పరిపాలనలో ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల ప్రత్యేక ముద్రలు

ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ పరిపాలనలో ప్రత్యేక పంధాను అనుసరిస్తున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలనలో ప్రభుత్వంపై అది తలపెట్టే ప్రతీ కార్యక్రమాలు, పధకాలలో స్పష్టమయిన తెలంగాణా ముద్ర కనబడాలని ఆరాటపడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వ రాజముద్రలో యావత్ దేశానికి సుపరిచితమయిన చార్మినార్ బొమ్మను ముద్రించడం, తెలంగాణ సంస్కృతి ఆచారాలకు అద్దంపట్టే బ్రతుకమ్మ, బోనాలు పండుగలను అధికారిక పండుగలుగా ప్రకటించడం, గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వంటివి అందుకు చక్కటి ఉదాహరణలు.   తెలంగాణా చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, తెలంగాణా కవులు, రచయితలు వగైరాలను వచ్చే ఏడాది నుండి పిల్లల పాట్యంశాలలో చేర్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇక తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేయాలనే కేసీఆర్ ఆలోచన ఆయనలో తెలంగాణావాదానికి మరో మంచి ఉదాహరణ. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా జరుగుతున్న సర్వే కూడా తెలంగాణా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదేనని ఆయనే స్వయంగా ప్రకటించారు.   ఈవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతీ నిర్ణయంలో, కార్యక్రమంలో తెలంగాణా ముద్ర స్పష్టంగా కనబడాలని తపిస్తుంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ అడుగు అభివృద్ధి పధం వైపే పడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఆయన తన మంత్రులందరికీ పూర్తి స్వేచ్చనిచ్చి వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును, తద్వారా ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచి అందరినీ రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకొనేలా గట్టిగా కృషి చేస్తున్నారు. మంత్రులకు పూర్తి స్వేచ్చనిచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వారి పనితీరును సమీక్షిస్తూ వారిని మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నారు.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చెప్పట్టక మునుపు, తరువాత కూడా ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులందరినీ స్వయంగా కలిసి రాష్ట్ర సమస్యల గురించి వివరించి వారి సహకారం కోరారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఉదారంగా అంగీకరించి రాష్ట్రానికి అనేక పధకాలను, పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు, పధకాలు, ప్రాజెక్టుల మంజూరు వంటి పనులను చక్కబెట్టేందుకు కంబంపాటి రామ్మోహన్ రావును డిల్లీలో రాష్ట్రప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, యంపీల ద్వారా కేంద్రంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను రప్పించేందుకు, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి, ప్రయత్నాల యొక్క ఫలితాలు క్రమంగా ప్రస్పుటంగా కనబడటం మొదలవుతుంది. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి కారణంగానే ఇంతవరకు తీవ్ర విద్యుత్ కొరతతో, కోతలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆ సమస్యల నుండి క్రమంగా బయటపడుతోంది.బహుశః త్వరలోనే చంద్రబాబు నాయుడు పాలన పూర్తి వేగం పుంజుకొని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మొదలవవచ్చును.

అయినా... జగన్ మారలేదు...

  అయినా... జగన్ మారలేదు... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి సమావేశాలు జరిగినప్పటి నుంచి తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మీద ఒకటే ఆశ పెట్టుకున్నారు. అదేమిటంటే, ఈ రెండు అసెంబ్లీ సెషన్ల మధ్యకాలంలో ఆయనలో ఏదైనా మార్పు వస్తుందేమోననని!! కానీ ఆయనలో ఎంతమాత్రం మార్పు రాలేదు. నేనింతే అని తన పంథాలో తాను వెళ్తూనే వున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమర్థ నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అవసరం ఎంతో వుంది. అలాంటి ప్రతిపక్షం పాత్రను వైసీపీ ధరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వుంది. అయితే జగన్ ప్రజల అభిప్రాయానికి ఎంతమాత్రం విలువ ఇవ్వకుండా తన రాజకీయ వ్యూహాలలో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ మొదటి సమావేశాలను ఆయన ఇలాంటి విమర్శలతోనే వృధా చేశారు. తొలి సమావేశాలు జగన్ ఎలాగూ వృధా చేశారు. ఈ వర్షాకాల సమావేశాల నాటికి అయినా జగన్‌లో మార్పు వస్తుందని జనం భావించారు. ఆ సమావేశాలకు, ఈ సమావేశాలకు మధ్యకాలంలో జగన్ తనను తాను పరిశీలించుకుంటారని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అర్థం చేసుకుని పాలక పక్షానికి సహకరిస్తారని ఆశించారు. అయితే జగన్ వారి ఆశలను వమ్ము చేసేశారు. సోమవారం ప్రారంభమైన ఏసీ అసెంబ్లీ సమావేశాలలో జగన్ పక్షం తన విశ్వరూపాన్ని మరోసారి చూపించడంతో అసెంబ్లీ ఎంతమాత్రం జరగకుండానే మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నాడు జగన్ కాస్తంత అయినా నిర్మాణాత్మకంగా వ్యవహరించి వుంటే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద చక్కని చర్చ జరిగి మంచి పరిష్కార మార్గాలు అభించి వుండేవి. అయితే జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు. తాను ఎంతమాత్రం మారలేదని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. మంగళవారం నుంచి అయినా జగన్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే బాగుంటుంది.

వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్

  వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తన హామీని నిలబెట్టుకొంటూ ఈసారి రాష్ట్ర బడ్జెట్టుతో ప్రత్యేకంగా వ్యవసాయానికి కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా రూపొందించారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఈనెల 22న వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. మంత్రి నారాయణ ఆ బడ్జెటును శాసనమండలిలో ప్రవేశపెడతారు. ఈసారి తెదేపా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబోతోందని, రుణాల మాఫీతోనే స్పష్టం అర్ధమయింది. ఇప్పుడు వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెటు కూడా కేటాయించడం ద్వారా మున్ముందు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయంలో యంత్రాల ఉపయోగం, బిందు సేద్యం, విత్తన ఉత్పత్తి, పండ్ల తోటల పెంపకం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి వంటివాటికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు. కనుక వ్యవసాయ బడ్జెటులో వీటన్నిటికీ ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం.. ఘోరం..!

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వం చేపట్టి రెండు నెలలు దాటింది. ఈ రెండు నెలల కాలంలో కేసీఆర్ ఊడబొడిచింది ఏమీ లేదని, రోజుకు రెండు మూడు కొత్త పథకాలను ప్రకటిస్తూ జనం చెవుల్లో పువ్వులు పెట్టడం మినహా ఆయన సాధించింది ఏమీ లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అయితే అలా విమర్శించడం తగదు. కేసీఆర్ అధికారాన్ని చేపట్టి కేవలం రెండు నెలలేగా అయింది. ఈ కొద్ది వ్యవధిలోనే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాదు కదా.. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు్న్నవారు అర్థం చేసుకోవాలి. ఈ రెండు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదని, హామీలతోనే కేసీఆర్ తెలంగాణ ప్రజల కడుపులు నింపేస్తున్నారని విమర్శించడం ఎంతవరకు న్యాయమో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి.   అలాగే కొంతమంది నాయకులు కేసీఆర్ ప్రభుత్వం చాలా విషయాలలో విజ్ఞత లేకుండా ఆలోచిస్తోందని, అందువల్లే అనేక విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవాల్సి వచ్చిందని, కోర్టుల దగ్గర మొట్టికాయలు వేయించుకోవాల్సిన ఖర్మ పట్టిందని అంటున్నారు. అధికార పార్టీ నాయకులకు ఉద్యమ ఆవేశం తప్ప, పరిపాలనా చాతుర్యం లేదని జాతీయ స్థాయిలో నవ్వుకునేలా కేసీఆర్ చేశారని విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం న్యాయం కాదు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు పూర్తిగా నిరాధారం. ఇదంతా కేసీఆర్ మీడియాతో ఎంత ఫ్రెండ్లీగా వుంటున్నారో తెలిసికూడా చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు.   ఆగస్టు 19వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే మీద కొంతమంది నోరు చేసుకుంటున్నారు. సీమాంధ్రుల మీద కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ సర్వే అని విమర్శిస్తున్నారు. సర్వే పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టమని కోర్టుకు హామీ ఇచ్చి కూడా ప్రజల్ని ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని అంటున్నారు. అయితే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు తగదు. ఎంతో చిత్తశుద్ధితో, ఎంతమాత్రం ప్రాంతీయ భేదం లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం.. ఘోరం..!

కాంగ్రెస్ ఓటమికి రాహుల్ కాదు మోడీయే కారణమట

    శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లు, రాజకీయపార్టీలు తమ అభిప్రాయాలకు, నమ్మకాలకు శాస్త్రీయత కల్పించి వాటిని ప్రజల మీద రుద్దేందుకు కమిటీలు వేసుకొంటుంటాయి. అటువంటిదే అంటోనీ కమిటీ కూడా. ముంజేతి కంకణంలా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారాణాలు కళ్ళెదుట కనబడుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు కనుగొనేందుకు వేయబడిన అంటోనీ కమిటీ ఊహించినట్లే కొండను త్రవ్వి ఎలుకను పట్టుకొంది.   నివేదికలో మొట్ట మొదటగా పార్టీ అపజయానికి రాహుల్ గాంధీ ఎంత మాత్రం బాధ్యుడు కాడని దృవీకరించింది. సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ కూడా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని, అయినప్పటికీ ప్రజలు, చివరికి మీడియా కూడా మోడీ మాయలో పడిపోయినందునే పార్టీ ఓడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు చూస్తున్న కొన్ని శక్తులే రాహుల్ గాంధీకి నాయకత్వపటిమ లేదనే వదంతులు వ్యాపింప జేస్తున్నాయని, కానీ రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలోనే పార్టీ పునర్వైభవం సాధిస్తుందని నివేదికను తయారు చేసిన అంటోనీ అభిప్రాయపడ్డారు. అందువల్ల సోనియా, రాహుల్ గాంధీల వలన కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, మోడీ వలననే ఓడిపోయిందని, కమిటీ తేల్చి చెప్పింది   కనుక ఇక కాంగ్రెస్ నేతలెవరూ వారిరువురి నాయకత్వాన్ని సందేహించనవసరం లేదు. అదేవిధంగా వారిరువురి నాయకత్వంలో ఏదో ఒకరోజు పార్టీ పునర్వైభవం సాధించడం కూడా ఖాయమని అంటోనీ కమిటీ ద్రువీకరిస్తోంది గనుక ఇక కాంగ్రెస్ నేతలు అందరూ గుండెల మీద హస్తాలు వేసుకొని హాయిగా నిద్రించవచ్చును. కమీటీల వలన ఇటువంటి గొప్ప ప్రయోజనాలున్నాయి గనుకనే, రాజకీయ పార్టీలు కమిటీలు వేసుకొంటుంటాయి. దీనిని బట్టి తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే జ్ఞానంలోనే కాదు అజ్ఞానంలో కూడా ఆనందం ఉంటుందని తెలుస్తోంది.

గవర్నర్ మధ్యవర్తిత్వం ఫలించేనా?

  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అల్పాహార విందుకు ఆహ్వానించి వారిరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసారు. గవర్నర్ పెద్దరికంతో చేసిన మధ్యవర్తిత్వాన్ని మన్నించి ఇరువురు ముఖ్యమంత్రులు ఇకపై సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొంటామని హామీ ఇచ్చారు. ముందు అధికారుల స్థాయిలో సమస్యాత్మక అంశాలను గుర్తించి ఆ తరువాత వాటిపై ఇరువురూ కూర్చుని మాట్లాడుకోవాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. నిజానికి రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంభిస్తే ఎటువంటి సమస్యలనయినా చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం కష్టమేమీ కాదు. కానీ ఈ గొడవలన్నిటికీ మూలం ఆ సమస్యలు ప్రధాన కారణం కాదు. ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలను నడుపుతున్న తెదేపా, తెరాసల మధ్య, వాటి అధినేతల మధ్య రాజకీయ వైరమే ప్రధాన కారణమని చెప్పవచ్చును. అదీకాక ప్రభుత్వాలను నడుపుతున్న ఆ రెండు పార్టీలపై ప్రజలు చాలా భారీగా ఆశలు పెట్టుకొన్నారు. అందువల్ల వారిని మెప్పించే ప్రయత్నంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ అంశంపై పంతాలకు, పట్టింపులకు పోతుండటంతో గోటితో పోయే సమస్యలకు కూడా గొడ్డలి అందుకొంటున్నాయి. కనీసం ఇప్పటినుండయినా చంద్రబాబు, కేసీఆర్ సయోధ్యకు ప్రయత్నిస్తే గవర్నరే కాదు ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి: భూమా నాగిరెడ్డి

  రాష్ట్రవిభజనను వ్యతిరేఖిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం పూరించినపుడు ఆపార్టీ నేతలందరూ ఆయనకు బాగానే వంతపాడారు. ఎందువలన అంటే ఆయన పోరాటం విభజనకు వ్యతిరేఖంగా కాక ఆ పేరుతో సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకొని ఎన్నికలో గెలవడం కోసమే కనుక. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తపించిపోయారో అందరికీ తెలుసు. కానీ ఆయనకు ఆ అవకాశం రాలేదు. బహుశః అందుకే ఇప్పుడు చాప క్రింద నీరులా మెల్లగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వైకాపా నిప్పు రాజేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత భూమానాగిరెడ్డి ఇటీవల నంద్యాల మండలంలో పాండురంగపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ, తాను ఏనాడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోలేదని, కానీ ఇప్పుడు సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కోరుకొంటున్నానని అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొంటేనే రాయలసీమ రైతులు బాగు పడతారని ఆయన అన్నారు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడిన వైకాపా ఇప్పుడు అకస్మాత్తుగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిప్పు రాజేయడం చూస్తే, అధికారం చేజిక్కించుకోవడం కోసం రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయడానికి కూడా వైకాపా సంకోచించదని స్పష్టమవుతోంది.   రాయలసీమ అన్నివిధాల వెనుకబడుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజాప్రతినిధులలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన లేకపోవడమే. వారికి ఎంతసేపు తమ స్వార్ధ రాజకీయాలు, వ్యాపారాల గురించి ఆలోచనలే తప్ప సీమ అభివృద్ధికి వారు చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తప్ప బాగుపడలేమని భూమనాగి రెడ్డి చెప్పడం బహుశః వైకాపా ఆలోచనే కావచ్చును.   రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు తప్ప ఏనాడు సీమను పట్టించుకొన్న పాపాన్నపోలేదు. అయినప్పటికీ సీమతో సహా మిగిలిన జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాదు మన రాష్ట్రమే కదా అనే ఉదారమయిన ధోరణితో ఎన్నడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అందుకే అందరూ కలిసి రాష్ట్రవిభజనకు వ్యతిరేఖంగా చాలా తీవ్రంగా పోరాడారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం స్వార్ధ రాజకీయాల ముందు తలొంచక తప్పలేదు. అందుకు దానిపై ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకొన్నారు. అది వేరే సంగతి.   గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీమ ప్రజలు ఇప్పుడు తమ ప్రాంత అభివృద్ధి జరగాలనే తపనతో వారు తమకు రాజధాని కావాలని గట్టిగా అడుగుతున్నారు. వారి కోరికలో ఎటువంటి తప్పు లేదు కూడా. గత ఆరు దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన సీమను ఇప్పటికయినా పాలకులు పట్టించుకొని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. రాజధాని ఏర్పడినట్లయితే సహజంగానే అభివృద్ధి జరుగుతుంది గనుక రాయలసీమలో రాజధాని కోసం వారు పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం విజయవాడ-గన్నవరం మధ్యనే రాజధానికి మొగ్గు చూపుతుండటంతో వారు అసంతృప్తికి గురయిన మాట వాస్తవం. వారి ఆ అసంతృప్తినే మరింత పెంచిపోషించగలిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంటుందని వైకాపా నేతల ఆలోచన కావచ్చును. బహుశః అందుకే భూమానాగిరెడ్డి వంటి వైకాపా నేతలు చాప క్రింద నీరులా రాయలసీమ ప్రజలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.   కానీ రాష్ట్ర విభజన వల్ల ఎంత అనర్ధం జరిందో, జరుగుతోందో చూసిన తరువాత కూడా వైకాపా నేతలు అధికారం చేజ్జికించు కోవడంకోసం మరోమారు రాష్ట్ర విభజన జరగాలని కోరుకోవడం చాలా దారుణం. అందువలన సీమ ప్రజలు ఇటువంటి ఉపదేశాలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ పోరాటాన్ని కేవలం తమ ప్రాంత అభివృద్ధి కోసమే పరిమితం చేయాలి. రాష్ట్రంలో రాయలసీమలాగే రాష్ట్రంలో వెనుకబడిన మరో ప్రాంతం ఉత్తరాంధ్ర. అక్కడి ప్రజలు కూడా ఇటువంటి రాజకీయ నేతలపట్ల అప్రమత్తంగా ఉంటూ తమ జిల్లాల అభివృద్ధికోసం ప్రజాప్రతినిధులపై నిరంతరం గట్టిగా ఒత్తిడి చేస్తుండాలి. అప్పుడే రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెంది, ఈ విభజన సెగలు చల్లారే అవకాశముంటుంది.

తెలంగాణా సర్వే ప్రయోజనం నెరవేరేనా?

  ఈనెల 19న తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలయిన ఒక పిటిషనుపై హైకోర్టు స్పందిస్తూ ప్రజలు సర్వేలో పాల్గొనాలని కానీ లేదా వారి వ్యక్తిగత వివరాలను తెలియజేయమని గానీ ప్రభుత్వం వారిపై ఎటువంటి ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. ప్రజలు ఇష్టమయితేనే ఈ సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేయించుకోవచ్చని, సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని స్పష్టంగా చెప్పింది. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్చంద సర్వే అని, ఇందులో పాల్గొనమని ఎవరినీ బలవంతంగా ఎవరూ ఒత్తిడి చేయబోమని ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలియజేసారు. ఆయన ఈవిధంగా చెప్పడం చాలా ఆశ్చర్యం  కలిగిస్తుంది. ఎందువలన అంటే ప్రభుత్వం చెపుతున్నదానికీ, ఆయన చెప్పిన దానికీ మధ్య చాలా తేడా కనబడుతోంది.   తెలంగాణాలో ప్రజలందరూ ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని ఇంతవరకు తెలంగాణా ప్రభుత్వం పదేపదే చెపుతోంది. అందుకొరకే సర్వే జరిగే రోజున అంటే ఆగస్ట్ 19న తెలంగాణాలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, స్కూళ్ళు, కాలేజీలకు అన్నిటికీ శలవు ప్రకటించి, ఆరోజు ప్రజలందరూ తప్పనిసరిగా తమతమ ఇళ్ళవద్దే ఉండి సర్వే ఫారములు నింపడానికి అవసరమయిన అన్ని ఆధారాలను సిద్దంగా ఉంచుకోవాలని నోటిఫికేషన్ లో కోరింది.   కనుక ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజలను సర్వేలో పాల్గోమని ప్రభుత్వం ప్రజలను ఒత్తిడి చేయకపోయినట్లయితే, ఇంత భారీ సర్వే చేసి ప్రయోజనం ఉండదు. అలాగని ఒత్తిడి చేసినట్లయితే తరువాత కోర్టు కేసులు ఎదుర్కోక తప్పదు. ఈ సర్వేలో పాల్గొనడం తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంగా చెప్పినందున ఒకవేళ తెలంగాణాలో స్థిరపడిన లక్షాలాది ఆంద్ర ప్రజలు, బోగస్ రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందుతున్న అనర్హులు ఈ సర్వేలో పాల్గొనకపోతే ఈ సర్వే యొక్క ప్రయోజనం కూడా నెరవేరదు. కనుక ప్రభుత్వం ప్రజల మీద పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వారి వివరాలు సేకరిస్తుందా? లేక దీనిని తూతూ మంత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకొంటుందా? అనే సంగతి మరో నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది.

ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తాము: జగన్

  ఇటీవల హత్యకు గురయిన గొట్టిముక్కల గ్రామ ఉపసర్పంచ్ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను పరామార్శించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు, తమ పార్టీ సభ్యులపై తెదేపా దాడులు పెరిగిపోయాయని, చివరికి పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు ఒత్తిడి వల్ల తమ పార్టీ కార్యకర్తలపి దాడులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని, కనీసం తమ పిర్యాదులను కూడా వారు స్వీకరించడంలేదని ఆరోపించారు త్వరలో మొదలవనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు.   రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు మొగినట్లు రాజకీయ ఘర్షణలు కూడా రెండు వర్గాలు కలహించుకొన్నపుడే మొదలవుతాయి. రాజకీయ ఘర్షణలలో సాధారణంగా కార్యకర్తలే బలవుతుంటారు తప్ప నేతలు కారు. ఎందువలన అంటే సదరు పార్టీల నేతలు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ సిబ్బంది పహారాలో కులాసాగా జీవిస్తుంటారు.ఇటువంటి దురదృష్ట ఘటనలు జరిగినప్పుడు సదరు నేతలు వచ్చి దానిని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు. కార్యకర్తలు ఏ పార్టీకి చెందినప్పటికీ వారు మనుషులే, వారికీ వారిపై ఆధారపడిన కుటుంబాలు కష్టనష్టాలు ఉంటాయి. కనుక రాజకీయ పార్టీల నేతలు వారి సంక్షేమం కోసం తామేమి చేసామో, ఏమి చేయగలమని ఆలోచించి తదనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది. అదేవిధంగా పోలీసులు కూడా రాజకీయాలకు, ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయగలిగినప్పుడే వారిపై ప్రజలలో నమ్మకం, గౌరవం ఏర్పడుతుంది.

జడ్జీల అప్పాయింట్‌మెంట్స్‌ కమీషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

  న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందని కొన్ని రోజుల కిందట ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని తట్టిలేపాయి. అందుకే న్యామూర్తుల నియామకాల ప్రక్రియను నిర్వహించే సుప్రీం కోర్టు కోలీజియం వ్యవస్థలో సమూలమయిన మార్పులు చేస్తూ మోడీ ప్రభుత్వం లోక్ సభలో జ్యుడీషియల్‌ అ ప్పాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది. సభ్యుల సూచనల ప్రకారం ప్రభుత్వం దానిలో కొన్ని సవరణలు చేయడంతో లోక్ సభ నిన్న దానిని ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కనుక రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత బలం లేనప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ సహకారంతో బిల్లు ఆమోదం పొందడంలో పెద్ద ఇబ్బందేమీ ఉండదని భావించవచ్చును.   ఇదివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ముగ్గురు న్యాయమూర్తులు ఉండే కోలీజియం వ్యవస్థను ఇప్పుడు ఆరుగురు సభ్యులుంటారు. వారే ఇకపై న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు వంటి వ్యవహారాలను చూసుకొంటారు.

ఏ చట్ట ప్రకారం 19న సర్వేకి సహకరించాలి?

  ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సర్వే తెలంగాణలో వున్న సీమాంధ్రులను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతో చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తు్న్న నేపథ్యంలో ఈ సర్వేని తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్వే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పౌర హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేకి సహకరించాల్సిన అవసరం లేదని ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారు. ఏ చట్ట ప్రకారం ఈ సర్వేకి సహకరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే విషయంలో ప్రజలు ఎంతమాత్రం భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని, సర్వేకి సహకరించకపోతే ఏవైనా సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ సర్వేకి సహకరిస్తేనే ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తమకు సంబంధించిన, తమకు వెల్లడించడానికి ఇష్టం లేని ఏ అంశాన్నీ సర్వే సిబ్బందికి వెల్లడించాల్సిన అవసరం లేదని, మనకు సంబంధించిన ఆస్తులు తదితర వివరాలన్నీ కేవలం ఒక్క భారత ప్రభుత్వానికి మాత్రమే వెల్లడి చేయాలని, ఆధార్ కార్డుల రూపకల్పన సమయంలో మనకు సంబంధించిన వివరాలన్నీ భారత ప్రభుత్వానికి వెల్లడించామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలేవీ వెల్లడించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. మన ఆస్తులు, స్థానికత తదితర అంశాల గురించి మనను ప్రశ్నించే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆయన చెబుతున్నారు.   తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకి ఎలాంటి చట్టబద్ధత, హేతుబద్ధత లేదని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు. నిజానికి కేంద్ర పరిధిలో వున్న అంశాల గురించి సర్వేలు జరపడం గానీ, సమాచార సేకరణ గానీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు వుండదని, ఒకవేళ తమకు ఆ హక్కు వుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తు్న్న పక్షంలో తాము ఆ సర్వే ఎందుకు చేయబోతోంది, సర్వే ఉద్దేశమేమిటి? సర్వే సందర్భంగా ప్రజల్ని ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, ఆ ప్రశ్నల ద్వారా ప్రజల నుంచి ఎలాంటి సమాధానాన్ని ఆశిస్తున్నారు? ఆ ప్రశ్నలు అడగటంలో తమకున్న చట్టపరమైన హక్కులేమిటి అనే అంశాలన్నిటితో ఒక గెజిట్ విడుదల చేయాలి. ఆ గెజిట్ మీద అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే తమకు ఉన్న హక్కులకు లోబడి సర్వే చేయాలి. మరి తెలంగాణ ప్రభుత్వం అలాంటి కసరత్తులేవీ చేయకుండా సర్వే చేయడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధమేనని జంధ్యాల రవిశంకర్ చెబుతున్నారు.  

సోనియా ఆందోళన ఎవరికోసం?

  బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరభారత దేశంలో మత ఘర్షణలు గణనీయంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ముఖ్యంగా మహారాష్ట్రాలో నానాటికీ పెరుగుతున్న ఈ మతఘర్షణలు తమకు చాలా ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను కులాలు, మతాల వారిగా విడదీసి వారి మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని ఆమె ఆరోపించారు. తమ యూపీయే హాయంలో ఏనాడు దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో మతఘర్షణలు జరిగిన దాఖలాలు లేవని ఆమె అన్నారు. ఈరోజు డిల్లీలో జరుగుతున్నకాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చర్చించి పార్లమెంటులో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ సమావేశంలో తగిన వ్యూహం కూడా సిద్దం చేసుకొంటున్నారు.   సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవీ కూడా తమ పాలనలో ఏ కారణంగానయినా అస్థిరత ఏర్పడాలని కోరుకోవనేది అందరికీ తెలిసిన విషయం పదేళ్ళ పాటు మన్మోహన్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేసిన సోనియా గాంధీకి తెలియదనుకోలేము. కానీ, అప్రతిహాతంగా దూసుకుపోతున్న నరేంద్ర మోడీని, ఆయన పార్టీని నిలువరించాలంటే వారిపై ఉన్న మతతత్వ ముద్రనే ఆయుధంగా చేసుకొని అడ్డుకోవాలని కాంగ్రెస్ భావిస్తునందునే సోనియా పదేపదే ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశం దొరకక ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణమయ్యారంటూ తనపై, తన కుమారుడుపై పార్టీలో వస్తున్న విమర్శలనుండి తమను తాము కాపాడుకోవడానికే సోనియాగాంధీ తనకు అనువుగా ఉన్న ఈ అంశం ఎత్తుకొని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మత ఘర్షణలపై ఆందోళన చెందడం వలన మాత్రం కాదని చెప్పవచ్చును. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఈ అంశంపై ఇరుకున పెట్టేందుకు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో వ్యూహాలపై చర్చించడం చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

చీలిక పేలికలవుతున్న మీడియాను కాపాడేదెవరు

  ఇంతవరకు ప్రజలు సాక్షి వెర్సెస్ ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా యుద్దాన్నే చూసారు. వారి యుద్దంలో ఇప్పుడు మరో కొత్త భాగస్వామి కూడా వచ్చి చేరింది. అదే ‘నమస్తే తెలంగాణా’ పత్రిక. ఆంధ్రజ్యోతిలో తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వెలువడుతున్నకధనాలపై, వాటిని ప్రచురిస్తున్న సంపాదకుడు రాధాకృష్ణపై నేరుగా విమర్శలు గుప్పిస్తూ ‘ఆంధ్రజ్యోతి చెత్త పలుకులు’ పేరిట ఈరోజు సంచికలో ఒక కధనం ప్రచురించింది. బహుశః రేపు దానికి దీటుగా ఆంద్రజ్యోతి కూడా ఒక కధనం ప్రచురించినా ఆశ్చర్యం లేదు.   తమ మేధస్సును ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాభిప్రాయాన్ని, ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు వాడవలసిన మీడియా ఈ విధంగా ఒకదానిపై మరొకటి బురద జల్లు కోవడానికి వినియోగించుకోవడం చాలా బాధ కలిగిస్తుంది. దానివలన ప్రజలకు మీడియాపై ఉన్న నమ్మకం, గౌరవం రెండూ పోతాయి. ఇప్పటికే పార్టీల వారిగా చీలిపోయిన మీడియా, రాష్ట్రవిభజనతో ఆంద్ర, తెలంగాణా మీడియాలుగా కూడా రెండుగా చీలిపోయింది.   ఒకప్పుడు ఏదయినా మీడియా మీద ఈగ వాలితే యావత్ మీడియా అక్కడ కాకుల్లా వాలిపోయి దానికి అండగా నిలబడేది. కానీ ఇప్పుడు మీడియానే ముక్కలు చెక్కలుగా విడిపోతూ ఒకదానినొకటి కాకుల్లా పొడుచుకోవడం చూడవలసి రావడం చాలా దురదృష్టకరమే. మీడియాకు, రాజకీయాలకు, నేతలకు మధ్య ఉండాల్సిన సన్నటి గీత చెరిగిపోయినప్పటి నుండే మీడియాకు ఈ దుస్థితి ఆరంభమయిందని చెప్పవచ్చును.   ఒకప్పుడు సమున్నత విలువలు పాటిస్తూ రాజకీయ నేతలకు మార్గదర్శనం చేసిన తెలుగు మీడియాలో చీలికపేలికలు ఏర్పడి నానాటికి బలహీనపడుతూ ఇపుడు మెల్లగా రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మీడియా క్రమంగా తన స్థాయి తానే స్వయంగా దిగజార్చుకొంటూ ప్రజల దృష్టిలో కూడా పలుచనయ్యే లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభం వంటి మీడియా పునాదులు ఈవిధంగా బలహీనపడటం మంచి పరిణామం కాదు. మీడియా తన ఉనికిని, గౌరవాన్ని కోల్పోకూడదని భావిస్తే తనను తానే పునరుద్దరించుకోవలసి ఉంటుంది తప్ప దానిని సామాన్య జనాలు కాపాడలేరు.

తండ్రిని వెనకేసుకు వచ్చిన కేటీఆర్

  కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేప్పట్టిన కేసీఆర్, 125 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఫాసిస్టు’ అని చులకనగా మాట్లాడటం పట్ల సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానమంత్రి వంటి గౌరవప్రదమయిన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి గురించి బాధ్యతాయుతమయిన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడి ఉండకూడదని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటే బాగుటుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.   అయితే కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా చేస్తున్న ఆయన కుమారుడు కే. తారక రామారావు, తన తండ్రిని వెనకేసుకు వస్తూ “ఆయన చేసిన వ్యాఖ్యలలో తప్పేముంది? హక్కుల కోసం పోరాడితే అది ప్రజాస్వామ్యం అవుతుందని, అదే హక్కులను కబళించే ప్రయత్నం ఫాసిజం అవుతుందని’ వాదిస్తున్నారు. సైద్దాంతికంగా ఆయన వాదన సరయినదే కావచ్చును. కానీ ఒక ముఖ్యమంత్రి దేశ ప్రధానిని పట్టుకొని ఫాసిస్టు అని చులకనగా మాట్లాడటం సబబేనా? అనేదే ప్రశ్న. ఒక తప్పును సమర్ధించుకొంటూ ఇంకా విమర్శలు ఎదుర్కోవడం కంటే, తప్పును సరిదిద్దుకొంటే ఎంతో హుందాగా ఉంటుంది. కేంద్రంతో తెలంగాణా ప్రభుత్వం సఖ్యతగా మెలగకపోయినా ఏమీ నష్టం ఉండదు. కానీ కేంద్రంతో కూడా కయ్యానికి కాలు దువ్వడం వలన మాత్రం తెలంగాణా ప్రజలకి ఎంతో కొంత నష్టం కలిగే అవకాశం ఉంది.

వైకాపాకు జూపూడి గుడ్ బై

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈరోజు ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపాలో ఎవరికీ వారు సామంతరాజుల్లా వ్యవహరిస్తుంటారని, అటువంటి వ్యవస్థలో ఇమడలేకనే తను పార్టీ నుండి బయటకు వచ్చేసానని చెప్పారు. తన ఓటమికి ప్రత్యర్ధ పార్టీ కాకా స్వంత పార్టీ నేత వైవీ సుబ్బా రెడ్డే కారణమని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉందామని చేరితే, కొందరి కారణంగా జగన్ తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. తన భవిష్య కార్యాచరణ గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని తెలిపారు.

ఇక హై-కమీషనర్ల వంతు

  కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే గవర్నర్లను బదిలీలు చేయడం లేదా వారి స్థానంలో తమకు అనుకూలురయిన వ్యక్తులను నియమించుకోవడం మామూలే. మోడీ ప్రభుత్వం కూడా అదేపని చేసింది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్, రోశయ్య, మార్గరెట్ ఆల్వా వంటి వారినే కాకుండా కాంగ్రెస్ హయంలో గవర్నర్లుగా నియమింపబడిన నరసింహన్ వంటి అనేకమందిని నేటికీ కొనసాగిస్తూనే ఉంది. గవర్నర్ల వ్యవహారాన్ని చక్క బెట్టిన మోడీ ప్రభుత్వం విదేశాలలో భారత హైకమీషనర్లుగా సేవలందిస్తున్న వారిపై దృష్టి పెట్టింది. త్వరలోనే వారి స్థానాలలో ప్రభుత్వానికి అనుకూలురయిన అధికారులను నియమించే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, నార్వే దేశాలలో భారత హైకమీషనర్లుగా చేస్తున్న రంజన్ మతై, నిర్మల్ కుమార్ వర్మమరియు నార్మన్ అనిల్ కుమార్ బ్రోనీల స్థానంలో కొత్త వారిని నియమమించాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. మోడీకి అత్యంత సన్నిహితులయిన స్వపన్ దాస్ గుప్తా మరియు బ్రహ్మ చెలానీలను బ్రిటన్ మరియు కెనడా దేశాలకు భారత హైకమీషనర్లుగా నియమించాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. బహుశః త్వరలోనే ఈ వ్యవహారం కూడా ఒక కొలిక్కి రావచ్చును.

సినీ సిటీకి కేసీఆర్ తన పేరే పెట్టుకోవాలి: కృష్ణ

  తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చెప్పట్టిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో కొందరు పెద్దలకు స్వర్గీయ యన్టీఆర్ హయాంలో కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడంతో, సినీ పరిశ్రమలో తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన సూపర్ స్టార్ కృష్ణకు చాలా సాహసవంతుడిగా పేరుంది. హైదరాబాదుకు సినీ పరిశ్రమ తరలి రాగానే ఆయన పద్మాలయ స్టూడియో నిర్మించి అందులో అనేక గొప్ప చిత్రాలు తీసారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణా ప్రభుత్వం ఆయన స్టూడియోకి ఆనుకొనున్న భూములను స్వాధీనం చేసుకొంది. బహుశః తరువాత తన స్టూడియో వంతు వస్తుందనే భయంతో కావచ్చు ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. రాష్ట్ర విభజనతో సినీ పరిశ్రమ కూడా ఆంధ్ర, తెలంగాణా సినీ పరిశ్రమలుగా విడిపోయింది. తెలంగాణ సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేసీఆర్ హైదరాబాదులో హాలీవుడ్ ను తలదన్నేలా ఒక సినీ సిటీ నిర్మిస్తానని కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సూపర్ స్టార్ కృష్ణ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్, తను నిర్మించబోయే సినీ సిటీకి తనపేరు పెట్టుకొంటే బాగుంటుందని కృష్ణ అన్నారు. తద్వారా భావి తరాలవారు ఆయనను ఎల్లపుడు గుర్తుంచుకోగలుగుతారని ఆయన అన్నారు. హైదరాబాదులో సినీ పరిశ్రమ స్థిరపడేందుకు విశేష కృషి చేసిన కృష్ణ వంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరూ అక్కడ సినిమా స్టూడియోలు, రికార్డింగ్ దియేటర్లు వగైరాలు నిర్మించారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఇప్పటికిప్పుడు వాటన్నిటినీ అమ్ముకొని బయటపడటం అసాధ్యం. కనుకనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొని ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేయాలని భావిస్తున్నారు. బహుశః ఆ ప్రయత్నంలోనే కృష్ణ కూడా కేసీఆర్ ని పొగిడి ఉండవచ్చును. అయితే కేసీఆర్ ఇటువంటి పొగడ్తలకు పడిపోయే రకం కాదని నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఉదంతం స్పష్టం చేస్తోంది. అందువల్ల కృష్ణ కూడా తన జాగ్రత్తలో తను ఉండటం మంచిది.

మూడు నాలుగేళ్ళలో తెలంగాణలో విద్యుత్ స్వయం సమృద్ధి

  సీత కష్టాలు సీతవి...పీత కష్టాలు పీతవి అన్నట్లుంది ఆంధ్ర, తెలంగాణాల కష్టాలు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెటు, వ్యవసాయ రుణ భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణా ప్రభుత్వానికి కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఎంత చురుకుగా విద్యుత్ ఉత్పత్తికి, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, కనీసం మరో మూడేళ్ళ వరకు తెలంగాణాకు విద్యుత్ కష్టాలు తప్పవని ముఖ్యమంత్రే స్వయంగా చెపుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. ప్రస్తుత్వం తెలంగాణా రాష్ట్రంలో రోజుకి 27.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. ఆంద్ర ప్రభుత్వం సహకరించి శ్రీశైలం ఎడమ కాలువ నుండి నీళ్ళు విడుదల చేస్తుండటంతో దిగువనున్న హైడల్ విద్యుత్ ప్రాజెక్టు నుండి దాదాపు 8 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనివలన తెలంగాణా రైతాంగానికి కొంతలో కొంత ఉపశమనం లభిస్తోంది.   అయినప్పటికీ వ్యవసాయానికి కనీసం ఏడూ గంటలసేపు విద్యుత్ సరఫరా చేయాలంటే పరిశ్రమలకు కోత పెట్టక తప్పేలా లేదు. ప్రస్తుతం వారానికి ఒక రోజు ఉన్న పవర్ హాలీడేను రెండు రోజులకి పెంచేందుకు తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణా రాష్ట్రంలో తొలి ప్రాధాన్యత వ్యవసాయానికే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, పరిశ్రమలకు విద్యుత్ కోతలు మరింత పెంచక తప్పేలా లేదు. దానివల్ల కొన్ని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే వాటిపై ఆఅధారపడిన కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అంతకంటే ఎక్కువ మందే రోడ్డున పడతారు. ఆహార ఉత్పత్తి పడిపోతుంది. దానివలన ధరలు పెరుగుతాయి. అందువలన తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయానికి రోజుకి కనీసం 7గంటలు నిరనత విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమయితే పరిశ్రమలకు కొత్త పెట్టాలని భావిస్తోంది.   తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం చేపడుతున్న అనేక చర్యలు ఫలించడానికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చని, అప్పటి నుండి క్రమంగా పరిస్థితి మెరుగవుతుందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఆయన కేంద్రంతో కూడా సామరస్యంగా వ్యవహరించ గలిగితే, కేంద్రం కూడా తెలంగాణా ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్దంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్ధనమేరకు కేంద్ర గ్రిడ్ నుండి ఇప్పటికే చాలా విద్యుత్ కేటాయించింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంతర విద్యుత్ సరఫరా పధకం పైలట్ ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకొంది. అక్టోబరు రెండు నుండి ఈ పధకం రాష్ట్రమంతటా అమలులోకి వస్తుంది.   నిజానికి ఆంధ్రా కంటే తెలంగాణా ప్రభుత్వానికే ఇటువంటి విద్యుత్ పధకాలు అత్యవసరమని చెప్పవచ్చును. కానీ, అటువంటివి ఆశించే ముందు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం చాలా అవసరం. మరొక రెండు మూడేళ్ళలో తెలంగాణా విద్యుత్ విషయంలో స్వయం సమృద్ధి చెందే అవకాశం ఉంది గనుక అంతవరకు కేంద్రంతో, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తెలంగాణా ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకోగలిగితే తెలంగాణకు విద్యుత్ కష్టాలు చాలా వరకు తీరవచ్చును.

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు సహకరించుకొన్నాయోచ్

   ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య కీచులాటలు నిత్యకృత్యం అయిపోయిన ఈ తరుణంలో రెంటి మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడటం చాలా కష్టమనిపిస్తోంది. కానీ బేషజాలు పక్కనబెట్టి కాసింత విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవడమేమీ కష్టం కాదని చెప్పేందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చును. రెండు ప్రభుత్వాల శాసనసభ స్పీకర్లు చర్చించుకొని, సభా సమావేశాల తేదీలు, చాంబర్ల కేటాయింపులు వంటి సమస్యలను చాలా సామరస్యంగా పరిష్కరించుకొన్నారు.   అదేవిధంగా తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణా ప్రభుత్వం అభ్యర్ధన మేరకు, శ్రీశైలం ఎడమవైపు తెలంగాణకు చెందిన హైడల్ ప్రాజెక్టుకు ఆంద్ర ప్రభుత్వం నీళ్ళు విడుదల చేసింది. ఆ నీటితో దాదాపు 8.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడంతో తెలంగాణా రాష్ట్రానికి కొంతలో కొంత ఉపశమనం లభించింది. నిజానికి డ్యాములో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు చేరేవరకు ఆంద్రప్రభుత్వం నీళ్ళు విడుదల చేయనవసరం లేదు. కానీ తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్, ఆంద్ర ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావుల మధ్య సహృద్భావ వాతావరణంలో జరిగిన చర్చల కారణంగా డ్యాములో 854 అడుగుల నీటి మట్టం ఉన్నపుడే ఆంద్ర ప్రభుత్వం నీలు విడుదల చేసి, తెలంగాణా ప్రభుత్వానికి సహకరించింది.   శ్రీశైలం, జూరాల హైడల్ విద్యుత్ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కారణంగా తెలంగాణాకు కొంత ఉపశమనం లభించింది. శ్రీశైలం ఎడమకాలువ నుండి ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకొన్న తరువాత ఆ నీటిని నాగార్జున సాగర్ డ్యాంలో నిలువచేసి ఉంచితే, మున్ముందు రెండు రాష్ట్రాలు ఆ నీటిని వాడుకోవచ్చని ఆంద్ర నీటిపారుదల శాఖ అధికారులు చేసిన సూచనకు తెలంగాణా అధికారులు సానుకూలంగా స్పందించారు.   ప్రస్తుతం ఎగువన కర్నాటక రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టి మరియు నారాయణ్ పూర్ డ్యాముల నుండి భారీగా నీరు విడుదల చేస్తున్నారు. రానున్న వారం రోజుల్లో దాదాపు 125 టీ.యం.సి.ల నీళ్ళు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులలో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుండి వస్తున్న నీటిని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సూచించిన విధంగా వాడుకొనేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు.   ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ పార్టీలు, తమ మధ్య పార్టీ పరంగా ఉన్న రాజకీయ వైరాలను లేదా వ్యక్తిగత వైరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ చిన్న అంశంపై పరస్పర వ్యతిరేఖంగా వ్యవహరించడం వలన ఇరు రాష్ట్రాలకీ సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. అదే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తమ అహాన్ని, పంతాలను పట్టుదలను, బేషజాలను పక్కన పెట్టి, నిపుణులయిన అధికారులకు నిర్ణయాలు తీసుకొనేందుకు తగినంత స్వేచ్చ ఇచ్చినట్లయితే అనేక సమస్యలు ఇరు రాష్ట్రాలకీ ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవచ్చునని చెప్పడానికి దీనినొక మంచి ఉదారణగా చెప్పుకోవచ్చును.