చంద్రబాబుతో కష్టం సార్... ఒప్పుకోవట్లేదు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు మధ్య ఉన్న విబేధాల గురించి తెలిసిందే. అసలు మోడీ చంద్రబాబుపై అంత కోపంగా ఉండటానికి ఓ రకంగా గవర్నరే కారణమని ఇటీవల పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి గవర్నర్ అన్నీ పక్కన పెట్టి చంద్రబాబును కలిశారు. ఊరకనే చంద్రబాబును కలవలేదులెండి. మోడీగారికి మధ్యవర్తిగా ఆయన రాయబారానికి వచ్చారు. అందుకే చంద్రబాబుతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు. ఇంతకీ గవర్నర్ ఏం చెప్పారంటే.. కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం.
చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.
ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా డ్రామాలాడుతోంది..విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారట. ఇక ఎంత చెప్పినా చంద్రబాబు వినకపోవడంతో చేసేది లేక, గవర్నర్ అక్కడి నుండి వెళ్ళిపోయారట.
మరి ఇక ఈ విషయాన్ని కేంద్రానికి చేరవేయాలి కదా. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ బయలుదేరారట. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు స్పీడ్ తగ్గించడానికి ఢిల్లీ పెద్దలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో చూద్దాం..