హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

  హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాతర్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 3 పేజీల సూసైడ్ నోట్‌లో తన చావుకు పూరన్ కుమారే కారణమని పేర్కొనడం సంచలనంగా మారింది. సందీప్ రోహ్‌తక్‌లోని సైబర్ సెల్‌లో పనిచేశారు. కాగా తనను వేధిస్తున్నారని 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల రాసి పూరన్ పూరన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.   ఏఎస్ఐ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్‌తో పాటు ఓ వీడియోను కూడా రికార్డ్ చేసిన సందీప్ కుమార్, ఐపీఎస్ పూరణ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పనిచేస్తున్న సందీప్, పూరణ్ కుమార్ జాతి వివక్షతో వ్యవహరించారని, నిజాయితీ గల అధికారులను పక్కనబెట్టి అవినీతిపరులను ప్రోత్సహించారని ఆరోపించారు.అంతేకాదు, ఫైళ్లను బ్లాక్ చేసి, పిటిషనర్లను ఫోన్ చేసి మానసికంగా హింసించేవారని, బదిలీల కోసం మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించేవారని సంచలన ఆరోపణలు చేశారు.  పూరణ్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, తనపై వచ్చిన ఫిర్యాదుల ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సందీప్ పేర్కొన్నారు.ఇక తక్కువ వ్యవధిలోనే హర్యానా పోలీస్‌ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   

ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ : మంత్రి లోకేశ్

  విశాఖలో గూగుల్ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ బుల్లెట్ ట్రైన్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతరామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఏపీ విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'వికసిత భారత్' నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు. మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక క్షణం” అని పేర్కొన్నారు. ఈ ఏఐ హబ్ కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, దేశంలోని అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలతో కూడిన ఒక ఇన్నోవేషన్ సెంటర్‌గా రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. సుందర్ పిచాయ్ వివరించినట్లుగా, ఈ ప్రాజెక్టులో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ఒకే చోట కలవనున్నాయి. దీని ద్వారా గూగుల్ తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలు, పరిశోధకులు, వినియోగదారులకు మరింత చేరువ చేయనుందని తెలిపారు. ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, భారతదేశ ఆర్థిక వృద్ధికి కూడా ఈ హబ్ దోహదం చేస్తుందని పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ ఈ నిర్ణయంతో విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా మారనుందనడంలో సందేహం లేదు

చిక్కుముళ్ల మహాఘట్ బంధన్!

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు ఇండీ కూటమి ముక్కలేనా? బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుపై ధీమాతో ఉన్న ఇండియా కూటమి.. అదేనండి బీహార్ లో మహాఘట్ బంధన్ లో  సీట్ల సర్దుబాటు వ్యవహారం చిచ్చు రేపుతోంది. వాస్తవిక బలంతో సంబంధం లేకుండా కూటమి పార్టీలూ వేటికవి తమకే సింహభాగం కావాలని పట్టుబడుతుండటంతో  మొదటికే మోసం వస్తుందా అనిపించేలా మారింది.  మహాఘట్ బంధన్ పార్టీల  సీనియర్ నాయకుల మధ్య సోమవారం (అక్టోబర్ 13)  సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సీట్ల సర్దుబాటు వరకూ ఎందుకు అసలు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపైనా పీటముడి పడింది. మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిపై చర్చంచేందుకు హస్తిన వెళ్లిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్.. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడిని కానీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కానీ కలవకుండానే తిరిగి పాట్నాకు వచ్చేశారు.   అలాగే ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ అయిన వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీ కూడా తమ పార్టీకి కేవలం 18 స్థానాలే కేటాయిస్తామనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన 30 సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ అలా ఇవ్వకుంటే కూటమి నుంచి నిష్క్రమిస్తానని హెచ్చరిస్తున్నారు.  అంత వరకూ ఎందుకు.. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ తాను గత ఎన్నికలలో పోటీ చేసిన విధంగానే ఈ సారి కూడా 70 స్థానాలను డిమాండ్ చేస్తున్నది. అయితే అందుకు కూటమిలోని మిగిలిన పార్టీలు ఏమంత సుముఖంగా లేవు. గత ఎన్నికలలో కాంగ్రెస్ 70 స్థానాలలో పోటీ చేసి కేవలం 19 స్థానాలలోనే గెలిచిన సంగతిని గుర్తు చస్తూ 60 స్థానాలతో సరిపెట్టుకోవాలని ఆర్జేడీ చెబుతోంది. అయితే ఇందుకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. గత ఎన్నికలకూ ఇప్పటికీ చాలా తేడా ఉందని చెబుతూ.. రాహుల్ గాంధీ ఒటు అధికార యాత్ర తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెబుతోంది.   అంతే కాదు.. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సహాని అసంతృప్తితో వైదొలిగితే.. ఆ సీట్లులో కూడా తమ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారని కాంగ్రెస్ అంటోంది. అయితే ఆర్జేడీ ఇందుకు అంగీకరించడం లేదు. కూటమి ఇన్ టాక్ట్ గా ఉండాల్సిందే అని పట్టుబడుతోంది.  మొత్తం మీద సీట్ల సర్దుబాటు విషయంలో మహాఘట్ బంధన్ లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఆ కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్లుగా బీహార్ లో ఏకతాటిపై ఉన్న మహాఘట్ బంధన్ ఎన్నికల ముందు ఇలా అంతర్గత విభేదాలను రచ్చకీడ్చుకోవడం.. ఎన్డీయేకు కలిసివస్తుందని అంటున్నారు. 

స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో కోచ్ అరెస్టు

  స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోచ్ అంబాజీ నాయక్ వేధింపులు భరించలేక మౌనిక ఆత్మహత్య చేసు కుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కోచ్ అంబాజీ నిజామాబాద్ లోని తన ఊరికి పారిపోయాడు. అనంతరం తిరుపతికి వెళ్ళాడు. తిరుప తిలోని అడ్వకేట్ ను కలిసి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించాడు. తర్వాత తిరుపతి నుండి తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుండగా అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారంతో పోలీసులు నిందితుడిని  రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు.  విద్యార్థిని మౌనిక మృతి చెందగానే కోచ్ అంబాజీ తన మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ కార్డును కూడా చేంజ్ చేశాడు. అంబాజీ నాయక్ పాత ఫోన్లో మౌనికను వేధింపు లకు సంబంధించిన డేటా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డేటా పోలీసులకు దొరకకూడదని అంబాజీ సిమ్ కార్డు ఛేంజ్ చేశాడు. పోలీసులు సిమ్ కార్డు స్వాధీనం చేసుకుని డేటా సేకరించే పనిల్లో పడ్డారు.  సికింద్రాబాద్, లాలా గూడ పరిధిలో నివాసం ఉంటున్న మౌనిక తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో బిబిఏ సెకండియర్ చదువుతుంది. అయితే అదే కాలేజీలో పని చేస్తున్న వాలీబాల్ కోచ్ అంబాజీ పెట్టిన వేధింపులు భరించ లేక ఆమె ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.. కోచ్ వేధిం పుల వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని మౌనిక తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి.. ఈరోజు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

టెక్‌ ప్రపంచంలో ఏపీ చరిత్రాత్మక అడుగు

  టెక్‌ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా రూ. 87 వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడన్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌  ఒప్పదం చేసుకున్నారు.  ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లోకేశ్ ఈ మేరకు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఒప్పందంతో విశాఖను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నగరంగా రూపొందించడంలో తొలి అడుగు పడినట్లయింది.  గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ఆరంభించే తరుణంలో భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందుతుంది. అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో ఐటీ - ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఎసెంచర్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలన్నీ క్యూ కడుతూ యువతకు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులపై ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పదోన్నతుల కల్పనపై  సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని  ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మొత్తం పది మంది తో   గ్రూప్‌ ఆఫ్‌  మినిస్టర్స్‌  ఏర్పాటుకు   ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కమిటీలో  ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత,  నారాయణ, డీఎస్‌బీ.వి. స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్,  సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.  సచివాలయ సిబ్బంది పదోన్నతుల అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని  సబ్‌కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఇంటర్‌మీడియేటరీ  పోస్టులను  సృష్టించే అవకాశాన్ని పరిశీలించాలని  సూచించింది. అలాగే.. అటువంటి పోస్టులు సృష్టించినట్లయితే, వాటికి  అనుగుణంగా పే స్కేల్‌ను నిర్ణయించాలని పేర్కొంది. అదే విధంగా..  ఇతర శాఖల్లో అమలులో ఉన్న ప్రమోషన్‌ ఛానల్‌ వ్యవస్థను కూడా  పరిశీలించి తగిన మార్పులపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. పదోన్నతుల  తర్వాత సచివాలయాల్లో ఏర్పడే ఖాళీల భర్తీ విధానంపై కూడా చర్చించి తగిన  సూచనలు ఇవ్వాలనీ,  ఈ అధ్యయనాన్ని వీలైనంత త్వరగా  పూర్తి చేసి  నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సబ్‌కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

  ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో తిరుపతి లోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి,  మిథున్ రెడ్డినివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు.. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇక, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి లో ఉన్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కాం లో అరెస్టైన  మిథున్ రెడ్డి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. మొత్తం 71 రోజుల పాటు ఈ కేసులో మిధున్ జైలులో ఉన్నారు. మద్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుమతి కోరడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా మిథున్‌రెడ్డి ఉన్నారు. ఆయనపై త్వరలో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.

జూబ్లీ బైపోల్.. కమలం ఆటలో అరటిపండేనా?

సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది.నవంబర్ 11న పోలింగ్ 14న కౌంటింగ్ జరుగుతుంది. మరోవంక, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. నిజానికి.. ఎన్నికల ప్రకటన కంటేముందు నుంచే జూబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీల నుంచి ఆశావహులు, ఓ వంక టికెట్ కోసం ప్రయతిస్తూనే మరో వంక వ్యక్తిగత స్థాయిలో ప్రచారం సాగించారు.   వాస్తవానికి.. జూబ్లీ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని,   కాంగ్రెస్, బీఆర్ఎస్ లతోపాటుగా బీజేపీ కూడా ప్రధాన పోటీ దారుగా ఉంటుందనీ, ముక్కోణపు పోటీ అనివార్యం అన్న ప్రచారం జరిగింది. అయితే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, బీజేపీ మరో మారు ఆటలో అరటిపండు అవుతుందా అనే అనుమనాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా.. అభ్యర్ధి ఎంపిక విషయంలో జాప్యం జరగడంతో పాటుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ లతో పోలిస్తే, పార్టీ నాయకత్వంలో ఉప ఎన్నికల గెలుపు విషయంలో  పెద్దగా ఆశలు,ఉత్సాహం కనిపించడం లేదు. అటు నాయకత్వంలోనూ, ఇటు క్యాడర్ లోనూ గెలుస్తామనే విశ్వాసం కనిపించడం లేదు.  మరో వంక పార్టీ నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి అరవింద్  పార్టీలో పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు ఎవరూ లేరన్నట్లుగా, బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన జీహెచ్ఎంసి మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ నుపార్టీలో చేర్చుకుని, జూబ్లీ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా నిలపాలని  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సూచించారు. సలహా ఇచ్చారు. అయితే  ఆయన ఏ ఉద్దేశంతో ఆ సూచన చేశారో ఏమో కానీ, ఆయన  చేసిన సూచన, పార్టీ బలహీనతను బయట పెట్టిందని అంటున్నారు. అరవింద్  సూచనతో అసలే అంతత మాత్రంగా ఉన్న క్యాడర్ ఉత్సాహం మరింతగా నీరుగారి పోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  అలాగే.. నియోజక వర్గంలో గట్టి బలమున్న టీడీపీ మద్దతు బేషరుతుగా లభిస్తుందని బీజేపీ నాయకత్వం భావించింది. అయితే..  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భవిష్యత్ రాజకీయలను దృష్టిలో ఉంచుకుని  వ్యూహాత్మకంగా  మద్దతు విషయంలో బీజేపీ కోరితే ఆలోచిస్తామని  లేదంటే తటస్థంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నాయకులకు సూచించారు. దీంతో  మొదటి నుంచి మాగంటితో కలిసున్న టీడీపీ క్యాడర్ ,ఓటర్లు పార్టీతో సంబంధం లేకుండా మాగంటి సునీత వైపే మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. దీంతో  బీజేపీ క్యాడర్  మరింతగా నీరుగారి పోయిందని అంటున్నారు.   అదలా ఉంటే..  మరో వంక నిరుత్సాహానికి గురైన బీజేపీ స్థానిక నాయకులు, క్యాడర్  పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. ఇప్పటికే కొందరు స్థానిక నాయకులు, క్యాడర్ తో సహా బీఆర్ఎస్  తీర్ధం పుచ్చుకున్నారు.  మరో వంక, పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ మరో మారు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తనదైన స్టైల్లో’ సెటైర్లు వేశారు.  కిషన్ రెడ్డి జీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..?  బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా? కాంగ్రెస్‌ని గెలిపిస్తారా?  అంటూ  చురకలు అంటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.  మీ గౌరవం ప్రమాదంలో ఉంది అంటూ  కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యంగ వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ విసిరిన వ్యంగ్యాస్త్రాల విషయం ఎల్లా ఉన్నా..  జూబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ రోల్  ఏమిటి?  వ్యూహం ఏమిటి? అనే విషయంలో పార్టీ వర్గాలనుంచి వినిపిస్తున్న అనుమానాలు మాత్రం ఒటమి తథ్యం అనిపించేలాగానే ఉన్నాయి.

ఉపరితల ఆవర్తనం.. రుతుపవనాల ఉపసంహరణ.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు  ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అంతే కాకుండా ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఏకకాలంలో జరుగుతుండటంతో.. ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇలా ఉండగా మంగళవారం (అక్టోబర్ 14)  మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   మరో వైపు  నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా  కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

ఆ ఫోన్ అన్ లాక్ కు కోర్టు అనుమతి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ34 అయిన చెరుకూరి వెంకటేశ్ నాయుడి ఐఫోన్ ను అన్ లాక్ చేసేందుకు విజయ వాడ ఏసీబీ కోర్టు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నకు అనుమతి ఇచ్చింది.  ఈ మేరకు న్యాయమూర్తి పి. భాస్కరరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో వెంకటేశ్ నాయుడి ఫోన్ అత్యంత ముఖ్యమైన ఆధారమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అధికారులు ఇదే ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని డిజిటల్ ఆధారాలు, కీలక సంభాషణలు, ఇతర సమాచారం ఈ ఫోన్‌లోనే భద్రపరిచి ఉండవచ్చని సిట్ బృందం బలంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, ఫోన్ లాక్‌ను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కొన్ని రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వెంకటేశ్ నాయుడి ఫోన్ అన్ లాక్ కు అనుమతిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. 

మల్లోజుల లొంగుబాటు..మావోయిస్టు ఉద్యమానికి బిగ్ సెట్ బ్యాక్!

మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు సీనియర్ నాయకుడు, మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ ఆయధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్లోజుల దాదాపు 60మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయుధాలను వీడి పోలీసులకు లొంగిపోయారు. మల్లోజుల లొంగు బాటును  కేంద్ర హోంశాఖ నుంచి కానీ, మహారాష్ట్ర పోలీసుల నుంచి కానీ అధికారికంగా ధృవీక రించలేదు. అయితే మల్లోజుల లొంగిపోయాన్న సమాచారం కేంద్ర హోంశాఖ వర్గాల నుంచే వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.   అయితే మల్లోజుల లొంగుబాటు వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే మావోయిస్టు పార్టీ చేసిన శాంతి చర్చల ప్రతిపాదన వెనుక ఉన్నది మల్లోజుల వేణుగోపాలే అంటున్నారు. ఆ ప్రతిపాదనకు కేంద్రం ఆంగీకరించలేదు.. అది వేరే సంగతి, కానీ ఆ ప్రతిపాదన సమయంలోనే  సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి కేంద్రంలో చర్చలకు సిద్ధమని మల్లోజుల ప్రకటించారు. ఆ ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచీ మల్లోజులకు మావోయిస్టు కేంద్ర కమిటీతో దూరం పెరిగిందని అంటున్నారు. ఒక దశలో మల్లోజులను మావోయిస్టు పార్టీ ఉద్యమ ద్రోహిగా కూడా ప్రకటించింది.  ఈ నేపథ్యంలోనే మల్లోజుల లొంగుబాటు నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.   మల్లోజుల వేణుగోపాల్  మావోయిస్టు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన స్వస్థలం పెద్దపల్లి. మల్లోజుల వేణుగోపాల్  సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు  అలియాస్ కిషన్ జీ గతంలో పార్టీలో రెండో స్థానంలో ఉండేవారు. ఆయన  2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. మల్లోజుల కోటేశ్వరరావు మరణం తరువాత మావోయిస్టు పార్టీలో మల్లోజుల వేణుగోపాల్ అత్యంత కీలక పాత్రపోషించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  కిషన్ జీ భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా అయిన పోతుల  అలియాస్ సుజాత కూడా గత నెలలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అంతకు ముందే మల్లోజుల వేణుగోపాల్ భార్య తార కూడా పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వార్త వాస్తవమే అయితే మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఇది కీలకమలుపు అవుతుందని అంటున్నారు.  

రెండో టెస్టులోనూ విండీస్ ఓటమి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పూర్తి సాధికారత ప్రదర్శించిన శుభమన్ గిల్ సేన విండీస్ ను రెండు టెస్టుల్లోనూ చిత్తుచిత్తుగా ఓడించింది. మంగళవారం (అక్టోబర్ 14) ముగిసిన రెండో టెస్టులో టీమ్ ఇండియా విండీస్ పై ఏడు వికెట్ల ఆధిక్యతతో గెలుపొందింది.  121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్ ఇండియా ఎక్కువ సమయం తీసుకోకుండానే లక్ష్యాన్ని ఛేదించేసింది. రాహుల్  58 నాటౌట్, జురేల్ 6 నాటౌట్ గా ఉన్నారు. చివరి రోజు ఆట ఆరంభమైన తరువాత సాయిసుదర్శన్ 39, శుభమన్ గిల్  13 ఔటైనా లక్ష్యం మరీ చిన్నది కావడంతో టీమ్ ఇండియా అలవోకగా దానిని ఛేదించి విజయం సాధించింది.   రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తరువాత విండీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి కేవలం 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు121 పరుగుల సల్ప విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.  

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు కొలిక్కి

దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖారరయ్యాయి. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 6న తొలి విడత, 11న మలివిడత పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే పోరు ఉన్నా.. జనసురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సైతం కీలక పాత్ర పోషించనున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ బీహార్ పరిస్థితి, ప్రజల మొగ్గు ఏ కూటమి వైపు అన్న కోణంలో జరిగిన పలు సర్వేలు కూడా ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలున్నాయనే పేర్కొన్నాయి. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే, ఇండియా కూటముల కంటే ముందే తన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. విద్యావంతులు, మేధావులతో కూడిన ఆ జాబితా విస్మయ పరిచింది. రాజకీయ నేపథ్యం ఇసుమంతైనా లేనివారికే ఆయన తొలి జాబితాలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు కేటాయించారు. అదలా ఉంచితే.. అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎన్డీయే, ఇండియా కూటములు మాత్రం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. అసమ్మతులను బుజ్జగించి జాబితాలను ప్రకటించడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు సోమవారం (అక్టోబర్ 13) నాటికి ఓ కొలిక్కి వ చ్చింది. ఆ సర్దుబాటు ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 243 నియోజకవర్గాలకు గాను కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలలోనూ పోటీ చేయనున్నాయి. సద్దుబాటులో భాగంగా  కూటమి భాగస్వామ్య పక్షమైన  చిరాగ్ పాశ్వాన్  నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్-విలాస్)కి  29 సీట్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన  హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌) , రాజ్యసభ ఎంపీ  ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా కు చెరో ఆరు సీట్లు కేటాయించారు.   ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా పూర్తయ్యిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ థృవీకరించారు.  ఇక ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

ఐపీఎస్ సంజయ్ బెయిలు పిటిషన్ డిస్మిస్

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ  అదనపు డైరెక్టర్‌ జనరల్‌,  అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేసిన ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌ కుమార్‌కు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన   బెయిల్‌ పిటిషన్‌ను   ఏసీబీ ప్రత్యేక  కోర్టు సోమవారం (అక్టోబర్ 13) డిస్మిస్ చేసింది.  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికలో, సంజయ్‌ డీజీగా, సీఐడీ ఏడీజీగా ఉన్న సమయంలో సుమారు  15 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు  దుర్వినియోగమయ్యాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో టెండర్‌ నిబంధనలు ఉల్లంఘించడం, సొమ్ము దుర్వినియోగం చేయడం, పలు పనులు అసంపూర్తిగా వదిలేయడం  వంటి అంశాలపై కూడా ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా అగ్నిమాపకశాఖలో అమలు చేసిన   అగ్ని ఎన్వోసీ వెబ్ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. కాగా ఈ కేసులో  హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిలును సుప్రీంకోర్టు  రద్దు చేయడంతో, సంజయ్‌ స్వయంగా ఏసీబీ ఎదుట లొంగిపోయారు. అనంతరం  ఆయనను 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. తదుపరి విచారణలో సంజయ్‌పై మరిన్ని ప్రశ్నలు అడగాల్సి ఉందని ఏసీబీ  అధికారులు వెల్లడించారు. గత వారంలో ఏసీబీ బృందం ఆయనను మూడు  రోజులపాటు విచారించింది.   ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విచారణ కొనసాగుతున్నందున సంజయ్‌  సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగించింది. ఆయన ప్రస్తుతానికి విజయవాడ  సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. సంజయ్‌ కుమార్‌ 1996 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. సీఐడీ, ఫైర్‌  సర్వీసెస్‌, హ్యూమన్‌ రైట్స్‌, ఎసిసి, ఎస్టి కమిషన్‌ వంటి కీలక విభాగాల్లో ఆయన  సేవలందించారు.  జగన్ హయాంలో సీఐడీ అదనపు డీజీగా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. 

గూగుల్ లో ఏపీ సర్కార్ హిస్టారికల్ అగ్రిమెంట్

సీబీఎన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ డీల్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసే గేమ్  చేంజర్ లాంటి చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఆ ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంటేనే అభివృద్ధి.. ఆయన హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ   ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ వరకూ ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చారు. ఎన్నో సంస్థలు, పరిశ్రమల రాకకు కారకుడయ్యారు. అయితే  ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఆయన సమక్షంలో గూగుల్ తో ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందం మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ లోనే అత్యంత భారీ ఒప్పందంగా చెప్పవచ్చు.   గూగుల్ సహ సంస్థ అయిన రైడైన్ లో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఈ  ఒప్పందం విలువ రమారమి 90 వేల కోట్ల రూపాయలు. ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన అతి పెద్ద పెట్టుబడి ఇదే. గూగుల్ విశాఖలో  దేశంలోనే  అతిపెద్ద డేటా కేంద్రం ప్రారంభంచనుంది.  ఇంకో విశేషమేంటంటే.. గూగుల్ హిస్టరీలో కూడా భారత్ లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. అంటే ఎలా చూసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఇన్వెస్ట్ మెంట్ ఒక కొత్త రికార్డు అని చెప్పారు. కాగా గూగుల్    డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖ‌ప‌ట్నం  డేటాసెంటర్‌ హబ్‌ గా మారుతుంది.  ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్  ల సహకారం ఉందని చంద్రబాబు తెలిపారు.   ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం (అక్టోబర్ 14) ఉదయం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇదే అతిపెద్దది.  ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ గతేడాది అక్టోబర్‌లో అమెరికా పర్యటనలో బీజం వేశారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గూగుల్ రాబోయే ఐదేళ్లలో (2026-2030 మధ్య) ఈ పెట్టుబడి పెట్టనుంది.  

మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే!

ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగనున్న ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 16 ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.20 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సున్నిపెంట కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. కొద్ది సేపు విశ్రాంతి తరువాత 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం 12.45 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు తిరిగి చేరుకుని, 1.25 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కి బయల్దేరతారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో   శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నున్నూరు హెలిప్యాడ్ కు చేరుకుని అక్డ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. మంగళవారం  (అక్టోబర్ 134 తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 23 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా సోమవారం  (అక్టోబర్ 13) శ్రీవారిని మొత్తం 78,569 మంది దర్శించుకున్నారు. వారిలో 27,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93  లక్షల రూపాయలు వచ్చింది.  

పోలీసు శాఖను మూసివేయడం మంచిది.. పరకామణి కేసులో హైకోర్టు సీరియస్

తిరుమల పరకామణిలో అక్రమాలపై ఏపీ హైకోర్టు పోలీసుశాఖపై తీవ్ర సీరియస్ అయ్యింది. ఈ అక్రమాలకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీసు శాఖ నిద్రపోతోందని వ్యాఖ్యానించింది. అంతే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తోందని హైకోర్టు పేర్కొంది.  తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన కేసులో గత నెల 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ బేఖాతరు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి లోక్ అదాలత్ లో రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని హైకోర్టు గత నెల 19న ఆదేశాలు జారీ చేసింది. అయితే పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను పట్టించుకోలేదంటూ సీరియస్ అయ్యింది. ఇలా అయితే పోలీసు శాఖను క్లోజ్ చేయడమే మంచిదని హెకోర్టు వ్యాఖ్యానించింది. రికార్డులు సీజ్‌ చేసి హైకోర్టు ముందు ఉంచాలని సీఐడీ డీఐజీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.  

జూబ్లీ బరిలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ కు షాక్!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి, సిట్టింగ్ సీటును నిలుపుకుని రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటడానికి సర్వశక్తులూ ఒడ్డి సమాయత్తమవ్వడానికి సిద్ధమౌతున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. అదేంటి టీఆర్ఎస్ పేరు మార్చుకుని బీఆర్ఎస్ అయ్యింది కదా? మళ్లీ టీఆర్ఎస్ బరిలోకి దిగడమేంటని అనుకుంటున్నారా? ఔను తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రక్షణ సమితి-డెమొక్రట్ (టీఆర్ఎస్-డి)అనే పార్టీ జూబ్లీ బరిలో అభ్యర్థిని నిలబెట్టబోతున్నది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. అయతే పార్టీలోంచి తెలంగాణ పేరును అయితే తీసేశారు కానీ, ఆయన రాజకీయాలు మాత్రం తెలంగాణను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ తెలంగాణ పేరును పార్టీ పేరు లోంచి తీసేసిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకూ దూరమయ్యారు. 2023 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన జనం ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.   సరే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరో మాజీ మంత్రి హరీష్ రావులు.. బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలలో పార్టీ పట్టును పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  జూబ్లీ ఉప ఎన్నికలో విజయం లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేస్తున్నారు.   ఈ పరిస్థితుల్లో జూబ్లీ ఎన్నికలో అభ్యర్దిని నిలబెట్టడానికి టీఆర్ఎస్ -డి  రెడీ అవ్వడం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.    అవును జూబ్లీ బైపోల్ లో టీఆర్ఎస్-డి రంగంలోకి దిగుతోంది. పార్టీ అభ్యర్థిగా కంచర్ల మంజూష అనే మహిళను రంగంలోకి దింపబోతున్నది. ఈ విషయాన్ని టీఆర్ఎస్-డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణ సోమవారం (అక్టోబర్ 13) ప్రెస్ క్లబ్ లో పార్టీ జెండాను, వెబ్ సైట్ ను ఆవిష్కరించి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు.   తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎ్ -డి లోగో రూపకల్పన చేశామన్న సత్యనారాయణ   జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీఆర్ఎస్-డి అభ్యర్థిగా తమ  పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షురాలు   కంచర్ల మంజూషను ప్రకటించారు.  ఇక టీఆర్ఎస్-డి పార్టీ లోగో, జెండా అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉన్నాయి. గులాబి రంగు, జెండా, గుర్తు అన్నీ బీఆర్ఎస్ ను పోలి ఉండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ -డి అభ్యర్థి జూబ్లీ బైపోల్ లో రంగంలోకి దిగితే తమ విజయావకాశాలకు గండి పడటం ఖాయమన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది.