టీజీ టీడీపీని వీడుతారా..?

  తాజాగా కర్నూలు ఉస్మానియా కళాశాలలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మంత్రి లోకేష్‌ అనూహ్యంగా.. కర్నూలు పార్లమెంట్ మరియు కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు.. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి.. ఒక ఓటు మోహన్‌రెడ్డికి.. మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.. మోహన్‌రెడ్డిని శాసనభకు, బుట్టా రేణుకను లోక్‌సభకు పంపే బాధ్యత మీదే అని లోకేష్ అన్నారు.. ఇప్పుడిదే కర్నూల్ రాజకీయాల్లో చర్చకు తెరదీసింది.. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీలో చాలా గందరగోళం ఉంది.. 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు.. తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.. ఇప్పుడా అసెంబ్లీ సీటు నుంచి తన కుమారుడు టీజీ భరత్‌ను నిలబెట్టాలనుకుంటున్నారు.. కానీ వైసీపీ తరపున గెలిచిన.. ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.. అప్పటి నుంచి కర్నూలు టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది.. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి.. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి.. బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.. అయితే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది.. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.. ఎస్వీ మోహన్ రెడ్డికి రూట్ క్లియర్ చేయాడానికేనన్న ప్రచారం మొదట్లో సాగింది. అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్‌ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు.. మరి లోకేష్ తాజా ప్రకటనతో టీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.. తనయుడి భవిష్యత్తు కోసం టీడీపీని వీడతారు అనే భావన కూడా వ్యక్తమవుతోంది.. చూద్దాం ఏం జగురుతుందో.

మోడీజీ.. జమిలి ఎన్నికలు ఉన్నాయా? లేవా?

  ఒక దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది.. దానిలో భాగంగానే వచ్చే లోక్‌సభతో పాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయపడుతోంది.. అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎప్పుడో ప్రకటించింది.. కానీ బీజేపీ మాత్రం జమిలి దిశగా అడుగులు వేస్తుంది.. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది.. వాటిని కాదని బీజేపీ ఏకపక్షంగా జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేయదు.. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.. లా కమిషన్ కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా.. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ, సిఫార్సులు చేస్తూ వస్తోంది.. ఇప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది. లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో కొన్ని పార్టీలు మాత్రమే జమిలి ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి.. మెజారిటీ పార్టీలు వ్యతిరేకత తెలిపాయి.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జమిలి ముసుగులో ముందస్తు ఎన్నికలకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస, ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఎన్నికలు జరిపేందుకు తాము అనుకూలమని స్పష్టం చేసింది.. మరోవైపు తమిళనాడు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నదని, ఇలాంటి ఒక ఆలోచన లా కమిషన్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.. ఇది సమాఖ్య విధానానికి విఘాతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.. ఇక యూపీలోని సమాజ్‌వాది పార్టీ, బీహార్ లోని జేడీయూ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి.. మరో ప్రధాన పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ మాత్రం చాలా బలంగా తాము జమిలి విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.. వామపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.. అసలు జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ పరిధిలోనే ఉండదని, పూర్తిగా పార్లమెంట్‌కే ఆ అధికారం ఉంటుందని తెలిపాయి. 2019 ప్రారంభంలో లో పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని మోడీ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. 2024కు దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలి నిర్వహించాలనేది ఆయన ఆలోచన.. దాని ప్రకారమే ప్రస్తుతం, కసరత్తు నడుస్తోంది.. చివరిగా లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది.. మరి, కొన్ని పార్టీలకు ఇష్టంగా, కొన్ని పార్టీలకు కష్టంగా ఉన్న ఈ జమిలి ఎన్నికలను మోడీ ప్రభుత్వం కొన్ని పార్టీలను కష్టపెట్టి నిర్వహిస్తుందో లేక ఎప్పటిలానే ఎన్నికలకు వెళ్ళడానికి అంగీకరిస్తుందో చూడాలి.

పవన్ తో విడాకులు.. రేణూదేశాయ్ సంచలన వ్యాఖ్యలు.!!

  ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు రేణూదేశాయ్.. హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మనకి సుపరిచితురాలు.. పవన్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్న తరువాత.. పవన్ మరో పెళ్లి చేసుకొని ఆయన జీవితం ఆయన బ్రతుకున్నారు.. రేణూదేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఇన్నాళ్లు ఒంటరిగా బ్రతికారు.. కానీ ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్ళికి సిద్ధమయ్యారు.. ఇది జీర్ణించుకోలేని కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెని సోషల్ మీడియాలో బెదిరించడం మొదలుపెట్టారు.. దాంతో భయపడిన రేణూదేశాయ్ ఆమెకి కాబోయే భర్త వివరాలు వెల్లడించలేదు.. నిశ్చితార్థం అయిన విషయం మాత్రం వెల్లడించారు.. దీంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు.. ఆమె విడాకుల తరువాత ఎవరి లైఫ్ వారికి ఉంటుంది అని ఫ్యాన్స్ కి అర్ధమయేలా చెప్పే ప్రయత్నం చేసారు..  అయినా ఫ్యాన్స్ వినలేదు.. పవన్ కూడా రేణూదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్తూ పాజిటివ్ గా పోస్ట్ చేసారు.. వారు అభిమానించే పవన్ పోస్ట్ కూడా కొందరికి పట్టలేదు.. ఆమెని అలానే బెదిరిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.. ఆమె చాలావరకు సహనంగా ఉంటూ వచ్చారు.. ఇక లాభం లేదని ఒక ఇంటర్వ్యూ ద్వారా తన మనసులో ఉన్న బాధని, కోపాన్ని బయటపెడుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్నాను.. కానీ ఇక భరించలేను అని చెప్పిన రేణూదేశాయ్.. అసలు విడాకులు కావాలన్న కోరిక ముందుగా పవన్ కళ్యాణ్ వైపు నుంచే వచ్చింది, నేనెప్పుడూ డివోర్స్ అడగలేదు అని స్పష్టం చేసారు.. పవన్ కళ్యాణ్ గారి ఫిమేల్ ఫ్యాన్స్‌ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా..  మీరే ఆయన భార్యగా వుండి.. 11 సంవత్సరాలు కాపురం చేసి.. మీకు తెలీకుండా అతడు మరొకావిడతో బిడ్డను కంటే మీకు ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు.. పిల్లల కోసం పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అన్నారు.. అకీరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలవడం.. అకీరాతో పాటు పవన్ కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదు.. అందుకే వద్దన్నా అని తెలిపారు.. పవన్ ఫ్యాన్స్ విమర్శలు ఆపకపోవడం వల్లే ఇలా ఇంటర్వ్యూ ద్వారా నా గురించి చెప్పుకోవాలనిపించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే 'అమ్మాయిలూ గట్టిగా వుండండి.. ప్రేమ ముఖ్యమే..  కానీ ప్రేమే జీవితం కాదు.. ఎవ్వరూ ఆ మాయలో పడొద్దు' అని అన్నారు.. ఇన్ని రోజులు సహనంగా ఉన్న రేణూదేశాయ్ ఇలా మాట్లాడటానికి ఖచ్చితంగా పవన్ ఫ్యాన్సే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.. విడాకుల తరువాత పవన్ కి ఒక జీవితం ఉన్నట్టే, రేణూదేశాయ్ కి కూడా ఒక జీవితం ఉంటుందని అర్ధం చేసుకోకుండా ఆమె మీద విమర్శలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.. అలానే పవన్ కూడా రేణుదేశాయ్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, రేణుదేశాయ్ ని ఇబ్బంది పెట్టొద్దని ఒక్కమాట చెప్తే ఫ్యాన్స్ ఆగేవారు కాదా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పవన్ జగన్ కలిస్తే.. బాబు గెలుపే.!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి తన అభిప్రాయాలు వ్యక్తం చేసారు.. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు తన వల్లే గెలిచారని పవన్ మాట్లాడినందుకే, పవన్ పై ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు.. 1983 నుంచి 2014 వరకు అశోక్ గజపతిరాజు గెలుస్తూ వస్తున్నారు.. అప్పుడు కూడా అశోక్ గజపతిరాజును పవనే గెలిపించారా? అని సబ్బం ప్రశ్నించారు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని బతికించడం కోసమే వైసీపీ, జనసేన పార్టీలు కలుస్తాయని అభిప్రాయపడ్డారు.. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు.. బీజేపీ చెప్పినట్టు ఈ రెండు పార్టీలు చేస్తాయనడానికి గత నెలరోజులుగా ఈ పార్టీల నేతలు చేస్తున్న ప్రసంగాలే నిదర్శనమని విమర్శించారు.. 'వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పవన్ మాకు మద్దతిస్తానని చెప్పాడని ప్రకటన చేసారు కదా' అని సబ్బం గుర్తు చేసారు.. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిన కారణంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత.. ఏపీ ప్రజల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. అదే సమయంలో వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీని వ్యతిరేకించకపోవడాన్ని ఏపీ ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. జగన్, పవన్ కలిసి పనిచేస్తున్నారనే విషయం అందరికీ తెలుసని, రాబోయే రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.. అలా జరిగినప్పుడు మాత్రమే, చంద్రబాబుని ఎదుర్కోగలరనేది వారి అభిప్రాయమని అన్నారు.. అయితే జగన్, పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే, ఖచ్చితంగా టీడీపీయే గెలుస్తుంది.. కానీ వైసీపీ,జనసేన కలిసి పోటీచేస్తే కొత్త వ్యూహాలకు టీడీపీ వెళ్లాల్సిన అవసరముంది.. ఆ వ్యూహాలకు టీడీపీ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది అని సబ్బం హరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.  

జగన్ కొంప ముంచబోతున్న కాంగ్రెస్..!

విభజన అనంతరం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ఊసే లేదు.. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం వచ్చింది.. చాలావరకు నేతలంతా కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలలో చేరారు.. ఇక కొందరు నేతలైతే రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు.. 'రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసింది' అని విమర్శిస్తూ అప్పుడప్పుడు ఇతర పార్టీ నేతలు గుర్తు చేసుకోవడమే తప్ప, ఇంచుమించు ఏపీలో అందరూ కాంగ్రెస్ ని మర్చిపోయారు.. ఇక ఏపీలో కాంగ్రెస్ ఎప్పటికీ కోలుకోలేదు అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.. ఏపీ లో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీతో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తోంది..  ఇప్పటికే పార్టీని వీడిన సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.. రేపో మాపో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. వీరి చేరిక వల్ల 'కార్యకర్తల్లో ఉత్సహం వస్తుంది.. అలానే పార్టీని వీడిన కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది' అని అధిష్టానం భావిస్తోంది. ఉమెన్ చాందీ ఏపీలో ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అనుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల ఓట్లు నుంచి 50 వేల ఓట్లు సాధించేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఒక్కో నియోజక వర్గంలో పదివేల ఓట్లు అంటే కాంగ్రెస్ పుంజుకున్నట్టే.. ఇంకేంటి కాంగ్రెస్ హ్యాపీ..  ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీ కొంప మునిగినట్టే అంటున్నారు విశ్లేషకులు.. విభజన అనంతరం కాంగ్రెస్ ని వీడిన మెజారిటీ కేడర్ అంతా వైసీపీలో చేరింది.. ఇప్పుడు వైసీపీ బీజేపీకి దగ్గరవుతోంది.. ఇది జీర్ణించుకోలేని కొందరు కార్యకర్తలు,ఎస్సీలు, మైనార్టీలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నారట.. ఆ కేడర్ ఎంతో కొంత తిరిగి కాంగ్రెస్ లో చేరితే.. ప్రతి నియోజక వర్గంలో వైసీపీ ఓటు బ్యాంకు పదివేలు తగ్గితే.. వైసీపీ పరిస్థితి ఏంటి?.. అసలే గత ఎన్నికల్లో 5 వేలు లోపు మెజారిటీతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పదివేల ఓట్లు సాధిస్తే, సీఎం అవ్వాలన్న జగన్ ఆశలు మీద నీళ్లు జల్లినట్టేనా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటే జగన్ కొంప మునిగేలా ఉందిగా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మహాత్మాగాంధీ పోటీ చేసిన నోట్లు పంచాల్సిందే..!!

  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే.. నాయకుడు అంటే నలుగురిని నడిపించేవాడు కాదు, నలుగురికి నోట్లు పంచేవాడు అనిపిస్తుంది.. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో నాయకులు, మేము గెలిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రచార పత్రాలు పంచేవారు.. కానీ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పినా చెప్పకపోయినా.. ఎంతిస్తే ఓటేస్తారని అడిగి మరీ నోట్లు పంచుతున్నారు.. ప్రజలు నోట్లు తీసుకొని ఓట్లేస్తున్నారు.. తరువాత నాయకులు పని చెయ్యట్లేదు, అవినీతి పెరిగిపోయింది అంటూ బాధపడుతున్నారు.. పోనీ వచ్చే ఎన్నికల్లో అయినా నోట్లిచ్చే నాయుడు కాదు మంచి చేసే నాయుడుకి ఓటేద్దాం అనుకుంటారా?.. అబ్బే లేదు.. అదే పాత పాట.. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది?.. నోట్లు పంచే నాయకుడుది కాదు, ఆ నోట్లు తీసుకుని ఓటేసే ప్రజలది.. ప్రజలు నోట్లకి అలవాటు పడిపోయారు కాబట్టే, కొందరు మంచి నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నోట్లు పంచుతున్నారు, నోట్లు పంచలేని మంచి నాయకులు సాధారణ ఓటర్లులా మిగిలిపోతున్నారు.. ఈ నిజం నాయకులకి కూడా తెల్సు.. కానీ ప్రజలకి చెప్పలేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు..  ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయి.. స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని అన్నారు.. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని, గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు.. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని, పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం అభిప్రాయపడ్డారు.. ఇది అందరికీ తెల్సిన నిజమే.. కొందరు ఆయనలా బయటపడతారు, మిగతావారు బయటపడరు అంతే తేడా.. దేశం మారాలంటే ముందు ప్రజలు మారాలి.. ప్రజలు మారితే మంచి నాయకులు వస్తారు.. ఆటోమేటిక్ గా దేశం మారుతుంది.

మోడీ దాచిన పెద్ద రహస్యం..!!

మోడీ ప్రధాని పదవి చేపట్టి నాలుగేళ్లు దాటింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, కాంగ్రెస్ మీద విమర్శలు చేసారు.. ఇప్పటి పరిస్థితులే కాదు, ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీను కూడా గుర్తుచేస్తూ విమర్శలు చేస్తారు.. అలాంటి మోడీ దేశానికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పుని నాలుగేళ్లుగా రహస్యంగా ఉంచారట.. కాంగ్రెస్ తప్పు చేస్తే మోడీ విమర్శించకుండా నాలుగేళ్లు ఉన్నారా? నో వే అంటారా.. నిజమండి బాబూ.. ఈ విషయాన్ని స్వయంగా మోడీనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆర్థిక నిపుణుడైన వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావిస్తాం..కానీ తాను ప్రధాని కుర్చీలో కూర్చునే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని' మోడీ, అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు.. ఆర్థిక వేత్త అయిన ప్రధాని, ఆర్థిక నైపుణ్యం ఉన్న ఆర్థిక మంత్రి హయాంలో దేశం సంక్షోభంలో పడింది.. ఆ గణాంకాల్ని చూసి తాము నిర్ఘాంతపోయామని మోడీ అన్నారు.. ఎవరూ ఊహించని రీతిలో ఉన్న అంకెల్ని చూసి, వాటిని సరి చేసేందుకు ప్రయత్నించామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..ఆ  సమయంలో తమ ముందు రెండు మార్గాలున్నాయి.. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పటం.. రెండోది దెబ్బ తిన్న భారత ఆర్థిక పరిస్థితిని గుట్టుగా బాగుచేయటం.. మొదటి విధానంలో రాజకీయ లబ్థికి అవకాశం ఉంది.. రెండో విధానంలో మాత్రం అలాంటిది లేదు.. అయినప్పటికీ తాము రెండో విధానాన్నే ఎంచుకున్నామని మోడీ అన్నారు.. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం.. దేశానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మోడీ తెలిపారు. ఓ వైపు ప్రజల్లో మోడీ మీద వ్యతిరేకత మొదలవ్వడం, మరో వైపు కాంగ్రెస్ విపక్షాలన్నింటినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని చూస్తున్న తరుణంలో.. మోడీ నాలుగేళ్ళ రహస్యం ఇప్పుడు బయటపెట్టడంతో అందరు షాక్ అవుతున్నారు.. మరి మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.. అయితే మోడీ వ్యాఖ్యల పట్ల కొందరి స్పందన వేరేలా ఉంది.. కాంగ్రెస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నాలుగేళ్లకు చెప్పారు.. మరి మీరు అధికారంలోకి వచ్చాక నోట్లరద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శలు వస్తున్నాయి.. ఇక దీనికి సమాధానం ఇంకెన్నాళ్ళకి చెప్తారు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

పవన్‌పై పోటీకి నిమ్మగడ్డ సై..?

  రాజకీయ నాయకుడు ఎన్నికలు ఉన్నప్పుడే ప్రచారం చేస్తే సరిపోదు.. ఎన్నికలు లేకపోయినా ఆరోజు ఈరోజని తేడాలేకుండా ప్రతిరోజూ ప్రచారం చేసుకోవాలి.. అప్పుడే నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటాడు.. ఈ ఫార్ములాని ఇంచుమించు అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి.. అందుకే ప్రతి పార్టీ సొంతంగానో లేక అనుకూలమైన వ్యక్తులతోనో.. న్యూస్ పేపర్, ఛానల్ నడిపిస్తున్నాయి.. ఎప్పటినుండో ఉన్న పార్టీల దగ్గరనుండి ఈ మధ్య వచ్చిన పార్టీల వరకు అన్నింటికీ మీడియా విలువ బాగా తెలుసు.. జనసేనకి కూడా మీడియా విలువ తెలిసినట్టుంది.. ఆ మధ్య కొన్ని ఛానెల్స్ మీద విమర్శలు చేసిన పవన్, పార్టీ తరుపున తనకంటూ ఓ ఛానల్ ఉండాలని అనుకుంటున్నారట.. దానిలో భాగంగానే కొత్త ఛానల్ తీసుకోవాలి అనుకున్నారట..  తరువాత కొత్త ఛానల్ కంటే ఆల్రెడీ కొంత పేరున్న పాత ఛానల్ కొనడం బెటర్ అని డిసైడ్ అయ్యారట.. ఓ ఎన్నారై ఆర్థిక సాయంతో 10 టీవీ ఛానల్ కొనాలని సంప్రదింపులు కూడా జరిపారట.. ఇక 10 టీవీ జనసేన టీవీ అని ఆనందపడే లోపు, అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ తెరమీదకు వచ్చారట.. భారీమొత్తానికి ఛానల్ కొంటా అనడంతో ఛానల్ యాజమాన్యం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే, ఒక ఛానల్ కోసం 'పవన్ పై పోటీకి నిమ్మగడ్డ ప్రసాద్ సై' అన్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై కొందరి వాదన వేరేలా ఉంది.. వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయి.. అందుకే వైసీపీ సానుభాతిపరుడు నిమ్మగడ్డ, పవన్ కోసం ఛానెల్ కొంటున్నాడు అంటున్నారు.. వీటిల్లో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి.  

అరెస్ట్.. విడుదల.. మళ్ళీ రాముడి గురించి వ్యాఖ్యలు!! 

  ఇటీవల ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్.. శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అయితే సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులు మహేష్ ని అరెస్ట్ చేసి ఆ వ్యాఖ్యల గురించి వివరణ కోరినట్టు తెలుస్తుంది.. అదేవిధంగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి వుంటుందని చెబుతూ నోటీసులు ఇచ్చి మహేష్ ని పంపించారు. ఈ అరెస్ట్, విడుదల గురించి కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు.. 'కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి' అని పోస్ట్ చేసారు.. అంతటితో ఆగితే కత్తి మహేష్ ఎలా అవుతా? అనుకున్నారేమో.. ఇంకో పోస్ట్ పెట్టి మరోసారి విమర్శలకు, చర్చలకు తెర లేపారు.  'శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువదించిన రామాయణం లో యుద్ధకాండలో రాముడు సీతనుద్దేశించి " సద్వంశంలో పుట్టినవాడు పౌరుశవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఓడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు.యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు. కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవునిదగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణునిదగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంటో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది. ఆధారం: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటం. మనసు ఫౌండేషన్ ప్రచురణ. కాబట్టి, సీతను రావణునిదగ్గర కే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది'. అంటూ పోస్ట్ చేసారు.. దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.. ఈ చర్చలు ఎప్పుడు ముగుస్తాయో ఏంటో.

ప్రేమిస్తే చంపేస్తారా నాన్న?

తండ్రికి కూతురంటే ఇష్టం.. కాదు కాదు ప్రాణం.. అందుకేనేమో కొందరు క్షణికావేశంలో సొంత కూతురు ప్రాణాలే తీస్తున్నారు.. కూతురిని ప్రేమగా చూసుకోవాల్సిన తండ్రి, తన కూతురు వేరొకరిని ప్రేమించిందని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు.. కూతురు మీద తనకున్న ప్రేమని మర్చిపోయి, తన కూతురి ప్రాణాలే తీసేస్తున్నాడు.. కూతురు మీదున్న ప్రేమని మర్చిపోయి తండ్రి యముడిలా మారడానికి కారణం.. కూతురి ప్రేమ.. అవును ప్రేమే.. ప్రేమ పలకడానికి రెండు అక్షరాలే.. కానీ అదే ప్రేమ రెండు అక్షరాల చావుని కూడా పరిచయం చేస్తుంది. చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని నడిపించిన నాన్న, ప్రేమిస్తే చంపేస్తాడని.. గుండెల మీద ఎత్తుకొని ఆడించిన నాన్న ప్రాణం తీస్తాడని..  ఏ కూతురు ఊహించదు.. అంతెందుకు ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీయాలని, తీస్తానని ఏ తండ్రి అనుకోడు.. కానీ తీస్తున్నాడు.. దానికి కారణం క్షణికావేశం.. అవును ఈ క్షణికావేశమే ప్రాణంగా ప్రేమించిన కూతురి ప్రాణాలు తీసేలా చేస్తుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె చంద్రిక బీ.ఫార్మసీ చదువుతోంది.. పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామం వచ్చిన చంద్రిక, తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్తే.. ఆమె తన భర్త కోటేశ్వరరావుకి చెప్పింది.. కూతురు ప్రేమలో పడటం, ఎక్కువగా ప్రేమికుడితో ఫోన్ మాట్లాడుతుండటంతో.. కూతురు ప్రేమలో పడి తన పరువు తీస్తుంది అంటూ క్షణికావేశంలో కర్రతో బలంగా కొట్టడంతో చంద్రిక చనిపోయింది.. ఇప్పుడు కూతురు దూరమైందని బాధపడుతున్నాడు.. ఆవేశంలో కూతుర్ని దూరం చేసుకొని ఇప్పుడు కన్నీరు పెట్టుకొని ఏం లాభం.. కూతురు ప్రేమ గురించి తెలిసి ఆవేశం తెచ్చుకునే ముందు, ఒక్కసారి కూతురి మీద తనకున్న ప్రేమని గుర్తుతెచ్చుకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా, కూతురికి నాన్నంటే ప్రాణం.. దానికి ఉదాహరణే చంద్రిక సోదరి శిరీష మాటలు.. 'మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క అంటేనే ఎక్కువ ప్రేమ.. క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది.. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ శిరీష కన్నీరు పెట్టుకుంది.. చంద్రిక, శిరీష లాంటి ప్రతి ఆడపిల్ల కోరిక ఒక్కటే.. 'కూతురు ప్రేమని అర్ధం చేసుకోకపోయినా పర్లేదు.. కానీ కూతురి మీద ప్రేమని చంపుకొని, కూతురిని చంపి సమాజం దృష్టిలో చెడ్డవాడివి కాకు నాన్న'.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం..!

  తెలంగాణ సీఎం కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసరడం తెలిసిందే.. అయితే ముందస్తు ఎన్నికల గురించి కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి కాస్త భిన్నంగా స్పందించారు.. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ సవాల్‌ హాస్యాస్పదమన్నారు.. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు ఓట్లేస్తే.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు..  కేంద్ర ప్రభుత్వం కూడా ముందుస్తు ఎన్నికలకు పోవాలని చూస్తుందని, దాని ట్రాప్ లో టీఆర్ ఎస్ పడినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.. ఒకవేళ టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే...ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందన్నారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేను కానీ అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో మాత్రం గెలుస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు..  అదే విధంగా, డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలపై స్పందించిన జానారెడ్డి.. డి శ్రీనివాస్ తనతో మాట్లాడలేదని, ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం తనకి అందలేదని అన్నారు.. అలానే, పీసీసీలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న సమాచారం లేదని.. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం నాయకులు, కార్యకర్తలు పని చేయాల్సి ఉంటుందన్నారు.. పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని స్పష్టం చేసారు.. చూద్దాం మరి జానారెడ్డి అనుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో.  

టీడీపీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

  కడప ఉక్కు పరిశ్రమ కోసం ఓ వైపు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్నారు.. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు, లేఖలు ఇలా అన్ని విధాలుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందించి, ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటానికి వెళ్లిన టీడీపీ ఎంపీల తీరే చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.. టీడీపీ ఎంపీలు సరదాగా దీక్ష గురించి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి లీక్ అయింది.. ఆ వీడియోలో టీడీపీ ఎంపీలు దీక్ష గురించి వెటకారం చేసారు.. జోను లేదు గీను లేదని అవంతి శ్రీనివాస్ అంటే.. నేను ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్న వారం రోజులు దీక్ష చేస్తానని మురళి మోహన్ అన్నారు.. ఈ వీడియోని ప్రతిపక్షాలు అస్త్రంగా మలుచుకొని దీక్షల మీద టీడీపీ చిత్తశుద్ధి ఇది అంటూ విమర్శలు చేస్తూ వీడియో షేర్ చేస్తున్నాయి.. ఈ విషయం చంద్రబాబుకి తెలిసి వెంటనే ఎంపీలతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది..  సీఎం రమేష్ ఓవైపు దీక్ష చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించిన బాబు, ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దని, ఛలోక్తులకు ఇది సమయం కాదని, మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దని హెచ్చరించారట.. చంద్రబాబు సీరియస్‌ కావడంతో ఎంపీలు కూడా వివరణ ఇచ్చారు.. తమ మాటలను కొంతమంది వక్రీకరించారని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్‌లు అన్నారు.. ఆ వీడియోను ఎడిటింగ్ చేశారని 75ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలమా అన్న మాటల్ని మాత్రం కట్ చేశారని చెప్పారట.. దీనిపై స్పందించిన బాబు, టీడీపీ చేసే పోరాటంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్టు తెలుస్తుంది..  అదే విదంగా, రాష్ట్రం మొత్తం ధర్మపోరాటం వైపు చూస్తోందని.. టీడీపీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని.. ఒకప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేశారని.. ఇప్పుడు మురళీ మోహన్ మాట్నలి కట్ అండ్ పేస్ట్ చేశారని.. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారొద్దని బాబు సూచించారు.. ప్రతి క్షణం అప్రమత్తంగా, సీరియస్‌నెస్‌తో ఉండాలన్నారు బాబు.. అలానే అసలు ఆ వీడియో ఎవరు తీశారు? బయటికెలా వచ్చింది? ఎవరు ఎడిట్ చేసారో? విచారించాలని.. ముందు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దీని వెనక ఎవరైనా ఇంటి దొంగ ఉన్నారేమో అన్న విషయం కూడా తెలిసిపోతుందని చెప్పినట్టు తెలుస్తుంది.  

60 కోట్ల భారతీయులు రోడ్డున పడతారు... ఎందుకంటే!

  ఇది ఎవరో దారిన పోయే దానయ్య చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్‌ చేస్తున్న హెచ్చరిక. ఇంతకీ ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు- వాతావరణంలో మార్పు! మనిషి రోజురోజుకీ ఎదిగిపోతున్నాడే కానీ వాతావరణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా భూగర్భ జలాలు పడిపోవడం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి రావడం, కాలుష్యం పెరిగిపోవడం, పంటలు సరిగా పండకపోవడం... లాంటి సవాలక్ష సమస్యలు వస్తున్నాయి. వీటికి తోడు కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాల సంగతి సరేసరి. వీటన్నింటి కారణంగా 2050 నాటికి మన దేశ జీడీపీ 2.8 శాతం తగ్గిపోయే అవకాశం ఉందంటోంది ప్రపంచ బ్యాంక్‌. దీనివల్ల తీవ్రమైన నిరుద్యోగం తలెత్తే అవకాశం ఉందట. ఇక పంటలు సరిగా పండక రైతులు, అనారోగ్యాల బారిన పడి మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరమయ్యే ప్రమాదం ఉంది. విదర్భ వంటి కొన్న ప్రాంతాల్లో అయితే తీవ్రమైన కరువు విలయతాండవం చేసే ప్రమాదం ఉందట.ఇప్పటికైనా కళ్లు తెరిచి మన చుట్టూ ఉన్న నీటి వనరులనీ, అడవులనీ, పర్యావరణాన్నీ కాపాడుకోకపోతే ఈ హెచ్చరిక నిజమై తీరుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుని ప్రజల ఆదాయంతో ముడిపెడుతూ ప్రపంచ బ్యాంక్‌ నివేదికను రూపొందించడం ఇదే మొదటిసారి.

తెలంగాణాలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు?

  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇవ్వడంతో, తెలంగాణ కాంగ్రెస్ అలెర్ట్ అయింది.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ చూస్తుంది.. ఇదే ఫార్ములాని తెలంగాణ కాంగ్రెస్ ఫాలో అవ్వాలనుకుంటుంది.. తెరాస వ్యతిరేక పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తుంది.. తెలంగాణలో తెరాస కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, టీఈపీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి.. ఎవరికి వారు ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ తెరాసనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.. అందుకే తెలంగాణ కాంగ్రెస్ తెరాస వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో తెరాసని ఓడించాలని చూస్తుంది. టీడీపీ ఏపీ లో అధికారంలో ఉంది కానీ, తెలంగాణాలో ఆ పార్టీ పరిస్థితి బాలేదు.. టీడీపీ అగ్రనేతలు చాలావరకు పార్టీని వీడి. తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. అయితే టీడీపీకి హైదరాబాద్, ఖమ్మం, అలానే కొన్ని గ్రామాల్లో ఇంకా ఓటు బ్యాంకు ఉంది.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందట.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసింది.. కానీ ఇప్పుడు టీడీపీ,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.. ఇక తెరాసతో కూడా టీడీపీ కి సఖ్యత లేదు.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇస్తుంది.. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన సీపీఐ ఈసారి కూడా కాంగ్రెస్ తోనే కలిసి నడవాలనుకుంటుంది. ఇక తెలంగాణ ఇంటి పార్టీ (టీఈపీ) ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది.. అలానే తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోదండరాం టీజేఎస్‌ కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా ఉంది.. కాంగ్రెస్ కి బీజేపీ పూర్తి వ్యతిరేకం కావున ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. అలానే సీపీఎం కూడా ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.. తెరాసను అడ్డుకోవాలంటే టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌, టీఈపీ ఇలాంటి పొత్తు తప్పనిసరి అని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో.

కాంగ్రెస్సా? బీజేపీనా? తేల్చుకోలేకపోతున్న డీఎస్

  తెలంగాణ రాజకీయాలు అప్పుడే వేడెక్కుతున్నాయి.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో విపక్షాలకు సవాల్ విసురుతుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మేము ముందస్తు ఎన్నికలకు సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసురుతుంది.. దీనికి తగ్గట్టే పార్టీలు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు గురించి లెక్కలు, ఆలోచనలు చేస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఒక టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో తెరమీదకు వచ్చింది.. అదే డీఎస్ చూపు ఏ పార్టీ వైపు?.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన డీఎస్, రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా మరియు కుమారుడు భవిష్యత్తు కోసం, తెరాసలో చేరారు..  తెరాస కూడా డీఎస్ అనుభవానికి గౌరవమిచ్చి రాజ్యసభ సభ్యుడుగా, ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.. అయితే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్, డీఎస్ తో పాటే ఉన్నారు కానీ, రెండో కుమారుడు అరవింద్ మాత్రం బీజేపీ లో చేరారు.. అరవింద్ చేరిక వెనక డీఎస్ ప్లాన్ ఉందని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.. ఇలాంటి ఆరోపణలని పెద్దగా పట్టించుకోని డీఎస్.. గత కొంత కాలంగా తెరాసతో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.. తెరాస పార్టీ కార్యక్రమాల్లో డీఎస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలానే కుమురుడు సంజయ్, తనతో పాటు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది..  దీనికి తోడు తాజాగా నిజామాబాద్ తెరాస నేతలు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి లేఖ రాయడంతో.. డీఎస్ కలత చెంది తెరాసను వీడి వేరే పార్టీలో చేరాలని చూస్తున్నారట.. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు కూడా జరిపారట.. కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించి డీఎస్ కి, ఆయన కుమారుడు సంజయ్ కి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిందట.. డీఎస్ అంత ఓకే ఇక పాత గూటికే నా పయనం అని సిద్దమవగా, రెండో కుమారుడు అరవింద్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట.. బీజేపీలో చేరాలని డీఎస్ మీద ఒత్తిడి చేస్తున్నాడట..  అలానే బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడిస్తున్నాడట.. కానీ డీఎస్ మాత్రం కాంగ్రెస్ వైపే వెళ్లాలని ఎక్కువ మొగ్గు చూపుతున్నారట.. ఒకప్పటి పార్టీ అయితేనే సంతృప్తి ఉంటుందని భావిస్తున్నారట.. చూద్దాం మరి డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారో లేక రెండో కొడుకు మాటలకు మనస్సు మార్చుకొని బీజేపీలో చేరతారో.. చూద్దాం ఏం జరుగుతుందో.  

మోడీకి దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం పరిస్థితులన్నీ బీజేపీ మీద బాగా పగపట్టేసినట్టు ఉన్నాయి.. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.. ఇప్పుడు మరో మిత్రపక్షం బీజేపీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. అదే బీహార్ లోని జేడీయూ పార్టీ.. గత ఏడాది ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీష్ కుమార్ జేడీయూ తిరిగి లాలూ పార్టీతో చేతులు కలపాలని చూస్తుందట.. నితీష్ కుమార్, బీజేపీతో ఇమడలేకపోతున్నారని తెలుస్తుంది.. మరోవైపు బీజేపీ మీద వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయి.. బీజేపీతో కలిసుంటే వచ్చే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం పడుతుంది.. అందుకే నితీష్ కుమార్ బీజేపీ తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే నితీష్ సన్నిహితులు ఆర్జేడీ మరియు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్జేడీ, నితీష్ తో దోస్తీ అంటే కాస్త ఆలోచిస్తుందట.. నితీష్ ని నమ్మలేం అనుకుంటున్నారట.. అదీకాక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద సిబిఐని ఉసిగొల్పారు.. అలాంటి వారితో దోస్తీ వద్దని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారట.. ఇక కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉంది.. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఏ పార్టీతో అయినా దోస్తీకి సిద్దమే.. కానీ లాలూ ఆర్జెడీకి ఇష్టం లేకుండా జేడీయూతో దోస్తీ చేసే సాహసం చేయదు.. ఇదే విషయం కాంగ్రెస్ నేతలు, జేడీయూ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది.. మీతో దోస్తీకి ఆర్జేడీ ఓకే అంటే మాకు ఓకే అన్నారట.. మరి నితీష్ తనమీద ఆర్జేడీ నేతలకు ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా? చూద్దాం ఇదే జరిగితే బీజేపీకి మరో దెబ్బ తగిలినట్టే.

టీఆర్ఎస్‌లో గడబిడ మొదలవుతుంది

  తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ అధికారం తమదే అని అంటున్నారు.. ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలని చూస్తున్నారు.. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం అంత సులభం కాదంటూ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు..  ఆ మధ్య కేసీఆర్ హడావుడి చేసిన ఫెడరల్ ఫ్రంట్  ఎక్కడ అంటూ ప్రశ్నించారు.. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూనే మరోవైపు బీజేపీతో కలిసి రహస్య దోస్తీ చేస్తున్నట్లుగా ఆరోపించారు.. కేసీఆర్ ఏ పథకాన్ని స్టార్ట్ చేసినా అది ఫెయిల్ అవుతుందన్నారు..  తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించింది తానేనని చెప్పిన జైపాల్ రెడ్డి, తెలంగాణలో ఆట స్టార్ట్ చేసింది కేసీఆరే అయినప్పటికీ గోల్ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.. అలానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు గురించి వస్తున్న విమర్శలపై కూడా జైపాల్ రెడ్డి స్పందించారు.. జాతీయ పార్టీగా కాంగ్రెస్లో విభేదాలు సహజమేనని, ఎన్నికల్లో మాత్రం తామంతా ఒక్కటై టీఆర్ఎస్ పని పడతామన్నారు.. కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కేసీఆరే ఎక్కువగా ఇబ్బంది పడతారన్నారు.. కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చిన తర్వాత కలిసి ముందుకు వెళతామని, టీఆర్ఎస్ లో మాత్రం టికెట్లు ఇచ్చిన తర్వాతే గడబిడ మొదలవుతుందన్నారు.. సిట్టింగులకు టికెట్లు ఇస్తే ప్రజలు ఓడిస్తారని, వేరేవారికి టికెట్లు ఇస్తే సిట్టింగులు ఓడిస్తారని జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

భారతదేశం పరువు తీసిన సర్వే

భారతదేశం.. సాంప్రదాయాల నిలయం.. స్త్రీలను గౌరవించడం ప్రపంచానికి నేర్పిన దేశం.. ఇలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు భారతదేశం సిగ్గుతో ప్రపంచం ముందు తల దించుకుంటుంది.. ప్రపంచానికి స్త్రీలను గౌరవించడం నేర్పించిన మనం, విలువలు మర్చిపోయి భారతదేశ పరువుని నడి ప్రపంచంలో తాకట్టు పెడుతున్నాం.. దానికి రుజువే తాజాగా వెల్లడైన థాంమ్సన్ రాయటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే.. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశమని ఈ సర్వే వెల్లడించింది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు,మహిళల అక్రమ రవాణాలో భారత్ అగ్రస్థానంలో ఉందట.. అలానే  మహిళల భద్రత విషయంలో భారత్ మహా డేంజర్ అంటూ సర్వే వెల్లడించింది.. లైంగిక వేధింపులతో పాటు, బలవంతపు పెళ్లిళ్లు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇలా అన్నింట్లో భారత్ ముందు వరుసలో ఉందని ఈ సర్వే వెల్లడించింది.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకి పోటీ ఇవ్వాలన్న ఆలోచన దగ్గరే ఆగిపోయిన భారతదేశం, మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా మొదటి స్థానం రావడం భారతీయులుగా సిగ్గుపడాల్సిన విషయం.. ఇప్పటినుండైనా స్త్రీలను గౌరవిద్దాం.. భరతమాత పరువు కాపాడదాం.

కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం?

  టీడీపీని విభేదించాక పవన్ ఒంటరి పోరుకి సిద్ధమన్నారు.. కానీ పవన్, వైసీపీకి మద్దతని ఆరోపణలు వచ్చాయి.. అయితే ఈ ఆరోపణలను పవన్ కొట్టిపారేసే ప్రయత్నం చేసారు.. అలానే కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని, మూడునెలల్లో కార్యాచరణ రూపొందిస్తాం అని పవన్ ప్రకటించారు.. విచిత్రంగా పవన్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. జనసేన, వైసీపీకి మద్దతిస్తే తాము ఆ పార్టీతో కొనసాగలేమని స్పష్టం చేసారు.. స్వయంగా పవన్, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినా, వాళ్ళకి నమ్మకం లేదా.. కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం? అని చర్చలు మొదలయ్యాయి.. అయితే కమ్యూనిస్టుల అనుమానాలకు కూడా కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది.. కడప ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న బంద్ కు పవన్ మద్దదైతే తెలిపారు కానీ, కేంద్రాన్ని నిలదీయట్లేదు, ఇదే కాదు ఏ విషయంలోనూ ఈ మధ్య పవన్ కేంద్రాన్ని విమర్శించట్లేదు.. అలానే ఎన్నికల విషయం వచ్చేసరికి పవన్ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని చెప్తున్నాడు.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు గురించి పవన్ స్పష్టత ఇవ్వలేదు.. వీటి మూలంగా తమను వాడుకుని వదిలేస్తున్నారా అనే అనుమానాలు కమ్యూనిస్టులకు వస్తున్నాయట.