పురంధీశ్వరీకి షాకిచ్చిన ఓటర్....అన్యాయం చేసే పార్టీలతోనే ఎందుకుంటున్నారమ్మా?

  త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారడంతో.. పార్టీలన్నీ కలిసి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని తెగ కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే ప్రచార కార్యక్రమాల్లో బిజీ.. బిజీగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో మన ఏపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అలా ప్రచార కార్యక్రమానికి వెళ్లిన బీజేపీ నేత పురంధీశ్వరీకి ఓ షాక్ తగిలింది. ఇంతకీ ఆ షాక్ ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..  రాయచూరు జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పురంధీశ్వరీని ఓ ఓటర్ ఓ ప్రశ్న అడిగాడు...  ‘అమ్మా… గత ఎన్నికలలో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నారు… ఇప్పుడు వచ్చి బిజెపికి ఓటేయమంటున్నారు. ఏపీకి అన్యాయం చేసే పార్టీలతోనే ఎప్పుడు ఎందుకుంటున్నారమ్మా?’ అంటూ అవాక్కయ్యే ప్రశ్న వేసాడు. ఇక ఆ ఓటర్ అడిగిన ప్రశ్నకు షాకైన పురంధీశ్వరీ తేరుకొని సమాధానం చెప్పుకున్న ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ ఆ ఓటరు...‘మాది గుడివాడ, మీ నాన్న గారు పార్టీ స్థాపించినపుడు జెండా మోసా, ఆ అభిమానంతోనే అడుగుతున్నా, వేరొకర్ని అయితే అడిగేవాడ్ని కాదు’ అంటూ మరో చురక అంటించారు. దీంతో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక..  ‘న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయాలని, తనది రాజకీయం కాదని’ ఓ ముక్క చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా సమాచారం. మొత్తానికి బీజేపీ నేతలకు ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మరి ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంత వరకూ విజయం సాధిస్తుందో చూద్దాం...

వారికి భూమిపై అదే చివరి రోజు..

గుంటూరుజిల్లా దాచేపల్లిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తొమ్మిదేళ్ల చిన్నారిపై..సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో దాచేపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడిని పట్టుకోవాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఒకపక్క ఆందోళనలు చేస్తుంటే.. మరోపక్క నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని.. నడిరోడ్డుపై కాల్చాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.   ఇక ఇప్పుడు ఈ ఘటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాగరిక సమాజంలో బతికేటప్పుడు మనుషులకు భయం కూడా ఉండాలని హెచ్చరించారు. ఈరోజు గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పులు చేసేవారికి ఈ భూమ్మిద అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. అలాంటి నీచులకు రాష్ట్రంలో నివసించే హక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ‘మనిషి మనిషిగా బతకాలి... మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని సూచించారు. అంతేకాదు... అమ్మాయిలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నీచమైన నేరాలను అందరూ ఖండించాలని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రతి మండల కేంద్రంలో ఆ మండలంలోని పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు.

టీడీపీ తమ్ముళ్లు ముందు వీటికి సమాధానం చెప్పండి....

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడుతే దేవ్ ని నియమిస్తున్నట్టు ప్రకటించారో అప్పటినుండి దేవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దేవ్ అస‌లు పేరు ఏమనగా.. వాసుదేవ్‌ అని...పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ అని.. తెలుగులో మాట్లాడ‌టం భేషుగ్గా వ‌చ్చని వార్తలు వచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... గ‌తంలో ఈయ‌న భారతీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారని.. అంతే కాదు.. ఈయ‌న తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌కి బంధువు అని పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దీంతో మరోసారి పవన్ వెనుక బీజేపీ ఉందని వార్తలు వచ్చాయి. ఇత టీడీపీ బీజేపీనే దేవ్ ను పంపిందని అన్నారు. ఇక తనపై వస్తున్న వార్తలపై స్పందించిన దేవ్.. టీడీపీకి ఓ బహిరంగ లేఖ రాసినట్టు తెలుస్తోంది..   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మొదట కాంగ్రెస్ పార్టీ ఉండేవారు... ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే టీడీపీ వెనకాల కాంగ్రెస్ ఉన్నట్టా..? రాష్ట్ర విభజనని తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్ పార్టీ చేత చేయించిందా..? ఎన్టీఆర్ గారి కూతురు పురుంధరేశ్వరి బీజేపీలో ఉన్నాయి.. అంటే బీజేపీ-టీడీపీ ఇంకా కలిసిఉన్నట్టేనా.. రెండూ కలిసి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయా..? ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు.. అంటే వైసీపీ-టీడీపీకి పోలవరంలో జరుగుతున్న అవినీతిలో భాగస్వామం ఉందా...? అని ముందు వీటికి క్లారిటీ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరి దేవ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.

టీడీపీలోకి రఘురామ కృష్ణరాజు.. జగన్ కు మొగుడు... కేవీపీకి వియ్యంకుడు..

  ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ ఫిరాయింపులు కూడా జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు వైసీపీలోకి.. వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరోనేత టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణరాజు. స్వయానా కేవీపీ రామచంద్రారావు వియ్యంకుడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణరాజు కొన్నాళ్లుగా వైసీపీలో ఉన్నారు. ఇక వైసీపీలో ఉంటే జగన్ జగన్ చెప్పుచేతల్లోనే ఉండాలి. జగన్ మాటను కాదని ఏం చేయడానికి కుదరదు. నిజానికి జగన్ తీరు నచ్చకే చాలా మంది నేతలు వేరే పార్టీలోకి వెళుతుంటారు. కొంతమంది మాత్రం ఏం చేయలేక సెలైంట్ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ రఘురామ రాజు మాత్రం అలా చేయలేదు. జగన్ వైఖరి భరించలేక పార్టీ నుండి బయటకు వచ్చేశాడు. అంతేకాదు.. తాను భయటకు వచ్చేప్పుడు మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జగన్ జనాల్లో ఉన్నప్పుడు రామాచారిలా, సెయింట్ లా కనిపిస్తాడు.. పార్టీ నేతల ముందు మాత్రం జుట్టు విదిల్చిన అపరిచితుడిలా ఉంటాడని... నా పరిస్థితి ఎలా అయిందంటే పౌరాణిక సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లి షకీలా సినిమా చూసినట్టుయిందని.. ఇంకా చాలా కామెంట్లే చేశారు. దీంతో రగిలిపోయిన జగన్ వైసీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇక అప్పటినుండి జగన్ రఘురామ కృష్ణరాజు పేరు చెబితెనే మండిపోతుంటారు. ఇక ఆతరువాత రఘురామ కృష్ణరాజు బీజేపీ పార్టీలో చేరారు. అక్కడ తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ నుండి బయటకు వచ్చేశారు.   ఇక ఇప్పుడు ఈయన టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈయన గత ఎన్నికల్లోనే టీడీపీలో చేరి నర్సాపురం నుండి పోటీ చేయడానికి రంగం సిద్దం అయ్యారు. కానీ అప్పుడు బీజేపీ-టీడీపీ తో పొత్తు పెట్టుకోవడంతో.. ఆసీటు గోకరాజు రంగరాజుకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇక ఇప్పుడు రెండు పార్టీలకు చెడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. దీంతో రఘురామ రాజుకు ఈసారి ఆ అవకాశం దక్కింది. మరి వైసీపీ లో ఉండి బయటకు వచ్చినప్పుడే జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా టీడీపీలోకి చేరుతున్నారు. అలాంటిది... ఇప్పుడు జగన్ పై ఏ రేంజ్లో కామెంట్లు విసురుతారో చూడాలి. ఇదిలా ఉండగా రఘురామ రాజు టీడీపీలోకి చేరుతున్నారన్న వార్తలు రావడంతో.. జగన్ కు సరైన మొగుడు ఈయనే అని అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి. మరి చూద్దాం జగన్ కు రఘురామ రాజు ముందు ముందు ఎలాంటి కౌంటర్లు వేస్తాడో..

మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా....!

  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి మోడీపై విమర్శలు ఆయన గుప్పించారు.  ఈరోజు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...‘ప్రధాని మోదీ గారూ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!’ అని...రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాకేం భయంలేదు... ఈ భాజపావాళ్లు నన్నేమీ చేయలేరు. నేను ఏ పార్టీ వ్యక్తిని కాను’..భాజపా నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మంచివా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్‌ తీవ్రంగా విమర్శించారు. ‘రాహుల్‌ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా’ అని అన్నారు. ‘ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే భాజపా పతనం ఆరంభమవుతుంది’ అని జోస్యం చెప్పారు.

జగనే సీఎం..రాజు గారు ఏమన్నా చెప్పారా... !

  బీజేపీ-టీడీపీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డివేస్తేనే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రపక్షంగా ఉన్నప్పుడే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం జరుగుతూ ఉండేది. ఇక ప్రత్యేక హోదా నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి వార్ ప్రకటించేశారు. మోడీని టార్గెట్ చేస్తూ... ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈ మాటల యుద్దం ఇంకా తారాస్థాయికి చేరింది అని చెప్పొచ్చు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్లయితే రెచ్చిపోయి మరీ మాట్లాడేస్తుంటారు. ఇక ఈ రెండు పార్టీలు విడిపోయిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ-బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని.. అందుకే జగన్ చంద్రబాబును విమర్సిస్తున్నారే తప్పా.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తూనే ఉన్నారు. అంతేకాదు కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరైనా బీజేపీతో పొత్తు కోసం జగన్ చూస్తున్నాడన్న విషయం ఇట్టే అర్దమైపోతుంది.   ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తున్నట్టు ఉన్నాయి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు..  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న ఈయన మీడియాతో మాట్లాడుతూ... ఎప్పటిలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని, రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని ఆయన అన్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు... హైదరాబాదులో ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి, విజయవాడలో మకాం పెట్టారని విష్ణు అన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని కర్ణాటకలోని తెలుగువారికి ఆయన పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పిలుపు ఇవ్వాలనుకుంటే ఆయన చుట్టాలకు ఇచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిలుపుతో కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పారు. టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని... త్వరలోనే అవినీతిని బయటపెడతామని చెప్పారు. అంతేనా అక్కడితో ఆగకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయ సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మరి సీఎం కావాలని ఎంతో ఆశగా ఉన్న జగన్ కనుక రాజు గారి మాటలు వింటే ఫుల్ కుషీ అవుతారేమో.. మరి ఏకంగా వైసీపీ నే గెలుస్తుందని... చెప్పి.. వైసీపీ-టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

అక్రమ నిర్మాణాలు కూల్చమన్నందుకు మహిళా అధికారి కాల్చివేత...

  అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నందుకు ఓ మహిళా అధికారిణిని కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సోలాన్ జిల్లాలోని కసౌలీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా సుప్రీంకోర్టు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ అధికారులు కసౌలీ పట్టణానికి చేరుకుని.. పోలీసుల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికారులు మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆ గెస్ట్ హౌజ్ కు నాలుగు అంతస్తుల మేరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ గెస్ట్ హౌజ్ యజమాని విజయ్ సింగ్ మాత్రం ఆరు అంతస్తులు కట్టాడు. దీంతో  భవనాన్ని కూల్చివేయాల్సిందిగా అసిస్టెంట్ టౌన్ ప్లానర్ షేల్ బాలా ఆదేశించారు. దీంతో విజయ్ సింగ్ కు షేల్ బాలా కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో ఆగ్రహానికి గురైన విజయ్ సింగ్ తుపాకీతో పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షేలా బాలా అక్కడికక్కడే మృతి చెందగా, మరో అధికారి గులాబ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం విజయ్ సింగ్ సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. పోలీసులు అతని కొరకు దర్వాప్తు ముమ్మరం చేశారు. విజయ్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు అందిస్తామని పోలీసులు తెలిపారు.   కాగా, మహిళ అధికారిణి హత్య ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు కోర్టు ప్రకటించింది. కేసుపై గురువారం వాదనలు విననున్నట్లు ప్రకటించింది.

ఎట్టిపరిస్థితిల్లో బీజేపీ అధికారంలోకి రాదు...

  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గత కొద్దికాలంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన బీజేపీ పై దుమ్మెత్తిపోశారు. ఈనెల 12 వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో...ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎవరికి వారు బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక జోరుగా సాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారంపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు.   "కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడమనేది కల్ల. విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందిరికీ చోటుంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతానికో, కులానికో మన దేశం పరిమితం కాదు. దక్షిణ భారత దేశంలో భాజపా ఇక అధికారంలోకి రాదు. వారి సిద్ధాంతాలు ఇక్కడ పనికి రావు. మనదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నింటికీ సొంత నిర్ణయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఒక్క భాజపా మాత్రం వేరొకరి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది" అని అన్నారు.   అంతేకాదు ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పలువురి చేత తిట్టించుకుంటున్న నేపథ్యంలో దానిపై కూడా స్పందించిన ప్రకాశ్ రాజ్‘మోదీ వారి పార్టీ నాయకులకు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మోదీజీ... వారిని మాట్లాడనివ్వండి. భాజపా నేతలు ఎలాంటి వారో తెలుసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఇదే. వారి మనసులో ఏముందో తెలుస్తుంది. మోదీ భాజపా పార్టీ నేతల నోర్లు మూయించినా వారి వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతూనే ఉంది... భాజపా వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపించమనండి... ఈ ఛాలెంజ్‌కు నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయ నేతలు చెప్పే మాటలను బట్టి వారిని నమ్మద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే వారి మాట వినండి.’ అని అన్నారు. అని అన్నారు. ఇంకా ‘భాజపాకు కర్ణాటక అంతగా కలిసిరాలేదు... ఇంతకుముందు అక్కడ అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు... దీంతోపాటు మరికొందరు కీలక నేతలదీ ఇదే పరిస్థితి...కర్ణాటక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాదని ’ అని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి వాళ్లా మోడీకి వారసులు...?

  ప్రధాని మోడీ ఎంత హితబోధ చేస్తున్నా బీజేపీ నేతలు మాత్రం తమ నోటిని మాత్రం హద్దుల్లో పెట్టుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు  పెద్ద దుమారమే రేపుతున్నాయి.తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఇక హిందూ భావ‌జాల నేప‌థ్య‌మున్న బీజేపీ నేత‌లు ప్ర‌స్తుత విష‌యాల‌న్నింటినీ పురాణాల‌తో ముడిపెట్టి మాట్లాడుతుండటంతో... బీజేపీపై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ, ఇలాంటి వాళ్లా మోదీకి వారసులు? అంటూ ప్రశ్నించారు. వీళ్లా ప్రజలను పాలించేది? అంటూ మండిపడ్డారు. సమాజానికి వీళ్లు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు..ఒకరేమో గూగుల్ ను నారదుడితో పోలుస్తూ మాట్లాడతారని, మరొకరేమో మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని అంటారని, యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకాలని సూచిస్తారని ఎద్దేవా చేశారు. వీళ్లకు ఉన్న జ్ఞానం ఇంతేనేమో అని అన్నారు. వీరి వివాదాస్పద వ్యాఖ్యలు ఇంతటితో ఆగబోవని చెప్పారు. మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు ఏం మాట్లాతున్నామో.. అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కాస్త నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే మోడీపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంటది....

మోడీ చెప్పినా వేస్ట్... అంబేద్కర్‌,మోడీ బ్రాహ్మణులంటా...

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అన్ని పార్టీల నేతలతో పోల్చుకుంటు బీజేపీ నేతలు కాస్త ముందుంటారన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ఒకప్పుడంటే ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా.. ఏం చేసినా అంత ఫోకస్ పెట్టలేదు ఎవరూ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కాస్త తేడాగా ఏం మాట్లాడినా ఒకటే కామెంట్లు చేస్తున్నారు. అలా ఈ మధ్య చాలామంది నేతలే బుక్కయ్యారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేముందు ఆచితూచి మాట్లాడాలని ఆదేశించారు.   కానీ మోదీ హితబోధ చేసినప్పటికీ బీజేపీ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్  డయానా హెడెన్ తెల్లగా లేకపోయినా ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం ఎలా ఇచ్చారని, ఉద్యోగాన్వేషణ కోసం సమయం వృథా చేసుకోకుండా ఆవులు, పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని, పాన్ షాపులు పెట్టుకోవాలంటూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపారు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగ మేళాలో పాల్గొన్న త్రివేది మాట్లాడుతూ... ‘బ్రాహ్మణులు దేవుళ్లను తయారు చేస్తారు. క్షత్రియుడైన రాముడిని, ఓబీసీ అయిన కృష్ణుడిని దేవుడిని చేసింది బ్రాహ్మణులే’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అంబేద్కర్‌ కూడా బ్రాహ్మణుడేనని, ఆయన ఇంటి పేరు చూస్తే అర్థమవుతుందని.. ఆయనకు ఆ పేరు పెట్టింది కూడా బ్రాహ్మణుడైన ఒక ఉపాధ్యాయుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కూడా బ్రాహ్మణుడని చెప్పడానికి నేను గర్వపడతానంటూ వ్యాఖ్యానించారు. ఇక రాజేంద్ర త్రివేది వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌.. స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, ప్రధాని మోదీలను బ్రాహ్మణులంటూ అభివర్ణించిన త్రివేది వల్ల పార్టీకి నష్టం కలుగుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక జరగాల్సింది జరిగిన తరువాత ఇప్పుడు కవర్ చేసుకునే పనిలో పడ్డారు త్రివేది.  ‘కులం అనేది మనిషి పుట్టుక మీద కాకుండా అతడు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. భవద్గీత ప్రకారం విఙ్ఞానం ఉన్న వ్యక్తులు బ్రాహ్మణులు’ అంటూ కవరింగ్ చేసుకొచ్చారు.

ఎన్టీఆర్ గడ్డపైనే టీడీపీకి ఎదురుదెబ్బ... జగన్ కు ఫిర్యాదులు...

  ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులోనే టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గర. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిద్దామా అని జగన్ చూస్తూ ఉంటాడు. అంతేకాదు... పాదయాత్ర మొత్తం మీద ఆయన చంద్రబాబును బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటిది.. ఆయన దగ్గరే టీడీపీ నేతల ఘనకార్యాలు చెబితే ఎలా ఉంటుంది. జగన్ దగ్గర అడ్డంగా బుక్కయ్యారు.   ప్రస్తుతం జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జగన్ కృష్ణా జిల్లాకు ఓ హామీ ఇచ్చారు. తాను కనుక అధికారంలోకి వస్తే.. కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరును పెడతానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లాకు తాను ఎన్టీఆర్ పేరు పెడతానని ఆయన ప్రకటించిన వేళ, ప్రజలు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇక జగన్ ప్రకటనపై స్పందించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆయన చేసిన ప్రకటనను స్వాగతించారు. తన అల్లుడు చంద్రబాబునాయుడు, కొడుకు బాలకృష్ణ చేయలేని జగన్ చేస్తున్నాడని... చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అంతేకాదు.. ప్రత్యేక హోదాపై జగన్ అలుపెరగని పోరాటం చేస్తుంటే, తెలుగుదేశం నేతలు చిత్తశుద్ధి లేని డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు.   ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.... ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. నీరు-చెట్టు పథకం టీడీపీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని  స్వయంగా ఎన్టీఆర్‌ బంధువులే వైఎస్‌ జగన్‌కు చూపించారట. ఈ పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని.. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్‌కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అ‍క్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాదు... ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్‌ జగన్‌ చూపించారట. అంతేకాకుండా మళ్లీ లేబర్‌ను పెట్టి తవ్వించామని చెప్పి ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటున్నారని సర్కారు అవినీతి ఎండగట్టారు. మరి సొంత బంధువులే ఇలా చెబితే.. జగన్ ఇంక ఊరుకుంటాడా...? రెచ్చిపోడూ...

జేసీ చెప్పాడు... చంద్రబాబు పాటించాడు....

  దేవుడు శాసించాడు...నేను పాటించాను అని ఓ సినిమాలో డైలాగ్ లాగా... ఇక్కడ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన సలహాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటించాడు. ఇంతకీ జేసీ ఇచ్చిన సలహా ఏంటీ... చంద్రబాబు పాటించింది ఏంటీ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయాన్నైనా సరే మొహం మీదే చెప్పేస్తుంటారు. ప్రతిపక్ష పార్టీయే కాదు... సొంత పార్టీపైన కూడా విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు.   అలా అమరావతికి చంద్రబాబును కలిసిన జేసీ తన మనసులో మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారట. చంద్రబాబుతో భేటీ అయిన జేసీ..ఒక అరగంట సేపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థుతులు, చంద్రబాబు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. మీరు ఏమైనా అనుకోండి, ఈ పనులు గురించి మీరు ఆలోచించాలి, నా సలహా పాటించాలి అంటూ, మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారికి సంతృప్తి లేదని....ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని...ఇది మీరు వెంటనే కరెక్ట్ చేసుకోపోతే, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, దీని పై అలోచించి, అందరితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోండి అంటూ సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారు.   దీంతో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి... బయోమెట్రిక్‌ హాజరుకు, జీతాలకూ మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారట. సమయం అటూ ఇటూ అయినా పర్వాలేదు.. కానీ... ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చేయాలన్నది నా ఉద్దేశం...తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్‌కు జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించారు...దీని ఆధారంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని... అధికారులందరినీ ఆదేశించారట. మరి జేసీ చెప్పడం.. చంద్రబాబు పాటించడం ఏమో కానీ.. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం హ్యాపీ...

మే 15న బాబుకు షాక్ తగలనుందా...!

  మే 15 న ఏపీ ముఖ్యమంత్రికి షాక్ తగలనుందా... ? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ భయంకరమైన నిజం చెప్పింది ఎవరో కాదు బీజేపీ  ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మిత్రపక్షంగా ఉన్నప్పుడే టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునేవారు. ఇప్పుడు ఏకంగా విడిపోవడంతో.. మాటలతో యుద్దాలే చేసుకుంటున్నారు. ఒకపక్క చంద్రబాబు మోడీపై, బీజేపీ చురకలు అంటిస్తుంటే.. మరోపక్క బీజేపీ నేతలు కూడా చంద్రబాబు పై విమర్సలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా మాట్లాడిన ఆయన.. పట్టిసీమపై అవకతవకలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలంటే విచారణను జరిపించి రుజువుచేయమని టీడీపీ నేతలు అడుగుతున్నారని, పట్టిసీమ ప్రాజెక్టులో వారు చేసిన గోల్ మాల్  లపై ఒక నివేదికను తయారుచేసి, దానిని సీబీఐకి అప్పగించి టీడీపీ నేతల భరతం పడతానని హెచ్చరించాడు. విచారణను జరిపించమని జూపూడి గారు సరదా పడుతున్నప్పుడు ఆయన సరదాను తీరుస్తానని ఎద్దేవా చేసాడు. అంతేకాదు... టీడీపీ తో తాము పొత్తు పెట్టుకోకున్నట్లయితే మరిన్ని సీట్లు గెలిచే వారిమని తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేదని జోస్యం చెప్పాడు. మే15 లోపు చంద్రబాబుకు షాక్ తగలనుందని.. టీడీపీ లోని చాలామంది నేతలు వైసీపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బాంబు పేల్చాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మే 15 వరకూ ఆగాల్సిందే...

సహసం కోల్పోయిన సహనశీలి...నచ్చకపోతే బయటకు వెళ్లిపోండి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత సహనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన సహనాన్ని కాస్త పక్కన పెట్టేశారు. ఇప్పటికే తన సహనాన్ని పక్కన పెట్టి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు. గత నాలుగేళ్లు ఎంతో ఓపికగా ఎదురుచూశారు... కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో మోడీకే ఎదురుతిరిగారు. దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు. అయితే ఒకపక్క చంద్రబాబు అలా చేస్తుంటే మరోపక్క సొంత పార్టీ నేతలే ఆయనకు  తలనొప్పిగా తయారయ్యారు. కానీ ఇది వరకు లాగా చంద్రబాబు వారికి నచ్చజెప్పే పరిస్థితిలో లేరు. వారికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి... క్లాస్ పీకి పంపిస్తున్నారు. నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయిస్తున్నారు.   బస్సు మీద చంద్రబాబు బొమ్మ చిరిగినందుకు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బస్సునే ఆపేసి.. ప్రయాణికులను దించేసి నానా యాగి చేశారు. ఇందుకుగాను... చంద్రబాబు ప్రభాకర్‌ను పిలిపించి క్లాస్ తీసుకున్నారట. బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారట.   ఇక అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొద్దికాలంగా వీరి మధ్య మాటల యుద్దం జరుగుతున్నా.. ఇటీవల ఏపీ సబ్బురాడ్డిపై జరిగిన రాళ్ల దాడి వల్ల ఈ పంచాయితీ కూడా చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. ఇద్దరినీ చంద్రబాబు పిలిపించి.. హెచ్చరించారు..ఎన్ని సార్లు మీకు రాజీ కుదిర్చాను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ సుబ్బారెడ్డిని మందలించారట. ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారట. అంతేకాదు... ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారట. మరి చంద్రబాబుకు సహనం ఎంత కోల్పేతే ఇలా వార్నింగ్ లు ఇస్తారు పాపం. అసలే ప్రత్యేహోదా విషయంలో కేంద్రంతో యుద్దానికి దిగి ఆ తలనొప్పులే భరించలేకపోతుంటే మధ్యలో పార్టీ నేతల తలనొప్పులు ఒకటి. అందుకే ఉన్న ఓపిక పోయినట్టుంది... అందరికీ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు.

ఇవేం పార్టీ ఫిరాయింపులు... వీరేం నేతలు

  ఏపీ ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఒక పార్టీలో ఉన్న నేత మరో పార్టీలోకి వరుసపెట్టి జంప్ జిలానీలు అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీలోకి జంపు అయ్యారు. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కూడా వైసీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నుండి కన్నీ లక్ష్మీ నారాయణ. పార్టీ అధ్యక్ష పదవి వస్తుందనుకున్న కన్నాకు పార్టీ అధిష్టానం షాకిచ్చి.. ఆపదవిలో సోము వీర్రాజును నియమించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. అయతే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ...బీజేపీ ఆ నిర్ణయం మార్చుకున్నారు. దీంతో పార్టీమీద అసంతృప్తితో ఉన్న కన్నా వైసీపీలోకి మారాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అమిత్ షా. జగన్ కు ఫోన్ మా వాళ్లని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. అంతేకాదు కన్నాకు కూడా ఫోన్ చేసి...పార్టీ మారొద్దని చెప్పారు. దీంతో ఆయన మనసు మార్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీలోకి వెళుతున్నట్టు రాజకీయ వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి.   ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నానని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నానని చెప్పారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... కానీ, తనను పార్టీ చిన్న చూపు చూసిందని అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి, మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి, దగా చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాను టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించానని... తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు.   మొత్తానికి త్వరలో ఏపీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కూడా బాగానే పుంజుకున్నాయి. తమకు అనుకూలంగా లేకపోతే చాలు తమ భవిష్యత్తు కోసం కొంచం కూడా ఆలోచించకుండ తమ దారి తాము చూసుకుంటున్నారు. మరి వేరే పార్టీలో కూడా పరిస్థితి ఇలా ఉంటే.. మళ్లీ జంప్ అయిన పార్టీలోకే వచ్చేస్తారు. మరి వాళ్లకి ఇవన్నీ కామనే కదా.. ఒకప్పుడు ఏ పార్టీలో ఎవరున్నారో చెప్పడం ఈజీగా ఉండేది... కానీ ఇప్పుడు ఏ  పార్టీలో ఎవరున్నారో... చెప్పడం కష్టమే..ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే నేతలందరూ ఆపార్టీలోకే వచ్చేస్తున్నారు..

టీడీపీలోకి కన్నా... ఇప్పుడెవరికి ఫోన్ చేస్తారు షా జీ..

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరిగి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా తయారయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నిన్న మొన్నటి వరకూ బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ చేరుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారని.. కన్నా వైసీపీలోకి తీసుకోవద్దని చెప్పారన్న టాక్స్ వినిపించాయి. అంతేకాదు... కన్నా కు కూడా షా ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్లొద్దని.. పార్టీలోనే ఉండాలని చెప్పినట్టు తెలిసింది. అందుకే కన్నా కూడా వెనక్కి తగ్గారని... తన మనసును మార్చుకున్నారని... అందుకనే.. ఆరోగ్యం బాలేదని.. ఏదో సాకు చెప్పి వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.   ఇవి నిన్నటి వరకూ వచ్చిన ఆరోపణలు.. కానీ ఈరోజు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. క‌న్నా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. నిజానికి క‌న్నా వైసీపీ కంటే ముందు టీడీపీలోకే వ‌చ్చేందుకే ఆస‌క్తి క‌న‌ప‌రిచారట. కానీ టీడీపీ నుంచి స‌రిగా స్పందన రాకపోవడంతో... వెంట‌నే వైసీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌ారట. ఇక  వాళ్లు క‌న్నా కోరుకున్న సీటుతో పాటు ఆయ‌న అనుచ‌రుడుకి కూడా ఓ సీటు ఇచ్చేందుకు ఓకే చెప్ప‌డంతో క‌న్నా వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టేసుకున్నారు. కానీ బీజేపీ నుండి వ్యతిరేకత రావడంతో.. ఆయన టీడీపీలోకే రావాలని నిర్ణయించుకున్నారట. దీంతో కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నాయకుడిని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా చూడటానికి టీడీపీ నాయకులు రంగంలోకి దిగారట.  విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొంతమంది గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కన్నాతో మంతనాలు జరిపారని తెలిసింది. ఇక క‌న్నా కూడా వైసీపీ కంటే టీడీపీయే బెట‌ర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఆయన డిమాండ్లు ఒప్పుకుంటే ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు పెద్ద అభ్యంత‌రం లేద‌న్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి క‌న్నా పెద‌కూర‌పాడు సీటు అడుగుతారా ? లేదా ? గుంటూరు వెస్ట్ సీటు అడుగుతారా ? అన్న‌ది చూడాల్సి ఉంది.  దీనిపై క్లారిటీ రావాలంటే  వెయిట్ చేయాల్సిందే...మరి  కన్నా వైసీపీ వెళ్లాలనుకున్నప్పుడు షా జగన్ కు ఫోన్ చేసి పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేస్తారో..

పాత కక్షలు పక్కన పెట్టి...

  ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అదేంటనుకుటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 65 సంవత్సరాల తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా  దేశాధినేతలు పాత కక్ష్యలకు పక్కన పెట్టి.. కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. కొరియా యుద్ధం అనంతరం దాదాపు 65ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈరోజు ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ల మధ్య  సమావేశం జరిగింది. ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కిమ్‌ చిరునవ్వుతో మూన్‌ జే ఇన్‌తో కరచాలనం చేశారు. మూన్‌ కూడా చిరునవ్వుతో కరచాలనం చేస్తూ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.   అనంతరం కిమ్‌ జోంగ్‌ ద.కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉ.కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. తర్వాత కిమ్‌ ద.కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని మూడంతస్థుల భవనం ‘పీస్‌ హౌస్‌’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. యుద్ధం తర్వాత కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. సమావేశం ప్రారంభానికి ముందు కిమ్‌ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్‌ జే ఇన్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి అవుతుందని మూన్‌ అన్నారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఇక ఇన్ని ఏళ్ల తరువాత వీరు కలవడంతో.. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలు.  ఇదిలా ఉండగా మే లేదా జూన్‌ నెలలో లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నాయి అంతర్జాతీయ మీడియాలు. మొత్తానికి నేను మోనార్క్ ని.. నేను ఎవరి మాట వినను అన్న పంథాలో నియంతలా ఉండే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ విధమైన శాంతి చర్చలకు సహకరించడం గొప్ప విషయమే. మరి వారి శాంతి చర్చలు సఫలీకృతమవ్వాలని కోరుకుందాం..

పిచ్చికుక్కలా మాట్లాడకు.. నోరు కంట్రోల్ లో పెట్టుకో

  యధా రాజ.. తధా ప్రజా అన్న సామెత వినే ఉంటారు కదా... ఇప్పుడు ఈ సామెత వైసీపీ నేతలకు బాగా సూటయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. తమ అధినేత ఎలా ఉంటే.. అనుచరులు కూడా అలానే ఉంటారు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ ఏ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తారో తెలుసుకదా. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని కానీ..వయసులో పెద్ద అని కానీ ఆలోచించకుండా.. ఆయనను నడిరోడ్డుపైనే కాల్చిపారేయాలని.. ఉరితీయాలని అబ్బో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. మరి ఒక పార్టీ అధినేత స్థానంలో ఉన్న ఆయనే అలా మాట్లాడితే.. మిగిలిన నేతలు మాత్రం ఎందుకు ఉంటారు. వారు కూడా చంద్రబాబును కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు.   ఇంతకీ అసలు సంగేతంటంటే...వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాములుగా కొంత మంది వైసీపీ నేతలకు మైకు చూస్తే పూనకాలు వచ్చేస్తుంటాయి కదా. ఏం మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా మైకు దొరికింది కదా అని తమ నోటికి పని చెప్పేస్తుంటారు. అలా నాని కూడా జగన్ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. టీడీపీ పై ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా..  ఆడు ఈడు అంటూ, బూతులు తిట్టారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఒక పక్క చంద్రబాబును తిడుతూ... మరోపక్క వంశీ నా సన్నిహితుడని చెప్పుకొచ్చారు.   అంతే నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీ... ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని వార్నింగ్ ఇచ్చారు.  ఒకప్పుడు ఇద్దరం స్నేహితులమే కావచ్చు.. ఇప్పుడు కాదు.. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదు..  పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరి చూద్దాం.. వంశీ మాటలకు నాని ఎలా రియాక్ట్ అవుతాడో..

రాధాకృష్ణ వార్నింగ్... లైట్ తీసుకుంటాడా..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై పెద్ద యుద్దమే చేస్తున్నారు. తన తల్లిని దూషించినందుకుగాను... ఆ విషయాన్ని మీడియాలో పదే పదే డిబెట్లు బెట్టి చర్చించినందుకు గాను.. పవన్ మీడియాపై వార్ ప్రకటించారు. ఇప్పటికే పవన్ పిలుపు ప్రకారం ఆయన అభిమానులు పలు ఛానళ్లను బ్యాన్ చేశారు. అంతేకాదు పవన్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు పెడుతూ మీడియాపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై అనవసరమై ఆరోపణలు చేశారని శ్రీనిరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులు అందుకున్న పవన్.. చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు నోటీసులు పంపించినా ఏం లాభం... ఆల్ ద బెస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నారు.   ఇక ఇప్పుడు తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా పవన్ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈయన కూడా పవన్ కు లీగల్ నోటీసులు పంపించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు.. త‌ననూ త‌న సంస్థ‌నూ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే ట్విట్ట‌ర్ నుంచి తొల‌గించాల‌నీ,బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నీ, లేని ప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్తాన‌ని కూడా హెచ్చ‌రించారు. త‌న వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ లోపాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే విచ్చ‌ల‌విడిగా ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్నార‌నీ, ఆ వ్యాఖ్య‌ల్లో వాస్త‌వాలు లేవ‌నీ, అన్నీ ఊహాజ‌నితాలే అని అన్నారు. మీడియాపై చుల‌క‌న‌గా వ్యాఖ్యానాలు చేయ‌డం ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కుల‌కు అల‌వాటైపోయింద‌న్నారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ట్విట‌ర్ లో వ్యాఖ్య‌లు తొల‌గించ‌క‌పోతే తాను వేయబోయే సివిల్‌, క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావాను ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. మరి ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి…? శ్రీనిరాజు నోటీసులను లైట్ తీసుకున్నట్టే రాధాకృష్ణ నోటీసులను లైట్ తీసుకొని దానికి కౌంటర్ ఏదైనా ఇస్తారా..?లేక సీరియస్ గా తీసుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో..