కేబినెట్ లోకి కవిత ఎంట్రీ ఖాయమేనా? ఆయనకు ఆ పదవి అందుకేనా? 

తెలంగాణ మంత్రివర్గంలోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఉంటుందనే చర్చ గత రెండేండ్లుగా సాగుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవితను... ఆ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో  ఎమ్మెల్సీగా గెలిచారు. కవిత మండలికి ఎన్నికయినప్పటి నుంచే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ లోకి తీసుకోవడం కోసమే ఆమెను ఎమ్మెల్సీ చేశారనే చర్చ జరిగింది. అప్పటి నుంచి ఆ చర్చ అలా కొనసాగుతూనే ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. ఇటీవల ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత మళ్లీ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తే కవితకు చోటు ఖాయమా లేదా అన్న చర్చ మొదలైంది. తాజాగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఓ నియామకంతో ఎమ్మెల్సీ కవితను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయమనే చర్చ సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, రూరల్ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్దన్ ను ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించారు కేసీఆర్. మంత్రిపదవిని ఆశిస్తున్న బాజిరెడ్డికి సడెన్ గా ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కడంతో కొత్త సమీకరణలు ఊపందుకున్నాయి. కుమార్తె కవితను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి వీలుగానే బాజిరెడ్డి గోవర్దన్ కు ఆర్టీసీ పగ్గాలు ఇచ్చారని అంటున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి కవితతో పాటు బాజిరెడ్డి మంత్రిపదవి రేసులో ఉన్నారు. ఇప్పుడు బాజిరెడ్డికి కీలక పదవి ఇవ్వడం ద్వారా మంత్రి రేసు నుంచి కేసీఆర్ ఆయన్ను తప్పించారని అంటున్నారు.  బాజిరెడ్డిని కాదని కవితకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే రానున్న రోజుల్లో కవితకు.. పార్టీకి అంతో ఇంతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే.. ఆయన మనసు నొప్పించకుండా.. ఆర్టీసీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మంత్రివర్గంలోకి కవితను తీసుకోవటానికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే.. కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. పదవులన్ని ఫ్యామిలీ ప్యాక్ గా మారాయని.. కల్వకుంట్ల రాజరిక పాలనకు నిదర్శనంగా ఉందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి.  విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి.. మంత్రిగా కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ మంత్రిగా ఉన్నారు. ఎంపీగా ఓడిపోయినా కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి.. దగ్గర బంధువు సంతోష్ ను రాజ్యసభ సభ్యుడ్ని చేయటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన కవితను ఎమ్మెల్సీగా చేయటానికి కేసీఆర్ ప్రదర్శించిన తాపత్రయం ఆయనపై విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. కవితను కేబినెట్ లోకి తీసుకుంటే కుటుంబ పాలన అంశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అది టీఆర్ఎస్ ఇబ్బంది కల్గిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ లోకి కవితను తీసుకునే సాహసం కేసీఆర్ చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు?

ప్రతి పార్టీకి ఒక సిద్దాంతం, ఒక రాజకీయ పంథా ఉంటాయి. అలాగే, ప్రతి ప్రభుత్వానికి ఒక ఆర్ధిక విధానం, ఆర్థిక ప్రాధాన్యతలు ఉంటాయి. ఆ ప్రకారంగా పార్టీలు, ప్రభుత్వాలు పని చేస్తాయి.అంతే, కానీ, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఒకే రీతిగా, ఒకేలా ఉండవు. ఒకే విధంగా పని చేయవు. అందులోనూ ప్రాంతీయ్ పార్టీల ఆలోచనా ధోరణీ, జాతీయ పార్టీల ఆలోచన ధోరణి ఒకేలా అసలే ఉండవు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలకు మధ్య భావిలో కప్పకు  సముద్రంలో చేపకు ఉన్నంత తేడా ఉంటుంది.  అయితే, అదేమిటో తెరాస నాయకులు, మంత్రులు మాత్రం,అన్నిటికీ నన్నుచూడు అందం చూడు  అన్నట్లుగా అన్ని పార్టీలకు సుద్దులు చెపుతుంటారు. మంత్రి కేటీఅర్’లాగా ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలలోనూ వేలు పెడతారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజే మంత్రి శశి థరూర్ గురించి ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఆ తర్వాత అందుకు ఆయనకు రేవంత్ క్షమాపణలు చెప్పారు... శశి థరూర్ కూడా రేవంత్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఏ సందర్భంలో చేశారో అర్థం చేసుకున్నారు. ఆ ఇద్దరూ ఆ విషయాన్ని మరిచి పోయారు.   కానీ, కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లుగా కేటీఆర్ మాత్రం అదే విషయాన్ని పట్టుకుని, పదే పదే గుర్తు చేసి ఎద్దేవా చేస్తున్నారు.  తాజాగా, మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన, కేటీఆర్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి ప్రశ్నించారు. అలాగే, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంటే, షర్మిల ఏమి మాట్లాడాలో, ప్రవీణ్ కుమార్ ఏమి చేయాలో కూడా ఈయనే చెపుతారా? ఇదెక్కడి ధోరణి, అంటూ రాజకీయ వర్గాలు కేటీఆర్ వింత ధోరణిని  అసహించు కుంటున్నాయి. జాతీయ పార్టీలు లేకుంటే, తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? అని  ప్రశ్నిస్తున్నారు.  అలాగే, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీ బంధు పెట్టాలని కీసీఅర్ డిమాండ్’ను కూడా రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ తెలంగాణాలో అమలవుతున్నాయా, అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం తెలంగాణ చేసినన్ని అప్పులు ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయవు, అని ప్రశ్నించలేదు, అంటూ విస్మయం వ్యక్తపరుస్తున్నారు.  నిజమే కావచ్చు, అటు నుంచి కాంగ్రెస్, ఇటు బీజేపీ దూసుకొస్తున్న నేపధ్యంలో, రేపు ఏమవుతుందో ? ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుందేమో అన్న నిరాశ,నిస్పృహలు కమ్ముకొస్తున్న సమయంలో, సహజంగానే మాటలు తడబడతాయి ... అయినా, రాజకీయ నాయకులు నోరు జారి గీత దాటడం మంచి కాదని అంటున్నారు, హితేషులు.

పంజాబ్ కొత్త ‘కెప్టెన్’ సిద్దూ ?

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే, ముందుగానే నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ శాసన సభా పక్షం (సీఎల్‌పీ) సమావేశం జరింగింది. నిజానికి, ముఖ్యమంత్రి, సీఎల్‌పీ నాయకుడు అమరీందర్ సింగ్’కు తెలియకుండానే, సీఎల్‌పీ సమావేశం ఏర్పాటు చేయడమే, అమరీందర్ రాజీనామా నిర్ణయానికి ఆఖరి కారణమని ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా తనకు తెలియకుండా గతంలోనూ అధిష్టానం రెండు సార్లు నేరుగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిందని అన్నారు.  అయినా  అప్పట్లోనూ  హర్ట్ అయినా సర్దుకు పోయానని చెప్పుకొచ్చారు. కానీ  ముచ్చటగా మూడో సారి కూడా అదే జరగడంతో ... ఆ అవమాన భారాన్ని భరించలేక అయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలిపారు. ఆమె కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నట్టు ఓకే ... ఇక మీదే ఆలస్యం అన్న ధోరణిలో మాట్లాడడంతో అయన హర్ట్ ఫీలింగ్స్ మరింత భగ్గుమన్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేశారు.  కాంగ్రెస్, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే అప్పగిస్తూ కాంగ్రెస్ సీఎల్‌పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎల్‌పీ సమావేశానంతరం పంజాబ్  కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీష్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ రెండు తీర్మానాలను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిందని, ఈ రెండూ సీఎల్‌పీ సమావేశంలో ఆమోదం పొందాయని చెప్పారు.“ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని కోరడం సంప్రదాయంగా వస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, కొత్త సీఎం ఎంపిక బాధ్యతను సోనియా గాంధీ అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సో ... సోనియా ఎవరిని సెలెక్ట్ చేస్తే వారు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన నాలుగైదు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక రెండవ తీర్మానం అమరీందర్ సింగ్’కు కృతజ్ఞతాపూర్వకంగా  వీడ్కోలు తెలిపే ఫార్మల్ తీర్మానం. ఈనేపధ్యంలో సోనియా గాంధీ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారు? అనేది ఇప్పుడు సస్పెన్స్’గా మారింది. అయితే, ఎవరికోసం అయితే, కెప్టెన్’కు ఉద్వాసన్ పలికారో, అదే నవజ్యోతి సింగ్ సిద్దూకు పట్టం కట్టే అవకాసం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిద్దూ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే అదే ఆశిస్తున్నారు.   అయితే, అదే జరిగితే, పార్టీ అధిష్టానం సిద్దూ పేరును ప్రతిపాదిస్తే, తాను ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తానని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. అంతే కాదు, సిద్దూను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఇంకా చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన (నవజోత్ సింగ్ సిద్ధూ) పేరును నా దేశం కోసం నేను వ్యతిరేకిస్తాను.ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన స్నేహితుడు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయి’’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు.   రాహుల్ గాంధీ ఇప్పటికీ, సిద్దూ వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని జతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తోంది. మరో వంక రాహుల్ గాంధీ, 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అమరీందర్’ స్థానంలో ప్రతాప్ సింగ్ భాజ్వాను  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టు పట్టరని, అయితే అప్పట్లో సోనియా గాంధీ పార్టీ సేనియర్లకు విలువ నిచ్చిరాహుల్ ప్రతిపాదనను పకక్న పెట్టారని అంటారు.  అప్పటినించి కూడా రాహుల్ , అమరీందర్  మధ్య ఒక విధమైన రచ్చ సాగుతూనే ఉందని,ఆ పర్యవసానంగానే జూలై లో సిద్దూ పీసీసీ అధ్యక్షుడయ్యారు . అప్పుడు కూడా అమరీందర్ ఇదే విధంగా అభ్యంతరం చెప్పారు. అయినా రాహుల్ గాంధీ, సిద్దూకి పీసీసీ బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను సీఎల్‌పీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది రాహుల్ గాంధీనే కాబట్టి, సిద్దూ, కాదంటే పీసీసీ మాజీ చీఫ్ భజ్వాకు ముఖ్యమంత్రే అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీకి దక్కిన బాలాపూర్ లడ్డూ.. పాత రికార్డులు బద్దలు

హైదరాబాద్ లో వినాయన చవితి వేడుకలు అంటే ఖైరతాబాద్ మహా గణపతి తర్వాత అంతే ఫేమస్ బాలాపూడ్ లడ్డూ. ఖైరతాబాద్ మహా గణపతికి పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తితే.. బాలాపూర్ గణపతి లడ్డూ ఫేమస్. బాలాపూర్ లడ్డూ వేలానికి అంతర్జాతయ స్థాయిలో గుర్తింపు ఉంది. బాలాపూడ్ లడ్డూను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా పోటీ పడతారు. బాలాపూడ్ లడ్డూ వేలాన్ని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. ప్రతి ఏటా లడ్డూ వేలం పాలం పాటలో రికార్డులు స్పష్టిస్తూ ఉంటుంది బాలాపూర్ లడ్డూ. ఈ సంవత్సరం కూడా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బాలాపూర్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికింది. వేలం పాట‌లో ఆ ల‌డ్డూ రూ.18.90 ల‌క్ష‌లకు అమ్ముడుపోయింది. ఈ ల‌డ్డూను కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ  ర‌మేశ్ యాద‌వ్ , మ‌ర్రి శ‌శాంక్ రెడ్డి ద‌క్కించుకున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రమేష్ రెడ్డి. 2019లో జరిగిన వేలంలో రూ.17లక్షలా 60వేలు పలికింది. దీంతో గత ఏడాది కంటే ఈసారి లడ్డూ ధర లక్షా 30 వేలు పెరిగింది. కరోనా కారణంగా గత ఏడాది వేలం పాటను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు న‌గ‌ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.  నగరంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వెళ్లే వైపుగా శోభాయాత్రలో పాల్గొనే వాహనాలను మిన‌హా ఇతర వాహనాలను అనుమతించట్లేదు. హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్ బండ్ కు గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల కోసం వ‌స్తున్నారు. 

కేసీఆర్ సర్కార్ పై  రేవంత్ మరో అస్త్రం ..

అధికారమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దాన్ని ప్రకటించి , వరస బాణాలు సంధిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మరో అస్త్రాన్ని సిద్దం చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పరుగులు తీసేలా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు యువత, విధ్యార్ధులను తమ వైపుకు తిప్పుకునేందుకు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరుతూ, యువ భేరి మొగించేందుకు సిద్దమయ్యారు.  నిధులు, నీళ్ళు, నియమకాలే ప్రధాన నినాదంగా సాధించుకున్న తెలంగాణలో, నియామకాల ఊసే లేకుండా పోయింది. నిరుద్యోగులు ఆత్మహత్యలు నిత్య కృత్యంగా మారాయి.. ఎక్కడో అక్కడ తరచూ నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఉన్నాడు. ఇప్పటికే, ఇచుమించుగా 20౦ మందివరకు నిరుద్గ్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది,ఉద్యమ కాలంలో ఆత్మబలిదానం చేసుకున్న 1400 మంది నిరుద్యోగ యువతకు అదనం. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పై దృష్టిని కేద్రీకరించారు. అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని, టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌, లేదా వరంగల్‌లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని, దానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేదా ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రప్పించాలని నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులు పాల్గొన్న సమావేశంలో ప్రధాన అజెండాగా అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు తీసుకున్న కార్యక్రమంపైనే చర్చించారు. నోటిఫికేషన్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి వరకు ఈ కార్యక్రమంలో ప్రస్తావించాలనుకున్నారు. ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రె్‌సలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. వర్సిటీలు, విద్యాసంస్థలను సందర్శించి యువతతో చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్టు 2 నుంచి డిసెంబరు 9 వరకు ఎప్పుడు ఏ కార్యక్రమం.. ఎలా నిర్వహించాలనే దానిపై మరో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు సాగిస్తున్న రేవత్ రెడ్డి మరో వంక తమ పోరాటంలో ఇతర పార్టీలను కలుపుకు పోయేందుకు నడుం బిగించారు. గతంలో కాంగ్రెస్ సారధ్యంలో సాగించిన ఉమ్మడి పోరాటాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) వామపక్షాలు సహా పలు పార్టీల నేతలతో  గాంధీభవన్‌లో సమావేశ మవుతున్నారు. ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం, 27న భారత్‌ బంద్‌లపైన ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.

టీటీడీ బోర్డు స‌భ్య‌త్వాల్లో గోల్‌మాల్‌.. కేంద్ర‌మంత్రి లేఖ‌తో క‌ల‌క‌లం..

లీల‌లు చాటే శ్రీవారికే.. లీల‌లు చూపించారు ఘ‌నులు. టీటీడీ జంబో బోర్డు స‌భ్య‌త్వాల నియామ‌కాల్లో గోల్‌మాల్ య‌వ్వారం జ‌రిగిన‌ట్టు తేలుతోంది. ఈ విష‌యం స్వ‌యంగా కేంద్ర‌మంత్రే వెల్ల‌డించ‌డంతో ఒక్క‌సారిగా అటెన్ష‌న్ పెరిగింది. ఇప్ప‌టికే టీటీడీ జంబో బోర్డు నియామ‌కంపై పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. తాజాగా ఏకంగా కేంద్ర‌మంత్రి పేరును వాడుకొని అక్ర‌మ మార్గంలో స‌భ్య‌త్వాన్ని క‌ట్ట‌బెట్టార‌ని తెలిసి అంతా ఉలిక్కిప‌డుతున్నారు. ఇంకా ఇలాంటి ఘ‌న‌కార్యాలు ఇంకెన్ని చేశారోన‌ని.. ఈ త‌తంగం వెనుక ఎన్ని కోట్ల సొమ్ము చేతులు మారాయోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య బోర్డునూ ఇలా వివాదాల‌కు, అక్ర‌మాల‌కు కేంద్రంగా మార్చ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  టీటీడీ జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. తాజాగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి రాసిన‌ లేఖ క‌ల‌క‌లం రేపుతోంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు వై.రవిప్రసాద్‌ పేరును తాను సిఫారసు చేయలేదని లేఖ‌లో కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, పర్యాటకశాఖ తరఫున గానీ.. తాను ఎవరినీ సూచించలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్‌కు సూచించారు.  కేంద్ర‌మంత్రి కిషన్‌రెడ్డి లేఖతో టీటీడీలో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. లేఖ‌ను బ‌ట్టి వై.ర‌విప్ర‌సాద్ అనే వ్య‌క్తిని కిష‌న్‌రెడ్డి రిక‌మెండేష‌న్ పేరుతో బోర్డులో ఆయ‌న పేరును జొప్పించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇంత‌కీ ఈ ర‌విప్ర‌సాద్ ఎవ‌రు?  కిష‌న్‌రెడ్డి పేరు చెప్పి ఆయ‌న్ను ప్ర‌త్యేక ఆహ్వానితునిగా చేర్చింది ఎవ‌రు?  తెర‌వెనుక ఈ కుట్ర చేసింది ఇంకెవ‌రు? అంత ఈజీగా ఈ ప‌ని ఎలా చేయ‌గ‌లిగారు?  టీటీడీ పెద్ద‌ల హ‌స్తం ఉందా? లేక‌, రాష్ట్ర పాల‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ య‌వ్వారం సాగిందా? ఏపీ బీజేపీ కీల‌క నాయ‌కులే కిష‌న్‌రెడ్డి పేరు చెప్పి ఈ ప‌ని కానిచ్చేశారా? ప్ర‌తిఫ‌లంగా చేతులు మారిన మొత్తం ఎంత‌? ఆ సొమ్ము ఎవ‌రికి ముట్టింది? డ‌బ్బులా లేక మ‌రేదైనా క్విడ్‌ప్రోకో న‌డిచిందా? ఇలా అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇందులో వైసీపీతో పాటు ఏపీ బీజేపీ నేతల పాత్ర కూడా ఉన్నట్టు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందిన‌ట్టు తెలుస్తోంది.   

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్‌".. ముదిరిన డ్ర‌గ్స్ జ‌గ‌డం..

మాట‌కు మాట‌. స‌వాల్‌కు ప్ర‌తిస‌వాల్‌. కేటీఆర్‌-రేవంత్‌రెడ్డి మ‌ధ్య డ్ర‌గ్స్ జ‌గ‌డం ముదురుతోంది. ప‌ర‌స్ప‌ర స‌వాళ్లతో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్‌కు లింకు పెడుతూ కొద్దిరోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. గ‌జ్వేల్ స‌భ‌లో మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. డ్ర‌గ్స్ వాడేవారికి కేటీఆర్ అంబాసిడ‌ర్ అంటూ ర‌చ్చ రాజేశారు. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. డ్ర‌గ్స్‌తో త‌న‌కేంటి సంబంధం అంటూ రేవంత్‌రెడ్డిని నిల‌దీశారు.  డ్ర‌గ్స్ వివాదంలో మ‌రో అడుగు ముందుకేసిన కేటీఆర్‌.. త‌న ర‌క్త న‌మూనాలు, లివ‌ర్ టెస్ట్‌కు శాంపిల్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌న్నారు. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌.  పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఏమాత్రం త‌గ్గ‌ట్లే. మంత్రి కేటీఆర్ స‌వాల్‌కు ప్ర‌తిగా.. "వైట్ స‌వాల్" విసిరారు రేవంత్‌. కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు తాను "వైట్ ఛాలెంజ్‌" విసురుతున్న‌ట్టు చెప్పారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గ‌న్‌పార్కు ద‌గ్గ‌ర‌కు వ‌స్తా. మీరు ఏ హాస్పిట‌ల్‌కు ర‌మ్మంటే అక్క‌డికి వ‌స్తా. త‌న ర‌క్తం, వెంట్రుక‌లు ఇస్తా. మీకిష్ట‌మొచ్చిన ప‌రీక్ష‌లు చేయించుకోండి. అంటూ కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిల‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి "వైట్ ఛాలెంజ్" విసిరడం సంచ‌ల‌నంగా మారింది.  టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రాణా, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ల‌ను కేటీఆర్ కాపాడాల‌ని చూసింది నిజం కాదా? బెంగ‌ళూరులో డ్ర‌గ్స్ కేసుపై విచార‌ణ జ‌రుగుతుంటే టీఆర్ఎస్ నేత‌లు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? హైద‌రాబాద్ స్కూల్స్, కాలేజెస్‌, ప‌బ్స్‌లో డ్ర‌గ్స్ అమ్ముతుండ‌టం  మీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కాదా?  యువ‌త‌రాన్ని కాపాడే బాధ్య‌త లేదా? డ్ర‌గ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించ‌రు? అంటూ రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. మ‌రి, రేవంత్ విసిరిన "వైట్ ఛాలెంజ్"ని కేటీఆర్, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు స్వీక‌రిస్తారా?  

పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామా.. సిద్ధూతో మ్యాచ్‌లో కెప్టెన్ ఔట్‌..

పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ రాజీనామ చేశారు. హైక‌మాండ్ ఆదేశాల‌తో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రం స‌మ‌ర్పించారు. త‌న‌కు తెలీకుండా సీఎల్పీ స‌మావేశం ఏర్పాటు చేస్తూ.. ఇప్ప‌టికి మూడుసార్లు త‌న‌ను అధిష్టానం ఇలానే అవ‌మానించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అమ‌రీంద‌ర్‌. ఎవ‌రిని ముఖ్య‌మంత్రి చేయాలో అధిష్టానం ఇష్ట‌మ‌ని.. త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. వ‌చ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో సీఎం ప‌ద‌వికి అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌డం ఆస‌క్తిక‌రం.  కొంత‌కాలంగా పంజాబ్ కాంగ్రెస్‌లో అమ‌రీంద‌ర్‌కు, పీసీసీ చీఫ్‌ సిద్ధూకు మ‌ధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని క‌లిసిన ఉప‌యోగం లేకుండా పోయింది. గత అర్థరాత్రి, పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి హరీశ్‌ రావత్‌ చేసిన ట్వీట్‌తో తాజా పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రావత్ త‌న ట్వీట్‌లో శాసనసభాపక్ష అత్యవసర  సమావేశం నిర్వహించనున్నట్లు. తెలిపారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలను కోరారు. ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సైతం ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. దీంతో అర్థరాత్రి నుంచే ఉహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్వాసకే, అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాల్లో సిద్ధూ వర్గం విక్టరీ సింబల్స్’తో చెలరేగిపోయింది. అయితే, ఈ పరిణామాలు అన్నీ పైకి హఠాత్తుగా జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, చాలా కాలంగా పార్టీలో అంతర్గతంగా లుకలుకలు  బహిర్గతంగా భగ్గు మంటూనే ఉన్నాయి.  ముఖ్యమంత్రికి ఉద్వాసన అంటూ గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారం తనకు అవమానకరంగా ఉందని ఆయన నేరుగా సోనియాకే చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ తరుణంలో పార్టీ సీఎల్పీ సమావేశానికి పిలుపునివ్వడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక తాను సీఎం పదవిలో కొనసాగలేనని అమ‌రీంద‌ర్‌సింగ్‌ రాజీనామా  చేసిన‌ట్టు తెలుస్తోంది.   

వైసీపీ దాడుల‌పై ఎదురుదాడి.. ర‌గులుతున్న ర‌చ్చ‌..

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికార నివాసంపై శుక్రవారం అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు జరిపిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విజయవాడలో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాడికి నాయకత్వం వహించిన జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జోగి రమేష్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చిత్రపటాలను ద‌హనం చేశారు. సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న, చంద్రబాబుపై దాడిని ఖండిస్తూ మహిళల కూడా ఆందోళనలకు దిగారు. మంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడికి పాల్పడిన వైసీపీ నేతలు.. శనివారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును టార్గెట్ చేశారు. నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  మరోవంక చంద్రబాబు నివాసం వద్ద నిన్న చోటుచేసుకున్న ఘటనలపై గుంటూరు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఇదలా ఉండగా, చంద్రబాబు నివాసంపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ చిత మోహన్ తీవ్రంగా  ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదని రామకృష అన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికీ తప్పని.. సీఎం దీనిని ఖండించాలని, వైసీపీ శ్రేణుల్ని అడుపుచేయాలని అన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, విమర్శలు సైద్ధాంతికం ఉండాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. సిపిఐ నేత రామకృష్ణ విచారం వ్యక్త పరిచారు.  అలాగే, చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి,  చింతా మోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందన్నారు.  

బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాం.. రాజ‌ద్రోహం కేసు పెడ‌తాం.. రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్‌

డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆ డ్ర‌గ్స్ బుర‌ద‌లోకి కేటీఆర్‌నూ లాగారు రేవంత్‌రెడ్డి. నేరుగా ఇలా అని అన‌కుండా.. ప‌రోక్షంగా.. కేటీఆర్‌.. గోవా.. డ్ర‌గ్స్.. ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌.. ఇలా పొడిపొడిగా మాట్లాడి.. మేట‌ర్‌ అర్థ‌మ‌య్యేలా మెసేజ్ ఇచ్చారు. అటు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు గ్లామ‌ర్ కోసం డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ ప‌రోక్షంగా కేటీఆర్‌నే టార్గెట్ చేశార‌ని అంటారు. ఇలా, కేటీఆర్‌కు డ్ర‌గ్స్ మ‌కిలి బాగానే అంటించేస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు.  ఇక గ‌జ్వేల్ స‌భ‌లోనైతే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మ‌రింత సూటిగా ఆరోప‌ణ‌లు చేశారు. తండ్రి తాగుబోతుల‌కు, కొడుకు డ్ర‌గ్స్ వాడేవారికి అంబాసిడ‌ర్లుగా మారారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, కేటీఆర్ డ్ర‌గ్స్ వాడ‌తారా? కేటీఆర్‌కు డ్ర‌గ్స్ దందాకు లింకుందా? కేటీఆర్ గోవా అందుకే వెళ్లారా? ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాలు.. అంత‌కుమించి అనుమానాలు. విష‌యం ముద‌ర‌డంతో కేటీఆర్ ఆ ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల్సి వ‌చ్చింది. తాజాగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. త‌న‌కూ డ్రగ్స్‌కు ఏం సంబంధం?.. ఏ పరీక్షకైనా తాను సిద్ధమంటూ స‌వాల్ చేశారు. బ్ల‌డ్ టెస్ట్‌, లివ‌ర్ టెస్ట్ ఏదైనా చేయించుకోవ‌డానికి సిద్ధ‌మ‌ని.. ద‌మ్ముంటే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు. త‌న‌పై ఇలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని.. అవ‌స‌ర‌మైతే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని రేవంత్‌రెడ్డిని హెచ్చ‌రించారు కేటీఆర్‌. ఎవ‌డో గాడిద త‌న‌పై ఈడీకి ఫిర్యాదు చేశాడ‌ట అంటూ రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోటికొచ్చిన‌ట్టు వాగితే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్‌.  రేవంత్‌రెడ్డిపై మ‌రిన్ని విమ‌ర్శ‌లు చేశారు కేటీఆర్‌. 50 కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేత అన్నారు. పీసీసీ కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. అంటూ రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్‌.   

నిన్న చంద్ర‌బాబు హౌజ్‌.. ఇవాళ‌ అయ్యన్న ఇల్లు.. వైసీపీ మూక‌దాడులు..

ఉండ‌వ‌ల్లి ర‌చ్చ నర్సీప‌ట్నంకు షిఫ్ట్ అయింది. శుక్ర‌వారం చంద్ర‌బాబు ఇంటిపై దాడితో ర‌చ్చ చేసిన వైసీపీ మూక‌లు.. శ‌నివారం టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిపై అటాక్‌కు ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా వ‌చ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జ‌రిగింది. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర‌ ఉద్రిక్తత నెలకొంది.  అయితే, వైసీపీ దాడిని ముందే ఊహించిన అయ్య‌న్న వ‌ర్గం.. పెద్ద సంఖ్య‌లో ఆయ‌న ఇంటి ముందు మోహ‌రించింది. అయ్య‌న్నపాత్రుడు ఇంటి ముట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే, ఆయ‌న అనుచ‌రులు వ‌స్తున్నార‌ని తెలుసుకున్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు భారీగా ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా త‌ర‌లివ‌చ్చారు. ఇరువైపులా పెద్ద సంఖ్య‌లో జ‌నం పోగ‌వ‌డంతో అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిద‌గ్గ‌ర హైటెన్ష‌న్ నెల‌కొంది.  దీంతో పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వైసీపీ శ్రేణుల‌ను క‌ట్ట‌డి చేశారు. అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా త‌ర‌లించారు. దీంతో ఉద్రిక్త‌త స‌ద్దుమ‌నిగింది. వైసీపీ నేత‌లు ఇలా దౌర్జన్యాలకు పాల్పడడడం మంచిది కాద‌ని టీడీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. వ్యక్తులు, కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలకంటే.. ప్రస్తుతం అయ్యన్న ఎక్కువగా మాట్లాడలేదని గుర్తు చేశారు. కొవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు.. వైసీపీ నేతలకు మాత్రం గొడవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.  

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం.. అమిత్‌షా చెప్పిందీ అదేనా..?

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ సక్సెస్. అదే రోజున గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ గ్రాండ్ సక్సెస్. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మీద రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతమా? అంటే, కావచ్చును. అయితే ప్రతిపక్షాల  బహిరంగ సభలు సక్సెస్ కావడం ఒక్కటే ప్రభుత్వ వ్యతిరేకతకు కొలమానమా, అంటే..కాదు కానీ, జాగ్రత్తగా గమనిస్తే, గజ్వేల్’లో కాంగ్రెస్ కానీ, నిర్మల్’లో బీజేపీ కానీ, జన సమీకరణకు పెద్దగా ఒళ్ళు హూనం చేసుకోలేదు. గత నెలలో హుజూరాబాద్’లో దళిత బంధు ప్రారంభ సభకు, జనాలను సమీకరించేందుకు అధికార పార్టీ ఎంత హడావిడి చేసిందో చూశాం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇలా హేమాహేమీలు అందరూ జనసమీకరణ క్రతువును మినిట్ టూ మినిట్ మానిటర్ చేశారు. ఎమ్మెల్యేలకు టార్గెట్స్ ఫిక్స్ చేసి, ఏసీ బస్సులు పెట్టి, ఇంకా ఏవేవో చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నడుం బిగిస్తే కానీ, సర్కార్ ఇజ్జద్  నిలవలేదు. దళిత బంధు సభ జన సమీకరణ ప్రయత్నాలతో  పోల్చిచూస్తే, గజ్వేల్, నిర్మల్ సభల సక్సెస్ కోసం కాంగ్రెస్, బీజేపీలు అంతగా కష్టపడవలసిన అవసరం రాలేదు. నిజమే, రెండు పార్టీలు జనసకరణకు కొంత ప్రయత్నం అయితే చేశాయి. కానీ,  చాలా వరకు జనం స్వచ్చందంగానే సభలకు హాజరయ్యారు. సక్సెస్ చేశారు.  అదలా ఉంటే, అక్కడ నిర్మల్’లో బీజేపీ నాయకులు.. ఇక్కడ గజ్వేల్’లో కాంగ్రెస్ నాయకులు  సహజంగానే ఉమ్మడి శత్రువు, తెరాసను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, ఫ్యామిలీనే టార్గెట్ చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి అదే భాషలో మాట్లాడారు. అదే సమయంలో, కాంగ్రెస్, బీజేపీల నాయకులు పరస్పర ఆరోపణలకు ఏ మాత్రం వెనకాడ  లేదు. ముఖ్యంగా చరిత్ర నుంచి.. నడుస్తున్న చరిత్ర వరకు మతపరంగా ఎవరు ఎవరి పక్షమో చాటుకునే ప్రయత్నం రెండు వైపులా నుంచి చేశారు. గజ్వేల్ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే దేశంలో దళితులు, గిరిజనులు, బహుజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అలాగే, ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ సమర్దిస్తుందని చెప్పారు.  మరోవంక నిర్మల సభకు ముఖ్య అతిధిగా వచ్చిన కేంద్ర హోం మంత్రి మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ, ప్రభుత్వం వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న మైనారిటీ రిజర్వేషన్ రద్దు చేయాలని డిమాండ్ సైతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే లౌకిక వాద పార్టీలు అనుసరిస్తున్న ముస్లిం సంతృష్టీకరణ విధానాలను ఎండ కట్టారు. తెరాస ప్రభుత్వం ఎంఐఎంకు భయపడుతోందని, తమ పార్టీ ఎవరికీ భయ పడదని అన్నారు. అలాగే, తెలంగాణ కారు తెరాస‌దే,  కేసీఆర్’దే అయినా స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని చురకలు అంటించారు. ఒవైసీలకు భయపడే కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించ‌డం లేద‌న్నారు. తాము అధికారంలోకి వ‌స్తే అధికారికంగా విమోచ‌న దినం నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ మతం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు చెరో గట్టున ఉన్నాయి అనేది సెప్టెంబర్ 17 న మరో మారు స్పష్టమైంది. అంతే కాదు, ముందు ముందు రెండు పార్టీలు అదే కార్డు ప్లే చేసేందుకు సిద్దమవుతున్నాయి అనే విషయంలో కూడా స్పష్టమైంది. నిజానికి జాతీయ స్థాయిలో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం కశ్మీర్’లో పర్యటించిన రాహుల గాంధీ, తానూ కశ్మీరీ హిందువునని ప్రకటించుకున్నారు. అలాగే, ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీనే నిజమైన హిందూ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.   అదలా, ఉంటే తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని, అమిత్ షా పరోక్షంగానే అయినా అంగీకరించారు. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించి పోతోంది కాబట్టి రాష్ట్రంలోనూ తెరాసకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని అమిత్  షా సూత్రీకరించారు. అదెలా  ఉన్నా, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ‘దే పై చేయని అమిత్ షా అంగీకరించడం సెప్టెంబర్ 17 రాజకీయానికి కొసమెరుపు.  

విరాళాలు 18 కోట్లు.. ఖ‌ర్చు 2 కోట్లు.. 20కోట్ల పన్ను ఎగవేసిన సోనూసూద్‌..

చూసేదంతా నిజం..కాక‌పోవ‌చ్చు. పైకి క‌నిపించేదంతా క‌రెక్ట్‌..కాక‌పోవ‌చ్చు. ఎవ‌రు మంచివాళ్లో, ఎవ‌రు మంచివాళ్ల‌లా న‌టిస్తున్నారో అంత ఈజీగా తేల్చ‌లేం. క‌ష్టాల్లో ఆదుకున్నోడు దేవుడు. ఆ కోణంలో క‌రోనా క‌ష్టాల్లో దేవుడిలా అవ‌త‌రించారు సోనూసూద్‌. అందుకే ఆయ‌న్ను ఆప‌ద్భాంద‌వుడు అన్నారు వ‌ల‌స కూలీలు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న వారికి మెడిసిన్‌, ఆక్సిజ‌న్ అందించి నేష‌న్ హీరో అయ్యారు సోనూసూద్‌. కొవిడ్ ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకోగా.. ఓ వ్య‌క్తిగా వ్య‌వ‌స్థ చేయ‌లేని సాయం చేసి చూపించారు సోనూసూద్‌. అందుకే, అలాంటి సూప‌ర్ హీరోపై స‌డెన్‌గా ఐటీ రైడ్స్ అన‌గానే అంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీ ప్ర‌భుత్వంతో చేతులు క‌ల‌ప‌డం వ‌ల్లే సోనూను టార్గెట్ చేశార‌ని మండిప‌డ్డారు. ఇదీ బీజేపీ ప్ర‌తీకార చ‌ర్య అంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే, మూడు రోజుల ఐటీ సోదాల త‌ర్వాత సోనూసూద్‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూస్తున్నాయి.  ప్రముఖ నటుడు సోనూసూద్ 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ‌ వెల్లడించింది. ఇటీవల ఐటీ అధికారులు ముంబై, ల‌క్నోలోని సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మూడురోజులు పాటు త‌నిఖీలు జ‌రిపారు. పన్ను ఎగవేత ఆరోపణలతో.. ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు తెలిపారు. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి 2.1 కోట్లను సేకరించినట్టు గుర్తించారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు ల‌భించాయ‌ని ఐటీ శాఖ తెలిపింది.  కాగా, ఫ‌స్ట్‌ వేవ్ సమయంలో సోనూసూద్‌ ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ 18 కోట్లకు పైగా విరాళాలను సేకరించ‌గా.. అందులో కేవ‌లం 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు ఖ‌ర్చు చేశారు. మిగతా డబ్బు అంతా ఆ సంస్థ ఖాతాలోనే ఉంద‌ని విష‌యం ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డటం క‌ల‌క‌లం రేపుతోంది.   

దొర పాలిట య‌ముడు.. రేవంతే అస‌లైన మొగుడు...

గ‌జ్వేల్‌లో దుమ్మురేగింది. కేసీఆర్ ఇలాఖాలో భూకంపం వ‌చ్చింది. 2 ల‌క్ష‌ల మంది రేవంత్ సైన్యం ప‌ద‌ఘ‌ట్ట‌న‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి. ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌లో వినిపించిన నినాదాలకు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో అద్దాలు ప‌గిలాయంటున్నారు. కాంగ్రెస్ స‌భ సూప‌ర్ స‌క్సెస్‌. రేవంత్‌రెడ్డి మీటింగ్ అదుర్స్‌. ల‌క్ష దాటుతార‌నుకోగా.. 2 ల‌క్ష‌ల జ‌నం రావ‌డం హస్తం పార్టీపై పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు సాక్షం. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వ ప‌టిమ‌కు నిద‌ర్శ‌నం.  రాహుల్‌గాంధీ రాక‌పోవ‌డం ఒక్క‌టే మైన‌స్‌. మిగ‌తా స‌భ అంతా గ్రాండ్ స‌క్సెస్‌. గ‌జ్వేల్‌లో ద‌ళిత గిరిజ‌న దండోరాతో సంచ‌ల‌నం సృష్టించారు రేవంత్‌రెడ్డి. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం.. ఆయ‌న ఇచ్చిన స్పీచ్‌.. అంతా హ‌ల్‌చ‌ల్‌. వీట‌న్నిటితో పాటు మ‌రో విష‌యం కూడా ఇంట్రెస్టింగ్‌. అదే ఈ క‌టౌట్‌... చూశారుగా. క‌టౌట్‌లో ఉన్న‌ది రేవంత్‌రెడ్డినే. య‌ముడి గెట‌ప్‌లో ఉన్నాడు. మామూలుగా అయితే య‌ముడిని నెగ‌టివ్ షేడ్‌లో చూస్తారు. అందుకే, య‌ముడి గెట‌ప్‌లో ఫ్లెక్సీ వేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు. కానీ, రేవంత్‌ను య‌ముడి రూపంలో ఇలా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయ‌డానికి స్ట్రాంగ్ రీజ‌నే ఉంది. ఊరికే పెట్ట‌లేదు య‌ముడి క‌టౌట్‌. దాని వెనుక అర్థం..ప‌ర‌మార్థం ఉంది. అదే ఈ ఫ్లెక్సీకి ట్యాగ్ లైన్ కూడా. దొర పాలిట య‌ముడు. ఈ టైటిల్‌తోనే కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో, గ‌జ్వేల్ ఫామ్‌హౌజ్‌లో ఉండే దొర కేసీఆర్‌ పాలిట య‌ముడు రేవంత్‌రెడ్డి అనే మీనింగ్‌తో ఈ భారీ కటౌట్‌ను పెట్టారు. స‌భ‌కు వ‌చ్చిన వారంతా య‌ముడు గెట‌ప్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని చూసి తెగ ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ముందు రేవంత్‌రెడ్డి ఏంటి.. య‌ముడి గెట‌ప్ ఏంట‌ని కాస్త సందేహించినా.. క‌టౌట్‌కు ఉన్న టైటిల్‌ను చూసి ఖుషీ అయ్యారు. అవును, నిజ‌మే. దొర పాలిట య‌ముడు రేవంత్‌రెడ్డినే అంటూ చ‌ర్చించుకున్నారు.  ఈ క‌టౌట్‌ను కూడా చాలా క్రియేటివ్‌గా సెట్ చేశారు. బ్లాక్ క‌ల‌ర్ పంచె, నెత్తిన కిరీటం.. చిన్న గ‌డ్డంతో.. రేవంత్‌రెడ్డి య‌ముడి గెట‌ప్‌లో భ‌టే షూట్ అయ్యారు. మొత్తం స‌భ‌లో ఈ ఫ్లెక్సీ మేట‌ర్ గురించే చ‌ర్చ‌. పెట్టింది ఎవ‌రో గానీ.. ఐడియా అదుర్స్‌....  

చంద్రబాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌.. రెండు కేసులు పెట్టిన పోలీసులు...

శుక్ర‌వారం ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటి మీద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడికి దిగారు. రాళ్లు, జెండా క‌ర్ర‌ల‌తో టీడీపీ వ‌ర్గీయుల‌ను గాయ‌ప‌రిచారు. వంద‌లాది మందిని వెంటేసుకొని వ‌చ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌.. టీడీపీ అధినేత నివాసం ద‌గ్గ‌ర ర‌చ్చ రంభోలా చేశారు. టీడీపీ విడుద‌ల చేసిన ఫూటేజీలో జోగి ర‌మేశ్ వ‌ర్గం ప‌దుల సంఖ్య‌లో కార్ల‌లో క‌ర్ర‌లు ప‌ట్టుకొచ్చిన దృశ్యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త‌త‌ను రేపిన చంద్ర‌బాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ముందురోజే ఎమ్మెల్యే ర‌మేశ్ తాను చంద్ర‌బాబు ఇంటిని చుట్టుముడ‌తాన‌ని చెప్పినా.. ఆయ‌న్ను హౌజ్ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం.. మార్గ‌మ‌ధ్య‌లోనే అడ్డుకోక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.  అంతా ముగిశాక‌.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ద‌గ్గ‌ర‌ చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా.. ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసును నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.    

సామాన్యుల ఖాతాల్లోకి నోట్ల వరద.. ఎందుకిలా..?

వారం రోజుల క్రితం ఒక సామాన్య వ్యక్తి ఖాతాలో 5.5లక్షలు జమయ్యాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు స్కూలు పిల్లల ఖాతాల్లో ఏకంగా 960 కోట్లు ఒకేసారి వచ్చి పడ్డాయి. ఆ మిస్టరీ  ఏమిటో తేలక ముందే శుక్రవారం ఓ రైతు ఖాతాలో 52 కోట్లు జమయ్యాయి. ఇలా బిహార్‌లో సాధారణ పౌరుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. అయితే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో, అంత సొమ్ములు సామాన్యుల ఖాతాల్లో వేస్తున్న, ‘’పుణ్యాత్ములు’ ఎవరో మాత్రం తెలియడం లేదు. కానీ, ప్రతి రోజు ఇక్కడో అక్కడో ఎక్కడో అక్కడ నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే, ఖాతాల్లో సోమ్ములు, (తెలంగాణలో  దళిత బంధు లబ్దిదారుల ఖాతాల్లో  జమైన రూ. 9,99,000 లాగా) చూసుకోవడానికే కాని, తీసుకోవడానికి లేకుండా బ్యాంకు అధికారాలు, ఆ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నారు. అయితే ఇందుకు ఒకే ఒక్క మినహా యింపు తమ ఖాతాలలో రూ.5.5 లక్షలు పడిన సామన్యుడు.. అతని ఖాతాలో జమైన సొమ్మును అతను, బ్యాంకు అధికారులు గుర్తించే లోగానే విత్ డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్నారు. అంతే కాదు. అవి ప్రధాని మోడీ వేసిన సోమ్ములంటూ వెనక్కి ఇచ్చేది లేదని  బ్యాంకు అధికారులకు షాక్ ఇచ్చారు.  ఇక తాజా విషయానికి వస్తే, అదే బీహార్ ముజఫరాపూర్‌ జిల్లా కతిహార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్‌ బహుదూర్‌ షా పింఛన్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఖాతాలో ఎంతుందో చెక్‌ చేయాలని అక్కడి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ (సీఎస్‌పీ) అధికారిని కోరగా.. ఖాతా చెక్‌ చేస్తే అందులో రూ.52 కోట్లు ఉన్నట్లు చూపించింది. అంతమొత్తం ఉండడం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలీదని బహుదూర్‌ షా చెప్పుకొచ్చాడు. అయితే ,ఇదే తరహాలో పెద్ద మొత్తంలో ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న ఉదంతాలు వెలుగుచూసినప్పుడు ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అలాగే, రామ్‌ బహుదూర్‌ షా ఖాతాను కూడా బ్యాంకు అధికారులు తాత్కాలికంగానిలిపి వేశారు.  అయితే, పాపం ఆ బక్క రైతు, అత్యాశకు పోకుండా అంతా వద్దులే, తన ఖాతాలో పడిన సొమ్ములో ఎంతో కొంత తనకిస్తే బతికేస్తానని బ్యాంకు అధికారులను అడుగుతున్నాడు. “వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం సాఫీగా సాగిపోతుంది’’ అని ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేశాడు. అయితే, అది అయ్యే పని కాదు కానీ, అసలు ఇలా సామాన్యుల ఖాతాలో కోట్ల రూపాయలు వచ్చి పడడం, ఏమిటో .. ఇందులో మాటలను ఏమిటో మాత్రం అంతు చిక్కని వింతగానే ఉంది. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయం;లో సామాన్యుల ఖాతాల్లో పెద్ద మొత్తాలు వేసి ‘పెద్ద’  మనుషులు సాగించిన గోల్ మాల్ వ్యవహారం వంటి వ్యవహారం ఏదైనా ఉందా .. అనే సందేహం కూడా కలుగుతోంది .. అయితే అదేమిటో ..అక్కడి  అధికారులకే తెలియాలి .. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు.  

కేంద్ర‌మంత్రి యూట్యూబ్ ఇన్‌క‌మ్ నెల‌కు 4 ల‌క్ష‌లు.. ఎలాగంటే...!

సెల‌బ్రిటీలు ఏం చేసినా ఫుల్ పైస‌ల్ వ‌స్తాయ్‌. సోష‌ల్ మీడియాలో వాళ్ల‌కు ఫుల్‌గా ఫాలోవ‌ర్స్ ఉంటారు కాబ‌ట్టి.. వారో ఏ పోస్ట్ పెట్టినా ల‌క్ష‌ల్లో వ్యూస్, లైక్స్‌ ఉంటాయి. అందుకే, సినీ సెలట్రిటీస్ సోషల్ మీడియా ఇన్‌క‌మ్ భారీగానే ఉంటుంది. కానీ, సినీ స్టార్స్‌తో పోలిస్తే పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌కు సోష‌ల్ మీడియాలో అంత‌గా క్రేజ్ ఉండ‌దు. ఫాలోయ‌ర్స్ ఉంటారు కానీ, వారు చెబితే ఆచ‌రించే టైప్ ఫ్యాన్స్ త‌క్కువ‌. అందుకే, రాజ‌కీయ నాయ‌కులు వారి ఎజెండాను ప్ర‌చారం చేసుకోవ‌డానికి మాత్ర‌మే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ యూజ్‌ఫుల్‌. అంతేకానీ, వాటి నుంచి లీడ‌ర్స్ ఎలాంటి ఇన్‌క‌మ్ ఎక్స్‌పెక్ట్ చేయ‌రు. కానీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మాత్రం సంథింగ్ స్పెష‌ల్‌. ఆయ‌న త‌న యూట్యూబ్ ఛానెల్ నుంచి దండిగా సంపాదిస్తున్నారు. ఏకంగా నెల‌కు 4 ల‌క్ష‌ల రాబ‌డి ఆర్జిస్తున్నారు. యూట్యూబ్ నుంచి మంత్రీ ఫోర్ లాక్స్ అంటే మామూలు విష‌యం కాదు. కేంద్ర‌మంత్రికి యూట్యూబ్ బాగానే గిట్టుబాటు అయిన‌ట్టుంది. ఇంత‌కీ ఆ ఆదాయం ఎలా వ‌స్తోందంటే... యూట్యూబ్‌ తనకు ప్రతి నెలా 4లక్షలు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీనే స్వ‌యంగా వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లోనే ఉండి లక్షల రూపాయాలు ఆర్జించానన్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో ఖాళీగా ఉండ‌లేక రెండు రకాల పనులు చేశానని చెప్పారు. అవే త‌న‌కు ఇంత ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయ‌ని అన్నారు. అవి ఏంటంటే... లాక్‌డౌన్ టైమ్‌లో కేంద్ర‌మంత్రి చెఫ్ అవ‌తారం ఎత్తారు. స‌ర‌దాగా ఇంట్లో వంట చేశారు. ఆ వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అలాగే, వంట అయ్యాక మిగ‌తా టైమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాన్యాసాలు ఇచ్చారు. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తదితరులకు ఆన్‌లైన్‌లో స్పీచ్‌లు ఇచ్చారు. ఇలా ఒక‌టి రెండూ కాదు.. దాదాపు 950కి పైగా ఉపన్యాసాలు ఇచ్చారు. అలా తానిచ్చిన ప్ర‌సంగాల‌న్నిటినీ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.  ఇటు వంట‌ల వీడియోలు, అటు గెస్ట్ లెక్చ‌ర్స్ వీడియోలు.. ఇలా కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఫీడ్‌కు భారీగా వ్యూస్ వ‌స్తున్నాయి. ఆ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. గ‌డ్క‌రీ వీడియోల‌కు వ్యూయ‌ర్‌షిప్ భారీగా పెర‌గ‌డంతో యూట్యూబ్ నుంచి డ‌బ్బులు కూడా బాగానే వ‌స్తున్నాయి. యూట్యూబ్ నుంచి నెల‌కు 4 ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తోంద‌ట నితిన్ గ‌డ్క‌రీకి. లాక్‌డౌన్‌లో భ‌లే మంచి బేరం క‌దా....  

మంత్రులు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌.. అందుకే అలా చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్నారా? ప్రభుత్వ పథకాల అమమలులో అవకతవకలు, పధకాలు, లబ్దిదారుల కుదింపు. అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో రోజు రోజుకు దిగాజారి పోతున్న శాంతి భద్రతలు, జడలు విప్పిన అవినీతి, అక్రమాలలు, మహిళలకు, చిన్నారులకు భద్రత‌లేని పరిస్థితి, పెరిగిపోతున్న మాన-భంగాలు, హత్యలు, హత్యాచారాలు  ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కడుతూ ప్రతిపక్షాలు, ప్రధానంగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ, అదే విధంగా బీజేపీ, జనసేన పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు శ్రద్ద చూపడం లేదని, చివరకు తమ శాఖలకు సంబంధించి వస్తున్న అవినీతి ఆరోపణలకు కూడా సంబంధిత శాఖల మంత్రులు సమాదానం ఇవ్వక పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  ఈమ‌ధ్యే జ‌రిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి.. సీనియర్ మంత్రులు సహా మంత్రులు అందరికీ గట్టిగా క్లాసు తీసుకున్నారని అంటున్నారు. విపక్షాలు చేసిన విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోతే, ప్రజలు.. ప్రతిపక్షాల విమర్శలే నిజం అనుకునే ప్రమాదం ఉందని అన్నారు. అలాగే, సమస్యల విషయంలో మంత్రుల నిర్లక్ష్య ధోరణి., అసమర్ధత వలన ప్రభుత్వ ప్రతిష్ట దినదినం దిగజారి పోతోందని, ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల పనితీరు పట్ల కూడా ముక్జ్హ్యమంత్రి జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తహం చేసినట్లు సమాచారం. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనంలోకి  వెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలుస్తోంది.   అయితే, మంత్రులు, పార్టీ నాయకులు మరో వాదన చేస్తున్నారు.  ప్రజల్లోకి వెళితే, ప్రతిపక్షాల కంటే గట్టిగా ప్రజలే ప్రభుత్వ వైఫల్యాలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల ఇసుక. మధ్య దందా,  అవినీతి అక్రమాలను  ఎత్తి చుతున్నారని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల మోతకు గత ప్రభుత్వం కారణమని చెపితే ప్రజలు నవ్వుతున్నారని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం నేరాలు పెరిగి పోవడం వంటి విషయాలలో ప్రజలు నిలదీస్తున్నారని, ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు అందక పోవడంతో అవమానాలు ఎదుర్కోనవలసి వస్తోందని అంటున్నారు.  అదలా ఉంటె ముఖ్యమంత్రి మంత్రి వర్గ సమావేశం సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మినహా మిగిలివ వారంతా పార్టీ బాధ్యతలకు సిద్దం కావాలని, మంత్రి వర్గంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నానని ముఖ్యమంత్రి స్పష్టం  చేశారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్సీలకు మంత్రి వర్గంలో స్థానం ఉండదని కూడా సీఎం చెప్పారని అంటున్నారు. కాగా, బద్వేల్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపినట్లు సమాచారం.  మంత్రులకు ముఖ్యమంత్రికి మొదటి నుంచి ఉన్న దూరం ఇప్పడు మరింతగా పెరిగిందని. అసహనం, సంతృప్తి మరింతగా పెరుగుతున్నాయని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, 2024 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యతను మరోమారు, ప్రశాంత్ కిశోర్ బృందానికి అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇంతవరకు, తమ అద్బుత పాలన చూసి ప్రజలు మళ్ళీ తమకే పట్టం కడతారనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, పీకే శరణు వేడుతున్నాంటే, అది ఆయనలో రెండున్నర ఏళ్లు ముందుగా మొదలైన ఓటమి భయానికి ఫ్రస్ట్రేషన్’కు నిదర్శనమని అంటున్నారు. ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక‌ల‌తోనే అయ్య‌న్న‌పాత్రుడి వ్యాఖ్య‌ల విష‌యంలో వైసీపీ నేత‌లు ఓవ‌రాక్ష‌న్‌కు దిగార‌ని.. జ‌గ‌న్ ముందు మార్కులు కొట్టేసి, మంత్రి ప‌ద‌వి కొట్టేసేందుకే ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేశార‌ని అంటున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల్లో అబాసుపాల‌వుతుంది కానీ, టీడీపీకి పోయేదేమీ లేద‌నే లాజిక్ మ‌ర్చిపోతున్నార‌ని మండిప‌డుతున్నారు. ఓట‌మి భ‌యంతో వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.   

కేసీఆర్ తాగుడుకు, కేటీఆర్‌ డ్రగ్స్‌కు అంబాసిడర్లు.. గ‌జ్వేల్‌లో రేవంత్ గ‌ర్జ‌న‌..

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెచ్చిపోయారు. కేసీఆర్ ఇలాఖా కావ‌డంతో మాంచి కాక మీదున్నారు. గ‌జ్వేల్‌లో 2 ల‌క్షల మందితో ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ను నిర్వ‌హించి తిరుగులేని స‌త్తా చాటారు. భారీ బ‌హిరంగ స‌భ‌కు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చిన జ‌నాల‌ను చూసి రేవంత్‌రెడ్డి పూన‌కంతో ఊగిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు.  ద‌ళిత గిరిజ‌న‌ దండోరా కావ‌డంతో ప్ర‌ధానంగా ఎస్సీ, ఎస్టీలకు జ‌రుగుతున్న అన్యాయం గురించే నిల‌దీశారు. జనాభా ప్రాతిపదికన కింద నిధులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తే దానిని పక్కన పెట్టి లక్ష కోట్లు పక్కదారి పట్టించార‌ని మండిప‌డ్డారు. కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినడానికి తాగుడే కార‌ణ‌మ‌న్నారు. 3.5 కోట్లు ఉన్న జనాభా 4 కోట్లు అయితే, తాగుబోతులను మాత్రం 3 రేట్లు పెంచిండని మండిప‌డ్డారు. సినిమా వాళ్లతో తిరిగిన కేటీఆర్ ఈడీ కేసులో ఇరుక్కున్న వారిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  తండ్రి తాగుబోతులకు.. కొడుకు డ్రగ్ తీసుకునే వాళ్లకు అంబాసిడర్ గా మారారు. పోరాటాలకు అడ్డాగా ఉన్న గడ్డను తాగుబోతులకు అడ్డాగా మారుస్తుంటే మనం మౌనంగా ఉందామా అని నిల‌దీశారు. 9,10 తరగుతుల పిల్లలు గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు ఓ సారి ఆలోచించు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.  తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కారు, ఇళ్లు లేని కేసీఆర్.. అటుకులు తిని ఉద్యమం చేశాన‌న్నారు.. మ‌రిప్పుడు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలు ఆలోచించాల‌ని పిలుపు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పండించేది పంట కాదు.. అవినీతి పంట అని అన్నారు. సైదాబాద్‌లో జరిగిన హత్యాచారం త‌న‌ను కలిచివేసిందని... కానీ నేరస్థుడు అరెస్ట్ కాకముందే.. పట్టుకున్నామని కేటీఆర్‌ ట్విట్టర్ల పెట్టి మళ్లీ సరిదిద్దుకుంటున్నా అని చెప్పిండే కానీ.. కుటుంబాన్ని పరామర్శించలే.. నేరగాళ్లను ఇట్టే పట్టుకునేందుకు నగరంలో 7 లక్షల కెమెరాలు ఉన్నాయని డీజీపీ చెప్పారు కదా.. నిందితుడిని 7 రోజులైనా పట్టుకోలేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణ చైతన్యం చూపెట్టి కేసీఆర్‌కు గోరి కట్టాలి. తెలంగాణ సమాజం కళ్లు తెరిస్తే కేసీఆర్ కాలిపోతడని తెలియజెప్పాలి అని అన్నారు. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవిని ఇవ్వలేదు. కేసీఆర్‌కు నిజంగా దళితులపై అభిమానం ఉంటే ఆయ‌న‌ ఇంట్లో ఉన్న ఓ మంత్రి పదవిని తీసేసి మాదిగ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వండి. కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టే ముంచారని, 14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు.  బూత్ కు 9 మంది చొప్పున నడుము బిగించి తుది దశ తెలంగాణ కోసం తరలిరండి. వారిని గుర్తించి గుండెల్లో పెట్టుకుంటాం. రాబోయే 19 నెలలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించబోతోంది. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్‌లో ధర్మ యుద్ధం చేద్దామని గ‌జ్వేల్ గ‌డ్డ నుంచి పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.