గజపతిరాజును చూసి కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి!!

  కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అయినా చాలా నిరాడంబరంగా వుంటారు. అసామాన్యుడైన వ్యక్తి అయినప్పటికీ సామాన్యులతో కలసి మెలసి వుంటారు. ఆయనకి వున్న ఈ క్వాలిటీయే ఆయన్ని మంచి ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. నరేంద్రమోడీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా చేసింది.   పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు చక్కని పనితీరు కనబరుస్తున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నారు. తమ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ తమకు విద్యాధికుడు, సౌమ్యుడు అయిన అశోక్ గజపతిరాజు మంచి మంత్రివర్గ సహచరుడిని ఇచ్చిందన్న ప్రశంసలు లభిస్తున్నాయి.   ఈ ప్రశంసలన్నీ ఒక ఎత్తయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన ఒక ఎత్తు. పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఆయనకు దేశంలోని ఏ ఎయిర్‌పోర్టులో అయినా రాయల్ ట్రీట్‌మెంట్ వుంటుంది. ఆయన ఎయిర్‌పోర్టులో విమానం దగ్గరకి ఏసీ కారులో వెళ్ళే అవకాశం కూడా వుంది. అయితే ఆయన ఆ సదుపాయాన్ని ఎంతమాత్రం వినియోగించుకోవడం లేదు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఆయన తన సూట్‌కేస్ తానే మోసుకుంటూ మిగతా ప్రయాణికులందరితో కలసి క్యూలో నిల్చుని చెకింగ్‌కి సహకరించారు. ఎయిర్‌పోర్టు భవనం నుంచి విమానం వరకు తన తోటి ప్రయాణికులతో కలసి బస్సులోనే ప్రయాణించారు. ఆయన నిరాడంబరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మనసులోనే ఆయనకు అభినందనలు తెలిపారు. అన్నీ వున్న ఆకు అణిగిమణిగి వుంటుంది అనడానికి అశోక్ గజపతిరాజు ఒక ఉదాహరణ అనుకున్నారు.   అశోక్ గజపతిరాజు లాంటి మంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన వారు, ఏమీ లేని ఆకులా ఎగిరెగిరి పడేవారు మన రాజకీయ రంగంలో చాలామంది వున్నారు. పదవి వుంది కదా అని బిల్బప్పు కోసం ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు పెట్టేవారు. తాము ప్రజా ప్రతినిధులం కాబట్టి తమకు అదనపు సదుపాయాలు కావాలని డిమాండ్ చేసేవారు, తమ దగ్గర పనిచేసే ప్రభుత్వోద్యోగుల చేత అడ్డమైన సొంత పనులు చేయించేవారు. తమ దగ్గర పనిచేసే పోలీసుల చేత కూరగాయలు తెప్పించుకునేవారు, తమ షూలకి ప్రభుత్వోద్యోగుల చేత, సెక్యూరిటీ అధికారుల చేత లేసులు కట్టించేవారు... ఇలాంటి నాయకులందరూ అశోక్‌ గజపతిరాజును చూసయినా మారితే దేశం కొంత అయినా బాగుపడుతుంది.

గోల్కొండ మీద జెండా వందనమా? న్యాయమా?

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదం అవుతోంది. అసలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయా లేక వివాదాస్పదం అయ్యే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ తీసుకున్న మిగతా నిర్ణయాలు, వాటి వివాదాల సంగతి అలా వుంచితే, తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం కలకలం రేపుతోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్.లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, జాతీయ జెండా ఆవిష్కరణోత్సవాన్ని గోల్కొండలో చేయాలని నిర్ణయించింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది. ఆ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోటలో చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.   గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపడం ద్వారా కేసీఆర్ ఏం సాధించదలచుకున్నారో స్పష్టంగా అర్థం కావడం లేదు. ఈ చర్య ద్వారా ఆయన ప్రత్యేకంగా సాధించేదేమీ లేకపోయినా లేనిపోని వివాదాలకు తెరతీస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇలా చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు రాంగ్ సిగ్నల్ఇస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అప్పటి టీఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ తెలంగాణ ప్రజలు భారతీయులు కాదని, భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుందని వ్యాఖ్యానించారు. అలాగే ఈమధ్యకాలంలో కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీ హోదాలో వుండి కూడా హైదరాబాద్‌ విషయంలో, కాశ్మీర్ విషయంలో అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శకులు విమర్శించడానికి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండలో చేయడం అంటే పాత హైదరాబాద్ సంస్థానాన్ని ప్రజలకు గుర్తు చేసినట్టు అవుతుంది. అది వేర్పాటు వాదానికి సూచిక అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్ల కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎప్పటిలాగానే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్.లోనే చేస్తే ఏ సమస్యా వుండదు.

వెంకయ్య నాయుడు హెచ్చరిక ఎవరికి?

  ఈరోజు ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులను వేర్వేరుగా కలిసిన కేంద్ర మంత్రి యం.వెంకయ్య నాయుడు, తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను ఇరు ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాలని, కొత్తగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాలలో పదేళ్ళ పాటు ప్రస్తుత విదివిధానాలే అమలు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పెర్కొనబడినప్పటికీ, తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని అర్దమవుతూనే ఉంది. అయితే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని విద్యార్ధుల ఫీజు రీ-ఇంబర్స్ మెంటును 52:48 నిష్పత్తిలో భరిద్దామని చేసిన ప్రతిపాదననే ఖాతరు చేయని కేసీఆర్ వెంకయ్యనాయుడు చెప్పే ఈ హితోక్తులను పట్టించుకొంటారని ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు భాద్యతగా తను చెప్పవలసిన నాలుగు మంచి ముక్కలు చెప్పారు. అంతే!

ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ

  ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ పై ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58:42 నిష్పత్తిలో విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ భరిద్దామని చేసిన ప్రతిపాదనను తెలంగాణా ప్రభుత్వం నిరాకరించింది. అంతే కాక తెలంగాణా ప్రభుత్వం తమకోసం ప్రత్యేకంగా ఒక ఉన్నత విద్యామండలిని కూడా ఏర్పాటు చేసుకోవడంతో ఇక ఈ సమస్యపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లయింది. ఇక ఎల్లుండి ఈ కేసును విచారణకు చెప్పట్టనున్నసుప్రీం కోర్టే ఈ సమస్యకు పరిష్కారం చూపవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు చూసిన తరువాత అవసరమయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి లేఖలు వ్రాయాలని భావిస్తున్నారు. ఆయన ఈరోజు తనను కలిసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి కూడా తెలంగాణా ప్రభుత్వంపై పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబును కలిసిన తరువాత కేసీఆర్ ను కూడా కలిసిన వెంకయ్యనాయుడు ఈ విషయం గురించి ఆయనతో కూడా చర్చించి ఉండవచ్చును. కానీ, కేసీఆర్ మరియు ఆయన మంత్రుల మాటలను బట్టి వారు ఈ విషయంలో రాజీపడే అవకాశం ఉండదని స్పష్టమవుతోంది. అందువలన ఇక సుప్రీం కోర్టు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. రెండు ప్రభుత్వాలు వేర్వేరుగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించుకోవచ్చునేమో కానీ హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల జిల్లాలలో స్థిరపడిన ఆంద్రప్రజల పిల్లల విషయంలో రెండు ప్రభుత్వాలు తప్పనిసరిగా సహకరించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కోర్టు కూడా చంద్రబాబు ప్రతిపాదనను సమర్ధిస్తే అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఏమి చేస్తుందనేది ఆసక్తికరమయిన విషయమే.

ఆంద్ర ఐటీ పారిశ్రామికవేత్తలకు తెలంగాణా తివాచీ?

  నిజమే! హైదరాబాదును ఐటీ కేంద్రంగా తీర్చిదిద్ది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ పేరు దశదిశలా మారుమ్రోగేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే. మళ్ళీ ఇప్పుడు ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టడంతో, గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన ఐటీ పరిశ్రమ ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని, మళ్ళీ త్వరలోనే ఐటీ రంగానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలు అందరూ ఆనంద పడ్డారు. కానీ తెదేపా ప్రభుత్వం అధికారం చేప్పట్టి దాదాపు రెండు నెలలు కావస్తున్నా వారి గోడు వినేవారు లేరు. చంద్రబాబు దేశ విదేశాల నుండి చిన్నా పెద్ద ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు తప్ప పెరట్లో ఉన్న ఐటీ పరిశ్రమల సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ లో ఐటీ పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందనే ఆలోచనతోనే తామందరం ఇక్కడ పరిశ్రమలు స్థాపించి, ఎన్ని ఇబ్బందులున్నా ముందుకే కొనసాగుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల గోడు పట్టించుకోకపోవడంతో, తమకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్న తెలంగాణా ప్రభుత్వం వైపు వారి దృష్టి మళ్ళుతోంది. తెలంగాణాలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వచ్చినట్లయితే, వారికి అవసరమయిన అన్ని సౌకర్యాలు కలిగించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తమకు ఆహ్వానాలు వస్తున్నాయని వారు స్పష్టం చేసారు. వారి ఆవేదన అర్ధం చేసుకోదగిందే. రాష్ట్రానికి అక్షయపాత్ర వంటి ఐటీ పరిశ్రమల స్థాపన అవసరం ఎంతుందో వాటి నిర్వహణకు ప్రభుత్వతోడ్పాటు అంతే అవసరం ఉంది. అయితే చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆంద్రప్రజలను, విద్యార్ధులను ఏవగించుకొంటున్న తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర పారిశ్రామిక వేత్తలకు మాత్రం ఎర్ర తివాచీ పరిచేందుకు సిద్దమయిందని వారు చెప్పడం. హైదరాబాదు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం లక్షలాది ఆంధ్ర, తెలంగాణా ప్రజల సమిష్టి కృషే కారణమని అందరికీ తెలుసు. కానీ హైదరాబాదు అభివృద్ధిలో ఆంద్ర ప్రజల పాత్రను, ముఖ్యంగా చంద్రబాబు పాత్రను ఎన్నడూ అంగీకరించని తెలంగాణా ప్రభుత్వం, అదే ఆంధ్రాకు చెందిన పారిశ్రామిక వేత్తలను తెలంగాణాలో పరిశ్రమలు స్థాపించాలని, తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆహ్వానించి ఉంటే అది హాస్యాస్పదమే అవుతుంది.

రాజధాని గుంటూరు వద్దే కానీ...

  మొదట విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లున్నారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయదలిస్తే అవసరమయిన భూమి సేకరించడానికే దాదాపు రూ. 20-25,000 కోట్లు అవసరం ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అంతేకాక ఇదివరకు కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ ఘర్, ఉత్తరాఖండ్, జార్ ఖండ్ రాష్ట్రాలు రాజధాని నిర్మించుకోవడానికే కేంద్రం అరకొర నిధులు విదిలించిందని, కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం వేలు,లక్షల కోట్లు కుమ్మరిస్తుందని ఆశపడటం అత్యాసే అవుతుందని కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోపదేశం చేసిన తరువాత నుండి దాని ఆలోచనలో మార్పు కనబడుతోంది.   తెదేపా అధికారం చెప్పట్టగానే ఎవరినీ సంప్రదించకుండానే రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు త్వరలోనే దీనిపై అఖిలపక్ష సమావేశం, ఇంకా అవసరమయితే శాసనసభలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయలు తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల తనను కలిసిన లెఫ్ట్ పార్టీ నేతల ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయం కేవలం నాయకుడు ఒక్కడే నిర్ణయించలేడు, అందరి అభిప్రాయం మేరకు తగిన నిర్ణయం తీసుకొంటామని జవాబు చెప్పడం గమనిస్తే ఆ మార్పు స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఆయన ఈ పని ముందే చేసి ఉండి ఉంటే విమర్శలు ఎదుర్కొనే ఇబ్బంది తప్పేది.   అయితే రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో శివరామ కృష్ణన్ కమిటీ కూడా అంగీకరించింది కనుక విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తోంది. అయితే దానికి ఇప్పుడు సమన్యాయం, సమదూరం అనే కొన్ని సవరణలను జోడిస్తోంది. అక్కడ రాజధాని నిర్మించినట్లయితే అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంటుందని, గనులు, దేవాదాయ, చేనేత, మత్స్య తదితర ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను, సంబంధిత జిల్లాలలోనే నెలకొల్పినట్లయితే అన్ని జిల్లాలకు సమన్యాయం చేసినట్లు ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వంలో వివిధ శాఖలకు చెందిన దాదాపు 900 కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యమయినవి తప్ప మిగిలిన అన్నిటినీ వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలో గణనీయమయిన ఈ మార్పు చాలా అభినందనీయమే. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఉంచి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసినట్లయితే, ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉండదు. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని కోసం మొదలయిన ఉద్యమాలు కూడా చల్లబడుతాయి. అప్పుడు రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు సేకరించే అవసరము తప్పుతుంది. ప్రస్తుతం తక్కువ పరిధిలో రాజధాని నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొనట్లయితే, కేంద్రం ఇచ్చే నిధులతోనే నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టవచ్చును. ఆ తరువాత అవసరమనుకొంటే రాజధానిని కొద్ది కొద్దిగా విస్తరించుకోవచ్చును. ముందు అనుకొన్నట్లుగా రాజధానిని 20-25,000 ఎకరాలలో నిర్మించినట్లయితే దానంతటికీ అవసరమయిన నీటి సరఫరా కూడా కష్టమే అవుతుంది. అదే రాజదానిని చిన్నదిగా నిర్మించుకొన్నట్లయితే నీటి కొరతను కూడా అధిగమించవచ్చును. ఏమయినప్పటికీ రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ తుది నివేదిక ఇచ్చిన తరువాతనే దానిపై తుది నిర్ణయం తీసుకొంటామని మంత్రి నారాయణ చెప్పారు.  

సోనియాగాంధీపై నట్వర్ విమర్శలకు బదులేది?

  మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకధ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు అనేక ఆరోపణలు చేసారు. వాటికి సోనియాగాంధీ నేరుగా సమాధానం చెప్పడమో లేక ఖండించడమో చేయకుండా తను కూడా తన ఆత్మకధ పుస్తకం వ్రాసి దానిలో ఆయన చేసిన ఆరోపణలకు జవాబు చెపుతానని తప్పించుకోవడం గమనిస్తే నట్వర్ సింగ్ చేసిన ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తోంది.   సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవి చేప్పట్టాలనుకొన్నప్పుడు, ఆ పదవి చేపడితే ఉగ్రవాదుల వలన ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చనే భయంతోనే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఆమెను ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అడ్డుపడ్డారనే సంగతి నట్వర్ సింగ్ తన పుస్తకంలో బయటపెట్టారు. ఆయన చెప్పిన ఈ విషయాన్ని సోనియాగాంధీ ఖండించినా లేక నిజాయితీగా అంగీకరించినా బాగుండేది. కానీ ఆమె కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా తన కుటుంబం చేసిన త్యాగాల గురించి  మాట్లాడి, ఇటువంటి ఆరోపణలు తనను కదిలించాలేవని అన్నారు. ఇక ఆమె భర్త రాజీవ్ గాంధీ మరణాంతరం ఆమె ప్రధానమంత్రి పదవి చెప్పట్టకపోయినప్పటికీ, ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోనేదని, అనేక ముఖ్యమయిన ఫైళ్ళు ఆమె ఇంటికి తెప్పించుకొని వాటిపై నిర్ణయాలు తీసుకోనేవారని నట్వర్ సింగ్ ఆరోపించారు. ఇది చాలా తీవ్రమయిన ఆరోపణ. ప్రభుత్వ వ్యవహారాలలో గోప్యనీయత పాటిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, ప్రభుత్వంలో భాగస్వామి కాని ఒక వ్యక్తి ఇంటికి అత్యంత కీలకమయిన ప్రభుత్వ ఫైళ్ళను తీసుకువెళ్ళడం, దానిపై ఆమె తీసుకొన్న నిర్ణయాలను ప్రభుత్వం అమలుచేయడం నిసందేహంగా ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. కానీ ఇటువంటి నేరాలకు పాల్పడినవారికి శిక్షలు పడిన దాఖలాలు లేవు గనుక, ఇప్పుడు కూడా అదే జరగవచ్చును. ఇక ఎమర్జన్సీ తరువాత వచ్చిన ఎన్నికలలో కూడా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 181 సీట్లు గెలుచుకొందని, కానీ ఇప్పుడు ఎటువంటి ఆటంకమూ లేకపోయినా సోనియా, రాహుల్ గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకోవడాన్ని కూడా నట్వర్ సింగ్ తప్పు పట్టారు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలగడానికి కారణం ఆ తల్లి కొడుకులను కాక మరెవారిని తప్పు పట్టగలమని నట్వర్ సింగ్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ ఆరోపణలకు, విమర్శలకు, ప్రశ్నలకు వేటికీ కూడా సోనియాగాంధీ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. కనీసం వాటిని ఖండించే దైర్యం చేయలేకపోయారు. అందువల్ల నట్వర్ సింగ్ చేసిన  ఆరోపణలు నిజమని నమ్మకతప్పదు.

త్యాగశీలివమ్మా...కాదమ్మా...ప్రాణ భయమమ్మా...

  ఇంతవరకు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్న కాంగ్రెస్ నేతలందరూ తమ అధినేత్రి సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవిని త్యజించిన గొప్ప త్యాగశీలి అని చాలా గొప్పగా భజనలు చేసారు. అంతేకాదు ఆమె ఈ త్యాగశీలత గురించి పాటలు కట్టి ఆమె ముందే పాడుకొన్నారు కూడా. అయితే ఆమె కానీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గానీ ఆ భజన పాటలను ఎప్పుడు ఖండించలేదు. అంటే దానర్ధం వారూ ఆ ప్రచారాన్ని ద్రువీకరిస్తున్నట్లేనని అర్ధం అవుతోంది. కానీ మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ వ్రాసిన ఒక పుస్తకంలో ఆమె ప్రధానమంత్రి పదవి చేపడితే ఆమె ప్రాణాలకే ప్రమాదమని రాహుల్ గాంధీ గట్టిగా అడ్డుపడటం వలననే ఆమె పదవి చేప్పట్టలేదనే గొప్ప నిజాన్ని బయటపెట్టారు. అంటే ఆమె పదవి చేప్పట్టకపోవడానికి కారణం ప్రాణ భయమే తప్ప త్యాగం చేసే ఉద్దేశ్యంతో కాదని స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు ఇంతకాలం ఆ త్యాగశీలి భజనలను ఎందుకు ప్రోత్సహించారో అర్ధం కాదు.   ప్రధానమంత్రి పదవి చేపడితే ఉగ్రవాదుల చేతిలో చచ్చిపోతామనే భయం రాహుల్ గాంధీకి ఉందనే సంగతి ఆయన రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ప్రసంగంలోనే బయటపడింది. అయితే ఆ భయంతోనే ఆయన తన తల్లిని కూడా ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అడ్డుపడ్డారనే సంగతి నట్వర్ సింగ్ బయటపెట్టిన తరువాతనే అసలు కధ బయటపడింది. బహుశః అందుకే రాహుల్ గాంధీ కూడా ఇంతకాలం అవకాశమున్నా కూడా ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అమూల్యమయిన అవకాశాన్ని వదులుకొని ఉండవచ్చును. కానీ చివరికి తల్లి బలవంతం చేతనో లేక పార్టీ నేతల ఒత్తిడి కారణంగానో ప్రధాన మంత్రి పదవి చెప్పట్టాడానికి బుర్ర ఊపిన తరువాత, ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దానితో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. అందువల్ల ఆయనకు ఆ అవకాశం కల్పించిన భారత ప్రజలకు, నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పుకోకతప్పదు. నరేంద్ర మోడీ తీరు చూస్తుంటే మరో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని రిస్క్ తీసుకొనే అవసరం లేకుండా చేసేలా ఉన్నారు. ఏమయినప్పటికీ బ్రతికుంటే పార్లమెంటు వెనుక బెంచీలలో కునుకు తీస్తూ శేషజీవితం చల్లగా కులాసాగా గడిపేయవచ్చును. కానీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం ఎందుకు? అనే జ్ఞానం ఒక్క రాహుల్ గాంధీకి తప్ప మరెవరికీ కలగకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

రాహుల్ గాంధీ మరీ ఇంత పిరికి వాడా?

  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు నట్వర్ సింగ్ ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకంలో ఉన్నాయని చెబుతున్న అంశాలు ఎంతో ఆసక్తికరంగా వుండటమే కాకుండా కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించేలా వున్నాయి. ఆల్రెడీ నట్వర్ సింగ్ పుస్తకంలోని విషయాల మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా తన ఆత్మకథ రాసినప్పుడు అసలు నిజాలు బయటపెడతానని ఉక్రోషంగా ప్రకటించారు. నట్వర్ సింగ్ పుస్తకం విడుదలకు ముందే ఇంత సంచలనం సృష్టించింది. పుస్తకం విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందో తలుచుకుంటేనే భలేగా వుంది.   నట్వర్‌సింగ్ ఆత్మకథ పుస్తకంలో వెల్లడి అయిన విషయాలన్నిటీలో చాలా ఆసక్తికరంగా వున్న విషయం, సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకుండా రాహుల్ గాంధీయే ఆపాడనే విషయం. సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే తన నానమ్మ ఇందిరమ్మలా, తండ్రి రాజీవ్ గాంధీలా తల్లి కూడా హత్యకు గురవుతుందని రాహుల్ భయపడ్డాడట. ఈ విషయంలో రాహుల్ మరీ పట్టుదలగా వ్యవహరించి తన తల్లి దేశానికి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నాడట. నట్వర్ సింగ్ చెప్పినదాని ప్రకారం చూస్తుంటే రాహుల్ గాంధీ పరమ పిరికివాడన్న విషయం అర్థమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. మొన్నీమధ్య ముగిసిన ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ తన నాయనమ్మ చావు గురించి, తండ్రి చావు గురించి ప్రస్తావించి, తనను కూడా చంపేసే అవకాశం వుందని బేలగా మాట్లాడి ఓట్లు పొందాలని చూశాడు. అప్పుడే రాహుల్ గాంధీ పిరికితనం దేశానికి తెలిసిపోయింది. ఇప్పుడు నట్వర్ సింగ్ పుస్తకంతో ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. అయినా సోనియాగాంధీ ప్రధానమంత్రి అయితే హత్యకు గురవుతుందని రాహుల్ గాంధీ బుర్రకి ఎందుకు అనిపించిందో ఏంటో!   సోనియాగాంధీని ఎవరైనా చంపదలుచుకుంటే ప్రధానమంత్రి కాకపోయినా చంపుతారు. 2004 తర్వాత ఆము ప్రధానమంత్రి పదవిని చేపట్టకపోయినప్పటికీ, మన్మోహన్‌సింగ్‌ని అడ్డం పెట్టుకుని డిఫాక్టో ప్రధానమంత్రిగా పదేళ్ళపాటు రాజ్యం చేశారు కదా! సోనియాని చంపాలని ఎవరైనా అనుకునే పక్షంలో ఇలా పదేళ్ళు డిఫాక్టో ప్రధానిగా ఉన్నందుకయినా చంపుతారు. మరీ అంత చంపేస్తారని భయం ఉన్నప్పుడు రాహుల్ తన తల్లిని రాజకీయాల్లో ఉంచకుండా ఇంట్లోనే ఉంచేస్తే సరిపోయేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే చంపేస్తారని రాహుల్ గాంధీ భయపడ్డాడు. మరి రాహుల్ గాంధీ తానే స్వయంగా ప్రధానమంత్రి అవ్వాలని కలలు కన్నాడే.. అప్పుడు తనను కూడా చంపేస్తారేమోనని భయం వేసి వుండాలి. అంత భయం వేసినా దేశం కోసం ఆయన ప్రాణాలకు తెగించి అయినా ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని అనుకుని వుండాలి. ఇదంతా ఇలా వుంటే, రాహుల్ గాంధీ తన పిరికితనంతో దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చాడు? ప్రధానమంత్రి పదవి చేపడితే ప్రాణభయం వుంటుందని చెప్పకనే చెబుతున్నాడు. ఇది సమర్థనీయమైన అంశం కాదు. రాహుల్ గాంధీ తాను పిరికిగా ఆలోచించడమే కాకుండా.. దేశానికి కూడా పిరికిమందు నూరిపోసే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో కూడా బ్రేక్ పడనుందా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై వచ్చే ఏడాది మార్చి31వరకు కొత్తగా ఎటువంటి పన్నులు విధించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీఓను హైకోర్టు నిలిపివేసింది. ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల విషయంలో కూడా ప్రస్తుత విధి విధానాలు, ప్రమాణాలనే పదేళ్ళపాటు యధాతధంగా కొనసాగించాలని బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం స్థానికత అంశం లేవనెత్తి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలు చెప్పట్టకుండా జాప్యం చేస్తోంది. దీనిపై కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఒక కేసు నడుస్తోంది. కానీ ఆ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘స్థానికత అంశం’ ప్రస్తావించకుండా కౌన్సిలింగ్ నిర్వహించడానికి తమ వద్ద తగినంతమంది అధికారులు, సిబ్బంది లేరు గనుక మరికొంత గడువు కావాలని కోరడం గమనార్హం. ఈకేసులో ఇంప్లీడ్ అవబోతున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఈ స్థానికత అంశాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చి, విభజన బిల్లుకు వ్యతిరేఖంగా తెలంగాణా ప్రభుత్వం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తోందని సమర్ధంగా వాదించగలిగితే, ఈ విషయంలో కూడా తెలంగాణా ప్రభుత్వానికి అవమానకర పరిస్థితులు ఎదుర్కోక తప్పకపోవచ్చును.

తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు స్పీడ్ బ్రేక్

  చాలా దూకుడుగా సాగుతున్న తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు నిన్న బ్రేకులు వేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాలో ప్రవేశించే వాహనాలపై ప్రవేశపన్ను విదిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీఓ నెంబర్:43ను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషనుపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (రాష్ట్ర విభజన) బిల్లులో సూచించిన విధంగా వచ్చే సంవత్సరం మార్చి 31వరకు ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రంలో ప్రవేశించే వాహనాలపై ఎటువంటి కొత్త పన్నులు విదించరాదని స్పష్టం చేసింది. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీఓ అమలుకాకుండా నిలిపివేసింది. ఇరు రాష్ట్రాలు విభజన బిల్లులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండాలని కోర్టు మెత్తగా చురకలు కూడా వేసింది.   ఇది తెలంగాణా ప్రభుత్వానికి చాలా అవమానకరమయిన విషయమేనని చెప్పవచ్చును. ఈ అంశంపై విభజన బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా ముందుకు సాగినందునే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చును. గతంలో కూడా ప్రభుత్వాలు విడుదల చేసిన అనేక జీఓలపై కోర్టులు స్టే విదించినా అప్పటి పరిస్థితులు వేరు గనుక ప్రభుత్వాలు దానిని అవమానకరంగా భావించేవి కావు. కానీ ఇప్పుడు తనకు తిరుగే లేదని భావిస్తున్న తెలంగాణా ప్రభుత్వం, తను జారీ చేసిన జీఓను కోర్టు నిలిపివేయడం చాలా అవమానకరమేనని చెప్పక తప్పదు. అందువల్ల ఇకనైనా విభజన బిల్లులో పేర్కొన్న షరతులకు లోబడి నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి అవమానకర పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.

కేంద్రం వరమిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కరుణించదేమి

  హైదరాబాద్ జంట నగరవాసులకు, ముఖ్యంగా శివారు ప్రాంతవాసులకు నీటి కష్టాలు కొత్తేమీ కాదు. ఇక వేసవి వస్తే ఆ కష్టాలు రెట్టింపు అవుతుంటాయి. నానాటికి జనాభా పెరిగిపోతుంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అని జనాలు భారంగా ఒక నిటూర్పు విడిచి సరిపెట్టుకోవచ్చును. కానీ నీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రప్రభుత్వం ఆరునెలల క్రితం రూ.1050 కోట్ల నిధులను విడుదల చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అన్నీ ఉన్నప్పటికీ అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయింది భాగ్యనగారవాసుల భాగ్యం. హైదరాబాదు శివారు ప్రాంతాలలో నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం 2014 ఫిబ్రవరి నెలలో రూ.1050 కోట్లు మంజూరు చేసింది. దానిలో శేరిలింగంపల్లి సర్కిల్ కు రూ.439.51 కోట్లు, యల్.బీ.నగర్. సర్కిల్ కు 367.17 కోట్లు, రామచంద్రాపురం సర్కిల్ కు రూ.78.89 కోట్లు, పటాన్ చెరు సర్కిల్ కు రూ.58.19 కోట్లు మజూరు చేసింది. కొన్ని ప్రాంతాలలో పాత పైపుల స్థానంలో పెద్ద పైపుల ఏర్పాటు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు ఏర్పాటు, నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదలకు అవసరమయిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం ఈ నిధులు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరు అయ్యి ఆరు నెలలు గడిచినప్పటికీ పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. నాటి నుండి నేటి వరకు హైదరాబాదు మెట్రో వాటర్ బోర్డు అధికారులు ప్రభుత్వాల చుట్టూ తిరుతూనే ఉన్నారు. కానీ వారి గోడు వినే నాధుడే లేడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రం విడిపోయినట్లయితే నీటి కష్టాలు తప్పవని చాలా ధాటిగా వాదించేవారు. కానీ రూ.1050కోట్ల నిధులు మంజూరు అయినప్పటికీ పనులు మొదలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేయకుండా అలసత్వం ప్రదర్శించి, భాగ్యనగర వాసులకు నీటి భాగ్యం లేకుండా చేసారు. ఆ తరువాత రాష్ట్ర విభజన, ఎన్నికలు వరుసగా వచ్చిపడటంతో ఆ ఫైళ్ళన్నీ దుమ్ముపట్టిపోయాయి. ఇప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కూడా ప్రభుత్వం తమ వినతులను పట్టించుకోకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు తలలు పట్టుకొన్నారు. తాము ఇప్పటికి రెండు సార్లు ప్రభుత్వానికి లేఖలు వ్రాశామని కానీ ఇంతవరకు జవాబు రాలేదని త్వరలో మళ్ళీ మరో మారు లేఖ వ్రాస్తామని అధికారులు చెపుతున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసినప్పటి నుండి రెండు సంవత్సరాలలో వాటిని వినియోగించుకొని పనులు పూర్తి చేసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయని, ఇక మిగిలిన ఏడాదిన్నర కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేసుకోలేకపోయినట్లయితే ఇక ప్రజలకు నీటి ఏడాది ఎన్నటికీ తప్పదని అధికారులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం పనులు మొదలు పెట్టేందుకు వాటర్ బోర్డుకు అనుమతులు మంజూరు చేస్తే నిధులు వెనక్కిమళ్ళి పోకుండా సద్వినియోగం అవుతాయి, ప్రజలకు నీటి కష్టాలు తప్పుతాయి.

అన్నదాతకి కావలసింది ఐప్యాడ్ కాదు చంద్రబాబు గారూ!

  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్న రైతులకు ఐప్యాడ్స్ పంపిణీ చేసే ఆలోచన వున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐప్యాడ్లు ఇవ్వడం ద్వారా రైతులు డైరెక్ట్‌గా ఉపగ్రహం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సూచనలు అందుకుంటారని చెప్పారు. ఈ ప్రకటన విన్న వెంటనే ఎవరికైనా ‘భలే’ అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మాత్రం ఇదెంత అనాలోచిత నిర్ణయమో అర్థమవుతుంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేయాలని, వారి జీవితాలలో మార్పు తీసుకురావాలి అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తూ వుంటారు. అయితే అప్పుడప్పుడు ఏ ఐఏఎస్ అధికారి ఉచిత సలహాల వల్లో ఆ ఆలోచన తప్పుదారి పట్టే అవకాశం కూడా వుంటుంది. రైతులకు ఐప్యాడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించడం కూడా ఈ కోవకు చెందిన ఆలోచనగానే భావించవచ్చు.   అసలు రైతులకు ఐప్యాడ్లు ఎందుకు? సెల్‌ఫోన్ ఆపరేట్ చేయడమే సరిగారాని రైతులకు ఐప్యాడ్లు ఇస్తే వాళ్ళు వాటిని ఏం చేసుకుంటారు? బాగా చదువుకున్నవాళ్ళే ఐప్యాడ్ ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కాక తికమక పడిపోతారు. మరి ఐప్యాడ్లు ఆపరేట్ చేయాల్సిన టెన్షన్ రైతులకి ఎందుకు పెడతారు చంద్రబాబు గారూ. అయినా రైతులకు ఐప్యాడ్లు ఇస్తే ఆ ఖర్చంతా తడిసి మోపెడవుతుంది. ఐ ప్యాడ్ ఇస్తే చాలదు.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ ఇవ్వాలి. ఆ ఖర్చు మరింత భారం. ఇంతా చేస్తే ఐపాడ్స్‌ని రైతులు వ్యవసాయం కోసమే ఉపయోగిస్తారన్న గ్యారంటీ కూడా లేదు. రైతులకు ఐప్యాడ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏ ఐప్యాడ్ల కంపెనీకో, ఆ కంపెనీకి - ప్రభుత్వానికి మధ్యన ఉండేవారికో తప్ప రైతులకు ఎంతమాత్రం ఉపయోగపడేది కాదు.   చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరుకుంటుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే రైతులకు మేలు చేయాలంటే ‘ఐప్యాడ్లు’ కాకుండా ఎన్నో మార్గాలు వున్నాయి. రాష్ట్రంలో రైతులు సరైన విత్తనాలు దొరక్క నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల బారిన పడి మోసపోతున్నారు. అలాగే సరైన సమయంలో ఎరువులు దొరక్క బాధపడుతున్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు బాగుపడిపోతున్నారు తప్ప రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విషయంలో రైతులు మోసపోకుండా చూడాలి.   అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతుకు దక్కడం లేదు. రైతుకు, వినియోగదారుడికి మధ్య చేరిన దళారి డబ్బు మింగుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగదారుడు కూరగాయలను కిలో 40 రూపాయలకు పైగానే కొంటున్నాడు. ఇందులో రైతుకు దక్కేది 5 రూపాయలు కూడా వుండటం లేదు. మిగతా డబ్బంతా మధ్యలో వున్నవారి జేబుల్లోకి వెళ్ళిపోతోంది. అందుకే రైతు నుంచి డైరెక్ట్‌గా వినియోగదారుడికి వ్యవసాయ ఉత్పత్తులు చేరేలా చూడాలి. పండించిన పంటను దాచుకోవడానికి అన్ని ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేయాలి.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని కూడా హైటెక్ చేయాలని అనుకోవడం అభినందనీయమైన విషయమే.. కానీ ఆ ‘హైటెక్’ చేయడం అనేది ఐ ప్యాడ్లు ఇవ్వడం ద్వారా కాకుండా ఆధునిక వ్యవసాయ విధానాలు, యంత్రాల మీద రైతుల్లో అవగాహన పెంచి, వాటిని వారికి అందుబాటులోకి తేవడం హైటెక్ అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయరంగాన్ని కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించడం ద్వారా తక్కువ మ్యాన్ పవర్‌తో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు... అందువల్ల ఆలోచిస్తే, ఆచరణలోకి తెస్తే రైతులకు మేలు చేసే అంశాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తాయి. అలాంటి వాటిని చంద్రబాబు నాయుడు వెతికిపట్టుకోవాలి. రైతులకు ఐప్యాడ్ల పంపిణీ లాంటి నవ్వొచ్చే ఆలోచనలు మానుకోవాలి.

రాజధానిపై ప్రభుత్వం పునరాలోచన?

  రాష్ట్ర రాజధానిని గుంటూరు-విజయవాడ ప్రాంతం మధ్య ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు చాలా మంది సానుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ రాజధాని ఏర్పాటులో ఉండే కష్టనష్టాలను, సమస్యలను శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించడంతో ఆయన పునరాలోచనలోపడినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో, ఒకవేళ అక్కడే రాజధానిని ఏర్పాటు చేయదలిస్తే తప్పనిసరిగా ప్రైవేట్ మరియు వ్యవసాయ భూములను భారీ మూల్యం చెల్లించి కొనవలసివస్తుంది.   ఒకప్పుడు ఎకరం 20-30 లక్షల మధ్య ఉన్న ధరలు, ప్రభుత్వం అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలియగానే, కేవలం నెలన్నర రోజుల వ్యవధిలోనే భూముల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రస్తుతం రూ.50-75లక్షల మధ్య ఉన్నట్లు శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులే స్వయంగా ద్రువీకరించారు. రాజధాని ఏర్పాటుకి కనీసం 20-25వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని ప్రాధమిక అంచనా. ఆ ప్రకారం చూసుకొంటే భూమి కొనుగోలుకే ప్రభుత్వం చాలా భారీ మొత్తం వెచ్చించవలసి ఉంటుంది. అసలే లోటు బడ్జెటుతో, తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమవుతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం అంత భారీ మొత్తం నిధుల సమీకరానా దాదాపు అసంభవమే అవుతుంది. రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఉదారంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఏ మేరకు ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి. కనుక రాజధాని విషయంలో చంద్రబాబు పునరాలోచనలోపడినట్లు మంత్రుల తాజా స్టేట్ మెంటులే పట్టిస్తున్నాయి.   ఒకవేళ రాజధాని ఆ ప్రాంతంలోనే నిర్మించినప్పటికీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము, సచివాలయము, ముఖ్యమయిన కొన్ని ప్రభుత్వభవనాలను మాత్రమే నిర్మించి, శాసనసభ, విధానసభ, హైకోర్టు వంటి వాటినన్నిటినీ వేరే ప్రాంతాలలో లేదా పరిసర జిల్లాలలో ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఆర్దికభారం తగ్గించుకోగలగడమే కాకుండా రాజధాని కోసం వివిధ జిల్లాల డిమాండ్లను అంగీకరించినట్లవుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్నిజిల్లాలు సమానంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. శివరామ కృష్ణన్ కమిటీ కమిటీ వచ్చే నెల 20లోగా తన తుది నివేదిక సమర్పిస్తుంది. కనుక దానిని బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని గమనించినట్లయితే, బయట నుండి భారీ ఆర్ధిక సహాయం లేకుండా తనంతట తానుగా గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయడం దాదాపు అసంభవమేననిపిస్తోంది.

ఇక ఏపీలో హైటెక్ వ్యవసాయం!!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాను గతంలో పాలనలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని విస్మరించారని, కేవలం ఐటీ, పారిశ్రామిక రంగం మీద దృష్టి సారించారన్న అపవాదును మోసిన చంద్రబాబు నాయుడు ఈసారి తన మీద వున్న అపవాదును తొలగించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.   ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ పద్ధతులనే పట్టుకుని వేలాడుతోంది. దానివల్ల దిగుబడులలోగానీ, రైతు జీవితంలోగానీ మార్పు రావడం లేదు. దినదిన ప్రవర్ధమానమవ్వాల్సిన రైతు ప్రగతి తిరుగమనం బాట పట్టడానికి కారణం రైతులలో ఆధునిక వ్యవసాయ విధానం పట్ల చైతన్యం లేకపోవడమేనని చెప్పవచ్చు. ఈ లోపాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యవసాయ బాటలో నడిపించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి ప్రారంభించినట్టు అర్థమవుతోంది.   తన తొమ్మిదేళ్ళ గత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి పథంలో ‘హైటెక్‌’గా నడిపించిన చంద్రబాబును ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా హైటెక్ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రైతులందరికీ ఐప్యాడ్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ ఐప్యాడ్స్ ద్వారా రైతులందరికీ నేరుగా ఉపగ్రహం ద్వారా సమస్త వ్యవసాయ సమాచారం అందే అవకాశం వుంది. అలాగే వ్యవసాయం రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఆధునిక పద్ధతులను కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి తేవడానికి కృషి జరుగుతోంది.

రావణకాష్టంలా రగులుతున్న శ్రీలంక సమస్య

  శ్రీలంక వ్యవహారాలు భారత రాజకీయాలను చిరకాలంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయపార్టీలు శ్రీలంకతో ముడిపడున్న ఏ సమస్యపైనైనా తక్షణమే స్పందించకపోతే ప్రత్యర్ధ పార్టీ నుండి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుందనే భయంతో, ప్రతీ సమస్యపై తీవ్రంగా స్పందిస్తుంటాయి. గతంలో తమిళ పార్టీలు మద్దతు తీసుకొన్న యూపీయే, ఎన్డీయే ప్రభుత్వాలకు శ్రీలంక వ్యవహారంలో తలబొప్పి కట్టింది. శ్రీలంకలో తమిళ ఉగ్రవాద సంస్థ- యల్.టీ.టీ.ఈ.ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో వేలాది తమిళుల మరణానికి కారకుడయిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేను కూడా నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిధిగా ఆహ్వానించడాన్ని నిరసిస్తూ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ప్రతిపక్ష నేత కరుణానిధి ఇరువురు హాజరుకాకుండా శ్రీలంకపై తమ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్పష్టం చేసారు.   తమిళనాడుకు చెందిన భారతీయ జాలారులను శ్రీలంక నావికాదళం తరచు అరెస్ట్ చేయడం ఆనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు మళ్ళీ వారిని విడిచి పెట్టడం చాలా కాలంగానే జరుగుతోంది. మళ్ళీ మొన్న మంగళవారంనాడు కూడా శ్రీలంక నావికాదళం 50మంది జాలారులు తమ జలాలలోకి ప్రవేశించారంటూ అరెస్ట్ చేసింది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుపు అందుకొన్నపుడు, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే సుహృద్భావ సూచనగా అంతవరకు అరెస్ట్ చేయబడిన తమిళ జాలారులందరినీ విడుదల చేసారు. కానీ, ఆ తరువాత ఈ నెలన్నర సమయంలో శ్రీలంక నావికాదళం 93 జాలారులను అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఒత్తిదిమేరకు వారిలో 43మందిని విడుదల చేసినప్పటికీ వారి పడవలు, వలలు వగైరా మాత్రం తిరిగి ఇవ్వలేదు.   ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో రాజకీయ దుమారం లేపుతోంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంలో కేంద్రప్రభుత్వం తక్షణమే కలుగజేసుకొని, జాలారులను, వారి పడవలను విడిపించవలసిందిగా కోరుతూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసారు. బహుశః ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ జాలరులను, వారి పడవలను విడిపించి ఇవ్వవచ్చును. కానీ రావణకాష్టంలా చిరకాలంగా రగులుతున్న ఈ సమస్యను ఆయన శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వితపరిష్కారం చేయగలిగినట్లయితే, ఆయనకు తమిళప్రజల దృష్టిలో మరింత గౌరవం పెరుగుతుంది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌పై సచిన్ చిన్నచూపు?

  ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లని దేశానికి అందించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ని భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్ చిన్నచూపు చూస్తున్నారా? ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కలవటానికి కూడా ఇష్టపడటం లేదా? ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులను చూస్తుంటే ఈ ప్రశ్నలకు ‘అవును’ అని సమాధానం చెప్పక తప్పడం లేదు. ఇంతకీ సచిన్ టెండూల్కర్‌ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఏవైనా మణులు, మాణిక్యాలు అడిగారా? ఆచరణ సాధ్యం కాని గొంతెమ్మ కోరికలేవైనా కోరారా? అలాంటివేమీ లేదు.. కేవలం సచిన్ టెండూల్కర్ని ఒక్కసారి కలవాలనుకున్నారు. భారతీయ క్రికెట్‌కి ఎంతో సేవ చేసిన ఆయనను సత్కరించి, తమను తాము సత్కరించుకున్నట్టు ఫీలవ్వాలని అనుకున్నారు. అయితే వారి ఈ కోరికని సచిన్ టెండూల్కర్ పట్టించుకోవడం లేదని సమాచారం. కనీసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను కలవటానికి కూడా సచిన్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్వాపరాలను పరిశీలిస్తే.... సచిన్ టెండూల్కర్ ఆగస్టు ఒకటో తేదీన విజయవాడకి రాబోతున్నారు. వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడలో నిర్మించిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు. సచిన్ ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కలవాలని, సత్కరించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆశించారు. అయితే సచిన్ దీనికి అంగీకరించలేదు. దీని వెనుక వున్న మూల కారణాన్ని పరిశీలిస్తే, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగరాజుకి, సచిన్ టెండూల్కర్‌ విజయవాడకు రావడానికి సహకరిస్తోన్న చాముండేశ్వరీనాథ్‌కి పాత గొడవలు ఏవో వున్నాయి. దాంతో గంగరాజు అధ్యక్షుడిగా వున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులను సచిన్ కలవకుండా చాముండేశ్వరినాథ్ అడ్డుపుల్ల వేసినట్టు తెలుస్తోంది.   పొట్లూరి వరప్రసాద్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం సచిన్ చాలా గంటలు విజయవాడలోనే వుండబోతున్నారు. ఆయనకు ఈ సందర్భంగా పొట్లూరి వరప్రసాద్ సత్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమకు ప్రారంభోత్సవంలో లేదా సత్కార కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కోరినప్పటికీ పొట్లూరి వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్‌ని కూడా చాముండేశ్వరినాథ్ ప్రభావితం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ అధికారులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సచిన్ టెండూల్కర్‌ని కలసి స్ఫూర్తిని పొందే అవకాశం లేకుండా పోతోంది.

పరిపాలనలో వేళ్ళు పెడుతున్న ‘చిన్న’బాబు లోకేష్!

  తెలుగుదేశం పార్టీ మీద తన తండ్రి చంద్రబాబు నాయుడి తర్వాత ఆ స్థాయిలో పట్టు సాధించిన నారా లోకేష్ ఇప్పుడు తన పట్టును ప్రభుత్వం మీద కూడా బిగించడానికి నడుం బిగించినట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగా పరిపాలనకు సంబంధించిన అంశాలలో కూడా ‘చిన్న’బాబు నారా లోకేష్ వేళ్ళు పెడుతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాల మీద నారా లోకేష్ పరోక్షంగా ప్రభావాన్ని చూపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష కార్యాచరణకు దిగిపోయారు. పరిపాలనకు సంబంధించిన అంశాలలో మెల్లమెల్లగా జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. తాజాగా మంత్రులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సెక్రటరీల నియామకానికి సంబంధించిన అంశంలో లోకేష్ జోక్యం చేసుకున్నారు. ఏడుగురు మంత్రులు నియమించుకున్న ప్రైవేటు సెక్రటరీలను లోకేష్ తొలగించి ఆ స్థానాల్లో తనకు నచ్చిన వారిని నియమించారు.   ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నియమించుకున్న ప్రైవేట్ సెక్రటరీని లోకేష్ తొలగించి, ఆ స్థానంలో వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా వున్న ఒక మహిళను లోకేష్ నియమించారు. సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు తనకు నచ్చిన వ్యక్తే తన ప్రైవేటు సెక్రటరీగా వుండాలని ఎంత ప్రయత్నించినా చిన్నబాబు దగ్గర ఆయన పప్పులు ఉడకలేదని తెలుస్తోంది. ‘పైనుంచి’ ఒత్తిడి రావడంతో లోకేష్ చేసిన నియామకానికి యనమల తల ఊపక తప్పలేదని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నియమించుకున్న ప్రైవేటు సెక్రటరీని కూడా లోకేష్ సాగనంపేశారు.   అలాగే గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర ప్రైవేటు సెక్రటరీలుగా పనిచేసిన వారిలో కొంతమందిని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులు కూడా కొనసాగించాలని భావించారు. ఆయా శాఖల్లో వారికి ఉన్న అనుభవం పరిపాలనలో తమకు ఉపయోగపడుతుందని వారు ఆశించారు. అయితే లోకేష్‌ మాత్రం గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రైవేట్ సెక్రటరీలు ఎవరినీ నియమించుకోవద్దని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మంత్రుల ప్రైవేట్ సెక్రటరీలుగా లోకేష్ పచ్చజెండా ఊపినవారినే నియమిస్తున్నట్టు సమాచారం.   పార్టీ మీద పూర్తి పట్టు సాధించిన లోకేష్ పరిపాలన, ప్రభుత్వం మీద కూడా పట్టు సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి నుంచే పార్టీ, ప్రభుత్వం మీద గ్రిప్ సాధిస్తే 2019 ఎన్నికల నాటికి తాను చాలా ‘ముఖ్యుడిగా’ మారితే పరిపాలనలో అనుభవ లేమి వుండదని లోకేష్ భావిస్తూ వుండొచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే లోకేష్‌ పరిపాలనకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోవడం, ముఖ్యంగా పరిపాలలో మొదటి మెట్టు అయిన ప్రైవేట్ సెక్రటరీల నియామకం విషయంలోనే తమ మాట నెగ్గకపోవడం కొందరు మంత్రులను ఇబ్బందిపెడుతోందని తెలుస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఎలా వుంటే ముందు ముందు లోకేష్ విశ్వరూపాన్ని ఏ స్థాయిలో చూడాల్సి వస్తుందో అని కొందరు మంత్రులు భయపడుతున్నట్టు సమాచారం. అయితే పార్టీ అధినేత కుమారుడు కావడంతో లోకేష్ ‘ఇన్వాల్వ్‌మెంట్’ విషయంలో మంత్రులు పెదవి విప్పలేకపోతున్నారని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ కబుర్లు

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఇంతకుముందు యూపీఏ అధికారంలో ఉన్నపుడు ఆయనను ఏదో ఒక కాలేజీవాళ్ళో, సంస్థలో ఆహ్వానిస్తే ఆయన రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారికత, అవినీతి అరికట్టడం, యువత, నగదు బదిలీ పధకం దాని ప్రయోజనాలు వంటి అంశాలపై అనర్గళంగా ఉపన్యాసాలు దంచుతూ క్షణం తీరికలేకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఉపన్యాసాలను వినేవారే కరువయ్యారు. అందుకని ఇప్పుడు మీడియా వాళ్ళను పిలిచి మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.   ఇటీవల అమేథీ పర్యటించినపుడు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగిపోయాయని, కనుక బీజేపీకి ఓటేసి గెలిపిస్తే పెరుగుతున్న ధరలను అదుపు చేసి చూపిస్తామని నరేంద్ర మోడీ నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాని మోడీయే బాధ్యత వహించాలి. తక్షణమే ధరల అదుపుకు అవసరమయిన చర్యలు చెప్పట్టాలి,” అని డిమాండ్ చేసారు. రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పెరుగుతున్న ధరలపై మాట్లాడటం వినడానికి చాలా బాగుంది. కానీ యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఈ విషయంపై నోరెందుకు మెదపలేకపోయారో కాస్త వివరిస్తే బాగుండేది.   గత పదేళ్ళలో ఆయన ఏనాడు కూడా ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఎందువలన అంటే కేంద్రంలో రాష్ట్రంలో కూడా తమ పార్టీయే అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బెంచీలలోకి మారింది గనుక ఇప్పుడు దైర్యంగా ధరల పెరుగుదల గురించి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల ఎన్డీయే అధికారం చెప్పట్టక మునుపు నుండే మొదలయిందనే విషయాన్ని ఆయన ఇప్పుడు ప్రస్తావించడంలేదు.   రాహుల్ గాంధీ అడిగినా, అడగకపోయినా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేప్పట్టింది. అయితే వాటి ఫలితాలు కనబడటానికి మరోకొంత సమయం పట్టవచ్చునని మార్కెట్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ పనితీరును అంచనావేసేందుకు, ప్రభుత్వానికి మరికొంత సమయం ఈయవలసి ఉంటుందని అన్నారు. అటువంటప్పుడు యూపీయే ప్రభుత్వం పదేళ్ళ పాలనలో చేయలేని పనిని మోడీ ప్రభుత్వం కేవలం నెల పదిహేను రోజుల వ్యవధిలోనే చేయాలని రాహుల్ గాంధీ ఆశించడం చాలా హాస్యాస్పదం. కనుక రాహుల్ గాంధీ తనకు బాగా పట్టున్న మరేదయినా అంశం గురించి మాట్లాడితే బాగుంటుందేమో!