తెలుగు రాష్ట్రాలు.. ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక కథ

నిజానికి వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఉపరాష్ట్రపతి పదవికి ఛాన్సున్నది బి. సుదర్శన్ రెడ్డి విషయంలోనే. అయితే ఇండియా కూటమి అభ్యర్ధి అయిన సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమెంత? అన్నది అటుంచితే.. ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి కాగా.. త్వరలో తమిళనాడు ఎన్నిక జరుగుతుండటంతో.. కాంగ్రెస్ సైతం ఒక తమిళ వ్యక్తినే ఎంపిక చేయాలనుకుంది. తిరుచ్చి శివ అనే డీఎంకే నేత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇస్రో సైంటిస్టు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. కానీ చివరి నిమిషంలో రాజకీయాలకు సంబంధం లేని బి. సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి చంద్రబాబుకు పరిచయముంది. అందుకే జస్టిస్  తాను రాజకీయ పార్టీలకు కొత్తగానీ, రాజకీయాలకు కాదన్నారు. అలాంటి పరిచయం ప్రస్తుతం ఉన్న ఒకానొక సిట్యువేషన్ లో సుదర్శనరెడ్డికి ఉపయోగ పడుతుందా? అని చూస్తే అదేమంత తేలిగ్గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రాధాకృష్ణన్ కు తమ బేషరతు మద్దతు ప్రకటించేశాయి. ఇక సాటి రెడ్డి కులస్తుడైన సుదర్శన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఎలాంటి అభిమానముందో తెలీదు.  ఒక వేళ అభిమానమున్నా జగన్ మరో ఆలోచన లేకుండా బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ కే మద్దతు పలుకుతారన్న విశ్లేషకుల అభిప్రాయాలను అనుగుణంగానే వైసీపీ సభ్యులు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పీకలోతు కేసుల గొడవల్లో ఉన్నారు. అందుకే తనకున్న లోక్ సభ, రాజ్య సభ సభ్యులు 11 మంది కాగా.. ఈ మొత్తం అటు వైపునకు మళ్లించేశారు. అలా మళ్లించకుంటే జైలుకు వెళ్లక తప్పదన్న భయం ఆయనది.  దీంతో ఎంత రెడ్డాభిమానం ఉన్నా గానీ జగన్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి  మద్దతుగా నిలవడం లేదు సరికదా..   వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు.. కట్ చేస్తే బీఆర్ఎస్ సీనేంటో చూస్తే.. బీజేపీ|బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మాటకు ఆస్కారమిచ్చేలా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అదేంటో చూస్తే ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇస్తారో వారికే తమ మద్ధతు అన్నారు. నిజానికి ఎరువులను ఇచ్చే అధికారం ఉన్నది కేంద్రంలోని బీజేపీకి. దీన్నిబట్టీ చూస్తే వారి మద్ధతు బీజేపీకే అని చెప్పాల్సి ఉంటుంది.  మొన్నటికి మొన్న సీఎం రమేష్ మాటలను అనుసరించి చెబితే ఇప్పటికే తమపై కేసుల్లేకుండా చేయడంలో భాగంగా.. బీజేపీలో కలిసి పోవడానికైనా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసి అయిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమెంతో ఈ ఎరువుల మెలికను బట్టిఇట్టే తెలిసిపోతోంది.  కాబట్టి.. తెలుగు సెంటిమెంటు కన్నా.. ఇక్కడ ఎవరి అవసరాలు, వారి వారి కేసుల వ్యవహారాలపైనే ఎక్కువగా ఈ ఎన్నిక ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదండీ మన తెలుగు వారి ఉప రాష్ట్రపతి ఎన్నిక కథ, కమామిషు!

జగన్, కేటీఆర్ కటీఫేనా?

తెలుగుదేశం పార్టీపై గుడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న అక్కసు  బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్  రాజకీయ బంధం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం, 2024 ఎన్నికలలో వైసీపీ పతనంతో బట్టబయలైంది ఆ ఓటముల తరువాత వైసీపీ అధినేత ప్యాలెస్ రాజకీయాలకు, బీఆర్ఎస్  ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ నుంచీ ఇరుపార్టీల బంధం తెగిపోకుండా కొనసాగించే బాద్యతను బీఆర్ఎస్ అధినేత కుమారుడు, ఆయన రాజకీయవారసుడు, అలాగే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాన వేసుకున్నారు. సొంత చెల్లెలితో విభేదాల విషయంలోనూ జగన్, కేటీఆర్ మధ్య సారూప్యాలు ఉన్నాయి.  ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత తీవ్రంగా విభేదిస్తున్నారు.  ఏ రకంగా చూసినా జగన్, కేటీఆర్   బాట ఒకటే అన్నట్లుగా ఇంత కాలం సాగింది.  ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆరంభించిన రాజకీయ యుద్ధం అనుంగు మిత్రులు జగన్, కేటీఆర్ దారులు వేరు చేసింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటే చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతు ప్రకటించారు. రాహుల్ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తూ.. తాను మరికొన్ని విమర్శలకు ఎన్నికల సంఘంపై సంధించారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా కూడా విమర్శలు గుప్పించారు.  ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.  భారత ఎన్నికల సంఘం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఘోర వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలను మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించిన ఈసీ అధికారుల మాటలు విన్న తరవాత సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయనీ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం నిప్పులు కక్కే కేటీఆర్ ఒక్క సారిగా రాహుల్ గాంధీకి వంత పాడుతూ.. బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ఓటు చోరీ ఆరోపణలను సమర్ధించలేదు, సరి కదా తమ పార్టీకి పులివెందులలో జరిగిన అన్యాయంపై రాహుల్ పన్నెత్తు మాట మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా   టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో జగన్, కేటీర్ మధ్య ఇంత కాలం ఉన్న స్నేహబంధం తెగిపోయిందా? ఇరువురూ కటీఫ్ చెప్పేసుకున్నట్లేనా అంటూ పోలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ ఆరంభమైంది.  

ఢిల్లీ సీఎంకు జడ్ కేటగరి భద్రత

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండించాయి. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సీఎంపై ఆమె  అధికారిక నివాసంలోనే జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించింది. రేఖాగుప్తాకు జడ్ కేటగరి భద్రత లక్పించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించడమే తరువాయి, అలా ఉత్తర్వులు జారీ చేసింది.   దీంతో గురువారం ఉదయానికే  సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. ఢిల్లీ  పోలీసుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను స్వీకరించాయి.  సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు.  

ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి.. ఇంతకీ ఆ నిందితుడు ఎవరంటే?

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో జన్ సున్‌వాయ్ నిర్వహిస్తున్న సమయంలో  ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి  కొన్ని పేపర్లను ఆమెకు అందించారు. అంతలోనే  గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఊహించని పరిణామంతో.. సీఎం రేఖా గుప్తా షాక్‌కి గురయ్యారు.  ముఖ్యమంత్రిపై దాడి చేసిన నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌ భాయ్‌ ఖిమ్జీ భాయ్‌ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోనూ అతడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు, దాడికి గల కారణాలు తెలుసుకొనే పనిలో ఉన్నారు. అయితే,  సీఎంపై రాజేశ్ ఎందుకు దాడి చేశాడనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతనిడి రిలీజ్ చేసేందుకు.. సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం,  ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తన కుమారుడు, ఢిల్లీ సీఎంని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. అతడు  జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే,  అతడి మానసిక పరిస్థితి బాగా లేదనీ, గతంలోనూ ఓ సారి ఢిల్లీకి వెళ్లి వచ్చాడని పోలీసులకు వివరించినట్లు సమాచారం. నిందితుడు రాజేశ్‌పై.. గుజరాత్‌లో తొమ్మిది కేసులున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు, స్థానికులపై దాడి, మద్యం మత్తులో దుష్ప్రవర్తనకు సంబంధించి.. ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. జైల్లో ఉన్న బంధువు విడుదల కోసమే.. సీఎంని కలిసేందుకు వెళ్లాడనే వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని గుజరాత్ పోలీసులు గుర్తించినట్లు తేలింది. సీఎం రేఖా గుప్తాకు కొన్ని పేపర్లు అందించిన తర్వాత.. గట్టిగా అరుస్తూ దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనని.. బీజేపీ సహా విపక్ష పార్టీలు ఖండించాయి. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతను దేనికోసం సీఎంపై దాడికి పాల్పడ్డాడు అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

అమెరికా సిటిజన్‌కి పుతిన్ రేర్ గిఫ్ట్

అలాస్కా సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా సిటిజన్ కు  ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా సిటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ ‌నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అతడు తన బైక్ గురించి   చెప్పుకొచ్చారు. అది తనకు చాలా చాలా ఇష్టమైన బైక్ అన్నాడు. అయితే ఇప్పుడు పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడి భాగాలు   అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు. కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇది నజమేనా? నమ్మలేకపోతున్నా అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసి  అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్‌ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక దళంలో  పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా?  మన కరెన్సీలో అక్షరాలా  19 లక్షల రూపాయలు. 

దేశ రక్షణ శక్తిని బలపర్చేలా ఎయిర్‌ఫోర్స్ వ్యూహాలు.. అమ్ములపొదిలోకి లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్‌

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వీలైనన్ని లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి చేర్చేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుపుతోంది. ఆ దిశగా దేశ రక్షణ శక్తిని మరింత బలపరిచేలా.. 62 వేల కోట్లతో.. 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ అడ్వాన్స్‌డ్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. తేజస్ మార్క్-1ఏ స్వదేశీ యుద్ధ విమానాలకు దక్కిన రెండో ఆర్డర్ ఇది.  2021లో  48 వేల కోట్లతో 83 యుద్ధ విమానాల సమీకరణకు పచ్చజెండా ఊపింది.   కొత్తగా 97 జెట్‌లతో కలిపి వీటి సంఖ్య 180కి చేరనుంది.  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చాలా కాలంగా సేవలందిస్తున్న.. పాత మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని తేజస్ మార్క్ 1ఏ భర్తీ చేయనుంది. మిగ్-21 విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతుండటంతో, వాటి స్థానంలో.. అడ్వాన్స్‌డ్ తేజస్ యుద్ధ విమానాలు రావడం వల్ల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత శక్తిమంతంగా, సురక్షితంగా మారుతుంది. తేజస్ ఫైటర్ జెట్స్‌ వల్ల ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ కీలకంగా మారనుంది. తేజస్ మార్క్ 1ఎ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ఈ ఫైటర్ జెట్స్ భారత వైమానిక దళంలోకి చేరడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో ఇండియా అభివృద్ధి సాధించిందనే మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అంతేకాదు.. విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం తగ్గుతుంది.  తేజస్ మార్క్ 1ఎ  విమానాల్లో అత్యంత అధునాతన టెక్నాలజీని వాడారు. ఇందులో ఉన్న యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే.. రాడార్ శత్రువుల కదలికల్ని కచ్చితంగా గుర్తించగలదు. ఇందులోని ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్ శత్రు రాడార్లను జామ్ చేసేందుకు, ఆయుధాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 9 రకాల రాకెట్లు, మిసైళ్లు, బాంబులను ఫైర్ చేయగలదు. ఇజ్రాయెల్ డెర్బీ మిసైళ్లతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణిని కూడా చాలా ఈజీగా ప్రయోగించగలదు. ప్రస్తుతం, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్ల కొరత ఎదుర్కొంటోంది. ఈ తేజస్ విమానాల చేరికతో ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యతో పాటు పోరాట సామర్థ్యం కూడా పెరగనుంది. తేజస్ యుద్ధ విమానాల తయారీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రొడక్షన్ ప్లాంట్‌కు రాబోయే కొన్నేళ్ల పాటు చేతి నిండా పని దొరుకుతుంది. ఇక,  దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు, ఎమ్ఎస్ఎమ్ఈలు, స్టార్ట ప్స్‌కు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఈ డీల్‌తో  భవిష్యత్తులో తేజస్ మార్క్-2 లాంటి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లని తయారుచేసే ప్రాజెక్టులకు రూట్ క్లియర్ చేస్తుంది.

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్!?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో కీలక నిందితుడు, ప్రస్తుతం అరెస్టై విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. అక్రమ మద్యం వ్యాపారంతో భారీగా కూడబెట్టిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలిన నేపథ్యంలో ఆయన ఆస్తులను సీజ్ చేయాలని ఏపీ సర్కార్ అదేశించింది. దీంతో సిట్ బెజవాడ ఏసీబీ కోర్టులో ఆస్తుల జప్తునకు పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతోంది.  దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే, 3 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను జప్తు చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నది.   

అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

హైదరాబాద్ లో ఘోర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్నాటక గుల్బర్గా జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ మక్క మహబూబ్ పేటలో నివాసం ఉంటున్న కుటుంబం గురువారం (ఆగస్టు 21) అనుమానాస్పద స్థితిలో తమ నివాసంలోనే మరణించారు. మృతులను లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవిత, అప్పు గా గుర్తించారు. వీరిలో అప్పు రెండేళ్ల చిన్నారి కావడం మహా విషాదం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని హత్య చేసి అనంతరం మిగిలిన నలుగురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఘటనా స్థలంలో ఎటువంటి లేఖా లభించలేదని తెలిపారు.  

ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదరింపు లేఖ

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డికి బెదిరింపు లేఖ క‌ల‌క‌లం సృష్టించింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ఈ నెల 17న  నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి నివాసానికి వచ్చి అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ లేఖలో  రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ బెదరింపు ఉంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బదరింపు లేఖ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు.  ఈ బెదరింపు లేఖకు సంబంధించి అల్లూరు మండలం ఇస్క‌పాళెంకు చెందిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఎంపీ నివాసంవద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటం, అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిస్తుండటంతో అతడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదరింపు లేఖ రావడం వాస్తవమేనని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. 

పులివెందులలో మరో ఎలక్షన్ వార్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడ్డపై  ఆయనకు, ఆయన పార్టీ వైసీపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక తరువాత అదే పులివెందులలో మరో ఎన్నికల యుద్ధానికి తెర లేచింది.  పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నిక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినది కాగా.. ఇప్పుడు జరగబోతున్నది పులివెందుల పట్టణంలోని మునిసిపల్ కౌన్సిల్ స్థానానికి. నిజానికి ఒక కౌన్సిలర్ ను ఎన్నుకోవడానికి జరిగే ఎన్నికకు పెద్దగా ప్రాథాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ అది పులివెందుల.. జగన్ కోట అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి పులివెందుల మునిసి పాలిటీలో వార్డు కౌన్సిలర్ స్థానానికి ఎన్నిక జరగనుంది. మరి పులివెందుల జడ్పీటీసీ స్థానినికి జరిగిన ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేసి మంచి జోరుమీద ఉన్న తెలుగుదేశం.. పులివెందుల పట్నంలో కూడా వైసీపీకి ఓటమి చూపి సత్తా చాటాలని సహజంగానే భావిస్తుంది. అలాగే జడ్పీటీసీ ఎన్నికలో ఓటమిని పరాభవాన్ని.. పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగనున్న ఎన్నికలో విజయం సాధించి సమాధానం చెప్పాలన్న పట్టుదలతో వైసీపీలో కనిపిస్తోంది.  దీంతో పులివెందుల మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ స్థానానికి జరగబోయే ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉండటం సహజమే. ఒక్క పులివెందులలోనే కాదు.. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీలో, కార్పొరేషన్ లలో ఎన్నికలు జరిగే  అవకాశం ఉంది.  ఇవీ ఉప ఎన్నికలే. జిల్లాలో   కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరణించి ఖాళీ అయిన స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో సంప్రదాయాన్ని అనసరించి ఈయా స్థానాలలో పోటీకి అభ్యర్థులను నిలపకుండా తెలుగుదేశం దూరంగా ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.  ఉమ్మడి కడప జిల్లాలో ఖాళీగా ఉన్న కార్పొరేటర్ , కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయ్యింది.  ఎన్నికలు జరుగనున్న స్థానాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. కడప నగరంలోని 22 ,48 డివిజన్ ల్లో, మైదుకూరులో  5 వ వార్డు, జమ్మల మడుగు లో 4 వ వార్డు, పులివెందుల లో 23 వ వార్డు, బద్వేలులో 11,30 వార్డుల్లో, కమలాపురం లో 8,20 వార్డుల్లో, రాయచోటిలో 19,30 వార్డుల్లో   ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మరోసారి కడప జిల్లా, మరీ ముఖ్యంగా పులివెందుల ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

చంద్రబాబుతో పని చేయడం అంత వీజీ కాదు.. ఈ మాటన్నదెవరో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత గురించి, ప్రగతి కాముకత గురించి ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైబరాబాద్ సిటీ, అమరావతి నిర్మాణాలే అందుకు ప్రత్యక్ష తార్కానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన  దార్మనికత, కృషి, శ్రమ, పట్టుదల కారణంగానే హైదరాబాద్ బెంగళూరు, చెన్నైలను అధిగమించి మరీ ఐటీ హబ్ గా రూపుదిద్దుకుంది. ఐఎస్ బీహెచ్ వంటి సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. బిల్ క్లింటన్ ముందే ఐటీ ప్రోగ్రస్, అభివృద్ధి ఎలా సాధించాలి అన్న విషయాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగల సత్తా, ధైర్యం చంద్రబాబు సొంతం. ఇది ఎవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలలో పదే పదే రుజువైన వాస్తవం.  అయితే తన తండ్రితో కలిసి పని చేయడం చాలా చాలా కష్టం అంటున్నారు నారా లోకేష్. తండ్రి స్థాయిని చేరుకునే సత్తా ఉన్న నాయకుడిగా నారా లోకేష్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కొండొకచో తండ్రిని మించిన తనయుడని కూడా పార్టీ శ్రేణులూ, నాయకులు, పరిశీలకులూ కూడా సోదాహరణంగా వివరిస్తున్నారు. అటువంటి లోకేష్ ఇటీవల ఒక సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం అని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆయన వద్ద పని చేయడం, ఆయన నుంచి నేర్చుకోవడం మాత్రం గొప్ప అదృష్టమన్నారు. ఇక చంద్రబాబుతో కలిసి పని చేయడం ఎందుకు కష్టమో కూడా లోకేష్ వివరించారు. ఆయనలా పంక్చువల్ గా (సమయపాలన) ఉండటం ఎవరికైనా సరే కష్ట సాధ్యమేనన్నారు.  ఇక ఆయన ఉదయం పది గంటలకు ఒక పని అప్ప చెబుతారనీ, పావుగంటలోనే వచ్చి ఆ పని ఎంతవరకూ వచ్చిందంటూ పీకలమీద కుర్చుంటారని లోకేష్ చమత్కరించారు.  ఆయనతో కలిసి పని చేయాలంటే ఆయన వేగం అందుకోవాల్సిందేనన్నారు.   చంద్రబాబు రెండు ఐకానిక్ నగరాలను అభివృద్ధి చేసే గొప్ప అవకాశం పొందిన నాయకుడన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ కూడా ఇటువంటి అవకాశం లభించిందని తాను అనుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కేలా సైబరాబాద్ నగరాన్ని నిర్మించి చూపారనీ, సైబరాబాద్ తో తెలంగాణ ముఖచిత్రమే మారిపోయిందని లోకేష్ అన్నారు. ఇక ఇప్పుడు ప్రపంచస్థాయి రాజధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తున్నారని పేర్కొన్నారు.  చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోనే అమరావతికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు తరలి వస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు.  

27 రోజులలో శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని బుధవారం(ఆగస్టు 20)  అధికారులు లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు కానుకలు నగదు రూపంలో 4 కోట్ల 51 లక్షల 62 వేల 522 రూపాయల వచ్చాయని ఆలయ ఈవో  శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 164.500 గ్రాముల బంగారం, 5.840 కేజీల వెండి వస్తువులు కూడా మల్లన్నకు కానుకలుగా అందాయని వివరించారు. ఇవే కాకుండా..   598 అమెరికా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, పది ఇంగ్లండ్‌ పౌండ్స్, 100 సింగపూర్ డాలర్లు, 100 ఈరోస్, 115 సౌదీ అరేబియా రియాల్స్, 102 కత్తార్ రియాల్స్, 300 ఒమన్‌ బైసా, ఒకటి కువైట్‌ దినార్‌ కూడా మల్లన్న సమేత భ్రమరాంబికా దేవికి  భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారని తెలిపారు.  పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు,  నిఘా నేత్రాల పర్యవేక్షణలో చంద్రావతికల్యాణ మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు శివసేవకుల సహాయంతో ఈ లెక్కింపు లెక్కింపు జరిగినట్లు తెలిపారు.    

మహోగ్రరూపం దాల్చిన గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న వానలకు గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం (ఆగస్టు 21)  ఉదయానికి గోదావరి నీటి మట్టం 50.8 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద కూడా వరదగోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కూడా 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల  ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.   ఇలా ఉండగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. కాళేశ్వరం సరస్వతీ ఘట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ణాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ గరిష్ఠ ప్రవాహం 13.460 మీట్లకు కాగా ప్రస్తత పప్రవాహం 12.220 మీటర్లుగా ఉంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరం వద్ద ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయించారు. అలాగే ములుగు జిల్లా  రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4.45 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం భక్త జనసందోహంతో కిటకిటలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు తిరమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 21) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (ఆగస్టు 20) శ్రీవారిని మొత్తం 75 వేల 688 మంది దర్శించుకున్నారు. వారిలో 29 వేల 99 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 45 లక్షల రూపాయలు వచ్చింది. 

కేంద్ర వ్యవసాయ మంత్రి జేపీ నడ్డాట.. వైసీపీ ఎంపీ అజ్ణానానికి ఇంత కంటే ఆధారం కావాలా?

వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలన్న అత్యుత్సాహంతో తప్పులో కాలేశారు. తన అజ్ణానాన్నా తానే బయటపెట్టుకున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ కు, తెలుగుదేశం శ్రేణుల ఎద్దేవాలకు గురౌతున్నారు. ఎంపి అయి ఉండి కూడా కేంద్రంలో ఏ మంత్రిది ఏ శాఖ అన్నది కూడా అవగాహన లేదని ఎంపీ తన విమర్శలతో తనను తానే పలుచన చేసుకున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ వైసీపీ ఎంపి మద్దిల గురుమూర్తి పెట్టిన ఒక పోస్టు ఎంపి అజ్ణానాన్ని బట్టబయలు చేయడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేసింది.   ఆంధ్రప్రదేశ్ లో యూరిగా కొరత కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేసిన వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడితో ఆగకుండా.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతుల ఇబ్బందులను తాను స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి  జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లాననీ, ఆయన సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారనీ పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఆయన అవగాహనారాహిత్యం, అజ్ణానం ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. ఏలా అంటే జేపీ నడ్డా వ్యవసాయ మంత్రి కాదు. ఆయన నిర్వహిస్తున్న శాఖ కేంద్ర రసాయనాలు, ఎరువులు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ గురుమూర్తిని నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు అయితే అసలు గురుమూర్తి నిజంగా కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర సమస్య గురించి ప్రస్తావించారా? అలా ప్రస్తావించి ఉంటే తాను ఏ శాఖ మంత్రిని కలిశారో కూడా అవగాహన లేకుండానే కలిశారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఈత సరదాకు ఆరుగురు చిన్నారులు బలి

  సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు మృత్యువు వడిలోకి చేరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి 6 గురు విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. స్కూల్ వదిలిన తరువాత సరదాగా ఈతకు వెళ్దామని ఐదవ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఊరికి దగ్గరలో ఉన్ననీటికుంటలో ఈతకువెళ్ళారు. వెళ్లిన ఏడుగురు విద్యార్థులుఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా ఒక విద్యార్థి ఒడ్డున నిలబడ్డాడు.  నీటికుంటలో ఆరుగురు విద్యార్థులు మునిగి పోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ఊరి పెద్దలకు విషయం తెలిపాడు. గ్రామ పెద్దలంతా హుటాహుటిన కుంట దగ్గరకు వెళ్లారు. వారంతా వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. నీటికుంటలో నుండి ఒక్కొక్కరి మృతదేహం బయట పడుతుంటే  పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు అందరి కంట కన్నీరు తెప్పించాయి. స్కూల్ నుండి ఇంటికి రావాల్సిన పిల్లలు విగత జీవులుగా మారడంతో అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థుల మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, కర్నూలు ఎంపీ నాగరాజు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్థానిక ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి మృతదేహాలకు నివాళి అర్పించి తల్లిదండ్రులను ఓదార్చారు.

హైదరాబాద్‌లో బేకరీ ఫ్లేవర్స్ కేంద్రం సీజ్

  హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తపడియా డయాగ్నొస్టిక్స్ బిల్డింగ్‌లో గల రాజ్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రన్సెస్ తయారీ కేంద్రంపై జిహెచ్ఎంసి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు  దాడి చేశారు. ఓ ఫ్లోర్‌లో గోదాంలా ఏర్పాటుచేసి, బేకరీ ఉత్పత్తులకు అవసరమైన ఫ్లేవర్స్, ఫ్రాగ్రన్సెస్‌ను అక్కడ తయారు చేస్తున్న నిర్వాహకులు అధిక మోతాదులో రసాయనాలు కలిపి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  అంతేకాకుండా, ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా పర్మిషన్ లేకుండా ఉత్పత్తులు కొనసాగిస్తున్నట్లు తేలింది. దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలగవచ్చని అధికారులు స్పష్టం చేశారు. చుట్టుపక్కల స్థానికుల ఫిర్యాదుతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించడంతో గోదాంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి బృందం చర్యలు తీసుకుంటున్న సమయంలో నిర్వాహకులు గొడవకు దిగినట్టు తెలిసింది.  

చంద్రబాబు నేలవిడిచి సాము : మాజీమంత్రి డిఎల్

  సీఎం చంద్రబాబు  పి 4 పిచ్చిలో వున్నట్లు వున్నట్లు అనిపిస్తోందని,  నేల విడిచి సాము చేస్తున్నట్లు వుందని మాజీమంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు.  కాజీపేటలోని తన నివాసంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.  సమాజంలో జరుగుతున్న పరిణామాలను నోరు విప్పకపోతే తప్పు చేసిన వారము అవుతామన్నా ఉద్దేశ్యంతో  చెప్పాల్సి వస్తోందన్నారు.       టీడీపీ నాయకులు  జగన్ పాలనలో అభివృద్ధి లేదు అన్నారు, మా ప్రభుత్వంలో అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు ఇచ్చామని చెబుతున్నారన్నారు. అభివృద్ధి ఏం జరిగిందనేది నా ఇంటి ముందు ఉండే రోడ్డును, మైదుకూరు సర్వయపల్లి రోడ్డు చూస్తే అర్థమవుతుందన్నారు. నా ఇంటి వద్దే ఇలా ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుందని నేను అనుకుంటానన్నారు. నా దృష్టిలో గత పాలకుల పాలనకు నేటి పాలకుల పాలనకు తేడా ఏమి లేదన్నారు.   అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, నిధులు ఎక్కడికి పోతున్నాయి, పేరుకే చెబుతున్నరా అన్నది తెలియాల్సి వుందన్నారు. ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరము నాలుగు నెలలు అవుతున్న ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. అధికారులను అడిగితే వచ్చే మార్చినాటికీ మంజూరవుతాయని చెబుతున్నారని ప్రజలు అంటున్నారన్నారు.. చేనేత కార్మికులు మగ్గాల ద్వారా వస్త్రాలు నేసి ఆప్కో  కు ఇచ్చే పనిచేయడం లేదన్నారు. క్వాంటమ్  వ్యాలీ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,వాట్సప్ గవర్నెన్స్ లను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.  వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఒక్క రూపాయి లంచం లేకుండా పనిచేయడం అన్నారు. అది  అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబుకు  పేరు రావాలని పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టారున్నారు. చంద్రబాబు రాజోలు నుండి నీరు ఇస్తానని రూ.3000 కోట్ల విలువ చేసే హామీలు ఇచ్చారన్నారు. రాజోలుకి ఇచ్చే రూ.1000 కోట్లు లేనప్పుడు 80 వేల కోట్ల బనకచర్ల ఎలా పూర్తి చేస్తారని డి.ఎల్ ప్రశ్నించారు.  ప్రజలకు అవసరమైన పనులు ఏమీ జరగడం లేదన్నారు. అలగనూరు ప్రాజెక్టు గురించి ఒప్పుకుంటాము కానీ ముందు రాజోలి గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. పోలవరం బనకచర్ల మరో కాళేశ్వరం అవుతుందన్నారు. రిజర్వాయర్లలో నీళ్లు పెడితే సరిపోదు ఆయకట్టు అభివృద్ధి చెందాలన్నారు. రిజర్వాయర్లు నిండితే మీ ప్రాంతంలో చెరువులకు నీటిని నింపుతామని జీవో ఇవ్వాలన్నారు. పారాసెటమాల్ కరువే.  నాకు తెలిసిన ఒక వ్యక్తి తాసిల్దార్ ఆఫీస్ కు ఓ పని కోసం వెళ్తే లక్ష యాభై వేల రూపాయలు లంచం అడిగితే అడ్వాన్స్ గా కొంత ఇచ్చాన్నారు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇంటి దగ్గర బల్బు పోతే అది పోయిందని చెప్పడం అని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో పారాసిటమల్ మాత్ర లేక చనిపోయిన పరిస్థితి వుందన్నారు. పారాసిటమాల్ మాత్ర ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఓ వార్తా పత్రిక  చెప్పకనే చెపుతోందన్నారు. ఈ విషయం పై ప్రభుత్వానికి లేఖ రాశాను, మెయిల్ చేశా స్పందన లేదని డి.ఎల్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి గిరిజన ప్రాంతాల్లో తొంగి చూసిన పరిస్థితి కూడా లేదన్నారు. ఒక్క కొత్త పించన్ అయినా ఇచ్చారా! ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడ మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం కనీస పథకాలను అమలు చేయాలని డి.ఎల్ డిమాండ్ చేశారు. 44 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ధర్నా చేద్దామనుకున్నానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఊరిలో పెన్షన్ ఇవ్వడానికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. నాడు జగన్ కూడా అదే చేశారన్నారు.  గ్రీవెన్స్ సెల్ లో ఒక్క  సమస్య కూడా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. అసలైన వికలాంగుల పెన్షన్లు తీసేసి అనర్హుల పెన్షన్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పెన్షన్లు కొనసాగించేందుకు బ్రోకర్లు కూడా ఉన్నారున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలది తప్పా. . ప్రభుత్వానిది తప్పా.  ఓట్లు వేసిన ప్రజలది తప్పా ఆలోచించుకోవాలని కోరారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలు రోజు ఎందుకు ఏడవాలని ఆయన ప్రశ్నించారు.  అధికారపార్టీ లో వైసీపీ నేతలు చెలామణి  వైసిపి లో చలామణి అయిన నేతలు నేడు అధికార పార్టీలో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఫ్యాక్స్ మిషన్ పెట్టి ఫిర్యాదులను పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదుని,మంచి పనులు చేస్తేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని డి.ఎల్ పేర్కొన్నారు.