పేకాట శిబిరాలపై చర్యల నివేదిక.. డీజీపీకి పవన్ కల్యాణ్ ఆదేశం

గత వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహించిన పలు చట్ట విరుద్ధ కార్యకలాపాలలో   జూదం ఒకటి. రమ్మీ క్లబ్‌లు, పేకాట శిబిరాలు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు  సహా జూద గృహాలను నిర్వహించారు. నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 18 మాసాలు అయినా కూడా ఈ జూద గృహాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్,  ఆఫ్‌లైన్ సహా ఈ పేకాట జాడ్యం విస్తరించింది. దీనిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి పేకాట శిబిరాలు, జూదగృహాలపై పలు ఫిర్యాదులు అందాయి.   వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో, కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం జూదం నిర్వహించడం, ఆడడం   శిక్షార్హమైన నేరాలు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై ఉప ముఖ్యమంత్రి దృష్ఠి సారించారు. చట్ట విరుద్ధంగా రాష్ట్రంలో సాగుతున్న ఈ పేకాట శిబిరాలు, జూదగృహాలపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల నివేదిక తనకుసమర్పించాల్సిందిగా పవన్ కల్యాణ్ డీజీపీని ఆదేశించారు.  

జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ ప్రచార సారథి కేసీఆర్!?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ అజ్ణాతాన్ని వీడి క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి ప్రవేశిస్తున్నారా?  బీఆర్ఎస్ కు చావో రేవోగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం ప్రచార సారథ్యం వహించనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంలో జూబ్లీ బై పోల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బైపోల్ కు బీఆర్ఎస్  అభ్యర్థిగా మాగంటి సతీమణి సునీతను రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక వచ్చే నెల 11న జరగనుంది.    ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికలో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మిగిలిన పార్టీల కంటే ఈ ఉప ఎన్నిక విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. ఈ ఉప ఎన్నికలో విజయంపైనే ఆ పార్టీ ఉనికి, ఊపు ఆధారపడి ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికలో పార్టీని గలిపించడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా తానే ప్రచార సారథ్యం వహించాలన్న తలపుతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసినా ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రచారానికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ.. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ పార్టీ ప్రధాన ప్రచార కర్తగా, ప్రచార సారథిగా ఉంటారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.   ఆ మేరకు పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా కేసీఆర్ పేరును కూడా బీఆర్ఎస్ చేర్చంది. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్ లు తమ ప్రచారం ప్రారంభించేశారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా జూబ్లీ బైపోల్ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని చెబుతున్నారు.   

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు. బుధవారం (అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 26 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 76 వేల 343 మంది దర్శించుకున్నారు. వారిలో 18 వేల768 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది. 

ప్రత్యేక కోర్టు ద్వారా లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ : సీఎం చంద్రబాబు

  కందుకూరులో ఇటీవల హత్యకు గురైన లక్ష్మీనాయుడు కేసును ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా లక్ష్మీ నాయుడు హత్యను సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, అమానవీయం అని వ్యాఖ్యానించారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అన్నారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. రూ.5 లక్షల చొప్పున పరిహారం.. 2 ఎకరాల చొప్పున భూమి లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వీరితో పాటు దాడిలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని చంద్రబాబు అధికారులను సూచించారు.  అంతేకాకుండా ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్‌కు కూడా రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భధ్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. 

పేకాట శిబిరాల నిర్వహణపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు

  ఆంధ్రప్రదేశ్ లో జూదం ఆడటం,  జూద కేంద్రాలు నిర్వహించడం, ప్రోత్సహించడం నేరం. ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించినా, ఆడినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ - 1974 ప్రకారం  శిక్షార్హులు అవుతారు అని చట్టం చెబుతోంది. రాష్ట్రంలో చట్ట విరుద్ధంగా జూద కేంద్రాలు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయానికి  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.  పేకాట క్లబ్బుల నిర్వహణపై ఆ ఫిర్యాదుల్లో తెలిపారు. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారి మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే  ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు, పోలీసు అధికారులకు దీనిపై ఉన్న సమాచారం తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  దీనిపై ఆరా తీశారు. ఒకవేళ పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో తెలియజేయాలని హోం శాఖకి  రాష్ట్ర డీజీపీకి స్పష్టం చేశారు.

ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య

  ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల్లో కె.రామకృష్ణ స్ధానంలో  కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తొలుత విశాఖకు చెందిన జేవీవీ సత్యనారాయణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించిన తరువాత అధిష్టానం నిర్ణయం విరమించుకుంది.  వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎఐవైఎఫ్, ఎఐఎస్ఎఫ్ విభాగంలో క్రియాశీలకంగా పని చేశారు. కడప జిల్లాలో కార్మికులు, రైతుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, నిర్వహించిన ఆందోళనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  క్షేత్రస్థాయిలో ఆయనకున్న అనుభవం, క్రియాశీలత ఈ పదవికి ఎంపికవడంలో కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈశ్వరయ్య నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటాలను ఉద్ధృతం చేస్తామని సీపీఐ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వరయ్య ఎన్నో‌ పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. అని జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా తెలిపారు.

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై హెచ్‌ఆర్సీ సుమోటో కేసు

  రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన వరస కథనాల ఆధారంగా చేసుకొని హెచ్ఆర్సి కేసు నమోదు చేసుకుని... ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు .కానిస్టేబుల్ ఎం. ప్రమోద్ కుమార్ ను అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నాడు.  అయితే డిజిపి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. రియాజ్‌ను  వెంటనే పట్టుకోవాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిన్న నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సారంగాపూర్ లో నిందితుడు రియాజ్ ఓ ద్విచక్ర వాహనదారుడి తో గొడవ పడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకొని... నిజామాబాద్ హాస్పి టల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందు తున్నాడు.  అయితే నిందితుడు రియాజ్ బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా తనకు సెక్యూరిటీగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సర్వీస్ గన్ తీసుకొని పోలీసు లను చంపుతానంటూ బెదిరింపు లకు గురి చేస్తూ అక్కడినుండి పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పై దాడికి పాల్పడ డంతో ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపామని.... ఈ క్రమంలోనే అతను మరణించాడని పోలీసులు వాదించారు.  ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవ నివేదిక సమర్పించాలంటూ హెచ్ఆర్సీ....డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివ రాలు ఇవ్వాలని సూచించారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 కింద ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది... కాబట్టి ఈ ఘటనపైసుప్రీంకోర్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్కౌంటర్ కు దారి తీసిన పరి స్థితులు మరియు ఎన్కౌంటర్ మరణంపై హెచ్ఆర్సీ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ కాపీ మరియు పోస్టు మార్టం నివేదికతో సహా నవంబర్ 24వ తేదీ వరకు నివేదిక ను సమర్పించా లంటూ డీజీపీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కారు ఢీకొని బాలుడి మృతి

    ఓ కారు మితిమీరిన వేగంతో బీభత్సం.... ఓ చిన్నారి బాలుడి ప్రాణం ఖరీదు... దీపావళి పండుగ రోజు ఇంట్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్.. చేయకూడదంటూ పోలీసులు  హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయినా కూడా యువత ఆ మాటలను పెడచెవిన పెట్టి మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ఇతరుల మరణానికి కారకులవుతున్నారు. నిన్న దీపావళి పండుగ రోజు నార్సింగీ పరిధిలో ఓ కారు చేసిన బీభత్సానికి ఓ చిన్నారి బాలుడు మృత్యువాతపడ్డాడు.  ఆ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది... రంగారెడ్డి జిల్లా నార్సింగీ కి చెందిన నవీన్ కుమార్ దీపావళి పండుగ సందర్భంగా తన రెండు సంవత్సరాల కొడుకు కూషన్ జోయల్‌ను  తీసు కొని టపాసులు కోసమని బైక్ మీద ఖాజా గూడా వెళ్లారు. తిరిగి ప్రయాణంలో అల్కాపూర్ రాగానే వీరి ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుండి ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టింది.  ఆ తాకిడికి బైక్ పై ఉన్న తండ్రి కొడుకు ఇద్దరు ఎగిరి రోడ్డు మీద పడిపోయారు. వెనువెంటనే కారు చిన్నారిపై నుండి రయ్ రయ్ అంటూ దూసుకువెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి బాలుని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆ బాలుడు మృతిచెందాడు.  దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలను కొనుక్కొని తన కొడుకుతో పాటు సంతోషంగా ఆడుకోవాలని చూసిన ఆ తండ్రికి... తన చేతు ల్లోనే ప్రాణాలు విడిచిన కొడుకును చూస్తూ బోరున విలపించాడు... అతని రోదన చూసి స్థానికులు, వాహన దారులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన పలువురి హృదయాలను కదిలించివేసింది. కొడుకు మరణ వార్త వినగానే తల్లి తన గారాల పట్టి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడంటూ  గుండెలు బాదుకుంది. నవీన్ కుమార్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగించారు.

వైసీపీ నేత భూమనకు షాక్

  వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై భూమన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గోవుల మృతిపై ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని తిరుపతి ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గోశాలలోని అధికారుల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పదుల సంఖ్యలో గోవులు అకాల మరణం చెందాయని భూమన విమర్శించారు. వాటికి సరైన సంరక్షణ, వైద్యం అందించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భూమన ఆరోపించారు. భూమన చేసిన ఆరోపణలు స్థానికంగా రాజకీయ దుమారం రేపడంతోపోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. 

కార్యకర్తలతో కోటంరెడ్డి వన్ టు వన్ కార్యక్రమం

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యకర్తల కష్టాలు, సమస్యలు వింటూ  ఒక్కొక్క కార్యకర్తతో 15 నిమిషాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే 57 మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే  సమావేశం అయ్యారు. పార్టీలో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, కార్యకర్తల కష్టాలు స్వయంగా  శ్రీధర్ రెడ్డి  తెలుసుకుంటున్నారు.  ఇప్పటివరకు 700 మంది కార్యకర్తలతో వన్ టు వన్ కార్యక్రమం పూర్తి అయింది.  నియోజకవర్గం మొత్తం కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు.  ఓపికగా ఒక్కొక్క కార్యకర్త సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారం చూపారు శ్రీధర్ రెడ్డి.  నెల్లూరు రూరల్  నియోజకవర్గ వ్యాప్తంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వన్ టు వన్ కార్యక్రమం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీడీపీ నాయకులు తెలిపారు.

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి లంకల

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో బీజేపీ నేతలతో కలిసి వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్లకు నేటితో చివరి రోజు ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించనున్నారు.  చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం 94 మంది 127 సెట్ల నామినేషన్లను దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్‌ను అభ్యర్థి నవీన్ యాదవ్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు బీఆర్‌ఎస్ నుండి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో రానున్న శాసన సభ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది.    

జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధాని

  జపాన్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనా తకాయిచి  ఎన్నికై చరిత్ర సృష్టించారు. నిన్న జరిగిన పార్లమెంట్ లోయర్ హోస్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనా తకాయిచికి 237 ఓట్లు లభించాయి. దీంతో ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారు. ఎగువ సభ ఆమోదం కూడా పొందిన తర్వాత, ఈ సాయంత్రం ఆమె జపాన్ 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  చక్రవర్తిని కలిసిన అనంతరం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపడతారు. కాగా ఐరన్ లేడి ఆఫ్ జపాన్‌గా గుర్తింపు పొందారు. గత నెలలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మాజీ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగాల్సి వచ్చింది.చైనా విధానాలపై తీవ్ర విమర్శలు చేసే వ్యక్తిగా పేరుగాంచిన తకాయిచి, గతంలో ఒక హెవీ మెటల్ డ్రమ్మర్‌గా కూడా పనిచేశారు. అక్టోబర్ 4న అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు.  అయితే, ఆమె కన్జర్వేటివ్ భావాలు, పార్టీలోని నిధుల కుంభకోణం కారణంగా పాత మిత్రపక్షం కొమెయిటో పార్టీ సంకీర్ణం నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో ఎల్‌డీపీ కొత్త పొత్తు కోసం ప్రయత్నించి, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ)తో సోమవారం సాయంత్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తకాయిచి మాట్లాడుతూ "జపాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాను. భావితరాలకు బాధ్యత వహించే దేశంగా జపాన్‌ను తీర్చిదిద్దుతా" అని హామీ ఇచ్చారు.

నవంబర్ 19న బతుకమ్మ చీరలు పంపిణీ

  తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంచింది. మహిళా శక్తితో పేరుతో వీటిని పంపిణి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బతుకమ్మ పండుగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్దం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ చేసి 19న పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా చీరలను ఇవ్వడం ప్రారంభించింది. సరిగ్గా బతుకమ్మ నాటికి చీరలను పంపిణీ పూర్తి చేసేది. అయితే బీఆర్ఎస్ సర్కార్ పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు ఇస్తామని ప్రకటించింది. అందుకోసం చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారీ చేయిస్తున్నారు.

కొన‌సాగింపు గాంధీ వ‌చ్చేశాడోచ్!

  ప్రియాంక గాంధీ వాద్రా.. త‌న కొడుకు పేరు.. రెహాన్ రాబ‌ర్ట్ వాద్రా నుంచి రెహాన్ రాజీవ్ గాంధీ అనే కొత్త పేరుకు మార్పించారు. అది కూడా కోర్టు ద్వారా పూర్తి చ‌ట్ట‌బ‌ద్ధంగా. దీంతో రాహుల్ గాంధీతో అంత‌మై పోనున్న గాంధీస్ డైనాస్టీ కాస్తా.. కొన‌సాగనుంది. దీంతో రెహాన్ రాజీవ్ గాంధీ ఇలా పేరు మార్చుకున్నారో లేదో అలా కొన‌సాగింపు గాంధీగా పిలుస్తున్నారంద‌రూ. బేసిగ్గానే ఒరిజిన‌ల్ గాంధీ కుటుంబం నుంచి దేశ రాజ‌కీయాల్లో ఎవ్వ‌రూ లేరు. గాంధీ కొడుకులున్నా వారంతా కూడా ర‌క‌ర‌కాల రంగాల్లో ఉండ‌టం వ‌ల్ల మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ కంటూ ఒక రాజ‌కీయ వార‌సుడు లేకుండా పోయారు. ప్ర‌స్తుతం గాంధీజీ మ‌న‌వళ్లుగా..  రాజ్‌మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ, అరుణ్ మణిలాల్ గాంధీ, తుషార్ గాంధీ వంటివారున్నారు. గాంధీకి నలుగురు కొడుకులు - హరిలాల్, మణిలాల్, రాందాస్, దేవదాస్. వీరి వార‌సులే వారంతా.  నిజ‌మైన గాంధీలు ఇంత మంది ఉండ‌గా.. వీరంతా కూడా రాజ‌కీయాల్లో లేక పోవ‌డంతో.. రాహుల్ గాంధీయే చివ‌రి రాజ‌కీయ‌ గాంధీగా ఉన్నారు. నిజానికి ఈ రాహుల్ గాంధీ కూడా ద ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఇందిర నెహ్రూ- ఫిరోజ్ గాంధీని పెళ్లాడ్డం వ‌ల్ల ఆమె ఇందిరా గాంధీగా మారారు అప్ప‌ట్లో. అలాగ‌ని ఫిరోజ్ గాంధీ సైతం ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఆయ‌న్ను గాంధీజీ ద‌త్త‌త తీస్కోవ‌డం వ‌ల్ల‌.. ఆయ‌న‌కా ఇంటి పేరు వ‌చ్చింది.  ఒక వేళ గాంధీ అన్న పేరే అంత గొప్ప రాజ‌కీయ నామం అయితే.. ఇక రాజ‌కీయాల్లో రాణించానుకున్న వారంతా.. గాంధీ అని పేరు పెట్టేసుకుంటే స‌రిపోతుంది క‌దా!? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఉన్న ఒరిజిన‌ల్ గాంధీల‌ను ప‌క్క‌న పెట్టి ఎక్క‌డో ఉన్న వాద్రాని గాంధీ చేయ‌డం వ‌ల్ల‌.. ఎలాంటి సందేశం ఇవ్వ‌నున్నారీ ప్రియాంక గాంధీ వాద్రా అన్న‌ది ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఇందులో వాద్ర అనేది కూడా ఒక కుటుంబ‌మే. మ‌రలాంట‌పుడు ఆ కుటుంబానికున్న ఆత్మ‌గౌర‌వం త‌గ్గించుకోవ‌డం కాదా ఇదీ? ఆపై గాంధీగా త‌న కొడుక్కి పేరు మార్చ‌డం వ‌ల్ల ప్రియాంక అంత విలువ లేని కుటంబానికి కోడ‌లిగా వెళ్లిన‌ట్టా? మ‌రి అత్తింటి కుటుంబ గౌర‌వాన్ని ఇది త‌గ్గించ‌డం కాదా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  గాంధీ అన్న పేరు పెట్ట‌గానే గొప్ప వాళ్ల‌యిపోతే.. మ‌రి గాంధీజీకి పుట్టిన న‌లుగురు కొడుకులు వారికి పుట్టిన పిల్ల‌లు ఆ పిల్ల‌ల‌కు పిల్ల‌లూ.. రాజ‌కీయంగా ఎంతో ఎత్తుల‌కు ఎదిగి పోవాలి క‌దా!? మ‌రి వారు ఎందుక‌ని అంత‌టి రాజ‌కీయ అనామ‌కులుగా మిగిలిపోయారు??? అన్న చ‌ర్చ‌కు తెర‌లేస్తోందీ ప్రియాంక గాంధీ వాద్రా చ‌ర్య‌ల వ‌ల్ల అంటున్నారు కొంద‌రు.  

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి : సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ పోలీసు శాఖ చర్యలతో మవోయిస్టు, ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు.  ఆజ్జాతంలో ఉన్న మవోయిస్టులు లోంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కొందరు మవోయిస్టు అగ్రనేతలు కొందరు లొంగిపోయారని అలాగే మిగిలినవారు కుడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలంగాణ పునర్నిర్మాణనికి తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు. పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని సీఎం తెలిపారు.  మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ నుండి రూ.8 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు  

ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వాళ్లకు అదే ఆఖరి రోజు : సీఎం చంద్రబాబు

  ఏపీలో పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తుమన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని 6 ఏపీఎస్పీ బెటాలియన్ లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కల్తీ మద్యంపై సీఎం కీలక వ్యాఖ్యలు..ఎవడు ఎక్కడ తప్పుచేసినా, దోషి ఎక్కడున్నా, ఏ పార్టీ వాడైనా సరే యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పాను రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కల్తీ మద్యం వల్లే చనిపోయారని దుష్ప్రచారం చేశారని పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి వారి ఆటలు సాగవు చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలే ఉండేవని కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.  వాళ్లు ఏది అనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీన్ని కొత్త ఛాలెంజ్ గా తీసుకోవాలి కొత్త ట్రెండ్స్ ను అరికట్టడానికి చొరవ తీసుకుని ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు. సీసీ కెమోరాలు, డ్రోన్లు, గూగుల్ టేకౌట్‌లను ఉపయెగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.  పోలీసు సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి పనిచేస్తున్నారంటూ పోలీసులను ప్రశంసించారు. ఈ ఏడాది విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని,. వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది.  ఈ కార్యక్రమంలో  సీఎస్ విజయానంద్ , డీజీపీ హరీష్ కుమార్ గుప్తా  పాల్గొన్నారు.

ద ఫ్యామిలీ మేన్ బాబు

  చంద్ర‌బాబు 4. 0 అంటే అంద‌రూ అది ప‌రిపాల‌న‌లో అనుకుంటారు. కానీ, ఆయ‌న ప‌రిపాల‌న ఇప్పుడేంటి ఎప్పుడో అంత‌ర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఈ విషయంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలే లేవు. ఆయ‌న ఇప్పుడే కాదు ఎప్ప‌టి నుంచో.. అడ్మినిస్ట్రేష‌న్ లో బ్రాండెడ్ సీఎంగా ఉన్నారు. ఆ మాట‌కొస్తే.. సీఈవో ఆఫ్ ద స్టేట్ అనే బిరిదు ఆయ‌న‌కు తాను తొలి సారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచీ ఉంది. బాబు మారింద‌ని చెబుతోంది.. ఆయ‌న యాటిట్యూడ్ కి సంబంధించిన‌ది. ఇటు కుటుంబం కావ‌చ్చు, అటు ప్ర‌జ‌ల మ‌ధ్య ఆయ‌న తీరు తెన్నులు కావ‌చ్చు.. వీటి విష‌యంలో విశేష‌మైన మార్పు రావ‌డ‌మే.. బాబు 4. 0 స్పెష‌ల్ మీరు భువ‌నేశ్వ‌రిగానీ, లోకేష్ గానీ మాట్లాడేట‌పుడు బాబు గురించి వారేమంటారో గుర్తించారా? నా బాల్యంలో కావ‌చ్చు నా ఎదుగుద‌లలో కావ‌చ్చు డాడీ పెద్ద‌గా ఉండేవారు కాద‌ని అంటారాయ‌న‌. ఒక పొలిటీషియ‌న్ గా మ‌రీ ముఖ్యంగా ఒక సీఎంగా ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఆల్వేస్ బిజీయే. ఇక నారా భువ‌నేశ్వ‌రీ మాత అన్న‌మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే త‌న మొత్తం ఫ్యామిలీ లైఫ్ లో బాబు తీసిచ్చింది ఒకే ఒక్క చీర‌గా చెప్పుకుని బాధ ప‌డ్డారామె.  లోకేష్ కొర‌త తీరేలా త‌న కేబినేట్లో మంత్రిని చేసి.. ఇక్క‌డ కావ‌చ్చు, ఏదైనా విదేశాల‌కు తీసుకెళ్ల‌డం కావ‌చ్చు.. చేస్తూ కొడుకు ముచ్చ‌ట తీర్చుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న మోడీ క‌ర్నులు జీఎస్టీ స‌భ‌లో కూడా త‌న త‌న‌యుడ్ని అది ప‌నిగా ద‌గ్గ‌ర‌కు తీస్కుని మోడీకి మొమెంటో ఇప్పించారు చంద్ర‌బాబు. అది క‌దా తండ్రి కొడుకుల వాత్స‌ల్యం అనిపించేశారు. ఈ మ‌ధ్య కాలంలో ఒక చేనేత వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌న శాల‌కు వెళ్లిన‌పుడు త‌న భార్య కోసం ప్ర‌త్యేకించీ ఒక చీర కొన్నారు చంద్ర‌బాబు. మా ఆవిడ నేనే చీర కొనివ్వ‌లేద‌ని కంప్ల‌యింట్ చేస్తోందీ.. ఆమె కోసం ఒక మంచి చీర ఇవ్వండ‌య్యా అంటూ అడిగి మ‌రీ ఆ లోటు తీర్చే య‌త్నం చేశారు. అలాంటి చంద్ర‌బాబుకు పండ‌గ‌లు ప‌బ్బాలు కూడా.. ఫ్యామిలీతో క‌ల‌సి ఉండేవి కావు. ఎప్పుడూ ఏదో ఒక బిజీ బిజీ. అలాంటిది ఇప్పుడు త‌న కుటుంబానికి కూడా కాస్త స‌మ‌యం కేటాయిస్తున్న దృశ్యానికి ఇదిగో ఇదే అస‌లైన సాక్ష్యం. గృహ‌మే క‌దా స్వ‌ర్గ సీమ అన్న‌ట్టుగా త‌న ఉండ‌వ‌ల్లి నివాసంలో స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రితో క‌ల‌సి ఆయ‌న దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం చాలా మంది దృష్టిని ఆక‌ర్షిస్తోంది. బాబు బొత్తిగా మారిపోయారోచ్ అంటూ ఒక‌టే కామెంట్లు పేలుతున్నాయ్ కొంద‌రి సోష‌ల్ మీడియా గోడల మీద‌. ఆ మాట‌కొస్తే.. బాబు ఫోర్ పాయింట్ ఓ అంటే ఇదేనంటూ కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.  

ఒక సీఎం.... జ‌నం మ‌ధ్య దీపావ‌ళి అంటే ఇదేనేమో!

  ఎప్పుడూ జెడ్ కేట‌గిరి భద్ర‌త లో ఉండే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక్క‌సారిగా జ‌నం మ‌ధ్య‌లోకి వ‌స్తే ఎలా ఉంటుందంటే.. జ‌స్ట్ దీపావ‌ళి న‌డిచి.. వ‌చ్చిన‌ట్టే ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఊహించ‌న‌వి విధంగా.. బాబు త‌మ ద‌గ్గ‌ర‌కి రావ‌డంతో ఒక్కొక్క‌రి క‌ళ్ల‌లో ఆనందం దీపావ‌ళి మ‌తాబుల్లో వెలిగిపోయి క‌నిపించాయి. ద‌స‌రా తొలి రోజు నుంచి దీపావ‌ళి వ‌ర‌కూ జీఎస్టీ త‌గ్గుద‌ల మీద అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. అందులో భాగంగా.. చంద్ర‌బాబు వితౌట్ సెక్యూరిటీతో మార్కెట్ లో క‌ల‌య‌దిరిగారు. చంద్ర‌బాబు. బాబు త‌మ‌ను ప‌ల‌క‌రించ‌డంతో ఒక్కొక్క‌రూ పుల‌క‌రించిపోయార‌నే చెప్పాలి. ఒక స‌మ‌యంలో జై బాబు జై బాబు అంటూ కొంద‌రు నిన‌దించ‌డం క‌నిపించింది.  త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ కోసం టపాకాయ‌లు కొన్న చంద్ర‌బాబు.. ఆపై ఒక సీజ‌న‌ల్ వ్యాపారితో జీఎస్టీ గురించి కాసేపు ముచ్చ‌టించారు. ఆపై చాలా మందితో సెఫ్లీల‌కు పోజులిచ్చారు. అటు పిమ్మ‌ట త‌న కారు ఎక్కి ఆయ‌న వెళ్లిపోయిన దృశ్యం క‌నిపించింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. హంగామాలు లేవు. జ‌నం పోగేయ‌టం వంటి కృత్రిమ విన్యాసాలు లేవు. అక్క‌డ జ‌నం ఎంత మంది ఉన్నారో అంద‌రితోనే మాటా మంతి క‌లిపారు. ఆపై వారి వారి వివ‌రాలు అడిగి తెలుసుకుని.. వారికి నిజ‌మైన దీవాళీ మ‌జా ఏంటో రుచి చూపించారు.  బాబు సార్ జ‌నం ముఖ్య‌మంత్రి అంతే అంటూ ఎవ‌రికి వారు ఉప్పొంగిపోయార‌నే చెప్పాలి. ఎంతైనా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న ప‌రిచ‌యం చేసిన సీఎం క‌దా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే జీఎస్టీ అవ‌గాహ‌న తీసుకురాలేరా? అన్న మాట కూడా వినిపించింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమల భక్తులు  ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుమల అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 72,026 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు గడిచిన 11 నెలల్లో 2024 నవంబర్ 1 నుండి - 2025 అక్టోబర్ 16వ తేదీ వరకు  రికార్డు స్థాయిలో రూ 918.6 కోట్లు విరాళాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడాక టీటీడీకు క్రమంగా దాతలు పెరుగుతున్నాట్లు తెలుస్తోంది