కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరు సమీపంలో మంటల్లో చిక్కుకుంది. ఈ బస్సు బైక్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ బస్సు కిందకు వెళ్లిపోయి ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొనడంతో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మొత్తం 41 మంది ఉన్నట్లు తెలు స్తోంది. కిటికీ అద్దాలు పగులగొట్టుకుని 21 మంది బయటపడ్డారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీశారు.    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.   ఏసీ బస్సు కావడం, సంఘటన జరిగిన సమయంలో ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండటంలో ప్రమాద తీవ్రత అధికమైందని తెలుస్తోంది.  మృతులలో అత్యధికులు హైదరాబాద్ వాసులే అని తెలుస్తోంది.   కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ నుంచే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.  మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటనపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షేడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా బిజెపి నేతలను అదేశించిచారు.  

వీడిన ఉత్కంఠ.. మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు కొలిక్కి!

బీహార్ రాజకీయాలలో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. మహాఘట్ బంధన్ లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు  ఒక కొలిక్కి వచ్చింది. దీంతో మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది.  ఈ మేరకు పట్నాలోని మౌర్య హోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాఘట్ బంధన్ కూటమి నేతలు తేజస్వియాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సహానీ పేరు ప్రకటించారు. కాగా కాంగ్రెస్ నుంచి పరిశీలకుడిగా వచ్చిన గెహ్లాట్ తేజస్వి యాదవ్ పేరును కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా యువనేత తేజస్వియాదవ్ పై పొగడ్తల వర్షం కురింపిచారు. తేజస్వికి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉందన్న గెహ్లాట్, ఆయన నాయకత్వంలోనే మహాకూటమి పోటీ చేస్తున్నదని స్పష్టం చేశారు.  ఇక పోతే సీట్ల పంపకాల విషయంలో కూడా మహాఘట్ బంధన్ లో తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో పీటముడి పడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈ సారి 70 స్థానాల కోసం పట్టుబట్టింది. అయితే అన్ని సీట్లను ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అనడంతో విభేదాలు మొదలయ్యాయి.  అయితే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి సమస్య పరిష్కరించి, ప్రతిష్ఠంభనకు తెరదించే బాధ్యతను సీనియర్ నాయకుడు గెహ్లాట్ కు అప్పగించింది.  దీంతో బుధవారం (అక్టోబర్ 22) పట్నా చేరుకున్న గెహ్లాట్.. ఆర్జీడీ ముఖ్య నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించడంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది.   దీంతో ఇక కూటమి ఐక్యంగా ప్రచార పర్వంలోకి దిగుతుందని అంటున్నారు. 

మరో సారి వివాదంలోకి కొలికపూడి.. ఈ సారి కేశినేని చిన్ని టార్గెట్ గా ఆరోపించారు

తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో సారి సంచలన వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. సొంత పార్టీ ఎంపీపైనే తీవ్ర ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్యా విభేదాలు మరోసారి రచ్చకెక్కియి. కాగా కొలికపూడి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.  ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి  తీవ్ర ఆరోపణలు చేశారు . కేశినేని చిన్ని పార్టీ పదవులను అమ్ముకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.  విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అవినీతి దందాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెడతానని కొలికపూడి అంటున్నారు. ఇంతకీ ఆయన ఆరోపణ ఏమిటంటే.. 2024 ఎన్నికలలో తిరువురూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాను మూడు దఫాలుగా 60లక్షల రూపాయల చొప్పున చిన్నికి సొమ్ములు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి 50లక్షల రూపాయలు తీసుకువెళ్లినట్లు  పేర్కొంటూ నిజమే గెలవాలి అంటూ కొలికపూడి ఆ పోస్టులో  పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.  దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ కోసం, ప్రజల కోసం తన జేబులో డబ్బులు ఖర్చు చేశానే తప్ప ఎన్నడూ ఎవరి వద్దనుంచీ పైసా తీసుకోలేదని పేర్కొన్నారు.  ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని అన్నారు. తాను ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసునన్న చిన్నికొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇలా ఉండగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కూడా కొలికపూడి వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు  హైకమాండ్ ఆయనను మందలించిందనీ, హెచ్చరించిందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నాయి.  

ఏపీకి రెండు హైస్పీడ్ రైల్వే కారిడార్లు

ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలు మారిపోనున్నాయి.  దక్షిణ మధ్య రైల్వే    హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ రెండు ప్రతిష్ఠాత్మకమైన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి రూట్ మ్యాప్‌ను ఖరారు చేసింది.  గంటకు 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.5.42 లక్షల కోట్లు. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ఎక్కువ మార్గం ఏపీ మీదుగానే వెడుతుంది.   మొత్తం 1,365 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు కారిడార్లలో సుమారు 767 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్ భూభాగం గుండానే వెడుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్-బెంగళూరు మార్గానికి రూ.2.38 లక్షల కోట్లు, హైదరాబాద్-చెన్నై మార్గానికి రూ.3.04 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ మొత్తం పొడవు 605 కిలోమీటర్లు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గుండా సాగుతుంది. ఈ నాలుగు జిల్లాలలోనూ కలిపి 263 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ను నిర్మితమౌతుంది. ఈ మార్గంలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో  ఆరు కొత్త స్టేషన్లు రానున్నాయి. మరోవైపు హైదరాబాద్-చెన్నై కారిడార్ మొత్తం పొడవు  760 కిలోమీటర్లు కాగా ఇది రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మీదుగా 504 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ కారిడార్‌లో దాచేపల్లి, నంబూరు, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో  మొత్తం 9  ప్రత్యేక రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.  ఈ మార్గానికి తరువాత దశలో అమరావతిని కూడా అనుసంధానించే అవకాశా లున్నాయని రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది.   సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధించిన సర్వే పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నట్లు సమాచారం.  

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో పిల్లలను వేధిస్తున్న ఓ   ఉపాధ్యాయునికి భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు దేహశుద్ధి చేసిన సంఘటన  బుధవారం (అక్టోబర్ 22) సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.  భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, సోషల్ మీడియాలో వారిని వేధింపులకు గురి చేస్తున్న విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విద్యార్థి పరిషత్ నాయకులు బుధవారం సాయంత్రం ఆ పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో విద్యార్థినులతో ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సోషల్ మీడియాలో వేధిస్తున్నట్లు పలువురు విద్యార్థినులు తమకు ఫిర్యాదు చేయడంతోనే ఆ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశామని విద్యార్థి పరిషత్ నాయకులు చెప్పారు.  

దుబాయ్ నుంచే అధికారులకు బాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పని రాక్షసుడన్న సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాలను విస్మరించరన్న సంగతీ తెలిసిందే. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాలలో ప్రాణనష్టాన్ని సాధ్యమైనంతగా తగ్గించడానికి ఆయన అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను జల ప్రళయంలా కమ్మేసిన సందర్భంలో ప్రాణనష్టం అతి స్వల్పంగా ఉండడానికి ఆయన తీసుకున్న ముందస్తు చర్యలే కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా, పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు దేశాలు చుట్టేస్తున్నారు.  యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు గురువారం (అక్టోబర్ 23) దుబాయ్ లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, మెరుపు వరదలు సంభవించే అవకాశాలపై వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయన దుబాయ్ నుంచే అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాలలో పరిస్థితిపై చంద్రబాబు దుబాయ్ నుంచే మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హోంమంత్రి వంగలపూడ అనితను కూడా అప్రమత్తం చేశారు. అవసరమైన చర్యలు తీసుకుని ప్రాణనష్టాన్ని నివారించాలని ఆదేశించారు.  వర్ష ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆదేశించారు.  ప్రజలకు ఎుఠవంటి ఇబ్బందీ కలగకుండా, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. దక్షణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సూచించిన చంద్రబాబు.. వర్ష ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలను ఏఱ్పాటు చేయాలని ఆదేశించారు.   

ఆస్ట్రేలియాలో నారా లోకేష్ స్పీడ్.. పెట్టుబడుల వేటలో దూకుడు

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో ఆస్ట్రేలియాలో యమా బిజీగా ఉన్నారు. పెట్టుబడులతో పాటు.. అక్కడి సాంకేతికతను, విద్యా రంగంలో మెళకువలను రాష్ట్రానికి అందించేందుకు అవసరమైన అవగాహనా ఒప్పందాలను చేసుకోనేందుకు కూడా ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇందులో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా(యుటిఏఎస్)ను  మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అలాగే రాష్ట్రంలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్/ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు చేపట్టాలని, ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రామ్ మాదిరిగా ఆస్ట్రేలియా మా విద్యార్థుల ప్లేస్ మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను నిర్వహించాలని మంత్రి కోరారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్ ను బెంచ్ మార్కు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. అదే విధంగా బ్రిటీష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్, హెడ్ ఎంటర్ ప్రైజెస్ ఇంటెలిజెన్స్ దినేష్ కంతేటిలతో భేటీ అయిన నారా లోకేష్  ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.  గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏబీవీ

కందుకూరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్లో జరిగిన హత్య ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం చెల్లించడంపై విమర్శలు వస్తున్నాయి.  ముఖ్యంగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్,  ఏబీ వెంకేటశ్వరరావు  ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రధాన సమస్యలన్నిటినీ  పక్కనపెట్టి  కుల గొడవలు, హత్యలు మీద దృష్టి పెడుతున్నదని విమర్శించారు.  ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన  పోలీసులు తాము చేయాల్సిన పని చేయడం లేదని దుయ్యబట్టారు.   కులాల గొడవలతో కొట్టుకు చస్తే..  ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఏపీలో  ఏడాదికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయనీ, హతులందరికీ ఇలాగే నష్టపరిహారం ఇచ్చుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు.                  నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని   దారకానిపాడు గ్రామంలో దసరా పండుగ రోజు జరిగిన దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పాతికేళ్ల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని   హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో  గుద్ది హత్య చేశాడు.  లక్ష్మినాయుడు  సోదరులకు కాళ్లు, చేతులు విరిగాయి.  ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. అయితేఈ ఈ హత్య రాజకీయ, కులాల కుంపటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హతుడు లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.   భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని నిర్మయించారు.  ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు.  లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే  కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు.    లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి..  కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే భారీ పరిహారం ఇవ్వడాన్ని ఏబీవీ తప్పుపట్టారు.  

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీత పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ  డాక్టర్  సునీతారెడ్డి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలు  సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర బాధలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని డాక్టర్ సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో డాక్టర్ సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె.. ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీం కోర్టుకు తెలియజేశారన్నారు.   ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె తన పిటిషన్ లో కోర్టును కోరారు.  ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి  సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

యూఏఈలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బాబు పెట్టుబడుల వేట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో దూకుడు పెంచింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో  విజయవంతం అవుతోంది. నవంబర్ లో  విశాఖలో జగరనున్న  సదస్సుకు  ఏపీ సర్కార్ పలు సంస్థలను ఆహ్వానిస్తున్నది.   భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు  ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా  మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నారు.  కాగా వీరిద్దరి ప్రయత్నాలకూ ఆయా దేశాలలోని పారిశ్రామిక వేత్తల నుంచి  మంచి సానుకూలత లభిస్తోంది.  ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు ఆస్ట్రేలియాకు ఎగుమతి కావడానికి మార్గం సుగమమైందంటే అది లోకేష్ కృషి ఫలితమేనని చెప్పక తప్పదు.  ఇక చంద్రబాబుకు అయితే పారిశ్రామిక వేత్తలు దుబాయ్ లో రెడ్ కార్పెట్ పరిచారనే చెప్పాలి. తన దుబాయ్ పర్యటనలో చంద్రబాబు  ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  ట్రాన్స్ వరల్డ్ గ్రూప్  ఏపీలో షిఫ్ట్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ సంషీర్ వయాలీల్ తో  సమావేశమయ్యారు. ఆ సంస్థ అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తోంది. ఏపీలో అత్యధునిక క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.    ఇంకా చంద్రబాబు శుక్రవారం వరకూ యూఏపీలోనే పర్యటించనున్నారు.  ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రముఖ సంస్థలతో అక్కడే ఒప్పందాలు చేసుకుని గ్లోబల్ సమ్మిట్ లో వాటిపై ప్రకటనలు చేసేలా ముందుకు సాగుతున్నారు.  ఇక గురువారం ఉదయం ఆయన అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో,  జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అలాగే  అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులనూ భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 23) యూఏఈలో ఆయన రెండో రోజు పర్యటన ఆద్యంతం బిజీబిజీగా సాగనుంది.    అబుదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో  పాల్గొన్న అనంతరం,  మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో  సీఎం భేటీ కానున్నారు. అలాగే  లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా   సమావేశమై విశాఖ, విజయవాడలలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో సమావేశమవుతారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

మాగంటి సునీత‌కు స‌వ‌తి పోరు!?

మొన్న‌టి వ‌ర‌కూ అందరూ సునీత మాత్ర‌మే మాగంటి గోపీనాథ భార్య‌. ఆమె పిల్ల‌లు మాత్రమే ఆయ‌న‌కు వార‌సులు. ఇదొక చిన్న కుటుంబం చింత‌లేని కుటుంబం.  అనుకుంటున్నారంతా. ఇంత‌లో స‌డెన్ ఎంట్రీ ఇచ్చాడు తార‌క్ ప్ర‌ద్యుమ్న‌. తానే అస‌లైన వార‌సుడిననీ, తనకు చ‌ట్ట‌రీత్యా రావ‌ల్సిన ఈ హ‌క్కు తన తండ్రితో  లివిన్ రిలేష‌న్లో ఉన్న సునీత‌కు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయ‌డంతో ఇంటి గుట్టు- రాజ‌కీయం ర‌ట్టుగా మారింది. సునీత‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు ప‌డ‌తాయ‌ని. ఇపుడీ మొద‌టి భార్య కొడుకు కార‌ణంగా బీఆర్ఎస్ ఆశ‌ల‌పై భారీగా నీళ్లు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చ‌నిపోయిన‌పుడు త‌ల‌కొరివి పెట్ట‌డానికి కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న నివాళి స‌భ‌లకు కానీ రాని  తార‌క్ ప్ర‌ద్యుమ్న స‌డెన్ గా తాను గోపీనాథ్ మొద‌టి భార్య మాలినీదేవి కొడుకును,  ఆయ‌న అస‌లు సిసలు రాజ‌కీయ వార‌సుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి ప‌డ్డారు. సునీత త‌ప్పుడు ఫ్యామిలీ స‌ర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్య‌గా నిరూపించే య‌త్నం చేశారు. అక్టోబ‌ర్ 11న ఆ స‌ర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా ర‌ద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇత‌డిచ్చిన కంప్ల‌యింట్ పై సునీత ఈసీకి వివ‌ర‌ణ ఇస్తారు. అంతా బావుంది. మ‌రి ఇప్పుడే ఇత‌డెందుకిలా బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు? ఇత‌డి వెన‌క ఎవ‌రున్న‌ట్టు? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. అయితే ఇత‌డు మాగంటి ఇంటి పేరును కూడా త‌న పేరు చివ‌ర వాడ‌టం లేద‌నీ.. కొస‌రాజు తార‌క్ ప్ర‌ద్యుమ్న అనే పేరుతో చెలామ‌ణీ అవుతున్నాడ‌నీ.. తండ్రి చివ‌రి సారి చూపుల‌కు కూడా రాని ఇత‌డు.. ఇప్పుడే స‌డెన్ గా ఊడి ప‌డ్డం వెన‌క కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయ కుట్ర కోణం ఉంద‌నీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడ‌ర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్  భార్య అవునా కాదా?  లివిన్ లో మాత్ర‌మే ఉన్న జీవిత భాగ‌స్వామా? వంటివి పెద్ద‌గా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశ‌గా చ‌ట్టాలు మారి చాలా కాల‌మే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ ని బ‌ట్టిచూస్తే ఆడ, మ‌గ తేడా లేకుండా ఎవ‌రు ఎవ‌రితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. స‌హ‌జీవ‌న భాగ‌స్వామ్యం కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే సునీత త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రాలే అస‌లు స‌మ‌స్య‌. ఇప్ప‌టికే సునీత నామినేష‌న్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణ‌యం తీస్కుంటారన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది.

జూబ్లీ బైపోల్.. 130 మంది నామినేషన్లు రిజెక్ట్.. బరిలో మిగిలింది 81 మంది!

జూబ్లీ బైపోల్ బరిలో 81 మంది మిగిలారు. ఈ ఉప ఎన్నికలో పోటీకి భారీ సంఖ్యలో  నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం (అక్టోబర్ 22) నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్ల   స్క్రూటినీ ప్రక్రియ దాదాపు 17 గంటల పాటు సాగింది.  వివిధ కారణాలతో 130 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో  130 మంది అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లు  తిరస్కరణకు గురయ్యాయి. దీంతో స్క్రూటినీ అనంతరం జూబ్లీ బరిలో 81 మంది మిగిలారు.  ఇక నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో బరిలో మిగిలిన వారిలో ఎందరు తమ నామినేషన్లను ఉపసంహరిం చుకుం టారన్నది చూడాల్సి ఉంది.  ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి.  

బాలికపై అత్యాచారయత్నం నిందితుడి ఆత్మహత్య

తునిలో బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడు నారాయణ రావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచారయత్నం కేసులొ నారాయణరావును అరెస్టు చేసి బుధవారం (అక్టోబర్ 22) కోర్టుకు తరలిస్తుండగా ఘటన జరిగింది.  అతడి మృతదేహాన్ని తుని శివారులోని కోమటి చెరువులో గుర్తించారు.  వివరాలిలా ఉన్నాయి. మంగళవారం (అక్టోబర్ 21)  ఉదయం   తాటిక నారాయణరావు బాలికకు తను తాతయ్యను అవుతానంటూ పాఠశాల సిబ్బందికి  పరిచయం చేసుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే నెపంతో బాలికను హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్లి తినుబండారాలు కొనిపెట్టి తనంటే ఇష్టం కలిగించేలా ప్రవర్తించాడు. అలా తీసుకెళ్లిన నారాయణరావు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు తొండంగి మండలం, పైడికొండ గ్రామ శివారులో గల సపోటా తోటలోకి తీసుకొని వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆ సమయంలో బాలిక  కేకలు వేయగా అటుగా వెళుతున్న వ్యక్తి  చూసి నారాయణరావుని ప్రశ్నించాడు. తాను టీడీపీకి చెందిన వ్యక్తిని అని తప్పుడు సమాచారం ఇచ్చాడు. వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  తోటకు సమీపంలో ఉన్న రెడ్ స్కూటీపై బాలికను ఎక్కించుకొని పారిపోయిన నారాయణరావు ఆమెను స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఊరి జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం దృష్టికి రావడంతో కేసు నమోదుకు ఆదేశించింంది. వెంటనే తుని పోలీసులు నారాయణరావుపై కేసు నమోదు చేశారు. సాక్షులను విచారించారు.  నేరం జరిగిందని నిర్దారించుకొని బుధవారం ఐదు గంటలకు జగన్నాధగిరి  సమీపంలో రైల్వే  అండర్ పాస్ వద్ద  నారాయణరావును అరెస్టు చేశారు.   ప్రాథమిక విచారణ అనంతరం నారాయణరావును కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెడుతుండగా, మార్గమధ్యలో  మూత్ర విసర్జనకంటూ వాహనం నుంచి దిగి సమీపంలోనే ఉన్న చెరువులోకి దూకాడు. అతడి మృతదేహం కోమటి చెరువులో లభ్యమైంది. 

అమరావతిలో 12 నేషనల్ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు శంకుస్థాపన.. ఎప్పుడంటే?

నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు దేశంలోనే.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశానమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి  అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి.  అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.  అంతేనా అమరావతికి పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలూ తరలి వస్తున్నాయి. ఈ నెల 28న అమరావతిలో  12 జాతీయ స్థాయి బ్యాంకుల రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది.  ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ హాజరౌతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, ఆర్బీఐ  గవర్నర్, ఆయన బ్యాంకుల ఉన్నతాధికారులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ బ్యాంకుల కోసం ఉద్దండరాయుని పాలెం వద్ద స్థలాలు కేటాయించారు. ఆ యా స్థలాలను చదును చేయడం కూడా జరిగింది. ఈ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభా వేదికపై నుంచే 12 బ్యాంకులకు ఒకే సారి శంకుస్థాపన జరుగుతుంది.   వాస్తవానికి 2014-19  మధ్య కాలంలోనే అమరావతిలో ఈ బ్యాంకుల కోసం స్థలం కేటాయించినప్పటికీ, 2019లో ప్రభుత్వం మారి జగన్ అధికారంలోకి రావడంతో ఇక బ్యాంకుల ఏర్పాటుకు ముందడుగు పడలేదు. బ్యాంకులు ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి పెద్దగా సుముఖత చూపలేదు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపింది.  ఇక్కడ వాటి రాష్ట్ర కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కు 3 ఎకరాలు కేటాయించారు. ఆ స్థలంలో ఎస్బీఐ  14 అంతస్తులు భవనం నిర్మిస్తోంది.  అలాగే కెనరా బ్యాంక్ ,  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్,   పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనాల నిర్మాణం ఒకే సారి ప్రారంభంకానుంది. ఈ భవనాల్లోనే ఆయా బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటౌతాయి.   ఈ బ్యాంకుల ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  

కేవలం నాలుగుగంటల్లోనే విజయవాడ టు సింగపూర్!

ఆంధ్రప్రదేశ్‌లో వైమానిక సర్వీసులు వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర పురోభివృద్ధికి ఇదొక సూచికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ వైమానిక సర్వీసుల విస్తరణ రాష్ట్రం పురో గమనానికి ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా   విజయవాడ నుంచి సింగపూర్‌కు మరో కొత్త సర్వీసు ఆరంభం కానుంది. ఇండిగో విమానసంస్థ విజయవాడ నుంచి సింగపూర్ కు అంతర్జాతీయ విమాన సర్వీసును వచ్చే నెల 15 నుంచి ప్రారంభించనుంది. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే ఇక విజయవాడ నుంచి కేవలం నాలుగంటే నాలుగు గంటలలో సింగపూర్ చేరుకునే వీలు కలుగుతుంది.  అలాగే రాష్ట్రం నుంచి విదేశీ ప్రయాణం సులభమౌతుంది.  ఇక విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన టికెట్ ధరను ఇండిగో సంస్థ ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించింది. ఈ విమానం సింగపూర్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడకు ఉదయం 7 గంటల 45 నిముషాలకు చేరుకుంటుంది. ఇక విజయవాడ నుంచి ఉదయం 10 గంటల ఐదు నిముషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిముషాలకు సింగపూర్ చేరుకుంటుంది.  ఇండిగో సంస్థ నిర్ణయించిన ప్రకారం ఈ విమాన టికెట్‌ ధర రూ.8 వేలుగా నిర్ణయించారు. ఈ విమానం ఉదయం 4 గంటల 45 నిముషాలకు సింగపూర్‌ నుంచి బయలుదేరి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్‌లోని ప్రసిద్ధ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల్లోనే సింగపూర్ నుంచి విజయవాడకు, అలాగే విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన ప్రయాణం పూర్తికావడం వల్ల ప్రయాణీకులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ విమాన సర్వీసుకు సంబంధించిన టికెట్ విక్రయాలు ప్రారంభమైనట్లు ఇండిగో సంస్థ తెలిపింది.  యి.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. గురువారం (అక్టోబర్ 23) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 21 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 22) శ్రీవారిని మొత్తం 72 వేల 853 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 551 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది. 

అమరావతిలో రూ.100 కోట్లతో వరల్డ్ క్లాస్ లైబ్రరీ

  దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో ఏపీ సీఎం  చంద్రబాబు  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ ముందుకు రావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.100 కోట్ల విరాళం ప్రకటించినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.దుబాయ్ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీలో, “జీరో పావర్టీ” లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పీఎన్సీ మీనన్‌కు సీఎం వివరించారు.  అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానులలో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు.రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని సీఎం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం సరైన గమ్యస్థానమని పేర్కొన్నారు.తదుపరి మూడు సంవత్సరాల్లో అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలు పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా, విశాఖపట్నంలో గూగుల్ డేటా–ఏఐ హబ్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గంజాయి వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

  అచ్చం సినిమాలో మాదిరిగానే తెలంగాణ పోలీసులు ఈగల్ టీమ్ తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి గంజాయి ఉన్న ఓ వాహనాన్ని రాత్రంతా ఫాలో చేస్తూ చివరకు చెక్ పెట్టి... నిందితు డిన్ని అరెస్టు చేసి అతని వద్ద ఉన్న  డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు...  సినిమాలో లాగా తెలంగాణ పోలీ సులు చేసిన చేజింగ్ సీన్స్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. గంజాయి భారీ ఎత్తున సరఫరా చేస్తున్నట్లు గా విశ్వసనీ యమైన సమాచారం రావడంతో వెంటనే ఖమ్మం జిల్లా నార్కోటిక్ పోలీసులు అప్రమత్తమై ఈగల్ టీం తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వ హిస్తూ... ఆంధ్ర-- ఒరిస్సా సరిహద్దు ప్రాంతా ల్లో నిఘా పెట్టారు.  ఈ నేపథ్యంలోనే అధికా రులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా పోలీ సుల తనిఖీల్లో నుంచి ఈజీగా తప్పించుకోవచ్చునని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే 21వ తేదీన మధ్య రాత్రి అతిపెద్ద ట్రక్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్‌లో గంజాయి పెట్టుకొని రవాణా చేస్తు న్నారు. అక్కడ వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారు లకు ఒక వాహనం అనుమానంగా కనిపించింది.  హెవీ వాహనం ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా నుండి ఉత్తరప్రదేశ్‌లో వారణాసికి బయలుదేరినట్లుగా నిర్ధారణ అయింది. అయితే వీరు గంజా యిని తీసుకొని తెలంగాణ గుండా ప్రయాణం చేస్తు న్నారు. తెలంగాణ పోలీసులు రాత్రం తా హెవీ వాహ నాన్ని చేజ్ చేస్తున్నారు... పోలీసులు తమను చేజ్ చేస్తున్నారని తెలుసుకున్న ఈ ముగ్గురు నింది తులు వాహనం దారి మళ్ళించి... వేరే దారిలో వెళ్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనేతెలంగాణ పోలీసులు ట్రాకింగ్ ద్వారా రాంచి ఎన్సీబీ కి సమాచారం ఇచ్చింది. రాంచి ఎన్సీబి అధికారులు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసి.. చివరకు   జార్ఖండ్ లోని రాంచి-రూర్కెలా రోడ్డులోని సిమ్ దేగా వద్ద 10 టైర్ల హెవీ గూడ్స్ వాహనాన్ని అడ్డగిం చారు. అనం తరం అధికారులు హర్యానాకు చెందిన నసిమ్ కమ్రుద్దీన్ (30) ను పట్టుకోగా హర్యానాకు చెందిన ముష్తాక్ ఖాన్, ఆరిఫ్ ఈ ఇద్దరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నివసిస్తున్నారు.. అధికారులు నసీమ్ కమ్రుద్దీన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 500 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

జూబ్లీ ఉప ఎన్నికల బరిలో 34 మంది అభ్యర్థులు

  జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ ల స్క్రూటీనీ ప్రక్రియను బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో  సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పకడ్బందీగా  నామినేషన్ ల స్క్రూటీనీ చేపట్టాలనీ రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. భారీ స్థాయిలో నామినేషన్ లు దాఖలు కావడంతో నామినేషన్ల స్క్రూటీనీ అధిక సమయం పడుతుంది. అభ్యర్థులు తమ  నామినేషన్ ల ఉపసంహారణకు ఈ నెల 24  తేదీ వరకు ఈసీఐ అవకాశం ఇచ్చింది.  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. చాలా నామినేషన్లు వచ్చినప్పటికీ.. పోటీ ఇ రెండు పార్టీల మధ్యనే ఉండటంతో వీరి నామినేషన్ల పరిశీలపై ఉత్కంఠతగా ఎదురు చూసారు కార్యకర్తలు. తన నామినేషన్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ యాదవ్ తెలిపార. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు తెలిపారు. 56 నామినేషన్లును ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బరిలో 34 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదం తెలిపారు.