రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి: భూమా నాగిరెడ్డి
posted on Aug 15, 2014 @ 2:23PM
రాష్ట్రవిభజనను వ్యతిరేఖిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం పూరించినపుడు ఆపార్టీ నేతలందరూ ఆయనకు బాగానే వంతపాడారు. ఎందువలన అంటే ఆయన పోరాటం విభజనకు వ్యతిరేఖంగా కాక ఆ పేరుతో సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకొని ఎన్నికలో గెలవడం కోసమే కనుక. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తపించిపోయారో అందరికీ తెలుసు. కానీ ఆయనకు ఆ అవకాశం రాలేదు. బహుశః అందుకే ఇప్పుడు చాప క్రింద నీరులా మెల్లగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వైకాపా నిప్పు రాజేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత భూమానాగిరెడ్డి ఇటీవల నంద్యాల మండలంలో పాండురంగపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ, తాను ఏనాడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోలేదని, కానీ ఇప్పుడు సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కోరుకొంటున్నానని అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొంటేనే రాయలసీమ రైతులు బాగు పడతారని ఆయన అన్నారు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడిన వైకాపా ఇప్పుడు అకస్మాత్తుగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిప్పు రాజేయడం చూస్తే, అధికారం చేజిక్కించుకోవడం కోసం రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయడానికి కూడా వైకాపా సంకోచించదని స్పష్టమవుతోంది.
రాయలసీమ అన్నివిధాల వెనుకబడుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజాప్రతినిధులలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన లేకపోవడమే. వారికి ఎంతసేపు తమ స్వార్ధ రాజకీయాలు, వ్యాపారాల గురించి ఆలోచనలే తప్ప సీమ అభివృద్ధికి వారు చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తప్ప బాగుపడలేమని భూమనాగి రెడ్డి చెప్పడం బహుశః వైకాపా ఆలోచనే కావచ్చును.
రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు తప్ప ఏనాడు సీమను పట్టించుకొన్న పాపాన్నపోలేదు. అయినప్పటికీ సీమతో సహా మిగిలిన జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాదు మన రాష్ట్రమే కదా అనే ఉదారమయిన ధోరణితో ఎన్నడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అందుకే అందరూ కలిసి రాష్ట్రవిభజనకు వ్యతిరేఖంగా చాలా తీవ్రంగా పోరాడారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం స్వార్ధ రాజకీయాల ముందు తలొంచక తప్పలేదు. అందుకు దానిపై ఎన్నికలలో ప్రతీకారం తీర్చుకొన్నారు. అది వేరే సంగతి.
గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సీమ ప్రజలు ఇప్పుడు తమ ప్రాంత అభివృద్ధి జరగాలనే తపనతో వారు తమకు రాజధాని కావాలని గట్టిగా అడుగుతున్నారు. వారి కోరికలో ఎటువంటి తప్పు లేదు కూడా. గత ఆరు దశాబ్దాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయిన సీమను ఇప్పటికయినా పాలకులు పట్టించుకొని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. రాజధాని ఏర్పడినట్లయితే సహజంగానే అభివృద్ధి జరుగుతుంది గనుక రాయలసీమలో రాజధాని కోసం వారు పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం విజయవాడ-గన్నవరం మధ్యనే రాజధానికి మొగ్గు చూపుతుండటంతో వారు అసంతృప్తికి గురయిన మాట వాస్తవం. వారి ఆ అసంతృప్తినే మరింత పెంచిపోషించగలిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంటుందని వైకాపా నేతల ఆలోచన కావచ్చును. బహుశః అందుకే భూమానాగిరెడ్డి వంటి వైకాపా నేతలు చాప క్రింద నీరులా రాయలసీమ ప్రజలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.
కానీ రాష్ట్ర విభజన వల్ల ఎంత అనర్ధం జరిందో, జరుగుతోందో చూసిన తరువాత కూడా వైకాపా నేతలు అధికారం చేజ్జికించు కోవడంకోసం మరోమారు రాష్ట్ర విభజన జరగాలని కోరుకోవడం చాలా దారుణం. అందువలన సీమ ప్రజలు ఇటువంటి ఉపదేశాలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ పోరాటాన్ని కేవలం తమ ప్రాంత అభివృద్ధి కోసమే పరిమితం చేయాలి. రాష్ట్రంలో రాయలసీమలాగే రాష్ట్రంలో వెనుకబడిన మరో ప్రాంతం ఉత్తరాంధ్ర. అక్కడి ప్రజలు కూడా ఇటువంటి రాజకీయ నేతలపట్ల అప్రమత్తంగా ఉంటూ తమ జిల్లాల అభివృద్ధికోసం ప్రజాప్రతినిధులపై నిరంతరం గట్టిగా ఒత్తిడి చేస్తుండాలి. అప్పుడే రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెంది, ఈ విభజన సెగలు చల్లారే అవకాశముంటుంది.