తెలంగాణలో తీన్మార్ ధమాకా.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఇప్పట్లో జరిగేలా లేదు. అయినా, రాజకీయ వాతావరణం మాత్రం, రేపో మాపో ఎన్నికలు జరుగుతాయన్నంతగా వేడెక్కింది. నాయకుల భాష అప్పుడే అరేతురే, వాడూ వీడూ దాకా వచ్చింది. ఇక రేపు ఎక్కడికి చేరుతుందో ఎంతగా దిగాజరుతుందో వేరే చెప్పనక్కర లేదు. అదలా ఉంటే, సెప్టెంబర్ 17న తెలంగాణలో తీన్మార్ ధమాకాకు రంగం సిద్దమైంది. ఒకే రోజున మూడు ప్రధాన పొలిటికల్ ఈవెంట్స్ కు తెలంగాణ వేదిక అవుతోంది.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఇది పార్టీలకు అతీతంగా ప్రజలు జరుపుకునే పండగ. నిజాం పాలన నుంచి, రజాకార్ల రాక్షస కృత్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. నిజానికి, సెప్టెంబర్ 17, తెలంగాణ స్వాతంత్ర దినం. అయినా, తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించ లేదు. కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు ప్రతి ఏటా, అదే డిమాండ్ చేస్తున్నా, తెరాస ప్రభుత్వం మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంద్ర పాలకులు ఏ విధంగా అయితే తెరాస చేసిన ఇదే డిమాండ్’ను పెడచెవిన పెట్టారో ఇప్పుడు తెరాస కూడా సీమాంధ్ర పాలకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా, విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా, రజాకార్ల వారసులు (ఎంఐఎం)కు భయపడో ఏమో కానీ, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 17 రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎక్కడిక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్మల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత షా ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో అధికార తెరాసపై యుద్దాన్ని ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న పాదయాత్ర కాకరేపుతోంది. బండితో పాటుగా బీజేపీ నాయకులు తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా ఎత్తు పల్లాలు లేని భాషలో ఏకి పారేస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళు రాజీనామాల దాక వెళ్ళాయి. ఈ నేపధ్యంలో జరుగుతున్న నిర్మల్ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా, గత కొంత కాలంగా బీజీపీ, తెరాసల మధ్య ఏదో బంధం ఉందని సాగుతున్న ప్రచారానికి అమిత్ షా సమాధానం ఇస్తారని భావిస్తున్నారు. అలాగే, నిర్మల సభ తర్వాత బీజేపే జోష్ పెంచుతుందని అంటున్నారు. అమిత్ షా వస్తోందే అందుకు, తెరాసతో ఎలాంటి చుట్టరికాలు లేవు, ఉండవు అని స్పష్టం చేయడంతో పాటుగా, తెరాసపై రాజకీయ యుద్ధానికి పచ్చ జెండా ఊపేందుకే అమిత్ షా వస్తున్నారని.పార్టీ నాయకులు అంటున్నారు.
అదే రోజున కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి సొంత గడ్డ గజ్వేల్’లో దళిత గిరిజన గర్జన సభను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్ర నేత రాహుల గాంధీ వస్తారని ప్రచారం జరిగినా, ఎందుకనో ఆయన రావడం లేదు. అయినా. ఇటు ప్రభుత్వానికి, అటు అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజక వర్గంలో ‘దళిత గిరిజన గర్జన’ సభను ఏర్పాటు చేశారు. అంతే కాదు లక్ష మందితో సభ నిర్వహిస్తామని, దమ్ముంటే ఆపాలని సవాలు విసిరారు.
మరో వంక ముఖ్యమంత్రి వ్యూహం ఏమిటో కానీ, ఆయన మంగళవారం అనుకున్న యాదగిరి పర్యటనను శుక్రవారం (సెప్టెంబర్ 17) కు వాయిదా వేసుకున్నారు. మొతానికి సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయ వేదిక మీద తీన్మార్... తమాషా రక్తికదుతుందని అదే విధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తునారు