బచ్చుల అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు
posted on Mar 3, 2023 @ 1:48PM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర గుండెపోటుకు గురై నెల రోజులుగావిజయవాడ డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బచ్చుల అర్జునుడు గురువారం ( మార్చి 2) సాయంత్రం కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన మృతితో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మంచి నాయకుడిని కోల్పోయామన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పలువురు సీనియర్ నాయకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా ఆయనను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బచ్చుల అర్జునుడు అంతిమ యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అర్జునుడి పాడె మోశారు. కాగా బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.