ఆ విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే..

  జనసేన పవన్ కళ్యాణ్ కు అన్ని విషయాల్లో ఏమో కానీ కొన్ని విషయాల్లో మాత్రం బాగానే క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అదేంటంటే... పార్టీలోకి ఎవరిని తీసుకోవాలీ అన్న విషయంలో. దీనికి కారణం కూడా లేకపోలేదు. తన అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఎవర్ని పడితే వాళ్లని పార్టీలోకి తీసుకొని.. చుట్టు పక్కల వాళ్ల మాటలు విని చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఆ తప్పు పవన్ చేయకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవర్ని పడితే వాళ్లని కాకుండా.. కాస్త సెలెక్టివ్ గా అందర్నీ ఎంపిక చేసుకుంటున్నాడు. ఆఖరికి కుటుంబసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడంటేనే అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుటుంబ సభ్యులు తన పార్టీల్లోకి రావడంపై కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   నిజానికి పవన్ కుటుంబ సభ్యులకు పవన్ అంటే ఎంత ఇష్టమో.. ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో బాబాయ్ పిలవాలే గానీ, మైక్ పట్టుకుని జనసేన తరపున ప్రచారం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధం అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామెంట్ కూడా చేశాడు. ఇక అన్నయ్య నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన తరపున బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో.. ఈ విషయంపై పవన్ ను అడగ్గా... దానికి పవన్ నుండి సమాధానం లభించింది. ‘ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేతప్పా తన కుటుంబ సభ్యులను రమ్మని గానీ, ప్రచారం చేయమని గానీ అడగబోనని’ స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ పార్టీలోకి వస్తానని చెప్పినా, ఒకటికి పది సార్లు ఆలోచించుకోమని కోరుతానని, రాజకీయాల్లోకి రావడం అంటే చాలా నిబద్దతో కూడుకున్న వ్యవహారం అని, ఇష్టపడి రావాలి తప్ప బలవంతంగా తీసుకురాకూడదని అన్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు.. వారినెందుకు ఇబ్బంది పెట్టడం అని తాను భావిస్తానని, ఇంతకుమించి తానేమీ చెప్పలేనని అన్నారు. దీంతో మొత్తానికి ప్రజారాజ్యం పార్టీలో జరిగింది ఓ ఎక్స్ పీరియన్స్ అయినట్టుంది. అందుకే పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో.. వద్దో అని క్లారిటీగానే ఉన్నారు అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఈ ఒక్క విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. రాజకీయాల్లోకి ఇష్టపడి రావాలి తప్పా, తాను ఆహ్వానించడం జరగదని చెప్పడం, పవన్ ఆలోచనా తీరుకు అద్దం పడుతోంది అని అంటున్నారు.

బ్యాంకులు, ప్రభుత్వాలు... మధ్యలో సామాన్యుడు!

  బాలు.. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఆమధ్య నాలుగైదు ఏటీఎంలు తిరిగి తెచ్చుకున్న అయిదువేలు ఖర్చయిపోయాయి. ఎలాగొలా మళ్లీ ఏటీఎం దగ్గరకి వెళ్లాలనుకుంటూ ఉండగానే ఓ వార్త కంటికి కనిపించింది. మే 30, 31న జాతీయ బ్యాంకులలో పనిచేసే పదిలక్షలమందికి పైగా ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారన్నదే ఆ వార్త. తమ డిమాండ్లకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదన్నదే వారి ఆరోపణ. సరే! అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాటిని వ్యక్తపరిచే హక్కూ ఉంటుంది. కానీ కోట్లాది మంది బడుగు జీవులకి జీతాలు చేతికందే వేళ సమ్మెకి దిగడం ఎంతవరకు మానవత్వం!   ఇప్పటికే ఏ సంస్థలకీ లేని విధంగా బ్యాంకులకు వరుసపెట్టి సెలవలు వచ్చేస్తుంటాయి. వాటికి తోడు శనివారాలు సెలవనీ ప్రకటించేశారు. బ్యాంకు దాకా వెళ్తే కానీ ఆ రోజు బ్యాంకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. వెళ్లాక పని జరుగుతుందో లేదో అనుమానం. ఇలాంటి పరిస్థితి మధ్య బ్యాంకు ఉద్యోగులకి, తమ అసంతృప్తిని తెలియచేసేందుకు సమ్మె తప్ప మరో మార్గం కనిపించలేదా! ఈ దేశంలో పని మానేయడం ఒక్కటే, అసంతృప్తిని తెలియచేసే మార్గంగా స్థిరపడిపోయిందా!   చాలా ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ప్రభుత్వరంగంలో వేతనాలు, సౌకర్యాలు, ఉద్యోగ భద్రతా ఎక్కువే! తమ డిమాండ్లను సాధించుకునేందుకు అక్కడ యూనియన్లు కూడా చాలా బలంగా ఉంటాయి. కానీ బ్యాంకులు ఇలా చటుక్కున సమ్మెకి దిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరోవైపు ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా ప్రవర్తించినా చెల్లిపోతుంటుంది. అక్కడ సమ్మె చేసే ధైర్యం కానీ, దానికి మద్దతు పలికే నైతిక బలం కానీ చాలా తక్కువగా ఉంటాయి. మన దేశంలో... ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కనిపించే ఈ వ్యత్యాసం చాలా దారుణం!   ఇక తమ సంస్థలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సిబ్బంది ఎందుకు దాన్ని సమ్మెతో సవరించే ప్రయత్నం చేయరన్నది సామాన్యులకి కలిగే మరో ప్రశ్న. ఒకప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మూలస్తంభంగా నిలిచేది. ప్రపంచవ్యప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా, మన దేశం స్థిరంగా ఉండటానికి కారణం ఆ వ్యవస్థే! కానీ నేషనలైజేషన్‌ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడూ లేనంత దుర్బలంగా ఉందని ఎవరో నిపుణుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి పెద్ద నోట్ల రద్దు లాంటి ప్రభుత్వ నిర్ణయాలతో పాటు యాజమాన్య వైఫల్యం కూడా ఓ కారణమే! ఈ వైఫల్యాల మీద ఏనాడూ బ్యాంకు దిగువ సిబ్బంది తగినంత గొంతుకని వినిపించనేలేదు!   సామాన్యుల దగ్గర ఒకప్పటి షావుకారులాగా రూపాయికి రూపాయి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు... బడాబాబుల దగ్గర సాగిలపడుతున్నాయి. ‘ఇస్తే ఇవ్వండి లేకపోతే మొండి బకాయిలలో రాసుకుంటామని’ ఆఫర్ చేస్తున్నాయి. దీనికి NPA (non performing assets) అని ఓ ముద్దు పేరు పెడుతున్నాయి. DENA బ్యాంకులో ఈ NPAలు ఇచ్చిన అప్పులలో నాలుగో వంతు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. NPAలను స్పష్టంగా చూపించాన్న రిజర్వ బ్యాంక్‌ సూచనే ఇందుకు కారణం అయినప్పటికీ... గత ఐదేళ్లలో బడా బాబులకి ఇచ్చే రుణాలలో అవినీతి పెరిగిపోయిందన్నది జగమెరిగిన సత్యం.   బ్యాంకు ఉద్యోగులకి మాత్రం ఇవేవీ పట్టలేదు. NPAలతో సంబంధం లేకుండా తమ జీతాలు పెంచాలని వాళ్లు కుండబద్దలు కొట్టేశారు. తగినంత పెంచనందుకు నిరసనగా సమ్మెకు దిగేశారు. ఈ సమ్మె వల్ల ఉద్యోగులకి లాభం జరిగితే మంచిదే! కానీ ప్రజలకి జరిగిన నష్టానికి ఎవరు ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నించినా సమాధానం వస్తుందా!

మాట్లాడే హక్కు లేదంటున్న షా...ప్రశ్నించడానికి మీరెవరంటున్న బాబు..

ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా మిత్రపక్షంగా బీజేపీ-టీడీపీ విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇక విడిపోయిన దగ్గరనుండి రెండు పార్టీల నేతల పోటీ పడి మరీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. ఏపీకి మేము అంతిచ్చాం... ఇంతిచ్చాం... అని ఒకపక్క బీజేపీ మొత్తుకుంటుంటే.. అసలు మీరు మాకు ఏం ఇచ్చారయ్యా బాబు అంటూ బీజేపీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి అమిత్ షా.. చంద్రబాబు నువ్వా నేనా అన్నట్టుగా విమర్సలు గుప్పించుకున్నారు.   ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 2,100 కోట్లను ఇచ్చిందని, వాటి లెక్కలు ఇంతవరకూ కేంద్రానికి చేరలేదని, ఆ పరిస్థితుల్లో మరిన్ని డబ్బులు ఎలా ఇస్తారని అడిగారు. ఒక్క భవన నిర్మాణానికైనా టెండర్లు పిలిచారా? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు కావని అన్నారు. చంద్రబాబు పలు సార్లు రాజధాని నిర్మాణం కోసమంటూ తయారుచేయించిన డిజైన్లన్నీ నేటికీ సింగపూర్ దగ్గరే ఉన్నాయని... ఇప్పటికీ సింగపూర్ ను దాటి బయటకు రాలేదని విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబుకు గుజరాత్ లో అభివృద్ధి చెందిన నగరాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గుజరాత్ నగరాలన్నీ రాష్ట్ర నిధులతోనే అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఏపీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లనున్నామని, కొత్త మిత్రపక్షాలేమీ ఉండబోవని స్పష్టం చేశారు.   ఇక షా చేసిన విమర్శలపై స్పందించిన చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎపీ ప్రభుత్వం యుటిలిజైషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని అమిత్ షా చెప్పడం సరికాదన్నారు. అసలు అమిత్ షా ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడని, ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అమరావతిలోని రాజధాని భవనాలకు తాము ఇప్పటికే టెండర్లు పిలిచామని.. వివరాలు తెలియకుండా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అసలు ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.. అయినా యూసీల విషయంలో ప్రధాని అడిగితే తాను సమాధానం చెబుతానని, వాటి గురించి అడగడానికి అమిత్ షా ఎవరిని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఏకంగా చంద్రబాబు షాకి వార్నింగ్ ఇవ్వడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని కీలక మలుపులు చోటుచేసుకుంటాయో..

ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం.. కమ్మ కులంలో చెడపుట్టారు..

  టీటీడీపీ నేత మోత్కుపల్లి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడిపై విమర్సలు కురిపించారు.తనను గవర్నర్ చేస్తానని, రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత మోసం చేశారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉన్నానని... ఇప్పుడు కనీసం మహానాడు కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వాపోయారు. ఎన్టీఆర్ పార్టీకి తనను దూరం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆయన... కన్నీటిపర్యంతం అయ్యారు.   ఎన్టీఆర్ ఆశీర్వాదం వల్లే తాను రాజకీయాల్లో ఉన్నానని...తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు పాలించే అర్హత కూడా లేదని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జయంతికి కాని, వర్ధంతికి కాని ఘాట్ వద్దకు వచ్చి చంద్రబాబు ఎప్పుడైనా నివాళి అర్పించారా? అని ప్రశ్నించారు. అంతేకాదు... టీడీపీ బాగుండాలంటే ఎన్టీఆర్ వారసులకు పార్టీని అప్పగించాలని...ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్రలు చేశారని.. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.

రాహుల్ బలే కౌంటర్ ఇచ్చాడుగా.. బీజేపీ ఎక్కువ కష్టపడొద్దు..

  కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి రాహుల్ గాంధీ కాస్త హుషారైనట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ అంటే అమూల్ బేబి, పప్పు, ఇంకా ఇలా ఎన్నో ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకునేవాళ్లు విపక్ష నేతలు. కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ కాస్త రూట్ మార్చారు. ఏకంగా మోడీ పైనే ఘాటుగా విమర్శలు చేస్తూ నేను పప్పు ఏం కాదని నిరూపించారు. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తుండటంతో... రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కూడా కాస్త మార్పు వస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి. అంతేనా...ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది.   ఇక ఇప్పుడు తాజాగా మరోసారి రాహుల్ గాంధీ బీజేపీకి చురక అంటించారు. గతంలో రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ కనిపించడం లేదంటూ  పోస్టర్లు వేయడం, కామెంట్లు చేయడం చేస్తుండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ప్రతిపక్షనేతలకు ఇవ్వాలనుకోలేదు రాహుల్. అందుకే ముందుగానే బీజేపీ నేతలను ఉద్దేశించి చురకలు అంటించారు. అమ్మను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్నానని... కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండనని..ఈ సందర్భంగా బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి ఒక విన్నపం చేస్తున్నానని... తనను విమర్శించడానికి ఎక్కువగా కష్టపడవద్దని, త్వరలోనే తిరిగి వస్తానని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ బాగానే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి తనపై కామెంట్లు చేసే అవకాశం ఇవ్వలేదు.

ఉద్దానంపై చంద్రబాబు.. పనిచేసేవాళ్లపై విమర్శలా..

  శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని... కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని..లేకపోతే దాను నిరాహారదీక్షకు దిగుతానని డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలసిందే. అయితే ఆ గడువు ముగియడంతో. పవన్ నిరాహార దీక్షకు దిగిన సంగతి కూడా విదితమే. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో నిన్న సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షకు దిగారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష కొనసాగుతుంది.   అయితే ఇప్పుడు దీనిపై చంద్రబాబు స్పందించినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థులని ఆదుకుంటున్నామని..ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "క్రానిక్ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనడానికి పరిశోధన మొదలైంది. ఉద్ధానం ప్రాంతంలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులకు సంబంధిత శిక్షణను అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న వారికి దగ్గరలోనే డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యాన్ని చేరువ చేస్తున్నాం. శ్రీకాకుళం రిమ్స్‌లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, పాలకొండ ఏరియా ఆసుపత్రిలో 5, పలాస సామాజిక ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12 డయాలిసిస్ మిషన్లను ఏర్పాటు చేశాము. ఉద్ధానం సమస్యపై ప్రత్యేక చొరవతో కార్యక్రమాలు చేపడుతున్నాము. గత ఏడాది జనవరి నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉద్ధానం 7 మండలాల్లోని 176 గ్రామాల్లో స్క్రీనింగు నిర్వహించి 1,01,593 మందిలో రుగ్మతలను గుర్తించారు. వారిలో 13,093 మందిని కిడ్నీ సంబంధిత వ్యాధి పరీక్షలకు సిఫారసు చేశారు" అని చంద్రబాబు అన్నారు.   అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా రోగుల నుంచి నమూనాలు సేకరించామని.. 13వేలమందికిపైగా క్రమం తప్పకుండా చికిత్స జరుగుతోందన్నారు. ప్రతి నెలా 2761మంది పేషంట్లకు రూ.రూ.2,500 పింఛన్ ఇస్తున్నామని.. రూ.17కోట్లతో 7 ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులకు ప్రతి 15 రోజులకు ఒకసారి నెఫ్రాలిజిస్టు ద్వారా వైద్య సేవలు కూడా అందుతున్నాయని చెప్పారు. ఇక 5 డయాలసిస్ సెంటర్లలో.. 50 మిషన్ల ద్వారా 3 సెషన్లు పని చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ రోగులకు పింఛన్లు ఇష్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు బాబు. ఉద్ధానం బాధితుల్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు ఎవరూ పట్టించుకోలేదని..గత ప్రభుత్వాలు ఇలాంటి సేవలు చేశాయా... పనిచేసే వారిని విమర్శిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు... మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూద్దాం...

సీఎం అనాలా? లేక బావగారు అనాలా..?

ఇటీవల విడుదలైన 'మహానటి' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కూడా ‘మహానటి’ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాల్‌లో ‘మహానటి’ చిత్రబృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్బంగా ఆయన  ‘మహానటి’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సావిత్రి జీవితానికి సార్థకత తీసుకురావాలనే పట్టుదలతో ఈ సినిమాలో కీర్తి సురేష్ బాగా నటించారని కొనియాడారు. సావిత్రి తన జీవితంలో పడిన కష్టాలకు ఈ సినిమా అద్దం పట్టిందని... కష్టాల్లో కూడా ఇతరులకు సహాయ పడాలనే సావిత్రి జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ‘మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు సంవత్సరాలు ‘మహానటి’ జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమాను తీసినందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెచ్చుకున్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకుందని చంద్రబాబు అన్నారు. సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావటం విశేషమని పేర్కొన్నారు.   అనంతరం చిత్ర యూనిట్ ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సన్మానించారు. ఇక తనకు సన్మానం అనంతరం సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం అనాలా? లేక బావగారు అని పిలివాలో’ తెలియడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ‘అక్కా’ అని పిలిచే దానినని చెప్పారు. చిత్రయూనిట్ ని సన్మానించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నికల నాటికి రాహుల్‌ పుంజుకుంటాడా!

ఒకప్పుడు రాహుల్ గాంధి ఓ అనామకుడు. ప్రజల దృష్టిలో తల్లి చాటు బిడ్డ, ప్రతిపక్షాల విమర్శలలో పప్పు. రాహుల్‌ గాంధి కామెడీ అని కొడితే యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు కనిపించేవి. ఇక మోదీ అయితే చెప్పనే అక్కర్లేదు. ‘కొంతమందికి బాదం పప్పులు తిన్నా బుద్ధి పెరగదంటూ’ రాహుల్‌ని గడ్డిపోచలా తీసిపారేసేవారు. కానీ నిరంతరం శత్రువు మీదే ధ్యాస పెడితే, ఆ శత్రువుకి బలాన్ని అందిస్తూ మనం బలహీనులం అయిపోతామన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు మోదీ! పిల్లవాడిని రెచ్చగొట్టి పరిగెత్తించే తల్లిలాగా రాహుల్‌లో కసిని పెంచారు. ఫలితం ఇప్పుడు రాహుల్‌ పట్ల ప్రజాభిప్రాయంలో కాస్త మార్పు వస్తోంది. రాహుల్‌ ప్రసంగాలలో కాస్త పరిణతి, దూకుడు కనిపిస్తోంది. ఇక అతని ట్వీట్లు ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారుతున్నాయి.ఇంతకుముందు ప్రభావవంతమైన నేతల జాబితాలో ఎక్కడో కనిపించేవాడు కాస్తా ఇప్పుడు, మోదీ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు మోదీ స్థానం మాత్రం ఓ రెండడుగులు దిగజారినట్లు సర్వేలలో తెలుస్తోంది. మైనారటీల మీద దాడులు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు కుంభకోణాలు, నిరుద్యోగం... లాంటి సవాలక్ష సమస్యలు ఇప్పుడు మోదీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ మంటల్ని మరింతగా రగులుస్తూ పెట్రోలు ధరలు ఎలాగూ పెరుగుతున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇవన్నీ ప్రతిబంధకాలే! డైనమిక్‌ నేతగా ప్రతి విషయం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మోదీ సమస్యల మీద నోరెత్తకపోవడం కూడా ప్రజల్ని అసహనానికి గురిచేస్తోంది. ఒకవేళ ఏదన్నా సమస్య గురించి మాట్లాడినా, దానికి యాభై ఏళ్ల నాటి నెహ్రూ పాలనే కారణం అని చెప్పడం మరింత చిరాకు తెప్పిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. తెరాస పాలనలో లోటుపాట్లు ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నారనే నమ్మకంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఆంధ్రలో పెద్దగా అభివృద్ధి జరగకపోయినా, దానికి కారణం బీజేపీ చేసిన ద్రోహమే అన్న కసితో అక్కడి ప్రజలు ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇలాంటి స్థానిక పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే లోక్‌సభ్‌ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్దగా లాభపడకపోయినా... ప్రాంతీయ పార్టీలు మాత్రం బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో కనిపించిన దృశ్యమే వచ్చే జాతీయ ఎన్నికలలో పార్లమెంటులోనూ కనిపించవచ్చు. అప్పుడు ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారనేదాని మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకప్పుడైతే ఇలాంటి సందర్భాలలో మోదీ- షా ద్వయం వేసే ఎత్తులదే పైచేయిగా ఉండేది. కానీ కర్ణాటకలో రాహుల్ చూపిన సమయస్ఫూర్తితో, ఒకప్పటి పప్పుని అంత తేలికగా అంచనా వేయడానికి లేకుండా పోయింది. ఏకు మేకవడం అనే సామెత రాజకీయానికి అతికినట్లు సరిపోతుందేమో!

పూనమ్ సంచలన కామెంట్లు... జల్సా చూపిస్తాడు.. అజ్ఞాతవాసంలో వేస్తాడు..

  నిన్నటి వరకూ శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లు సినీ పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల నుండి ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఓ రకంగా దీనంతటికీ పవన్ కళ్యాణే కారణమని చెప్పొచ్చు. మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. మీడియా కూడా కాస్త వెనక్కి తగ్గి.. అదే పనిగా డిబెట్లు పెట్టడం ఆపేశారు. ఇక డిబెట్లు లేకపోవడం.. ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల సోషల్ మీడియాకు కూడా పెద్దగా వార్తలు లేకుండా పోయాయి. అయితే మరోసారి నెటిజన్లకు మంచి న్యూస్ దొరికింది. ఈసారి ఈ న్యూస్ కు కారణమయ్యింది ఎవరో కాదు పూనమ్ కౌర్.   నిజానికి అందాల కథానాయికే అయినా టాలీవుడ్ లో సరైన హిట్ కొట్టి నిలబడలేకపోయింది పూనమ్ కౌర్. ఫేడవుట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ ఇష్యూతో వెలుగులోకి వచ్చింది. కత్తి మహేశ్ పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో పవన్ సపోర్ట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ఆ తరువాత పూనమ్ కౌర్ ను ఉద్దేశించి కూడా కత్తి మహేశ్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనమ్ కౌర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని రోజులు ఈ విషయంపై చర్చలు జరిగినా... ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా తన ట్విట్టర్లో ఒక స్టార్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి ఈ భామ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జల్సాలు చూపిస్తూ.. అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త... నమ్మకద్రోహి అని పూనమ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు... ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటూ... ఎన్నారై హీరోయిన్లను అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాడు... నాకు హిట్లు లేవనే సాకులు చెప్పి... ఆ ఎన్నారై హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఎన్నారై హీరోయిన్ కు హిట్లు ఉన్నాయా..? ఆ ఎన్నారై హీరోయిన్ మీరు ఏ పని చెప్పినా చాలా శ్రద్దగా చేస్తారట... నేను విన్నాను.. అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే మంచిది అంటూ పూనమ్ తన ట్విట్టర్లో చాలా ఘాటుగానే కామెంట్లు విసిరింది. ఇక పూనమ్ కామెంట్లు చేసిన ఆ దర్శకుడు కూడా ఎవరికో దాదాపు క్లారిటీ వచ్చింది. మరి ముందు ముందు పూనమ్ ఇంకెంత మంది గురించి ఇలా కామెంట్లు చేస్తుందా.. లేకపోతే...దీంతో ఆపేస్తుందా చూద్దాం ఏం జరుగుతుందో..

దీదీ దెబ్బకి డీజీపీ బదిలీ...

  కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమానికి వచ్చిన మమతా బెనర్జీ.. విధాన సౌధకు వెళ్లే దారిలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కారు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొంతదూరం నడిచి విధాన సౌధకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రాగానే డీజీపీ నీలమణిపై విరుచుకుపడ్డారు. వేదికపైనే డీజీపీకి చీవాట్లు పెట్టారు. అంతేకాదు... అదే ఆవేశంతో దేవెగౌడకు ఫిర్యాదు చేశారు. ఇకేముంది...ట్రాఫిక్ నిర్వహణ తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి మమత నుంచే ఫిర్యాదు రావడంతో తక్షణం నివేదిక సమర్పించాల్సిందిగా సీఎం కుమారస్వామి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షం కారణంగానే సమస్య తలెత్తిందని, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కార్లు ఒక్కసారిగా విధాన సౌధ ప్రాంగణానికి రావడంతో ఇబ్బంది తలెత్తిందని డీజీపీ తెలిపారు. ఆఖరికి మమతా బెనర్జీకి జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పవన్ కు బాబుకు అక్కడే చెడిందట..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్సల తీవ్రత పెంచారు. గత ఏడాది ఈ టైంలో టీడీపీ-జనసేన కలిసే ఉన్నాయి. కానీ ఏడాదికి వచ్చే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. నిన్నటి వరకూ మిత్రులు అనుకున్నవాళ్లే ఇప్పుడు శత్రువులుగా తయారయ్యారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున టీడీపీని విమర్శించి అందరికీ షాకిచ్చారో ఆ రోజు నుండి ఏదో ఒక సందర్భంలో టీడీపీపై చంద్రబాబు పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ మాత్రమే చంద్రబాబు ను తిట్టేవాడు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి చంద్రబాబే కారణమంటూ టైం దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శలు గుప్పించేవాడు. ఇక ఇప్పుడు పాదయాత్ర నేపథ్యంలో మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేశారనుకోండి. అది వేరే విషయం. అయితే ఇప్పుడు పవన్ జగనే మించి పోయాడు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంలో జగన్ కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పవన్ శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఏకంగా  తనపై దాడి చెయ్యడానికి ముఖ్యమంత్రి కిరాయిగూండాలను పంపించారు అని అభియోగించారు. చంద్రబాబు బద్దశత్రువులు కూడా ఎప్పుడు ఇటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబుపై పవన్ ఇంతలా విమర్శలు చేయడానికి కారణం ఏంటీ.. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది అన్న చర్చల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. జనసేన టీడీపీ పొత్తు చర్చలు విఫలం అవ్వడమే దీనికి కారణం అంటున్నారు. టీడీపీని జనసేన 50 సీట్లు అడగగా, చంద్రబాబు కేవలం 16 ఇస్తా అన్నారట. దీనిని పవన్ కళ్యాణ్ అవమానంగా ఫీల్ అయ్యారట పవన్. అందుకే చంద్రబాబుపై పవన్ ఇంతలా విరుచుకుపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే నేను గెలవకపోయినా టీడీపీని ఓడిస్తా అని శబధం చేసి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారట. మరి ముందు ముందుపవన్ ఇంకెన్ని విమర్శలు గుప్పిస్తారో చూద్దాం... 

నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా కోహ్లీ...

విరాట్ కోహ్లీ ఛాలెంజ్ ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. విరాట్ కోహ్లీ ఏంటీ..? ప్రధానికి సవాల్ విసరడం ఏంటీ..?దాన్ని మోడీ కూడా స్వీకరించడం ఏంటీ.. అసలు మోడీకి కోహ్లీ విసిరిన సవాల్ ఏంటీ అనుకుంటున్నారా... ? అదేంటంటే... మోదీకి కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసిరాడు. అసలు సంగతేంటంటే...రెండు రోజుల క్రితం కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ అనే ఛాలెంజ్‌లో ఆయన స్వయంగా పుషప్స్‌ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దానితో పాటు రాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌, హృతిక్‌ రోషన్‌ కు ఈ ఫిట్‌నెస్‌ సవాల్ ను విసిరారు. దీంతో సైనా, హృతిక్‌ రోషన్‌ ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మరికొందరికి ఈ సవాలును విసిరారు. తాజాగా కోహ్లీ కూడా రాథోడ్‌ సవాలును స్వీకరించాడు. తాను కసరత్తులు చేసిన వీడియోను పోస్త్ చేస్తూ.. తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ధోనీ ఈ సవాలును స్వీకరించాల్సిందిగా కోరాడు. ఆశ్చర్యం ఏంటంటే.. కోహ్లీ సవాలుకు ప్రధాని మోదీ స్పందించారు. ‘నీ సవాలును స్వీకరిస్తున్నాను. త్వరలోనే నా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ వీడియోను పంచుకుంటాను’ అని తన మోదీ ట్విటర్‌లో తెలిపారు.

నన్ను ఏదైనా అంటే వెంకన్న ఊరుకోడు..

  తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇప్పటికే రమణ దీక్షితులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే  రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని, తనను అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని అన్నారు. అంతేకాదు పరమ పవిత్రమైన, దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, బీజేపీ పార్టీ అనుకున్నది ఎప్పటికీ జరగబోదని.. నేను దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని హెచ్చరించారు.   ఇంకా రమణ దీక్షితులు గురించి మాట్లాడుతూ.. "ఈయన (రమణ దీక్షితులు) కూడా ఈయనింట్లో వెంకటేశ్వరస్వామి పక్కనే రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలపైనా తాను టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని, అన్నీ బాగున్నాయని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో... దీనిపై కేంద్రం ఏం స్టెప్ తీసుకుంటుందో చూద్దాం..

కుమారస్వామి పదవి ఎన్నాళ్లుంటుందో!

  కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యులంతా సంబరపడిపోతున్నారు. కానీ ఈ సంబరాలు ఎన్నాళ్లు నిలుస్తాయన్నదే అసలు ప్రశ్న. అందుకు కుమారస్వామే కారణం. అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడకైనా సిద్ధపడతారన్నది కుమారస్వామి మీద ఉన్న ఓ ఆరోపణ. ఆయన గతాన్ని చూస్తే, ఈ ఆరోపణని ఏమంత తేలికగా కొట్టి పారేయలేం అనిపిస్తుంది. 2004లో కర్ణాటకలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిలాగానే అది కూడా జేడీఎస్- కాంగ్రెస్ పొత్తుతోనే ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కుమారస్వామి తన తండ్రిని సైతం కాదని 2006లో ప్రభుత్వాన్ని కూలదోశాడు. అంతటితో ఊరుకోలేదు. బీజేపీతో కలిసి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఆ ప్రభుత్వంలో జేడీఎస్ తరపున 20 నెలలు కుమారస్వామి, 20 నెలలు బీజేపీ తరపున యడ్యూరప్ప ముఖ్యమంత్రులుగా ఉండాలన్నది ఒప్పందం. కానీ తన పదవీకాలం ముగియగానే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు. ఆ నిర్ణయమే 2014 ఎన్నికలలో బీజేపీకి లాభించి యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం మీద ఇంత మోజు ఉండబట్టే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అతనికే సీఎం పదవిని వదులుకుంది. ఇక సిద్ధరామయ్యతో కూడా కుమారస్వామిది ఉప్పూనిప్పూ వ్యవహారమే! ఒకప్పుడు సిద్ధరామయ్య దేవగౌడకి వీరవిధేయుడిగా ఉంది అన్ని సందర్భాలలో చేదోడుగా నిలిచాడు. కానీ కుమారస్వామి రాకతో అతని ప్రాధాన్యత తగ్గిపోవడమే కాకుండా పార్టీ నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఎన్నికల ముందు వరకూ సిద్ధరామయ్య కుమారస్వామి మీదా, కుమారస్వామి సిద్ధరామయ్య మీదా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు బీజేపీ కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎలాగొలా అస్థిరపరచాలనే ఆలోచనలో ఉండక మానదు. మోదీ- షా ద్వయం తమకు జరిగిన గర్వభంగాన్ని అంత తేలికగా మర్చిపోతారనుకోలేం. ఇన్ని పడగల నడుమ కుమారస్వామి ప్రభుత్వం నిండు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించగలదా అన్నదే కోటి రూపాయల ప్రశ్న!

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బూచాడి భయం

    వాళ్లు మనకి అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారు. ఎవరన్నా మనుషులు ఒంటరిగా కనిపిస్తే దాడి చేస్తారు. ఆ తర్వాత అతని మెదడుని ఒలుచుకుని తినేస్తారు. ఇదేదో ఇంగ్లిష్‌ హారర్‌ మూవీ కాదు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న బూచాళ్ల భయం. బీహార్‌ నుంచి వచ్చిన కొంతమంది సైకోలు ఇలా దాడులకు పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా వాట్సప్‌లో సందేశాలు వ్యాపిస్తున్నాయి. దాంతో చాలా గ్రామాల్లో పిల్లలను గదుల్లో ఉంచి తాళం వేసేస్తున్నారు. కొత్తవాళ్లు ఎవరన్నా కనిపిస్తే చితకబాదేస్తున్నారు. వింతగా ఎవరు ఉన్నా వెంటపడుతున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి తిరిగి ఊరూరా తిరిగి ప్రజలను సముదాయించాల్సి వస్తోంది. తమిళనాడులో ఇలాగే ఓ కారులో దిగినవారిని, పిల్లలు ఎత్తుకుపోయేవారుగా స్థానికులు అనుమానించారు. ఈ విషయాన్ని వాట్సప్‌లో షేర్‌ చేసుకుని, ఊరు బయట వాళ్లని అడ్డగించారు. అమాయకులం అని మొత్తుకున్నా వినకుండా వాళ్లలో ముగ్గురిని కొట్టి చంపేశారు. బూచాడి భయంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పోలీసులు భయపడుతున్నారు. అందుకే ఓ పక్క బూచాడి భయం లేదని బుజ్జగిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించాల్సి వస్తోంది. మనిషి సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా, ఆలోచన మాత్రం ఆటవిక స్థాయిలోనే మిగిలిపోతే ఎలా ఉంటుందో బూచాడి భయం మరోసారి నిరూపిస్తోంది. వెర్రితనానికి వాట్సప్‌ తోడై విచక్షణను మంటకలిపేస్తోంది.

"జనసేన"లోకి సుజనా.. అందుకే ఇలా..!

  గత కొద్దిరోజులుగా సుజనా చౌదరి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పదవికి తాను ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటినుండి  ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే 'సుజనాచౌదరి' పవన్‌ కళ్యాణ్‌ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే..దీనికి సంబంధించి...చర్చలు పూర్తి అయ్యాయని...ఆయన త్వరలో అధికారికంగా 'జనసేన' పార్టీలోకి చేరతారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. నిజానికి తన పదవికి రాజీనామా చేసిన తరువాత సుజనాచౌదరి పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలా పాల్గొనటంలేదనే చెప్పొచ్చు. టిడిపి కార్యక్రమాల్లో 'సుజనా' మొక్కుబడిగా పాల్గొంటున్నారు.ఏ కార్యక్రమంలోనూ..ఆయన పాల్లోవడం లేదు. టిడిపి విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలోనూ 'సుజనా' పాల్గొనలేదు. ఇక తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏదో నామ్ కే వాస్త్ పాల్గొని చంద్రబాబు రాకముందే ప్రసంగించి... ఆయన రాకముందే వెళ్లిపోయారు.   దీనికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపితో...పొత్తు తెంచుకోవడం 'సుజనా'కు ఇష్టం లేదట. వారితోనే కలసి వెళ్లాలనేది ఆయన ఉద్దేశ్యమట. కానీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. ఇంకా బీజేపీతో ఉంటే ఏపీ ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భావించి చంద్రబాబు వారితో తెగదెంపులు తెంచుకున్నారు. అందుకే సుజనా కాస్త అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నంత ఇంట్రస్టింగ్ గా పాల్గొనడం లేదట. ప్రస్తుతం తనకు సంబందించిన వ్యాపార విషయాలపై ఎక్కువ శ్రద్దపెడుతున్నారని, ఢిల్లీలో బిజెపి నాయకులతో కలసి తిరుగుతున్నారని... ఆయన పార్టీలో ఉండడం కష్టమేనని..ఓ సీనియర్‌ టిడిపి నేత వ్యాఖ్యానించారు. ఇక ఆయన మాటలను నిజం చేస్తూ... .'సుజనా' 'జనసేన' పార్టీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలోకి ఆయన వెళ్లలేరు...అందుకే 'జనసేన'ను ఎంపిక చేసుకున్నారని... ఇప్పటికే..తనకు చెందిన ఛానెల్‌ను..'జనసేన'కు అనుకూలంగా మార్చారని...'ప్రస్తుతం 'పవన్‌' సభలకు, కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

శ్రీకృష్ణుని ఆలయంపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం....

పాకిస్తాన్ లో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంపై ఆదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. అదేంటంటే..  రావల్పిండి, ఇస్లామాబాద్‌ జంటనగరాల్లో పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఉంది ఒక్కటే. శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రావిన్స్‌ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్‌ పేర్కొన్నారు.   కాగా 1897లో కంజీమాల్, రామ్‌ రచ్‌పాల్‌ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్‌ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి  కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు.

యాడ్యురప్ప బేరసారాలు.. బయటపెట్టిన కాంగ్రెస్

ఇప్పటికే కర్ణాటకలో బలపరీక్షలో ఏం జరగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక బలపరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్ది కొత్త కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ నేతలపై బేరాసారాలకు దిగిన ఆడియో టేపులు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆడియో టేపులను బయటపెడుతోంది. ఆడియో టేపులో ఉందంటే.. యడ్యూరప్ప: ఎక్కడున్నారు? పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం. యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్. పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి. యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం. పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా. పాటిల్: అలాగే అన్నా. యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు? పాటిల్:  మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా.

కర్ణాటకలో బీజేపీ నెగ్గేస్తుందా!

  ఇప్పుడు దేశం అంతా కర్ణాటక వైపే చూస్తోంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎన్ని మెలికలు తిరుగుతోందో గమనిస్తోంది. మోదీ ప్రచారం పుణ్యమా అని బీజేపీ 100 మార్కుల దాటేసింది. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 8 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీనికి తెలుగువారి ఓట్లే కారణం అన్న చర్చ లేకపోలేదు. అయినా బీజేపీ పెద్దలు ప్రజా తీర్పుని ఆమోదించే పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలనే పట్టుదలతో వారు సామదానబేధదండోపాయాలను అమ్ములపొదిలోంచి బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిబిరం నుంచి జంప్‌ అయిపోయినట్లు వార్తలు వచ్చేశాయి. మరికొంతమంది తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు గాలిలాంటి దళారులు రంగంలోకి దిగారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే పక్షపాతిగా పేర్కొన్న బోపయ్యను స్పీకర్‌గా నియమించడం మరో ఎత్తు. బోపయ్య యడ్యూరప్పకు వీరవిధేయుడు. యడ్యూరప్పను కాపాడేందుకు ఉచ్చనీచాలను పెద్దగా పట్టించుకోనివాడు. ఇలాంటి దశలో ఎలాగొలా తమను బోపయ్య కాపాడేస్తాడనే నమ్మకంలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. అప్పటికప్పుడు ఏదో ఒక వంకతో కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి పరిస్థితులను తిరగతిప్పేయడంలో బోపయ్య సిద్ధహస్తుడు. కొందరు ఎమ్మెల్యేలు గట్టు దాటినా, కొందరు గైర్హాజరైనా ఆయన పని మరింత సులువైపోతుంది. ఇలాంటి వాతావరణం మధ్య ఇవాళ తలపెట్టే కర్ణటక బలపరీక్షలో బీజేపీనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ తర్వాత మళ్లీ రచ్చ మొదలవ్వకా తప్పదు. సుప్రీం తలుపులు బాదకా తప్పదు! ప్రజాస్వామ్యానికి ఎన్ని కష్టాలో!