తిరుపతిలో ఎన్నిక జరగాలి
posted on Jan 19, 2015 @ 2:38PM
ఎవరైనా పదవిలో వున్న ప్రజా ప్రతినిధి అకస్మాత్తుగా మరణిస్తే, వారి స్థానంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని ఎన్నుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఆయా స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలిపి, పోటీ లేకుండా గెలిపించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆళ్ళగడ్డ స్థానంలో భూమా శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అన్ని పార్టీలూ సహకరించాయి. ఆ తర్వాత నందిగామ అసెంబ్లీ స్థానం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచారు. అయితే అంతకుముందు ఆళ్ళగడ్డ స్థానంలో ఏకగ్రీవం కావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నందిగామ స్థానం విషయానికి వచ్చేసరికి లేనిపోని ఆశలు పెట్టుకుని పోటీలో నిలిచింది. దాంతో ఆ స్థానంలో ఎన్నిక తప్పలేదు. తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య గెలవకా తప్పలేదు. ఇప్పుడు తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి తెలుగుదేశం ఎమ్మెల్యే వెంకట రమణ అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం నుంచి ఆయన భార్య సుగుణమ్మని నిలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తిరుపతి నుంచి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయితే బావుంటుందని తిరుపతిలోని వెంకట రమణ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎన్నిక జరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తిరుపతి స్థానం ఈసారి ఏకగ్రీవం కాకుండా పోటీ జరగాలని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా అడ్రస్ లేకుండా పోయిన లోక్‌సత్తా పార్టీకి తిరుపతిలో పోటీ చేయాలన్న తహతహ పుట్టుకొచ్చింది. ఏదైనా అద్భుతం జరిగి గెలవకపోతామా అన్న ఆశ ఆపార్టీలో ఏర్పడింది. అందుకే ‘కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం’ అంటూ నినదిస్తూ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ స్థానం మీద కన్ను వుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయం జరిగిపోయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా, ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తమకు మంచి రోజులు వస్తాయన్నదానికి ఆ విజయాన్ని ఉదాహరణగా చూపించాలని ఆశిస్తోంది. ఇక వైసీపీ అయితే పైకి వెంకట రమణ కుటుంబం మీద తమకు బోలెడంత సానుభూతి వుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ ముఖ్య నగరమైన తిరుపతిలో తమ పట్టును సాధించాలంటే తిరుపతిలో పోటీ చేసి గెలవాలని ఆశిస్తోంది. అయితే తన మనసులోని మాటను ఇంతవరకు బయటపెట్టలేదు. మిగతా పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి కాబట్టి మేమూ చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో కరుణాకర్ రెడ్డిని రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఏది ఏమైనప్పటికీ, తిరుపతిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నిక నిర్వహించడం ద్వారానే వెంకట రమణ భార్య సుగుణమ్మ విజయం సాధించడం మంచిదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ వారో దయ చూపిస్తే గెలిచామన్న న్యూనత లేకుండా వుండాలన్నా, వెంకట రమణకు, తెలుగుదేశం పార్టీకి తిరుపతి ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి నిరూపణ అవ్వాలన్నా తిరుపతిలో ఎన్నిక జరగడమే న్యాయమని వారు భావిస్తున్నారు.