తాటికొండ రాజయ్య... నీ టైం అస్సలు బాగోలేదయ్య...!
posted on Aug 22, 2023 @ 11:06AM
అది ముందుగా ఊహించినదే... మొదటి నుంచి జరిగిన ప్రచారమే..చివరికి నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం పేరును ప్రకటించారు. దీంతో టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగారని సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్‌పీలో చేరాలంటున్నట్టు రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజయ్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసలు..రాజయ్యకు టిక్కెట్ రాకపోవడానికి పెద్ద కారణం.. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణలు. ఈ వ్యవహారం తాటికొండ రాజయ్య ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. నవ్య ఎపిసోడ్ రచ్చకెక్కడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారంతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఈసారి స్టేషన్‌పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం కడియం వైపే మొగ్గుచూపింది. బీఆర్ఎస్ మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు రావడమే ఇందుకు నిదర్శనం.
పార్టీ ఏదైనా... లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యకు... జనం ఆదరిస్తారా...? ఇప్పుడైతే.. ఆయన టైం అసలు ఏమీ బాగోలేదు.. టైం బాగోనప్పుడు... ఏది చేసినా... కలిసి రాదు.