హరీష్ ఒంటరి పోరాటం వృధా ప్రయాసేనా ? కేటీఆర్ సేఫ్ జోన్ అందుకేనా?
అర్థమై పోయింది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం అనుకున్న దళిత బంధుతోనూ లాభం లేదని తెలిపోయిందో, అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటుందో అర్థమైపోయింది. అందుకే ఆయన వ్యూహం మార్చారు, హుజూరాబాద్ రాజకీయ రొంపిలోంచి కేటీఆర్ ను సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు. నిజానికి, ముందు నుంచి కూడా, కీడెంచి మేలంచాలనన్న ‘దూర దృష్టి’తోనే కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓడిపోయినా, ఓటమి ముల్లు కేటీఆర్ కు గుచ్చుకోకుండా, హుజూరాబాద్ బాధ్యతలను హరీష్ కు అప్పగించారని అంటున్నారు. గెలిస్తే పార్టీ గెలుపు, అంటే కేసీఆర్, కేటీఅర్ గెలుపు, ఓడితే హరీష్ రావు ఓటమి. కేటీఅర్ ఇన్ సేఫ్ జోన్. ఆ విధంగా కేసీఆర్ స్కెచ్ గీసుకున్నారు. ఆ ప్రకారంగానే కథ నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఎప్పుడైతే ఓటమి తధ్యమని తెలిపోయిందో, అప్పుడు కేటీఅర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను శతకోటి ఉప ఎన్నికల్లో అదొకటి, అన్నట్లుగా హరీష్ రావు ఆరాటం మీద నీళ్ళు చల్లారు. గెల్సితే కేంద్రంలో అధికారం వస్తుందా, ఓడి పోతే రాష్ట్రంలో అధికారం పోతుందా అంటూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని తేల్చేశారు. లైట్ గా తీసుకున్నారు. గెలిచినా ఓడినా ఒకటే అన్నట్లుగా మాట్లాడి, ఆ ఒక్క సీట్లో గెలిచి మామ ముందు కాలర్ ఎగరేద్దామనుకున్న హరీష్ రావు గాలి తీసేశారు. ఒక వేళ రేపు పొరపాటున తెరాస గెలిచినా, హరీష్ కు గండపెండేరాలు తొడిగేది ఏమీ ఉండదని, ముందుగానే కేటీఆర్ తేల్చేశారు.
ఇక ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ, ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదు అన్న కారణం చూపించి కేసీఆర్ దళిత బంధుకు బ్రేకులు వేశారు. అంతకు ముందే ఎనిమిది వేలమంది వరకు లబ్దిదారుల బ్యాంకు ఖాతలాలో పదివేలు తక్కువ పదిలక్షల రూపాయలు జమ చేశారు. అయితే,ఆ సొమ్ములు చూసుకోవడానికే కానీ, విత్’డ్రా చేసి తీసుకోవడానికి వీలులేకుడా బ్యాంకులకు సీజ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంతే కాకుండా, కొత్తగా ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్వో) నిబంధన తెచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి ఫోకస్’ను మెల్లమెల్లగా ఇతర అంశాల వైపుకు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగు మండలాలలో దళిత బందు అంటూ కొత్త ఎత్తుకు తెరతీశారు. ఉప ఎన్నికలు ఇప్పట్లో జరగవని తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఎటూ ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చి, వెనకడుగువేస్తున్నారా అనేది ప్రశ్నార్ధకంగా మారిందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. కేసీఆర్. కేటీఆర్ తమ చేతికి మట్టి అంటకుండా హుజూరాబాద్ ఉప ఎన్నిక రొంపిలోంచి బయట పడినా, హరీష్ రావు మాత్రం పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకు పోయారని ఆయన అభిమానులే, అయ్యో... హరీష్ అంటున్నారు.
ఇప్పటికే దుబ్బాక ఓటమితో సగం ఇమేజి డ్యామేజి చేసుకున్న హరీష్ రావు.. హుజూరాబాద్ లోనూ ఓడిపోతే, అక్కడితో ఆయన రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనని, పార్టీలోని అయన వర్గం ఆందోళన చెందుతోంది. హుజూరాబాద్’లో హరీష్ రావు కాలికి బలపం కట్టుకుని ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే, హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండ , కేటీఆర్ పట్టాభిషేకానికి సిద్దమవుతున్నారని, కేసీఅర్ అన్ని రోజులు ఢిల్లీలో మకాం చేసింది అందుకే అన్న కథనాలు వినిపిస్తున్నాయి. హరీష్ వర్గం ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఆ ఇద్దరూ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే హరీష్ ఢిల్లీకి రాకుండా చేసారని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
కొంచెం ఆలస్యంగానే అయినా, హరీష్ రావు వర్గం తమ నాయకుడు తనకు తెలియకుండానే కేసీఆర్ విసిరిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని అంటున్నారు. ఆయన తీరు చూస్తే.ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని అంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు సామాన్య ప్రజల్లో చులకన అవుతున్నారని అంటున్నారు. అయితే, హరీష్’ను తక్కువగా అంచనా వేయలేమని అయన వ్యూహం ఆయనకు ఉండే ఉంటుందని అనేవాళ్ళు లేక పోలేదు. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేస్తోందని, అయితే కొత్త చిత్రంలో హరీష్ బొమ్మ ఉంటుందా, లేక ఢిల్లీ భూమి పూజ ఫోటోలో లా మిస్ అవుతుందా చూడాలని పరిశీలకులు భావిస్తున్నారు.