కేసీఆర్ యాదాద్రికి ఆ రోజే ఎందుకు వెళుతున్నారు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న యాదాద్రికి వెళుతున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిజానికి కేసీఆర్ యాదాద్రి పర్యటన మొదట మంగళవారమే ఖరారైంది. సీఎంవో నుంచి షెడ్యూల్ కూడా వచ్చింది. తర్వాత సీఎం కార్యక్రమం రద్దైందనే సమాచారం వచ్చింది. ఈనెల 14న కాదు 17న కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తారనే ప్రకటన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటనలో మార్పుపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజకీయ కోణంలో ఆయన యాదాద్రిలో పర్యటనలో మార్పు చోటు చోసుకుందనే ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి.  ప్రధాన పార్టీల పోటాపోటీ ఎత్తులతో జనంలోకి వెళుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా పేరుతో గర్జిస్తున్నారు. విపక్షాలకు కౌంటర్ గా అధికార పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17 ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ప్రతి పక్షాలు భారీ సభలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రిని రప్పిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు అమిత్ షా. ఈ సభను బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సభ ద్వారా కేసీఆర్ సర్కార్ పై సమరశంఖం పూరించబోతున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా సెప్టెంబర్ 17నే దళిత గిరిజన దండోరా సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వేదికగానే గర్జించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గజ్వేల్ సభను కాంగ్రెస్ కూడా సవాల్ గా తీసుకుంది. జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను నియమించింది. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈ సభ ద్వారా సత్తా చాటాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో నిర్మల్ లో బీజేపీ నిర్వహిస్తున్న సభకు ధీటుగా జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. గజ్వేల్ సభ ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేసీఆర్ కు షాక్ ఇవ్వడంతో పాటు బీజేపీ సభను కార్నర్ చేయవచ్చని భావిస్తోంది రేవంత్ రెడ్డి టీమ్. విపక్షాల వ్యూహాలకు కౌంటర్ గా సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు. అందుకే 14న ఉన్న యాదాద్రి పర్యటనకు 17వ తేదీకి మార్చారని అంటున్నారు. కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తే.. మీడియా అటెన్షన్ అంతా అటువైపు ఉంటుందనే యోచనలో గులాబీ నేతలు ఉన్నారట. దీంతో విపక్షాల సభలకు మీడియా మైలేజీకి గండి పెట్టవచ్చనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ తన యాదాద్రి పర్యటనను 17వ తేదీకి మార్చుకున్నారని తెలుస్తోంది.  సెప్టెంబర్ 17నే నిర్మల్ లో బీజేపీ బహిరంగ సభ , గజ్వేల్ లో రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలు ఉండగా.. అందుకు పోటీగా  సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన ఉందంటున్నారు.  అంతేకాదు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు కేసీఆర్. యాదాద్రి పర్యటనలో ప్రధాని రాక వివరాలను ప్రకటించే అవకాశం ఉందట.అమిత్ షా సభ రోజే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వివరాలను ప్రకటించి బీజేపీని డిఫెన్స్ లో పడేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇలా రాజకీయ పార్టీల పోటాపోటీ వ్యూహాలతో తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనంత వేడి రాజుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఏపీ అదనపు అప్పులకు కేంద్రం అనుమ‌తి.. దొందూ దొందేనా..?

నేను బెదిరించిన‌ట్టు చేస్తా. నువ్వు భ‌య‌ప‌డిన‌ట్టు చేయి. అప్పుడే మ‌నిద్ద‌రం క‌లిసిమెలిసి ఉన్నామ‌నే విష‌యం.. చూసే వాళ్ల‌కు అనుమానం రాకుండా ఉంటుంది. అలా ఉంది కేంద్రం-ఏపీ ప్ర‌భుత్వ‌ వ్య‌వ‌హారం అంటున్నారు విమ‌ర్శ‌కులు. ఏపీ అప్పుల కుప్ప‌గా మార‌డంపై కేంద్రం క‌న్నెర్ర చేసిందంటూ వార్త‌లు వ‌స్తాయి. స్థాయికి మించిన‌ అప్పుల‌ లెక్క‌లు లాగ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా ఏజీని నియ‌మిస్తుంది. మ‌ద్యం ఆదాయంపై అప్పులు చేయ‌డాన్ని నిల‌దీస్తుంది. ఏపీ అప్పుల‌పై ప‌దే ప‌దే త‌ప్పుబ‌డుతుంది. అది సరి కాదంటూ.. అప్పుల త‌ప్పులు స‌రి చేసుకోవాలంటూ హెచ్చ‌రిక ధోర‌ణిలో సూచ‌న‌లు చూస్తుంది. అదంతా నిజ‌మే అనుకున్నారు ఇన్నాళ్లూ. ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కేంద్రం భ‌లే కంట్రోల్ చేస్తుందే అని భావించారంతా. అయితే, అదంతా ఉత్తుత్తి బెదిరింపులేన‌ని.. కేంద్రం-ఏపీ.. బీజేపీ-వైసీపీ మ‌ధ్య పైకి క‌నిపించ‌ని అండ‌ర్‌స్టాండింగ్ బాగానే ఉంద‌నే ప్ర‌చారం నిజ‌మేన‌ని ప‌లుమార్లు తేలిపోయింది. తాజాగా, మ‌రోసారి ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమ‌తించ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అప్పుల‌తో మ‌రో 2,665 కోట్ల సమీకరణకు ఏపీ స‌ర్కారుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇప్ప‌టికే ఎఫ్ఆర్ఎమ్‌బీ లిమిట్ దాటిపోతోంద‌నే గ‌గ్గోలు ఒక‌వైపు.. ప‌రిమితికి మించి అప్పులు చేస్తోంద‌నే ఆందోళ‌న మ‌రోవైపు.. ఇవేమీ ప‌ట్టించుకోకుండా.. తామ లెక్క‌లు తామ‌వేనంటూ.. ఏపీ మ‌రో రెండు వేల‌న్నర కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు ఓకే చెప్పేసింది కేంద్రం. అందుకు, టెక్నిక‌ల్‌గా మూల‌ధ‌న వ్య‌యాన్ని రీజ‌న్‌గా చూపుతోంది కేంద్ర ఆర్థిక శాఖ‌. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఏపీ కూడా ఉండ‌టం ఆస‌క్తిక‌రం. కేంద్ర తాజా నిర్ణ‌యంతో ఏపీకి 2021- 22 మొద‌టి క్వాట‌ర్‌లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్టైంది. మార్కెట్‌ నుంచి అదనంగా ఏపీ రూ.15,721 కోట్ల సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు గాను ఆ మేర‌కు రాష్ట్రానికి కేంద్రం త‌ర‌ఫున‌ ప్రోత్సాహకం ల‌భించింది. ఏపీతో పాటు మ‌రో 11 రాష్ట్రాల‌కు ఈ అద‌న‌పు రుణ స‌మీక‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చామ‌ని కేంద్రం చెబుతుంటే.. అదంతా స‌రే గానీ.. మ‌రి, ఏపీ అప్పుల‌పై ఇటీవ‌ల‌ కేంద్రం ఎందుకు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్టు? ఏపీ అప్పుల లెక్క‌ల‌పై ఏజీని ఎందుకు నియ‌మించిన‌ట్టు? నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కార్పొరేష‌న్ల ద్వారా నిధులు కొల్ల‌గొట్ట‌డం.. లిక్క‌ర్ ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టి అప్పులు చేయ‌డం.. సంగ‌తేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  

సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 16న జరగబోతోంది. ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ అధికారంగా ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధుపైనా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దళిత బంధును ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. హుజురాబాద్ కు చెందిన దాదాపు 14 వేల కుటుంబాల ఖాతాలకు నిధులు కూడా జమ అయ్యాయి.  తాజాగా హుజురాబాద్ తో పాటు ఖమ్మం జిల్లా మధిర, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి, కామా రెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోను దళిత బంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోమవారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో వివిధ పక్షాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. దళిత బంధు లాగా అన్ని వర్గాల్లోని పేదలకు బంధు పథకం అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. దీనిపైనా కేబినెట్ లో చర్చించవచ్చని భావిస్తున్నారు.  వినాయక నిమజ్జనోత్సవానికి హైకోర్టు తీర్పుతో ఇబ్బందులు తలెత్తాయి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది హైకోర్టు. ఈ తీర్పుపై జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే కోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తే ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, విద్యాసంస్థలు తెరిచినందున ఇప్పటివరకు తలెత్తిన సమస్యలపైనా చర్చ ఉండే అవకాశం ఉంది. వరి కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు పెట్టిందని ఆరోపిస్తున్న కేసీఆర్.. దీనిపైనా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.యాసంగిలో వరి సాగు, పంట కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.  తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికపైనా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చర్చిస్తారని అంటున్నారు. హుజురాబాద్ కు సంబంధించి నిర్వహించిన వివిధ సర్వేల ఫలితాలను మంత్రులతో ముఖ్యమంత్రి పంచుకునే అవకాశం ఉందంటున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావస్తున్నందున.. ఆలయ ప్రారంభోత్సవంపైనా మంత్రివర్గంలో చర్చించవచ్చని భావిస్తున్నారు. 

కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు! రేవంత్ రెడ్డి కామెంట్లతో రచ్చ.. 

అటు బీజీపే, ఇటు కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ బండి సంజయ్ కి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాయి. బండి రాకతో బీజేపీలో, రేవంత్ కాకతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపధ్యంలోనే అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరు? అన్న ప్రశ్న మళ్ళీ తెరపైకొచ్చింది.  రేవంత్ రాకకు ముందు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించంతో కారుకు కమలమే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం బలపడింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత సీన్ మారింది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు పుచ్చుకున్న తర్వాత టోటల్’గా  సీన్ రివర్సే అయింది. హస్తం పార్టీ పైచేయిగా నిలిచింది. రేవత్ రెడ్డి దూకుడుతో పాటుగా కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది. రేవంత్ చుట్టూనే కాంగ్రెస్ రాజకీయం నడుస్తోంది. అతి కొద్ది కాలంలోనే కాంగ్రెస్ అంటే రేవంత్, రేవంత్ అంటే కాంగ్రెస్ అనే విధంగా రేవంత్ రెడ్డి గిరిజన, దళిత, దండోరా తో దూసుకు పోతున్నారు.  నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీనే కాదు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక మంది కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం వుంది. ఎన్నో ఎన్నికలు, అటుపోట్లు ఎదుర్కున్న రాజకీయ అనుభవమూ పుష్కలంగా వుంది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి (1983) ముందు ఆంధ్ర ప్రదేశ్’లో ఏక (కాంగ్రెస్) పార్టీ ప్రజాస్వామ్యమే నడిచింది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, అధికారంలో కొనసాగింది.రాష్ట్రాన్ని పాలించింది. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత కూడా కాంగ్రెస్, టీడీపీలే వంతుల వారీగా రాష్ట్రాన్ని పాలించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ  బీజేపీ ఎప్పుడూ అధికారం సంగతి దేవుడెరుగు, పట్టుమని పది స్థానాలలో గెలిచిందే లేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒక సారి ఐదు, రెండవ సారి ఒకటి (ప్లస్ దుబ్బాక) మాత్రమే గెలిచింది.   ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, రాష్ట్ర విభజన తర్వాత కూడా, కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో రెండు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 20కి పగానే  స్థానాలలో గెలిపించి తెరాసకు ప్రత్యాన్మాయం కాంగ్రెస్ పార్టీనే, అని తిరుగులేని తీర్పు నిచ్చారు. ప్రధాన పతిపక్ష హోదా నిచ్చారు. అయితే, హస్తం గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు క్యూ కట్టి తెరాస గూటికి చేరడంతో, కాంగ్రెస్ పార్టీ ఆ హోదాను నిలబెట్టుకోలేక పోయింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అయినా, 2019 లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ మూడు స్థానాలు గెలుచుకుంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఉన్నా, నాయకులలో నిబద్ధత మాత్రం లేకుండా పోయింది.  పార్టీలోని అంతర్గత విబేధాలు, పార్టీ ముందడుగుకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి.  ముఖ్యంగా జాతీయ స్తాయిలో ఏ విధంగా అయితే, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి సేనియర్లు జీ 23 గా ఏర్పడి అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారో, అదే విధంగా రాష్ట్రంలోనూ సీనియర్లు, రేవత్ దూకుడుకు కళ్ళెం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ బలహీనతను, కేసీఆర్ తమకు అనుకూలం మార్చుకుంటున్నారు. ఇంత కాలం ఇది రహస్య వ్యవహారంగా సాగుతున్నా, కాంగ్రెస్ లో కొందరు సీనియర్లు ముఖ్యమంత్రికి మంచి మిత్రులుగా మెలుగుతున్నారు అనేది బహిరంగ రహస్యమే. ఈనేపధ్యంలోనే రేవంత్ రెడ్డి, అసలు గుట్టును బయట పెట్టారు. ముఖ్యమంత్రి కుట్రలు చేసి... కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చీలికలు తెచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు.  నిజానికి  రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పార్టీ నాయకులూ, కార్యకర్తలలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిచే అవకాశం హస్తం పార్టీకే వుందనే అబిప్రాయం బలపడుతోంది. అయితే ఇంతలోనే తెరపైకొచ్చిన అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ప్రతిబంధకంగా  మరే ప్రమాదం ఉందని అంటున్నారు. అవును  రాజకీయాలలో ఆత్మహత్యలే కాని,  హత్యలు ఉండవు, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకుంటే, అది హస్తం పార్టీ స్వయం కృతమే అవుతుంది.

ఫైబ‌ర్ నెట్‌పై సీఐడీ విచార‌ణ‌.. లోకేశే టార్గెటా?

జ‌గ‌న్ స‌ర్కారు టార్గెట్ ఒక్క‌టే. రెండేళ్లుగా ఒక‌టే ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంది. ఏపీలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని చూస్తోంది. కేసులు, అరెస్టుల‌తో టీడీపీ నేత‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. అయినా, తెలుగు త‌మ్ముళ్లు అద‌ర‌కుండా, బెద‌ర‌కుండా వైసీపీ ప్ర‌భుత్వ అరాచ‌కాలు, అక్ర‌మాల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఇలాగైతే కుద‌ర‌ద‌నుకుందో ఏమో.. ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌పైనా వ‌ల విసిరింది. అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ చంద్ర‌బాబును ఇరికించే ప్ర‌య‌త్నం చేసినా.. అది అనుకున్న మేర‌కు వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో, నారా లోకేశ్‌కైనా ప‌క‌డ్బందీగా కేసు ఉచ్చు బిగించాల‌ని చూస్తోంది. ఏపీ ఫైబ‌ర్ నెట్ టెండ‌ర్ల‌లో 121 కోట్ల మేర అవినీతి జ‌రిగిందంటూ లోకేశ్ టార్గెట్‌గానే సీఐడీ విచార‌ణ జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  ఫైబర్ నెట్ టెండర్‌లో అవినీతి, అక్రమాలపై సీఐడీ విచారణ మొద‌లైంది. విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఫైబర్ నెట్ మాజీ ఎం.డి సాంబశివరావు, ఎలువషన్ కమిటీ మెంబెర్ వేమూరి ప్రసాద్‌లు విచారణకు హాజరయ్యారు. మొదటి దశలో జరిగిన రూ.333 కోట్ల రూపాయల టెండర్లలో రూ.121 కోట్ల అక్రమలు జరిగాయంటూ ఈ నెల 9న సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 161 క్రింద నోటీసులు జారీ చేశారు.  ఫైబర్‌నెట్‌ టెండర్లలో రూ.121 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.321 కోట్ల విలువైన టెండర్‌ను తమకు కావాల్సిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టేందుకు పలు అవకతవకలకు పాల్పడ్డారన్నారు. నాసిరకం పరికరాల సరఫరా, బిల్లుల్లేకుండా చెల్లింపులు, పరికరాల పరీక్షలో మార్పులు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.121 కోట్ల నష్టం జరిగిందన్నారు. అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందని, ఆ సంస్థపై పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తోందని చెప్పారు.  మ‌రోవైపు, ఫైబర్‌నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ టీడీపీ జాతీయ అధ‌దికార ప్ర‌తినిధి పట్టాభిరామ్ మండిప‌డ్డారు. ఏపీని ఫైబర్‌నెట్ రోల్‌ మోడల్‌ చేసిందని, కేంద్ర ప్రభుత్వం సైతం ఫైబర్‌నెట్‌ను ప్రశంసించిందని అన్నారు. ఒకే కనెక్షన్‌తో రూ.149కే మూడు రకాల సేవలు అందించే ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు అని, దేశమంతా ఈ విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ప్రతిష్టాత్మక ఫైబర్‌ నెట్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందని పట్టాభి ఫైర్ అయ్యారు. ఫైబర్‌ నెట్‌లో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అవినీతి జరిగిందంటున్న గౌతమ్‌రెడ్డి.. 121 కోట్లు కాదు క‌దా.. పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని పట్టాభి ఛాలెంజ్ చేశారు. 

యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక.. కాంగ్రెస్ కథ మారేనా? 

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే అత్యంత కీలకంగా మరాయి. యూపీ ఫలితం 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు సీరియస్ గా వర్క్ చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే మెజార్టీ కేంద్రమంత్రులను యూపీ నుంచే తీసుకుంది. ఐదుగురు కేంద్ర మంత్రులను యూపీకి ఇంచార్జులుగా నియమించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా  నేతలంతా యూపీపై ఫోకస్ చేశారు. ఎస్పీ బీఎస్పీలు జట్టుకట్టి ఈసారి తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇక గతంలో యూపీని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలిచి సత్తా చాటింది. సమాజ్ వాదీ పార్టీ 47 బీఎస్పీ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.ఈసారి ఆ పార్టీ ఒంటరిగా పోటీచేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు.  ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలున్నాయని సల్మాన్ ఖుర్షీద్ చెప్పడంతో యూపీ రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉందంటున్నారు.  యూపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రియాంక ఎంతో కష్టపడుతోంది. పోయిన సారి ప్రతి ఊరు వాడ తిరిగి దళితులు బీసీల ఇళ్లలోకి వెళ్లి భోజనం చేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎంతో కష్టపడ్డారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు మాత్రం పడలేదు. అయినా ప్రియాంక మాత్రం వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ తో వచ్చేవారిని ఆహ్వానిస్తూ ముందుకెళుతున్నారు. ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.  

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై హైకోర్టుకు ర‌ఘురామ‌.. సాక్షికి ఊహించ‌ని షాక్‌..

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో కేసు వేసి ముఖ్య‌మంత్రికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఏ1, ఏ2ల ఇద్ద‌రి బెయిలూ ర‌ద్దు అయ్యేలా.. అటు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ సైతం ర‌ద్దు చేయాల‌ని సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు. సెప్టెంబ‌ర్ 15న ఆ రెండు కేసుల‌పై క‌లిపి.. ఒకేసారి తీర్పు ఇవ్వ‌నుంది నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు.  ఓవైపు సీబీఐ కోర్టు తీర్పుపై ఉత్కంఠ పెరుగుతుండ‌గా.. ఎంపీ ర‌ఘురామ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌నూ మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌న్నారు. సీబీఐ కోర్టు బుధ‌వారం ఉత్త‌ర్వులు ఇవ్వ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని హైకోర్టును కోరారు. పిటిష‌న్‌పై అత్య‌వ‌స‌రం విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు అంగీక‌రించిన హైకోర్టు ర‌ఘురామ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం ఆస‌క్తిక‌రం.  సాక్షి మీడియాలో వ‌చ్చిన క‌థ‌నంతో సీబీఐ కోర్టు తీర్పు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశ‌ముంద‌ని ఆరోపించారు ఎంపీ ర‌ఘురామ‌. సీబీఐ కోర్టులో గ‌త విచార‌ణ సంద‌ర్భంగా.. తీర్పు కంటే ముందే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసిందంటూ సాక్షి మీడియా ట్విట్ట‌ర్‌లో న్యూస్ వ‌చ్చింది. ఓవైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే.. సాక్షి మీడియాలో త‌న పిటిష‌న్‌ను కొట్టేశారంటూ వార్త‌లు రావ‌డాన్ని ర‌ఘురామ త‌ప్పుబ‌ట్టారు. సాక్షి క‌థ‌నంపై కోర్టును ఆశ్ర‌యించారు. అయితే, అది కావాల‌ని రాసిన న్యూస్ కాద‌ని.. ఉద్యోగి చేసిన త‌ప్పిద‌మంటూ క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేసింది సాక్షి మీడియా. ఆ మేర‌కు కోర్టుకు కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. దీంతో.. పిటిష‌న‌ర్‌ ర‌ఘురామ వ్యూహం మార్చారు. సాక్షి మీడియా క‌థ‌నం ఆధారంగా సెప్టెంబ‌ర్ 15న రాబోవు సీబీఐ కోర్టు తీర్పు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉన్నందున‌.. వెంట‌నే సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాలంటూ నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించారు. ర‌ఘురామ పిటిష‌న్‌తో సాక్షి మీడియా క‌థ‌నంపై మ‌రింత ఉచ్చు బిగుసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.   

సుప్రీంకోర్టుకు కేసీఆర్ స‌ర్కార్‌.. అక్క‌డైనా ఊర‌ట ద‌క్కేనా?

తెలంగాణ స‌ర్కారు నిర్లక్ష్యం ఇప్పుడు మెడ‌కు చుట్టుకుంది. ఓవైపు స‌మ‌యం మించిపోతోంది. మ‌రోవైపు చేతులెత్తేయ‌డం మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేదు. ఏళ్లుగా కోర్టులు చెబుతున్నా.. క‌నీసం సోయి కూడా లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కాల‌క్షేపం చేస్తూ వ‌స్తోంది. ఈసారి మాత్రం గ‌తంలో మాదిరి కుద‌ర‌దు.. డైవ‌ర్ట్ చేయాల్సిందేన‌ని హైకోర్టు గ‌ట్టిగా చెప్ప‌డంతో.. టీఆర్ఎస్ స‌ర్కారు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. అదంత ఈజీ వ్య‌వ‌హారం కాక‌పోవ‌డంతో.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని భావిస్తోంది.  హుస్సేన్‌సాగ‌ర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారుచేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని.. నిమజ్జనానికి అనుమతి కోరాలని కేసీఆర్ సూచించారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సడలించడానికి సోమవారం హైకోర్టు నిరాకరించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ సహా జలాశయాల్లో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న కుంటల్లోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. జల కాలుష్యానికి మీరే అనుమతిస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ తీరును తప్పుపట్టింది. పీవోపీ విగ్రహాలను, సింథటిక్‌ రంగులను వినియోగించరాదని, కాలుష్యాన్ని నివారించాలని పదేపదే చెబుతున్నా మీరు నిద్రలేవకుండా కాలుష్యానికి అనుమతించారంటూ తప్పుపట్టింది. తాము కేవలం చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే చెబుతున్నాం అని కోర్టు వ్యాఖ్యానించింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని స్ప‌ష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించలేమని తేల్చి చెబుతూ జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. హుస్సేన్‌సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం వ‌ద్దంటూ గ‌తంలోనూ ప‌లుమార్లు హైకోర్టు తీర్పులు చెప్పింది. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఒక్క‌సారికి అంటూ ప్ర‌భుత్వం అనుమ‌తులు సంపాదిస్తోంది. ఈసారి మాత్రం హైకోర్టు సీరియ‌స్‌గా ఉంది. ఉత్త‌ర్వులు స‌వ‌రించడానికి స‌సేమిరా అంటోంది. దీంతో.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌లేక జీహెచ్ఎమ్‌సీ అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోవైపు మంత్రి కేటీఆర్ బ‌ల్దియా అధికారుల‌తో భేటీ అయి.. అన్ని వినాయ‌క విగ్ర‌హాల‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాల‌ని.. న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ఉన్న 23 నీటి కుంట‌ల‌ను గుర్తించి.. అందులో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం చేసేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తే.. ఇలా 23 చిన్న నీటికుంట‌ల్లో నిమ‌జ్జ‌నం జ‌రిగేలా ప్ర‌త్యామ్నాయ ఏర్ప‌ట్లు చేస్తోంది ప్ర‌భుత్వం.   

వైసీపీలో ‘మతం’  చిచ్చు.. జగన్ తీరుపై గర్జిస్తున్న నేతలు 

వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం క్రైస్తవ కుటుంబం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు దాపరికమూ  లేదు.  వైఎస్ ఉన్నంత వరకు ఆయన మత విశ్వాసాలు ఆయన రాజకీయాలను అంతగా ప్రభావితం చేయలేదు.ఆయనకు ప్రతిబంధకమూ కాలేదు. నిజానికి, ఒక్క వైఎస్సే కాదు, మతం మారిన రాజకీయ నాయకులు ఎవరూ కూడా, తమ మూలాలను పూర్తిగా తుడిచేసుకో లేదు. మెజారిటీ మతస్తుల మనోభావలాను ఉద్దేసపూర్వకంగా కించపరిచే ప్రయత్నం చేయలేదు. వైఎస్స్ సహా ఒకరిద్దరు ఒకటిరెండు సందర్భాలలో ఒకటి రెండు తప్పటడుగులు వేసినా అంతలోనే సర్దుకున్నారే కానీ, గీత దాటలేదు.   వైఎస్ మీద ఆరోపణలు అసలే లేవని కాదు ఉన్నాయి. తిరుమల దేవుని ఏడుకొండలను రెండు కొండలకు కుదించే కుట్రచేశారనే ఆరోపణ, రంగారెడ్డి జిల్ల్లాలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేటాయించారనే మరో ఆరోపణ ఇలా ఇంకొన్ని ఆరోపణలు ఆయనపై వచ్చినా ఆ ఆరోపణలు అంతలా దుమారం లేపలేదు. వైఎస్ ను ఆయన ప్రత్యర్ధులు కూడా ఆ కోణంలో విమర్శించ లేదు.క్రైస్తవ ముఖ్యమంత్రి అన్న ముద్ర వేయలేదు.  కానీ, జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొద్ది కాలానికే ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి అన్న ముద్ర పడిపోయింది. సోషల్ మీడియాలో ఆయన పేరే ఏసు రెడ్డిగా మారిపోయింది. ఆయన పాలనలో సాగుతున్న హిందూ వ్యతిరేక ధోరణికి విసిగిపోయిన జనం, జగన్ రెడ్డిని, ఏసు రెడ్డి అనేంతవరకు వెళ్ళారంటే, పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చును.  ఎన్నికలలో జగన్ గెలుపు  ఏసు ప్రభువు విజయంగా ప్రచారం జరిగింది. అది మొదలు, అనేక విధాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారాన్ని, ప్రోత్సహిస్తూ ,మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ వచ్చిందని, విపక్షాలే కాదు, సామాన్య జనం కూడా ఆరోపిస్తున్నారు. ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో క్రైస్తవ మత ప్రచారం ముందెన్నడూ లేని విధంగా సాగుతోంది. గ్రామాలకు గ్రామాలే, క్రైస్తవ గ్రామాలు (వంద శాతం క్రైస్తవులు నివసించే గ్రామాలు)గా మారిపోతున్నాయి. ప్రభుత్వమే టెండర్లు పిలిచి మరీ ప్రజల సొమ్ముతో చర్చిలునిర్మిస్తోంది. పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా జీతాలు చెల్లిస్తోంది. మతం మారిన వారికి రాజ్యంగ విరుద్ధంగా రిజర్వేషనలు కల్పిస్తోంది. సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఒకే సారి ఇటు ఎస్సీలుగా, అటు క్రైస్తవులుగా చెలామణి అవుతూ, ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ విషయంలో సామాన్య ప్రజలే కాదు మంత్రులు కూడా వివాదంలో చిక్కుకుని విచారణ ఎదుర్కుంటున్నారు. మరో వంక హిందూ దేవాలయలపై దాడులు, రధాల ద్వంస రచన సాగుతోంది. ఇవన్నీ పిచ్చోళ్ళ పనని ప్రభుత్వం హిందువుల మనోభావాలను కించే పరిచే విధంగా లైట్’గా తీసుకుంటోంది. అంతే కాదు, ఎదేమితని ప్రశ్నిస్తే మంత్రులు బూతుల దంకం ఎత్తుకుంటున్నారు.  ఇంచు మించుగా 150 వరకు దేవాలయాలపై దాడులు జరిగితే ఇనతవరకు ఒక్కరిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అన్న ముద్ర పడింది. అలాగే తిరుమల వెంకన్న దేవుని ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సహా రాష్ట్రంలోని అనేక ప్రముఖ దేవాలయాలలో అన్యమత ఉద్యోగుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో దేవుడు మంత్రి ఉన్నారు కానీ, అయన ఏ దేవుడు మంత్రో మాత్రం తెలియదు. ఇలా, హిందూ దేవుళ్ళు, హిదువుల మాట విశ్వాసాలపై ముప్పేట దాడి జరగటానికి, క్రైస్తవ సమాజంలో ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మావాడు, చట్టాలు మమ్మల్ని ఏమీ చేయలేదు అన్న ధోరణి, భరోసానే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.  అయితే, ఇంతవరకు ఇంత జరుగుతున్నా, వైసీపెలో ఏ ఒక్కరు కూడా ఇదేమిటి? అని ప్రశ్నించిన పాపాన పోలేదు. చివరకు మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు కూడా తమ మనోభావాలను వ్యక్తంచేసే సాహసం చేయలేదు. పదవులు నిలుపుకోవడం కోసంగా, మౌనంగా ఉండిపోయారు. అంతే కాదు, ముఖ్యమంత్రి మెప్పుకోసం, అన్యమతస్తులు సాగిస్తున్న మత ప్రచారాన్ని సమర్ధించారు. చివరకు దేవుడు మంత్రిసహా  పలువురు మంత్రులు హిందువుల మనో భావాలను చులకన  చేసి మాట్లాడారు.మాట్లాడుతున్నారు. అయితే ఇంత కాలానికి వైసీపీలో ఒక హిందూ గళం వినిపించింది.వైసీపే ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందని గళం విప్పి గర్జించారు, గుంటూరు జిల్లా వైసీపీ కార్యదర్శి, బందా శశిధర్.  నిజమే ఆయన  మహా నేత కాదు, మంత్రి, ఎమ్మెల్యే కాదు, జిల్లా స్థాయి నాయకుడే, అయినా, ఎవరికి వారు లోలోన కుమిలి పోతూ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరని ఎదురు చూస్తున్న, వైసీపీలోని హిందువులకు, నేనున్నాను, అంటూ ముందు కొచ్చి గర్జించారు బందా శశిధర్. వినాయక విగ్రహాల ఏర్పాటుపై, జగన్ రెడ్డి  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయన తప్పు పట్టారు.అది కూడా మాములుగా కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలతో లోలోన రగిలిపోతున్న హిందువుల మనోవేదనను తన గొంతుతో గర్జించి వినిపించారు. హిందుత్వాన్ని నాశనం చేసేందుకు, వైసీపీ అధినేత జగన్ కంకణం కట్టుకున్నాడని శివమెత్తారు, శశిధర్. ఇలాంటి పార్టీలో ఉండలేనని, ఆ పాపంలో పలు పంచుకోలేనని, పార్టీ పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒక జిల్లా కార్యదర్శి రాజీనామా చేయడం పెద్ద విషయం, విశేషం కాకపోవచ్చును, కానీ, ఆది ఆయన ఒక్కరి ఆవేదన, ఆగ్రహం కాదు. అనేక మంది, చివరకు జగన్ రెడ్డి కుటుంబానికే చెందిన బాప్టిజం పుచ్చుకోని  బంధువులు కూడా జగన్ రెడ్డి మత వివక్షను తప్పు పడుతున్నారని అంటారు.  జగన్ రెడ్డికి పార్టీలో . ప్రభుత్వంలో ఇతరత్ర కూడా వ్యతిరేక గళం వినవస్తోంది. వివద రూపాల్లో ప్రమాద ఘంటికలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం లీకైన విశాఖ జిల్లా  చోడవరం ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ సంభాషణ వీడియో, ఆ వీడియోలో ఆయన జగన్ రెడ్డి విధానలను ఎండగట్టిన తీరు, అంతకు ఇంకొన్ని రోజుల ముందు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రామ వాలెంటీర్ల వ్యవస్థపై చేసిన విమర్శలు, చివరకు శ్రీకాకుళం జిల్లాకు చెంది వాలెంటీర్ ఒకరు, ప్రజలను సోమరలును చేయవద్దంటూ అంటించిన చురక, ఇవన్నీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో రగులుతున్న అసంతృప్తికి. నిదర్శనం. అగ్ని పర్వతం భగ్గుమనేందుకు సిద్దంగా ఉందనేందుకు సంకేతమనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చిక్కుల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి!

ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు వరుసగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలము సురేష్ పై జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కులం విషయం కోర్టు బోనులోకి వెళ్లింది. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.  హైకోర్టులో  న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే  జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఆమె ఎస్టీ అని తేల్చిందని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్ జూన్ 10న అప్పీల్ దాఖలు చేసినట్టు చెప్పారు.  అయితే కుల ధ్రువీకరణ విషయంలో మంత్రి తానే విచారణ చేయించడం చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు పిటిషనర్ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్. ఎం.సత్యనారాయణమూర్తి.. పత్రాలను పరిశీలిస్తే రాష్ట్ర స్థాయి పునస్సమీక్ష కమిటీ వద్ద అప్పీల్ చేసినట్టుగా ఉందన్నారు. కాబట్టి అప్పీల్‌ను ఉపసంహరించుకుని సంబంధిత అథారిటీ ముందు దాఖలు చేసుకోవాలని సూచించారు. అప్పీలు అథారిటీ విచారణకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. 

నాకో లవర్ ను సెట్ చెయండి.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్

ప్రస్తుత సమాజంలో లవ్ అనేది కామన్ గా మారిపోయింది. ఎక్కువ మంది ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. యూత్ లో దాదాపుగా అందరికి ప్రేమలు ఉన్నాయని అంటారు. కాని ఓ యువకుడికి మాత్రం ఎంతగా ప్రయత్నించినా లవర్  దొరకడం లేదట. దీంతో విసిగిపోయిన ఓ యువకుడు ఏకంగా స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. తమకో లవర్ ను చూసి పెట్టమని ఆ లేఖలో కోరాడు.  ఓ యువకుడు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాశాడు. అల్లరిచిల్లరగా, జులాయిగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనను మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదంటూ ఆ లేఖలో యువకుడు వాపోయాడు. ఇది తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, తనకో గాళ్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని కోరాడు. భూషణ్ జామువంత్ అనే యువకుడు మరాఠీలో రాసిన ఆ లేఖ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తాను ఉంటున్న ప్రాంతంలో బోల్డంతమంది చక్కని అమ్మాయిలు ఉన్నారని, అయినప్పటికీ తనను ఎవరూ ఇష్టపడడం లేదని భూషణ్ లేఖలో వాపోయాడు. అమ్మాయిలు తనను ఇష్టపడకపోవడంతో తనలో ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. మద్యం తాగేవారికి, అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనకు మాత్రం ఎవరూ లేరని అన్నాడు. వారిని చూస్తున్నప్పుడల్లా తన బాధ మరింత ఎక్కువ అవుతోందన్నాడు. కాబట్టి తనకో గాళ్ ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని లేఖలో వేడుకున్నాడు భూషణ్ జామువంత్.  యువకుడి లేఖపై చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని చెప్పారు. భూషణ్ ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని, అతడి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్టు చెప్పారు. అయినా ఇలాంటి ఉత్తరాలు రాయడం సరికాదని, అతడి ఆచూకీ తెలిస్తే పట్టుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపాడు.  

సీఎం జగన్‌తో అదానీ సీక్రెట్‌ మీటింగ్!.. అందుకేనా..?

ర‌హ‌స్య స‌మావేశాలు ఎప్పుడూ అనుమానాస్ప‌ద‌మే. ఎలాంటి లొసుగులూ లేక‌పోతే నిర్భ‌యంగా, అంద‌రికీ తెలిసేలానే భేటీలు జ‌రుగుతుంటాయి. ఏదైనా తేడా వ్య‌వ‌హారమైతేనే ఆ విష‌యం ఎవ‌రికీ తెలీకుండా ర‌హ‌స్య మంత‌నాలు నెర‌పుతారు. అప్పుడెప్పుడో పోస్కో ప్ర‌తినిధులు సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. క‌ట్ చేస్తే, ఆ త‌ర్వాత విశాఖ ఉక్కును పోస్కో కంపెనీ కొన‌బోతోంద‌ని.. అందుకు జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌వంతు సాయం చేస్తోంద‌నే న్యూస్ వైర‌ల్ అయింది. ఇలా ప‌లు మీటింగ్స్ ప‌లుర‌కాల‌ సందేహాల‌కు దారి తీస్తుంటాయి. అందులో, జ‌గ‌న్‌రెడ్డిలాంటి వాళ్లు పారిశ్రామిక‌వేత్త‌ల‌తో సీక్రెట్‌గా మీటింగ్ జ‌రిపార‌ని తెలిస్తే.. గ‌త క్విడ్‌ప్రోకో చ‌రిత్ర కార‌ణంగా అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. తాజాగా, సీఎం జ‌గ‌న్‌తో అదానీ సోద‌రులు భేటీ అయ్యార‌నే స‌మాచారంతో ఒక్క‌సారిగా అటెన్ష‌న్ నెల‌కొంది. తాడేప‌ల్లి ప్యాలెస్ కేంద్రంగా అస‌లేం జ‌రుగుతోంద‌నే అటెన్ష‌న్‌ పెరిగిపోయింది. ఇండియాస్ టాప్ బిజినెస్‌మేన్‌లో ఒక‌రైన గౌతమ్ అదాని స‌డెన్‌గా సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆ మేర‌కు ఓ మీడియాలో ప్ర‌ముఖంగా వార్త వ‌చ్చింది. అదానీ సోదరులు స్వ‌యంగా త‌ర‌లివ‌చ్చి మ‌రీ.. తాడేప‌ల్లి ప్యాలేస్‌లో జగన్‌తో భేటీ అవ‌టం మామూలు విష‌య‌మేమీ కాదంటున్నారు. ఇప్ప‌టికే కృష్ణ‌ప‌ట్నం పోర్టును సొంతం చేసుకున్న అదానీ గ్రూప్‌.. మ‌రోవైపు విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్టులో నూరుశాతం వాట కోసం ప్రయత్నిస్తున్న త‌రుణంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం ఊహాగానాల‌కు తావిస్తోంది. సీఎం జ‌గ‌న్‌తో అదానీ బ్ర‌ద‌ర్స్ భేటీ గురించి త‌న‌కు తెలీద‌ని.. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గౌతంరెడ్డే చెప్ప‌డం.. ఆ శాఖ మంత్రికే తెలీకుండా జ‌గ‌న్‌తో అదానీ సోద‌రులు సీక్రెట్ మీటింగ్ జ‌రిపారంటూ వార్త‌లు రావ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.  గంగ‌వ‌రం పోర్టులో 89 శాతం వాటా అదానీ గ్రూపుదే. మిగిలిన 10.54 శాతం వాటాను కూడా కొనేస్తే.. పోర్టు పూర్తి స్థాయిలో అదానీ చేతికొస్తుంది. ఆ మేర‌కు ప్రభుత్వంతో అదానీ గ్రూపు ఒప్పందం కూడా చేసుకుంది. ఆ ప‌ది శాతం వాటా కోసం సుమారు 645 కోట్ల చెల్లింపులు కూడా పూర్త‌య్యాయి. అయితే ఈ ఒప్పందంపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లైంది. ఆ కేసుపై తదుపరి విచారణను ఈనెల 20వ తేదీన జ‌ర‌గ‌నుంది. అంటే విచార‌ణ‌కు సరిగ్గా వారం ముందు.. సీఎం జ‌గ‌న్‌తో అదానీ సోదరులు సమావేశమ‌య్యారంటూ తెలీడం అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.  మ‌రో 10శాతం వాటా కోస‌మే అదానీ బ్ర‌ద‌ర్స్ సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారా? కోర్టు తీర్పు త‌మ‌కు వ్య‌తిరేకంగా వ‌స్తే నెక్ట్స్ ఏం చేయాల‌ని చ‌ర్చించారా? ఆ విష‌యం మాత్ర‌మే చ‌ర్చించ‌డానికి అదానీ సోద‌రులు ఇంత‌దూరం తాడేప‌ల్లి ప్యాలెస్‌కు స్వ‌యంగా త‌ర‌లిరావాలా? వ‌స్తే, ఆ మీటింగ్‌ను అంత ర‌హ‌స్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏముంది? ఆ శాఖ మంత్రికి కూడా స‌మాచారం లేదంటే ఏమ‌నుకోవాలి? ప్యాలెస్ లోప‌ల ఏం జ‌రిగింద‌ని భావించాలి? ఇలా అనేక అనుమాన‌పు ప్ర‌శ్న‌లు. ఇందులో ఏది నిజ‌మో.. జ‌గ‌న్‌కే తెలియాలి....

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో నలుగురిపై సీబీఐ చార్జీషీట్ 

ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ  దూకుడు పెంచింది. సెప్టెంబర్ 1న ఒక చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ.. తాజా  మరో నలుగురిపై వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆదర్శ్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివారెడ్డి, సుధీర్ లపై అభియోగాలు మోపింది. సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ లో మరో 16 మంది పేర్లు ఉన్నాయి. ఈ కేసులో నిందితులను జులై 27, ఆగస్టు 7 తేదీల్లో అరెస్ట్ చేశారు. విజయవాడ, హైదరాబాదు నగరాల్లో వారిని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో  ఇప్పటి వరకు 11 మందిని విచారించిన సీబీఐ.. లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై సెప్టెంబర్ 1న  ఛార్జిషీట్‌  దాఖలు చేసింది. విచారణలో భాగంగా జూలై 9న లింగారెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అధికారులు కడపలో సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.   గత ఏడాది ఏపీలో కొందరు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం న్యాయ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తొలుత ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా, సీఐడీ విచారణపై అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు గతేడాది అక్టోబరు 8న ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీఐడీ నుంచి సమాచారాన్ని స్వీకరించిన సీబీఐ సెప్టెంబరు 11న కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా వరుసగా చార్జీషీట్లను కోర్టులో దాఖలు చేస్తోంది సీబీఐ.   

మోడీని కేసీఆర్ కలిసింది అందుకే? ఢిల్లీ డీల్స్ బయటపెట్టిన బీజేపీ నేత..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం హస్తిన వెళ్లిన గులాబీ బాస్.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పలువురు కేంద్రమంత్రులను కలిశారు కేసీఆర్. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ నేతలు సై అంటే సై అంటున్న పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కేసీఆర్ కలవడం ప్రాధాన్యతగా మారింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన పరిణామాలు తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారాయి. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.  కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే మరో కీలక పరిణామం జరిగింది. ప్రధానిని కేసీఆర్ కలిసిన మరుసటి రోజే పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఖచ్చితంగా ఉంటుందని భావించిన హుజురాబాద్ ఉప ఎన్నిక అందులో మిస్సైంది. బైపోల్ ఆలస్యమైతే ఈటల రాజేందర్ కు ఇబ్బందులు వస్తాయనే చర్చ సాగుతుండగానే.. ఉప ఎన్నికను వాయిదా వేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధానమంత్రితో కేసీఆర్ మాట్లాడటం వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందనే చర్చ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ ను బీజేపీ బలి పశువు చేసిందని చెప్పారు. అయితే తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన, కేంద్రం పెద్దలతో సమావేశాలకు సంబంధించి కమలం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు అతి త్వరలోనే షెడ్యూల్ వస్తుందన్నారు. కేసీఆర్ కు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఎన్నికలు వాయిదా వేయించేంత దమ్ములేదన్నారు జితేందర్ రెడ్డి. రాష్ట్రం  దగ్గర డబ్బులు లేవు.. అప్పు కావాలని బ్రతిమాలడానికే మోడీ దగ్గరకు వెళ్లాడని తెలిపారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించబోతున్నారని, త్వరలో విజయోత్సవాలు జరుపుకోబోతున్నామని హుజురాబాద్ మధువని గార్డెన్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జితేందర్ రెడ్డి కామెంట్ చేశారు.  హుజురాబాద్ ప్రజలంత తమ వెంటే ఉన్నారని చెబుతున్న హరీష్ రావు.. ఎందుకు కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ వరాలు ఇస్తున్నారని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. డబ్బులు, మద్యం పంచినా టీఆర్ఎస్ సభలకు జనం పెద్దగా పోవడం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలు చెప్పే అబద్ధాలు ప్రజలు వినివినీ నమ్మడం మానేశారని అన్నారు జితేందర్ రెడ్డి.  దళిత బంధు పేరుతో ఖాతాల్లో డబ్బులు చేస్తూ ఫ్రీజ్ చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పుకుంటున్న హరీశ్ రావు.. ఒక్క రోజైనా తన ఆఫీసులోకి వెళ్లాడా? అని ప్రశ్నించారు. తాను కూర్చునేందుకే ఆఫీసు లేదు.. ఇక్కడికొచ్చి అన్ని కులసంఘాలకు బిల్డింగ్ లు కట్టిస్తానని చెబితే జనాలు ఎలా నమ్ముతారని నిలదీశారు. నీతివంతుడైన ఈటలకు ఓటేస్తారా... ?  ఓ దొంగకు వేస్తారా ఆలోచించుకోవాలని ఓటర్లను కోరారు జితేందర్ రెడ్డి. 

కొవిడ్ థర్డ్ వేవ్ మార్చి వరకు రాదు! పిల్లలను స్కూల్ కు పంపాలన్న వైద్యశాఖ 

తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ చేసినా విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. కొందరు పేరెంట్స్ తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంటూ కొన్ని సంస్థలు హెచ్చరికలు చేస్తుండటం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందనే ప్రచారమే వాళ్ల భయానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక ప్రకటన చేసింది. కొవిడ్ థర్డ్ వేవ్ మార్చి వరకు వచ్చే అవకాశం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. పిల్లలను స్కూల్స్ కి పంపండిడానికి భయపడొద్దని పేరెంట్స్ కు సూచించారు. స్కూల్స్ తెరిచాకా 1.5 లక్షల మంది విద్యార్థులకు టెస్ట్ లు చేస్తే 57 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు శ్రీనివాసరావు. 5 లక్షల మంది రెసిడెన్స్, హాస్టల్స్ లో చదువుకుంటున్నారని... అవి కూడా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. దేశంలో కేరళ, మహారాష్ట్ర లలో మాత్రమే కేసులు ఎక్కువ ఉన్నాయన్నారు. కొవిడ్ అదుపులో ఉన్నా.. జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ వో వెల్లడించారు. 27 వేల ప్రభుత్వ బెడ్స్ కు ఆక్సిజన్ కల్పిస్తున్నామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చిన సమర్థంవంతంగా ఎదుర్కొనేందుకు 3 వేల 202 బెడ్స్ ను పిల్లల కోసం ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 113 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు శ్రీనివాసరావు.  డెల్టా వేరియంట్ వైరస్ పూర్తిగా తగ్గలేదుని, మాస్క్ ధరించాలని జనాలకు సూచించారు శ్రీనివాస రావు. ఐటీ కంపెనీలు ఇంకా ఓపెన్ కాలేదు.. వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు.. కంపెనీలు కూడా ఓపెన్ చెయ్యాలని కోరారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని, లక్షలాది మందికి ఉపాధి దొరకాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామ్ననారు శ్రీనివాసరావు.Ghmc లో 100 శాతం మొదటి డోసు పూర్తైందని తెలిపారు. గత 3 వారాల్లో 8.75 లక్షల మందికి మొబైల్ వ్యాక్సిన్ ద్వారా ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98 శాతం మందికి హాస్పిటల్ కు వెళ్లవలసిన అవసరం రావడం లేదన్నారు శ్రీనివాస రావు. థర్డ్ వేవ్ రావాలంటే.. కొత్త వేరియంట్ మాత్రమే రావాలి.. అప్పటి వరకు 3వ వేవ్ రాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు. 20 లక్షల వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.. ఈ నెలలో25 లక్షల డోసులు రాబోతున్నాయని చెప్పారు. ఈ సీజన్ లో వచ్చే రోగాలకు అన్ని ఒకే లక్షణాలు ఉంటాయన్నారు. 95 శాతం వైరల్ ఫీవర్స్, మలేరియా 2 జిల్లాలో ఎక్కువ ఉందన్నారు. ఈ సీజన్ లో ప్రతి నెల 2 లక్షల వరకు వైరల్ ఫీవర్ వస్తుంటాయన్నారు డీఎంహెచ్ వో శ్రీనివాసరావు. రాష్ట్రంలో R ఫ్యాక్టర్ .5% , పాజిటివిటి రేట్ 4.5% ఉందన్నారు.

జ‌గ‌న్ స‌ర్కారుపై క్రేజీ మీమ్స్‌.. సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్‌..

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఏ ఒక్క వ‌ర్గాన్నీ సంతోష పెట్ట‌లేక పోతున్నాయి. పాల‌నంతా కామెడీ కామెడీగా సాగుతోంది. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని, విన‌ని చ‌ర్య‌ల‌తో ప‌బ్లిక్‌ని ప‌రేషాన్ చేస్తున్నారు. ఇసుక పాల‌సీ అంటూ కూలీల నోట్లో మ‌న్ను కొట్టారు. ఏపీలో ఉపాధి లేకుండా చేశారు. ఒక్క కంపెనీ, ప‌రిశ్ర‌మ‌నైనా ఏర్పాటు చేయ‌కుండా.. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌కుండా.. రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేశారనే విమ‌ర్శ‌. ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌పైనే క‌త్తిగ‌ట్టి.. వాటంత‌ట అవే వెళ్లిపోయేలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేవ‌లం మ‌ద్యం ఆదాయంపైనే ఆధార‌ప‌డి.. అప్పుల‌తో పాల‌న‌ను నెట్టుకొస్తున్నార‌ని అంటున్నారు. ఖ‌జానా మొత్తం ఖాళీ కావడం.. కొత్త అప్పులు ముట్ట‌క‌పోవ‌డం.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు వేయ‌లేక పోవ‌డం.. ఇలా దివాళా అంచున‌కు చేరిన ఏపీకి.. స‌రికొత్త మార్గంలో ఆదాయాన్ని స‌మ‌కూర్చే ఆలోచ‌న‌లు చేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం. అయితే, ఆ ఐడియాలే బ‌హు విచిత్రంగా ఉండ‌టం.. విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.  అస‌లే క‌రోనా కాలం. సినిమాలు, థియేట‌ర్లు అంతంత మాత్రం. ఈ స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారుకు ఆదాయం రాబ‌ట్టుకోడానికి బ్ర‌హ్మాండ‌మైన ఆలోచ‌న చేసింది. ఇక‌పై ఏపీలో సినిమా టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే అమ్మితే ఎలా ఉంటుంద‌నే విధంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు షోలు న‌డిపితే.. తాము దివాళా తీయ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే థియేట‌ర్ల స‌మాఖ్య ఆవేద‌న, ఆందోళ‌న‌ వ్య‌క్తం చేస్తేంటే.. తాజాగా, ఆ సినిమా టికెట్ల‌ను సైతం తామే ఆన్‌లైన్లో అమ్ముతామంటూ ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.  సినిమా టికెట్ల ఐడియా బాగా న‌చ్చిన‌ట్టుంది.. అదే దారిలో.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు అమ్మాల‌ని భావిస్తోంది. రాష్ట్రంలో ల‌క్ష‌లాది మంది చిరు వ్యాపారులు నాన్‌వెజ్ అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. అలాంటిది ఏకంగా ప్ర‌భుత్వమే మ‌ట‌న్‌, ఫిష్ అమ్మితే.. ఇక వారంతా రోడ్డున ప‌డాల్సిందేన‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌ర్కారుకు ఇలాంటి త‌లాతోకాలేని ఆలోచ‌న‌లు ఎలా వ‌స్తున్నాయో అర్థం కావ‌ట్లేద‌ని అంతా మండిప‌డుతున్నారు. బ‌య‌ట‌కు రాకుండా తాడేప‌ల్లి ప్యాలెస్‌లోనే తిష్ట‌వేసి.. సీఎం జ‌గ‌న్ ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్‌నే త‌యారు చేస్తున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  ఇక సోష‌ల్ మీడియాలోనైతే వైసీపీ ప్ర‌భుత్వంపై మీమ్స్ మామూలుగా లేవు. సినిమా టికెట్ల అమ్మ‌కం నుంచి.. మ‌ట‌న్‌, ఫిష్‌, వంకాయ‌లు, బెండ‌కాయ‌లు అమ్ముతూ రాష్ట్రానికి కోట్ల‌కు కోట్లు రాబ‌డి సృష్టిస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా భ‌విష్య‌త్తులో.. సైకిళ్ల‌కు పంచ‌ర్లు, బండ్ల‌కు గాలి కొట్ట‌డాలూ చేయాల‌ని.. వాటితోనూ కోట్ల రాబ‌డి సాధించాల‌ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నారు. అబ్బో ప‌ర్లేదు.. ఏపీని ఎక్క‌డికో తీసుకుపోవ‌చ్చు.. అంటూ ఇంట్రెస్టింగ్ మీమ్స్‌తో జ‌గ‌న్ స‌ర్కారును సోష‌ల్ మీడియాలో కుమ్మేస్తున్నారు నెటిజ‌న్స్‌.   

ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి సీఎల్పీ లీడ‌ర్‌.. రేవంత్‌రెడ్డిని సీనియ‌ర్లు టార్గెట్ చేశారా? 

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచీ కాంగ్రెస్‌లో జోష్ మామూలుగా లేదు. హ‌స్తం కేడ‌ర్‌లో మునుప‌టి ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌లో పాత రోజుల‌ను గుర్తుకు తెస్తున్నాయి. ద‌ళిత బంధుతో సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో పూర్తిగా పాగా వేయాల‌ని చూస్తున్నారు. అందుకు విరుగుడు మంత్రంగా ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌ల‌తో రేవంత్‌రెడ్డి గులాబీ బాస్‌కు చెక్ పెడుతున్నారు. రేవంత్‌రెడ్డి నిర్వ‌హిస్తున్న దండోరాకు ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో త‌ర‌లివ‌స్తుండ‌టం.. స‌భ‌లు ఫుల్‌గా స‌క్సెస్ అవుతుండ‌టంతో.. కాంగ్రెస్ మాంచి ఊపు మీదుంది. ఇలాంటి స‌మ‌యంలో.. కాంగ్రెస్ ఉత్సాహాన్ని నీరుగార్చేలా.. పార్టీ సీనియ‌ర్లు ప‌స లేని నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని రేవంత్ వ‌ర్గం మండిప‌డుతోంది. ద‌ళిత బంధుపై ఓ వైపు రేవంత్‌రెడ్డి అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంటే.. అదే స‌మ‌యంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ద‌ళిత బంధుపై సీఎం కేసీఆర్ నిర్వహించే స‌మీక్ష స‌మావేశానికి హాజ‌ర‌వ‌డం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఒకే పార్టీలో ఇలా రెండు వేరు వేరు వైఖ‌రిలు స‌రికాద‌ని హ‌స్తం నేత‌లే త‌ప్పుబ‌డుతున్నారు. సో కాల్డ్‌ సీనియ‌ర్లంతా ద‌గ్గ‌రుండి స‌మాలోచ‌న‌లు జ‌రిపి.. కేసీఆర్‌తో మీటింగ్‌కు భ‌ట్టిని పంపించ‌డం ఏంట‌ని.. ఇదంతా రేవంత్‌రెడ్డి దూకుడుకు బంధ‌నాలు వేయ‌డ‌మేన‌ని విమ‌ర్శిస్తున్నారు.   తెలంగాణ‌లో 4 మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్‌ సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. అందులో, మధిర శాసనసభ నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. అందుకే, స్థానిక ఎమ్మెల్యే అయిన భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఆహ్వానం అందింది. దీంతో భట్టి నివాసంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్‌, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు భేటీ జ‌రిపారు. ముఖ్యమంత్రి నిర్వ‌హించే దళితబంధు సమావేశంలో పాల్గొని.. కాంగ్రెస్‌ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాల‌ని నిర్ణ‌యించారు.  భ‌ట్టి నివాసంలో జ‌రిగిన మీటింగ్‌కు హాజ‌రైన వారిలో మ‌ధుయాష్కీ మిన‌హా మిగ‌తా సీనియ‌ర్లంద‌రిపై రేవంత్‌రెడ్డి వ్య‌తిరేకులనే ముద్ర ఉండ‌టం ఆస‌క్తిక‌రం. పీసీసీ చీఫ్ రేవంత్‌ను ముందు నుంచీ లైట్ తీసుకుంటున్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఈ భేటీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయ‌డం అందుకు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. రేవంత్‌రెడ్డి ఛాలెంజింగ్‌గా తీసుకొని చేప‌డుతున్న ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌ల స్పూర్తిని చెడ‌గొట్ట‌డానికే సీనియ‌ర్లు ఇలా స‌మావేశ‌మై సీఎంతో మీటింగ్‌కు కాంగ్రెస్ త‌ర‌ఫున భ‌ట్టిని పంపించార‌నే ఆరోప‌ణ వినిపిస్తోంది. దండోరా స‌భ‌కు ఏకంగా రాహుల్‌గాంధీనే ర‌ప్పించాల‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తుంటే.. సీఎల్పీ లీడ‌ర్‌ మాత్రం ఇలా ద‌ళిత బంధు సమీక్షకు వెళ్ల‌డం ప్ర‌జ‌ల్లో ఎలాంటి మెసేజ్ ఇస్తుందో తెలీదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచైతే కేసీఆర్‌ను బ‌య‌ట‌కు గుంజుతాన‌ని రేవంత్‌రెడ్డి స‌వాల్ చేశారో.. అదే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి వెళ్లి కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత భ‌ట్టి.. సీఎం కేసీఆర్‌తో స‌మావేశమ‌వ‌డాన్ని రేవంత్ వ‌ర్గీయులు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. రేవంత్‌పై క‌ళ్ల మంట‌తోనే సీనియ‌ర్లు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఆ మేర‌కు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ముస్లిం దేశంలో ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడి విగ్రహం..

విదేశాల్లో విగ్రహాలు లేదా అతిపెద్ద టవర్లు అంటే మనకు గుర్తుకొచ్చేవి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పీసా టవర్ లాంటి అతి కొద్ది మాత్రమే. కానీ ప్రపంచంలో అతి భారీ సైజు వినాయక విగ్రహం కలిగిన దేశం కూడా ఉంది. అదే థాయిలాండ్. కేవలం ఒక్క విగ్రహమే కాదు.. ఇక్కడ వినాయకుడికి మూడు విగ్రహాలున్నాయి. అన్నీ కూడా చాలా పెద్ద సైజువే కావడం విశేషం. ఈ గణేశ్ నవరాత్రుల సందర్భంగా థాయిలాండ్ లోని అతి భారీ సైజు వినాయక విగ్రహం విశేషాలు చూడండి.  ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడి కాంస్య విగ్రహాన్ని థాయిల్యాండ్ లో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం చూడటానికి ప్రపంచ   పర్యాటకులంతా  ఇష్టపడతారు. చాచొంగ్సావ్ ప్రావిన్స్ లోని క్లాంగ్ ఖ్యాన్ లో ఈ విగ్రహాలున్నాయి. సోంసావలీ ఫ్రవర రజతినుద్దమత్ అనే థాయి రాజు హయాంలో దీన్ని నిర్మించారట. 39 మీటర్ల ఎత్తులో పూర్తి కాంస్యంతో నిర్మించడం ఈ వినాయకుడి మరో ప్రత్యేకత.  39 మీటర్లు అంటే దాదాపు 150 అడుగుల విగ్రహం అన్నమాట.  థాయిలాండ్ ముస్లిం కంట్రీ అయినా కూడా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు తమ మూలాలను మాత్రం మరచిపోలేదు. మూలాలను అంటిపెట్టుకునే ఉన్నారు కాబట్టే.. వాటిని జీవితంలో భాగం చేసుకున్నారు కాబట్టే... ఆ దేశానికి టూరిజం ద్వారా పెద్దమొత్తంలో ఆదాయం లభిస్తోంది. కాలక్రమంలో వారు ఇస్లాంనే పాటిస్తున్నా.. అంతకు పూర్వం ఉన్న వారసత్వ వైభవాన్ని మాత్రం ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. వేదకాలం, ఆ తరువాతి కాలంలో భారతదేశాన్ని భరతఖండం అని పిలిచేవారు. సంస్కృతీ, సంప్రదాయాలు, మేధో వలసలు అన్నీ భారత్ నుంచే జరిగాయి. భారత్ నుంచి వెళ్లిన అనేక తరాల ప్రజలు తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా ఆసియా ఖండమంతటా హిందూ సంస్కృతి వ్యాపించడానికి ఇదే కారణమంటారు.  ఇక థాయిల్యాండ్ లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా 39 అడుగులు కాంస్య విగ్రహాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండడం విశేషం. అక్కడ బౌద్ధులు ఎక్కువగా ఉన్నా.. వారంతా హిందూ ట్రెడిషన్ నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. గణేశ్ ఉత్సవాలను బౌద్ధులు కూడా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఇక్కడ గణేశుణ్ని ఫ్ర ఫికానె (శ్రీ గణేశ్) అని థాయి భాషలో పిలుస్తారు. హిందువులు తమ అన్ని కార్యాల్లో విఘ్నం కలగకుండా చూడాలని, విజయం కలిగించాలని వినాయకుణ్ని ఎలాగైతే వేడుకుంటారో బౌద్ధులు కూడా అదే తరహాలో వినాయకుణ్ని పూజించడం విశేషం. కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు, నూతన కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, పెళ్లిళ్ల లాంటి శుభకార్యాల్లో అక్కడి బౌద్ధులు వినాయకుణ్నే ఆరాధిస్తారు. థాయిల్యాండ్ లో ఉన్న మూడు పెద్దసైజు వినాయకులను దర్శించేందుకు నవరాత్రుల టైమ్ లో పెద్దఎత్తున పర్యాటకులు క్యూ కడతారు.  ఇక హిందూ మెజారిటీ గల ఇండియాలో ఎవరైనా వినాయకుడికి ఇంత భారీ ప్రయారిటీ ఇస్తే మాత్రం విమర్శించడానికి కొన్ని వర్గాల ప్రజలు మాత్రం రెడీగా ఉంటారు.

పెగాసస్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్.. కేంద్రానికి షాక్ తప్పదా? 

దేశంలో ప్రకంపనలు స్పష్టించిన పెగాసస్ స్పైవేర్ అంశం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో మొదటి నుంచి సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తున్న ధర్మాసనం కేసు విచారణ సందర్భంగా కేంద్ర సర్కార్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో  పెగాసస్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కేసులో కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైన సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వు చేసింది.పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనందువల్లే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దాఖలు చేయాలని నిర్ణయించింది.రెండుమూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్వర్వులు జారీ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కేంద్రానికి పునరాలోచన ఉంటే ధర్మాసనానికి చెప్పవచ్చని సీజేఐ సూచించారు.  పెగాసస్‌ స్పైవేర్ అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్( వాదనలు వినిపించారు. స్పైవేర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే కేంద్రం అభిప్రాయమని, ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని ఎస్‌జీ చెప్పారు. వాదనల సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు.ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి సొలిసిటర్ జనరల్ సమాధానం ఇస్తూ.. స్పైవేర్‌ అంశంపై లోక్‌సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే స్పైవేర్‌పై కమిటీని నియమించడం.. విచారణ చేయడం ఇక్కడ ప్రశ్న కాదని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ స్టాండ్ ఏంటో తెలుస్తుందని సీజేఐ సూచించారు. కేంద్ర మాజీమంత్రి రవిశంకర్‌ప్రసాద్ 2019లో పెగాసస్‌పై చేసిన ప్రకటనను  సీజేఐ ప్రస్తావించారు.కేంద్రానికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని సీజేఐ అభిప్రాయపడ్డారు.  అయితే స్పైవేర్‌పై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని సొలిసిటర్ జనరల్ మరోసారి కోర్టుకు తెలియజేశారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ..అఫిడవిట్ దాఖలు చేస్తారనే గత విచారణలో సమయం ఇచ్చామని, కానీ మీరు మరోలా మాట్లాడుతున్నారని ఎస్‌జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అఫిడవిట్ దాఖలు చేసేందుకు కేంద్రం సుముఖంగా లేనందున మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సీజేఐ ఎన్వీరమణ పేర్కొన్నారు. ఈ కేసులో పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, శ్యామ్ దివాన్, రాకేష్ ద్వివేది, దినేష్ ద్వివేది వాదనలు వినిపించారు.