వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయి : గోరంట్ల

  వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయని ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయిన ప్రతిపక్ష బాధ్యతను తాము తీసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. మెడికల్ కాలేజీల కోసం మాట్లాడితే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారని ధ్వజమెత్తారు.  జగన్ అండ్ కో శాడిస్టు మనస్వత్వంతో వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పేదలకు రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని తెలిపారు. నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు అగ్ర హీరోలుని వైసీపీ హయంలో  టాలీవుడ్ నటులను అవమానించారనే అంశంపైనే అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు.  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకి జగన్ ఐదేళ్లపాటు బకాయిలు చెల్లించకపోతే.. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాలా తీసిందని విమర్శించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మెడికల్ కాలేజీలకు రూ.7,500 కోట్లు అవసరమైతే.. జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలను వైసీపీ పునాదుల్లోనే వదిలేసిందని  గోరంట్ల విమర్శించారు.  

విమానం గాలిలో ఉండగానే విండ్ షీల్డ్ కు పగుళ్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇటీవలి కాలంలో విమానాలలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో  జనం విమానయానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మధురై నుంచి ముంబై వెడుతున్న ఇండిగో విమానానికి తృటితో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు బతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే మధురై నుంచి ముంబై వెడుతున్న విమానం ముందు భాగంలో ఉండే అద్దానికి  (విండ్ షీల్డ్) పగుళ్లు ఏర్పడ్డాయి. విమానం ల్యాండ్ కావడానికి కొద్ది సేపటి ముందు జరిగిన ఈ ఘటనతో కంగుతిన్న పైలెట్ వెంటనే  విషయాన్ని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కు తెలియజేశాడు. కాక్ పిట్ లోని ముందు అద్దానికి ఈ పగుళ్ల ఏర్పడ్డాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్  చేయడంతో పెను ప్రమాదం తప్పింది.  అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా బే నంబర్ 95 వద్దకు తరలించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ కారణంగా ముంబై నుంచి మధురై వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్ ను రద్దు చేశారు.  విమానం అద్దం ఎందుకు పగిలిందనే దానిపై  దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

అనిల్ అంబానీకి ఈడీ షాక్

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ (సీఎఫ్ వో) అశోక్ కుమార్ పాల్ ను ఈడీ శనివారం (అక్టోబర్ 11) అరెస్టు చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు.  ఏడేళ్లుగా రిలయన్స్ పవర్‌లో సీఎఫ్‌వోగా పనిచేస్తున్న అశోక్ పాల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కి రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారెంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది.  ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో అసలు ఉనికిలోనే లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారెంటీ పత్రాలు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది.  కేవలం కాగితాలపై మాత్రమే ఉన్న ఈ కంపెనీ ద్వారానే రిలయన్స్ పవర్ తరఫున నకిలీ గ్యారెంటీలను ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిస్వాల్ కంపెనీ డైరెక్టర్‌ను గత ఆగస్టులోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ  విస్తృత దర్యాప్తు చేస్తోంది.   ఈ  దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. 

పుస్తక పఠనం ద్వారానే పరిపక్వత.. పవన్ కల్యాణ్

పుస్తకపఠనం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమౌతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐరాస మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, ఆ సందర్భంగా మాట్లాడుతూ తనపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందన్నారు.   విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో  మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.  దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందన్న పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ మహిళా విభాగానికి 'ఝాన్సీ వీర మహిళ' అని పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేయబోతున్నామని ఈ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు.   మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను పవన్ అభిమానినని చెప్పుకున్నారు. మంత్రిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే తాను కూడా అందరితో కలిసి పవర్ స్టార్, ఓజీ అంటూ అరిచేవాడనని చెప్పారు.  

నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్...దర్యాప్తు వేగవంతం

  అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు విచారణలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు దర్యాప్తు వేగం పెంచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్‌ అష్రఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో అతను 21వ నిందితుడిగా గుర్తించబడ్డాడు. అరెస్ట్‌ అనంతరం అష్రఫ్‌కు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తహసీల్దార్‌ శ్రీనివాసులు ఎదుట ఆయనను హాజరుపర్చనున్నారు. నకిలీ మద్యాన్ని వాహనంలో తరలించి గ్రామాలకు చేర్చడంలో అష్రఫ్‌ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో జయచంద్రారెడ్డి, ఆయన బావమరదలిని పట్టుకునేందుకు బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావును  గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా సంగతి తెలిసిందే.  

మ‌హా మాయ‌లేడి లెండి..

బిస్కెట్ల‌తో బుట్ట‌లో ప‌డేస్తుంది జాగ్ర‌త్త‌!  వైసీపీ లీడ‌ర్లు తాము చేసిన మోసాలు చాల‌వ‌న్న‌ట్టు వారి ఇన్ స్పిరేష‌న్ తో కొంద‌రు మోస‌గాళ్లు, మోస‌గ‌త్తెలు త‌యార‌య్యారంటే అతిశ‌యోక్తి కాదేమో. మొన్న‌టి వ‌ర‌కూ నెల్లూరు అరుణ ఈ కోణంలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో కిలేడీ లేడీ తెర‌పైకి వ‌చ్చింది. ఆమె పేరు విద్య‌. విద్య ఎంత‌టి ఘ‌టికురాలంటే ప్ర‌స్తుతం మ‌ద్యం కుంభ‌కోణంలో పీక‌లోతు కూరుకుపోయిన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పేరు అడ్డంగా వాడేసుకుని.. ఏకంగా 18 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిందని వింటే ఆశ్చ‌ర్య‌పోతారు ఎవ‌రైనా. త‌క్కువ ధ‌ర‌కు బంగారం వ‌స్తోంద‌ని.. మీరిచ్చిన డ‌బ్బుకు రెట్టింపు ఇస్తాన‌ని అమ్మ‌ల‌క్క‌ల మ‌ధ్య ఒక ప్ర‌చారం లేవ‌నెత్తింది. ఆ నోటా ఈనోటా విన్న ప‌లువురు మ‌హిళ‌లు ఇదంతా నిజ‌మేన‌ని ఆమె చెప్పిన బురిడీ క‌థ‌ల‌న్నీ న‌మ్మేశారు. కంటైన‌ర్ వ‌స్తుంది డ‌బ్బు కావాలంటూ వారి నుంచి డ‌బ్బు అడ్డంగా దోచేసింది. అంతే కాదు.. ఆమె చూపించిన బంగారు బిస్కెట్ల వ్య‌వ‌హారం నిజ‌మేన‌ని భావించి ఆమె బుట్ట‌లో ప‌డిపోయారు వీరంతా. ఇలా ఆయా మ‌హిళ‌లు జీవితాంతం దాచుకున్న సొమ్ము మొత్తం తీసుకెళ్లి ఇదిగో ఈ మాయ‌లేడి విద్య‌కు ధార‌బోసారు. ఇలా ఒక‌టీ రెండు కాదు ఏకంగా 18 కోట్ల రూపాయ‌ల మేర వీరు విద్య‌కు స‌మ‌ర్పించుకున్నారు. మేమిచ్చిన డ‌బ్బు ఏద‌ని అడిగితే ఇదిగో అదిగో, రేపూ మాపంటూ తిప్పించుకునేది. ఇలాక్కాద‌ని అంద‌రూ క‌ల‌సి ఆమెను క‌ల‌సి నిల‌దీయ‌గా.. త‌న భ‌ర్త చేత బాధిత మ‌హిళ‌ల‌ను చిత‌క‌బాదించిందీ మాయ‌లేడి. దీంతో  చేసేది లేక వీరంతా క‌ల‌సి పోలీసుల‌కు మొర‌పెట్టుకున్నారు. ఇలాంటి వారిని న‌మ్మి డ‌బ్బులివ్వ‌డం క‌రెక్టుకాద‌ని   చెబుతున్నా స‌రే, జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ్వ‌రూ కూడా ఎక్కువ డ‌బ్బులిస్తామంటే న‌మ్మొద్ద‌ని తాము గ‌త కొన్నేళ్లుగా చెబుతూనే వ‌స్తున్నామంటున్న పోలీసులు కేసు టేక‌ప్ చేసి విచార‌ణ చేస్తున్నారు. మ‌రి నిందితురాలు విద్య ఈ మొత్తం డ‌బ్బు.. ఎక్క‌డ దాచింది? ఆ వివ‌రాలేంటి? బాధితుల‌కు న్యాయం జ‌రిగే దారేది? తేలాల్సి ఉంది.

గాంధీజీకి నోబెల్ ఎందుకు ఇవ్వ‌లేదో మీకు తెలుసా!?

డైనమైట్ సృష్టిక‌ర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాప‌కార్ధం ఇచ్చే ఆరు అవార్డుల్లో నోబెల్ శాంతి పురస్కారం కూడా ఒక‌టి.  ఏటా సాహిత్యం, భౌతిక‌, ర‌సాయ‌న‌, ఆర్ధిక‌, ఔష‌ధ రంగాల‌తో పాటు శాంతి స్థాప‌కుల‌కు సైతం నోబెల్ పురస్కారం ప్రదానంచేస్తుంటారు.  ఎవ‌రైతే మాన‌వాళికి మేలు చేసేలాంటి సూత్రీక‌ర‌ణ‌లు చేస్తారో వారికి నోబెల్ పురస్కారం దక్కుతుంది. ఇక ప్ర‌పంచ శాంతి కోసం పాటు ప‌డేవారికి  నోబెల్ శాంతి పురస్కారం ప్ర‌దానం చేస్తుంటారు.  అయితే ఇక్కడ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే..  మిగిలిన ఐదు విభాగాల‌కు చెందిన నోబెల్ ప్రైజులు స్వీడ‌న్ లో ఇస్తుండ‌గా.. ఒకే ఒక్క శాంతి పురస్కారం మాత్రం నార్వేలో ఇస్తారు. కార‌ణం ఏంటంటే గ‌తంలో స్వీడ‌న్ నార్వే రెండూ ఒకే దేశంగా ఉండేవి. ఇప్ప‌టి వ‌ర‌కూ నోబెల్ శాంతి శాంతి పురస్కారం పొందిన ప్ర‌ముఖులు ఎవ‌ర‌ని చూస్తే.. ఈ జాబితాలో మార్టిన్ లూథ‌ర్ కింగ్, జూనియ‌ర్, ఎలిహూ రూట్, నెల్స‌న్ మండేలా, కోఫీ అన్న‌న్, జిమ్మీ కార్ట‌ర్, వంగారి మాతై, బ‌రాక్ ఒబామా, లియు క్సియాబో స‌హా ప‌లువురు ఉన్నారు. తాజాగా వెనెజువెలా మాన‌వ‌హ‌క్కుల నేత మ‌రియా కొరీనా మ‌చాడో అనే శాంతి క‌పోతానికి ఈ పురస్కారం ద‌క్కింది. 2014 లో భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ సంయుక్తంగా ఈ నోబుల్ శాంతి పురస్కారం పొందారు. 1948లో నోబెల్ శాంతి బ‌హుమ‌తి కోసం మ‌హాత్మాగాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయ‌న ఆ ఏడు జ‌న‌వ‌రి 30న నాథూరామ్ గాడ్సే పేల్చిన తుపాకీ గుండ్ల‌కు బ‌లి అయ్యారు. అప్ప‌ట్లో ఉన్న నియ‌మం ప్ర‌కారం.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించిన వారికి నోబెల్ పురస్కారం ఇవ్వాల‌న్న నిబంధ‌న ఉండేది. దానికి తోడు ఆయ‌న ఒక సంస్థ ప్ర‌తినిథి కాదు, ఆపై త‌న వీలునామా కూడా రాయ‌లేదు. దీంతో బ‌హుమ‌తి ఎవ‌రికి ఇవ్వాలో కూడా తెలియ‌లేదు. దీంతో  ఈ ప్ర‌తిపాద‌న విర‌మించుకుంది నోబెల్ క‌మిటీ. అంతే కాదు అర్హులంటూ మ‌రెవ‌రూ లేక పోవ‌డంతో ఆ ఏడాది శాంతి పురస్కార ప్రదానాన్నే విరమించుకుంది నోబెల్ కమిటీ.   1979లో మ‌ద‌ర్ థెరీసాకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి  వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆమె చేసిన మ‌రో మంచి ప‌ని ఏంటంటే నోబెల్ గ్ర‌హీత‌ల‌కు మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇచ్చే సంప్ర‌దాయ విందును నిరాక‌రించి ల‌క్షా 92 వేల డాల‌ర్ల‌ను భార‌త‌దేశంలోని పేద‌ల‌కు ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు. ఈ బ‌హుమ‌తులు అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఉప‌యోగ‌ప‌డ్డం వ‌ల్లే ఎక్కువ విలువ‌గా అభివ‌ర్ణించారామె.   ఇక 2025 సంవత్సరానికిగానూ  వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి  లభించింది. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య  జ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు.. అందుకే మచాడోను నోబెల్ శాంతి బ‌హుమ‌తికి అర్హురాలుగా ప్ర‌క‌టిస్తూ.. ప్రశంసల్లో ముంచెత్తిందీ క‌మిటీ.    కమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో తీవ్రంగా పోరాడుతున్నారు. నికొలాస్‌ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి మ‌రీ త‌న‌ పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఆమెపై మదురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి పారిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. అలా అజ్ఞాతంలో ఉండి కూడా ప్ర‌జాస్వామ్య జ్వాల ర‌గుల్చుతోన్న మ‌రియా కొరీనా మ‌చాడో ఈ పురస్కారానికి నిజంగా అర్హురాలేనంటారు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శాంతి కాముకులు. శాంతి విజేతా నీకు జేజేలు అంటూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ప్రభుత్వం ఏదైనా ఏపీలో మందుబాబులకు సుఖం లేదా!?

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు సుఖం లేకండా పోయిందా? వైసీపీ హయాంలో నాసిరకం మద్యం.. ప్రభుత్వం మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది ఇక నాణ్యమైన మద్యం దొరుకుతుందని ఆనందపడేలోగా కల్తీ మద్యం భయం పట్టి పీడించడం మొదలైంది. వైసీపీ హయాంలో నాసిరకం, తెలుగుదేశం హయాంలో కల్తీ మద్యం తాగలేక.. తాగకుండా ఉండలేక నానాయాతనకు గురౌతున్నారు ఏపీలో మందుబాబులు. ఆచార్య ఆత్రేయ ఓ పాటలో మనసున్న మనసుకూ సుఖము లేదంతే అన్నారు. ఏపీలో అయితే మందుబాబులు దీనిని కొంచెం మార్చి తాగే అలవాటున్న మనిషికి సుఖం లేదంతే అని పాడుకుంటున్నారు.    జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో.. మందుబాబుల‌కు నాణ్యమైన మ‌ద్యం దొరికిందే లేదు. ఒక వేళ అలాంటి మంచి బ్రాండ్ల‌కు చెందిన మ‌ద్యం తాగుదామంటే ఖాతా ఖాళీ అయిపోయేది జేబు గుల్ల‌యిపోయేది. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇదిగో ఈ జ‌య‌చంద్రారెడ్డి- జ‌నార్ధ‌న్ క‌ల‌సి చేసిన న‌కిలీ మ‌ద్యం బాగోతం కార‌ణంగా.. ఎక్క‌డ ఏమందు బాటిల్లో ఏం క‌లిపారో అన్న భ‌యాందోళ‌న వారిని వెంటాడుతోంది.  ఏపీ మ‌ద్యం బాబులూ మీకు మ‌ళ్లీ క‌ష్టాలు త‌ప్ప‌లేదు. మీరు తెలంగాణ వ‌చ్చిన‌పుడు మంచి మందు తాగుదురుగానీ.. ఏపీలో  మాత్రం తాగొద్దంటూ సామాజిక మాధ్య‌మాల్లో  నెటిజనులు తెగ పోస్టులు పెడుతున్నారు.  దీంతో మందు బాబులు ఏం చేయాలో తోచ‌క బుర్ర బ‌ద్ధ‌లు కొట్టుకుంటున్నారు. అస‌లే ఇలాంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుదామ‌ని సాయంత్రం పూట ఒక నైన్టీ వేసి చిల్ అవుదామ‌న్న‌ది మందుబాబుల ఆలోచ‌న‌. అలాంటి వారికి ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. ఇక్క‌డి మ‌ద్యం తాగొచ్చా? తాగితే ప‌రిస్థితేంట‌న్న‌ది వారికి అర్ధం కావ‌డం లేదు.   ఉన్న గొడ‌వ‌లు చాల‌వ‌న్న‌ట్టు ఇటీవ‌ల ఒక వ్య‌క్తి వైన్ షాపులోనే  చ‌నిపోయాడు. ఇదంతా న‌కిలీ మ‌ద్యం మ‌హ‌త్య‌మేనంటూ వైసీపీ తెగ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌చ్చిన పాములా ప‌డి ఉన్న వైసీపీకి ముల‌క‌ల‌చెరువు న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారం బయటకు రావడంతో పోయిన ప్రాణం తిరిగి వ‌చ్చిన‌ట్ట‌య్యింది. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై తామెంత ట్రై చేస్తున్నా మైలేజ్ రాక జుట్టుపీక్కుంటున్న వైసీపీకి కల్తీ మద్యం ఆయుధంగా మారింది. దీంతో ఇటు జ‌గ‌న్ నుంచి అటు సాధార‌ణ వైసీపీ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ ఏపీలో న‌కిలీ మ‌ద్యం ఏరులై పారుతోందంటూ.. లెక్క‌లు క‌ట్టి మ‌రీ వివ‌రిస్తున్నారు. దీంతో మందు బాబుల‌కు మ‌న‌సు మ‌రింత‌ పాడై పోతోంది. అప్పుడు చూస్తే అలా- ఇప్పుడు చూస్తే ఇలా.. ఏంటి మాకీ అగ్ని ప‌రీక్ష అంటూ  విల‌విల‌లాడుతున్నారు. తాజా క‌బ‌ర్ ఏంటంటే న‌కిలీ మ‌ద్యం కేసులో ఏవ‌న్ గా ఉన్న జ‌నార్ద‌న‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న గ‌న్న‌వ‌రంలో దిగ‌గానే ప‌ట్టుకుపోయారు. ఎక్క‌డికి తీసుకుపోయార‌న్న సంగ‌తి అలా ఉంచితే.. ఆయ‌న నోటి ద్వారా ఎవ‌రి పేర్లు బ‌య‌ట‌కొస్తాయ‌న్న‌ది స‌స్పెన్స్ గా మారింది. చూడాలి మ‌రి  ఈ మ‌ద్యం కేసు ఏ తీరం చేరనుందో.. ఎవరెవరి పేర్లు బయటకు రానున్నాయో? 

కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి.. మంత్రుల మధ్య టెండర్ల మంట!

తెలంగాణ కాంగ్రెస్ వివాదాలతో సహవాసం చేస్తున్నదా అనిపిస్తున్నది. నిత్యం అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలతో  సతమతమౌతూనే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య వార్ జరిగింది.  అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. అది అలా ఫుల్ స్టాప్ పడిందో లేదో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్  విషయంలో అలిగి.. తనకు టికెట్ రాకుండా చేసిన వారి పేరు త్వరలోనే బయటపెడతానంటూ మీడియాకు ఎక్కారు. దీంతో ఆయనను బుజ్జగించడానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ ఎపిసోడ్  అలా ముగిసిందో లేదో.. ఇలా మరో ఇద్దరు మంత్రుల మధ్య వార్ రచ్చకెక్కింది.   మంత్రి పొంగులేటి తన శాఖ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పరిధిలోని టెండర్లలో మంతి పొంగులేటి జోక్యమేంటంటూ కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి అనుచిత జోక్యం చేసుకుంటున్నారంటూ ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఆమె భర్త కొండా మురళి అధిష్ఠానానికి లేఖ రాశారు. ఇక ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.   దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో మరో  తలనొప్పి మొదలైనట్లైంది.  ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం  ఇబ్బందుల్లో పడిన సమయంలో కొత్తగా కొండా మురళి, పొంగులేటి మధ్య వార్ మరిన్ని ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినట్లైంది. వాస్తవానికి వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి మంత్రి కొండా సురేఖ్ అసంతృప్తితోనే ఉన్నారు.  జిల్లాకు చెందిన   అంశాల్లో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనీ గత కొంత కాలంగా కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడా అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.   ఇంతకీ విషయమేంటంటే...  మేడారం జాతర సమీక్ష సమావేశం లో మంత్రి పొంగు లేటి  తీరుపై  కొండా సురేఖ,  ఆమె భర్త అసంతృప్తి వ్యక్తం చేశారు.వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌ లో పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండి పడ్డారు.  టెండ‌ర్ల వ్య‌వ‌హారా లపై కాంగ్రెస్  అధ్య‌క్షుడు ఖ‌ర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.ఇదే విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపారు.   తాజాగా మంత్రి కొండా సురేఖ పొంగులేటి వ్యవహారశైలిపై అధిష్ఠానాని స్వయంగా ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికిసమాయత్తమౌతున్నారు. చూడాలి మరి ఈ వివాదాన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో?

మీరు శాంతిదూత ఎలా అవుతారు ట్రంప్?

ప‌హెల్గాం దాడికి సూత్ర‌ధారి   క‌సూరీని  ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టిస్తుంది ఐక్య‌రాజ్య‌స‌మితి. అత‌డేమో పాకిస్థాన్ న‌డి వీధుల్లో నిర్భ‌యంగా తిరుగుతుంటాడు. ట్రంప్, ఆయ‌న‌  కుటుంబం చూస్తే ఆ పాకిస్థాన్ తో వ్యాపారాలు చేస్తుంటారు. అంతేనా హ‌ఫీజ్ స‌యీద్ త‌ల‌కు సుమారు 90 కోట్ల రివార్డు ప్ర‌క‌టించింది మీరే, అత‌డికి పాకిస్థాన్ సైన్యం హైలెవ‌ల్ సెక్యూరిటీ అందిస్తూ కాపాడుతుంది. అతడేమో భార‌త్ మీద ఉగ్ర దాడుల‌కు ప‌థ‌క ర‌చ‌న  చేస్తుంటాడు. త‌ద్వారా యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అప్పుడు మీరేమో మీ ఎఫ్ 16లు ఇత‌ర‌త్రా ఆయుధాలు ఎలా ప‌ని చేస్తాయో చూద్దామ‌ని ఆలోచిస్తుంటారు. అలాంటి మీరు ఎలా అవుతారు శాంతి దూత‌?  ఇక్క‌డ మా పౌరుల చితిమంట‌ల్లో మీరు మీ మీ వ్యాపార లావాదేవీలు ఇత‌ర‌త్రా లాభ‌న‌ష్టాల బేరీజు వేస్తుంటారు. అలాంటి మీరు శాంతి దూత‌ అంటే న‌మ్మే వారెవ‌రు? ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం సంగ‌తే తీసుకుందాం. అక్క‌డ ఉక్రేయిన్ పీక‌లోతు క‌ష్టాల్లో ఉంటే.. మీరు చేసిందేంటి? ఆ దేశంతో ప‌దేళ్ల ఖ‌నిజ ఒప్పందం చేసుకోవ‌డం. వాళ్లు చావు బ‌తుకుల్లో ఉన్నా కూడా వ‌ద‌ల‌క వ్యాపారం చేయ‌డాన్ని ఏమంటారు? శాంతి స్థాప‌న‌గా దీన్నెలా భావించ‌గ‌లం? ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు  కొన‌డం ద్వారా, ఆ దేశానికి   నిధులు అందిస్తున్నారంటోన్న ట్రంప్.. మ‌రి గాజాపై త‌ర‌చూ విరుచుకుప‌డే ఇజ్రాయెల్ కి ఈ మ‌ధ్యే 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా నిధులివ్వడాన్ని ఎలా తీసుకోవాలి? ఇది శాంతికాముక‌త ఎలా అవుతుంది? ఉగ్ర‌వాదుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే పాకిస్థాన్ కి మీరు ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నుంచి ఏటా కొన్ని వంద‌ల కోట్ల డాల‌ర్ల నిధులు మంజూరు చేయిస్తుంటారు. వారేమో మ‌సూద్  అజ‌ర్ వంటి వారి ఉగ్ర స్థావ‌రాల ప‌రిర‌క్ష‌ణ‌కై ఈ నిధులు వెచ్చిస్తుంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డి సైన్యం ఉగ్ర‌వాదుల‌కు శిక్షణ ఇవ్వ‌డంతో  పాటు.. వారు ఏదైనా దాడుల్లో చ‌నిపోతే.. ద‌గ్గ‌రుండి జాతీయ జెండా క‌ప్పి మ‌రీ  అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తుంటుంది. అలాంటి దేశ ఆర్ధిక స్థితిని అనునిత్యం ప‌రిర‌క్షించే మీరు శాంతి సాధ‌కులు ఎలా అవుతారు? ప్చ్.. ఎనిమిది యుద్ధాల‌ను ఆపినా కూడా తనకు శాంతి బ‌హుమ‌తి రాలేద‌ని ట్రంప్ ఎలా అంటారు?  మీరు రివార్డులు ప్ర‌క‌టించిన అశాంతి కార‌కులు, ఉగ్ర‌నాయ‌కులు మీ కంటి ముందే తిరుగుతుంటే.. మీరేం చేస్తున్నారు? వారిని కట్టడి చేసి ప్ర‌పంచ శాంతి నెల‌కొల్పాల్సింది పోయి.. వారి ద్వారా ఉగ్ర‌దాడులు చేయించి ఆపై యుద్ధం వ‌చ్చేలా చేసి.. ఆ గ్యాప్ లో మీ ద‌గ్గ‌రున్న ఆయుధాల‌ను అమ్ముకోచూసే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ పీస్ మేక‌ర్ అవుతారు?  నిజంగా ట్రంప్ శాంతి దూతే అయితే.. మొద‌ట పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని అర్జెంటుగా అక్క‌డి నుంచి తొల‌గించాలి..  కార‌ణం ప‌హెల్గాం దాడికి కార‌కుడు ప్రేర‌కుడు. అత‌డే .  దాడికి మూడు రోజుల ముందు అత‌డు చేసిన రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లే  పహెల్గాం దాడికి కార‌ణం. అలాంటి వ్య‌క్తి యుద్ధం వ‌స్తే పారి పోయి ప్ర‌ణాళిక‌ల్లేవ్- ప్రార్ధ‌న‌ల్లేవ‌న్న పిరికిపంద‌.  మీ  కాళ్లు ప‌ట్టుకుని భార‌త్ చేత కాల్పుల విర‌మ‌ణ చేయించ‌డం.. శాంతి ప్ర‌య‌త్నం ఎలా అవుతుంది? పైపెచ్చు అటువంటి వ్యక్తిని అమెరికా  ఆర్మీ పరేడ్ కి పిలిపించ‌డం మాత్ర‌మే కాకుండా.. అత‌డికి ఫీల్డ్ మార్ష‌ల్ హోదా  ఇచ్చి.. ఆపై పాకిస్థాన్ ని మీ వ్యాపార ప్ర‌యోగ‌శాల‌గా మార్చే య‌త్నం చేస్తున్నారు. నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇలాంటి  ర‌క్త‌దాహంతో కూడిన వ్యాపార  ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే వారికి ఇవ్వ‌రు. అందుకెంతో నీతి, నిజాయితీ, ప్ర‌జా సేవ‌, ప్రాణ  త్యాగం వంటి అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మ‌రి మీరేం చేస్తున్నారు ఇప్ప‌టికీ ఏ దేశంలో ఏ స‌మ‌స్య త‌లెత్తుతుందా? దాన్ని మ‌న‌మెలా క్యాష్ చేసుకుందామా? అని చూస్తారు. క‌డుపులో ఒక‌టి పెట్టుకుని.. పైకి మాత్రం మ‌రొక నీతి వ‌చ‌నం వ‌ల్లె వేస్తుంటారు. భార‌త్ అంటే అనుక్ష‌ణం ర‌గిలిపోతూ.. ఆ దేశంపై వంద శాతం సుంకాలు విధిస్తుంటారు. మ‌రి ఇప్పుడు విధించండి.. నోబెల్ మీకు ఇవ్వ‌ని నార్వే దేశంపై వంద‌కు వంద శాతం సుంకాలు. ఎందుకంటే ఆ దేశం మిమ్మ‌ల్ని, మీ ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు క‌దా? ఎప్పుడైతే ర‌క్త‌పిపాసి  పాకిస్థాన్ మిమ్మ‌ల్ని ఈ బ‌హుమ‌తికి నామినేట్ చేసిందో అప్పుడే నోబెల్ క‌మిటీకి మీరేంటో మీ వ్యూహ‌మేంటో పూర్తిగా అర్ధ‌మై పోయింది.  పైపెచ్చు ట్రంప్ ది ఎంత‌టి తెంప‌రిత‌నం అంటే.. నోబెల్ నామినేష‌న్లు జ‌న‌వ‌రిలోనే ముగిశాయి. గ‌డువు ముగిశాక పాక్, ఇజ్రాయెల్.. ఆఖ‌రికి ర‌ష్యా చేత కూడా సిఫార్సు చేయించుకుని మరీ నామినేట్ అయ్యారు. అయినా సరే త‌మ నోబెల్ ని ట్రంప్ లాంటి  వారికిచ్చి.. ఆ మ‌చ్చ‌ను కొని తెచ్చుకోవ‌డం ఇష్టం లేని క‌మిటీ.. ఇదిగో వెనిజులా హ‌క్కుల కార్య‌క‌ర్త‌,  ప్ర‌తిప‌క్ష నేత, 58 ఏళ్ల‌ మ‌రియా మ‌చాడోకు ఇచ్చి ఈ ప్ర‌పంచానికి గొప్ప సందేశం ఇచ్చింది. ఇందులో మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈమె కూడా  త‌న‌కొచ్చిన ఈ శాంతి బ‌హుమ‌తిని ట్రంప్ కే అంకితం ఇవ్వ‌డం.  ఆల్రెడీ ఈ పుర‌స్కారం త‌న‌కు ద‌క్క‌ద‌ని భావించిన ట్రంప్ వైట్ హౌస్ నుంచి ద పీస్ ప్రెసిడెంట్ అనే అవార్డ్ పొందారు. అక్క‌డంటే నిపుణుల క‌మిటీ ఉండ‌దు. ఆయ‌న  చెప్పిందే వేదం కాబ‌ట్టి దీంతో సంతృప్తి చెందాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్ గా ట్రంప్ కి నోబెల్ రాక పోవ‌డానికి రాజ‌కీయాలే కార‌ణ‌మంటూ శ్వేత సౌధం స్పందించ‌డం.. ఈ ప్ర‌పంచమంతా క‌ల‌సి చేసుకున్న దుర‌దృష్టం కాక మ‌రేమిటంటారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.

బెంగళూరు టు లండన్.. జగన్ తిరిగొచ్చేది ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి లండన్ బయలుదేరారు. కోర్టు అనుమతిలో ఆయన ఓ పక్షం రోజుల పాటు యూకేలో పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలనీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించాలని ఆదేశించారు. తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ సంతకాలను గవర్నర్ కు అందజేస్తానన్నారు. ఆందోళనలకు పిలుపునివ్వడం, నేతలకు, క్యాడర్ ను ముందుకు నెట్టి తాను ముఖం చాటేయడం పట్ల వైసీపీ శ్రేణులలో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలకు పిలుపునిచ్చి జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యేవారని గుర్తు చేస్తున్నారు.  ఇంతకీ ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఎందుకంటే.. అక్కడ ఉన్న కుమార్తెలతో సమయం గడపడానికి అని చెబుతుంటారు. అండన్ లో వారి చదువులు పూర్తియిన తరువాత కూడా అక్కడే ఎందుకు ఉంటున్నారన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం వారితో సమయం గడపడానికి అంటూ ఓ పదిహేను రోజుల పాటు పార్టీకి అందుబాటులో ఉండకుండా వెడుతున్నారు. జగన్ నర్సీపట్నం పర్యటన విషయంలో జనసమీకరణను పార్టీ నేతలు, శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన స్వయంగా వచ్చినప్పుడే అంతంత మాత్రం అటెన్షన్ చూపిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు జగన్ విదేశాలకు వెడుతూ ఇచ్చిన ఆదేశాలను ఎంత మేరకు పాటిస్తారన్నది చూడాల్సిందే.  ఇక మరో విషయమేంటంటే జగన్ లండన్ యాత్రకు అనుమతి ఇస్తూ కోర్టు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఇప్పటి వరకూ తన పాస్ పోర్టు రెన్యువల్ కు కూడా కోర్టకు వెళ్లకుండానే చేయించుకున్నారు. అంతెందుకు కోడి కత్తి కేసులో సాక్షిగా కూడా ఆయన కోర్టుకు హాజరు కావడానికి సాకులు చెబుతూ ఆ కేసును సాగదీస్తున్నారు. ఇక లండన్ నుంచి వచ్చిన తరువాతనైనా ఆయన సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరౌతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.  

అమెరికా కర్మాగారంలో పేలుడు.. 19 మంది మృతి

అమెరికాలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 19 మంది మరణించారు. టేనస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో  ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.   సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న నివాసాలు బీటలు వారాయి. ప్రాణభయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఉండగా పేలుడు ధాటికి కర్మాగారం భవనం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు తీవ్రత కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కాగా పేలుడుకు కారణాలేంటన్నది వెంటనే తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.  

బీహార్ ఎన్నికలు.. క్లీన్ ఇమేజ్ కే పీకే పెద్దపీట

51 మంది అభ్యర్థులతో తొలి జాబితా ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఆ జాబితా మహామహా రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లైతే.. వారు అత్యధికులు రచయతలు, మేథమెటీషియన్లు, మాజీ బ్యూరో క్రాట్లు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు.  ప్రశాంత్ కిశోర్ విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాపై ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన్ సూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారూ, క్లిన్ ఇమేజ్ ఉన్నవారే కావడం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కులం, ధనం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే బీహార్ లో ఆ రెంటినీ పూర్తిగా విస్మరించి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలపాలని ప్రశాంత్ కిషోర్ భావించడం ఆసక్తి కలిగిస్తున్నది. అయితే అదే సమయంలో  ప్రశాంత్ కిశోర్ సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 51 మందితో విడుదల చేసిన జాబితాలో 16 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు.  ఇటు సామాజిక సమతుల్యత, అటు విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారితో ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన జాబితా విడుదల చేయడం ద్వారా తాను బీహార్ లో ధన స్వామ్యం, నేరస్వామ్యం లేని రాజకీయాలు నడుపుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పకనే చెప్పారు.   

మేడారంలో క్యూఆర్ స్కానర్లు.. ఎందుకో తెలుసా?

మెడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కానుకులు సమర్పించేందుకు ఆన్ లైన్ విధానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వన దేవతల దర్శనం తరువాత కానుకలు వేసేందుకు జేబులో క్యాష్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో  అధికారులు వనదేవతలకు కానుకలు సమర్పించడానికి ఆన్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం తాడ్వాయ్ కెనరా బ్యాంకు అధికారులతో సంప్రదించి.. మేడారం ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ స్కానర్ లను ఏర్పాటు చేయించారు. దీంతో వనదేవతలను దర్శించుకున్న తరువాత హుండీలో సొమ్ములు వేయాలని  అనుకున్నా చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఈ ఆన్ లైన్ స్కానర్లను మేడారం ప్రధాన పూజారి ఆవిష్కరించారు.  

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్​లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జోవోను హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించాలని నిర్ణించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 13)న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడైంది.  అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ లతో  ప్రభుత్వ వాదనలు వినిపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.   ఇక హైకోర్టు జీవో9పై స్టేవిధిస్తూ..  తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.   బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టేకు సంబంధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం (అక్టోబర్ 10) అర్ధరాత్రి దాటిన తరువాత అందుబాటులోకి వచ్చాయి.   ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది.  అలాగే రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా  కాలపరిమితి దాటిన స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు  ట్రిపుల్​ టెస్ట్​ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్​ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. శనివారం (అక్టోబర్ 11) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 74 వేల 468 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 86 లక్షల రూపాయలు వచ్చింది. 

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్

  ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.  ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్  ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో నవంబరు 4 తేదీన జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు.  సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా అమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.  గతంలో ఈ అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ-వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్,  గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావటంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం ఆమెను సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేశారు.

అప్పుల బాధతో... సొంత ఇంట్లోనే దోపిడీ

  విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ లో ధర్మాల  ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల క్రితం దోపిడీ జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంట్లో అతని తల్లి కొడుకు కృష్ణ కాంత్ మాత్రం ఉన్నారు అర్ధరాత్రి నిద్రపోతున్న దశలో ఇంటి వెనకనుంచి తలుపులు పగలగొట్టి నాన్నమ్మ మనవడు చేతులకు తాళ్లు కట్టి ముఖానికి ప్లాస్టర్ వేసి ఇంట్లో 12 తులాల బంగారం రెండున్నర లక్షల నగదును దోపిడీ చేశారు. ఆ అగంతకులు హిందీలో మాట్లాడారు దోపిడీ అనంతరం ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలోనే పరారయ్యారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తొలిత భావించారు. .. విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు  ..  కాంట్రాక్టర్ ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ విచారణలో విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమ్మలేని నిజాలను చూడాల్సి వచ్చింది. దోపిడి అనంతరం పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు ఇంటి ఆవరణలో నిందితులు ఎత్తుకుపోయిన వాహనం నగర శివారులోని మధురవాడ వద్ద కనిపించింది. అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో ఆనంద్ కుమార్ రెడ్డి తనయుడు కృష్ణ కాంత్ దినచర్యను ఆరా తీశారు. దోపిడీ జరిగిన అర్ధరాత్రి అతను కొందరుతూ ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ జరిగింది.  ఆ మేరకు విచారణ చేపట్టుగా వారంతా కృష్ణ కాంత్ స్నేహితులు గా తేలింది. పరపతి ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యనారాయణ అనే ఈ ముగ్గురు దోపిడీ జరిగిన కృష్ణ కాంత్ స్నేహితులు వీరంతా విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో  సెల్ టవర్ల ద్వారా నిందితుల కదలికను వెంటాడారు. దోపిడీ జరిగిన రోజు వీరు కంచరపాలెం లో ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆపై ఆ యువకులను పోలీసులు విచరించగా ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కృష్ణ కాంత్ ఇటీవల కాలంలో ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుల పాలయ్యాడు. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లోనే దొంగతనం చేయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకోసం ముగ్గురు స్నేహితులను సిద్ధం చేశారు.  ఇంట్లో తన తండ్రి లేని సమయంలో నాన్నమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులకు తాళ్లను కట్టి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేయాలని అనంతరం పంచుకుందామని కృష్ణ గాని చెప్పాడు. నెల రోజులుగా చేస్తున్న ఆ ప్రయత్నం ఒకరోజు ఫలించింది కానీ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నలుగురు నిందితులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.... విలాసవంతమైన జీవితం గడపాలని యువత ఆలోచన చేయడంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత  బాచ్చి  తెలిపారు. అయితే నేరం చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కడం ఖాయమని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకు హితవు పలికారు