హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం

    హైదరాబాద్‌ నగరంలో శనివారం సాయంత్రం సమయంలో చాదర్‌ ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా సంచ లనం సృష్టించింది. సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్యతో పాటు పోలీస్ సిబ్బంది సెల్ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయత్నంలో  సెల్‌ఫోన్ స్నాచర్ కత్తితో ఒక్కసారిగా డిసిపి చైతన్య పై దాడి చేయడానికి యత్నించాడు. అయితే డిసిపి చైతన్యకు మరియు సెల్ఫోన్ స్నాచర్ మధ్య తోపులాట జరగడంతో డిసిపి చైతన్య గన్మెన్ వెపన్ కింద పడిపోయింది. దీంతో డిసిపి చైతన్య వెంటనే గన్ను తీసుకొని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.  చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతంలో  సెల్‌ఫోన్ స్నాచింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో డీసీపీ చైతన్య స్వయంగా తన గన్ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు.  మొత్తం మూడు రౌండ్ల  కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తోపులాటలో డీసీపీ గన్‌మెన్ కింద పడి గన్ నేలపై పడగా, వెంటనే డీసీపీ స్వయంగా ఆయు ధాన్ని స్వాధీనం చేసుకొని ఫైర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.  వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ డీసీపీ చైతన్యతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మొత్తం రెండు రౌండ్లు దొంగలపై ఫైర్ చేసినట్లు ఆయన తెలిపారు. నగర పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని  వెల్లడించారు.

కార్ పూలింగ్ తో ట్రా‘ఫికర్’కు చెక్

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడాన్ లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా మారడంతో ఆర్టీసీ ఐటీ కంపెనీల ముందుకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు ఐటీ కంపెనీలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆర్టీసీ ప్రతిపాదన ఏంటంటే..   ప్రజా రవాణాను విస్తరించేందుకు ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి ఐటీ కంపెనీకి ఒక ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతిపదికన కేటాయించడం ద్వారా ఉద్యోగులు సొంత వాహనాలకు బదులుగా బస్సులలో వచ్చేలా ప్రోత్సహించాలన్నది ఒక భాగం కాగా, కార్ పూలింగ్ అన్నది రెండో భాగంగా ఆర్టీసీ ప్రతిపాదన చేసింది.   ఇందులో భాగంగా ముందుగా మైండ్ స్పేస్ ప్రాంతంలో వన్ బస్ పర్ కంపెనీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సైబరాబాద్ పోలీసులు కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు సమసిపోతాయని అంటున్నారు.  సో ముందుగా మైండ్ స్పేస్ ఏరియాలో వన్ బస్ పర్ వన్ కంపెనీ పాలసీలో భాగంగా ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే 250 కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సైబరాబాద్ పోలీసులు ఓ సర్వే కూడా చేశారు.  ఆ సర్వే ప్రకారం ఐటీ హబ్  ప్రాంతాలలో  పనిచేసే చాలామంది ఉద్యోగులు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఎవరికి వారుగా సొంత వాహనాల్లో వస్తున్నారు. ఆ కారణంగా పీక్ అవర్స్ లో  ట్రాఫిక్  సమస్య తీవ్రమౌతోంది. ఇలా ఒకే ఆఫీసులో పని చేస్తూ ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కార్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకూ పరిష్కారమౌతుందని ఈ సర్వే ద్వారా తేలిందని అంటున్నారు. అలాగే మైండ్ స్పేస్ ప్రాంతంలోని కంపెనీలలో పని చేసే ఉద్యోగులు దాదాపు 250 కార్లలో తమతమ కార్యాలయాలను హాజరౌతున్నారని సర్వేలో తేలింది. ఈ కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేస్తే తక్కువలో తక్కువ పాతిక శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమౌతుందని అంటున్నారు. అంటే వన్ బస్ పర్ వన్ కంపెనీ పద్ధతిలో ఐటీ ఉద్యోగులు సొంత కార్లకు ప్రత్యామ్నాయంగా బస్సులను ఆశ్రయించేలా చేస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు కడతేరుతాయని అంటున్నారు. అదే సమయంలో ఆర్టీసీ తన బస్సులను ఐటీ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం కలుగుతుందంటున్నారు.  త్వరలోనే దీనిపై ఐటీ కంపెనీలు, ఉద్యగులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

  కర్నూలు జిల్లా చిన్నటేకూరులో వి. కావేరి బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బస్సు, బైక్ ప్రమాదాలు వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే— బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్, ఎర్రిస్వామి హైవేపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో శివశంకర్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  వెంటనే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న వి. కావేరి బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లింది.దీంతో బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అయి మంటలు చెలరేగాయి. దీని వల్ల పెట్రోలు లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయని ఎర్రిస్వామి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   ప్రమాదానికి ముందు శివశంకర్ మరో యువకుడితో కలిసి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో శివశంకర్ మత్తుతో తూలుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ దారుణం రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.  

రేవంత్ హస్తిన బాట.. డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. కేబినెట్ రీషఫుల్ కూడా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకూ ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణకూ లింక్ ఉందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. రేవంత్ రెడ్డి శనివారం (అక్టోబర్ 25) హస్తినకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన హస్తిన పర్యటనకు ప్రధాన కారణం పార్టీ జిల్లా అధ్యక్షుల ఖరారు కోసమే అయినప్పటికీ.. పనిలో పనిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించి ఓకే చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించే విషయంలో సీరియస్ గా ఉంది. అందుకోసమే శనివారం (అక్టోబర్ 25)  ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా వెళ్లారు.  అది పక్కన పెడితే.. తెలంగాణలో మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం ఏమీ గోప్యంగా ఉంచలేదు కూడా. పద్ధతి మార్చుకోవాలని   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షీ నటరాజన్ పలు మార్లు మంత్రులను హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులూ చేర్పుల కోసం హైకమాండ్ ను కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి సీఎం రేవంత్ హస్తిన పర్యటన సందర్భంగా తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతర పనుల విషయంలో రేగిన రగడ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.  అలాగే అంతకు ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్,  అడ్లూరి లక్ష్మణ్‌ ల వివాదంపై కూడా హైకమాండ్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. మంత్రివర్గ పునర్వ్యవ స్థీకరణపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

రాణించిన రోహిత్‌, కోహ్లీ...భారత్ ఘన విజయం

  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల టార్గెట్‌ను ఒకే వికెట్ కోల్పోయి టీమిండియ ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా , విరాట్ కోహ్లీ 74 పరుగుల అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది.  భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. రెన్‌షా (56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టిమీండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు  

శివయ్యపై ఇద్దరు నాగేంద్రుల దర్శనం

  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన పరిసరాల్లో నాగేంద్రుడు సంచరిస్తున్న సంగతి భక్తులకు తెలిసిందే.  అయితే, తాజాగా ఉదయం తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా విశ్వనాథ స్వామి సన్నిధిలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చారు. అందులో ఒక నాగేంద్రుడు శ్వేతనాగ రూపంలో కనిపించి, భక్తులందరికీ కడువిందు చేసినట్లు అక్కడివారు తెలిపారు. ఇప్పటివరకు ఒకే నాగేంద్రుడు దర్శనమిచ్చిన ఈ దేవస్థానంలో ఇద్దరు నాగేంద్రులు ప్రత్యక్షమవడం విశేషంగా మారి, మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు బస్సు దుర్ఘటనలో మృతదేహాల కోసం ఎదురుచూపులు

  కర్నూలు బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని డీఎన్ఏ సేకరించి ఎవరి చెందిన మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే  డీఎన్ఏ సేకరణకు మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు.  బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్నవారు 19 మంది చనిపోగా వారిలో ఇప్పటికే 14 మంది డిఎన్ఏ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్టుగా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఐదు మంది డీఎన్ఏల సేకరణ కూడా ఈరోజు పూర్తవుతుందని ఫారెన్సీక్ డాక్టర్లు చెబుతున్నారు. మృతుల దగ్గర నుంచి సేకరించిన డీఎన్ఏ పరీక్షలు పూర్తిచేసుకుని తిరిగి తిరిగి రిపోర్టులు రావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే మృతదేహాలు అప్పగింత ప్రారంభమవుతుందని చెప్తున్నారు.  దీనితో చనిపోయిన వారి బంధువుల బాధ వర్ణాతీతంగా మారింది. అసలే అయినవారు చనిపోయిన దుఃఖంలో శవాల అప్పగింతకు కూడా అధిక సమయం పడుతుండటంతో, ఎటు పాలుపోనీ నందిగ్ధంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాసిన చెందినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఆస్పత్రి మార్చురీ దగ్గర నిన్నటి నుంచి పదిగాపులు కాస్తున్నారు.  అయితే మృతదేహాలు అప్పగింతకు అధిక సమయం పడుతున్న నేపథ్యంలో వీరందరినీ అధికారులు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి తరలించి అక్కడ బసవ ఏర్పాట్లను చేశారు. సమయం ఆలస్యం అవుతున్న కొద్దీ చనిపోయిన వారి బంధువులు ఒకరు ఒకరిగా అక్కడికి చేరుతుండటంతో బంధువుల ఆక్రందనలు చూసేవారికి సైతం కంటతడి తెప్పిస్తున్నాయి..

పెద్ద అంబర్ పేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ల నైపుణ్యంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ ఆనుమానాలకు బలం చేకూర్చేలా  తాజాగా  మరో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. శనివారం (అక్టోబర్ 25)తెల్లవారు జామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, ముందు భాగం ధ్వంసమయ్యాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇకమరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటన శనివారం (అక్టోబర్ 26) ఉదయం జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరు వెడుతున్న న్యు గో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.   

ఏపీకి ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్

  అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పుటికీ అంతలోనే ఉన్న పళంగా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.  మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.  రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది.  ‘మొంథా’ తుపాను.. రాష్టంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.  ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో 90-110 కి.మీ. వేగంతో గాలుల వీస్తాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రభావం ఉండనుంది. తీర ప్రాంత జిల్లాల్లో 28,29 తేదీల్లో సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు.

కవిత క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్!

అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కవిత బహిరంగంగా చెప్పిన క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. తెలంగాణ జాగృతి తరఫున జాగృతి జనంబాట కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ప్రారంభించడానికి ముందు ఆమె తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంలో విఫలమయ్యామంటూ బీఆర్ఎస్ తరఫున క్షమాపణలు చెప్పారు.  అధికారంలో ఉన్న పదేళ్లలో  అమరుల ఆశయాల సాధన దిశగా సాగడంలో బీఆర్ఎస్ విఫలమైందనీ, అలాగే అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలోనూ, సరైన గౌరవం ఇవ్వడంలోనూ విఫలమయ్యామనీ అంగీకరించడం ద్వారా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.   కల్వకుంట్ల బహిరంగ క్షమాపణ బీఆర్ఎస్ కు బిగ్ షాకే..  ఎందుకంటే.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరులందరినీ తాము సముచితంగా గౌరవించామనీ, వారి కుటుంబాలకు అండదండగా నిలిచామనీ ఇంత కాలం బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్నది.  అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంత కాలం బీఆర్ఎస్ చెబుతూ వస్తున్నదంతా అవాస్తవమని తన బహిరంగ క్షమాపణలతో తేల్చేశారు. అమరుల కుటుంబాలకు రూ. కోటి సాయం కోసం పోరాడతానని ప్రకటించడం ద్వారా అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అమరులకు ఇచ్చింది శూన్యహస్తమేనని తేల్చేశారు. కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ లో లేరు.. నిజమే.. కానీ తెలంగాణ ఉద్యమ సారథి, నేత బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత అయిన కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత స్వయానా కుమార్తె.. ఆమే అధికారంలో ఉన్న సమయంలో తన తండ్రి, ఆయన ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ పరువును నిలువునా గంగలో కలిపేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత కొత్తగా తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆమె టార్గెట్ మాత్రం బీఆర్ఎస్సేననీ, రాష్ట్రంలో ఆ పార్టీ బలాన్నీ, బలగాన్నీ తనవైపుకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె భవిష్యత్ కార్యాచారణ ఉండబోతున్నట్లు అవగతమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అమరుల కుటుంబాలకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరులకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమో జనం బాట పట్టడానికి ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ సందర్భంగా మాట్లాడిన కవిత ఉద్యమకారులను న్యాయం చేయడంలో విఫలమయ్యానని అంగీకరించారు. అమరవీరుల కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.  ఇక నుంచి తన పోరాట పంథా మారుతుందన్నారు. జాగృతి జనం బాట యాత్రలో అందరినీ కలుస్తానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారని గుర్తు చేసుకున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.  తెలంగాణ  కోసం 1200 అమరులు అయ్యారనీ, అయితే ఆ అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత చెప్పారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. కేవలం 500 మంది అమర వీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు   ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు తాను   క్షమాపణ చెబుతున్నాననీ అన్నారు.  అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరు తున్నట్లు వెల్లడించారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలన్నారు. సబ్బండ వర్గాలూ కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఆమె తన జాగృతి జనం బాటలో జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తానన్నారు.  గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నానన్న ఆమె..  మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం కలిసిరావాలని  పిలుపునిచ్చారు.  

కిలో టమోటా రూ. 600లు.. ఎక్కడో.. ఎందుకో తెలుసా?

కిలో టామోటా ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు. ఈ మాట వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారా? ఈ ధర మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు లెండి. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో. ఔను పాకిస్థాన్ లో ఇప్పుడు టమోటా ధర జనం గుండెల్లో మంట పుట్టిస్తోంది. గింజ మెతుకు దొరకడమే అక్కడ గగనంగా మారిపోయింది. టమోటాల ధరైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. ఆ రెండు దేశాల సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దులను ఈ నెల 11 నుంచి మూసేశారు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఈ పరిస్థితి పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు దేశాల ప్రజలూ కూడా ఆహారం, ఔషధాల కొరతతో అల్లాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలూ చుక్కలనంటాయి. ఇరు దేశాల మధ్యా ఘర్షణలకు ముందు పరిస్ధితితో పోలిస్తే పాకిస్థాన్ లో అన్ని వస్తువుల ధరలూ కనీసం ఐదు రెట్లు పెరిగాయి.  ఆ దేశంలో  ప్రస్తుతం కిలో టమాటాల ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు పలుకుతోంది.   సాధారణంగా పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్   వెల్లడించింది.  ఈ కారణంగా  అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు ఎందుకూ పనికిరాకుండా పాడైపోయాయి. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయి.   గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్‌లోని దోహాలో పాక్, అఫ్గాన్‌ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులోభాగంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్ఠంభనకు తెరపడలేదు.   

ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నిన్న మొన్నటి వరకూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక ప్రచారంలో వెనుకబడిన మహాఘట్ బంధన్ ఇప్పుడు ఆ వ్యవహారం తేలడంతో ప్రచారాన్నిస్పీడప్ చేసింది. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మహాఘట్ బంధన్ కు చావో రేవోగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న అంచనాలతో ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాఘట్ బంధన్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు గెలుపు అంచనాలతో సీట్ల విషయంలో ఒకింత పట్టుదలకు పోయినా.. చివరాఖరకు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ వ్యవహారం వల్ల ప్రచారంలో కొంత విలువైన సమయాన్ని మహాఘట్ బంధన్ కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి కవర్ చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్.. ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తిగా ఉంది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా.. అదేదో సినిమాలో హీరో వేషం ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ తిరిగినట్లు.. తేజస్వీయాదవ్.. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే సర్కార్ ను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు.  ఇక ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కర్మాగారాలు ఏర్పాటు చేసి...  బీహార్‌లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.  నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించిన మోడీయే.. ఆయనపై చర్య తీసుకోకుండా ఆయన సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారనీ, కుంభకోణాల సర్కార్ ను మళ్లీ గెలిపించమని కోరుతున్నారనీ ఆరోపిస్తున్నారు. గత ఆర్జేడీ హయాంలో నితీష్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ అప్పుడు నితీష్ పై చేసిన విమర్శలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.  దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేజస్వి ఆరోపిస్తున్నారు. తాను  అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పననీ, చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా అని నొక్కి చెబుతున్నారు. ఇండియా కూటమి (మహాఘట్ బంధన్)ని గెలిపిస్తే.. తాను సీఎం అవుతాననీ, బీహార్ ను నేరరహిత రాష్ట్రం చేస్తాననీ చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందిస్తాననీ,   ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.  

కర్నూలు బస్సు ప్రమాదం.. లగేజీ క్యాబిన్లో వందల ఫోన్లు!

 కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా ఉండటానికి డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్లు తెరుచుకోకపోవడం ఒక కారణమైతే.. బస్సు లగేజీ క్యాబిన్ లో ఉన్న ఫోన్ల పార్శిల్ ప్రధాన కారణమని అంటున్నారు. బస్సు లగేజీ క్యాబిన్ లో  దాదాపు 46లక్షల రూపాయల విలువైన ఖరీదైన సెల్ ఫోన్ లను బస్సులో పార్సిల్ సర్వీసుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫొరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగగానే.. ఆ వేడికి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి.. మంటలు వేగంగా వ్యప్తి చెందాయి. ఆ కారణంగానే బస్సులోని ప్రయాణీకులు బయటకు రావడం కష్టమైందంటున్నారు.  కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి.  హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు   సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం  ఓ కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు.   మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలతో పాటు బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయనీ.. ఈ మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.   

పెట్టుబడులతో వస్తాం.. ఏపీపై యూఏఈ పారిశ్రామికవేత్తల ఆసక్తి

ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన,  పెట్టుబడులకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆవిష్కరించిన తీరు, పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం పాతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు.   అదే విధంగా యూఈఏ ప్రభుత్వ ప్రతినిధులు,  మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఏపీలో ఏయే ప్రాంతాలలో ఏయే రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో కూలంకషంగా వివరించారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఏఐ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వారి కళ్లకు కట్టారు.  విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయనే అంశానికి సంబంధించిన వివరాలను పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.  రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగం, ఎరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ వంటి పరిశ్రమలు, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు..ఆక్వా కల్చర్,   టూరిజం రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సీఏం అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లకు వివరించారు.   ఇక రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని, అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామనీ,  పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని భావిస్తే, అవసరమైతే పాలసీల్లో మార్పులు తేవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలిపారు. భారత్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి చొరవను సీఎం తన పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.   చంద్రబాబు ప్రజంటేషన్ కు ముగ్ధులైన యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ సంస్ధలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇక  చివరిగా   గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది  పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన ఊహించిన దానికన్న సక్సెస్ అయ్యింది. భారీ పెట్టుబడులు వస్తాయన్న ధీమాతో ఆయన తన పర్యటన ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు.  

వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ

ఓలా, ఉబెర్ వంటి   రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్' బ్రాండ్‌తో కొత్త టేక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి.    300 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని..  డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహించనున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్‌డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టేక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్నాయి.  ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు  డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.  తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.  

ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టిఏ దాడులు

కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన ఘటనతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను  క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.  డ్రంకన్‌ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్‌ పత్రాలు, బస్సు లోపల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్మిట్‌ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని   బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ, మెడికల్‌ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్‌ బస్సును సీజ్‌ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. అలాగే శుక్రవారం అర్థరాత్రి హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరా బాద్ శివారు ప్రాంతాలలో కూడా రవాణాశాఖ అధికారులు దాడులు కొనసా గుతున్నారు.  శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవే పైన కూడా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా కెరళా, తమిళ నాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, పాండి చ్చేరి, నాగాల్యాండ్, ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చే  వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ చేపట్టిన ఈ దాడులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఆర్టీఏ తీరు ఉందంటూ పెదవి విరుస్తున్నారు.   

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.శనివారం (అక్టోబర్ 25) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 24) శ్రీవారిని మొత్తం71 వేల110  మంది దర్శించుకున్నారు. వారిలో 25,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.  

అయ్యో అయ్యయ్యో.. ఏపీ మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే..!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుకు ముందు మరో మాజీ కూడా చేరనుందా? ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రే కాకుండా పులివెందుల మాజీ ఎమ్మెల్యేగా కూడా మారనున్నారా? అంటే అసెంబ్లీ డిప్యటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాటలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని  మరోమారు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే, రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిగ్గా శాసనసభ సభ్యత్వం రద్దైపోతుందని చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మరో పాతిక రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన గైర్హాజరైతే.. ఇక అంతే సంగతులు అని పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు కూడా. అదే సమయంలో గతంలో నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో అంటే జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ మొత్తం 67 రోజులు మాత్రమే సమావేశమైందన్న ఆయన.. చివరి రెండేళ్లలో అంటే చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన కాలంలో అసెంబ్లీ కేవలం 37 రోజులు మాత్రమే సమావేశమైందని చెప్పారు. అయితే జగన్ ఇప్పటికే  35 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారనీ, మరో పాతిక రోజులు ఆయన అసెంబ్లీ పనిదినాలలో సభకు హాజరు కాకపోతే ఆటోమేటిగ్గా మాజీ అవుతారని చెప్పారు. దీంతో  నెటిజనులు జగన్ కోరుతున్నట్లు ప్రతిపక్షహోదా సంగతి అటుంచి మొదటికే మోసం అంటే అసెంబ్లీ సభ్యత్వానికే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే జగన్ పరిస్థితి ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్నట్లుగా తయరయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రస్థానం మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే వరకూ సాగుతుందా? లేక మనసు మార్చుకుని ప్రతిపక్హ హోదా కోసం మంకుపట్టు వీడి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా?