మ‌హా మాయ‌లేడి లెండి..

బిస్కెట్ల‌తో బుట్ట‌లో ప‌డేస్తుంది జాగ్ర‌త్త‌! 

వైసీపీ లీడ‌ర్లు తాము చేసిన మోసాలు చాల‌వ‌న్న‌ట్టు వారి ఇన్ స్పిరేష‌న్ తో కొంద‌రు మోస‌గాళ్లు, మోస‌గ‌త్తెలు త‌యార‌య్యారంటే అతిశ‌యోక్తి కాదేమో. మొన్న‌టి వ‌ర‌కూ నెల్లూరు అరుణ ఈ కోణంలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో కిలేడీ లేడీ తెర‌పైకి వ‌చ్చింది. ఆమె పేరు విద్య‌. విద్య ఎంత‌టి ఘ‌టికురాలంటే ప్ర‌స్తుతం మ‌ద్యం కుంభ‌కోణంలో పీక‌లోతు కూరుకుపోయిన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పేరు అడ్డంగా వాడేసుకుని.. ఏకంగా 18 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిందని వింటే ఆశ్చ‌ర్య‌పోతారు ఎవ‌రైనా.

త‌క్కువ ధ‌ర‌కు బంగారం వ‌స్తోంద‌ని.. మీరిచ్చిన డ‌బ్బుకు రెట్టింపు ఇస్తాన‌ని అమ్మ‌ల‌క్క‌ల మ‌ధ్య ఒక ప్ర‌చారం లేవ‌నెత్తింది. ఆ నోటా ఈనోటా విన్న ప‌లువురు మ‌హిళ‌లు ఇదంతా నిజ‌మేన‌ని ఆమె చెప్పిన బురిడీ క‌థ‌ల‌న్నీ న‌మ్మేశారు. కంటైన‌ర్ వ‌స్తుంది డ‌బ్బు కావాలంటూ వారి నుంచి డ‌బ్బు అడ్డంగా దోచేసింది. అంతే కాదు.. ఆమె చూపించిన బంగారు బిస్కెట్ల వ్య‌వ‌హారం నిజ‌మేన‌ని భావించి ఆమె బుట్ట‌లో ప‌డిపోయారు వీరంతా. ఇలా ఆయా మ‌హిళ‌లు జీవితాంతం దాచుకున్న సొమ్ము మొత్తం తీసుకెళ్లి ఇదిగో ఈ మాయ‌లేడి విద్య‌కు ధార‌బోసారు. ఇలా ఒక‌టీ రెండు కాదు ఏకంగా 18 కోట్ల రూపాయ‌ల మేర వీరు విద్య‌కు స‌మ‌ర్పించుకున్నారు.

మేమిచ్చిన డ‌బ్బు ఏద‌ని అడిగితే ఇదిగో అదిగో, రేపూ మాపంటూ తిప్పించుకునేది. ఇలాక్కాద‌ని అంద‌రూ క‌ల‌సి ఆమెను క‌ల‌సి నిల‌దీయ‌గా.. త‌న భ‌ర్త చేత బాధిత మ‌హిళ‌ల‌ను చిత‌క‌బాదించిందీ మాయ‌లేడి. దీంతో  చేసేది లేక వీరంతా క‌ల‌సి పోలీసుల‌కు మొర‌పెట్టుకున్నారు. ఇలాంటి వారిని న‌మ్మి డ‌బ్బులివ్వ‌డం క‌రెక్టుకాద‌ని   చెబుతున్నా స‌రే, జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ్వ‌రూ కూడా ఎక్కువ డ‌బ్బులిస్తామంటే న‌మ్మొద్ద‌ని తాము గ‌త కొన్నేళ్లుగా చెబుతూనే వ‌స్తున్నామంటున్న పోలీసులు కేసు టేక‌ప్ చేసి విచార‌ణ చేస్తున్నారు. మ‌రి నిందితురాలు విద్య ఈ మొత్తం డ‌బ్బు.. ఎక్క‌డ దాచింది? ఆ వివ‌రాలేంటి? బాధితుల‌కు న్యాయం జ‌రిగే దారేది? తేలాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు ముందు.. మంత్రి రాంప్రసాద్‌ కన్నీటి పర్యంతం

  అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాకి మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాయచోటి అభివృద్ధిని తానే ప్రత్యేకంగా చూసుకుంటానని, పట్టణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోనని  సీఎం, మంత్రికి భరోసా ఇచ్చారు.  సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది.  క్యాబినెట్‌లో 24 అంశాలను ఆమోదించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో మాత్రం మార్పులు జరిగినట్లు మంత్రి అనగాని వెల్లడించారు.  

డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడిన ఐబొమ్మ రవి!

సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్‌ కేసులో  రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తున్నది. తాజాగా ఐబొమ్మ రవి కేవలం పైరసీకే పరిమితం కాలేదనీ.  ఇతరుల గుర్తింపు పత్రాలను సైతం దొంగిలించి భారీ అక్రమాలకు పాల్పడిన వైనం వెలుగు చూసింది. గతంలో పోలీసుల ముందు రవి ఇచ్చిన వాంగ్మూలంలో... ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అనీ, ఐబొమ్మ నిర్వహణలో అతడికి కూడా పాత్ర ఉందని చెప్పాడు. అయితే విచారణలో   రవి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని తేలింది. వాస్తవానికి ప్రహ్లాద్‌కు ఏమాత్రం తెలియకుండానే అతడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక డాక్యుమెంట్లను రవి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. అలా దొంగిలించిన పత్రాలతో ప్రహ్లాద్ పేరుపై నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంతో పాటు అతని ఐడెంటిటీని వెబ్‌సైట్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ కోణంలో నిజాలను వెలికితీసేందుకు బెంగళూరులో నివసిస్తున్న ప్రహ్లాద్‌ను ప్రత్యేకంగా విచారణకు పిలిపించారు. రవి ఎదుటే ప్రహ్లాద్‌ను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టగా, అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు రవి ఎవరో తెలియదని, తామిద్దరం ఎప్పుడూ రూమ్‌మేట్స్‌ కాదనీ  ప్రహ్లాద్ స్పష్టంగా చెప్పాడు. తన పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వాడుతున్నారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానని పోలీసులకు వివరించాడు. తన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశాడు. ఈ పరిణామాలతో రవి చేసిన నేరాల జాబితా మరింత పెద్దదిగా మారుతోంది. పైరసీతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్‌, ఫోర్జరీ, మోసాలు వంటి తీవ్రమైన ఆరోపణలు అతడిపై నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇంకెంతమంది అమాయకుల డాక్యుమెంట్లు దుర్వినియోగం అయ్యాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సేవలు : టీటీడీ ఏఈవో

  తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 వ తేదీల్లో టికెట్లు జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్ల లేని భక్తులకు దర్శనం ఉండదు. 2వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఇప్పటికే టిక్కెట్లు పొందిన భక్తులకు మూడు దశల్లో దర్శనానికి అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశికి అలంకరణలు పూర్తి అయ్యాయి.  స్వామి వారి ఆలయంతో పాటు ఆలయం బయట భారీ షెట్టుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకరణలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి చోటా టెక్నాలజీ వాడుకుంటున్నామని ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల దర్శనం, వెయిటింగ్, వాహనాల పార్కింగ్ సహా అన్నింటినీ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూల కౌంటర్లు కూడా పెంచమని తెలిపారు.  

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్‌ గ్రీన్ సిగ్నల్

  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు  అధ్యక్షతన జరిగిన ఈ  క్యాబినెట్‌ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది.  రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.  మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుత రేవంత్ సర్కార్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్  సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందనీ, ఈ పద్థతి నెహ్రూ హయాం నుంచీ ఉన్నదేననీ అన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో నిఘా వ్యవస్థ లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అన్నారు. దీనిపై అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టడం లేదని నిలదీశారు. ప్రస్తుత డీజీపీ కూడా ఒకప్పుడు అధికారేనన్న కేటీఆర్ ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న విషయం అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్న ఆయన  అలాగే నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏలా వస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అడగరని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు వంటి డ్రామాలతో  ప్రజల దృష్టిని సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

సైబర్ వలకు చిక్కిన పోలీసు అధికారులు

ప్రభుత్వం ఎంతగా అప్రమత్తం చేస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సామాన్యులు మాత్రమే కాదు, విద్యావంతులు, సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన పోలీసు అధికారులు కూడా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి ఆర్థికంగా భారీగా నష్టపోతున్నారు. తాజాగా  హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సైబర్ మోసారికి గురై భారీగా నష్టపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో  పని చేసే ఒక ఇన్ స్పెక్టర్ ను సైబర్ నేరగాళ్లు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడ్డారు.   దర్శనం టికెట్లు, ప్రత్యేక అనుమతులు అంటూ ఆ ఇన్ స్పెక్టర్ నుంచి దశలవారీగా దాదాపు నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. అదే విధంగా అదే కమిషనరేట్ లో పని చేస్తున్న మరో ఇన్ స్పెక్టర్ న స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు దాదాపు 39 లక్షల రూపాయల మేర మోసం చేశారు.   సోషల్ మీడియా ద్వారా స్టాక్ ట్రేడింగ్ గ్రూప్‌లో  తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట చిన్న మొత్తాలతో లాభాలు వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించిన మోసగాళ్లు, ఆపై పెద్ద మొత్తాల పెట్టుబడులకు ప్రోత్సహించారు. ఈ ప్రక్రియలో ఆ ఇన్స్పెక్టర్ నుంచి సుమారు రూ.39 లక్షలు వసూలు చేశారు.  అయితే ఆ తరువాత  అకస్మాత్తుగా గ్రూప్ అడ్మిన్లు కనిపించకుండా పోవడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన సదరు పోలీస్ ఇన్ స్పెక్టర్ లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇ  సైబర్ మోసానికి గురైన ఈ ఇద్దరు ఇన్ స్పెక్టర్లూ కూడా సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తున్న వారు కావడమే ఇక్కడ విశేషం.  సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అధికారులే ఇలా మోసపోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జరిగిన మోసంపై ఈ ఇరువురు పోలీసు అధికారులూ కూడా సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.   ఈ కేసులపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, ఐపీ అడ్రెసులు, సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా మోసగాళ్లను గుర్తించే ప్రయత్నాలు కొనసాగు తున్నాయి.  

ప్రధాని నోట నరసాపురం లేస్ క్రాఫ్ట్

ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో సారి ఆంధ్రప్రదేశ్ హస్తకళల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నరసాపురంలోని లేస్ క్రాఫ్ట్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన నరసాపురం లేస్ క్రాఫ్ దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు.  2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన ఈ కళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందు చొరవ తీసుకున్న డీఆర్‌డీఏ  భారతదేశంలోనే తొలి లేస్‌ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.  విశేషమేంటంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో  ఏపీలోని నరసాపురంలో ఆదివారం పర్యటించిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.  నరసాపురం మండలంలోని పేదవారి లంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామంలో  ఆమె ఆదివారం పర్యటించారు.  ఈ సందర్భంగా   మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె  రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి నరసాపురం లేస్ క్రాష్ట్ గురించి ప్రస్తావించి, ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా తాను దత్తత తీసుకున్న పేదవారి లంక గ్రామంలో పర్యటించిన నిర్మలాసీతారామన్ గ్రామస్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. తాను రాష్ట్రానికి కోడలినైనా.. పేదవారి లంక గ్రామానికి మాత్రం కూతురినని చెప్పారు.  ఒకప్పుడు  ఎలాంటి గుర్తింపూ లేని మారుమూల గ్రామమైన పేదవారి లంక ఈ రోజు  దేశంలోనే గ్లోబల్‌ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందనీ, ముందు ముందు ఏఐ శిక్షణలో దేశంలోనే ఆగ్రగామిగా నిలవనుందని ఆమె అన్నారు.  మహిళ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా గ్రామంలో నిర్మించిన చిన్న భవనం ఇప్పుడు  పీఎం విశ్వకర్మ యోజన కింద చేపట్టిన ఉపాధి శిక్షణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు.  మహిళలు అన్ని రంగాల్లో  రాణించాలని పిలుపునిచ్చారు.  గ్రామంలో  13కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలించారు.  

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో మంటలు..ఒకరు సజీవదహనం

టాటా- ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. విశాఖ నుంచి ఎర్నాకుళం వెడుతున్న ఈ రైలులో ఎలమంచలి సమీపంలో మంటలు చెలరేగాయి.  వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగతో బోగీలలోని ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   అగ్నిమాపక యం త్రాలు వచ్చేసరికే రెండు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. బీ1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.

న్యూ ఇయర్ వేడుకలు...పబ్‌లపై ఈగల్ టీమ్ దాడులు

  మరో రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్టీ నిర్వాహకులు, పబ్బులు యువతను ఆకర్షించేలా ప్రత్యేక వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై ఈగల్ టీమ్ ప్రత్యేక నిఘా పెట్టింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో దాడులు చేశారు.  14 మందికి  డ్రగ్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఐదుగురు యువకులు,  ముగ్గురు యువతులు ఉన్నారు. కాగా గత 10 రోజులుగా ఈగల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 27 మంది కస్టమర్స్, ఐదుగురు నైజీరియన్స్ మహిళలను అరెస్ట్ చేశారు.న్యూ ఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేపడుతున్న తనిఖీలు నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.