ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా.. దాని కోసం కలుస్తా.. మీకెందుకు..?

నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధాని మోడీని కలుస్తా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తా మీకెందుకు..? ఈ డైలాగులు కొట్టేది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి, మోడీల భేటీలపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వస తీర్మానం పెట్టి ఇప్పుడు మోడీని కలవడం ఏంటని ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికో తోడు ఈ రోజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో మంతనాలు జరుపుతూ దొరికిపోయారు. మరి దీన్ని చూసి ఊరుకుంటారా..? ఇదే విషయాన్ని మీడియా వాళ్లు అడగగా... విజయసాయిరెడ్డికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే మీడియా పై చిందులు తొక్కారు. అవునండీ కలిశాను..  నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధానిని కలుస్తా, మీకెందుకు, చంద్రబాబుకి ఎందుకు.. నా ఇష్టం, మోడీని కలుస్తూనే ఉంటా అంటూ రెచ్చిపోయాడు...అక్కడితో ఆగకుండా... చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, దాని కోసం మోడీని కలుస్తా, మంత్రుల్ని కలుస్తా, అందరినీ కలుస్తా, చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధాన మంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని రెచ్చిపోయారు.  కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తమకు మాత్రమే ఉందని, చంద్రబాబుకి లేదని చెప్పారు... చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి బాగానే కోపం వచ్చినట్టుంది పాపం. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి...

ఎవడండీ ప్రధాని.. వాడికి ఎంత ధైర్యం..!

  ప్రధాని మోడీని ఫ్లోలో గాడు అన్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంత బద్నాం చేశారో తెలిసిందే. ప్రధాని అంతటి వ్యక్తిని గాడు అని అంటావా అని కొందరు.. మోడీని గాడు అని సంబోధించినందుకు కేసీఆర్ ను జైల్లో కూడా పెట్టాలని మరికొంతమంది బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరి మాములుగానే కేసీఆర్ ప్రతిపక్షనేతలను కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తుంటారు. అలాంటిది తనను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా..? బీజేపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించి..ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. నాలాంటి వాళ్ల దగ్గర కొస్తే భస్మం అయిపోతారాని...అయినా ప్రధానిని ఏం అనకూడదని ఏమన్న రాజ్యాంగంలో రాసుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే..ఇక్కడ మరో వ్యక్తి కూడా కోపంతో మోడీని ఆడు అని సంబోధించారు. ఆయన ఎవరో కాదు.. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే..సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్.   ఇటీవల నేను 29సార్లు ఢిల్లీ వెళ్లినా మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చంద్రబాబు ఓ చెప్పుకుంటున్న సంగతి తెలిసందే. దీనిపైనే ఓ మీడియా ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29సార్లు ఢిల్లీకి వెళితే.. మోడీ అపాయింట్‌ మెంట్ ఇవ్వలేదట. ఇది ఎంత దారుణం.. దీన్ని ఎవరైనా చెప్పుకుంటారా? నిజంగా చంద్రబాబుకి ఆత్మగౌరవం ఉండి ఉంటే ఒకసారి రెండుసార్లు చూసి అప్పుడే ఎన్డీఏకి గుడ్‌బై చెప్పి బయటకు వచ్చేసి ఉండాల్సింది..' అని భరద్వాజ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మోడీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.  29 సార్లు మా ముఖ్యమంత్రి వెళితే పట్టించుకోరా? ఎవడండీ ప్రధాన మంత్రి?.. సీఎంని లోపలికి రానీయకుండా ఉండటానికి.. వాడికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రధాన మంత్రి ఎంత గొప్పోడైనా కావచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా అవమానిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలం మా ముఖ్యమంత్రిని లోపలికి రానీయకుండా చేశారంటే ఏమనాలి? ఆ ముఖ్యమంత్రి ఎవరు? మేం ఓటేసి గెలిపించుకున్నాం.. ఆయన్ని అవమానించారంటే.. ఆ అవమానం ఆయనొక్కరిదే కాదు.. మమ్మల్నీ అవమానించినట్టే. మాకు జరిగిన ఈ అవమానానికి నువ్ ఏం సమాధానం చెప్తావ్?.. అంటూ ప్రధానిని ప్రశ్నించారు. మరి కేసీఆర్ గాడు అన్నందుకు బీజేపీ నేతలు అంతలా విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు భరద్వాజ గారు ఏకంగా.... వాడు, వీడు అనే సంబోధించారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

మోడీ నిజస్వరూపం బయటపెట్టిన బీజేపీ ముఖ్యనేత...నియంతకు నిదర్శనం..

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మోడీకు ఉన్న హవా ఇప్పుడు లేదని చెప్పొచ్చు. ఇటీవల జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి మూటగట్టుకుంటుందంటేనే చెప్పొచ్చు.. మోడీ ప్రభంజనం తగ్గిందని. మోడీ-షా ద్వయం చేస్తున్న పాలన నచ్చక ఇప్పటికే కొత్తగా థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రతిపక్షపార్టీలన్నీ ఒకతాటిపైకి వస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలు, రాజకీయ పార్టీల పట్ల… మోదీ, షాల వ్యవహరిస్తున్న తీరుపై.. బీజేపీలోని చాలా మంది నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... అసలు బీజేపీలోనే చీలికలు వస్తాయేమో అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి కారణం మోడీ అద్వానీని అవమానించడమే కారణంగా తెలుస్తోంది. అద్వానీ తరపు నాయకులు మోడీ ప్రవర్తించిన తీరుకు ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు దీనికి ఆజ్యం పోస్తున్నట్టు మరో ఘటన చోటుచేసుకుంది.   అదేంటంటే.. మోడీ తీరు నచ్చక ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. ఆయన ఎవరో కాదు..భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ఫౌండర్ ప్రద్యుత్ బోరా. బయటకు వస్తూ మోడీ నిజస్వరూపాన్ని బయటపెట్టేశాడు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో  మాట్లాడుతూ... ” దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. గెలుపు కోసం ఎలాంటి నీచమైన పనులైనా చేయడానికి పార్టీ వెనుకాడటం లేదు. ఇది 2004 నాటి బీజేపీ కాదు. పార్టీలో అంతా పిచ్చితనం కనిపిస్తోంది. నియంతల వ్యవహారంలా నడుస్తోంది. ఇలాంటి పార్టీలో ఉండలేను..”.. అని నేరుగా  ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు స్వయంగా పార్టీ నేతే బయటకు రావడంతో పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు పట్టుకుందట. పార్టీపైన అసంతృప్తితో ఉన్నా కొంతమంది నేతలు మాత్రం ఏం చేయలేక... మోడీ-షా ద్వయానికి భయపడి సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారట. ఈ సమయంలో ప్రద్యుత్ బోరా ఏకంగా వారిది నియంత పాలన అని సంచలన వ్యాఖ్యలు చేసి.. ఇంక పార్టీలో ఉండలేక.. రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. దీంతో బోరా స్ఫూర్తితో పార్టీలో ఉన్న ఇంకా కొంత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది చూద్దాం మరి ముందు ముందు ఎంత మంది నేతలు బయటకు వస్తారో...

అమ్మను ఆస్పత్రిలో చేర్పించే రోజు ఏం జరిగిందంటే...? నిజం చెప్పిన శశికళ..

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను ఆస్పత్రిలో చేర్పించినప్పుటి నుండి... ఆమె మరణించినంత వరకూ అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక్క శశికళకు తప్ప. కనీసం పార్టీ నేతలకు కూడా అనుమతి లేకుండా.. చాలా రహస్యంగా జయలలితకు చికిత్స చేశారు. అందుకే కొంతమంది అసలు జయలలితను శశికళే చంపింది అని ఆరోపణలు కూడా చేశారు. ఆ తరువాత ఇంకా ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి కానీ.. వాటికి సమాధానం మాత్రం లేదు. అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయారని వైద్యులు చెబుతున్నప్పటికీ.. అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని కొందరు అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పడు జయలలితను ఆసుపత్రిలో చేర్చిన రోజు ఏం జరిగిందో శశికళ చెప్పారు.   ఆమె మృతిపై దర్యాప్తు చేసేందుకు న్యాయస్థానం జస్టిస్‌ అరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ వేసింది. ఆ విచారణలో ఆమె ఏం చెప్పిందంటే..‘సెప్టెంబరు 22, 2016 రాత్రి 9.30 గంటల ప్రాంతంలో జయలలిత బ్రష్‌ చేసుకునేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లారు. అప్పటికే ఆమెకు జ్వరం బాగా ఉంది. బాత్‌రూంలో ఆమె కిందపడిపోవడంతో సాయం పట్టమని నన్ను పిలిచారు. నేను వెంటనే వెళ్లి జయలలితను బాత్‌రూం నుంచి తీసుకొచ్చి బెడ్‌ మీద పడుకోబెట్టాను. అంతలో ఆమె స్పృహ కోల్పోయారు. దీంతో నేను మా బంధువైన డాక్టర్‌ శివకుమార్‌కు ఫోన్‌ చేశాను. డాక్టర్‌ వచ్చి జయలలితను పరీక్షించారు.  ఆ తర్వాత అపోలో ఆసుపత్రి వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి భర్త విజయ్‌కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపమని కోరారు’. ‘15 నిమిషాల్లో రెండు అంబులెన్స్‌లు వచ్చాయి. జయలలితను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. మార్గ మధ్యంలో ఆమెకు స్పృహ వచ్చింది. ఎక్కడకు వెళ్తున్నాం అని అడిగితే ఆసుప్రతికి అని చెప్పాను. ఆ రోజు ఉదయమే డాక్టర్‌ శివకుమార్‌ జయలలితను రెండు సార్లు పరీక్షించారు. ఆసుప్రతికి రావాలని చెప్పినా అందుకు అమ్మ ఒప్పుకోలేదు. జ్వరం ఎక్కువవడంతో రాత్రి స్పృహ కోల్పోయారు’ అని శశికళ చెప్పారు.   ఇంకా  ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలలితను చూసేందుకు ఎవరినీ అనుమతించలేదంట కదా అని అడుగగా.. దానికి.. అది అవాస్తవమని..అక్టోబరు 22, 2016న అప్పటి రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు జయలలితను చూశారు. ‘అప్పుడు అమ్మ గవర్నర్‌ను చూసి చేయి పైకెత్తిందట... ఈ విషయాన్ని గవర్నరే నాతో చెప్పారు’ అని అన్నారు.  సెప్టెంబరు 22-27 మధ్య అన్నాడీఎంకే నేతలు పన్నీర్‌సెల్వం, తంబిదురై, విజయ భాస్కర్‌ ఆమెను చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా కొందరు నేతలు జయలలితను చూసినట్టు తెలిపారు. ఏది ఏమైనా జయలలిత మరణం మిస్టరీగా మారడం బాధాకరమైన విషయం. చూద్దాం.. శశికళ చెప్పింది నిజమో..కాదో...?  

టీఆర్ఎస్ వెనుక బీజేపీ... గమనిస్తున్న పార్టీలు...

  దేశ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత వేడి పుట్టిస్తున్నాయి. ఒకపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తుంటే..మరోపక్క టీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్లపై.. ఇంకో రాష్ట్రం కావేరి నది వివాదంపై ఇలా పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టీడీపీ నేతలు బీజేపీ నుండి బయటకు వచ్చి పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఇక దీని వెనుక చంద్రబాబు ఉన్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ చంద్రబాబుకి మద్దతుగా నిలిచాయి. కానీ దురదృష్టం ఏంటంటే.. అంతమంది మద్దతున్నా అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాకపోవడం. కారణం టీఆర్ఎస్ పార్టీ.. అన్నాడీఎంకే పార్టీ.   టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తుంది. అన్నాడీఎంకే పార్టీ కావేరి జల వివాదం పై డిమాండ్ చేస్తుంది. ఈ రెండు పార్టీలు కనుక సెలైంట్ గా ఉంటే.. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుంది. కానీ అది జరగడం లేదు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని.. చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అన్నాడీఎంకే పార్టీ అంటే మోడీ డైరెక్షన్ లో నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పార్టీ లోక్ సభలో ఆందోళన చేసే విషయంలో ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. కానీ టీఆర్ఎస్ ను చూస్తుంటేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వెనుక బీజేపీ ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో థర్డ్ ఫ్రంట్ పేరుతో హంగామా చేస్తున్నారు కానీ...  అయితే ఆచరణలో మాత్రం ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు అనేక పార్టీల్లో ఉన్నాయి. అందుకే.. అవిశ్వాసం అంశం చర్చకు రాకుండా చేయడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని మిగిలిన రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి. అందుకే... కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీలు ఒక వైపు తాము బీజేపీకి కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నామని చెబుతూనే బీజేపీని టార్గెట్ చేసే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం ఏమిటని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరి కేసీఆర్ ఇలానే వ్యవహరిస్తే థర్డ్ ఫ్రంట్ సంగతేమో కానీ... తమ పార్టీకే మద్దతి లేకుండా చేసుకునేలా ఉన్నాడు. మరి జనాల్ని పిచ్చోళ్లని చేయడం ఈజీ ఏమో కానీ... తోటి రాజకీయ పార్టీలను పిచ్చోళ్లని చేయడం ఈజీ కాదని కేసీఆర్ కు కూడా అర్దమయ్యే టైం దగ్గర్లోనే ఉంది.

మోడీని వణికిస్తున్న అద్వానీ..

  ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చంద్రబాబు బీజేపీతో విడిపోయి.. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టించారు. అయితే కేంద్రం మాత్రం అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వడం లేదన్నది ప్రతిఒక్కరి వాదన.  చంద్రబాబుకి ప్రతిపక్షపార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో.. మోడీ భయపడి కావాలనే ఇలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో వాదన కూడా వినిపిస్తోంది.. టీడీపీ అవిశ్వాసం అయితే పెడుతుంది గానీ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు అని తెలుసు. అలాంటిది బాబుకి మోడీ ఎందుకు ఇంతలా భయపడుతున్నారని కూడా అనుకుంటున్నారు.   అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు మోడీ భయపడేది చంద్రబాబుకి కాదట.. బీజేపీ సీనియర్ నేత అద్వానీకట. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు కథ ఏంటంటే... ఇప్పటికే అద్వానికీ దక్కాల్సిన ప్రధాని పదని మోడీ దక్కించుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ లో తనకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా మౌనంగా భరిస్తూవచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటనను మాత్రం అద్వానీయే కాదు.. ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. త్రిపుర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా మోడీ సహా బీజేపీ పెద్దలు అక్కడకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మోడీ అందరికీ నమస్కారం చేశారు కానీ..అక్కడే ఉన్న అద్వానిని మాత్రం పట్టించుకోలేదు. అంత పెద్ద వయసులో ఉన్న ఆయన నమస్కారం పెడితే.. ప్రతినమస్కారం కూడా చేయకుండా ఆయన్ని  గుర్తించినట్టు ప్రవర్తించారు. ఇక ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ప్రధాని ప్రవర్తించిన తీరు చూసి అందరూ మోడీని ఓ రేంజ్లో ఏకిపారేశారు. ఇక అంతకుముందు నుండే అద్వాని అనుచరులు మోడీపై కోపంగా ఉన్నా.. ఇక ఈ ఘటన తరువాత ఇంకా ఆవేశంతో రగిలిపోతున్నారట. దాంతో అవిశ్వాసం చర్చ కనుక ఓటింగ్ కు వస్తే.. అద్వాని అనుచరులు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మోడీ భయపడిపోతున్నారట. అంతేకాదు... అద్వానీ ఎక్కడా బయటపడకపోయినా.. తన వర్గాన్ని తన మీద యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడని మోడీ సందేహిస్తున్నాడట. ఇప్పటికే బీజేపీ తో పాటు జాతీయంగా అన్ని పార్టీల్లో అద్వానీ మీద సానుభూతి వ్యక్తం అవుతున్న విషయం మోడీకి బాగా అర్ధం అయ్యింది. అందుకే అద్వానీ అదును చూసి దెబ్బ కొడతారేమో అన్న భయంతో మోడీ వణికిపోతున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మోడీ ఇంతగా అభద్రతకు లోను అవుతున్నారు. మొత్తానికి తాడిని తన్నేవాడు ఉంటే.. వాడిని తలను తన్నేవాడు ఉంటాడన్న సామెత ప్రకారం.. అందరూ మోడీ భయపెడుతుంటే.. మోడీ మాత్రం అద్వానికి భయపడుతున్నారు.

ఇంతలా లొంగిపోవాలా పవన్..?..ఏం సాధించడానికి

  నాకు కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది.. ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్. కానీ ఇప్పుడు చూడబోతే ఆయనకు తిక్కుంది కానీ.. దానికి లెక్కలేకుండా ఉందన్నట్టుంది పరిస్థితి. ఒకపక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ఎంపీలందరూ పోరాటం చేస్తుంటే.. మరోపక్క పవన్ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీపై విమర్శలు గుప్పించి ట్విస్ట్ ఇచ్చిన పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి అయోమయంలో పడేశాడు. ఓ నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడిన పవన్... ప్రభుత్వంలోని అవినీతిపై చంద్రబాబుకు తెలుసు.. 40 మంద ఎమ్మేల్యేలు, కొంత మంది టీడీపీ నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నాకు చెప్పారు.. నేను కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు చాలా సార్లు చెప్పా.. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి.. లోకేశ్ కు ఉన్న లింకులపై న్యాయ విచారణ చేపట్టాలి అని అన్నారు. అంతేకాదు.. మోడీతో నాకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవమే అని చెప్పారు.   ఇక ఇన్ని రోజులు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా.. ప్రజలతో కలిసి పోరాడతా.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ డైలాగులు చెప్పిన ఆయన ఇప్పుడు ఆవిషయంలో కూడా మాట మార్చాడు.  ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నుండి వస్తున్న డిమాండ్.. దీనిపై ప్రజల్లో పట్టింపు లేదు.. హోదానా, ప్యాకేజీనా అనేది అనవసరం, మాకు డబ్బులు" కావలి అంటూ మాట్లాడారు. మరి హోదా అవసరం లేదని ఇప్పుడు చెబుతున్నారు.. గతంలో చంద్రబాబు కూడా ఇదే కదా చెప్పింది. హోదా.. అయినా ప్యాకేజీ అయినా ఏపీకి న్యాయం చేస్తే చాలు అని.. మరి ఇదే విషయం చంద్రబాబు అంటే, పాచి పోయిన లడ్డులు అని చెప్పిన పవన్.. ఇప్పుడు ఇలాంటి పలుకులు పలుకుతున్నారు. ఇప్పుడు పవన్ ను ఏమంటారు..?   ఇక పొతే, కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి కూడా చెప్పారు...కెసిఆర్ కు, థర్డ్ ఫ్రంట్ పెట్టమని చెప్పింది తానే అని చెప్పారు... 10 మార్కులకు గాను, చంద్రబాబుకి 2.5 మార్కులు, కెసిఆర్ కు 6 మార్కులు వేస్తున్నట్టు చెప్పారు పవన్...దీన్ని బట్టి పవన్ వెనుక బీజేపీ ఉందన్న వార్తలు నిజమేనేమో అని అనుకుంటున్నారు. ఢిల్లీ పెద్దలు చంద్రబాబును ఎదుర్కోవడానికి ఇక్కడ పవన్ ను, తెలంగాణలో కేసీఆర్ ను ఎందుకంటే..పర్ఫెక్ట్ గా వాడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒక పక్క ఢిల్లీతో చంద్రబాబు పోరాడుతుంటే.. చాలా పార్టీలు మద్దతిచ్చాయి కానీ టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకూ మద్దతివ్వలేదు. ఇక ఈ టైంలో పనిగట్టుకొని పవన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం.. దానికితోడు.. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేయడం.. దీంతో పవన్ బీజేపీతో కలుస్తాడు అనే ప్రచారం నిజం అని పవన్ మాటలను బట్టి తేలిపోతుంది. మొత్తానికి నిన్న మొన్నటి వరకూ పవన్ పై ఉన్న అభిప్రాయం.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కనీసం ఎన్నికల సమయానికైనా ఈయన ఓ క్లారిటీతో ఉంటారో లేదో..?

చంద్రబాబుకి ఎప్పుడో చెప్పా.. పట్టించుకోలేదు..

  ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను... టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ వెనుక బీజేపీ ఉందని కూడా వాదిస్తున్నారు. ఇదిలా జరుగుతుండగా మరోసారి పవన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓ జాతియ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ మరోసారి ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై మండిపడ్డారు. ప్రభుత్వంలోని అవినీతిపై చంద్రబాబుకు తెలుసు.. 40 మంద ఎమ్మేల్యేలు, కొంత మంది టీడీపీ నేతలు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై నాకు చెప్పారు.. నేను కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు చాలా సార్లు చెప్పా.. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి.. లోకేశ్ కు ఉన్న లింకులపై న్యాయ విచారణ చేపట్టాలి అని అన్నారు. మోడీతో నాకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవమే..  బీజేపీ, టీడీపీ మధ్య జరుగుతున్న గొడవలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు.. బీజేపీపై ప్రజల్లో నమ్మకం లేదు.. ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నుండి వస్తున్న డిమాండ్.. దీనిపై ప్రజల్లో పట్టింపు లేదు.. హోదానా, ప్యాకేజీనా పేరు ఏదైనా రాష్ట్రానికి ఆర్ధిక సాయం కావాలి అని అన్నారు. ఇంక థర్డ్ ప్రంట్ పై ఇప్పుడేమి చెప్పలేను అంటూ చంద్రబాబు, కేసీఆర్ పాలనపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. చంద్రబాబుకి 2.5మార్కులు..కేసీఆర్ కు 6 మార్కులు వేశారు. మరి ఇప్పటికే పవన్ మీద గుర్రుగా ఉన్న టీడీపీ నేతలకు మరోసారి పవన్ మంటపుట్టించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో.. ముఖ్యంగా చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అందుకే చంద్రబాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు...

  నేను ఢిల్లీ 29 సార్లు వెళ్లానని.. ప్రధాని మోడీ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు తనకి మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కానీ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తున్నారని... బీజేపీ వైసీపీకి ఫేవర్ గా ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి అని మండిపడేవారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన విజయసాయిరెడ్డి మోడీ చంద్రబాబుకి ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదో చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి పూటకో మాటను మార్చడం చంద్రబాబు నైజమని.. రంగులు మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించినవారు మరెవరూ లేరని విమర్శించారు. అంతేకాదు.. గతంలో రాత్రికి రాత్రే ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనని చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ డ్రామాలాడుతున్నారని అన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో కూడా అందరికీ తెలుసు.. చంద్రబాబు తన నీడను తానే నమ్మలేరని... ఇంకా చెప్పాలంటే కన్న కొడుకు నారా లోకేష్ ను కూడా ఆయన నమ్మడం లేదని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని, ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారు... రంగులు మార్చే నైజం చంద్రబాబుది కాబట్టే మోదీ ఆయనను విశ్వసించలేదు... అందుకే చంద్రబాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అని కామెంట్ చేశారు.

జుట్టు పీక్కుంటున్న పవన్ ఫ్యాన్స్...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును చూసి ఆయన అభిమానులు జుట్టు పీక్కుంటున్నారట. అసలు తాము ఎవరికి శత్రువులమో..ఎవరికి మిత్రులమో అని అయోమయంలో పడిపోయారట. ఇప్పటి వరకూ టీడీపీ-జనసేన మిత్రులుగా ఉన్నారనుకున్న వారందరికీ.. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీపై విమర్శలు గుప్పించి అందరికీ షాకిచ్చాడు. లోకేశ్ నుండి టీడీపీ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇక ఆరోజు నుండి టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో టీడీపీకి తాను వ్యతిరేకమని పవన్ చెప్పనకే చెప్పారు అని అంటున్నారు. రాజకీయవిశ్లేషకులు. దీంతో పవన్ అభిమానులు కన్ఫ్యూజన్లో పడ్డారట. కారణం.. ఇన్ని రోజులు తాము టీడీపీ మిత్రులమని అనుకోవడమే.   ఇక ఇన్ని రోజులు పవన్ వైసీపీకి వ్యతిరేకం అని అనుకున్నారు. ఎప్పుడూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడంతో అందరూ అదే కరెక్ట్ అనుకున్నారు. వైసీపీ అయితే పవన్ వెనుక టీడీపీ ఉందని.. పవన్ చంద్రబాబు ఆడినట్టు ఆడుతున్నారని కామెంట్లు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్... పవన్ తనతో మాట్లాడి.. వైసీపీకి మద్దతు ఇవ్వబోతున్నట్లు చెప్పి బాంబు పేల్చారు. పోనీ దానిపై పవన్ స్పందించి.. సమాధానం ఇచ్చారా...? అంటే అదీలేదు.. ఆవార్తలను ఖండించలేదు.. మరోవైపు భాజపా తో పవన్ కుమ్మక్కయ్యాడని చంద్రబాబు అంటాడు. దానిని కూడా పవన్ ఖండించలేదు. అలాగని భాజపా వారి వైఫల్యాలను తిట్టడమూ లేదు. సరే భాజపాతో కలిసి నడుస్తారేమో అని అనుకుంటుండగా.. ఆయన వామపక్షాలతో కలిసి ప్రజాపోరాటాలుచేస్తాం అని ప్రకటించారు. దీంతో తాము ఎవరికి మిత్రులో ఎవరికి శత్రువులో తెలియక పవన్ కల్యాణ్ అభిమానులు సతమతం అయిపోతున్నారట. మరి అభిమానుల్లో ఉన్న కన్ఫ్యూజన్లో పోవాలంటే.. ముందు పవన్ లో ఉన్న కన్ఫ్యూజన్ పోవాలి...అప్పటివరకూ అభిమానులకు ఈ కన్ఫ్యూజన్ తప్పదు...

వైసీపీ-టీడీపీ కుమ్మక్కు... ఇదేం కామెడీ పవన్....

  మొత్తానికి పవన్ కు రాజకీయం బాగానే వంటపట్టినట్టు ఉంది. పక్కవారిని విమర్శిస్తేనే కానీ.. రాజకీయ ఎదుగుదల ఉండదని తెలిసినట్టుంది. అందుకే ఇన్ని రోజులు నేను ఎవరిని విమర్శించను అని మడి కట్టుకొని కూర్చున్న పవన్.. ఇప్పుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏపీ ప్రభుత్వం పై, టీడీపీపై, వైసీపీ పై విమర్శలు గుప్పించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీపై యూటర్న్ తీసుకొని.. ఆ పార్టీపై పవన్ ఓ రేంజ్లో విమర్శలు గుప్పించి అందరికీ షాకిచ్చాడు. జనసేన పార్టీ ఆవిర్బావం రోజున తమ పార్టీ కార్యచరణ ఏంటో... పవన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వేళ.. టీడీపీని మెయిన్ టార్గెట్ గా చేసుకొని ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్లలో టీడీపీపై కాస్త సాఫ్ట్ కార్నర్ తో పెద్దగా విమర్శించింది లేదు.. అందుకే పవన్ వెనుక చంద్రబాబు ఉన్నాడు అని ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేసేవారు. అలాంటిది సడెన్ గా టీడీపీపై విమర్శలు చేయడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ.. పవన్ వెనుక బీజేపీ ఉందని మొదలుపెట్టారు. దీంతో మరోసారి పవన్ టీడీపీపై వారిపై విరుచుకుపడ్డారు.   మొన్నటి వరకూ తనను టీడీపీ మనిషని అన్నారు... ఇప్పుడేమో బీజేపీ మనిషని అంటున్నారు, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని మండిపడ్డారు. ఇక ఆరోజు నుండి టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అవిశ్వాస తీర్మానంపై విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. అదేంటంటే.. టీడీపీ, వైసీపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. విచిత్రంగా ఉంది కదా...గతంలో ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవనే రెండు పార్టీలకు సవాల్ విసిరారు. దమ్ము ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించండి.. దానికి అవసరమైన 50 కాదు కదా.. 70మంది సభ్యుల మద్దతు నేను సేకరిస్తా.. వామపక్షాలు, తెరాస, కాంగ్రెస్ అందరి మద్దతు నేను తీసుకువస్తా.. మీరు దమ్ముంటే తీర్మానం పెట్టండి చాలు అని అన్నారు. ఇక పవన్ సవాల్ ను మొదట జగన్ స్వీకరించి...తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. అయితే అప్పుడు.. నేను మద్దతు సమీకరిస్తాను గానీ..  4వ తేదీలోగా తీర్మానం పెట్టాలి.. అని కండిషన్ పెట్టారు. కానీ మారుతున్న రాజకీయాల నేపథ్యంలో జగన్ 23 న కాకుండా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక టీడీపీ కూడా వైసీపీకి మద్దతిచ్చేది ఏంటీ అని వారే స్వయంగా తీర్మానం పెట్టారు. ఇప్పుడు ఇదే పవన్ కు తప్పుగా కనిపిస్తోంది. ఇంకా కామెడీ ఏంటంటే... ‘‘తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ కుమ్మక్కు అయ్యాయి.. కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారు’’ అంటూ పవన్ కల్యాణ్ సెలవివ్వడం. దీంతో ఇన్ని రోజులు మాట్లాడిన పవనేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని జనాలు అనుకుంటున్నారు. పవనే స్వయంగా మద్దతు సమీరించాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ప్రత్యేకహోదా గురించి పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలేనా...? అని ప్రజలు విస్తుపోతున్నారు. అంతేకాదు... నవతరం రాజకీయాలు చేయాలని వస్తున్న పవన్ కల్యాణ్ కు.. ఇలాంటి రాజకీయాలు అవసరమా అని మాట్లాడుకునేవాళ్లు కూడా ఉన్నారు. మరి పవన్ ఆలోచన ఏంటో.. ఆయనకే తెలియాలి....

మరోసారి రాజకీయ చాణక్యాన్ని చూపించారుగా...!

  మరోసారి చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని చూపించారు. తన రాజకీయానుభవం ముందు జగన్ మరోసారి బోల్తాపడ్డాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిన్న వైపీసీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక టీడీపీ కూడా వైసీపీకీ మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడే చంద్రబాబు నైట్ కి నైటే తన చక్రాన్ని తిప్పేశారు. వైసీపీలో ఉంది ఐదుగురు.. ఐదుగురితో కలిసి వెళ్లేదేంటి.. మనమే స్వయంగా అవిశ్వాస తిర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక చంద్రబాబు నిర్ణయంతో ఈరోజు టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ముందు పెట్టిన వైసీపీ నేతలు అవిశ్వాసం ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే...అవిశ్వాసం అవిశ్వాసం అంటూ వైసీపీ నెలరోజులుగా డ్రామా చేస్తున్నా ఆ పార్టీకి ఎంత మద్దతు దక్కుతుందన్నది వారికే అర్థం కాని పరిస్థితి.   కానీ టీడీపీ పరిస్థితి అలా కాదు. టీడీపీ తీర్మానం మాత్రం కలకలం రేపే అవకాశాలే కనిపిస్తున్నాయి. కారణం చంద్రబాబు. ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. చంద్రబాబు రంగంలోకి దిగడంతో  టీడీపీ తీర్మానానికి జాతీయ పార్టీలు మద్దతిచ్చేందుకు క్యూ కట్టాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుండి అన్నాడీఎంకే.. ఇక మమతాబెనర్జీ, లెఫ్ట్ పార్టీలు కూడా బాబు తీర్మానానికి మద్దతిస్తామని చెప్పినట్లు సమాచారం. శివసేన ఎలాగూ కేంద్రంపై మండిపడుతోంది. శివసేన, అకాళీదల్ తమ వైఖరిని చెప్పనప్పటికీ అవిశ్వాసానికి సై అనొచ్చంటున్నారు. కాంగ్రెస్ తోనే ఆర్జేడీ నడవొచ్చు. అంటే ఓ రకంగా జాతీయ పార్టీల్లో చాలావరకూ టీడీపీకి మద్దతిస్తున్నట్లే. దీంతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని టీడీపీ మరోసారి జాతీయ స్థాయిలో వివరించే అవకాశం దక్కుతుంది. మొత్తానికి వైసీపీ మద్దతిచ్చి ఆ క్రెడిట్ వైసీపీకి దక్కకుండా జాగ్రత్తపడ్డారు. మరోసారి చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు  రాజకీయం ఏంటో చూపించారు.

ప్రత్యేక హోదా ఇస్తారు..కానీ..?

  బీజేపీ నుండి అలా విడిపోయారో లేదో..అప్పుడే బీజేపీ పై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసేశారు. ఇన్ని రోజులు సహనంతో ఉన్న చంద్రబాబు కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని సంచలన విమర్శలు గుప్పించారు. మోదీ వంటి వేల కోట్ల మేరకు మోసం చేసిన వారిని దేశం దాటి పోనిచ్చింది స్వయంగా ప్రధానేనని..  నీరవ్ మోదీ, విజయసాయిరెడ్డి, జగన్ వంటి ప్రజాధనం మెక్కిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్న నరేంద్ర మోదీ, వారికి అండగా నిలిచారని నిప్పులు చెరిగారు. ఇప్పటికే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకునే ప్లాన్ లో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పిన చంద్రబాబు ఇక ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకోవడంతో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా వీరితో కలిపి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం గురించి మాట్లాడిన ఆయన మోడీపై మండిపడ్డారు.   ఏపీకి  ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని కానీ ఇక్కడే మోడీ ఓ ప్లాన్ వేశారని చెప్పారు. వైకాపా, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్య పుచ్చాలన్నది మోదీ కుట్ర అని ఆరోపించారు. హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తరువాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్ కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు.  కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. మరి చంద్రబాబు ఊహించినట్టు జరుగుతుందో..? లేదో...? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతా..

  సూపర్ స్టార్ రజనీకాంత్‍‌.. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనం. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత పెద్ద స్టార్ అయ్యారు. సౌత్‌లో ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంక ఏహీరోకి ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇక తమిళనాడులో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈయన్ని ఆయన అభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఎలాంటి ఆడంభరాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేస్తుంటారు రజనీ. అప్పుడప్పుడు హిమాలయాలకు కూడా వెళ్లి ఆధ్యాత్మిక జీవితంలో మునిగిపోతారు.   ఇక తన సినీ జీవితంలో సక్సెస్ అయిన రజనీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎప్పటినుండో రజనీ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఇటీవలే రాజకీయ ప్రవేశం చేశారు. అయితే పార్టీ పేరు..చిహ్నం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆధ్మాత్మిక పర్యటన నిమిత్తం హిమాలయాలకు వెళ్లిన రజనీ ఆసక్తికర రాజకీయాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రిషికేష్ లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన..  నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆధ్యాత్మిక బాట పట్టాను. మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమేనన్నారు. తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంక తన రాజకీయ ప్రవేశంపై అడుగగా... తానింకా పూర్తి స్థాయి రాజకీయవేత్తను కాలేదని.. కనీసం రాజకీయ పార్టీ పేరును కూడా ప్రకటించలేదని... అయినా ఆశ్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కానీ... రాజకీయ నాయకుడిగా సరికొత్త పాత్రను పోషించనున్న తాను, ఈ రంగంలోనూ విజయం సాధించగలనని నమ్ముతున్నట్టు చెప్పారు.  ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా వారి కోరికలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మొత్తానికి రజనీకాంత్ కు తాను ఈ రాజకీయ రంగంలో కూడా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది. మరి మనం కూడా రజనీ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..

మీతో కటీఫ్.. మీ ఇష్టం..

  ఇన్ని రోజులు ముసుగులో గుద్దులాటలాగ జరిగిన వ్యవహారానికి తెరపడింది. ఎన్నో రోజుల నుండి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ-బీజేపీ పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇక కేంద్ర బడ్డెట్ తరువాత ఈ వార్ ఇంకా తారాస్థాయికి చేరింది.  ఏపీకి కేంద్రం నిధులు సరిగా కేటాయించకపోవడం.. ప్రత్యేక హోదా విషయంలో.. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి చాలా ఇచ్చామని.. మరోపక్క మాకేం ఇవ్వలేదని రెండు పార్టీల నేతలు బహిరంగానే తిట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇక రెండు పార్టీలు కలిసి ఉండటం కష్టం అనే అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ఎప్పటినుండో విడిపోతారు.. విడిపోతారు అన్న వార్తలు రావడం తప్పా...ఇంతవరకూ జరిగింది లేదు. కానీ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. రెండు పార్టీలు విడిపోయినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి.. ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని చెప్పినట్టు సమాచారం. ఈ ఉదయం ఎంపీలతో అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్టీయే నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న చంద్రబాబు వెంటనే ఆ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పారట. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్టు స్పష్టం చేశారట. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం చూపుతున్న వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ, అమిత్ షా పేరిట ఓ లేఖను పంపామని, అందులో మిగతా విషయాలన్నీ సవివరంగా ప్రస్తావించామని చంద్రబాబు చెప్పారట.   ఇదిలా ఉండగా చంద్రబాబు తమ నిర్ణయాన్ని చెప్పగా.. దానికి షా పెద్దగా స్పందించలేదని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుసునన్నట్టుగా అమిత్ మాట్లాడారని.. మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుందని.. మీ ఇష్టమని మాట్లాడారట. మొత్తానికి రెండు పార్టీలు విడిపోయాయి. మరి ఇన్ని రోజులు కలిసివున్నా కూడా ఒకరి మీద ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటూ.. దుమ్మెత్తిపోసుకున్నారు...ఇప్పుడు విడిపోతున్నారు... ఇప్పుడు ఏం రేంజ్ లో తిట్టుకుంటారో చూద్దాం..

పవన్-వైసీపీల గుట్టు బయటపడింది...!

  ఉన్నట్టుండి ఒక్కసారిగా పవన్ టీడీపీపై విమర్శలు గుప్పించడంతో...ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. నిన్నటి వరకూ ఊహించింది ఒకటి ఇప్పుడు జరుగుతోంది ఒకటి. ఇప్పటివరకూ ఏ సభ జరిగినా టీడీపీ పై పవన్ ఇంతలా విమర్శలు చేసింది లేదు. బీజేపీపై, వైసీపీ పై విమర్శలు గుప్పించారు కానీ.. నిజానికి అందరూ అన్నట్టుగానే టీడీపీ పై కాస్త సాఫ్ట్ కార్నర్ తోనే ఉండేవారు. అలాంటిది జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పనిగట్టుకొని టీడీపీనే టార్గెట్ చేసినట్టు ఉంది పవన్. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీని, కేంద్రాన్ని తిట్టినప్పుడు కూడా ఇన్ని విమర్శలు గుప్పించలేదు. టీడీపీపై ఏకంగా ఓరేంజ్ లో అవినీతి మరకలు అంటించారు. ఏకంగా లోకేశ్ పేరునే చెబుతూ చంద్రబాబును ప్రశ్నించారు.   దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు పవన్ పై గుర్రుమంటున్నారు. పవన్ వెనుక బీజేపీ ఉందని.. మోడీ ఉన్నారని ఇలా ఎవరి నచ్చిన విమర్శలు వాళ్లు చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోందో నిన్నటి సభతో తేలిపోయింది. ఇకపై తాను టీడీపీ తో కలిసి వెళ్ళేది లేదని ఈ సభ ద్వారా పవన్ చెప్పేసారు. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగు చూసింది. వైసీపీతో పవన్ వెళ్లే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు వైసీపీ కి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ నిర్ధారించారు. ప్రత్యేక హోదా పై వైసీపీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్నా.. కనీసం సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని.. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని చెప్పారు. దీనికి అన్ని పార్టీల మద్దతు కావాలని అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ టీడీపీ పై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించి...  నాలుగేళ్లుగా హోదాపై మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. హోదాకోసం పోరాడితే పవన్ కు మద్దతిస్తాం... హోదాపై జనసేన, వైసీపీ కలిపే పోరాడతామని అన్నారు. ఇంకా ఒకరోజు పవన్ ఫోన్ చేసి కలవాలంటే కలిశాను.. అప్పుడు వైసీపీ నేతలు నన్నేందుకు విమర్శిస్తున్నారని అడిగారు.. దానికి మీరు టీడీపీకి వంత పాడుతున్నారు కాబట్టే విమర్శిస్తున్నాం అని చెప్పాను.. నేను టీడీపీ తో లేను అవసరమైతే జగన్ కు మద్దతిస్తాను అని చెప్పారని తెలిపార అని అసలు విషయం బయటపెట్టారు. దీంతో వైసీపీ-జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయి అని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై పవన్ ఎలా స్పందిస్తాడు.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పవన్ పై బాబు ఫైర్...ఎదురుదాడికి దిగండి..

  మొత్తానికి ఇన్ని రోజులకు ప్రతిపక్షనేతలు హ్యాపీగా ఫీలయివుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మామీదే విమర్శలు చేస్తుంటాడు తప్పా.. ? టీడీపీ ని ఒక్క మాట కూడా అనడు... చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ అంటూ అనుకునే వాళ్లు. ఇప్పుడు అలా అనుకున్నవాళ్లకి పవన్ మాటలు సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ టీడీపీకి మద్దతుగా ఉన్న పవన్ ఒక్కసారిగా టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడేక్కాయి.   ఇదిలా ఉండగా.. టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అనంతరం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని నిలదీసి డిమాండ్లను సాధించుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో చౌకబారు విమర్శలు చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామాలు కూడా చేసి, నిత్యమూ పార్లమెంట్ వేదికగా పోరాటం సాగిస్తుంటే ఈ తరహా విమర్శలు ఏంటని అన్నారు. అంతేకాదు....పవన్ కల్యాణ్ విమర్శల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని.. ఓ పథకం ప్రకారం బుదరజల్లే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. నరేంద్ర మోదీ తన భుజాలపై ఓకవైపు పవన్ ను, మరోవైపు జగన్ ను మోస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరునైనా తలవని పవన్, లోకేష్ పై ఆరోపణలు చేయడం బాధను కలిగించిందని అన్నారు. ఆయన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగాలని, అయితే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని మాత్రం ఎటువంటి విమర్శలూ చేయవద్దని సూచించినట్టు సమాచారం.. మరి టీడీపీ విమర్శలను పవన్ తట్టుకుంటాడా...లేకపోతే తిరిగి టీడీపీపై మళ్లీ విరుచుకుపడతారా..? చూద్దాం ఏం జరుగుతుందో..

పవన్ కు భజన మొదలైంది.. బీజేపీతో పవన్

  జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీని టార్గెట్ చేసినట్టు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. ఇన్ని రోజులు బీజేపీ, వైసీపీపైనే విమర్శలు గుప్పిస్తాడు.. టీడీపీపై ఎందుకు విమర్శలు చేయరు అని అనుకునే వాళ్లకు పవన్ ఈ రకంగా సమాధానం చెప్పినట్టు ఉంది. మొదట ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై నిప్పులు చెరిగిన పవవ్.. ఆతరువాత టీడీపీనే టార్గెట్ చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కొడుకు నారా లోకేశ్ నుండి టీడీపీ నేతలందరిపై మండిపడ్డారు. అసలు లోకేశ్ అవినీతి గురించి మీకు తెలుసా... అని డైరెక్ట్ గా చంద్రబాబునే ప్రశ్నించారు. ఇంకా టీడీపీ నేతలపై పలు ఆరోపణలే గుప్పించారు. మరి ఇంత బహిరంగంగా ఆరోపణలు చేసిన పవన్ ను ఊరికే వదిలిపెడతారా..? అప్పుడే టీడీపీ నుండి భజన మొదలైంది. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..ప్రత్యేక హోదా రాలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా పెల్లుబుకుతున్న వేళ, హోదా సాధన కోసం ఏం చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా, వేరెవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మారిన పవన్, చౌకబారు విమర్శలతో ప్రచారం పొందాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో ఎవరి ప్రయోజనాల కోసం తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారో పవన్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. హోదాను ఇవ్వని నరేంద్ర మోదీ గురించి ఒక్క విమర్శ కూడా చేయని ఆయన తీరును చూస్తుంటే తనకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఇంకా పల్లె రఘునాథ్ మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతల హస్తముందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారిపోయారని, వారు ఏం చెబితే పవన్ అది చేసే స్థితికి వచ్చేశారని నిప్పులు చెరిగారు. మంత్రి కేఎస్ జవహర్ కూడా ఘాటుగా స్పందించారు. పవన్ మతిలేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత నాలుగేళ్లుగా కనిపించని అవినితి పవన్‌కు ఇప్పుడే కనిపించిందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పవన్ లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకున్నారని, అదేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా పలువురు టీడీపీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించి పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పవన్ కల్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు. మొత్తానికి ఇన్ని రోజులు పవన్ పై ఒక్క విమర్శ కూడా చేయని టీడీపీ.. ఇప్పుడు టీడీపీ పైనే పవన్ రివర్స్ అవ్వడంతో.. పవన్ పై మండిపడుతున్నారు. పవన్ పై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడుతున్నారు. చూద్దాం మరి ఈ పోరు ఎంతు వరకూ వెళుతుందో...

జగన్ తో పాటు మోడీని కూడా ఏసుకున్నారుగా...!

  ఎప్పుడూ సహనంగా ఉండే చంద్రబాబుకు కోపం వచ్చినట్టుంది. అందుకే అసెంబ్లీలో మోడీ నుండి మొదలు పెట్ట జగన్, విజసాయిరెడ్డిన ఏకిపారేశారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు చంద్రబాబు మోడీపై ఒకింత అసహనంతో ఉన్నారు. అంతేకాదు బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు పొత్తుకు సిద్దంగా ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వీటిపై స్పందించిన చంద్రబాబు.. వైసీపీ తో మాకు పొత్తు లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు సరే.. మరి ఏ1, ఏ2 లు ప్రధానమంత్రి దగ్గరకు ఎందుకు వెళుతున్నారు.. అసలు ఆర్దిక నేరగాళ్లు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అంతేకాదు... ఇదే విషయాన్ని నేను ప్రధానినే అడిగాను అని కూడా అన్నారు. బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న నాకే రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరిని ఎన్నుకున్నారో తెలియలేదు.. కానీ నాకంటే ముందుగానే వైసీపీ నేతలకు ఎలా తెలిసింది..? బీహార్ గవర్నర్ గా కోవింద్ దగ్గరకు విజయసాయిరెడ్డి అందరికంటే ముందు వెళ్లి అభినందనలు ఎలా చెప్పారు.. ఆ తరువాత ఎప్పటికో నాకు తెలిసింది.. ఆహా ఎంత పవర్ లాబీయింగ్ అని సెటైర్ వేశారు.   ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాటం చేస్తుంటే... మరోపక్క మోడీపై నమ్మకం ఉంది.. మోడీ ప్రత్యేక హోదా ఇస్తారని అంటారు.. ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు... అలాంటిది.. వైసీపీకి అంత నమ్మకం ఎలా ఉంది... అవిశ్వాస తీర్మానం పెడతామంటారు.. దానికి మా మద్దతు కావాలంటారు.. ఇలాంటి కుట్రలతో ప్రజలను మోసం చేయలేరు.. కుట్రలు చేసేవారు శాశ్వతంగా నష్టపోతారు అని అన్నారు. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు... అటు జగన్ ను తిడుతూనే... ఇన్ డైరెక్ట్ గా మోడీకి కూడా బాగానే సెటైర్ వేసినట్టు ఉంది చంద్రబాబు.