సీబీఐ చార్జ్ షీట్ లో కనిపించని మనీష్ సిసోడియా, శరత్ చంద్రారెడ్డి పేర్లు
posted on Nov 26, 2022 8:59AM
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీలో పోటీలు పడి మరీ ఈ కేసు దర్యాప్తులో అంతులేని వేగం ప్రదర్శించాయి. దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు ఈ కుంభకోణం కేసులో వెలుగులోకి వచ్చాయి.
అసలీ కేసులు ఏ1గా డిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడిగా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ పే పేర్కొంది. సరే పలువురిని ఈ కేసులో అరెస్టు చేయడం కూడా జరిగింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే విచిత్రంగా ఎఫ్ఐఆర్ లో ఎ1 ముద్దాయిగా పేర్కొన్న మనీష్ సిసోడియా పేరును చార్జిషీట్ లో పేర్కొన లేదు. ఇంకా ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
మరో ఐదుగురు ప్రైవుటు వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రైవేటు వ్యక్తులలో తెలంగాణకు చెందిన అభిషేక్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రచురితమౌతున్న ఒక ప్రముఖ దినపత్రిక ఎండీ ఉన్నారు. అలాగే మరో వ్యక్తి అరుణ్ రామచంద్రపిళ్లై ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ అప్రూవర్ గా పేర్కొన్న దినేష్ అరోరా కూడా ఉన్నారు. కానీ ఈ కేసులో ఎ1గా ఎఫ్ ఐఆర్ లో సీబీఐ పేర్కొన్న మనీష్ సిసోడియా పేరు లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
అలాగే ఈ స్కాం కు సంబంధించి ఇటీవల అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరూ కూడా సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేమిటంటే.. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కాంలోనే అరెస్టయినా ఆయనను అరెస్టు చేసింది మాత్రం ఈడీ. సీబీఐ కాదు. అందుకే సీబీఐ చార్జ్ షీట్ లో ఆయన పేరు లేదంటున్నారు. మొత్తం మీద సీబీఐ చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేకపోవడంతో.. ఆప్ ఆరోపిస్తున్నట్లుగానే లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఏ1గా నమోదు చేశారా అన్న అనుమానాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
అయితే సిసోడియా సన్నిహితుడైన దినేష్ అరోరాను సీబీఐ అప్రూవర్ గా ప్రకటించడంతో ముందు ముందు మరేవైనా సంచలనాలు బయటపెట్టనుందా అన్న అనుమానాలూ వ్యక్త మౌతున్నాయి. ఇక నేడో రోపో ఇదే కేసులో ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ చార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి కోణాన్ని సీబీఐ, మనీల్యాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.