ఏపీకి ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్

  అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పుటికీ అంతలోనే ఉన్న పళంగా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.  మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.  రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది.  ‘మొంథా’ తుపాను.. రాష్టంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.  ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో 90-110 కి.మీ. వేగంతో గాలుల వీస్తాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రభావం ఉండనుంది. తీర ప్రాంత జిల్లాల్లో 28,29 తేదీల్లో సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు.

కవిత క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్!

అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కవిత బహిరంగంగా చెప్పిన క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. తెలంగాణ జాగృతి తరఫున జాగృతి జనంబాట కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ప్రారంభించడానికి ముందు ఆమె తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంలో విఫలమయ్యామంటూ బీఆర్ఎస్ తరఫున క్షమాపణలు చెప్పారు.  అధికారంలో ఉన్న పదేళ్లలో  అమరుల ఆశయాల సాధన దిశగా సాగడంలో బీఆర్ఎస్ విఫలమైందనీ, అలాగే అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలోనూ, సరైన గౌరవం ఇవ్వడంలోనూ విఫలమయ్యామనీ అంగీకరించడం ద్వారా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.   కల్వకుంట్ల బహిరంగ క్షమాపణ బీఆర్ఎస్ కు బిగ్ షాకే..  ఎందుకంటే.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరులందరినీ తాము సముచితంగా గౌరవించామనీ, వారి కుటుంబాలకు అండదండగా నిలిచామనీ ఇంత కాలం బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్నది.  అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంత కాలం బీఆర్ఎస్ చెబుతూ వస్తున్నదంతా అవాస్తవమని తన బహిరంగ క్షమాపణలతో తేల్చేశారు. అమరుల కుటుంబాలకు రూ. కోటి సాయం కోసం పోరాడతానని ప్రకటించడం ద్వారా అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అమరులకు ఇచ్చింది శూన్యహస్తమేనని తేల్చేశారు. కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ లో లేరు.. నిజమే.. కానీ తెలంగాణ ఉద్యమ సారథి, నేత బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత అయిన కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత స్వయానా కుమార్తె.. ఆమే అధికారంలో ఉన్న సమయంలో తన తండ్రి, ఆయన ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ పరువును నిలువునా గంగలో కలిపేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత కొత్తగా తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆమె టార్గెట్ మాత్రం బీఆర్ఎస్సేననీ, రాష్ట్రంలో ఆ పార్టీ బలాన్నీ, బలగాన్నీ తనవైపుకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె భవిష్యత్ కార్యాచారణ ఉండబోతున్నట్లు అవగతమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అమరుల కుటుంబాలకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరులకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమో జనం బాట పట్టడానికి ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ సందర్భంగా మాట్లాడిన కవిత ఉద్యమకారులను న్యాయం చేయడంలో విఫలమయ్యానని అంగీకరించారు. అమరవీరుల కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.  ఇక నుంచి తన పోరాట పంథా మారుతుందన్నారు. జాగృతి జనం బాట యాత్రలో అందరినీ కలుస్తానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారని గుర్తు చేసుకున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.  తెలంగాణ  కోసం 1200 అమరులు అయ్యారనీ, అయితే ఆ అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత చెప్పారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. కేవలం 500 మంది అమర వీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు   ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు తాను   క్షమాపణ చెబుతున్నాననీ అన్నారు.  అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరు తున్నట్లు వెల్లడించారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలన్నారు. సబ్బండ వర్గాలూ కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఆమె తన జాగృతి జనం బాటలో జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తానన్నారు.  గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నానన్న ఆమె..  మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం కలిసిరావాలని  పిలుపునిచ్చారు.  

కిలో టమోటా రూ. 600లు.. ఎక్కడో.. ఎందుకో తెలుసా?

కిలో టామోటా ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు. ఈ మాట వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారా? ఈ ధర మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు లెండి. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో. ఔను పాకిస్థాన్ లో ఇప్పుడు టమోటా ధర జనం గుండెల్లో మంట పుట్టిస్తోంది. గింజ మెతుకు దొరకడమే అక్కడ గగనంగా మారిపోయింది. టమోటాల ధరైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. ఆ రెండు దేశాల సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దులను ఈ నెల 11 నుంచి మూసేశారు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఈ పరిస్థితి పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు దేశాల ప్రజలూ కూడా ఆహారం, ఔషధాల కొరతతో అల్లాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలూ చుక్కలనంటాయి. ఇరు దేశాల మధ్యా ఘర్షణలకు ముందు పరిస్ధితితో పోలిస్తే పాకిస్థాన్ లో అన్ని వస్తువుల ధరలూ కనీసం ఐదు రెట్లు పెరిగాయి.  ఆ దేశంలో  ప్రస్తుతం కిలో టమాటాల ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు పలుకుతోంది.   సాధారణంగా పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్   వెల్లడించింది.  ఈ కారణంగా  అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు ఎందుకూ పనికిరాకుండా పాడైపోయాయి. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయి.   గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్‌లోని దోహాలో పాక్, అఫ్గాన్‌ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులోభాగంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్ఠంభనకు తెరపడలేదు.   

ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నిన్న మొన్నటి వరకూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక ప్రచారంలో వెనుకబడిన మహాఘట్ బంధన్ ఇప్పుడు ఆ వ్యవహారం తేలడంతో ప్రచారాన్నిస్పీడప్ చేసింది. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మహాఘట్ బంధన్ కు చావో రేవోగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న అంచనాలతో ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాఘట్ బంధన్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు గెలుపు అంచనాలతో సీట్ల విషయంలో ఒకింత పట్టుదలకు పోయినా.. చివరాఖరకు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ వ్యవహారం వల్ల ప్రచారంలో కొంత విలువైన సమయాన్ని మహాఘట్ బంధన్ కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి కవర్ చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్.. ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తిగా ఉంది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా.. అదేదో సినిమాలో హీరో వేషం ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ తిరిగినట్లు.. తేజస్వీయాదవ్.. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే సర్కార్ ను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు.  ఇక ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కర్మాగారాలు ఏర్పాటు చేసి...  బీహార్‌లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.  నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించిన మోడీయే.. ఆయనపై చర్య తీసుకోకుండా ఆయన సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారనీ, కుంభకోణాల సర్కార్ ను మళ్లీ గెలిపించమని కోరుతున్నారనీ ఆరోపిస్తున్నారు. గత ఆర్జేడీ హయాంలో నితీష్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ అప్పుడు నితీష్ పై చేసిన విమర్శలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.  దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేజస్వి ఆరోపిస్తున్నారు. తాను  అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పననీ, చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా అని నొక్కి చెబుతున్నారు. ఇండియా కూటమి (మహాఘట్ బంధన్)ని గెలిపిస్తే.. తాను సీఎం అవుతాననీ, బీహార్ ను నేరరహిత రాష్ట్రం చేస్తాననీ చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందిస్తాననీ,   ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.  

కర్నూలు బస్సు ప్రమాదం.. లగేజీ క్యాబిన్లో వందల ఫోన్లు!

 కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా ఉండటానికి డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్లు తెరుచుకోకపోవడం ఒక కారణమైతే.. బస్సు లగేజీ క్యాబిన్ లో ఉన్న ఫోన్ల పార్శిల్ ప్రధాన కారణమని అంటున్నారు. బస్సు లగేజీ క్యాబిన్ లో  దాదాపు 46లక్షల రూపాయల విలువైన ఖరీదైన సెల్ ఫోన్ లను బస్సులో పార్సిల్ సర్వీసుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫొరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగగానే.. ఆ వేడికి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి.. మంటలు వేగంగా వ్యప్తి చెందాయి. ఆ కారణంగానే బస్సులోని ప్రయాణీకులు బయటకు రావడం కష్టమైందంటున్నారు.  కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి.  హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు   సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం  ఓ కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు.   మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలతో పాటు బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయనీ.. ఈ మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.   

పెట్టుబడులతో వస్తాం.. ఏపీపై యూఏఈ పారిశ్రామికవేత్తల ఆసక్తి

ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన,  పెట్టుబడులకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆవిష్కరించిన తీరు, పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం పాతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు.   అదే విధంగా యూఈఏ ప్రభుత్వ ప్రతినిధులు,  మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఏపీలో ఏయే ప్రాంతాలలో ఏయే రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో కూలంకషంగా వివరించారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఏఐ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వారి కళ్లకు కట్టారు.  విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయనే అంశానికి సంబంధించిన వివరాలను పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.  రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగం, ఎరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ వంటి పరిశ్రమలు, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు..ఆక్వా కల్చర్,   టూరిజం రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సీఏం అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లకు వివరించారు.   ఇక రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని, అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామనీ,  పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని భావిస్తే, అవసరమైతే పాలసీల్లో మార్పులు తేవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలిపారు. భారత్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి చొరవను సీఎం తన పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.   చంద్రబాబు ప్రజంటేషన్ కు ముగ్ధులైన యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ సంస్ధలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇక  చివరిగా   గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది  పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన ఊహించిన దానికన్న సక్సెస్ అయ్యింది. భారీ పెట్టుబడులు వస్తాయన్న ధీమాతో ఆయన తన పర్యటన ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు.  

వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ

ఓలా, ఉబెర్ వంటి   రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్' బ్రాండ్‌తో కొత్త టేక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి.    300 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని..  డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహించనున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్‌డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టేక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్నాయి.  ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు  డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.  తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.  

ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టిఏ దాడులు

కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన ఘటనతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను  క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.  డ్రంకన్‌ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్‌ పత్రాలు, బస్సు లోపల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్మిట్‌ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని   బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ, మెడికల్‌ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్‌ బస్సును సీజ్‌ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. అలాగే శుక్రవారం అర్థరాత్రి హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరా బాద్ శివారు ప్రాంతాలలో కూడా రవాణాశాఖ అధికారులు దాడులు కొనసా గుతున్నారు.  శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవే పైన కూడా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా కెరళా, తమిళ నాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, పాండి చ్చేరి, నాగాల్యాండ్, ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చే  వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ చేపట్టిన ఈ దాడులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఆర్టీఏ తీరు ఉందంటూ పెదవి విరుస్తున్నారు.   

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.శనివారం (అక్టోబర్ 25) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 24) శ్రీవారిని మొత్తం71 వేల110  మంది దర్శించుకున్నారు. వారిలో 25,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.  

అయ్యో అయ్యయ్యో.. ఏపీ మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే..!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుకు ముందు మరో మాజీ కూడా చేరనుందా? ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రే కాకుండా పులివెందుల మాజీ ఎమ్మెల్యేగా కూడా మారనున్నారా? అంటే అసెంబ్లీ డిప్యటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాటలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని  మరోమారు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే, రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిగ్గా శాసనసభ సభ్యత్వం రద్దైపోతుందని చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మరో పాతిక రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన గైర్హాజరైతే.. ఇక అంతే సంగతులు అని పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు కూడా. అదే సమయంలో గతంలో నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో అంటే జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ మొత్తం 67 రోజులు మాత్రమే సమావేశమైందన్న ఆయన.. చివరి రెండేళ్లలో అంటే చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన కాలంలో అసెంబ్లీ కేవలం 37 రోజులు మాత్రమే సమావేశమైందని చెప్పారు. అయితే జగన్ ఇప్పటికే  35 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారనీ, మరో పాతిక రోజులు ఆయన అసెంబ్లీ పనిదినాలలో సభకు హాజరు కాకపోతే ఆటోమేటిగ్గా మాజీ అవుతారని చెప్పారు. దీంతో  నెటిజనులు జగన్ కోరుతున్నట్లు ప్రతిపక్షహోదా సంగతి అటుంచి మొదటికే మోసం అంటే అసెంబ్లీ సభ్యత్వానికే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే జగన్ పరిస్థితి ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్నట్లుగా తయరయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రస్థానం మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే వరకూ సాగుతుందా? లేక మనసు మార్చుకుని ప్రతిపక్హ హోదా కోసం మంకుపట్టు వీడి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా?  

బీసీ రిజర్వేషన్లు.. కోల్డ్ స్టోరేజీలోకేనా?

తెలంగాణలో ఇటీవలి కాలంలో రాజకీయంగా ఎంత చర్చనీయాంశమైందో.. అంతకు మించి వివాదాస్పదమైన బీసీ రిజర్వేషన్ల అంశం ఇక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయినట్లేనా?  తెలంగాణ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తేసిందా?  ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్లిన రేవంత్ సర్కార్ చివరికి ఇది జరిగేది లే.. అని ఉసూరు మందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైన తరువాత కూడా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకే సాగుతామని సంకేతాలిచ్చింది. ఈ విషయంపై గురువారం (అక్టోబర్ 23)న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. అయితే గురువారం (అక్టోబర్ 23) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీసం చర్చ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని కోల్ట్ స్టోరేజీలో పెట్టేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంటే కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశ కూడా వదిలేసుకుని.. రిజర్వేషన్ల ఊసెత్తకుండానే ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అవగతమౌతోంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం చర్చించకుండా.. స్థానిక ఎన్నికలలో పోటీకి ఇంత కాలం ఉన్న ఇద్దరు పిల్లలు అన్న నిబంధనను రద్దుపై చర్చింది, ఆమోదం తెలిపింది.   ఇందు కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో స్థానికి ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తుతానికి అటకెక్కించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబుకు మేలు.. జగన్ తీరు!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతే కాకుండా గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కువిమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికీ, తప్పదోవపట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి మేలు చేయవు సరికదా, ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తాయి. ప్రత్యర్థి పార్టీగా వైసీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల రాజకీయంగా ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ వ్యవహరిస్తున్న తీరు.. అధికార కూటమికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎనలేని మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.    తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ విమర్శల వల్ల ఆయనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరనీ, ఎవరో చేసిన మంచి పనుల క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసేసుకుని, అంతా తానే చేశాన్న బిల్డప్ ఇచ్చుకుంటారనీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు నెటిజనులు క్షణం ఆలస్యం చేయకుండా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.  కియా, విశాఖకు ఏఐ వంటి అంశాలలో తొలుత విమర్శలకు దిగిన జగన్ తీరా వాటికి ప్రజల నుంచి వచ్చిన అమోఘమైన సానుకూలతను గమనించి అవి తమ ఘనత వల్లే వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజనులు ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. అనంతపురానికి కియా రాక తన తండ్రి వైఎస్ దేననీ, అదానీతో తాను గతంలో జరిపిన చర్చల వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ వచ్చాయనీ జగన్ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు ఎన్నడూ వేరొకరి క్రిడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అప్పుడూ, ఇప్పుడూ కూడా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరునే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.  ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని చంద్రబాబు కొనసాగించారనీ, అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదనీ గుర్తు చేస్తున్నారు నెటిజనులు. ఇక హైదరబాద్ కు అదనంగా సైబరాబాద్ ఆవిర్భావం చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాలలో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పారు. నెటిజనులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ అసత్యాలను ప్రచారం చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ మైలేజ్ రావడం సంగతి అటుంచి ఉన్న ప్రతిష్ఠ కూడా మసకబారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

చంద్రబాబు.. మనిషక్కడ.. మనసిక్కడ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. క్షణం తీరిక లేకుండా అక్కడ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులతో చర్చలు జరుపుతున్నారు. రోజుకు తొమ్మదికి పైగా సమావేశాలు, సదస్సులతో ఊపిరి తీసుకునే తీరిక కూడా లేనంతగా ఉన్నారు. అయినా ఆయన చిత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై గురువారం (అక్టోబర్ 23)న అక్కడి నుంచే ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.   అంతేనా రాష్ట్రంలో మంత్రులు, అధికారులతో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 24) ఉదయం కర్నూలు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, డీఐజీ, కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.  అధికారులు, మంత్రులు దగ్గరుండి ఈ పనులన్నిటినీ పర్యవేక్షించాలన్నారు. అలాగే ప్రమాదఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

దేశంలో ఏపీయే నంబర్ వన్.. పెట్టుబడులతో తరలిరండి.. లోకేష్

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉంది.. కానీ అతి త్వరలోనే నంబర్ వన్ స్థానినికి చేరుకుంటుంది. ఈ మాట తన ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో అన్న మాట. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అఅండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్  రౌండ్ టేబుల్ సమావేశంలో  లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులకు 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు లీప్  పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని  వివరించారు. ప్రధానంగా తాము 15 రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పిన ఏపీ ఐటీ మంత్రి..  వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్ వన్ అవుతామని గట్టిగా చెప్పారు.  ఏపీతో చేతులు కలిపి మీ ప్రాజెక్టులను సక్సెస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే విశాఖలో జరగనున్న  గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.  కాగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ను  ఒక స్టార్టప్ స్టేట్ గా అభివర్ణించారు. చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన  ఏపీ కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడంతో సరిపెట్టదనీ, ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించుకుని మాతో చేతులు కలిపితే.. అది ఇక ఎంత మాత్రం కేవలం మీ ప్రాజెక్టుగా ఉండదనీ, అది మన ప్రాజెక్టు అవుతుందని అన్నారు. 

కర్నూలు ప్రమాద ఘటన మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్ గ్రేషియా

కర్నూలు వద్ద జరిగిన  బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున అందిచనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ  సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఏమందంటే?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసల వర్షం కూడా కురిపించింది. అంతటితో ఆగకుండా   రెండో విడతగా అమరావతి నిర్మాణానికి 17వందల కోట్ల రూపాయల విడుదలకు పచ్చ జెండా ఊపింది.  ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ మూడు లేదా నాలుగోవారానికల్లా ఈ నిధులు ఏపీకి అందుతాయి.  ఈ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు.  అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది మార్చిలో  తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది కూడా. ఆనిధుల్లో   50 శాతం మేర నిధులను ప్రభుత్వం వివిధ పనులకు వ్యయం చేయడం కూడా జరిగిపోయింది. వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు  తొలి విడత విడుదల చేసిన నిధుల్లో 75శాతం ఖర్చు చేసిన తరువాత మాత్రమే రెండో విడత నిధులు విడుదల అవుతాయి. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులలో ఇప్పటి వరకూ 50 శాతం వ్యయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొలి వారం నాటికి మరో పాతిక శాతం నిధులను కూడా రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేయనున్నట్లు చెప్పింది. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కూడా ఈ పనుల వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో రెండో విడత నిధులకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించవచ్చు.  అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్యారంటీతో వరల్డ్ బ్యాంకు నిధులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇస్తున్న నిధులు ఎలా వినియోగం అవుతున్నాయన్న విషయంపై ఆ బ్యాంకు ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే.   ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా  రూపొందుతోంది. అంటే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. మొత్తం ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ఏడీబీ), కేంద్రం గ్రాంట్లతోనే నిర్మితమౌతోంది. ఇక ప్రపంచబ్యాంక్, ఏడీబీ రుణాల రూపంలో అందజేస్తున్న నిధులకు సంబంధించిన రీపేమెంట్ బాధ్యత అంతా కేంద్రానిదే.   దీంతో ఎవరెన్ని కుట్రలు పన్నిలా, అడ్డంకులు సృష్టించినా ఇక అమరావతి నిర్మాణ వేగం మందగించే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు. 

భారత రక్షణ రంగం మరింత శక్తిమంతం!

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  త్రివిధ దళాల ఆధునికీకరణ కోసం 79 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   రక్షణ  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం (అక్టోబర్ 23) జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. రెండు నెలల కిందటే రక్షణ రంగాన్ని శక్తిమంతం చేసేందుకు  67 వేల కోట్ల రూపాయల విలువైన విలువైన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. తాజాగా అదే లక్ష్యంతో మరో భారీ కొనుగోలుకు పచ్చజెండా ఊపింది.   డీఏసీ సమావేశంలో ఆమోదించిన కొనుగోళ్లలో  భారత నౌకాదళం కోసం అత్యాధునిక ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పీడీ), నావల్ సర్ఫేస్ గన్స్, అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ సిస్టమ్స్ వంటివి  ఉన్నాయి. ఎల్‌పీడీల ద్వారా ఆర్మీ, వైమానిక దళాలతో కలిసి నౌకాదళం ఉభయచర కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్ టార్పెడోలు సంప్రదాయ, అణు జలాంతర్గాములను సైతం లక్ష్యంగా చేసుకోగలవు. అలాగే  సైన్యం కోసం 2వేల 408 ట్యాంక్ విధ్వంసక 'నాగ్ మార్క్-2' గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు ఆమోద డీఏసీ ఆమోదం తెలిపింది.  శత్రువుల యుద్ధ వాహనాలు, బంకర్లను సులభంగా ధ్వంసం చేయడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో పాటు భూతలం నుంచి శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు మొబైల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా, వైమానిక దళం కోసం లాంగ్ రేంజ్ టార్గెటింగ్ సిస్టమ్‌ల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.  ఇక పదాతిదళ 380 పదాతిదళ బెటాలియన్లను 'ఆష్ని' డ్రోన్ ప్లాటూన్లతో అనుసంధానం చేసేందుకు ఆమెదం తెలిపింది.   సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచే ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు డీఏసీపేర్కొంది. ప్రతి బెటాలియన్‌కు కేటాయించే ప్లాటూన్‌లో కనీసం నాలుగు నిఘా డ్రోన్లు ఉంటాయని తెలిపింది. దీనితో పాటు 2 వేల770 కోట్ల రూపాయలతో 4.25 లక్షల తుపాకుల కొనుగోలుకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. 

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కుటుంబం బలి

కర్నూలు సమీపంలోని చిన్న టేకూరు వద్ద శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనమయ్యారు.  నెల్లూరు జిల్లా వింజమూరు మండలం  గొల్లవారి పల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం మొత్తం ఈ బస్సు ప్రమాదంలో మరణించింది. గోళ్లరమేష్ (35), ఆయన భార్య అనూష (30), పిల్లలు మన్విత (10), మనీష్ (12) ఈ ప్రమాదంలో అశువులుబాసారు.    బెంగళూరులో స్థిరపడిన గోళ్ల రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదంలో చిక్కుకుని మరణించింది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.