అన్నదాతకి కావలసింది ఐప్యాడ్ కాదు చంద్రబాబు గారూ!
posted on Jul 30, 2014 @ 3:08PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్న రైతులకు ఐప్యాడ్స్ పంపిణీ చేసే ఆలోచన వున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఐప్యాడ్లు ఇవ్వడం ద్వారా రైతులు డైరెక్ట్‌గా ఉపగ్రహం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సూచనలు అందుకుంటారని చెప్పారు. ఈ ప్రకటన విన్న వెంటనే ఎవరికైనా ‘భలే’ అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మాత్రం ఇదెంత అనాలోచిత నిర్ణయమో అర్థమవుతుంది. రాష్ట్రంలోని రైతులకు మేలు చేయాలని, వారి జీవితాలలో మార్పు తీసుకురావాలి అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తూ వుంటారు. అయితే అప్పుడప్పుడు ఏ ఐఏఎస్ అధికారి ఉచిత సలహాల వల్లో ఆ ఆలోచన తప్పుదారి పట్టే అవకాశం కూడా వుంటుంది. రైతులకు ఐప్యాడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించడం కూడా ఈ కోవకు చెందిన ఆలోచనగానే భావించవచ్చు.
అసలు రైతులకు ఐప్యాడ్లు ఎందుకు? సెల్‌ఫోన్ ఆపరేట్ చేయడమే సరిగారాని రైతులకు ఐప్యాడ్లు ఇస్తే వాళ్ళు వాటిని ఏం చేసుకుంటారు? బాగా చదువుకున్నవాళ్ళే ఐప్యాడ్ ఎలా ఆపరేట్ చేయాలో అర్థం కాక తికమక పడిపోతారు. మరి ఐప్యాడ్లు ఆపరేట్ చేయాల్సిన టెన్షన్ రైతులకి ఎందుకు పెడతారు చంద్రబాబు గారూ. అయినా రైతులకు ఐప్యాడ్లు ఇస్తే ఆ ఖర్చంతా తడిసి మోపెడవుతుంది. ఐ ప్యాడ్ ఇస్తే చాలదు.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ ఇవ్వాలి. ఆ ఖర్చు మరింత భారం. ఇంతా చేస్తే ఐపాడ్స్‌ని రైతులు వ్యవసాయం కోసమే ఉపయోగిస్తారన్న గ్యారంటీ కూడా లేదు. రైతులకు ఐప్యాడ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏ ఐప్యాడ్ల కంపెనీకో, ఆ కంపెనీకి - ప్రభుత్వానికి మధ్యన ఉండేవారికో తప్ప రైతులకు ఎంతమాత్రం ఉపయోగపడేది కాదు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరుకుంటుందన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే రైతులకు మేలు చేయాలంటే ‘ఐప్యాడ్లు’ కాకుండా ఎన్నో మార్గాలు వున్నాయి. రాష్ట్రంలో రైతులు సరైన విత్తనాలు దొరక్క నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల బారిన పడి మోసపోతున్నారు. అలాగే సరైన సమయంలో ఎరువులు దొరక్క బాధపడుతున్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులు బాగుపడిపోతున్నారు తప్ప రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విషయంలో రైతులు మోసపోకుండా చూడాలి.
అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర రైతుకు దక్కడం లేదు. రైతుకు, వినియోగదారుడికి మధ్య చేరిన దళారి డబ్బు మింగుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగదారుడు కూరగాయలను కిలో 40 రూపాయలకు పైగానే కొంటున్నాడు. ఇందులో రైతుకు దక్కేది 5 రూపాయలు కూడా వుండటం లేదు. మిగతా డబ్బంతా మధ్యలో వున్నవారి జేబుల్లోకి వెళ్ళిపోతోంది. అందుకే రైతు నుంచి డైరెక్ట్‌గా వినియోగదారుడికి వ్యవసాయ ఉత్పత్తులు చేరేలా చూడాలి. పండించిన పంటను దాచుకోవడానికి అన్ని ప్రాంతాల్లో గోడౌన్లు ఏర్పాటు చేయాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని కూడా హైటెక్ చేయాలని అనుకోవడం అభినందనీయమైన విషయమే.. కానీ ఆ ‘హైటెక్’ చేయడం అనేది ఐ ప్యాడ్లు ఇవ్వడం ద్వారా కాకుండా ఆధునిక వ్యవసాయ విధానాలు, యంత్రాల మీద రైతుల్లో అవగాహన పెంచి, వాటిని వారికి అందుబాటులోకి తేవడం హైటెక్ అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయరంగాన్ని కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగించడం ద్వారా తక్కువ మ్యాన్ పవర్‌తో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు... అందువల్ల ఆలోచిస్తే, ఆచరణలోకి తెస్తే రైతులకు మేలు చేసే అంశాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తాయి. అలాంటి వాటిని చంద్రబాబు నాయుడు వెతికిపట్టుకోవాలి. రైతులకు ఐప్యాడ్ల పంపిణీ లాంటి నవ్వొచ్చే ఆలోచనలు మానుకోవాలి.