్ ఆయనను విచారించినప్పుడు కూడా ఆయన మద్యం కుంభకోణం విషయంలో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ, ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టి వ్యవహారమంతా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలే నడిపారని చెప్పినట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇక జిల్లాకే చెందిన మరో నాయకుడు భూమన కరుణాకరరెడ్డి విషయానికి వస్తే ఆయన తిరుపతి, టీటీడీ విషయాలు తప్ప మరేమీ పట్టించుకునే పరిస్థితులు లేవు.   ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గీయులు రోజా, భూమనల అరెస్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర కుంభకోణంలో మాజీ మంత్రి రోజా, టీడీఆర్ కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలు త్వరలోనే అరెస్టు కాకతప్పదని వైసీపీ వర్గాలే చెబుతుండటం.. చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎంతగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్ధమౌతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే.. మద్యం కుంభకోణం తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో అసలు ఆ కుంభకోణంలో అరెస్టైన వారిని కనీసం పరామర్శించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఎలా చూసినా వైసీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీని వదిలేసినట్లే కనిపిస్తోందని చెబుతున్నారు.